టీ-కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయిట!

  తలుపులు నమిలేసేవాడికి అప్పడాలు ఒక లెక్కా అన్నట్లు ఏపీ రాష్ర్ట ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేయగలిగినవారికి తమ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఒక లెక్కా? తెలంగాణా కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం తమ పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. ఆయన చెప్పిన మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ఓటుకి నోటు కేసు బయటపడటానికి చాలా కాలం ముందు నుండే తమ ఫోన్లు ట్యాపింగ్ చేయబడుతున్నాయని చెప్పారు. తన ఆరోపణలను ఖండించే దైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉందా? అని ప్రశ్నించారు. ఇలాగ విచ్చలవిడిగా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా నేరమని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తక్షణమే పదవి నుండి బర్త్ రఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్ కి విజ్ఞప్తి కూడా చేసారు.   అయితే ఆయన తమ ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయని పిర్యాదు చేయడం చూస్తుంటే రోలోచ్చి మద్దెలతో మొరపెట్టుకొన్నట్లుంది. విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు కాల్-డాటా తనకు సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినప్పుడు, ఆ రికార్డులు దానికి ఇవ్వకూడదని హైకోర్టులో వాదించిన తెలంగాణా అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి తమ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. తద్వారా తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని అంగీకరించినట్లయింది. హైకోర్టులోనే ఆయన అంత విస్పష్టంగా చెపుతున్నప్పటికీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఆటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఘోడును ఎవరు పట్టించుకొంటారు? ఆయన ఆరోపణలను ఎవరు పట్టించుకొంటారు?   అయినా చాలా కాలం క్రితమే తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని తెలిసి ఉన్నప్పుడు అప్పుడే ఆసంగతి ఆయన ఎందుకు బయటపెట్టలేదు? అని తెరాస నేతలు ప్రశ్నిస్తే దానికి ఆయన జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని తెలిసి ఉంటే ఆయన కనీసం తన పార్టీ నేతలయినా హెచ్చరించి ఉండాలి. కానీ అదీ చేయలేదు. కానీ ఇప్పుడు తాపీగా ఆరోపణలు చేయడం చూస్తే, ఎందుకు చేస్తున్నారో? అని ఆయన పైనే అందరికీ అనుమానం కలుగడం సహజం. ఒకవేళ ఆయన తెలంగాణా ప్రభుత్వం తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందని నమ్ముతున్నట్లయితే, దానికి బలమయిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నట్లయితే ఆయన కూడా న్యాయపోరాటం చేయవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా మీడియా ముందుకు వచ్చి తన ఘోడు వెళ్లబోసుకొంటే ఏమి ప్రయోజనం ఉండదు.

జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు అందుకే: కామినేని

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెదేపా ఇంకా బీజేపీతో ఎందుకు స్నేహంగా ఉంటోందని, తక్షణమే తమ ఇద్దరు కేంద్రమంత్రులను రాజీనామా చేయించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరచూ డిమాండ్ చేస్తుంటారు. మొన్న డిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆయన మళ్ళీ అదే డిమాండ్ లేవనెత్తారు.   దానిపై స్పందించిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా-బీజేపీలు ఎప్పుడు విడిపోతాయా అని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అవి విడిపోవాలని అతను కోరుకొంటున్నాడు. కానీ ఆయన కోరిక ఎన్నటికీ తీరేది కాదని గ్రహిస్తే మంచిది. మా రెండు పార్టీల మధ్య మంచి అవగాహన, బలమయిన అనుబందం ఉంది. కాంగ్రెస్ లేదా వైకాపా నేతలు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు కేంద్రంతో దురుసుగా వ్యవహరిస్తారనుకొంటే అంతకంటే పొరపాటు ఉండదు. ఈ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలను పట్టుకొని నేను స్పందించనవసరం లేదు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం చాలా అవసరముంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే. కానీ అది ఇచ్చేందుకు కొన్ని సమస్యలున్నాయి. అందుకు తీసిపోని విధంగా ప్యాకేజి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకొని రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించాలి కానీ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని ఈవిధంగా రాజకీయాలు చేయడం వలన రాష్ట్రానికి ఇంకా నష్టమే తప్ప లాభం ఉండబోదని గ్రహించాలి. అయినా రాష్ట్రానికి చెందిన తెదేపా, బీజేపీ నేతలు డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నిటినీ సాధించుకొంటూనే ఉన్నాము. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయం మీద ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాయో ప్రజలకీ తెలుసు. వాళ్ళే వాటికి తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.

ముద్దులకొడుకు ముచ్చట కోసం పార్లమెంటు బంద్ చేసినా తప్పేనా?

