ఏపీ.ఎస్.ఎఫ్.సి.కి రవీంద్రనాద్ రెడ్డి కుచ్చుటోపీ?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నీరజారావు అనే ఆమెకు చెందిన భూమిని 2008లో కబ్జా చేసినప్పుడు, ఆమె కోర్టులో సుమారు ఏడాదిపాటు న్యాయపోరాటం చేసి మళ్ళీ తన భూమిని దక్కించుకొన్నారు. ఆ సంఘటన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరగడంతో వైకాపాకు స్వంత జిల్లా అయిన కడపలోనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది.   ఆమె మళ్ళీ మరోసారి రవీంద్రనాథ్ రెడ్డిపై గురిచూసి బాణం వదిలారు. ఈసారి ఆమె అభియోగం ఏమిటంటే రవీంద్రనాథ్ రెడ్డి 2008-13సం.ల మధ్య కాలంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంస్థ నుండి తన హరితా ఫెర్టిలైజర్స్ సంస్థ కోసం రూ.28కోట్లు తీసుకొన్నారు. కానీ ఆయన నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి కార్పోరేషన్ నుండి రుణం తీసుకొన్నారని ఆమె ఏసిబికి పిర్యాదు చేసారు. అంతే కాదు ఆయన తన సంస్థ కోసం తీసుకొన్న రుణాన్ని వేరే ఇతర అవసరాలకు మళ్ళించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా ఆమె ఏసిబిని కోరారు. ఆమె ఆరోపణలు రుజువయితే రవీంద్రారెడ్డికి శిక్ష తప్పదు. ఆయనతో బాటే వైకాపా ప్రతిష్టకు కూడా భంగం కలగవచ్చును. నకిలీ డాక్యుమెంట్లపై ఆయనకి అంత భారీ ఋణం ఇచ్చిన అధికారులకు శిక్ష తప్పదు.

స్పీకర్ కోడెలకి జగన్ బంపర్ ఆఫర్

  ఈరోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగనిచ్చిన ఆ బంపర్ ఆఫర్ కి స్పీకరే కాదు ఆయన స్వంత పార్టీలో సీనియర్లు కూడా కంగు తిన్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే, రేపు జరుగబోయే సమావేశాలలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తమకు చర్చించే అవకాశం ఇస్తానంటే ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అడ్డుకోబోమని ఆఫర్ ఇచ్చారు. అంటే ఈరోజు తాము సభలో గొడవ చేయకుండా ఉండాలంటే తను చెప్పినట్లుగా రేపు చర్చకు ఒప్పుకోవాలని స్పీకర్ తో బేరం ఆడుతున్నారన్న మాట. అయితే సభా కార్యక్రమాలు నిబంధనల ప్రకారమే నిర్వహించబడుతాయి తప్ప ఇటువంటి షరతులతో కాదని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభ సమావేశాలు మొదలయిన రోజు నుండి జగన్ కి ఇదే విషయం పదేపదే చెపుతున్నా ఆయన సభలో కార్యక్రమాలు తను కోరినట్లుగా నిర్వహించాలని కోరుతుండటం విచిత్రమే. అందుకే శాసన సభ అంటే మీ పార్టీ కార్యలయమో లేక లోటస్ పాండో అనుకోవద్దని మంత్రి హెచ్చరించవలసి వచ్చింది. అయినప్పటికీ జగన్ ఈవిధంగా బేరాలు ఆడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది.ఆయన బహుశః తన మాతృ పార్టీ కాంగ్రెస్ ని చూసి నేర్చుకొంటున్నారేమో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుందరా రాజే రాజీనామాలు చేస్తే తప్ప పార్లమెంటు సమావేశాలు జరగనీయమని పంతం పట్టి చివరికి అన్నంత పనీ చేసింది.

చంద్రబాబు వాళ్ళతో కబడీ ఆడేసుకొన్నారు

  ఈరోజు ఏపీ శాసనసభ సమావేశాలలో వైకాపా సభ్యుడు జ్యోతుల నెహ్రూ పట్టిసీమ ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెపుతున్నారని, నిజానికి ఆ ప్రాజెక్టు పార్టీలో, ప్రభుత్వంలో అసమదీయులకు లబ్ది చేకూర్చేందుకే మొదలుపెట్టారని ఆరోపించారు.   దానికి చంద్రబాబు నాయుడు జవాబిస్తూ “ముందు మీరు ఈ పట్టిసీమ ప్రాజెక్టుకు అనుకూలమా లేక వ్యతిరేకిస్తున్నారా? అనే సంగతి స్పష్టంగా చెప్పండి. ఆ తరువాత నేను మీ విమర్శలకు జవాబు చెపుతాను,” అన్నప్పుడు జ్యోతుల నెహ్రు ఆయనకి సమాధానమిస్తూ ‘మేము ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.   అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “ఒక ప్రాజెక్టుకి అనుకూలమో, వ్యతిరేకమో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్న మీరా మమ్మల్ని విమర్శించేది? మీ పార్టీలో జిల్లాకో పాలసీ ఉన్నట్లుంది. రాయలసీమకు చెందిన వాళ్ళు ఈ ప్రాజెక్టు కావాలి..నీళ్ళు రావాలి అంటారు. గోదావరి జిల్లాల సభ్యులు దీనిని వ్యతిరేకిస్తుంటారు. కృష్ణా జిల్లా నేతలు అవుననీ కాదనీ చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఒక అంశంపై నిర్దిష్టమయిన స్టాండ్ లేని పార్టీ వైకాపా. తాము ఏమి మాట్లాడదలచుకొన్నారో కూడా వాళ్లకి క్లారిటీ ఉండదు. పోలవరం పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇమ్మని ఒకసారి డిమాండ్ చేస్తుంటారు. కానీ మళ్ళీ అంతలోనే దాని కోసం భూసేకరణ చేయడానికి వీలు లేదంటారు. భూమి లేకుండా ప్రాజెక్టుని ఎక్కడ కట్టాలి?"   "మేము పట్టిసీమ కడుతుంటే పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేశామని విమర్శిస్తుంటారు. అయితే పోలవరం పూర్తయ్యేందుకు మరో నాలుగేళ్ళు పడుతుంది. అంతవరకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వవద్దని మీరు చెపుతున్నారా?ఒకవేళ అక్కడా మీనాయకుడు ఓదార్పు యాత్రలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? మీకు దేని గురించి అవగాహన లేదు. కానీ ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శలు చేస్తుంటారు. అయితే ప్రజలకు నీళ్ళు అందించేందుకు మేము చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుపడుతూ, ఇలాగే విమర్శలు చేస్తుంటే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించినప్పుడు, మీరే ప్రజలలో అవమానం పాలవుతారు."   "ఈ ప్రాజెక్టుకి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు తెలుసు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యి రాయలసీమకు నీళ్ళు అందించడం మొదలయితే అక్కడ మీ పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గిపోతుందని మీరు భయపడుతున్నారు. కానీ మీరు ఔనన్నా కాదన్నా మా ప్రభుత్వం రాయలసీమకు ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తాము. ఇంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఆటంకాలు సృష్టించారు..విమర్శలు చేసారు. కానీ ఆయన ఆనాడు ఎంతో దూరదృష్టితో చేసిన ఆ ప్రాజెక్టు వలన చెన్నై వాసులకే కాదు రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్ళు పారుతున్నాయి. ఈ పట్టిసీమ ప్రాజెక్టుకి ఇప్పుడు మీ నుండి అటువంటి ఆటంకాలే ఎదురవుతున్నాయి. కానీ మేము వాటన్నిటినీ అధిగమించి రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందిస్తాము. అందులో మీ జగన్ స్వంత ఊరుకి కూడా నీళ్ళు అందిస్తాము."   "పోలవరం ప్రాజెక్టుని వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు నిర్దిష్టమయిన ప్రణాళికలను సిద్దం చేసుకొంటున్నాము. రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసి వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను భూములకు పారించి రాష్ట్రం నుండి కరువు రక్కసిని పారద్రోలుతాము. మీకు వీలయితే మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. లేకుంటే మా మానాన్న మమ్మల్ని పనిచేసుకోనివ్వండి అంతే కానీ మాపై ఊరకనే రాళ్ళు విసిరే ప్రయత్నం చేయకండి. దాని వలన చివరికి మీరే ప్రజలలో అభాసుపాలవుతారు,” అని జవాబిచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ జవాబుతో వైకాపా సభ్యుల నోట మాట రాలేదు.

