తెలంగాణ తెలుగుదేశంలో ఆధిప‌త్య పోరు

తెలంగాణ టీడీపీలో కోల్డ్ వార్ జ‌రుగుతోంది. టీటీడీపీకి కొత్త సార‌ధిని అపాయింట్ చేసేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వ‌డంతో... కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది, టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎర్ర‌బెల్లి...ఈసారి తెలంగాణ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఆశిస్తుండ‌గా, రేవంత్ రెడ్డి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మ‌రోసారి అవ‌కాశ‌మివ్వాల‌ని కోరుతున్నా, ద‌క్కే ఛాన్స్ లేక‌పోవ‌డం..ఎర్ర‌బెల్లి, రేవంత్ లు...మ‌ధ్యే ప్ర‌ధాన‌ పోటీ న‌డుస్తోంది, అయితే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలై క‌ష్టాలుప‌డ్డ రేవంత్ రెడ్డిపై చంద్ర‌బాబుకు సానుభూతి ఉంద‌ని, పైగా కేసీఆర్, టీఆర్ఎస్ ను ధీటుగా ఢీకొట్టాలంటే అత‌నే క‌రెక్ట‌నే భావ‌న‌లో ఉన్నార‌ట‌, కానీ సీనియ‌ర్ లీడ‌ర్ ఎర్ర‌బెల్లిని కాద‌ని, రేవంత్ కి ప‌గ్గాలు అప్ప‌గిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని సందిగ్ధంలో ప‌డ్డారంటున్నారు, దాంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని అధ్య‌క్షుడిగా, మ‌రొక‌రిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ‌మించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, ఎర్ర‌బెల్లికి సార‌ధ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, రేవంత్ ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒక‌వేళ రేవంత్ కే ప‌గ్గాలివ్వాల్సి వ‌స్తే, ఎర్ర‌బెల్లికి మ‌ళ్లీ పాత పోస్టే ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు. అయితే వీరిద్ద‌రిలో ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇచ్చినా పొస‌గ‌ద‌ని, ఆధిప‌త్య పోరుతో పార్టీ కేడ‌ర్ న‌లిగిపోవ‌డం ఖాయ‌మంటున్నారు మిగ‌తా నేత‌లు.

జ‌గ‌న్ కి షాకివ్వ‌నున్న ఆ న‌లుగురు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భారీ షాక్ త‌గ‌ల‌బోతోంది. తెలంగాణ‌లో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గోడ దూకినా, ఏపీలో మాత్రం ఎవ‌రూ ఆ సాహ‌సం చేయ‌క‌పోవ‌డంతో ధీమాగా ఉన్న జ‌గ‌న్ కు న‌లుగురు ఎమ్మెల్యేలు క‌చ్చితంగా షాకివ్వ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌యంగా తెలిసింది. క‌ర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతలు... మొద‌ట్లోనే ఝ‌ల‌క్  ఇవ్వ‌గా,  ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వ‌చ్చింద‌ని, ద‌స‌రాకి కొంచెం అటూఇటుగా గోడ దూకేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. న‌వ్యాంధ్ర రాజ‌ధాని శంకుస్థాప‌న జ‌రిగే రోజే....పార్టీలో చేరేలా తెలుగుదేశం పెద్ద‌లు ప్లాన్ చేశార‌ని చెబుతుండ‌గా,  ప్ర‌కాశం జిల్లా నుంచే అధికంగా ఈ వ‌ల‌స‌లు ఉంటాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతోపాటు సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ లు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌గా, గొట్టిపాటి, పోతుల... చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికే చెందిన‌వారే కావ‌డం విశేషం. ఇక కొద్దిరోజులుగా జ‌గ‌న్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర్రావు కూడా గోడ దూకేయ‌డం ఖాయంగా తెలుస్తోంది. ఆ న‌లుగురితోపాటు... మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జ‌గ‌న్ కి షాకివ్వ‌బోతున్నార‌ని అంటున్నారు. అయితే ఈ వార్త‌లు నిజ‌మో కాదో తెలియాలంటే ద‌స‌రా వ‌ర‌కూ ఆగాల్సిందే.

అత్యాచారం చేసిన సౌదీ దౌత్యవేత్తకి శిక్ష పడుతుందో లేదో?

