నేతాజీ మరణ రహస్యం ఇప్పటికయినా వీడుతుందా?

  ప్రముఖ స్వాతంత్ర్య సమరవీరుడు సుబాష్ చంద్ర బోస్ మరణం నేటికీ ఒక పెద్ద మిష్టరీగానే మిగిలి ఉంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు, కాదు రష్యా ప్రభుత్వం ఉరి తీసిందని మరికొందరు, నేటికీ సజీవుడుగానే ఉన్నాడని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరూ కూడా తమ వాదనలను నిరూపించలేకపోయారు. ఈ మిష్టరీని ఛేదించేందుకు కేంద్రప్రభుత్వం ఇదివరకు రెండు కమిటీలను కూడా వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను కూడా కేంద్రప్రభుత్వం ఇంతవరకు రహస్యంగానే ఉంచింది.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నేతాజీ జీవిత విశేషాలను, స్వాతంత్ర సంగ్రామం గురించి తెలియజేసే అనేక వందల ఫైళ్ళు, నివేదికలు ఉన్నాయి. వాటిని బయటపెడితే కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే కారణంతో వాటిని నేటి వరకు రహస్యంగానే ఉంచుతున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ప్రభుత్వ అధీనంలో ఉన్న 12,744 పేజీలతో కూడిన 64 ఫైళ్ళను అందులో సమాచారాన్ని ఇవ్వాళ బయటపెట్టబోతోంది. వాటినన్నిటినీ సంబంధిత నిపుణులు లోతుగా అధ్యయనం చేసిన తరువాత వాటిని బయటపెట్టడం వలన పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బ తినే అవకాశం లేడని దృవీకరించుకొన్న తరువాతనే వాటిని బయటపెట్టబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ కేంద్రం అధీనంలో ఉన్న ఫైళ్ళను బయటపెట్టాలా వద్దా అనేది కేంద్రమే నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు. మరికొద్ది సేపటిలో నేతాజీకి సంబంధించిన ఆ ఫైళ్ళనన్నిటినీ పశ్చిమ బెంగాల్ బయటపెట్టబోతోంది.

విమోచనమా? విద్రోహమా? అవతరణమా?

సెప్టెంబర్ 17, తెలంగాణ చరిత్రలో ఇదో ముఖ్యమైన తేదీ, హైదరాబాద్‌ సంస్ధానం భారత్‌ యూనియన్‌లో కలిసి రోజు, దాదాపు 2వందల ఏళ్లపాటు సాగిన నిజాం నిరంకుశ పాలన అంతరించి, తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు, తెలంగాణ చరిత్రలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సెప్టెంబర్ 17పై 67ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. కొందరు విమోచనమంటుంటే, మరికొందరు విద్రోహదినమంటున్నారు, ఇవన్నీ ఎందుకు జూన్ 2న తెలంగాణ అవతరణం ఉందిగా అంటున్నారు ఇంకొందరు.అయితే గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండుసార్లు సెప్టెంబర్ 17 వచ్చివెళ్లిపోయింది కానీ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ మాత్రం అలాగే ఉంఢిపోయింది.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు, ఉద్యమ పార్టీగా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలందరూ, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసినవాళ్లే, మరి ఇప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు?, ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది?   అయితే హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకున్నారని, పైగా శాంతిభద్రతల పేరుతో అప్పటి భారత ప్రభుత్వం... సైనికులతో ముస్లింలపై దాడులు చేయిందని,అందుకు నిరసనగా సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని మజ్లిస్ నేతలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ కి చిక్కులు తెచ్చిపెట్టింది.తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకు, అవకావం దొరికినప్పుడల్లా నిజాంను పొగుడుతున్న సీఎం కేసీఆర్, విమోచన దినోత్సవాన్ని కూడా పక్కనపెట్టేశారు. అయినా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉండగా, వేరే ఉత్సవాలు అధికారికంగా ఎందుకంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 17కి మరో కొత్త భాష్యం చెప్పారు, రాజరిక పాలన అంతమై, ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజంటూ టీఆర్ఎస్ లీడర్స్ వ్యాఖ్యానించారు.   ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట, అధికారంలో ఉండగా మరో మాట మాట్లాడటం రాజకీయ పార్టీలకు అలవాటే అయినా, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, ప్రజల తరపున పోరాడే ప్రజాసంఘాలు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన వాళ్లే ఇవాళ అధికారంలో ఉన్నా, దాన్ని అమలు చేయకపోగా, ఆనాడు టీఆర్ఎస్ తో కలిసి ఆందోళనలు, ధర్నాలు, డిమాండ్లు చేసిన కోదండరాం లాంటి నేతలు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏకాభిప్రాయం కావాలన్న ఆయన, ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందిపడ్డారు. కేసీఆర్ పార్టీ స్టాండ్ మార్చేయడంతో, ప్రభుత్వానికి నొప్పి కలగకుండా కోదండరాం మాట్లాడిన తీరును జేఏసీ నేతలే ఆక్షేంపించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్వహించలేదంటూ నిలదీయాల్సిపోయి, ఈ నసుగుడు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట... ఇది పార్టీలకూ అలవాటేనని, అందుకే కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తుందని గుర్తుచేస్తున్నారు. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్, ఫక్తు రాజకీయ పార్టీగా మారి, అధికారంలోకి వచ్చాక మాత్రం వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసిందని అంటున్నారు.   అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పోరాటాలతో తెచ్చుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో కూడా కనీసం విమోచన దినోత్సవం జరిపే పరిస్థితి లేదా అంటూ వాపోయారు.ఓట్ల రాజకీయం కోసం పాకులాడుతున్న కేసీఆర్...చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని దుమ్మెత్తిపోస్తున్నారు.

వరల్డ్ బ్యాంక్ తెలంగాణ ద్రోహ? చంద్రబాబు-వెంకయ్య మేనేజ్ చేశారా?

      ప్రపంచ బ్యాంక్ నివేదికపై తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. పెట్టుబడులకు, వ్యాపారాలకు అనుకూల రాష్ట్రాల్లో   వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో తెలంగాణకు 13వ ర్యాంక్ రావడంపై కేసీఆర్ అండ్ కో ఆశ్చర్యం వ్యక్తంచేస్తుండగా, రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు పనితీరుకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికే కొలమానమని, పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని టీడీపీ నేతలు గొప్పులు చెప్పుకుంటుంటే, అదంతా కుట్ర, చంద్రబాబు-వెంకయ్య కలిసి మేనేజ్ చేశారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. అయితే వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంత-ప్తిని వ్యక్తంచేసింది. వ్యాపారాలకు, పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సదుపాయాలున్న తెలంగాణను దారుణంగా వెనక్కి నెట్టారని, అసలు ఏ పద్ధతి ప్రకారం ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు ప్రకటించిందో తెలియడం లేదంటున్నారు. అయినా ఈ ర్యాంకులతో దిగులు చెందాల్సిన పనిలేదని సర్దిచెప్పుకుంటూనే, తమ పనితీరుకు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివద్ధే నిదర్శనమంటూ పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలంగాణకు నెగటివ్ గా ఉండటంతో ఆత్మరక్షణలో పడ్డ గులాబీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.ఇదంతా చంద్రబాబు కుట్ర అని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రపంచ బ్యాంక్ ను మేనేజ్ చేశారని, అందుకే తెలంగాణకు 13వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ కి 2వ ర్యాంక్ ఇచ్చారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు.పైగా  వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ కు  అసలు క్రెడిబులిటీయే లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అసలు ఎలాంటి మౌలిక వసతుల్లేని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఎలా స్వర్గధామం అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే తాము అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని, టీఎస్-పాస్ తో ఇప్పటికే అనేక కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని, ఈ నివేదికతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్న గులాబీ నేతలు...డామేజ్ కంట్రోల్ కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా ప్రపంచ బ్యాంక్ నివేదికను తప్పుబట్టడం సరికాదని, అంతర్జాతీయ సంస్థను మేనేజ్ చేసేతంట స్థాయి చంద్రబాబుకి, వెంకయ్యకు ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ ను కూడా తెలంగాణ ద్రోహి అనడంలో అర్థంలేదని, ఇలాంటి ఆరోపణలతో తెలంగాణకు మరింత డామేజ్ జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు అయితే టీఆర్ఎస్ నేతల బాధ...తెలంగాణకు 13వ ర్యాంక్ వచ్చిందని కాదంటా? పక్క రాష్ట్రం...తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు అధికారంలో ఉన్న ఏపీకి సెకండ్ ప్లేస్ వచ్చిందని తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఇది చంద్రబాబు-వెంకయ్య కుట్ర అంటూ బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని గులాబీ నేతలను ఎత్తిపొడుస్తున్నారు టీటీడీపీ నేతలు

ఉత్తర కొరియాకి భారత్ స్నేహ హస్తం!

  ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిటితో కూడా దక్షిణ కొరియాకి మంచి సత్సంబందాలున్నాయి. కానీ సైనిక పాలనలో కొనసాగుతున్న ఉత్తర కొరియాకి మాత్రం చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలతోనే సంబంధాలున్నాయి. భారత్-దక్షిణా కొరియాల మధ్య ఉన్నసత్సంబందాల కారణంగా భారత్ మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్లు మొదలుకొని కార్ల వరకు విస్త్రుత వ్యాపారావకాశాలను అందిపుచ్చుకొని లబ్ది పొందగలుగుతోంది. ఇది గమనించిన ఉత్తర కొరియా కూడా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ప్రయాత్నాలు ప్రారంభించింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఆ దేశ విదేశాంగ మంత్రి రి సు యంగ్ డిల్లీ పర్యటన చేసారు. భారత్ కూడా అందుకు చాలా సానుకూలంగానే ప్రతిస్పందించింది. ఇటీవల డిల్లీలో ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఆ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిట్జు భారత ప్రభుత్వం తరపున హాజరయ్యారు.   అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇదేదో హడావుడిగా తీసుకొన్న నిర్ణయం కాదు. భారత్-ఉత్తర కొరియా దేశాల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకొనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. మిగిలిన దేశాలలాగే ఉత్తర కొరియా కూడా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉంది. కనుక మిగిలిన దేశాలతో భారత్ ఏవిధంగా మైత్రిని కోరుకొంటుందో అదేవిధంగా ఉత్తర కొరియాతో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తోంది. గత సమస్యలను, అవరోధాలను అన్నిటినీ పక్కనబెట్టి ఉత్తర కొరియాతో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,” అని అన్నారు.   ఉత్తర కొరియా భారత్ కంటే చైనా, పాకిస్తాన్ దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున భారత్ కూడా దానితో ఇంతకాలం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాను దూరం పెట్టడం కంటే తన వైపు త్రిప్పుకోవడం మంచిదని భావించడంతో ఈ అడుగు వేసింది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి చైనా కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకవైపు భారత్ తో చర్చలు సమావేశాలు అంటూనే సరిహద్దుల వద్ద కాల్పుల అతిక్రమణకు పాల్పడుతూ, భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశ పెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ ఒంటరి చేసేందుకే మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాతో స్నేహ సంబందాలు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తోందేమో? లేకుంటే అమెరికా యూరప్ దేశాల దృష్టిలో దూర్తదేశంగా ముద్ర వేసుకొన్న ఉత్తర కొరియాతో స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేసి ఉండదు.

కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం నేడే

  దేశంలో నదుల అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధాన కార్యక్రమాన్ని చెప్పట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో తొలి ప్రయత్నంగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి దాని ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నదీ జలాలను కృష్ణా జిల్లా మీదుగా మళ్ళించి కృష్ణానదితో అనుసంధానం చేయబోతున్నారు. తద్వారా వేలాది ఎకరాలలో ఏడాదికి మూడు పంటలు సాగుచేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు మార్చి 29న శంఖుస్థాపన చేసారు. నాటి నుండి ప్రతిపక్షాల తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటూనే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. మూడు-నాలుగు రోజుల క్రితమే తాటిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి చూసారు. ఇవ్వాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని ఆరంభించబోతున్నారు.   ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా నదులను ఏవిధంగా అనుసంధానం చేస్తారంటే: తాటిపూడి ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని పోలవరం కుడి కాలువకి పంపింగ్ చేస్తారు. ఆ నీళ్ళు వెలగలేరు గ్రామం వద్ద గల భలేరావు చెరువుకి చేరుకొంటాయి. అక్కడి నుండి బుడమేరు కాలువకి మళ్ళిస్తారు. బుడమేరు ద్వారా గోదావరి నీళ్ళు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తాయి. పట్టిసీమ వద్ద నీటిని విడుదల చేసిన తరువాత కృష్ణా, గోదావరి రెండు నదులు సంగమించే ఇబ్రహీం పట్టణం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ‘కృష్ణాగోదావరి పవిత్ర సంగమం’ అని ప్రభుత్వం నామకరణం చేసింది.   ఈ ఏడాది నవంబర్ లోగా కనీసం 13-15 టి.యం.సి.ల గోదావరి జలాలను కృష్ణకు తరలించడానికి అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 80 టి.యం.సి.ల నీళ్ళు కృష్ణా నదికి తరలివెళతాయి. దీని కోసం మొత్తం 24 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఒక పంపు ద్వారా ఇవ్వాళ నీటిని పంపింగ్ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరంభించబోతున్నారు. ఈ నెలాఖరులోగా మరో మూడు పంపులు పనిచేయడం ఆరంభిస్తాయి. నవంబర్ నాటికి మరో 6 పంపులు పనిచేయడం ఆరంభిస్తాయి.