పాపం రోజా!

  ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మొదటి రెండు రోజులు తెదేపాతో హోరాహోరీగా పోరాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్ధనతి కావడంతో సభకు రాలేదు. జగన్ లేని ఆ లోటుని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, జ్యోతుల నెహ్రు తీర్చే ప్రయత్నం చేసినప్పటికీ అధికార పార్టీ సభ్యుల ముందు గట్టిగా నిలబడలేకపోయారు.   పరిటాల రవి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, సభలో ఉన్న మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఆనాడు రోజా మాపార్టీలో ఉన్నప్పుడు నా భర్త మరణానికి వై.యస్సారే కారకుడని ఆరోపించేవారు. కానీ తరువాత ఆ వైయస్సార్ కొడుకు జగన్ పార్టీలోనే చేరి ఇప్పుడు నన్ను, నా కొడుకును హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ నిందించడం విచిత్రంగా ఉంది,” అని జవాబిచ్చినప్పుడు రోజా పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చును.   మళ్ళీ రిషితేశ్వరి ఆత్మహత్య గురించి ప్రస్తావించి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమె తల్లితండ్రులను పిలిపించుకొని మాట్లాడిన తరువాత శ్రీమంతుడు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిపోయారని రోజా ఆరోపించినప్పుడు మంత్రి గంటా ఇచ్చిన జవాబుతో మరోమారు కంగు తిన్నారు.   “రిషితేశ్వరి తల్లి తండ్రులను నా కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడిన మాట వాస్తవం. అలాగే శ్రీమంతుడు సినిమా ఫంక్షన్ కి విమానంలో వెళ్ళడం వాస్తవమే. ఆరోజున ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న కారణంగా నేను స్వయంగా రిషితేశ్వరి తల్లి తండ్రుల ఇంటికి వెళ్లి కలవలేనని వారినే పిలిపించుకొని మాట్లాడాను. వారు కూడా అందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే కోరారు. శ్రీమంతుడు సినిమా కార్యక్రమానికి నాకు బాగా కావలసినవారు, చాలా ఆప్తులు ఆహ్వానించారు. వారి అభ్యర్ధనను కాదనలేకనే నేను హైదరాబాద్ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళలేదు. ఒక సాదాసీదా సినిమా కార్యక్రామంలో పాల్గొనడానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమానికి వైకాపాకి చెందిన కొందరు నేతలు కూడా హాజరయ్యారు. అందులో తప్పేమీ లేదనే అనుకొంటున్నాను. విజయవాడలో ఉన్న నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి విమానంలో వెళ్ళడం కూడా తప్పని నేను భావించడం లేదు,” అని మంత్రి గంట జవాబిచ్చారు.

ప్రత్యేక పోరాటానికి కవితమ్మ అందుకే మద్దతు తెలిపారేమో?

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని పొరుగునున్న జయమ్మ, నవీన్ పట్నాయక్ ఇంకా ఎక్కడో వేల కిమీ దూరంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం చెపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో నిత్యం దేనికో దానికి గొడవ పడుతూ, ఏపీకి వ్యతిరేకంగా కేంద్రానికి పిర్యాదులు చేసే తెరాస మాత్రం మొదటి నుండి ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము అభ్యంతరం చెప్పబోమని చెపుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎన్నడూ దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ మూడు రోజుల క్రితం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె కవితమ్మ స్వయంగా ఈ ప్రత్యేక పోరాటానికి మద్దతు పలికడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చాలా హర్షించారు.   ఇదే స్ఫూర్తి అన్ని విషయాలలో కూడా చూపిస్తే ఎవరూ సందేహించేవారు కాదు. కానీ ఈ ప్రత్యేక హోదా వల్ల తెలంగాణాకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసినా మద్దతు తెలపడం ఆలోచించవలసిన విషయమే. ఈ ప్రత్యేక పోరాటం కాంగ్రెస్ సువర్ణ హస్తాలలో ఉన్నంత కాలం తెరాస పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదిప్పుడు జగన్ చేతికి వచ్చిన తరువాత ‘కలిసి పోరాడుదాము’ అని ఆఫర్ ప్రకటించారు. ఆ చిన్నముక్క చాలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చక్కటి అనుబంధానికి అర్ధం చేసుకోవడానికి. అయితే జగన్ దీని కోసం మోడీ ప్రభుత్వంతో పోరాటం చేయడం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యేక పోరాటం అంతా తన రాజకీయ బద్ద శత్రువు చంద్రబాబు నాయుడు మీదనే అనే సంగతి కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక తమ ఉమ్మడి శత్రువుపై జగన్ చేస్తున్న ఆ ప్రత్యేక పోరాటానికి కవితమ్మ మద్దతు తెలపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. బహుశః అందుకేనేమో కలిసి పోరాడుదామని అంటున్నారు.

