కేంద్రాన్ని రాష్ట్రాలు యాచించాల్సిందేనా?
posted on Jan 21, 2015 @ 11:18AM
రాష్ట్ర విభజన జరిగి, రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి మిగులు బడ్జెట్ దక్కింది. కానీ ఆంద్రకుమాత్రం ఉన్న కష్టాలు సరిపోవన్నట్లుగా ఏకంగా రూ.16,000కోట్ల లోటు బడ్జెట్టు దక్కింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8నెలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దేనికీ కోతలు పెట్టకుండా ఉన్నంతలో తగినన్ని నిధులు మంజూరు చేస్తూ చాలా పొదుపుగా నెట్టుకొస్తోంది.
కానీ రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవాలంటే ముందుగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అందుకు అనేక సంస్థలు సిద్దంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగుదామనే ఉద్దేశ్యంతో కొన్ని సంస్థలు వేచి చూస్తున్నాయి. ఈ అవరోధం తొలగితేకానీ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం కాదు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే గానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను అధికారంలోకి రాక ముందు నుండి కూడా ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా మళ్ళీ అదే పని మీద ఆయన డిల్లీ వెళ్లి వచ్చేరు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటిలోగా ఇస్తుందో కేంద్రం చెప్పలేకపోతోంది.
కనీసం ఈలోగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.16,000కోట్లయినా విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలగవచ్చును. కానీ ఆ విషయంలో కూడా కేంద్రం ఏమి చేయబోతోందో తెలియదు. ఒకవేళ కేంద్రం తక్షణమే సహాయం చేయలేకపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం కటకటలాడవలసిన పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక కేంద్రం తక్షణమే ఎంతో కొంత సహాయం చేస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందని బీజీపీ పదేపదే చెప్పుకొంటోంది. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా కోసం కేంద్రం ముందు ఈవిధంగా చేయి చాచే పరిస్థితి రాకుండానే కేంద్రం స్పందిస్తే బాగుండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అడిగినా చేయి విదిలించకపోతే, దాని వలన తెదేపా-బీజేపీల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా రాష్ట్రంలో ప్రజలకు కూడా బీజేపీపై దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి ఉదారంగా సహాయపడి, ఈ క్లిష్ట పరిస్థితుల నుండి అది బయటపడేందుకు వీలయినంత సహాయం చేసినట్లయితే ఆ పార్టీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర నేతలు కూడా దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి వారి మద్దతు అడగగలుగుతారు. అలాకాక చేస్తాం, చూస్తాం అంటూ ఇలాగే నెలలు, సంవత్సరాలు దొర్లించేస్తే రాష్ట్రం ఎలాగూ మెల్లగా ఎప్పటికో అప్పటికి అభివృద్ధి చెందుతుంది. కానీ దాని వలన బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది.