కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర జరుగుతోందా..?

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి..? ఇది ఎవరో అనామకుడు చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలు. పార్టీలోకి కొత్త నాయకులు వస్తున్న వేళ..పార్టీ నేతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నాయని ఆయన బాంబు పేల్చారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రనాయక్ తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసి..రాష్ట్రపతి పాలన పెట్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రపన్నాయని ఆరోపించారు.   ఈ విషయాన్ని తనకు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారన్నారు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆయన తనకు ఫోన్ చేయగా ఇంటికి పిలిచానని, అక్కడే ఆయన తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఇదేం అన్యాయమని, రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడమే కాకుండా..వచ్చిన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతారని ఒవైసీ తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఏకమవుతాయని పదే పదే చెబుతున్నారని..దానికి ఈ కుట్రే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం మధ్యలో పారిపోతుందన్నారని చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు నిజమేనా లేదంటే ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేసే ఎత్తుగడ అన్నది త్వరలో తేలిపోనుంది. 

విజయ్ మాల్యా ముమ్మాటికీ నేరస్తుడే

బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు టోపి పెట్టి..బ్రిటన్‌కు పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ముమ్మాటికి నేరస్తుడేనని మరోసారి న్యాయస్థానం ప్రకటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ వినతి మేరకు ముంబైలోని ప్రత్యేక మనీల్యాండరింగ్ నేరాల విచారణ కోర్టు మాల్యాను ప్రకటిత నేరస్థుడిగా నిర్దారించింది. ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్లతో పాటు ఎస్‌బీఐ కన్సార్షియంకు 9,000 కోట్లకు పైగా బకాయిలు పడ్డారు మాల్యా.  దీంతో ఆయన్ను ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారుడిగా పలు బ్యాంకులు ప్రకటించాయి. తనకు అరెస్ట్ తప్పదని భావించిన మాల్యా ఈ ఏడాది మార్చి 2న గుట్టుచప్పుడు కాకుండా బ్రిటన్‌కు పారిపోయాడు.   ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనతో పాటు మరికొందరిపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు చేసింది. మాల్యాను ఇండియాకు రప్పించేందుకు చట్టపరంగా చర్యలు చేపట్టింది. పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుంది. అయితే ఇంటర్‌పోల్ అందుకు నిరాకరించడంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ఈడీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక మనీలాండరింగ్ నేరాల విచారణ కోర్టును ఆశ్రయించింది. మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో పాటు చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కూడా అనేక అరెస్ట్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇదివరకే అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ..దానిని ఆ వ్యక్తి పట్టించుకోకపోవడం, పరారైపోవడం, రహస్య ప్రాంతాల్లో దాక్కొవడం వంటి కారణాలతో న్యాయస్థానం మాల్యాను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించడంతో మాల్యాను భారత్‌‌కు రప్పించే చర్యల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరో వీలు చిక్కింది.

టోల్‌గేట్ వస్తే ఆగక్కర్లేదు..