  నేటికీ రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియాలో చిన్నపాటి నేరాలకి కూడా కటినమయిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఇక హత్యలు, మానభంగాల కేసులలో అయితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే. ఆ శిక్షలు కూడా మామూలుగా ఉండవు. అటువంటి కేసుల్లో చాలాసార్లు శిరచ్చేదనం చేస్తారు.   అదే ఒక సౌదీ దౌత్యవేత్త పదేపదే ఇద్దరు మహిళలను రోజుల తరబడి మానభంగం చేస్తే? తను మానభంగం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిని మానభంగం చేయిస్తుంటే? రోజూ వారిని మానభంగం చేస్తూనే వారికి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా వారి చేత ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకొంటుంటే? ఎటువంటి శిక్షలు విధించాల్సి ఉంటుందో సౌదీ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది.   డిల్లీలోగల సౌదీ ఎంబసీలో పనిచేస్తున్న ఒక సౌదీ అధికారి ఇంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు పనిమనుషులుగా చేస్తున్నారు. వారిలో ఒకామె వయసు 50సం.లు మరొకరిది 30సం.లు. వారిరువురూ తమ కుటుంబాలను పోషించుకొనేందుకు సౌదీ అరేబియా వెళ్లి డబ్బు సంపాదించుకోవాలని ఆశ పడ్డారు. కానీ ఒక నేపాలీ ఏజెంట్ వారిని సదరు సౌదీ అధికారి ఇంట్లో పనికి కుదిర్చాడు. అప్పటి నుండి అతను వారిరువురికీ ఈ భూమ్మీద నరకం అంటే ఏమిటో చూపించాడు. రోజుల తరబడి ఆహారం లేకుండా ఇంటి పని చేయవలసి వచ్చేది. అంతే కాకుండా అతనికి రోజూ మసాజులు చేయడం, ఆ తరువాత అతను, అతని ఇంటికి వచ్చే స్నేహితుల చేతిలో మాన భంగానికి గురికావడం చాలా రోజులుగా సాగుతోంది. వారిద్దరినీ మెయితీ-ఇండియా అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ పాండే రక్షించకపోయుంటే వారు ఏదో ఒకరోజు శవాలయి తేలేవరేమో?   వారిని గుర్ గావ్ క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగించడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. వారిరువురినీ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందించి, వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకొన్నారు. సదరు అధికారి దౌత్యవేత్తగా పనిచేస్తున్నందున దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉంటాడు. కానీ ఆ సంగతి తెలియక అతనిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు పోలీసులు సౌదీ ఎంబసీలోకి సోమవారం ప్రవేశించారు. సౌదీ ఎంబసీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి తమ పరిధిని అతిక్రమించారని, అది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, కనుక వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ సౌదీ రాయబారి సౌద్ అల్ సతి, భారత విదేశాంగ శాఖలో గల్ఫ్ దేశాల జాయింట్ సెక్రటరీ తంగ్లూర దార్లంగ్ కి పిర్యాదు చేసారు.   ప్రస్తుతం సదరు అధికారిని అరెస్ట్ చేయడానికి వీలులేదు కనుక విదేశాంగ శాఖ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని క్రైం ఏ.సి.పి. రాజేష్ కుమార్ తెలిపారు. ఆ సౌదీ అధికారిని అరెస్ట్ చేయలేకపోయినా అతనితో కలిసి ఈ హేయమయిన నేరానికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వారికి దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉండి ఉంటే వారినీ అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్-సౌదీ విదేశాంగ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. బాధిత మహిళలు ఇద్దరూ నేపాల్ దేశానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఇది మూడు దేశాలకు సంబంధించిన సమస్యగా మారింది.   కానీ ఇటువంటి నేరాలకు కటినమయిన శిక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ దౌత్యవేత్తకి కూడా అదే విధంగా శిక్షిస్తుందో లేక అధికారులకొక న్యాయం సామాన్య ప్రజలకు మరొక న్యాయం అని అంటుందో వేచి చూడాలి.

కేసీఆర్ ను ఆ భయం వెంటాడుతోందా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట. అందుకే స్పీకర్ ను కూడా చైనా పర్యటనకు తీసుకెళ్లారంటున్నారు టీకాంగ్రెస్ నేతలు. కొడుకు, కూతురు, మేనల్లుడు హరీష్ రావు నుంచి కేసీఆర్ కు పదవీ గండం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నా... కేటీఆర్, కవితకి అంత సీన్ లేదంటున్నారు. కేసీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన నేత హరీష్ రావు మాత్రమేనని, మామకు ఉన్నట్లే అల్లుడుకి కూడా అన్నివర్గాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉందని, పైగా ఎమ్మెల్యేల్లోనూ అతనంటే మక్కువ ఉందంటున్నారు.అందుకే కేసీఆర్ తన జాగ్రత్తల్లో తానుంటున్నారని టీకాంగ్ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా....గతంలో హరీష్ ను పొగుడుతూ అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మరి కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా... నిజంగానే కేసీఆర్ ను అల్లుడి భయం వెంటాడుతోందా? లేక బాల్ థాకరే మాదిరిగా కొడుకు, మేనల్లుడి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారో...

చంద్రబాబు కోరిక తీరుతుందా? లేదా?

  రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఏడాది దాటి పోయింది. కానీ కార్యాల‌యాల‌ను న‌వ్యాంధ్ర రాజ‌ధానికి త‌ర‌లించాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోరిక మాత్రం తీర‌డం లేదు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే రంగంలోకి దిగినా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్నట్లుగా త‌యారైంది ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే కార్యాల‌యాల త‌ర‌లింపుపై నిర్ణ‌యం తీసుకున్నా...ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి మాత్రం సాధ్యంకావ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలున్నా... ప్ర‌ధానంగా ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో స‌రైన మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డం... ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూప‌క‌పోవ‌డమేనంటున్నారు ఉన్న‌తాధికారులు. అయితే స‌మ‌స్య‌ల‌ను షార్ట్ అవుట్ చేయ‌డానికి నాలుగు క‌మిటీల‌ను వేసిన ప్ర‌భుత్వం...స‌రైన నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. మొద‌ట్లో న‌లుగురు అధికారుల‌తో ఒక‌ క‌మిటీ...ఆ త‌ర్వాత ఇంజనీర్లతో మ‌రో క‌మిటీ వేసి ప‌క్క‌న‌పెట్టేశారు. మంత్రులు య‌న‌మ‌ల‌, నారాయ‌ణ‌ల‌ను రంగంలోకి దింపినా.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో... ఫైన‌ల్ గా ఐదుగురు సీనియ‌ర్ అధికారుల‌తో మ‌రో క‌మిటీని వేసింది ప్రభుత్వం. అయినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేక‌పోవ‌డంతో...మ‌రోసారి చంద్ర‌బాబే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ఉద్యోగుల త‌ర‌లింపుపై ఉన్న‌తస్థాయి స‌మీక్ష జ‌రిపి....ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలంటూ ఆదేశించారు. అయితే ఉద్యోగుల‌ను మాత్రం వేధింపుల‌కు గురిచేయొద్ద‌ని సూచించారు. ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చ‌డంతోపాటు, కార్యాల‌యాల త‌ర‌లింపుపై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. అయితే రాష్ట్ర ప‌రిస్థితిని, ఉద్యోగుల ఇబ్బందుల‌ను అర్థంచేసుకుని, అద్దెల విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హరించాల‌ని య‌జ‌మానుల‌కు బాబు విజ్ఞ‌ప్తిచేశారు. అయినా ఇంకా అనేక సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు ఉద్యోగులు. దాదాపు 20వేల ఉద్యోగులు హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి ఉంటుంద‌ని...వీరికి అవసరమైన గృహాలు, మౌలిక వ‌స‌తులు సమకూర్చాకే...త‌ర‌లించాలంటూ ప‌ట్టుబ‌డుతున్నారు. పైగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ మ‌ధ్య‌లో త‌ర‌లిస్తే... త‌మ పిల్లల చ‌దువులు ఏం కావాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తో సమానంగా హౌస్ అలవెన్స్, 371డి ఆర్టికల్ పై స్పష్టత వ‌చ్చాకే త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాలంటున్నారు ఉద్యోగులు. దాంతో చంద్ర‌బాబు ఆశిస్తున్నట్లుగా కార్యాల‌యాలు, ఉద్యోగుల త‌ర‌లింపు వేగం పుంజుకుంటుందా...లేదా అన్న అనుమానాలు రిపీట్ అవుతున్నాయి  

బీహార్ లో జనతా పరివార్ కే విజయావకాశాలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుండే ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి మొదలయిపోయింది. ఇప్పుడు ఎన్నికల గంట కూడా మ్రోగింది. ఈ ఎన్నికలలో ఏ పార్టీ లేదా ఏ కూటమి విజయం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అందుకే వివిధ మీడియా సంస్థలు సర్వేలు మొదలుపెట్టేశాయి. ఇండియా టీవీ-సి ఓటర్ అనే రెండు సంస్థలు నిర్వహించిన తాజా సర్వే ప్రకారం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు కలిసి ఏర్పాటు చేసుకొన్న జనతా పరివార్ కూటమి, దానితో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలున్నట్లు వెల్లడయింది. మొత్తం 243 సీట్లలో జనత పరివార్ 116-132 సీట్లు వరకు గెలుచుకోవచ్చునని తెలిపింది. ఎన్డీయే కూటమికి సుమారు 94-110 సీట్లు వరకు రావచ్చని తెలిపింది. ఆగస్ట్ నెలాఖరు-సెప్టెంబర్ మొదటి వారంలో బీహార్ లోని మొత్తం 243 నియోజక వర్గాలలో సర్వే నిర్వహించి మొత్తం 10,638 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలు సేకరించినట్లు తెలిపింది.   అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ ఓటర్ల ఆలోచనా సరళి కూడా మారే అవకాశం ఉంది. జనతా పరివార్, ఎన్డీయే కూటములలో లుకలుకలు, ములాయం సింగ్ ఒంటరిగా బరిలోకి దిగడం, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజీ, పార్టీల ప్రచార వ్యూహాలు వంటి అనేక అంశాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అదీ గాక ఎన్నికలు ఐదు దశలలో జరుగుతున్నందున పార్టీల జయాపజయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఏమయినప్పటికీ నవంబర్ 8న ఫలితాలు వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.

విద్యుత్ ఉద్యోగుల సమస్యకి హైకోర్టు పరిష్కార మార్గం

  తెలంగాణాలో వివిధ విద్యుత్ సంస్థల నుండి సుమారు 1200 మంది ఆంధ్రా మూలాలు ఉన్న ఉద్యోగులను స్థానికత కారణంగా ఉద్యోగాలలో నుంచి తొలగించబడ్డారు. తెలంగాణా ప్రభుత్వం వారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పజెప్పింది. కానీ వారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వీకరించలేదు. తామందరం తెలంగాణా విద్యుత్ సంస్థల్లోనే పనిచేయాలనుకొంటున్నట్లు ఉద్యోగులు హైకోర్టుకి విన్నవించుకోవడంతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. కానీ అందుకు విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో గత నాలుగు నెలలుగా వారికి జీతాలు కూడా అందడం లేదు. రెండు ప్రభుత్వాల పంతాలు పట్టింపుల వలన మధ్యలో ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్ధిక సమస్యలు, మనో వేదనకి గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు.   ఈ సమస్య పరిష్కారానికి హైకోర్టే ఒక మధ్యే మార్గం సూచించింది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన చెరో నలుగురు ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కమిటీకి రెండు రాష్ట్రాలకు చెందని ఒక మాజీ న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించబోతున్నట్లు తెలిపింది. కనుక రెండు ప్రభుత్వాలు ఈ కమిటీ కోసం తమ ప్రతినిధుల పేర్లను శుక్రవారంలోగా సూచించాలని ఆదేశించింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యపై ఆ కమిటీ తీసుకొనే నిర్ణయానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కనీసం ఈవిధంగానయినా ఉద్యోగుల సమస్య పరిష్కారం అయితే వారు, వారి కుటుంబాలు ఒడ్డున పడతారు.

వినూత్న పంధాలో ఉద్యమం నడిపిస్తున్న హార్దిక్ పటేల్

  గుజరాత్ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ తన ఉద్యమాన్ని వినాశకర మార్గంలో ముందుకు నడిపిస్తున్నట్లు కనబడుతోంది. ఆయన ఉద్యమం మొదలుపెట్టిన మూడవరోజే గుజరాత్ రాష్ట్రంలో విద్వంసకర రూపం దాల్చడంతో దానికి తొమ్మిది మంది బలయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.   మళ్ళీ ఇప్పుడు అతను మరొక విద్వంసక ప్రయత్నం చేస్తున్నాడు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారందరూ బ్యాంకుల్లో దాచుకొన్న తమ డబ్బుని వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఆర్ధిక సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా మోడీ ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుందని చెపుతున్నారు. ఒక విధంగా అతని ఆలోచన అద్భుతంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ దాని వలన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో వ్యాపార మరియు ఇతర రంగాలలో పటేల్ సామాజిక వర్గమే ఆధిపత్యం కలిగి ఉంది.   ఒక అంచనా ప్రకారం గుజరాత్ లో వివిధ బ్యాంకులలో పటేల్ సామాజిక వర్గానికి సుమారు 70లక్షల ఖాతాలున్నాయి. వాటిలో కనీసం రూ.350 కోట్లు ఉంటాయని అంచనా. కానీ పటేల్ సామాజిక వర్గం ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నందున ఆ అంచనాలకు మించి డబ్బు నిల్వలు ఉండి ఉండవచ్చును. దానిని వారు వెనక్కి తీసుకోవడం మొదలుపెడితే బ్యాంకులు కుప్ప కూలే ప్రమాదం ఉంది. ఇటువంటి వినాశకర ఆలోచనలకు తాము మద్దతు ఈయలేమని గుజరాత్ వాణిజ్య మండలి తేల్చి చెప్పింది. కానీ హార్దిక్ పటేల్ తన సామాజిక వర్గానికి ఇచ్చిన ఈ పిలుపు ద్వారా వారే సమాజాన్ని శాసించే స్థితిలో ఉన్నారని దృవీకరించినట్లయింది. అటువంటప్పుడు వారికి కూడా రిజర్వేషన్లు కావాలని హార్దిక్ పటేల్ ఎందుకు పోరాటం చేస్తున్నాడు? అతని పోరాటం వెనుక ఎవరున్నారు? వారి ఉద్దేశ్యాలేమిటి? అనే ప్రశ్నలు అతని పోరాటంలో చిత్తశుద్ధిని శంఖించేలా చేస్తున్నాయి.

సోనియా పదవీ కాలం పొడుగింపు ఎందుకో?

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిన్న డిల్లీలో జరిగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలాన్ని మరో ఏడాది పెంచుతూ అందులో నిర్ణయం తీసుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేప్పట్టాలని చాలా ఉత్సాహపడుతుంటే సోనియా గాంధీ పదవీ కాలం మరో ఏడాదిపాటు పొడిగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పలేదేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం పొందుతూనే ఉంది. వచ్చే నెల జరుగనున్న బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ జనతా పరివార్ చెయ్యి పట్టుకొంది. లాలూ, నితీష్ కుమార్ చెరొక 100 సీట్లు పంచుకొని, మిగిలిన 40 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో బీజేపీని, కొత్తగా ఏర్పడిన వామపక్ష కూటమిని, సమాజ్ వాదీ పార్టీని డ్డీకొని ఆ 40 సీట్లయినా గెలుస్తుందో లేదో అనుమానమే. ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ పరాభవం ఎదురయితే ఆ అప్రదిష్ట రాహుల్ గాంధీపై పడకూడదనే ఉద్దేశ్యంతోనే బహుశః ఆయనని అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదేమో? కానీ బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. మరి అప్పుడు కూడా రాహుల్ గాంధీని ఇలాగే కాంగ్రెస్ పార్టీ దాచి పెట్టుకొంటుందా? చూడాలి.

సీట్ల కోసం పాశ్వాన్-జితన్ రామ్ మంజీ ఫైట్

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నానాటికీ రాజకీయ పార్టీలలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. జనతా పరివార్ నుండి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ బయటకు వెళ్లిపోయి ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన్ని వెనక్కి తిరిగి రప్పించేందుకు లాలూ, నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి.   ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీకి, రామ్ విలాశ్ పాశ్వాన్ కి మధ్య సీట్ల పంపకాలలో గొడవలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగుతున్న రామ్ విలాశ్ పాశ్వాన్ తన లోక్ జన శక్తి పార్టీకి 75 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. జితన్ రామ్ మంజీ కూడా తను కొత్తగా స్థాపించిన హిందుస్తానీ అవామీ మోర్చా లో ఉన్న 19మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించాలని ఇంకా అదనంగా మరికొన్ని సీట్లు కూడా కేతాయిన్చాలాని పట్టుబడుతున్నారు. తమ పార్టీకి తగినన్ని సీట్లు రాకుండా పాశ్వాన్ అడ్డుపడుతున్నారని జితన్ రామ్ మంజీ ఆరోపిస్తున్నారు.   "దళితుల సమస్యల గురించి ఏనాడు మాట్లాడని పాశ్వాన్ తను దళిత ప్రతినిధినని చెప్పుకొంటూ ఏకంగా 75 సీట్లు కోరడం చాలా విచిత్రంగా ఉంది. అసలు లోక్ జన శక్తి పార్టీ ఇంతవరకు ఒక్క స్థానంలో గెలవలేకపోయింది. పాశ్వాన్ కోసం మా పార్టీని పక్కనబెడితే ఎన్డీయే కూటమికే నఃస్తం కలుగుతుంది,” అని జితన్ రామ్ మంజీ బీజేపీ అధిష్టాన్ని హెచ్చరించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు తమ ఎన్డీయే కూటమిలో ఇటువంటి గొడవలు మొదలవడంతో బీజేపీ అధిష్టానం వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.   ఈసారి బీహార్ ఎన్నికలలో బీజేపీ-జనతా పరివార్ దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్ష కూటమిని, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎదుర్కొని విజయం సాధించాల్సి ఉంటుంది.