  కాకి పిల్ల కాకికి ముద్దు. సోనియాగాంధీకి రాహుల్ బాబు అంటే ముద్దు. అందుకే ఆమె తన ముద్దుల కొడుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొనేందుకు వీలుగా ప్రధాని కుర్చీలో డా. మన్మోహన్ సింగ్ ని కూర్చోబెట్టి ఆమె రిమోట్ తో దేశాన్ని పాలించారు. కానీ పదేళ్ళపాటు ఎదురు చూసినా రాహుల్ బాబు ఆ కుర్చీలో కూర్చొనే సాహసం చేయలేకపోవడంతో, ఆయన తన కుర్చీకి అంటిన బొగ్గు మసి దులుపుకొంటూ రోజులు దొర్లించేసారు. తీరా రాహుల్ బాబుకి ఆ కుర్చీలో కూర్చోవాలనే మనసు పుట్టేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది.   పోనీ మమ్మీ కుర్చీలోనయినా కూర్చోందామని ముచ్చటపడితే ‘నీకు అంత సీన్ ఉందా?” అని వెనక నుండి ఎవరో గుసగుసలు ఆడుకోవడం చూసి ఆయన చాలా హర్ట్ అయిపోయి ఫారిన్ వెళ్లిపోయారు. “ఉద్యోగులు శలవులు పెట్టడం చూశాము కానీ దుక్కలా ఉన్న రాజకీయ నాయకులు రాజకీయాలకు, పార్టీకి శలవులు పెట్టడం మేమెన్నడూ చూడలేదు స్మీ!” అంటూ గిట్టనివాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. “లోకులు కాకులు వంటివారు...వారు అరుస్తూనే ఉంటారు...వాళ్లకి భయపడితే జీవితంలో ఇక ఏ కుర్చీలోనూ మనం కూర్చోలేము” అని ఫారిన్ లో ఉపదేశం పొందిన రాహుల్ బాబు తిరిగివచ్చి తన పవర్ ఏమిటో చూపించాలని ఫిక్స్ అయిపోయాడు.   ఫారిన్ నుండి వస్తూనే రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంటులో ఎక్కి చీమిడి ముక్కులున్న పిల్లలను గుర్తించి వాళ్ళని ఒళ్లో కూర్చోబెట్టుకొని జనాలతో మమేకం అయిపోయారు. ఆ తరువాత కాళ్ళు నొప్పులు పుట్టేవరకు వరకు పాదయాత్రలు చేసి తమ హయాంలో ఆత్మహత్యలు చేసుకొన్నా రైతుల కుటుంబాలను ఓదార్చడం మొదలుపెట్టారు. కానీ దానికి అంతెక్కడ?ఆయన జీవితాంతం పాదయాత్రలు చేసినా పూర్తవదు. అయినా కూడా ఓదార్పు యాత్రలు కంటిన్యూ చేసేవాడే కానీ మధ్యలో పార్లమెంటు సమావేశాలు వచ్చి పడ్డాయి.   తనకు బాగా పట్టున్న భూసేకరణ బిల్లు-సవరణలు-నష్టాలు, మహిళా సాధికారత, దేశాభివృద్ధి, నీతి నిజాయితీ అనే అంశాల మీద మాట్లాడి అందరినీ ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ, మోడీకి తన పవర్ ఏమిటో రుచి చూపించాలని ఫిక్స్ అయిపోవడంతో ‘పార్లమెంట్ బంద్’ కి పిలుపునిచ్చారు. రాజకీయాలలో శలవులు పెట్టుకోవచ్చేమో కానీ పార్లమెంటుకి బందులు చేయడం వీలుపడదు కనుక ఓ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కేంద్రమంత్రి పేర్లు చెప్పి వాళ్ళందరినీ తక్షణమే డిస్మిస్ చేయాలని లేకుంటే పార్లమెంటు బంద్ తప్పదని ప్రకటించేశారు.   అప్పటి నుండి పార్లమెంటు బంద్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీలు సభలో రభస చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో సోనియమ్మ కనుసైగ చేస్తే కిక్కురుమనకుండా కూర్చోండిపోయిన జేడీ శీలం వంటివాళ్ళు కూడా ఇప్పుడు లోక్ సభలో హెడ్ ఫోన్స్ పెట్టుకొన్న వారి చెవుల్లో నుండి రక్తాలు కారిపోయేంత గట్టిగా నోరు పెట్టుకొని అరుస్తుండటం చూసి, మరి ఆనాడు రాష్ట్రం కోసం వీళ్ళందరూ ఇలాగ ఎందుకు మాట్లాడలేకపోయారు? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.   “ముద్దుల కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేయగాలేనిదీ, పార్లమెంటు బంద్ చేయలేమా...కొడుకు పవర్ ఏమిటో లోకానికి తెలియాలంటే ఆ మాత్రం ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా?” అనుకొన్న సోనియమ్మ అంత వయసులో కూడా రోడ్డు మీద నిలబడి ‘ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేసారు. కొడుకు కోసం ఆమె కష్టపడితే పడ్డారు కానీ దేశాన్ని పాలించిన ఆ పెద్దాయనని కూడా రోడ్డుమీద నిలబెట్టించి ఆయనతో కూడా నినాదాలు చేయించారే అయ్యో పాపం...అని మళ్ళీ గిట్టని వాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. కానీ కన్న ప్రేమ ముందు అవ్వన్నీ లెక్కలోకి రావు. అందుకే ఇవాళ్ళ ఆమె కూడా లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిలబడి అందరితో కలిసి నినాదాలు చేసారు. అది చూసి కడుపు తీపి ఎంతకయినా తెగించేలా చేస్తుందని జనాలు అనుకొన్నారే తప్ప ఆమె దేశం కోసం ఏదో పోరాడేస్తున్నారనుకోవడం లేదు. ఇంకెంత మరొక్క రోజు ఓపిక పడితే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి ఆనక మళ్ళీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు రెస్ట్ తీసుకోవచ్చును. అందుకే ఆమెతో సహా అందరూ కలిసి రాహుల్ బాబు కోసం అంత కష్టపడుతున్నాట్లున్నారు.