ఆ చంద్రబాబే కావాలి.. ఈ చంద్రబాబు వద్దు

  హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మాణంకోసం, సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం కోసం కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన ఆంధ్రుల పాలిట నవశకానికి నాంది పలికే నాయకుడిగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ ను అట్టడుగు స్థానం నుండి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లగలిగే స్థైర్యం ఉన్న నేతగా నమ్మి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించి పట్టం కట్టారు. కాని నేడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు కావాలి కాని, నేటి చంద్రబాబు కాదు అని సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క శివాజీ ఆరోపణ మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకోసం నిరంతరం కృషి చేస్తున్న చాలా మంది సీనియర్ల నుండి కార్యకర్తల వరకు అదే భావన. చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఉన్నదని.. ఆయన ఆ కోటరీ ఉచ్చులో బిగుసుకొని వాస్తవాలను గుర్తించడంలేదని చాలా మంది నేతల వేదన. ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఒకసారి గమనిస్తే క్షేత్రస్థాయి అవసరాలపై, సమస్యలపై అవగాహన లేని పరకాల ప్రభాకర్ లాంటి ప్రభుత్వ సలహాదారు, తిమ్మిని బమ్మిని చేసి చూపే ఐఏస్ ఆఫీసర్లు, బ్యూరో క్రాట్స్.  ప్రభుత్వ పథకాల పనితీరు, అమలు ఎలా ఉన్నా వీరికి అనవసరం. చంద్రబాబు నాయుడిని ఎంతగా తమ కల్లబొల్లి మాటల ద్వారా సంతృప్తి కరంగా ఉంచగలిగామన్నదే వారి ఆలోచన. దీనికి తోడు విమర్శలు గిట్టని చంద్రబాబు నైజం. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని బాబు వరకూ చేరకుండా అంతా బాగానే ఉందనే ఈ కోటరీ కితాబు. దీనితో ఆంధ్ర రాష్ట్రంలో బాబుగారి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి గాడితప్పిన పాలన. బాబుగారి వ్యవహారం చూస్తేనే తన చుట్టూ ఉన్నా భజన పరుల కోటరీలో సదా కాలక్షేపం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైనా సరే ఈ కోటరీని దాటి బాబుగారిని చేరే పరిస్థితి లేని కారణాన ఏం చేయాలో అర్ధంకాని దైన్యం పార్టీలో నెలకొంది. దీనికి తోడు లోకేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ ఐఏస్ ఆఫీసర్ అయినా లోకేశ్ కన్నుసన్నల్లోనే పనిచేయాల్సి రావడంతో ఈ భజన బృందం లోకేశ్ ను కూడా అదే తరహాలో పొగడ్తలతో ముంచెత్తుతూ, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ పాలనను అపహాస్యం చేస్తున్నారు. వీరికి తోడు వివిధ ప్రాజెక్టులను దక్కించుకునే యావలో కాంట్రక్టర్లు పార్టీలోని ఆర్ధిక బలంతో మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్న రాజకీయ అవగాహన, పరిపాలన అవగాహన లేని మరికొంతమంది నేతలతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది. దీనికి ఉదాహరణగా రాజమండ్రిలో పుష్కరాల సంఘటన, ప్రత్యేక హోదాపై రోజుకోరకమైన ప్రభుత్వ వ్యాఖ్యానాలు, రైతు రుణమాఫీ అమలవుతున్నతీరు, నిరుద్యోగ భృతి అందని నిరుద్యోగులు, గుంటూరు నాగార్జున వ్యవహారం, రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ నడుస్తున్న విధానం వెరసి నిజంగా ఇది చంద్రబాబు నాయుడి పాలనేనా అనే ప్రజలకు తీవ్రమైన సందేహం కలుగుతోంది. తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం వివిధ కన్సెల్టీలు, కాంట్రక్టర్లు, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ సలహాదారుల కోటరీ నుండి చంద్రబాబు బయటపడి తన పాలనలో ప్రజలు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టినిసారించక పోతే నష్టపోయేది పార్టీనే. నీతికి మారుపేరైనా పరిపాలన అందిచకుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని విశ్లేషకులు సైతం విస్మయం చెందేలా అవినీతిలో కూరుకుపోయిన పాలనను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు స్వయంగా పూనుకోకపోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం.

గులాబీ గూటిలో ఉపఎన్నికల గుబులు

  తెలంగాణలో తమకు ఎదురే లేదన్నట్లుగా ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న గులాబీ పార్టీకి అడ్డుకట్టపడేటట్లే కనిపిస్తోంది. కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ప్రజలు పెట్టుకున్న నమ్మకం మెల్లగా కరిగిపోతుందని, త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఖాయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పదేపదే ఉపఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించి, ప్రత్యర్ధి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టిన టీఆర్ఎస్ కు ఇప్పుడవే ఉపఎన్నికలు తలనొప్పిగానూ, సవాలుగానూ మారాయంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్ కు ఏమాత్రం అనుకూలంగా లేవని గులాబీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని, మరోవైపు రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి, బ్యాంకు రుణాలు అందకపోవడం, పెన్షన్ లబ్దిదారుల ఎంపికలో కిరికిరి, చీప్ లిక్కర్ తేవాలన్న ప్రయత్నాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని అంగీకరిస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా, కొన్ని హామీల విషయంలో ఇంకా అడుగు ముందుకు పడలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ బిల్లులు చెల్లించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ ఉపఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారట. అందుకే అభ్యర్ధులెవరనే దాని కంటే, ప్రతికూల అంశాలు ఏంటనే దానిపైనే టీఆర్ఎస్ లో చర్చ నడుస్తోందట. అసలు విపక్షాలు ఏఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. వరంగల్ పార్లమెంట్ స్థానంతోపాటు నారాయణఖేడ్ ఉపఎన్నిక విషయంలోనూ టీఆర్ఎస్ లో ఆందోళన చెందుతోందని, అయితే కిష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఏకగ్రీవమయ్యేటట్లు అన్ని పార్టీలూ నిర్ణయం తీసుకుంటాయా? లేక పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ నేతల దురుసు ప్రవర్తన, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, విద్యార్ధుల్లో, యువతలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత...తమకు కలిసొస్తాయని విపక్షాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పై భ్రమలు తొలగిపోతున్నాయని, ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు షాకివ్వడం ఖాయమంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నట్లు జరుగుతుందా? లేక ఉప ఎన్నికల గండం గట్టెక్కి...మరోసారి అందరికీ టీఆర్ఎస్ షాకిస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.