జగన్, రాహుల్...ఒకరి బాటలో మరొకరు

  జగన్, రాహుల్... ఇద్దరూ యువనేతలే! ఒకరు ముఖ్యమంత్రి కావాలని పరితపించిపోతూ ఓదార్పు యాత్రలు చేస్తుంటే మరొకరు చేతిలో ఉన్న ప్రధానమంత్రి కుర్చీని కాలదన్నుకొని పశ్చాతాపపడుతూ భరోసా యాత్రలు చేస్తున్న వ్యక్తి. ఓదార్పు యాత్రల ద్వారా పవర్ చేతికి రాకపోయినా మంచి పాపులారిటీ వస్తుందనే సంగతి రుజువు చేయబడింది కనుక సార్వత్రిక ఎన్నికల ఎఫెక్టుతో పాపులారిటీ కోల్పోయిన రాహుల్ గాంధీ కాశ్మీరు బోర్డర్ నుండి అనంతపురం జిల్లా వరకు కవర్ చేసేస్తున్నారు. ఇక రాహుల్ సూచించిన తరువాతే యువనేత జగన్ ప్రత్యేక పోరాటాలు ఆరంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా డిల్లీ నుండి గుంటూరు వరకు ప్రత్యేక కవరేజ్ చేస్తున్నారు. ఈవిధంగా ఈ యువనేతలిద్దరూ ఒకరిబాటలో మరొకరు సాగిపోతుండటం చూస్తుంటే మున్ముందు ఇద్దరూ చేతులు కలిపే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేకుంటే నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి ఎన్నడూ మాట్లాడని యువనేత ఇంత హటాత్తుగా బరిలో దిగిపోవడం ఏమిటి? ఇంతవరకు దాని గురించి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా బరిలో నుండి పక్కకు త్రప్పుకొని యువనేతకు ఆ అవకాశం కల్పించడం ఏమిటి? అని రాజకీయ విశ్లేషకులు తెగ మధనపడిపోతున్నారు. బహుశః మళ్ళీ ఆ చల్లని తల్లి ఒడిలోకి చేరేందుకే వైకాపా సిద్దం అవుతోందేమో? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓ అయ్య (జగన్) చేతిలో పెట్టి రక్షించుకోనేందుకే జాతీయ యువనేత ఆరాట పడుతున్నారేమో? వారిరువురి మధ్య ప్రత్యేక అవగాహాన కుదిరి నందునే కాంగ్రెస్ పార్టీ ఈ ‘ప్రత్యేక బరి’ లో నుండి తప్పుకొని రాష్ట్ర యువనేతకు అవకాశం కల్పిస్తోందేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారా?

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిని ఎలా నిర్మించాలని.. దానిని ఎలా అభివృద్ధి చేయాలి.. అలాగే కేంద్ర నుండి ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా విషయంలో ఎలా నచ్చజెప్పాలని చూస్తుంటే ఇప్పుడు ఆపార్టీలో నేతలే ఆయనకు తలనొప్పిగా తయారయ్యారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాల్లో పార్టీ నేతల వల్ల ఆయనకు సమస్యలు వచ్చాయి.   అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు కూడా అలాగే జరిగింది. పుష్కరాలప్పుడు జరిగిన ప్రమాదంలో చాలా ప్రాణాలు మంది ప్రాణాలు పోగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు మీద విమర్శలు చేశారు. దీని మీద నేషనల్ మీడియాలో జరిగిన ఇంటర్య్వూలో కూడా టీడీపీ నేతలు వారికి వచ్చీ రాని ఇంగ్లీష్ తో పాట్లు పడుతూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో నేతల భాషా పాండిత్యం పై మండిపడి ఇక నుండి ఇంగీష్ మీడియా మాట్లాడేందుకు గాను గల్లా జయదేవ్ ను నియమించారు.   అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏదో ఒక రకంగా పాట్లు పడుతుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది ప్రజలు నిరాశపడొద్దు అని చెబుతుంటే ఈలోపు జేసీ దివాకర్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ వ్యాఖ్యలు చేస్తాడు. రాష్ట్ర విభజన కారణంగా రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని.. విభజన అనంతరం ఇస్తున్న ప్యాకేజీలో రాయలసీమకు న్యాయం చేయాలని.. లేదంటే రాయలసీమలో పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్ ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలంతా రాజీనామా చేయాలని విమర్శిస్తే.. దానికి ఆయన ఎంపీ లంతా కాదు ఆఖరికి ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదంటూ బాంబు పేల్చారు.    మరోవైపు భూసేకరణలో కూడా చంద్రబాబుకు పార్టీ నేతలు సమస్యలు తెచ్చారు. ఇప్పటికే  ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి భూసేకరణపై పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అవసరం లేదని.. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ఎంత ప్యాకేజీ ఇస్తుందో తెలియదు కానీ ప్రత్యేక ప్యాకేజీలో రాయలసీమకు లక్ష కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఓరకంగా తలనొప్పి వ్యవహారమే అని చెప్పవచ్చు.     మరోవైపు మంత్రి నారాయణ అయితే ఏకంగా ఈ భూసేకరణ బిల్లు విషయం చంద్రబాబుకు తెలియదని.. చంద్రబాబు దృష్టికి తీసుకురాకుండానే భూసేకరణ బిల్లు ఇచ్చామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు చంద్రబాబు మొదటి నుండి వ్యతిరేకమే అని కానీ రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతుండటంతో తానే నోటిఫికేషన్ జారీ చేయించానని చెప్పారు. ఇది ఒకరకంగా ప్రతిపక్షనేతలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు పార్టీనేతల వైఖరిని మార్చకపోతే చాలా కష్టమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఎర్ర చందనం స్మగిలింగ్ సమస్య ఏపీ ప్రభుత్వానిదేనా?