గ్రామజ్యోతి వెనుక ఆ నీడలేమిటి?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి పధకం గురించి ఆయన తన పార్టీ నేతలకి, మంత్రులకి, చివరికి సర్పంచులకి కూడా చాలా క్లాస్ తీసుకొంటున్నారు. గ్రామాల స్వయం సంవృద్ది సాధించేందుకు నిర్దేశించిన పధకం కనుక నేరుగా గ్రామాలకే అన్ని హక్కులు, బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ఆయన చెపుతున్నారు. గ్రామీణవ్యవహారాలు చూసే పంచాయితీ రాజ్ శాఖ నుండే దీనికి అవసరమయిన నిధులు, ఆదేశాలు వగైరా అన్నీ విడుదలవుతాయని సమాచారం. అంటే ఇంతవరకు పెత్తనం చేస్తున్న వ్యవసాయ శాఖ, ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖ వంటి శాఖలకు ఈ పధకంలో వేలుపెట్టే అవకాశం ఉండదన్నమాట.   పంచాయితీ రాజ్ శాఖకి కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎవరూ కూడా ఈ పధకం జోలికి వచ్చే సాహసం చేయలేరని స్పష్టం అవుతోంది. తెలంగాణాలో అధికారం అంతా ఆ ముగ్గురు నలుగురు వ్యక్తుల చేతిలోనే ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మిగిలినవారందరూ నామ మాత్రంగానే మంత్రులుగా చెలామణి అవుతున్నారని బీజేపీ రాష్ట్ర విభజన అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాదిస్తున్నారు. కానీ ఆయన రాష్ట్రంలో అధికారం ముగ్గురు చేతిలో కాదు అంతా ఒక్కరి చేతిలోనే ఉందని వాదిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు సరిగ్గా ఇటువంటిదే ‘మన ఊరు-మన ప్రణాళిక’ అనే పధకం ప్రకటించారు. కానీ ఆ తరువాత దాని గురించి చప్పుడు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామజ్యోతిని వెలిగించి కొడుకు చేతిలో పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తెరాస 14 పార్టీలుగా మారుతుందా...బాబోయ్!

  ఒక్క తెరాస పార్టీని చూసే తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ జడుసుకొంటున్నాయి. మరి ఏకంగా 14 తెరాస పార్టీలు ఏర్పడితే ఊహించడానికే భయం వేస్తుంది. కానీ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం మున్ముందు 14 తెరాస పార్టీలు ఆవిర్భావం తధ్యమని జోస్యం చెపుతున్నారు. కానీ అదెలాగ సాధ్యమంటే కేసీఆర్ ఉన్నంతవరకే తెరాస ఒక్కటిగా ఉంటుందని, ఆయన తప్పుకోగానే తెరాస 14 ముక్కలు అవుతుందని అన్నారు. తెరాస-కె (కవిత), తెరాస-హెచ్ (హరీష్ రావు), తెరాస కేటీఆర్ (కె.తారకరామావు), తెరాస-ఈ (ఈటెల రాజేందర్) ఇలాగ తెరాసలో నుండి 14 తెరాస ముక్కలు పుట్టుకొస్తాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణా ఉద్యమం కోసం పోరాడిన వారినందరినీ కేసీఆర్ పక్కనబెట్టి అసలు తెలంగాణా పేరు కూడా ఎత్తని తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలకి మంత్రి పదవులు ఇచ్చి చంకన ఎక్కించుకొన్నారని ఆయన విమర్శించారు.   ఆయన విమర్శల మాటెలాఉన్నా ఆయన చెప్పిన జోస్యంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ముగ్గురుకి మాత్రమే చాలా ప్రాధాన్యంఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కి స్వయాన మేనల్లుడయిన హరీష్ రావు ఈవిషయంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ తన వారసుడిగా తన కుమారుడిని కానీ కుమార్తెని గానీ ప్రకటించినట్లయితే అప్పుడు హరీష్ రావు తదితరులు వేరు కుంపటి పెట్టుకొంటే ఆశ్చర్యం లేదు. ఈ సమస్య తెరాసకే కాదు అన్ని పార్టీలకు ఉన్నటువంటిదే. అధికారంలో ఉన్న పార్టీలపై మరి కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది అంతే. కనుక ఇటువంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ ముందే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చును.

అతను ఎవరికీ అంతుపట్టడు...

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలియగానే తెలంగాణా నుండి ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి సమైక్యాంధ్ర పోరాటం మొదలుపెట్టిన ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు పలికారు. తెలంగాణా ప్రజల తరపున తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతామన్న వ్యక్తి మళ్ళీ అదే తెరాస ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఏవో కుంటిసాకులు చెప్పారు. నిన్న మొన్న వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఆయన, రాహుల్ గాంధీ వచ్చి విమర్శించేసరికి హడావుడిగా డిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అదే మాట కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం అన్నారు కూడా. అంటే బీజేపీతో ఇక దోస్తీ కుదిరే అవకాశాలు లేవని గ్రహించి రాహుల్ గాంధీ మాట విని డిల్లీ వెళ్లి ధర్నా చేసి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం ద్వారా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారేమో అని జనాలకి అనుమానం కలిగించారు.   కానీ ఏడాదిగా కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనని జగన్మోహన్ రెడ్డి డిల్లీలో చేసిన ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోనేందుకే తమ అధినేతని విమర్శించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకే అతను డిల్లీ వెళ్లి ధర్నాచేసారని తెదేపా నేతలు అనుమానిస్తే, మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే సోనియా గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తను ప్రత్యేక హోదా కోసమే డిల్లీ వెళ్లి ధర్నా చేశానని చెప్పుకొంటున్నా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు వింటుంటే ఆయన దీక్షకు పరమార్ధం ఏమిటని అనుమానించవలసివస్తోంది. ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికీ అంతుపట్టని విధంగా వ్యవహరిస్తూ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అందుకే అతనికి రాజకీయ పరిపక్వత లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారేమో?