నంద్యాల బైపోల్ తో...ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హోదా కోసం జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న ఆయన... అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకొనే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో ఏవైనా ఎన్నికలు జరిగితే, అధికార పార్టీకి కనువిప్పు కలిగేలా ప్రజాగ్రహం బయటపడుతుందని,అందుకు నంద్యాల ఉప ఎన్నికే సరైన ఆయుధమని జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగాలని జగన్ బలంగా కోరుకుంటున్నారట. ఫ్యాను గుర్తుపై గెలిచి, వారం తిరక్కుండానే టీడీపీ కండువా కప్పుకున్న ఎస్పీవై రెడ్డికి బుద్ధి చెప్పినట్లూ ఉంటుంది, అటు తెలుగుదేశం పార్టీకి వైసీపీ సత్తా చాటినంటూ ఉంటుందని లెక్కలేసుకుంటున్న జగన్, ఎలాగైనా ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో నంద్యాల ఉపఎన్నిక జరిగితే, మనమేంటో నిరూపించుకోవచ్చని, ప్రజల అటెన్షన్ ను కూడా తమవైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. అయితే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైసీపీకి షాకిచ్చి...ఫ్యాన్ ను గాలికి వదిలేసినా, అధికారికంగా టీడీపీలో చేరలేదని, ఎస్పీవై రెడ్డి అయితే...గెలిచి వారం రోజులకే చంద్రబాబును కలిసి పార్టీలో చేరారని, దాంతో అనర్హత వేటు పడటం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద...ఎస్పీవై రెడ్డిపై ఫిర్యాదు చేసి, పదిహేను నెలలు దాటిపోతున్నా, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించారట. ఎలాగైనా నంద్యాలలో బైపోల్ జరగాలని కోరుకుంటున్న జగన్... ఎస్పీవై రెడ్డిపై వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ నేతలకు సూచించారు పార్ఠీ ఫిరాయించిన ఎంపీల అనర్హత వేటుపై మొన్నటివరకూ పెద్దగా పట్టించుకోని జగన్...నంద్యాల ఎంపీపైనే ఫోకస్ పెట్టడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానంలో వైసీపీకి పట్టుందని, ఒకవేళ ఉప  ఎన్నిక జరిగినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, అందుకే జగన్ నంద్యాలను ఎంచుకున్నారని చెబుతున్నారు.

తెలంగాణ కంటే 11 రెట్లు ఏపీనే బెటర్

  నవ్యాంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనతను సాధించింది. రాష్ట్ర విభజనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, భారతదేశంలో వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల్లో మాత్రం రెండో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ లాంటి మహానగరం...ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా, పెట్టుబడులకు సెకంట్ బెస్ట్ ప్లేస్ అంటూ ప్రపంచ బ్యాంక్ తేల్చిచెప్పింది.పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విధానం, పరిశ్రమల సమాఖ్యలైన సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి జాబితాను రూపొందించిన ప్రపంచ బ్యాంక్...రాష్ట్రాలకు ర్యాంకింగ్ లు ఇచ్చింది. అయితే భారత్ లో వ్యాపారాలు చేయడం కష్టమని, అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్న వరల్డ్ బ్యాంక్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సంస్కరణలు అమలు చేయాలని సూచించింది. వ్యాపారాలకు అనుకూలమైన 182 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 142వ స్థానంలో ఉందన్న ప్రపంచ బ్యాంక్  డైరెక్టర్ రుహల్...నిర్మాణ అనుమతుల వంటి అంశాల్లోనైతే... ఏకంగా చివరి పది దేశాల్లో ఉందన్నారు. ఇక టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, రెండో స్థానంలో నిలిచిన ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటం విశేషం, ఈ లిస్ట్ లో గుజరాత్ మొదటి టాప్ ప్లేస్ లోనూ, జార్ఖండ్ మూడో స్థానంలో నిలవగా, మిజోరాం, జమ్మూకాశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లు అట్టడుగున ఉన్నాయి, అన్ని వనరులూ కలిగి హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం...13వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడానికే ఈ జాబితా రూపొందించినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ల్యాండ్ అలాట్ మెంట్, కార్మిక సంస్కరణలు,పర్యావరణ అనుమతులు, ఇన్ ఫ్రా వంటి మొత్తం 8 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిపారు. పెట్టుబడులు, వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం లభించడం శుభపరిణామమని, ప్రపంచ బ్యాంక్ నివేదిక నవ్యాంధ్ర అభివద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి

తెలంగాణలో డేంజర్ బెల్స్, సంక్షోభంలో విద్యా వ్యవస్థ

  ఏళ్ల తరబడి నిరీక్షణ, కోటి ఆశలు, ఎన్నో కలలు, వేలాది ఆకాంక్షలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకం... తెలంగాణ రాష్ట్రం రానే వచ్చింది, కానీ నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలు మాత్రం కలలుగానే మిగిలిపోతున్నాయి. సొంత పాలకుల చేతిలోనూ నిరాశే ఎదురవుతోంది, అవమానాలే మిగులుతున్నాయి. ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి, ఒకపక్క అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన యువత...సరైన విద్య అందక పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతున్నారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభమే కాదు,  విద్యావ్యవస్థ కూడా చిన్నాభిన్నమై... సాయం కోసం రోదిస్తోంది. తెలంగాణ తెచ్చింది మేమే, తమకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి టీఆర్ఎస్ అధికారంలో వచ్చి ఏడాది దాటిపోతున్నా, హామీల అమలులో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వెనుకబడిపోతోంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు... నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అదిగో ఇదిగో...అమలు చేస్తున్నామని చెబుతున్నా, కార్యరూపం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అడుగు ముందుకుపడటం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా, ఇంతవరకూ యూనివర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితి, రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కూడా దాదాపుగా రెగ్యులర్ వీసీలు లేరంటే...విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు గత జులై నుంచి నేటివరకూ రెగ్యులర్ వీసీ లేరు. మిగతా యూనివర్సిటీల పరిస్థితీ దాదాపు అంతే, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరాబాద్), పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్ నగర్)లైతే నిధులు, తీవ్ర సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం యూనివర్సిటీలు, కాలేజీల్లో 50శాతం వరకు సిబ్బంది కొరత ఉందని, అది విద్యార్ధుల ప్రతిభా పాటవాలు, ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. తెలంగాణలో చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థను గమనించిన పలువురు అధికారులు...ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారని,పరిస్థితి ఇలానే కొనసాగితే పలు యూనివర్సిటీలు...నాక్(నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్) గుర్తింపును కోల్పోతాయని, దాంతోయూజీసీ గ్రాంట్స్ నిలిచిపోయి, మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని డేంజర్ బెల్స్ మోగించారు. దాంతో ఆలస్యంగానైనా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం...వీసీల నియామకానికి హడావిడిగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా, ఇంకా కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇదిలా ఉంటే, హాస్టల్, మెస్ బిల్లులు అందక ఎస్సీఎస్టీ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలకు 110 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం...విద్యార్ధుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రైవేట్విద్యాసంస్థలు...బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ దూసుకుపోతుండగా, ప్రభుత్వ స్కూళ్లు మాత్రం మూసివేత దిశగా సాగుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా డ్రాపవుట్స్ ను తిరిగి స్కూళ్లకు చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దాంతో పేదలకు విద్య మరింత దూరమవుతోందని అంటున్నారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యావ్యవస్థను బాగుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నికల హామీల్లో ఒకటైన విద్యావ్యవస్థను గాడిలో పెడుతుందో లేక చేతులెత్తిస్తుందో చూడాలి

జగన్ ...హిందువులకు దగ్గర అవుతున్నారా?