మా అబ్బాయి చాలా గ్రేట్: సోనియా గాంధీ

  సుమారు రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి కూడా శలవుపెట్టి విదేశాలలో ‘చార్జింగ్’ చేసుకొని వచ్చిన రాహుల్ గాంధీ భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలని వ్యతిరేకిస్తూ గట్టిగానే పోరాడారు. రాహుల్ గాంధీ చేసిన పోరాటం వలననే మోడీ ప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకోవలసి వచ్చిందని సోనియా గాంధీ ఏ.ఐ.సి.సి. సమావేశంలో చెప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ భూసేకరణ బిల్లులో సవరణలను వ్యతిరేకిస్తూ కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే పోరాడలేదు. దేశంలో ప్రతిపక్షాలన్నీ దానిని తీవ్రంగా వ్యతిరేకించినందునే మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. కానీ సోనియాగాంధీ ఆ ఖ్యాతిని తన ముద్దుల కొడుక్కి కట్టబెట్టుకొన్నారు.   రాహుల్ గాంధీకి నిజంగా అంత పోరాటపటిమ, మోడీని నిలువరించే దైర్య సాహాసాలు ఉన్నట్లయితే త్వరలో జరుగబోయే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేత ఒంటరిగా పోటీ చేయించి దానికి విజయం సాధించి చూపినట్లయితే అందరూ అతని పోరాట పటిమను మెచ్చుకొనేవారు. కానీ బీహార్ లో ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేక ‘జనతా పరివార్’ విదిలించిన 40 సీట్లతో సర్దుకుబోతున్నారు. అంతేకాదు, తన తల్లి చేతుల్లో నుండి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొనేందుకు భయపడటంతో మళ్ళీ ఆమె పదవీ కాలం మరొక ఏడాదిపాటు పొడిగిస్తూ ఏ.ఐ.సి.సి. నిర్ణయం తీసుకొంది. అటువంటి రాహుల్ గాంధీని చూసి సోనియా గాంధీ మురిసిపోవడం దేనికో అర్ధం కాదు.

పాపం రాహుల్ కోరికలు తీరతాయా?

  పాపం రాహుల్ గాంధీ కోరికలు గొంతెమ్మ కోరికల్లా తీరుతాయో లేదో అన్న సందేహం మొదలవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తన పుత్ర రత్నాన్ని పీఎం చేద్దామని ఎంతో ప్రయత్నించింది. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా చాలా ఎదురుచూశాడు. కానీ అతని ఆశ మాత్రం తీరలేదు. పాపం అతనికోసం సోనియమ్మ ఏకంగా ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని కూడా విడదీసింది. కానీ ఫలితం శూన్యం. అది పోతే పోయింది ఇప్పుడు కనీసం కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయినా దక్కుతుందేమో అని ఆశగా ఎదురుచూసిన రాహుల్ కు నిరాశే ఎదురైంది. అసలు ఈ యేడాది డిసెంబర్‌ నాటికి సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. అయితే ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి సోనియా పదవీకాలాన్నే మరో ఏడాది పాటు పొడిగించాలని వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ అధ్యక్షు పదవి చేపట్టడానికి మరో ఏడాది పట్టనుంది.  ఇప్పుడు అసలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రాహులు గాంధీ చేతిలో పెడితే అసలుకే ఎసరోస్తుందని ఆలోచించే నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గారి సామర్థ్యం చూసి అప్పుడే విమర్శలు వచ్చాయి. అందులోనూ ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో.. 2017లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ బరువు బాధ్యతలు రాహుల్ పై పెడితే మొదటికే మోసం వస్తుందని తలచి వచ్చే ఏడాది రాహుల్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సోనియానే పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరి వచ్చే ఏడాది అయినా రాహుల్ గాంధీ కోరిక తీరుతుందో? లేదో?అప్పుడు కూడా మరో ఏడాది అంటూ పొడిగిస్తారో చూడాలంటే ఏడాది ఆగాల్సిందే.

నేడో, రేపో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ?