వైకాపాకి అంత ఓవర్ యాక్షన్ ఎందుకో?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కలిసి సోమవారం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా చేసారు. ఆ తరువాత వారందరూ కలిసి అక్కడి నుండి పార్లమెంటుకి పాదయాత్రగా బయలుదేరారు. పార్లమెంటు సమీపంలో వారిని భద్రతా దళాలు, పోలీసులు అడ్డుకొన్నప్పటికీ వారు ముందుకు సాగే ప్రయత్నం చేయడంతో జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలు కొందరిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ సాయంత్రం వారందరినీ విడుదల చేసారు. పోలీసులు తమని అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు తప్పు పట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము పాదయాత్ర చేసి పార్లమెంటు వద్దకు వెళ్లానుకొంటే తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు విమర్శించారు.   ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున చాలా కట్టుదిట్టమయిన భద్రత వలయం ఏర్పాటు చేయబడి ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలని వెంటపెట్టుకొని ఆ భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లానుకోవడమే చాలా తప్పు. ఒకప్పుడు ఎంపీగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియదనుకోలేము. పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటికి భంగం కలిగించకుండా తన పార్టీ నేతలని నియంత్రించవలసింది పోయి ఆయనే స్వయంగా అందరినీ వెంటేసుకొని ముందుకు వెళ్ళడం మరో తప్పు.   నిజానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించలేదు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు. భద్రతా వలయాన్ని చేధించుకొని ముందుకు సాగి వారే అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేయవలసి వచ్చింది. పార్లమెంటు చుట్టూ ఏర్పాటు చేయబడిన భద్రతా వలయాన్ని చేదించుకొని ముందుకు సాగితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి, అతని అనుచరులకు తెలియదనుకోలేము. కానీ రాష్ట్రంలో ప్రజల దృష్టిని, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంతో అరెస్టుకు సిద్దపడే వారు ముందుకు వెళ్ళారు. బహుశః తమను పోలీసులు అరెస్ట్ చేసినందుకు కూడా రాష్ట్రంలో ప్రజల సానుభూతి పొందాలనుకొంటున్నారేమో?

రాహుల్ గాంధీని ఉస్మానియాలో అడుగుపెట్టనీయం

  తెలంగాణా కోసం తెరాస పోరాడింది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది. వీటిపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ తెలంగాణా కోసం పోరాడిన తెరాస దాని ఫలాలు పూర్తిగా పొందగలిగినా కాంగ్రెస్ మాత్రం పొందలేకపోయింది. పొందలేక పోతే పాయె కనీసం ఆ గౌరవం అయినా దక్కించుకోగలుగుతోందా అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన చేసినందుకు ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని తరిమికొడితే, సుమారు 1,000 మందికి పైగా తెలంగాణా యువకులు బలిదానాలు చేసుకొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, ఆనాడు వారి మరణాల గురించి నోరు విప్పని రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఉస్మానియా విద్యార్ధులతో మాట్లాడేందుకు వస్తున్నారని తెలంగాణా టీ.యస్. జెఎసి చైర్మెన్ డి. బలరాజ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక రాజకీయ నిరుద్యోగి కనుకనే మళ్ళీ తెలంగాణాలో తిరుగుతున్నాడని అయన ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణా ప్రజలకు, ఆత్మహత్యలు చేసుకొన్న యువకుల కుటుంబాలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పిన తరువాతనే ఉస్మానియాలో అడుగుపెట్టాలని లేకుంటే ప్రతిఘటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంద జెఎసికి చెందిన ఉస్మానియా విద్యార్ధులు కొందరు డిల్లీ వెళ్లి సోనియా గాంధీతో మాట్లాడటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ 2009 లో తెలంగాణా ఇస్తామని ప్రకటన చేసి మళ్ళీ వెనక్కి తగ్గిన తరువాత అనేక మంది విద్యార్ధులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి మరణాలకు సోనియా, రాహుల్ గాంధీలే కారణమని అటువంటి వారితో ఉస్మానియా విద్యార్ధులే స్వయంగా వెళ్లి మంతనాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నన్ను నేను నిగ్రహించుకొంటున్నాను: పవన్ కళ్యాణ్

  కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మొన్న నిర్వహించిన బహిరంగ సభలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ముని కామకోటి అనే యువకుడు నిన్న చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ట్వీట్ మెసేజ్ పెట్టారు. “మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది. వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియ చేస్తున్నాను.” ఆ తరువాత మరొక మెసేజ్ లో “అతని మరణానికి కారణమయిన ఈ ప్రత్యేక హోదా అంశం గురించి ఈ పరిస్థితుల్లో మాట్లాడకుండా నున్ను నేను నిగ్రహించుకొంటున్నాను,” అని వ్రాసారు.   రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మళ్ళీ ఊపందుకొంటున్న ఈ సమయంలో ఆయన తను తను నిగ్రహించుకోవలసిన అవసరం ఏమిటో తెలియదు. మళ్ళీ ఎంపీలు దీనిపై దృష్టి సారించకుండా వ్యాపారాలు చేసుకొంటున్నారని విమర్శించడం ఎందుకో తెలియదు. ఆయన మునికోటి మృతికి సంతాపం తెలిపిన తరువాత ప్రత్యేక హోదా గురించి ఇటువంటి మాటలు చెప్పే బదులు, దాని కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి ఉండి ఉంటే ఉపయోగం ఉండేది.

