తెలంగాణలో డేంజర్ బెల్స్, సంక్షోభంలో విద్యా వ్యవస్థ
posted on Sep 15, 2015 @ 12:20PM
ఏళ్ల తరబడి నిరీక్షణ, కోటి ఆశలు, ఎన్నో కలలు, వేలాది ఆకాంక్షలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకం... తెలంగాణ రాష్ట్రం రానే వచ్చింది, కానీ నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలు మాత్రం కలలుగానే మిగిలిపోతున్నాయి. సొంత పాలకుల చేతిలోనూ నిరాశే ఎదురవుతోంది, అవమానాలే మిగులుతున్నాయి. ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి, ఒకపక్క అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన యువత...సరైన విద్య అందక పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతున్నారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభమే కాదు, విద్యావ్యవస్థ కూడా చిన్నాభిన్నమై... సాయం కోసం రోదిస్తోంది.
తెలంగాణ తెచ్చింది మేమే, తమకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి టీఆర్ఎస్ అధికారంలో వచ్చి ఏడాది దాటిపోతున్నా, హామీల అమలులో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వెనుకబడిపోతోంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు... నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అదిగో ఇదిగో...అమలు చేస్తున్నామని చెబుతున్నా, కార్యరూపం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అడుగు ముందుకుపడటం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా, ఇంతవరకూ యూనివర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితి, రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కూడా దాదాపుగా రెగ్యులర్ వీసీలు లేరంటే...విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.
ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు గత జులై నుంచి నేటివరకూ రెగ్యులర్ వీసీ లేరు. మిగతా యూనివర్సిటీల పరిస్థితీ దాదాపు అంతే, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరాబాద్), పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్ నగర్)లైతే నిధులు, తీవ్ర సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం యూనివర్సిటీలు, కాలేజీల్లో 50శాతం వరకు సిబ్బంది కొరత ఉందని, అది విద్యార్ధుల ప్రతిభా పాటవాలు, ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.
తెలంగాణలో చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థను గమనించిన పలువురు అధికారులు...ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారని,పరిస్థితి ఇలానే కొనసాగితే పలు యూనివర్సిటీలు...నాక్(నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్) గుర్తింపును కోల్పోతాయని, దాంతోయూజీసీ గ్రాంట్స్ నిలిచిపోయి, మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని డేంజర్ బెల్స్ మోగించారు. దాంతో ఆలస్యంగానైనా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం...వీసీల నియామకానికి హడావిడిగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా, ఇంకా కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇదిలా ఉంటే, హాస్టల్, మెస్ బిల్లులు అందక ఎస్సీఎస్టీ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలకు 110 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం...విద్యార్ధుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రైవేట్విద్యాసంస్థలు...బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ దూసుకుపోతుండగా, ప్రభుత్వ స్కూళ్లు మాత్రం మూసివేత దిశగా సాగుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా డ్రాపవుట్స్ ను తిరిగి స్కూళ్లకు చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దాంతో పేదలకు విద్య మరింత దూరమవుతోందని అంటున్నారు.
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యావ్యవస్థను బాగుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నికల హామీల్లో ఒకటైన విద్యావ్యవస్థను గాడిలో పెడుతుందో లేక చేతులెత్తిస్తుందో చూడాలి