  నేడో, రేపో బీహార్ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత బీహార్ శాసనసభ పదవీ కాలం నవంబర్ 29తో ముగియబోతోంది. కనుక వచ్చే నెల మొదటి లేదా రెండవ వారం నుండి ఐదు దశలలో బీహార్ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికల ఫలితాలను ప్రకటించవచ్చును. అయితే ఈ ఎన్నికల కోసం బీహార్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆరు నెలల ముందు నుండే సన్నాహాలు ప్రారంభించాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తున్న జీతన్ రామ్ మంజీని బలవంతంగా కుర్చీలో నుండి దింపేసి నితీష్ కుమార్ ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఆ తరువాత ఆరు పార్టీలను కూడగట్టి జనతా పరివార్ అనే కూటమిని ఏర్పాటు చేసారు. కానీ ఈ మధ్యనే దానిలో నుంచి సమాజ్ వాదీ పార్టీ తప్పుకొని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.   ఈసారి బీహార్ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఓటర్లకు చాలా పెద్ద తాయిలమే ఎర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీని మరో రూ.40, 000 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు అసంఘటితంగా ఉన్న వామపక్షాలన్నీ ఈసారి చేతులు కలిపాయి. ఈ ఎన్నికలలో మతతత్వ బీజేపీని, కులతత్వ ‘జనతా పరివార్’ని వాటితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీని, ఒంటరిగా బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీని ఓడిస్తామని వామపక్ష కూటమి చెపుతోంది. కానీ సాధారణంగా ఎన్నికలలో ఇన్ని పార్టీలు, కూటములు బరిలో ఉన్నట్లయితే ప్రజల ఓట్లు చీలుతుంటాయి. కనుక బీహార్ ఎన్నికలలో కూడా అదే జరుగవచ్చును. ఎవరికీ పూర్తి మెజార్టీ రానట్లయితే బీహార్ రాజకీయాలు ఇంకా దిగజారిపోవచ్చును.

పోరు పడలేకే నరసింహన్ రాజీనామా చేస్తున్నారా?

రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహస్ ను నియమించారు. అయితే విడిపోయిన కొన్ని రోజుల వరకూ బానే ఉన్నా తరువాత నుండే అసలు సమస్య మొదలైంది. రెండు రాష్ట్రాలు ఏదో ఒక వివాదం సృష్టించుకోవడం..  దానిపై వివాదాలు చేసుకోవడం.. దీని పరిష్కారం కోసం గవర్నర్ ను ఆశ్రయించడం.. ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉండడం సరిపోయేది. కానీ ఎప్పుడైతే నోటుకు ఓటు కేసు బయటకు వచ్చిందో అప్పుటినుండి గవర్నర్ కు మరింత తలనొప్పి ఎక్కువైందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ అనుకూలమంటూ ఏపీ.. ఏపీకి అనుకూలంగా ఉన్నారంటూ తెలంగాణ వాదులు ఇద్దరు గవర్నపై విమర్శలు చేసినోళ్లే. ఏపీకి సంబంధించిన అంశాలపై తెలంగాణ సర్కారుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారం.. సెక్షన్ 8 వల్ల  ఏపీకి గవర్నర్ కు మధ్య దూరం ఎక్కువైందనే చెప్పాలి. అంతేకాక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని గవర్నర్ తప్పుపట్టటం.. ఆయన తీరుపై కేంద్రానికి ఇచ్చిన నివేదికతో ఇటు కేసీఆర్ తో గొడవ వచ్చిపడింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన గొడవల పరిణామాల నేపథ్యంలో ఒకానొక సందర్భంలో నరసింహన్ ను తప్పించే అవకాశం ఉందన్నవార్తలు కూడా వచ్చాయి. కాని అది జరగలేదు. అయితే ఇప్పుడు నరసింహనే స్వయంగా తనకు తానుగా పదవి నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆమధ్య ఆగస్టు 15న ఆయన చేసిన నిరాశాపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని అంటున్నారు. ఎందుకంటే గతంలో గవర్నర్ ఇచ్చిన విందులకు ఇద్దరు ముఖ్యమంత్రులలో ఒకరైనా హాజరయ్యేవారు. కాని ఆగస్టు 15న రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టటంతో తనకు తానుగా గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని గవర్నర్ యోచిస్తున్నట్లుగా వాదన వినిపిస్తోంది. మరోవైపు నరసింహనే స్వయంగా పదవి నుండి తప్పుకోవాలని చూస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించాలంటే అందుకు న్యాయనిపుణుడైన వ్యక్తిని గవర్నర్ గా ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్నసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన అయితే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా సరిపోతారని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పోరు పడలేకే నరసింహన్ పాపం తనకు తానుగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొత్తగా వచ్చే గవర్నర్ ఎంతవరకూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గిల్లికజ్జాలను తీర్చుతారో చూడాలి.

విజయవాడ మెట్రో పట్టాలెక్కబోతుందా?