నేడు డిల్లీలో జగన్మోహన్ రెడ్డి దీక్ష

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళ డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయబోతున్నారు. అందుకోసం రాష్ట్రం నుండి రెండు ప్రత్యేక రైళ్ళలో వైకాపా నేతలని, కార్యకర్తలని కూడా డిల్లీకి తరలించారు. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటం గురించి జాతీయ మీడియా, హిందీ మాట్లాడే ప్రజలందరికీ కూడా తెలిసేందుకు హిందీ, ఇంగ్లీష్ బాషల్లో కూడా పోస్టర్లు, బ్యానర్లు అచ్చువేశారు. ఇది చాలా తెలివయిన ఆలోచనేనని చెప్పవచ్చును. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో శివాజీ వంటి వారు ఎంతమంది పోరాడుతున్నా కూడా వారికి రాని గుర్తింపు దీనివలన జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే దక్కుతుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా వంటి అంశాల గురించి గట్టిగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, ఈరోజు డిల్లీలో చేస్తున్న దీక్షతో రాష్ట్రం కోసం తానొక్కడినేడే పోరాడుతున్నడనే భావన జాతీయ మీడియాకు తద్వారా దేశప్రజలకు కల్పించగలుగుతున్నాడని చెప్పకతప్పదు.

న్యాయం చేయండి లేకుంటే ఆత్మహత్యకి అనుమతించండి

సుమారు ఒకటిన్నర దశాబ్దాలుగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం కుంభకోణాలు, వాటిపై దర్యాప్తులు, సుమారు రెండు వేలమందికిపైగా నిందితుల అరెస్టులు, వరుసగా కొనసాగుతున్న అనుమానాస్పద మరణాలు...ఏవీ కూడా ఆగడం లేదు. అన్నీ కూడా దేని దారి దానిదే అన్నట్లు సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సీబీఐ అధికారులు ఇప్పుడు ఆ కేసులనన్నిటినీ తమ చేతుల్లోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో అన్ని రంగాలకి చెందినవారున్నారు. వారిలో 70 మంది వైద్యులు, వైద్య విద్యార్ధులు చాలా కాలంగా గ్వాలియర్ జైల్లో ఉన్నారు. ఈ కుంభకోణాలపై దర్యాప్తులు పూర్తయ్యి ఈ కేసులు ఇంకా ఎప్పటికి తేలుతాయో, తామెప్పుడు జైల్లో నుండి బయటపడుతామో, అసలు జీవితంలో జైల్లో నుండి బయటపడుతామా లేదా? అని వారందరూ ఆందోళన చెందుతున్నారు.   వారు ప్రధానికి, రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జాతీయమానవ హక్కుల సంఘానికి లేఖలు వ్రాశారు. ఈ కేసుల విచారణ కోసం ఎదురుచూస్తూ తాము జీవితాంతం జైల్లోనే బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని భావిస్తున్నామని, కనుక తమకు తక్షణమే న్యాయం చేయలేకపోతే కనీసం ఆత్మహత్య చేసుకొనేందుకయినా తమందరికీ అనుమతి ఇవ్వమని వారు కోరారు. న్యాయవిచారణ కోసం ఏళ్ల తరబడి తమను జైల్లో ఉంచడం మనవహక్కుల ఉల్లంఘన కాదా? అని వారు ప్రశ్నించారు.   సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న తమను ఈవిధంగా నెలల తరబడి జైల్లో ఉంచడం వలన తాము మానసికంగా చాలా క్రుంగి పోతున్నామని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, తాము జైల్లో మ్రగ్గుతుండటం వలన బయట తమ కుటుంబాల ఆర్ధిక, సామాజిక పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోందని కనుక తమకు తక్షణమే న్యాయం చేయాలని లేఖలు వ్రాశారు. ఒకవేళ అలాగా వీలుకాదని భావిస్తే తమందరికీ ఆత్మహత్యలు చేసుకొనేందుకు అనుమతించాలని వారు కోరారు.   వారు వ్రాసిన ఈ లేఖలు వారి మనోవేదనకు, దైన్యస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంతవరకు ఈ కేసులో వివిధ రంగాలకు చెందిన సుమారు 2000 మందికి పైగా అరెస్టయ్యారు. అరెస్టయిన వారందరూ దోషులు కావచ్చు, కాకపోవచ్చును. కానీ కేసులు దర్యాప్తు, న్యాయ విచారణ పేరిట వారిని ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచడం వలన చివరికి వారిలో నిర్దోషులుగా తేలినవారికి ఇంతకాలం అన్యాయంగా జైల్లో ఉంచి వారికి, వారి కుటుంబాలకి కూడా తీవ్ర మనోవేదన కలిగించినట్లే అవుతుంది.   ఇది ఒక వ్యాపం కుంభకోణాలకు సంబంధించిన కేసులలోనే కాదు దేశంలో నిత్యం నమోదయ్యే వేలాది ఇతర కేసుల్లో అరెస్టయినవారి పరిస్థితి కూడా ఇదే. కనుక న్యాయవ్యవస్థే దీనికి పరిష్కారం చూపించవలసి ఉంటుంది. అజ్మల్ కసాబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మీమన్ వంటి ఉగ్రవాదులకి పొరపాటున కూడా అన్యాయం జరగకూడదనుకొనే మన చట్టాలు, న్యాయవ్యస్థలు వ్యాపం కుంభకోణంలో అరెస్టయిన ఈ 70 మంది వైద్యులు, వైద్య విద్యార్ధుల పట్ల ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తోంది?