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి...పక్కా క్రిస్టియన్... తాతల కాలం నుంచే ఆయనది క్రైస్తవ కుటుంబం. జగన్ తాత రాజారెడ్డి తరానికంటే ముందే క్రైస్తవ మతంలోకి మారారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా దాదాపు క్రైస్తవ్యంలోకి మారిన వాళ్లే. వైఎస్ కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించి బాప్తిస్మం తీసుకున్నా, జగన్ మాదిరిగా పెద్దగా ఫోకస్ కాలేదు. వైఎస్ క్రైస్తవుడే అయినా, అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ, హిందూ సంప్రదాయాలనూ పాటిస్తూ అందరివాడినన్న భావన కలిగించేవాడు.  ఎన్నికల ప్రచారంలోనూ నుదుటన తిలకం దిద్ది...పక్కా హిందువుగా కనిపించేవారు. జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించారు, పక్కా క్రిస్టియన్ గా ప్రజల్లో ఫోకస్ అయ్యేవారు, వైఎస్ భార్య విజయమ్మ, కూతురు షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ అయితే క్రైస్తవ ప్రచారకులుగా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపే...జగన్ కు మైనస్ గా మారిందని, 2014 ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి కారణమైందని వైసీపీ నేతలు అంటున్నారు. లోటస్ పాండ్ లోని ఇంటికి పెద్దగా సిలువ సింబల్ వేయడం, ఎన్నికల ప్రచారంలో జగన్ ఎక్కువగా చర్చిలకే వెళ్లడం, హిందువులకు నచ్చలేదని, ఈ గుర్తింపు వల్లే రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా పూర్తిస్థాయిలో మద్దతు లభించలేదని అంటున్నారు. జగన్... క్రిస్టియన్... మనోడు కాదని రెడ్డి వర్గం భావించిందని, అందుకే రెడ్డి డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. అయితే క్రిస్టియన్ గుర్తింపుతో వైసీపీకి కొన్ని వర్గాలు బలంగా కొమ్ముకాసినా, హిందువులు పెద్దమొత్తంలో దూరమవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన జగన్... లోటస్ పాండ్ లోని తన ఇంటికి సిలువ గుర్తు తీయించేశారు. హిందువులకు దగ్గరైతేనే లక్ష్యాన్ని చేరుకోగలమని, లేదంటే 2014 రిజల్టే రిపీట్ అవుతుందని భావిస్తున్నారట, అందుకే సీనియర్ల సూచన మేరకు అప్పుడప్పుడూ స్వామిజీలను, పీఠాధిపతులను, బాబాలను కలుస్తూ... హిందువులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి మొన్న గోదావరి పుష్కరాల్లో హిందూ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్నానం ఆచరించి పిండ ప్రదానం చేశారు.ఇప్పుడు తాజాగా జ్యోతిష్కుడు రమణారావు సూచన మేరకు శాంతి హోమం చేయిస్తున్నారట. మరి జగన్ ఆశిస్తున్నట్లుగా 2019 నాటికైనా హిందువులు వైసీపీ దగ్గరవుతారో లేదో చూడాలి.

చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా?

  చంద్రబాబుకు పదవీ గండం ఉందని, 2017లో అంతర్గత కుమ్ములాటలు పెరిగి, అనూహ్య పరిస్థితుల్లో...టీడీపీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయని, అదే సమయంలో లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తే, సర్కార్ నిలబడుతుందని, లేదంటే ఇబ్బందికరమేనంటూ జ్యోతిష్కుడు రమణారావు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతమే అయినా, వాటిని తూచా తప్పకుండా ఆచరించేవాళ్లు మాత్రం ఈ జ్యోతిష్కుడి మాటలతో అయోమయంలో పడ్డారు. అలా జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన మాటలపై నమ్మకం కుదిరే...మూడేళ్లలో తానే సీఎం అవుతానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెబుతున్నాడని గుర్తుచేస్తున్నారు. పైగా చంద్రబాబు గ్రహస్థితి అంతగా బాగో లేదని, గ్రహాలు బలహీనంగా ఉన్నాయని చెప్పిన రమణారావు...జగన్ గ్రహస్థితి మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పైగా 2017లోనే జగన్ సీఎం అవుతారంటూ చెప్పడంతో, చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా అనే చర్చజరుగుతోంది. అయితే జ్యోతిష్కులు చెప్పేవి అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోయినా, ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తుల గురించి వాళ్లు చెప్పే విషయాలు సంచలనంతోపాటు ఆసక్తిని రేకేత్తిస్తుంటాయ్. ఇప్పుడు చంద్రబాబు, జగన్ విషయంలో జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన విషయాలూ అంతే సంచలనం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు జిగిరీ దోస్త్ అయిన రమణారావు...2009లో టీడీపీ-టీఆర్ఎస్ కు పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారట. అంతేకాదు 2014లో కచ్చితంగా తెలంగాణ ఏర్పడటం ఖాయమని ముందే చెప్పానని ప్రచారం చేసుకునే రమణరావు... వైఎస్ విమాన ప్రమాదాన్ని కూడా ముందుగానే ఊహించి చెప్పారట.దాంతో పక్కా క్రిస్టియన్ అయిన జగన్ కు కూడా రమణారావుపై గురి కుదిరిందని, అందుకే బెంగళూర్ లోని జగన్ ఎస్టేట్స్ లో శాంతి హోమం చేయిస్తున్నారట. జగన్ కు కూడా వాళ్ల నాన్నలాగే ఆకాశ యానంలో ప్రమాదం ఉందని రమణారావు హెచ్చరించడంతోనే శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి రమణారావు చెప్పినట్లుగా టీడీపీలో తిరుగుబాటు వస్తుందో? మూడేళ్లలో జగన్ సీఎం అవుతాడో తెలియదు కానీ...జ్యోతిష్యాన్ని  నమ్మేవాళ్లు మాత్రం...చంద్రబాబు శాంతి హోమం చేయించాలంటున్నారు. గ్రహాల అనుగ్రహం కోసం హోమం చేయడం తప్పుకాదంటున్న టీడీపీ నేతలు...టీ-సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ 2014కి ముందు ఇలాంటి హోమాలు ఎన్నో చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు కూలిపోవాలంటూ...రహస్య హోమాలు చేసిన వాళ్లూ ఉన్నారని, అలాంటి వాటికి విరుగుడుగా హోమం చేయడం మంచిదంటున్నారు. రమణారావు కూడా ఇదే విషయం చెప్పారని, కొన్ని పనులు చేస్తే రాజధాని నిర్మాణం త్వరగా పూర్తయి, చంద్రబాబు మంచిపేరు తెచ్చుకుంటారన్న మాటలను గుర్తుచేస్తున్నారు. మరి రమణారావు చెప్పిన జాతకం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మూరో మూడేళ్లు ఆగాల్సిందే.