  విజయవాడ మెట్రో రైలు పట్టాలెక్కబోతుందా ? మెట్రో రైలు నిర్మాణం పై కేంద్రం సమాధాన పడిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అనుకున్న దగ్గర నుండి ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై కేంద్రం కూడా సముఖత చూపలేదు. విజయవాడలో మెట్రో నిర్మించాలంటే దానికి 20 లక్షల పైగా జనాభా ఉండాలని.. అంత జనాభా లేదు కాబట్టి విజయవాడకి మెట్రో అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాగైనా మెట్రోని నిర్మించాలని దీని నిర్మాణానికి కావలసిన అనుమతులు.. వ్యయం గురించి చాలా కష్టపడుతున్నారు. ముందు కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తుందని భావించినా తరువాతం అంత సముఖత చూపకపోవండతో చంద్రబాబే రంగంలోకి దిగి పట్టువీడని విక్కమార్కుడిలా ప్రయత్నిస్తుండటంతో ఈప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి మెట్రో శ్రీధరన్ తో కూడా ఆయన చర్చించారు. అంతేకాదు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విజయవాడ మెట్రోపై లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా శ్రీధరన్ పూర్తిస్థాయిలో సమాధానాలు చెప్పడంతో ఆ వివరణలకు కేంద్రం కూడా సమాధానపడినట్లు సమాచారం. దీంతో కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో ప్రాజెక్టు వేగం పుంజుకుంటుంది ఈ నేపథ్యంలో మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసేశారు. దీంతో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే మెట్రో సమావేశంలో రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2018 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక ఎటువంటి ఎలైన్ మెంట్ మార్పు లేకుండానే.. బస్టాండ్ నుంచి బందరు రోడ్డు వరకు రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు వరకు మొదటి దశలో 26 కిలోమీటర్లు నిర్మాణానికి రూట్ క్లియర్ అయినట్టు సమాచారం. కాగా ప్రముఖ జపాన్ సంస్థ జమైకా మెట్రో నిర్మాణానికి కావాల్సిన సహాయం అందిస్తుంది.. దానితో పాటు కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా సమకూర్చుకునేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రం అయిపోయింది.. ఇప్పుడు భాష

  తెలంగాణ ప్రాంతానికి.. ప్రజలకు అన్యాయం జరిగిపోతుందంటూ.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎలాంటి మొహమాటం లేకుండా తెలంగాణ ప్రభుత్వం అప్పటి వరకూ ఒకటిగా ఉన్న శాఖలను రెండుగా చీల్చేసింది. ఒక్క హైకోర్టు మినహా తెలంగాణ పోలీస్ వ్యవస్థ.. తెలంగాణ అసెంబ్లీ.. టీఆర్ఎస్ ఆర్టీసీ ఇలా ఎన్నో మార్పుచేసేశారు. దీనిలో భాగంగానే విద్యుత్ ఉద్యోగుల బదిలీల పేరిట వాళ్లంతట వాళ్లే ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలీవింగ్ కింద పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.. అటు కేంద్రం మాటను కూడా పెడవ చెవిన పెట్టేసింది టీ సర్కార్. అన్నీ తమకు వీలుగా మార్చేసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా సంతృప్తి కలగలేదేమో ఇప్పుడు భాషను కూడా వేరు చేయాలని.. మరో దుందుడుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భాష అనేది ఒక ప్రత్యేకమైన భాష అన్నట్టు.. దానికి ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని టీసర్కార్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి కాళోజీ జయంతి అంటే సెప్టెంబరు 9న  తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా ఈ తెలంగాణ భాషా దినోత్సవం చేయాలని ఇందులో తెలంగాణ భాష గురించి చర్చలు.. వ్యాస రచన పోటీలు నిర్వహించాలని చూస్తోంది.   రాష్ట్ర విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఎన్నో వివాదాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని గొడవలు జరిగినా ఒక రకంగా ఇరురాష్ట్రాలు కాస్తంత కలిసి ఉండటానికి ప్రధాన కారణం భాష కూడా. రాష్ట్రాలు వేరైనా మాట్లాడేది ఒకే భాష.. అందుకే తెలుగు రాష్ట్రాలు అని కూడా వాడుకలో చేరిపోయింది. రెండు ప్రాంతాల వారి మధ్య అనుబంధాన్ని సజీవంగా ఉంచగల ఒకే ఒక అంశం.. భాష మాత్రమే కాగా.. తాజాగా ఆ బంధాన్ని కూడా తెలంగాణ సర్కారు పుటుక్కున తుంచేసింది. ఎన్నో అంశాల్లో ఒంటెద్దు పోకడని అనుసరించే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భాష ను కూడా మార్చేసి.. తెలుగు అక్షరమాలను కుదించి.. అదే తెలంగాణ భాష అని తమ కంటూ ఓ భాషను కూడా సృష్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు..

గురువులను కూడా వదిలిపెట్టడు అతను?

  మరే దేశంలోను చెప్పని విధంగా మన దేశంలో మాత్రమే ‘మాతృదేవో భవ, పితృదేవో భవ’ అని చెప్పిన తరువాత ‘ఆచార్య దేవో భవ’ అని చెపుతుంటారు. అంటే తల్లి తండ్రుల తరువాత స్థానం గురువుదేనని అర్ధం అవుతోంది. పిల్లలకి ఈ సువిశాల ప్రపంచాన్ని పరిచయం చేసే వ్యక్తి గురువు. వారి ఉజ్వలమయిన జీవితాలకు బాటలు పరిచే మహనీయుడు గురువు. అందుకే గురువుకి అంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తుంటారు.   మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం తన చివరి క్షణం వరకు కూడా పిల్లలకు పాఠాలు చెపుతూ కన్ను మూసి గురువుగా తన జన్మచరితార్ధం చేసుకొన్నారు. దేశంలో కెల్లా అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంతటివ్యక్తి, ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా కళాశాలలో పిల్లలకి పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారంటే రాష్ట్రపతి కంటే గురువే గొప్పవారని ఆయన కూడా భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. నేడు దేశ వ్యాప్తంగా పిల్లలు,పెద్దలు అందరూ తమ గురువులను స్మరించుకొని, సన్మానించుకొంటున్నారు.   కానీ ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరొకదారి అనే నానుడి బహుశః దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళవంటి వల్లనే ఏర్పడిందేమో? ఆయన దేవుళ్ళని వదిలి పెట్టలేదు చివరికి గురువులను కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఎప్పటి లాగే గురువు గురించి కూడా కొన్ని వంకర మాటలు పలికారు. “నేను నా జీవితంలో ఒక్కరోజు కూడా నా గురువుల వలన సంతోషంగా లేను. కనుక నేను ‘హ్యాపీ టీచర్స్ డే’ అని వారిని అభినందించలేను” అని ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఇటువంటి వ్యక్తిని ఏమనాలి?