ప్రత్యేక రాజకీయాలకు యువత ఎందుకు బలవ్వాలి?

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తిరుపతి పట్టణంలో మంచాల వీధికి చెందిన కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త మొట్టమొదటి సమెదగా మారాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో అతను అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకొన్నాడు. అక్కడ ఉన్నవారు వెంటనే మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే 50 శాతం కాలి గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అతనిని చెన్నై లేదా వేలూరు తరలించి మంచి వైద్యం అందించాలని భావిస్తోంది.   ఈ ప్రత్యేక హోదా అనే అంశం ప్రస్తుతం రాజకీయ పార్టీలకు అధికార తెదేపా, బీజేపీలను డ్డీ కొనేందుకు ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రత్యేక హోదా వల్ల తమకు, రాష్ట్రానికి ఏమి ప్రయోజనం చేకూరుతుందో కూడా తెలియని కోటి వంటివారు అందరికంటే ముందు పావులుగా మారి బలవుతుంటారాని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇంతకు ముందు తెలంగాణా సాధన కోసం కూడా సుమారు 1200మందికి పైగా ఆత్మహత్యలు చేసుకొన్నారని తెరాస నేతలే చెప్పేవారు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత బలిదానాలు చేసుకొన్న వారిలో కేవలం 456 మంది కుటుంబాలనే ప్రభుత్వం గుర్తించింది. వారికే కొన్ని ప్రయోజనాలు చేకూర్చింది. మిగిలిన కుటుంబాలు నిరాదారణకి గురయ్యాయి. తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న యువకుల తల్లి తండ్రులకు జీవితాంతం సరిపోయే విషాదం, కష్టాలు మిగలగా రాజకీయ నాయకులకు పదవులు, అధికారం, విలాసవంతమయిన జీవితాలు అన్నీ దొరికాయి. చివరికి తెలంగాణా సాధన కోసం ఏనాడు నోరు విప్పని వారికి కూడా మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెయల్సీ సీట్లు దక్కాయి. కనుక కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చరిత్ర నుండి ఆంద్రప్రదేశ్ యువత కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి, ప్రత్యేక హోదా కోసం పోరాడాలే తప్ప ప్రాణాలు తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక బలమయిన రాజకీయ ఆయుధంగానే వాడుకొనేప్రయత్నం చేస్తున్నాయనే సంగతిని కూడా గ్రహించాలి.

ఏపీకి ప్రత్యేకహోదా రాదు: జేసీ దివాకర్ రెడ్డి

  రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిన్న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రత్యేకహోదాతో సహా విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేసారు. పార్లమెంటులో కూడా దీని కోసం తాము పోరాడుతామని తెలిపారు. ఈ ధర్నాలో తెదేపా ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకహోదా రాదని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తాము ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో మాట్లాడినప్పుడు వారు రాష్ట్ర పరిస్థితుల పట్ల చాలా సానుభూతి చూపారని, వారు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకొనేందుకు అవసరమయిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వగలమని చెప్పారని కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా మాత్రం ఇవ్వలేమన్నట్లుగా వారు మాట్లాడారని ఆయన తెలిపారు.   ఈ ప్రత్యేకహోదా అంశం కారణంగా తెదేపా, బీజేపీలు ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి సమయంలో అధికార తెదేపాకి చెందిన నేతలే ప్రత్యేకహోదా గురించి ఈవిధంగా పరస్పర విరుద్దంగా మాట్లాడుతూ చేజేతులా తమ పార్టీకి, ప్రభుత్వానికీ కూడా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ప్రత్యేకహోదా విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా తెదేపా, బీజేపీలకు ఎదురవుతున్న ఇబ్బందుల కంటే అధికార పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంభశివరావు వంటి నేతలు చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యల వలన మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకి బలమయిన ఆయుధాలుగా మారుతున్నాయి. కనుక ఇప్పటికయినా తెదేపా దీనిపై ఒక నిర్దిష్ట విధానంతో ముందుకు సాగడం మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆధార్ కార్డు పేరుతో హైదరాబాద్ లో తెదేపా, బీజేపీ ఓట్లు రద్దు?

  ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడం మంచి ఆలోచనే. తద్వారా బోగస్ ఓట్లను తొలగించవచ్చును. కానీ ఆ పేరుతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బ తీయలనుకొంటే? అధికార తెరాస పార్టీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో గెలవలేమనే భయంతో హైదరాబాద్ లో తెదేపా, బీజేపీలకు మంచి పట్టు ఉన్న ప్రాంతాలలో సుమారు 34 లక్షల ఓట్లను తొలగించేందుకు ఓటర్లకు నోటీసులు ఇచ్చిందని ఆ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా తెదేపా నేతలు ముఖ్యమంత్రి ఎన్నికల అధికారి బంవార్ లాల్ ని కలిసి దీని గురిని ఒక పిర్యాదు కూడా చేసారు.   ఎన్నికల కమీషన్ ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని, ఓటరు కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ఎటువంటి గడువు విధించలేదని, అదొక నిరంత ప్రక్రియగా కొనసాగుతుందని చెపుతున్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారి ఓట్లను రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేస్తోందని వారు ఆరోపించారు. తెదేపా, బీజేపీలను ఎన్నికలు జరుగక మునుపే దెబ్బ తీసేందుకే తెలంగాణా ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తోందని వారు ఆరోపించారు. ఒకవేళ ఓటరు కార్డులని ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలనుకొంటే రాష్ట్రమంతటా ఆ ప్రక్రియను చేప్పట్టాలి కానీ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టడంతో ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని నమ్మవలసి వస్తోంది. తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎన్నికల సంఘం అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