  మూడు నెలల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ తరువాత స్మగిలింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయని అనుకొంటే ఇంకా పెరిగిపోయాయి. ఈ మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర అటవీశాఖ అధికారులు, పోలీసులు అనేకమంది ఎర్రచందనం చెట్లు నరుకుతున్న కూలీలను అరెస్ట్ చేసారు. అనేక కోట్ల విలువయిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నారు. అనేక వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. అయినా ఎర్రచందనం స్మగిలింగ్ కార్యకలాపాలు ఆగడం లేదు. స్మగ్లర్ల బారి నుండి ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.   శేషాచలం అడవుల్లో ఈతమాకులగుంట అనే ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారనే సమాచారం అందడంతో 12మంది రిజర్వు పోలీసులు నిన్న రాత్రి అక్కడికి చేరుకొన్నప్పుడు అక్కడ వారికి ఏకంగా 200 మందికి పైగా స్మగ్లర్లు కనబడ్డారు. పోలీసుల కంటే స్మగ్లర్ల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో వారు పోలీసులపై రాళ్ళతో దాడి చేసారు. పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుండి పారిపోయారు. నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు.   ఇదివరకు ఎన్కౌంటర్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరణించినప్పుడు తమిళనాడులో అధికార అన్నా డీ.యం.కె.తో సహా అన్ని రాజకీయ పార్టీలనీ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేసాయి. చనిపోయిన వారందరూ ఎర్రచందనం స్మగ్లర్లు కారని, వారు పొట్ట కూటి కోసం పనిచేసే రోజువారి కూలీలేలని రాజకీయ పార్టీలన్నీ వాదించాయి. తమిళనాడు ప్రభుత్వం ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీల కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు, నష్టపరిహారం కూడా చెల్లించింది. ఏపీలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఎన్కౌంటర్ ని ఖండించాయి. కోర్టులు, మానవ హక్కుల సంఘాలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. నేటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎర్రచందనం స్మగిలింగ్ కార్యక్రమాలు మాత్రం నేటికీ యదేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి.   ఒక ప్రభుత్వం దీనిని నేరంగా భావిస్తున్నప్పుడు మరొక ప్రభుత్వం కూలీలకు ఉద్యోగాలు, నష్టపరిహారం ఇచ్చి ప్రోత్సహిస్తునంత కాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగానే అందరూ చూస్తున్నారు తప్ప దేశ సంపదను కొల్లగొడుతున్నట్లుగా, చట్ట వ్యతిరేఖ చర్యలుగా భావిస్తున్నట్లు లేదని రాజకీయ పార్టీల, తమిళనాడు ప్రభుత్వ ప్రతిస్పందన చూస్తే అర్ధమవుతోంది. ఎర్రచందనం స్మగిలింగ్ వార్తలను సర్వసాధారణ వార్తలయిపోయాయి. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.   తమిళనాడుకు చెందిన కూలీలే ఈ స్మగిలింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిసినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో దీని గురించి మాట్లాడి ఈ సమస్యని శాశ్విత పరిష్కారానికి కృషి చేసి ఉంటే బాగుండేది. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం అందుకు సహకరించదనుకొంటే, ఈ ఎర్ర చందనం స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకే ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను, బలమయిన చట్టాలను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది.   ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చును. ఇటువంటి స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవలసి ఉంటుంది. అలాకాక స్మగ్లర్లు చెట్లు నరుకుతున్నారని తెలిసినప్పుడు ఓ పదిమంది పోలీసులను పంపడం వలన స్మగ్లర్ల దాడిలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడమో లేకపోతే పోలీసుల కాల్పుల్లో స్మగ్లర్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం రాజకీయ పార్టీల నుండి నిరసనలు, కోర్టు కేసులు ఎదుర్కోవడం, పొరుగు రాష్ట్రంతో సంబంధాలు దెబ్బ తినడం తప్పకపోవచ్చును.

జగన్ ఒక అపరిచితుడు: తెదేపా

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయిన క్షణం నుండే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో చాలా వేడిగా మొదలయ్యాయి. పుష్కరాల మొదటిరోజు త్రొక్కిసలాటలో మరణించినవారి మృతికి సంతాపం ప్రకటిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసారు.వారి మృతికి ఆయనే కారణమని, మళ్ళీ ఆయనే వారికి సంతాపం ప్రకటించడం కత్తితో పొడిచిన తరువాత పూలదండ వేసినట్లుందని అనడంతో తెదేపా సభ్యులు తీవ్రంగా స్పందించారు.   జగన్ కి ఎక్కడ ఏవిధంగా తెలియము మూర్ఖుడని మంత్రి అచ్చెం నాయుడు విమర్శించారు. పుష్కరాలను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తు త్రొక్కిసలాటలో కొందరు మృతి చెందారని దానికి ప్రభుత్వం కూడా చాలా బాధపడుతోందని కానీ జగన్ వారి మృతిని కూడా రాజకీయం చేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తరువాత గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిలో ఒక అరిచితుడు దాగి ఉన్నాడని, అతను ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తుంటాడని విమర్శించారు.

దేనికయినా రాసిపెట్టి ఉండాలి: డి.శ్రీనివాస్

  కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తనకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీతో సుమారు నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని పుటుక్కున త్రెంచుకొని తెరాసలో చేరిపోయారు. ఆయనను ఎవరూ సంజాయిషీలు అడగనప్పటికీ గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా తను పదవులు, అధికారం కోసం తెరాసలో చేరడం లేదని చెప్పుకొని తన అంతర్యం ఆయనే బయట పెట్టుకొన్నారు. ఊహించినట్లే ఆయన తెరాసలో చేరిన నెల రోజుల్లోగానే క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని గుర్తించి తనకు ఆ పదవి ఇచ్చి గౌరవించారని ఆయన చెప్పుకొన్నారు. ఆయన బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని అన్నారు. ధర్మాధర్మాలు, న్యాయన్యాయాలు అన్నీ పైనున్న భగవంతుడే చూసుకొంటాడని అన్నారు. తన టాలెంట్ చూసే కేసీఆర్ ఈ పదవి ఇచ్చారని, దానిని బంగారి తెలంగాణా కోసం ఉపయోగిస్తానని అన్నారు. తెరాసలో కొత్త బ్యాచి, పాత బ్యాచి అని రెండు గ్రూపులు ఏవీ లేవని, అందరూ కలిసి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణా కోసం తను జలగం వెంగళరావు కాలం నుండి వైయస్ కాలం వరకు పోరాటాలు చేసానని అన్నారు.   తన ట్యాలంట్ చూసే తనకు ఈ పదవి ఇచ్చారని డి.శ్రీనివాస్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనలో నిజంగా అంత ట్యాలెంట్ ఉండి ఉంటే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న పార్టీగా పేరుమోసిన కాంగ్రెస్ పార్టీలోనే రాణించగలిగేవారు. కానీ ఆయనకి ఎన్నిసార్లు పార్టీ టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. చివరికి ఎమ్మెల్యేల కోటాలో రెండవసారి ఎమ్మెల్సీ అవ్వాలనుకొని భంగపడటంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ అదే అదునుగా ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చి తనవైపు త్రిప్పుకొన్నారు.   డీ.యస్. తను కూడా చిరకాలంగా తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకొన్నారు. కానీ తెరాస ప్రభుత్వంలో కాబినెట్ హోదా పదవి పొందేందుకు అది అర్హత కాబోదు. అటువంటి అర్హత ఉన్నవాళ్ళు తెరాసలో కొన్ని వేల మంది ఉన్నారు. అయినా వైయస్ హయం వరకే తాను తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకోవడం చూస్తే ఆ తరువాత నుండి తెలంగాణా కోసం ఆలోచన కూడా చేయలేదని ఆయనే ఒప్పుకొన్నట్లుంది.   అలాగే తన ట్యాలెంట్ చూసి కేసీఆర్ ఆయనకి ఆ పదవి ఇచ్చారనుకోవడానికి లేదు. ఒకవేళ ట్యాలెంట్ ఉన్నవాళ్లకే ఆ పదవిని ఇవ్వాలనుకొంటే తెరాసలోనే అంతకంటే గొప్ప ట్యాలెంటు ఉన్నవాళ్ళు అనేకమంది ఉన్నారు. వారందరినీ కాదని ఆయనకు ఆ పదవి ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీని త్యజించి తెరాసలో చేరినందుకేనని భావించాల్సి ఉంటుంది. పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని చెప్పిన మాట అక్షరాల తెరాస నేతలకు సరిపోతుంది. ఆయనకి కాదు. పదేళ్ళపాటు కేసీఆర్ తో కలిసి తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళలో చాలా మందికి పదవులే దక్కలేదు. ఎందుకంటే వారికి రాసి పెట్టిలేదనుకోవాలి. కానీ నిన్నగాక మొన్న తెరాసలో చేరిన డి.శ్రీనివాస్ కి నెల తిరక్క ముందే క్యాబినెట్ హోదా గల పదవి దక్కింది.   అయితే ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చేరు కదా అని ఆయన తన ట్యాలెంట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చూపిద్దామని ప్రయత్నిస్తే మళ్ళీ భంగపాటు తప్పకపోవచ్చును. నిజానికి కేసీఆర్ కి ఎవరి సలహాలు అవసరం లేదు. ఆయన తీసుకొనే నిర్ణయాలని చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆయనకు మాట ఇచ్చినందున ఏదో రాజకీయ ఉపాది కల్పించాలి గాబట్టి ఆ పదవి ఇచ్చారనుకోవలసి ఉంటుంది. కనుక డి.శ్రీనివాస్ తనకు దక్కిన ఆ హోదాని హాయిగా అనుభవిస్తూ కాలక్షేపం చేసుకోవడమే అన్ని విధాల మంచిది.