అందుకే అచ్చెం నాయుడు అలాగన్నారేమో?

  శాసనసభ సమావేశాలు సజావుగా సాగనీయాలంటే చివరి రోజయిన శుక్రవారంనాడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి షరతు విధించడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభ తను చెప్పినట్లు నడవాలనుకొంటే అది సాధ్యం కాదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేస్తున్నప్పటికీ జగన్ తన పట్టు విడవలేదు. దానితో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే వైకాపా నేతలు యదావిధిగా సభను స్తంభింపజేసే ప్రయత్నాలు చేసారు.   శాసనసభ మొదటిసారి వాయిదా పడిన తరువాత బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్వయంగా జగన్ వద్దకు వెళ్లి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కానీ ఓటుకి నోటు కేసు గురించి సభలో చర్చకు అనుమతిస్తేనే సహకరిస్తామని జగన్ చెప్పడంతో ఆయన వెనుతిరిగారు. ఈ విషయాన్ని జగన్ కి చెందిన మీడియాలో ప్రచురించుకొన్నారు. అంటే జగన్ తను కోరినట్లు సభా కార్యక్రమాలు జరుగకపోతే సభ సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతామని చెప్పడమే కాక ఆ విషయాన్ని తన మీడియాలో కూడా ప్రచురించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అందులో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేయకుండా, తన రాజకీయ కక్షల కోసం సమయం కేటాయించమని పట్టుబట్టడం, అందుకు స్పీకర్ ఒప్పుకోకపోతే సభ జరగనీయకుండా అడ్డుపడుతామని హెచ్చరించడం, ఆ సంగతిని మళ్ళీ తన మీడియాలో గొప్పగా ప్రచురించుకోవడం చూస్తుంటే మంత్రి అచ్చెం నాయుడు వైకాపాపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిజమేనేమో అనే అనుమానం కలుగడం సహజం.

జగన్ ప్రత్యేక దీక్షకి విఘ్నం

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ హడావుడిగా ఏదో ఒక ప్రకటన చేసేయడం వైకాపాకి అగ్నిపరీక్షగా మారిందని చెప్పుకోవచ్చును. ఆయన ఎప్పుడూ ఏదో ఒక ధర్నా లేదా బంద్ నిర్వహించబోతున్నట్లు హడావుడిగా ప్రకటించేస్తుంటారు. ఆ తరువాత పార్టీలో సీనియర్లు దానిని వాయిదా వేయడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రత్యేక హోదా కోరుతూ క్రిందటి నెల 28న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని జగన్ ప్రకటించేశారు. కానీ ఆరోజున మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో బంద్ ని మర్నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆ మరునాడు రాఖీ పండుగ కావడంతో మళ్ళీ ఇబ్బంది వచ్చింది. కానీ అన్నిసార్లు వాయిదా వేస్తే ప్రజలకి, అధికార పార్టీకి కూడా చులకనవుతామనే ఉద్దేశ్యంతో బలవంతంగా రాఖీ పండుగనాడే వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించింది. కానీ ఆరోజు రాఖీ పండుగ సందర్భంగా అనేక కార్యాలయాలు, దుఖాణాలు మూసి ఉండటంతో బంద్ ప్రభావం అంతగా కనబడలేదు.   మళ్ళీ మొన్న శాసనసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ఈనెల 15లోగా ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వం సాధించకపోతే 15నుండి గుంటూరులో ఆమరణ దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే సమస్య వచ్చి పడింది. ఈసారి ఆయన దీక్షకు సాక్షాత్ విఘ్నరాజు గణపతే అడ్డుపడ్డాడు. సెప్టెంబర్ 17వ తేదీన వినాయక చవితి పండుగ. ఆరోజు నుండి వరుసగా కనీసం 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి సమయంలో జగన్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నా పట్టించుకొనేవారు ఉండరు. అటువంటి సమయంలో జనసమీకరణ చేయడం కూడా చాలా కష్టమే. కనుక ఆయన ఆమరణ దీక్షని వాయిదా వేస్తున్నట్లు వైకపా ప్రకటించింది. ఆయన మళ్ళీ దీక్షకి ఎప్పుడు కూర్చోబోతున్నారో త్వరలో ప్రకటిస్తామని వైకాపా తెలియజేసింది.   వినాయక చవితి వెళ్ళగానే దసరా, ఆ తరువాత దీపావళి, క్రిస్మస్ ఇలాగ వరుసగా పండుగలు ఒకదాని తరువాత మరొకటి వచ్చేస్తాయి. ఈ పండుగ సమయంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలవబోతున్నాయి. కనుక ఈసారి దీక్షలు, ధర్నాలు చేస్తామని ప్రకటించే ముందు జగన్ ఓసారి పంచాంగం, సినిమా షెడ్యూల్స్ చెక్ చేసుకొని మరీ ప్రకటిస్తే ఈవిధంగా వాయిదాలు వేసుకోవలసిన అవస్థ ఎదురవదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.