మా మమ్మీ అయితే అలాగా చేయదు: రాహుల్ గాంధీ

  లలిత్ మోడీ వ్యవహారంలో లోక్ సభలో నిన్న సంజాయిషీ ఇచ్చుకొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, నేను లలిత్ మోడీకి ఎటువంటి ఆర్ధిక లబ్ది చేకూర్చలేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతని భార్య పోర్చుగల్లో ఒక ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను కేవలం మానవతా దృక్పధంతో లలిత్ మోడీకి బ్రిటన్ చట్టాలు అనుమతిస్తే వీసా మంజూరు చేయమని సూచించానే తప్ప అతనికి వీసా కోసం బ్రిటన్ ప్రభుత్వంపై నేను ఎటువంటి ఒత్తిడి చేయలేదు. భయంకరమయిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న లలిత్ మోడీ భార్యకు నేను సహాయపడాలనుకొన్నానే తప్ప లలిత్ మోడీకి కాదు. అతని భార్య ఎటువంటి నేరమూ చేయలేదు. ఆమెపై ఎటువంటి కేసులు లేవు. ఆమె కూడా ఒక సాధారణ భారతీయులు. అందుకే నేను మానవతా దృక్పదంతో ఆమె భర్త లలిత్ మోడీకి వీసా ఇవ్వగలిగితే ఇవ్వమని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించాను. మానవత్వంతో నేను చేసిన ఈ పని తప్పనుకొంటే నేను ఎటువంటి శిక్షనయినా అనుభవించడానికి సిద్దం. ఒకవేళ నా స్థానంలో సోనియా గాంధీ ఉన్నా అలాగే చేసేవారు కాదా? అని ఆమె ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమె తన తల్లి గురించి మాట్లాడతానని తప్పు పట్టారు. తన తల్లి ఎన్నడూ అటువంటి తప్పు చేయదని అన్నారు. సుష్మా స్వరాజ్ ఈ విషయంలో లబ్ది పొందారని ఆయన ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

  ఆగస్ట్ 15వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో ఉగ్రవాదుల హడావుడి కూడా నానాటికీ పెరిగిపోతోంది. మొదట పంజాబ్ లో గురుదాస్ పూర్ తరువాత జమ్మూలో ఉద్డంపూర్, మళ్ళీ ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే శ్రీనగర్ కి సుమారు 32 కిమీ. దూరంలో పుల్వామా జిల్లా కాకాపూరా గ్రామంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. కాకాపూరా గ్రామంలో ఉగ్రవాదులు ఒక ఇంట్లో దాగిఉనట్లు తెలియగానే భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. వారిని చూడగానే లోపలి నుండి ఉగ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. సుమారు గంటకుపైగా సాగిన వారి కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా మరొకడు తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరూ కూడా లష్కర్ ఏ తోయిబా గ్రూపుకి చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు.   మరోవైపు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డిల్లీలో ప్రేలుళ్ళకు పాల్పడేందుకు పాకిస్తాన్ కి చెందిన 9 మంది ఉగ్రవాదులు డిల్లీలో జొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పట్టుకోవడానికి భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఉగ్రవాదులు ఇంత తరచుగా భారత్ పై దాడులకు ప్రయత్నించలేదు. కానీ యాకుబ్ మీమన్ ని ఉరి తీసిన తరువాత నుండి తరచూ ఎక్కడో అక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు. అతనిని ఉరి తీసినందుకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడుతున్నారా లేక తమ జోరు మరింత పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదులు ఈవిధంగా పేట్రేగిపోతున్నారా అనే విషయం తేలవలసి ఉంది. యాకుబ్ మీమన్ కి ఉరిశిక్షని ఖరారు చేసినందుకు సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ మిశ్రాను వదిలిపెట్టబోమని బెదిరిస్తూ ఒక బెదిరింపు లేఖ వచ్చింది.

ఆ న్యాయమూర్తికి బెదిరింపు లేఖ!

  ముంబై ప్రేలుళ్ళ పాత్రధారిగా గుర్తింపబడిన యాకుబ్ మీమన్ కి ఉరిశిక్షని ఖరారు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తి దీపక్ మిశ్రాకి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఆయన ఇంటి గేటు వద్ద పడి ఉన్న ఆ లేఖను చూసిన ఆయన భద్రతా సిబ్బంది దానిని తుగ్లక్ రోడ్డులో గల పోలీస్ స్టేషన్లో పోలీసులకి అందజేసి పిర్యాదు చేసారు. డిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ముకేష్ కుమార్ మీనా ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. డిల్లీలోని ఉగ్రవాద నిరోధ బృందం తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టింది.   రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించిన తరువాత ఆరోజు అర్ధరాత్రి యాకుబ్ మీమన్ తరపున అతని న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లి యాకుబ్ ఉరిశిక్షని రద్దు చేయమని కోరారు. వారి అభ్యర్ధనను మన్నించవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఆయన తక్షణమే స్పందించి యాకుబ్ మీమన్ కి ఉరిశిక్ష ఖరారు చేసిన త్రిసభ్య దర్మాసనాన్ని వారి విజ్ఞప్తిని పునః పరిశీలించమని ఆదేశించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు ఆరోజు తెల్లవారుజామున 3-4.30 గంటల వరకు ఈ కేసును పునర్విచారించింది.   చట్టప్రకారం యాకుబ్ మీమన్ కి రెండు వారాల ముందుగా డెత్ వారెంట్ ఇవ్వలేదు కనుక అతని ఉరిశిక్షని నిలిపివేయాలని అతని తరపున న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు మరణశిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ అందజేసిందని కనుక మళ్ళీ మరొకమారు డెత్ వారెంట్ ఇవ్వవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రొహత్గీ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం న్యాయమూర్తి దీపక్ మిశ్ర వారి అభ్యర్ధను తిరస్కరించడంతో ఆరోజు ఉదయం యాకుబ్ మీమన్ ఉరితీయబడ్డాడు. అందుకే న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఎవరో గుర్తి తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు.   దానిలో ఏమని ఉంది? ఎవరు పంపారు? ఎక్కడి నుండి ఆ లేఖ వచ్చింది? వంటి వివరాలన్నీ తెలియవలసి ఉంది. కానీ సుప్రీం న్యాయమూర్తినే ఈవిధంగా బెదిరించడం చూస్తే అది ఉగ్రవాదుల పనో లేక దేశంలో వారికి మద్దతు ఇస్తున్నవారి పనో అయ్యి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది.