ఈ ప్రత్యేక మరణాలు ఆగేదెప్పుడు?

  ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కానీ అది రానంత కాలం ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగా, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అది వాటి చేతిలో ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. కానీ మాంసం తింటారని ఎవరూ ఎముకలు మెళ్ళో వేసుకొని తిరుగనట్లే, ఈ బహిరంగ రహస్యాన్ని రాజకీయ పార్టీలు బయటకి చెప్పుకోవు. ప్రజలే అర్ధం చేసుకోవాలి. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొన్ని వారాల క్రితం తిరుపతిలో జరిపిన బహిరంగ సభలో మునికోటి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, అతని అంత్యక్రియలకు హాజరయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు స్వయంగా అతని పాడె మోశారు. ఎందుకు మోసారో వారికీ తెలుసు, ప్రజలకీ తెలుసు.   ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లా వేదాయపాలెంకుచెందిన రామిశెట్టి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు వెళ్ళారు. మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరూ కలిసి పోరాడి సాధించుకొందాము. కలిసి పోరాడితే చంద్రబాబు నాయుడే కాదు ఆయన నాయిన (తండ్రి) అయినా దిగిరావలసిందే.” అని అన్నారు. అంటే మనుషులు ప్రాణాలు పోతున్నా తన ఉద్యమం కొనసాగిస్తానని చెప్పుతున్నట్లే ఉంది.   రామిశెట్టి లక్ష్మయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలు చెపుతున్న మాటలతో భావోద్వేగానికిలోనయి కొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అలా చేస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయనే సంగతి గుర్తుంచుకోవాలి. రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంచినప్పుడు ప్రతిపక్షాల మాటలు విని ప్రజలు ఆందోళన చెంధవలసిన అవసరం లేదు. దయచేసి ఎవరూ ఆత్మహత్యల ఆలోచన కూడా చేయవద్దు,” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.   కానీ రాజకీయ పార్టీలు రాజేసిన ఈ అగ్గికి ఇంకా ఎవరో ఒకరు సమిధలుగా మారుతూనే ఉన్నారు. ఈరోజు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయ్ భాను(40) అనే వ్యక్తి ప్రత్యేక హోదా రానందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని తల్లి తులసీ రాణి గుడివాడ పట్టాన తెదేపా మహిళాధ్యక్షురాలిగా ఉన్నారు. జిల్లా తెదేపా నేతలు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దాని కోసం అన్యాయంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తరువాత కూడా వారి మరణాలను ఎత్తి చూపిస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించడం మానవత్వం అనిపించుకోదు. మనుషుల ప్రాణాలకంటే ప్రత్యేక హోదా ఏమీ ముఖ్యమయినది కాదు. కనుక అన్ని పార్టీలు ఇకపై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునివ్వాలి. వీలయితే సినిమా హీరోలు, క్రీడాకారులు తదితర సెలబ్రేటీలు కూడా ప్రజలకు సందేశం ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న సినీ తారలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా, జూ.ఎన్టీఆర్ వంటివారు సోషల్ నెట్ వర్క్ మరియు టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు సందేశం ఇస్తే దాని వలన కొంత ప్రయోజనం ఉంటుంది.

మరో పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు

  కొన్ని వారాల క్రితం జమ్మూలోని ఉదంపూర్ వద్ద సరిహద్దు భద్రతా దళాల మీద కాల్పులు జరిపిన ఉస్మాన్ ఖాన్ అనే పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. మళ్ళీ ఈరోజు మరో పాక్ ఉగ్రవాది భారత దళాలకు సజీవంగా పట్టుబడ్డాడు. బారాముల్లా జిల్లాలోని రఫియాబాద్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు నిన్న రాత్రి అక్కడికి చేరుకొన్నాయి. ఒక ఇంట్లో దాకొన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడంతో భారత్ భద్రతా దళాలు కూడా ఎదురు దాడి చేసాయి. నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకు సాగిన ఈ ఆపరేషన్ లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాలు చేతిలో హతమవ్వగా ఒక్కడు సజీవంగా పట్టుబడ్డాడు. అతనిపేరు సజ్జాద్ అహమ్మద్. వయసు 22సం.లు. పాకిస్తాన్ లో ముజఫర్ ఘర్ అనే ప్రాంతానికి చెందినవాడు. భారత్ పై దాడులు చేసేందుకు తామంతా పాకిస్తాన్ నుండి వచ్చామని అంగీకరించాడు. భద్రతా దళాలు అతని నుండి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నాయి.   ఇంతకు ముందు ఉదంపూర్ లో పట్టుబడిన ఉస్మాన్ ఖాన్ తాము మొత్తం 18మంది భారత్ లోకి ప్రవేశించమని చెప్పాడు. కనుక చనిపోయిన ఆ నలుగురు, పట్టుబడిన సజ్జద్ అహమ్మద్ తో కలిపి మొత్తం ఐదుగురు ఆ 18మంది ఉగ్రబ్యాచ్ లోవారేనా లేక వీళ్ళు వేరేగా వచ్చారా? అనేది తేలవలసి ఉంది. భారత్ పై దాడి చేసే పాక్ ఉగ్రవాదులు చాలా అరుదుగా సజీవంగా పట్టుబడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులలో ప్రాణాలయినా వదులుకొనేందుకు సిద్దపడతారు కానీ సజీవంగా పట్టుబడరు. కానీ ఈసారి చాలా తక్కు వ్యవధిలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడటం విశేషం. బహుశః ఇద్దరూ ఇంకా చిన్న వయసువారే అవడంతో వారు పట్టుబడుతున్నట్లున్నారు.   పాకిస్తాన్ లో దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులను తాలిబాన్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు డబ్బులు ఎరవేసి ఆకర్షించి శిక్షణ ఇచ్చి భారత్ పై దాడులు చేసేందుకు పంపిస్తోందని పట్టుబడ్డ ఉగ్రవాదులు ఇస్తున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ డబ్బుకు ఆశపడి ఇటువంటి పనులకు పూనుకొన్నందుకు వారి జీవితాలే కోల్పుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ సమస్య గురించి తెలియదనుకోలేము. కానీ తెలిసీ మౌనం వహిస్తోంది అంటే దానిపై ఉగ్రవాదుల ప్రభావం, పెత్తనం చాలా ఉందని స్పష్టం అవుతోంది.

ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యలా? ఆ ఆలోచనే వద్దు!

  ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజేసిన హోమగుండంలో మొట్ట మొదటగా ఆ పార్టీకి చెందిన కార్యకర్త మునికోటి సమిధగా మారాడు. మళ్ళీ ఈ మధ్యనే ప్రత్యేక హోదా కోసం కృష్ణా జిల్లాలో పామర్రుకు చెందిన చావల సుబ్బారావు అనే వ్యక్తి ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. కానీ అదృష్టవశాత్తు సకాలంలో అతని బార్య చూసి తన భర్తను రక్షించుకొంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సంగతి తేటతెల్లం అవడంతో నెల్లూరు జిల్లా వేదాయపాలెం వాస్తవ్యుడయిన రామిశెట్టి లక్ష్మయ్య అనే 53 ఏళ్ల వయసు గల వ్యక్తి గురువారం ఉదయం తన ఇంట్లో ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రత్యేక హోదా రాదనే ఆవేదనతోనే తను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు లేఖ వ్రాసిపెట్టి చనిపోయాడు.   ప్రత్యేక హోదా కోరుతూ ఈవిధంగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరం. వారి కుటుంబాలకు తీరని ఆవేదన, ఊహించని ఆర్ధిక సామాజిక సమస్యలు చుట్టు ముట్టవచ్చును. ప్రత్యేక హోదా రాకపోవడం వలన రాష్ట్రం కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును. కానీ ప్రళయం సంభవించదు. ప్రత్యేక హోదా ఉన్నాలేకపోయినా, పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రం మళ్ళీ మెల్లగా నిలద్రొక్కుకోగలదు. కనుక ప్రత్యేక హోదా రాలేదనే బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం వలన చివరికి వారి కుటుంబాలే వీధిన పడే ప్రమాదం ఉంది.   ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ర్టం ఏర్పాటు చేస్తానని ప్రకటించి మళ్ళీ ఒత్తిళ్లకు తలొగ్గి మాట మార్చడంతో సుమారు 1200 మంది యువకులు తీవ్ర ఆవేదన చెంది బలిదానాలు చేసుకొన్నారు. అయినా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. తరువాత ఎప్పుడో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ ఆ యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని ఎన్నడూ తెలంగాణా కోసం మాట్లాడని వాళ్ళు పరిపాలిస్తున్నారిప్పుడు. ఈనాడు వాళ్ళు అనుభవిస్తున్న ఈ రాజభోగాలకి కారకులయిన ఆ అమరవీరుల కుటుంబాలలో కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేసింది. మిగిలిన వాళ్ళు చేతికి అందివస్తాడనుకొన్న బిడ్డ కాటికి పోయినందుకు కుమిలిపోతూ ఆదుకొనే నాధుడు లేక దయనీయమయిన జీవితాలు గడుపుతున్నారు.   ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే, ఆనాడు తెలంగాణా రాష్ట్రం కోసం తెలంగాణా యువకులు ఆత్మహత్యలు చేసుకొన్నట్లే, ఈనాడు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాలో కూడా కొందరు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. కానీ తెలంగాణా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటని అర్ధం అవుతోంది. తెలంగాణా యువకుల బలిదానాల వలన రాజకీయనాయకులే లబ్ది పొందగా బలిదానాలు చేసుకొన్న యువకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంగతి గ్రహిస్తే ఎవరూ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోరు.

చేసేది రైతుల కోసం దీక్ష! కానీ కనేది ముఖ్యమంత్రి కలలు

  జగన్ కి ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా బలమయిన కోరిక ఉంది. అది తరచూ అతని ప్రసంగాలలో చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఈరోజు విజయవాడలో ఆయన చేప్పట్టిన దీక్షలో కూడా మూడేళ్ళలో తెదేపా ప్రభుత్వం కూలిపోతుందని తరువాత తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. కానీ తను ముఖ్యమంత్రి అవడం కోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. అయితే మూడేళ్ళ తరువాత ప్రభుత్వం ఏవిధంగా కూలిపోతుందో, తను ఏవిధంగా తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని భావిస్తున్నారో ఆయన చెప్పి ఉండి ఉంటే బాగుండేది.   కానీ ఆయన ఒక సమస్యపై పోరాటం చేస్తున్నప్పుడు తన ముఖ్యమంత్రి స్వప్నాన్ని ప్రజల ముందు ఉంచుతుండటం వలన అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందనే సంగతి ఆయన గ్రహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తను మాట్లాడుతున్న ఆ మాటలు తన పోరాటం తాలూకు అసలు ఉద్దేశ్యాన్ని నీరుగార్చడమే కాకుండా ఆయన తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకొనే ప్రయత్నాలలో భాగంగానే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేస్తున్నారనే భావం ప్రజలలో నెలకొంటుంది.   తెదేపా ప్రభుత్వం కూలిపోగానే తను రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం చూస్తే వారి సమస్యకు ఏకైక పరిష్కారం తను ముఖ్యమంత్రి అవడమే అని చెపుతున్నట్లుంది. రైతుల కోసం పోరాడుతున్నానని చెపుతూనే మళ్ళీ నేను మీ భూములను రక్షించలేను. అన్నీ పైనున్న ఆ దేవుడే చూసుకొంటాడు, అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. దేవుడే చూసుకొంటాడన్నప్పుడు మరి ఆయన ఈ దీక్షలు ధర్నాలు అంటూ హడావుడి చేయడం ఎందుకు? అంటే మళ్ళీ అదే సమాధానం చెప్పుకోవాలేమో?   జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరిక ఉంది కనుక దానిని నెరవేర్చుకొనేందుకు అవసరమయిన ప్రయత్నాలు చేసుకుపోవాలి కానీ ఇలాగ పదేపదే ‘నేను ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతాను, మూడేళ్ళ తరువాత ప్రభుత్వం కూలిపోతే ముఖ్యమంత్రి అవుతాను,” అని చెప్పుకోవడం వలన నలుగురిలో నవ్వులపాలవడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదు.