తెలంగాణ తెలుగుదేశంలో ముసలం

తెలంగాణ తెలుగుదేశంలో జరుగుతున్న కోల్డ్ వార్...బ్లాస్ట్ అయ్యింది. కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు....తమ ఆక్రోశాన్ని బహిరంగంగా బయటపెట్టేశారు, టీటీడీపీ భేటీలో రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసిన సీనియర్లు... తమను కాదని యువనేతకు పగ్గాలిస్తే మరో సంక్షోభం తప్పదని పార్టీ అధినేతకు సంకేతాలు పంపారు. పైకి ఎర్రబెల్లి, రేవంత్ మధ్యే ఆధిపత్య పోరు జరుగుతోందని అనుకున్నా, సీనియర్లంతా మూకుమ్మడిగా ఈ యువ నాయకుడిపై యుద్ధం ప్రకటించారు. అటు అసెంబ్లీ అయినా, ఇటు ప్రజాక్షేత్రమైనా తెలంగాణ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి మాత్రమే ఫోకస్ అవుతున్నాడని, చివరికి గవర్నర్ ను కలిసినా... మీ హీరో ఏడంటూ అడుగుతున్నారని ఫీలవుతున్నారట. ఒకవేళ తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలు రేవంత్ కి దక్కితే తమ పరిస్థితి మరింత దిగజారిపోతుందని భయపడుతున్నారట ఈ పేకాట బ్యాచ్. రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్న సీనియర్లు...ఎలాగైనా అడ్డుకట్టవేయాలనే ఆలోచనకు వచ్చారని,  లేదంటే తమను మొత్తానికే మర్చిపోయే ప్రమాదముందని, చంద్రబాబు సైతం పట్టించుకోరని మదనపడుతున్నారట. పైగా తెలంగాణ టీడీపీకి కొత్త సార‌ధిని నియమించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, అది రేవంత్ కి దక్కకుండా సీనియర్లంతా జట్టు కట్టారని తెలుస్తోంది. అందుకే టీటీడీపీ సమావేశంలో రేవంత్ టార్గెట్ గా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారని,దానికి మిగతా సీనియర్లంతా మద్దతు పలికారని అంటున్నారు. పరోక్షంగా ఎర్రబెల్లికి కొమ్ముకాస్తున్న సీనియర్ లీడర్లంతా, రేవంత్ కి కీలక బాధ్యతలు దక్కకుండా పావులు కదుపుతున్నారని, చంద్రబాబుపైనా ఒత్తిడి పెంచుతున్నారని అంటున్నారు. ఇక గతంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆశించిన ఎర్రబెల్లి...ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారట, అయితే అనుకోని విధంగా రేవంత్ రెడ్డి రాకెట్ లా పోటీలోకి దూసుకురావడంతో, సీనియర్ల మద్దతు కోరారని, అందుకే మోత్కుపల్లి, ఎల్.రమణ లాంటి నేతలంతా యువ నాయకుడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయినప్పుడు...పైకి టీఆర్ఎస్ కుట్ర అంటూ కామెంట్స్ చేసినా...లోలోన సంతోషపడ్డారని, ఏ చిన్న సందు దొరికినా రేవంత్ ను తొక్కేయాలని ఎత్తులు వేస్తోందట ఈ పేకాట బ్యాచ్. అయితే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలై క‌ష్టాలుప‌డ్డ రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు సానుభూతి ఉంద‌ని, పైగా కేసీఆర్, టీఆర్ఎస్ ను ధీటుగా ఢీకొట్టాలంటే అత‌నే కరెక్ట్ అనే భావనలో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి, కానీ సీనియ‌ర్ లీడ‌ర్ ఎర్రబెల్లిని కాదని, రేవంత్ కి ప‌గ్గాలు అప్పగిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని సందిగ్ధంలో ప‌డ్డారంటున్నారు, దాంతో ఈ ఇద్దరిలో ఒక‌రిని అధ్యక్యుడిగా, మ‌రొక‌రిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ‌మించాల‌నే నిర్ణయానికి వ‌చ్చార‌ని, ఒక‌వేళ రేవంత్ కే ప‌గ్గాలివ్వాల్సి వ‌స్తే, ఎర్రబెల్లికి మళ్లీ పాత పోస్టే ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు. అయితే వీరిద్దరిలో ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇచ్చినా పొస‌గ‌ద‌ని, ఆధిప‌త్య పోరుతో పార్టీ కేడ‌ర్ న‌లిగిపోవ‌డం ఖాయ‌మంటున్నారు మిగ‌తా నేత‌లు. పైగా తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అభ్యర్ధినంటూ రేవంత్ చెప్పుకుంటున్నారని, చంద్రబాబు కూడా సీనియర్లను కాదని, రేవంత్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని మోత్కుపల్లి లాంటి లీడర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ పైనా అభ్యంతరం తెలిపిన మోత్కుపల్లి.... పులులు, సింహాలంటూ సినిమా డైలాగ్ లు మానేయాలంటూ చురకలంటించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీ...పునర్ వైభవం సాధించాలంటే రేవంత్ లాంటి ఫైర్  ఉన్న నాయకుడే కావాలని, టీటీడీపీని నడిపించగల సత్తా ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. పైగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను సమర్ధంగా ఎదుర్కోవాలంటే అది రేవంత్ వల్లే సాధ్యమని, అందుకే గులాబీ నేతలు కూడా అతడ్ని టార్గెట్ చేశారని చెబుతున్నారట. అయితే దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను  కాదని, జూనియరైన రేవంత్ కి పగ్గాలు అప్పగిస్తే, కొత్త తల నొప్పులు వస్తాయని భావిస్తున్న అధినేత...ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటికే వలసలతో సతమతమవుతూ,  ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న పార్టీలో మరో సంక్షోభం వస్తే, తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమని భావిస్తున్న  చంద్రబాబు...సీనియర్లను బుజ్జగించే పనిలో పడ్డారట.

ప్రైవేట్ ట్రావెల్స్ కి డబుల్ ఎంట్రీ టాక్స్ నుండి మినహాయింపు?

  తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ఆంధ్రా వాహనాల నుండి ప్రవేశపన్ను వసూలు చేయాలనే నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆంధ్రా నుండి తెలంగాణాలో పర్యాటక ప్రాంతాలకు వచ్చేవారి కంటే, తెలంగాణా నుండి ఆంధ్రాలో పర్యాటక, పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్ళే వారి సంఖ్యే అధికంగా ఉండటంతో తెలంగాణా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలే ఎక్కువ పన్ను చెల్లించవలసి వస్తున్నట్లు తెలంగాణా రవాణా శాఖా అధికారులు గుర్తించారు. కనుక ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల మధ్య తిరుగుతున్న సుమారు 10, 000 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై డబుల్ ఎంట్రీ టాక్స్ ఎత్తివేసి దాని స్థానంలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే పర్మిట్ జారీ చేసేందుకు ఆంధ్రా రవాణా శాఖా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.   తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్ను విధించాలనుకొన్నప్పుడు, దాని వలన సరుకు రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలపై చాలా భారం పడుతుంది కనుక ఆ ఆలోచన విరమించుకోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను, సరుకు రవాణా, ట్రావెల్స్ సంస్థలు చేసిన విన్నపాలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఇతర రాష్ట్రాలకు లేని నిబంధనలు తమకే ఎందుకని ప్రశ్నిస్తూ ఆంధ్రా వాహనాల నుండి ప్రవేశపన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. దాని ద్వారా వస్తున్న భారీ ఆదాయాన్ని చూసి మురిసిపోయింది. కానీ సరుకు రవాణా, ట్రావెల్స్ సంస్థలు ఆ భారాన్ని తిరిగి ప్రజలకే బదలాయించడంతో రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ ఆర్ధిక భారం మోయక తప్పలేదు. కానీ తన తొందరపాటు నిర్ణయం వలన తమకే ఎక్కువ నష్టం వస్తోందని గ్రహించిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ట్రావెల్స్ సంస్థలపై ప్రవేశపన్ను ఉపసంహరించుకోవడానికి సిద్దపడుతోంది. ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. బహుశః అది ఇదేనేమో?