పార్లమెంటులోనూ ఇద్దరు ఉగ్రవాదులున్నారుట!!!

  డిల్లీలోకి 9 మంది ఉగ్రవాదులు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన సంగతి తెలుసు. కానీ పార్లమెంటులో కూడా ఇద్దరు ఉగ్రవాదులు జొరబడిన సంగతి మన నిఘా వర్గాలు కూడా కనిపెట్టి చెప్పలేకపోయాయి. కానీ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి ఆ విషయం కనిపెట్టి చెప్పారు. ఆమె తను ఒక సర్వసంగ పరిత్యాగి అయిన సాధువునని భావిస్తున్నప్పటికీ, రాజకీయాలపై ఆసక్తిని మాత్రం ఇంకా పరిత్యజించలేకపొతున్నారు. అందుకే నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం లేపుతుంటారు.   పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ భద్రతా దళాలకు సజీవంగా పట్టుబడటంపై ఆమె స్పందిస్తూ, “అతనికి తగిన గుణపాఠం చెప్పాలంటే చట్టానికి కాదు హిందుసంస్థలకి అప్పగించాలి,” అని అన్నారు. ముంబై ప్రేలుళ్ళ పాత్రధారి యాకూబ్ మీమన్ కి ఉరి శిక్ష వేయడాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించడంపై ఆమె చాలా తీవ్రంగా స్పందించారు. “ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు కూడా ఉగ్రవాదులే! మన పార్లమెంటులో అటువంటి ఉగ్రవాదులు ఒకరిద్దరున్నారు. అటువంటివారు పార్లమెంటులో ఉండటం చాలా దురదృష్టకరం,” అని ఆమె అన్నారు.   ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ పట్టుబడినప్పుడు “తను హిందువులని చంపెందుకే పాకిస్తాన్ నుండి భారత్ కి వచ్చేనని, హిందువులని చంపడం తనకు చాలా వినోదం కలిగిస్తుందని” మీడియాతో చెప్పిన మాటలు ఆమెకు తీవ్ర ఆగ్రహం కలిగించి ఉండవచ్చును.అందుకే అతని విషయంలో ఆవిధంగా అని ఉండవచ్చును. ఉగ్రవాదులను సమర్ధించేవారి పట్ల కూడా ఆమె అసహనం వ్యక్తం చేయడం సహజమే. భారతదేశంలో చాలా బలమయిన చట్టాలు, రాజ్యాంగం, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. అటువంటి ఉగ్రవాదులను ఏవిధంగా శిక్షించాలో అవి నిర్ణయిస్తాయి. కనుక ఆటవిక న్యాయం అమలు చేయమని సాధ్వి ప్రాచి వంటివారు కోరడం సమంజసం కాదు.   కొందరు రాజకీయ నేతలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే సుప్రీంకోర్టు దోషి అని తేల్చిన ఉగ్రవాదులకు సైతం మద్దతుగా మాట్లాడుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అటువంటి వారికి సమయం వచ్చినప్పుడు ప్రజలే తగినవిధంగా బుద్ది చెపుతారు.

డిల్లీలో 9మంది ఉగ్రవాదులు?

  డిల్లీలో ఏకంగా 9మంది ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుల సమయంలో లేదా అంతకంటే ముందే డిల్లీలో ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. వెంటనే కేంద్రం డిల్లీతో సహా దేశమంతా హై అలెర్ట్ ప్రకటించింది. కనుక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రజలు, పోలీసులు అందరూ అప్రమత్తంగా మెలగడం మంచిది.   వారం రోజుల క్రితం పంజాబ్ గురుదాస్ పూర్ లో పోలీస్ స్టేషన్ పై పాక్ ఉగ్రవాదులు ముగ్గురు దాడి చేసి 8మందిని చంపారు. మళ్ళీ మొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉదంపూర్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసి ఇద్దరు జవాన్లను చంపారు. వారిలో ఒక ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ నిన్న సజీవంగా పట్టుబడ్డాడు. హిందువులను చంపడానికే తాను పాకిస్తాన్ నుండి వచ్చానని అలాగా చంపడం తనకు చాలా వినోదం కలిగిస్తుందని నవ్వుతూ చెప్పాడు. మనుషుల ప్రాణాలను తీయడం వినోదంగా భావించే అటువంటి ఉగ్రవాదులు 9మంది డిల్లీలో ప్రవేశించారంటే ఎంత ప్రమాదమో అర్ధమవుతోంది.