ఏపీ అసెంబ్లీ భవనం మరమత్తులకి కోటి రూపాయలు ఖర్చు!

  ఇక నేడో రేపో ఏపీ ప్రభుత్వం విజయవాడకి తరలిపోవాలని సన్నాహాలు చేస్తోంది. ఈసారి వీలయితే రాష్ట్ర శాసనసభ సమావేశాలని విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇటువంటి సమయంలో హైదరాబాద్ లో ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన శాసనసభ భవనానికి మరమత్తులు కోసం ఏపీ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ రూ.97 లక్షలు మంజూరు చేసింది. చారిత్రాత్మక కట్టడమయిన అసెంబ్లీ భవనానికి మరమత్తులు చేసేందుకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రూ.3.58 కోట్లు వ్యయం అయ్యే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కానీ తెలంగాణా ఉద్యమాల కారణంగా ఇంతవరకు పనులు మొదలవలేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాలలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కనుక గత ప్రభుత్వం ఆమోదించిన పనులను చేప్పట్టవలసి వస్తోంది. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు కోటి రూపాయలు మంజూరు చేసింది. త్వరలోనే మొదటి దశ మరమత్తుల పనులు మొదలుపెడతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ ఉన్నతాధికారి బి. రాజేందర్ తెలిపారు.

పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు

  “పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు” తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సీపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అన్నమాట ఇది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కేసీఆర్ ఒక నయా నిజాం నవాబు” అని ఆయన అభివర్ణించారు. కానీ కేసీఆర్ ని ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వర్ రావు, చిన్న జియ్యర్ స్వామే వెనుకనుండి నడిపిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు తెలంగాణాలో ఆంధ్రా నేతల పాలన సాగేదని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కుల పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, నిజాం దొరలపాలనా సాగుతోందని అన్నారు.   రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళు, మూడెకరాల స్థలం హామీని పక్కనబెట్టి బడా పారిశ్రామిక వేత్తలకు స్థలాలు అన్వేషించడానికి కేసీఆర్ స్వయంగా హెలికాఫ్టర్లో తిరుగుతున్నారని హరిభూషణ్ ఆరోపించారు. పేదలకు 100 గజాల స్థలం ఇవ్వడానికి వెనుకాడే కేసీఆర్ పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు, కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా 1.60 లక్షల ఎకరాల భూమిని సిద్దం చేసామని గొప్పగా చెప్పుకోవడాన్ని హరిభూషణ్ తప్పు పట్టారు. ఒకవైపు పోలీసులకు అత్యదునిక ఆయుధాలు, వాహనాలు సమకూర్చి మావోయిస్టులను భూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మళ్ళీ తమ ప్రభుత్వం మావోయిస్ట్ అజెండానే అమలు చేస్తోందని కేసీఆర్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అధికారంలోకి రావడానికే కేసీఆర్ తమపెరును వాడుకోన్నారని హరిభూషణ్ అన్నారు. రాష్ట్రంలో పేదలకు కూడు, గుడ్డ, ఇళ్ళు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పించినప్పుడే ఆ మాట చెప్పుకొనే అర్హత ఉంటుందని అభిప్రాయపడ్డారు.   పేదల కోసం పనిచేయకుండా కేసీఆర్ తన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను ఏర్పాటు చేసుకొంటున్నారని హరిభూషణ్ విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయవలసిన సొమ్మును చిన్న జీయర్ స్వామీ సలహాతో కేసీఆర్ గుళ్ళు గోపురాలకి(యదాద్రి), పుష్కరాలకి ఖర్చు చేస్తున్నారని ఆవేదన చెందారు. నిరుపేద మునిసిపల్ కార్మికులు, ఈజీఎస్ ఉద్యోగుల సమ్మెను కేసీఆర్ ఉక్కుపాదంతో అణచివేశారని హరిభూషణ్ విమర్శించారు. చివరికి తనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలని, మీడియాని కూడా కేసీఆర్ నియంతలాగా అణగద్రొక్కేస్తున్నారని హరిభూషణ్ అన్నారు.   తెలంగాణా భౌగోళికంగా ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ఆంధ్రా భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో నుండి ఇప్పుడు నయా నిజాం దొరల వంటి కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కుకుపోయిందని హరిభూషణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేతిలో నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు మళ్ళీ మరొక ఉద్యమం అవసరం అవుతుందని హరిభూషణ్ అభిప్రాయ పడ్డారు.

ప్రత్యేక హోదా సాధించకపోతే దానికి తెదేపా మూల్యం చెల్లించాలా?

  ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హోదా సాధించుకువస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆయనకే అధికారం ఖాయమని లేకుంటే ఆయన ఉనికి కోల్పోవచ్చని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. కనుక చంద్రబాబు ప్రయత్నం సఫలం అవకపోవచ్చును. బహుశః ఈ సంగతి గ్రహించే ఉండవల్లి ముందుగానే అయన ముందరి కాళ్ళకి బందం వేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది.   ప్రత్యేక హోదా కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని ఎంపీగా పనిచేసిన ఆయనకి తెలిసే ఉండాలి. చంద్రబాబు తన ప్రయత్నాలు తను చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇవ్వకపోతే దానికి ఆయన ఏవిధంగా బాధ్యుడు అవుతారు? అటువంటప్పుడు ఈ అంశంపై చంద్రబాబు భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఉండవల్లి ఎందుకు చెపుతున్నారు? అంటే ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలనే పలుకుతున్నట్లున్నారు. ఈమధ్యన ఆయన వైకాపాకు దగ్గరవుతున్నారని ఆయనను పార్టీలోకి రప్పించేందుకు జగన్ కూడా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేనని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. ఒకవేళ వెళ్ళాలనుకొన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలు కనబడటం లేదు. కనుక వైకాపాకు దగ్గరయ్యేందుకే ఆయన కూడా జగన్ లాగే చంద్రబాబు, ఆయన ప్రభుత్వ భవిష్యత్ గురించి జోస్యం చెపుతున్నరేమోననే అనుమానం కలుగుతోంది.   రాహుల్ గాంధీ గుర్తు చేసేవరకు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డికి దాని కోసం ఇప్పుడు హటాత్తుగా డిల్లీ వెళ్లి ఐదు గంటలు దీక్ష చేసి వచ్చినా, రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినా ఆయనకీ విషయంలో చిత్తశుద్ధి ఉందనుకోలేము. కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల కోసం తెదేపా ప్రభుత్వం అధికారం చేప్పట్టక ముందు నుండే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెటింది. తెదేపా బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది కనుక అది ప్రతిపక్ష పార్టీలలాగ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, బంద్ లు చేయలేదు. ప్రయత్నలోపం లేకుండా కేంద్రప్రభుత్వంపై నిరంతరంగా తీవ్ర ఒత్తిడి చేస్తూనే ఉంది. ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.   కానీ రాజకీయ కారణాలతో ఉండవల్లి వంటివారు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. ఇతరులను విమర్శించే ముందు తాము  అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పట్ల తమ కర్తవ్యాన్ని ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించారు? అని ప్రశ్నించుకొంటే మంచిది. ఉండవల్లికి కాంగ్రెస్ పార్టీతో చిరకాల అనుబంధం ఉంది. పార్టీలో మంచి పలుకుబడి గల నేతగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసిన తరువాత కూడా ఆయన తన ఈ తెలివి తేటలు, పలుకుబడి, రాజకీయ అనుభవం అన్నిటినీ ఉపయోగించి రాష్ట్రానికి నష్టం జరగకుండా అవసరమయిన అన్ని హామీలను విభజన చట్టంలో చేర్పించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో ప్రజల నుండి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల నుండి తప్పించుకొనేందుకు మిగిలిన ఎంపీలతో కలిసి విభజనను అడ్డుకొంటున్నట్లు నటిస్తూ తమపై బహిష్కరణ వేటు వేయించుకొని సమైక్య సమర యోధులుగా, ఎంపీ పదవులను త్యజించిన గొప్ప త్యాగమూర్తులుగా చాలా లౌక్యంగా ఈ సమస్య నుండి బయటపడ్డారు. ఆనాడు తమ కర్తవ్యాన్ని, బాధ్యతలను విస్మరించిన నేతలందరూ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని సాధించుకు రావలసిన బాధ్యత చంద్రబాబు నాయుడిదే...లేకుంటే ఆయనకు భవిష్యత్ లేదు అని జోస్యం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.   ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే అప్పుడు ఏమి చేయాలో చంద్రబాబే నిర్ణయించుకొంటారు. ఆయన నిర్ణయం తప్పా ఒప్పా? అనే సంగతి ప్రజలు చూసుకొంటారు. కానీ ఈలోగా ఉండవల్లి వంటి మేధావులు ఇటువంటి చిలక జోస్యాలు, తీర్పులు చెపుతూ కాలక్షేపం చేసే బదులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్ళితే బాగుంటుందో నిర్మాణాత్మకమయిన సూచనలు, సలహాలు ఇస్తే అందరూ హర్షిస్తారు కదా?

పవన్ కళ్యాణ్ రైతులను రెచ్చగొడుతున్నారుట!

  పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడిన తరువాత రాష్ట్ర మంత్రులపై విమర్శలు గుప్పించారు. దానిపై రాష్ట్ర మంత్రులు ఆయనపై ప్రతివిమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వార్ధం కోసమే రైతుల వద్దకు వెళ్లి వారిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే 95శాతం భూసమీకరణ జరిగిందని మిగిలిన 3,000ఎకరాల భూమిని కూడా రైతులను ఒప్పించి సేకరిస్తామని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   పవన్ కళ్యాణ్ మొన్న రైతులతో సమావేశమయినప్పుడు తను తెదేపా-బీజేపీలకు మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన్న వాటికి తను బానిసను కానని అన్నారు. బహుశః అందుకే ఇప్పుడు తెదేపా-బీజేపీ నేతలు కూడా ఆయనకీ అంతే ఘాటుగా ధీటుగా జవాబులు చెపుతున్నారు. కానీ వారి వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శల వలన సమస్యలు పరిష్కారం కావనే సంగతి అందరూ గ్రహించి దానికోసం ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. లేకుంటే వారే ప్రజలలో చులకనవుతారు.

పవన్ కళ్యాణ్ కి వీహెచ్ మార్గదర్శనం!!!

  కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ తదితర అంశాలపై మాట్లాడకపోతే ప్రతిపక్షాల విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటిపై గట్టిగా మాట్లాడితే అధికార పార్టీ నేతల విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ఇటువంటి సందిగ్ద పరిస్థితుల్లోనే ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యం భోదపరిచి యుద్దానికి సన్నధం చేసినట్లుగా తెలంగాణాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు వెనక నుండి పవన్ కళ్యాణ్ కి మార్గదర్శనం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   పవన్ కళ్యాణ్ ఎప్పుడయినా మౌనం వహిస్తే వీహెచ్ ఆతనికి తక్షణ కర్తవ్యం భోదిస్తున్నట్లు ఫలానా అంశం మీద పోరాడు లేకుంటే నీ ఇంటి ముందు ధర్నా చేస్తానని చురకలు వేసి మేల్కొలుపుతూ ఉంటారు. ఉదాహరణకి ఓటుకి నోటు కేసు విషయంలో పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే దాని గురించి మాట్లడవేమని నిలదీసింది ఆయనే. అదేవిధంగా రాజధాని భూసేకరణ అంశం గురించి పవన్ కళ్యాణ్ ట్వీట్లకే పరిమితమయినప్పుడు, తెలంగాణాకు చెందిన వీహెచ్ కి ఆ అంశంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ట్వీట్లు పోస్ట్ చేయడం కాదు వెళ్లి రైతుల తరపున నిలబడి పోరాడమని దిశా నిర్దేశం చేసింది ఆయనే. పవన్ కళ్యాణ్ ఆయన సలహాలు, సూచనలను పట్టించుకోవడంలేదనడానికీ లేదు. ఎందుకంటే ఇంతకు ముందు అయన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన ప్రసంగంలో వీహెచ్ ప్రస్తావన చేసారు. అంటే వీహెచ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి కర్తవ్యం భోదిస్తున్నట్లుగానే భావించవచ్చును.   పవన్ కళ్యాణ్ నిన్న రాజధాని గ్రామాలలో పర్యటించి తెదేపా ప్రభుత్వాన్ని ఎండగట్టిన తరువాత, వీహెచ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రజల కోసం దైర్యంగా పోరాడే వాడే నిజమయిన లీడర్ అని రైతులకు అండగా నిలబడేందుకు సిద్దపడిన పవన్ కళ్యాణే నిజమయిన లీడర్ అని ఆయన మెచ్చుకొన్నారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నేత తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపా, బీజేపీలకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈవిధంగా మెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆయన తమ ప్రత్యర్ధ రాజకీయ పార్టీల మీదకి పవన్ కళ్యాణ్ ని ఉసిగొల్పుతున్నట్లు కనబడుతోంది. రాజధాని భూసేకరణ విషయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం చూస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. లేకుంటే ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ అంశాలపై పవన్ కళ్యాణ్ కంటే ముందు నుండి పోరాటం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన మెచ్చుకొని ఉండాలి. పైగా జగన్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే. కానీ జగన్ని పట్టించుకోకుండా వీ.హెచ్. కేవలం పవన్ కళ్యాణే పట్టించుకొంటున్నారు?