ఎన్డీయేలో సీట్ల పంపకం పూర్తయినట్లే!

  మాజీ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ స్థాపించిన హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్.ఎ.యం.) పార్టీ త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమితో జత కట్టింది. కానీ నిన్నటి వరకు వాటి మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. హెచ్.ఎ.యం.కి మొదట 13సీట్లు మాత్రమే బీజేపీ ఇవ్వజూపింది. కానీ హెచ్.ఎ.యం.లో ఉన్న 19మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అధనంగా మరో పది సీట్లయినా తమకు కేటాయించాలని లేకుంటే ఎన్డీయే కూటమి నుండి తప్పుకొంటామని జితన్ రామ్ మంజీ హెచ్చరించారు. ఒకవేళ ఆయన ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చి తమ సమాజ్ వాది పార్టీతో చేతులు కలిపినట్లయితే ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ప్రకటించడంతో బీజేపీ అప్రమత్తమయింది. జితన్ రామ్ మంజీ కోరినట్లే హెచ్.ఎ.యం.కి 20 సీట్లు కేటాయించింది. అదనంగా మరో ఐదు సీట్లు కూడా కేటాయించింది. కానీ ఆ ఐదు స్థానాలలో బీజేపీ టికెట్ పైనే పోటీ చేయవలసి ఉంటుంది. అందుకు జితన్ రామ్ మంజీ కూడా అంగీకరించారు.   ఇక కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్ విలాశ్ పాశ్వాన్ కి చెందిన లోక్ జన్ శక్తి పార్టీకి 40సీట్లు కేటాయించడానికి బీజేపీ అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ సజావుగా పూర్తయినట్లే భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243సీట్లలో లోక్ జన్ శక్తి పార్టీకి 40, హెచ్.ఎ.యం.కి 25 సీట్లు ఇవ్వగా మిగిలిన స్థానాలలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. సీట్ల పంపకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

రూ. 19,496 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ నగరాలలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ని ఈ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారు శ్రీధరన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు.   వాటిలో విజయవాడలో పి.యస్. బి.యస్. నుంచి పెనమలూరు వరకు నిర్మించబోయే 26.03 కి.మీ. పొడవుగల మెట్రో ప్రాజెక్టుకి రూ.6, 769 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వైజాగ్ లో మదురవాడ సమీపంలో కొమ్మాది నుండి ఎన్.ఏ.డి. మీదుగా గాజువాక వరకు ఒక కారిడార్, గురుద్వారా జంక్షన్ నుండి పాత పోష్టాఫీసు వరకు మరో కారిడార్ నిర్మిస్తారు. మొత్తం 42.5 కి.మీ పొడవుగల ఈ రెండు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 12,727 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే విజయవాడలో ఒక కి.మీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.260.04 కోట్లు అవసరమయితే, అదే వైజాగ్ లో ఒక కి.మీ.కి రూ.299.46 కోట్లు వ్యయం అవుతుందన్నమాట!   20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నట్లయితే మెట్రో ప్రాజెక్టులు నిర్వహించడం లాభదాయకం కాదనే కారణం చేత విజయవాడ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చలేనని ఇదివరకే తేల్చి చెప్పింది. కానీ జపాన్ దేశానికి చెందిన జైకా అనే సంస్థ ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేప్పట్టాలని నిశ్చయించుకొంది. కానీ రెండు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తే వీలయినంత వరకు రెంటికీ కూడా నిధులు మంజూరు అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా 2018 డిశంబరు నాటికి పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు అన్నారు.   ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా విజయవాడ-గుంటూరు-రాజధాని అమరావతిని కలుపుతూ సర్క్యులర్ రూటులో ఒక హైస్పీడ్ రైల్ నడిపేందుకు కూడా ప్రతిపాదనలు రైల్వే శాఖకు పంపించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ సమగ్ర నివేదిక తయారు చేసి ఈయవలసి ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ నివేదిక చేతికి అందగానే తను రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడి దానిని కూడా ఆమోదింపజేయిస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలు పెట్టే ముందు వాటికి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. బహుశః త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమం మొదలుపెట్టవచ్చును.

టీకాంగ్రెస్ నేతలకు జ్ఞానోదయం అయినట్లేనా?

రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ మారింది...పాత చింతకాయ పచ్చడిలాగా రుచీపచీ లేకుండా విమర్శలు చేస్తే, జనం పట్టించుకోవడం మానేశారు. జనానికి పంచ్ డైలాగ్ లు కావాలి, అది నిజమైనా, కాకపోయినా సెన్షేషన్ కామెంట్స్ చేయాలి, పచ్చి బూతులు మాట్లాడాలి, సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అంటూ ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడాలి, సందర్భం చూసుకుని జనాల్లో అలజడి రేపాలి, అన్యాయం జరిగిపోతుందంటూ రెచ్చగొట్టాలి... అప్పుడే జనం అటెన్షన్, మీడియా ఫోకస్ ఆ పార్టీపైనా, ఆ లీడర్ పైనా పడుతుంది... ఆటోమెటిగ్గా స్టార్ పొలిటీషియన్ గా మారిపోతాడు. ఇదీ ఇప్పటి ట్రెండ్... దీనికి భిన్నంగా ఏం చేసినా...జనాలు పట్టించుకోరు సరికదా, మొత్తానికే మర్చిపోయే అవకాశముంది. దీన్ని ఆలస్యంగానైనా గుర్తించినట్లున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను గుర్తుతెచ్చుకున్నారో లేక టీటీడీపీ బుల్లెట్ రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకున్నారో తెలియదు గానీ, కొద్దిరోజులుగా దూకుడు మంత్రం ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా మాటల తూటాలు పేల్చుతూ, గులాబీ కోటలో గుబులు పుట్టిస్తున్నారు. దాంతో  జనం అటెన్షన్, మీడియా ఫోకస్...టీకాంగ్రెస్ పై పడింది.  కేసీఆర్ కు సొంత కొడుకుపైనే నమ్మకం లేదంటూ పొన్నం చేసిన కామెంట్స్ తో వేడెక్కిన వాతావరణం, మెల్లమెల్లగా రాజుకుంటోంది. పొన్నం స్ఫూర్తితో మిగతా టీకాంగ్ నేతలు కూడా కేసీఆర్ పైనా, మంత్రులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండటంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు టీకాంగ్రెస్ నేతల దూకుడు...ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది, తమ నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందని, ఇదే దూకుడుని కొనసాగిస్తే, కాంగ్రెస్ కు మళ్లీ పునర్ వైభవం ఖాయమని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.  అయితే అసెంబ్లీలోనూ సమర్ధవంతంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అప్పుడే ప్రజల అటెన్షన్ కాంగ్రెస్ పై పడుతుందని సీనియర్లు సూచిస్తున్నారు.

జగన్ దీక్షలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయిట!

  ఏ రాష్ట్రంలోనయినా ప్రతిపక్షాలు ఏదో ఒక అంశంపై ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ పోరాడటం సహజమే. కానీ అందుకోసం రాజకీయ పార్టీలు తరచు నిరాహార దీక్షలు చేయవు. కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సగటున నెలకొకసారి ఏదో ఒక అంశం పేరుతో నిరాహార దీక్షలు, ఓదార్పు యాత్రలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆయన రెండు రోజులు దీక్షలు చేస్తుంటారు. మరొకసారి కొన్ని గంటలు మాత్రమే చేస్తుంటారు. వాటికోసం వైకాపా చేతిలో ఉన్న మీడియా ద్వారా చాలా ప్రచారం చేసుకొంటారు. దాని కోసం అట్టహాసంగా ఏర్పాట్లు, భారీగా జనసమీకరణ చేస్తుంటారు. కానీ ఏ అంశం మీద నిలకడగా కొన్ని రోజుల పాటు పోరాడకపోవడమే జగన్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చును.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26వ తేదీ నుండి జగన్ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అది ఎన్నిరోజుల్లో ఏవిధంగా ముగియబోతుందో ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి కూడా చెప్పగలడు. కానీ షరా మామూలుగానే జగన్ దీక్ష కోసం అన్ని జిల్లాలలో పార్టీ నేతలు ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న వై.యం.సి.ఎ. కార్యాలయంలో జిల్లా వైకాపా నేతలు ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఇవ్వాళ్ళ సమావేశమవుతున్నారు.   జగన్ చేస్తున్న ఈ హడావుడిని చూసిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజి “జగన్ చేస్తున్న దీక్షలు ఏదో ఫ్యాషన్ షోలాగ సాగుతున్నాయి. ఆయనకి ఎంతసేపు ముఖ్యమంత్రి పదవి మీదే ఆరాటం. ప్రభుత్వం తీసుకొన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇస్తూ తనే ఆపరేషనల్ సీ.ఎం.అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన రైతులను మభ్య పెడుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మళ్ళీ బ్రతికి బట్ట కట్టడానికి ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. అటువంటి ప్రయత్నాలను మేము ఎదుర్కొంటాము,” అని తెలిపారు.

తుపాకుల మ్రోతలో శాంతి చర్చలా?

  భారత్-పాక్ దేశాల సరిహద్దు భద్రతా దళాల అధికారుల మధ్య గురువారం నుండి మూడు రోజుల పాటు డిల్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. సరిహద్దులో కాల్పులు విరమించి శాంతి నెలకొల్పడమే వారి సమావేశం యొక్క ప్రదానోదేశ్యం. కానీ వారు సమావేశం జరుపుతున్న సమయంలోనే సరిహద్దులో పాక్ దళాలు భారత దళాలపై కాల్పులు జరపడం విశేషం. పాక్ మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదని అప్పుడే నిరూపిస్తున్నట్లుంది. కానీ మొదటిరోజు సమావేశం చాలా సానుకూలంగా ముగిసినందుకు భారత్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారు.   రెండవరోజు సమావేశం జరుగుతున్న సమయంలో కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాక్ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ రేంజర్ల డి.జి. మేజర్ ఉమర్ ఫరూకి బుర్కీ నేతృత్వంలో వచ్చిన పాక్ రేంజర్లను ఉద్దేశ్యించి భారత్ హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ మాట్లాడుతూ, “భారత్ ఎప్పుడూ శాంతిని, పొరుగుదేశాలతో స్నేహాన్నే కోరుకొంటుంది. మావైపు నుండి మొదటి బులెట్ ఎన్నడూ పేల్చమని నేను భారత్ తరపున హామీ ఇస్తున్నాను. మీ నుండి కూడా అదే ఆశిస్తున్నాను. ఇరు దేశాలు ఉగ్రవాదుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనుక ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదులను అరికట్టాల్సి ఉంది. ముఖ్యంగా సరిహద్దులలో ఉగ్రవాదుల చొరబాట్లను నివారించవలసి ఉంది,” అని అన్నారు.   హోంమంత్రిగా ఒక భాద్యతాయుతమయిన పదవిలో ఉన్న రాజ్ నాద్ సింగ్ ఆవిధంగానే మాట్లాడాలి గాబట్టి మాట్లాడుతున్నారనుకోవాలి. కానీ, ఇక్కడ శాంతి ప్రవచనాలు చెప్పుకొంటున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల చేతిలో ఇద్దరు భారత జవాన్లు మరణించారు. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పుడు కూడా సరిహద్దులో తుఫాకులు మ్రోతలు మారు మ్రోగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఇంతగా బరి తెగించి వ్యవహరించడం చాలా విస్మయం కలిగిస్తుంది. అటువంటి దేశాన్ని కాల్పులు విరమించమని, ఉగ్రవాదులను మన దేశంలో చొరబడకుండా అడ్డుకోమని హోంమంత్రి కోరడం వలన ఏమి ప్రయోజనం.   “మా వైపు నుండి మొదటి బులెట్ పేల్చమని నేను భారత్ తరపున హామీ ఇస్తున్నాను. మీ నుండి కూడా అదే ఆశిస్తున్నాను,” అని రాజ్ నాద్ సింగ్ చెప్పినప్పుడు పాక్ రేంజర్ల డి.జి. మేజర్ ఉమర్ ఫరూకి బుర్కీ కూడా అటువంటి హామీ ఇస్తే వారి చిత్తశుద్ధిపై కొంతయినా నమ్మకం ఏర్పడి ఉండేది. కానీ ఆయన “నేను కేవలం ఒక డి.జి. స్థాయి అధికారిని మాత్రమే. మీలాగ నిర్ణయం ప్రకటించగల అధికారం నాకు లేదు. కానీ మీ సందేశాన్ని మా ప్రభుత్వానికి తెలియజేస్తాను,” అని గడుసుగా జవాబిచ్చారు.   ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకొన్నట్లయితే సరిహద్దుల్లో కాల్పులు జరుపమని పాక్ ప్రభుత్వమే నేరుగా తన సైనికులకి ఆదేశాలిస్తోందని భావించవలసి ఉంటుంది. కానీ కాల్పుల విరమణ కోసం భారత అధికారులతో చర్చలు జరిపేందుకు వచ్చిన ఒక డి.జి స్థాయి ఉన్నతాధికారి తమ వైపునుండి కాల్పులు జరగవని హామీ ఇవ్వడం లేనప్పుడు ఇక ఈ చర్చలకు అర్ధం ఏముంటుంది?