జాతీయ రహదారులపై 150 స్పీడుతో దూసుకెళ్తుండగా సడెన్‌గా టోల్‌గేట్లు వస్తుంటాయి. ఎంతో స్పీడుతో వచ్చి టోల్‌గేట్ దగ్గర బారులు తీరాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. సరేలే అని ముందుకు వెళితే మరోక టోల్‌గేట్ తారసపడుతుంది. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జాంలు, పెట్రోల్ దుర్వినియోగం , కాలుష్యం వంటి వాటితో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.  దానికి తోడు చాలా మంది వాహనదారులు టోల్‌ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కోల్‌కతా ఐఐఎం, టీసీఐల అధ్యయనం ప్రకారం ఏడాదికి 21.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఎన్‌హెచ్ఏఐ కోల్పోతుందని అంచనా.   దీనిని గుర్తించిన భారత జాతీయ రహదారుల సంస్థ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ఫాస్టాగ్‌ అని పిలిచే ఈ విధానం ద్వారా వాహనాలేవైనా ఇక టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు సాంకేతిక విధానం ద్వారా పనిచేస్తుంది. దీనిని కలిగి ఉన్న వాహనాలు టోల్‌గేట్ మీదుగా వెళ్లగానే అక్కడ రుసుం ఎంత ఉందో ఆ మొత్తం ఫాస్టాగ్ ఖాతాలోంచి దానంతట అదే తీసుకుంటుంది. దీని వల్ల గేటు వద్ద ఆగకుండానే వాహనం వెళ్లిపోవచ్చు. ఈ విధానం ద్వారా సమయం, ఇంధనం రూపంలో చాలా డబ్బు ఆదా అవుతుంది.   దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన టోల్ కేంద్రాల నుంచి ఈ ఫాస్టాగ్ ఖాతా తీసుకోవచ్చు. దానిలో రూ. 100 నుంచి రూ. లక్ష వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చెల్లింపులను డెబిట్/క్రెడిట్, చెక్కులు, నెట్ బ్యాంకింగ్, ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీసీ, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి ఢిల్లీ-ముంబయి, ముంబయి-చెన్నై మార్గాల్లో 48 టోల్ కేంద్రాల్లో ఫాస్టాగ్ లేన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్ తీసుకునేవారందరికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని కూడా ఇచ్చేందుకు ఎన్‌హెచ్ఏఐకి కేంద్రం అనుమతినిచ్చింది. 

ఢిల్లీలో మళ్లీ సీఎం vs గవర్నర్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య గతంలో ఉన్న వివాదాలు సద్దుమణిగి వీరిద్దరూ కలిసిపోయారని అంతా భావించారు. కాని అది నిజం కాదని ఆ వివాదం నీవురుగప్పిన నిప్పులా ఉందని రుజువైంది.  గతేడాది ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ ప్రభుత్వం కిందకు రాని పోలీసు, శాంతిభద్రతలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించిన ఫైళ్లను తనకు పంపాలని లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్, కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీనికి అభ్యంతరం తెలిపిన కేజ్రీవాల్ ఎలాంటి ఫైళ్లను ఎల్జీ కార్యాలయానికి పంపనవసరం లేదని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. ఆ తర్వాత సీఎస్ నియామకం, జన్‌లోక్ పాల్ బిల్లు, డీఎంసీ సభ్యుల నియామకం, శాంతిభద్రతలు ఇలా ప్రతి అంశంలోనూ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నాయి. మరోసారి వీరిద్దరి వివాదం బయటకొచ్చింది..తమ ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అవినీతి నిరోధక శాఖ, సీబీఐ వంటి సంస్థలతో విచారణలు చేయిస్తూ తమను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ప్రధాని మోడీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌లపై కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆరోపణలతో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఓ లేఖను రాశారు. తమ ప్రభుత్వం ఆదివారం నాడు ప్రారంభించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని..అలాగే రికార్డు సమయంలో కళాశాల నిర్మాణం పూర్తి చేసినందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై కూడా విచారణ జరిపించాలని పేర్కొన్నారు. తాను, తన బృందం ప్రజల కోసం కష్టపడుతున్నామని..అయితే తాము చేసే ప్రతి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. చివరిగా మీ తమ్ముడిగా నాదో చిన్న సలహా..ప్రధాని అడుగులకు మడుగులొత్తుతూ మీరు రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు. అలా చేసినంత మాత్రాన మోడీ మిమ్మల్ని దేశానికి ఉపరాష్ట్రపతిని చేయబోరని గుర్తు పెట్టుకోండి. అంటూ లేఖలో తన నిరసనను వెళ్లగక్కారు.

కమల్‌నాథ్ నియామకం- కాంగ్రెస్ ఘోర తప్పిదం!

  దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అక్కడ తమ పార్టీని గెలిపించే బాధ్యతను సమర్థులకు అప్పగించడం పరిపాటి. కానీ కాంగ్రెస్ చేసిన ఓ నియామకం ఒకనాటి పాత గాయాలను రేపుతోంది. అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే... త్వరలో పంజాబ్‌, హర్యానాలలో జరగనున్న ఎన్నికలలో తమ పార్టీని గెలిపించే బాధ్యతను కమల్‌నాథ్‌కు అప్పగించారు సోనియాగాంధి. ఇందులో ఆశ్చర్యం ఏముంది? కమల్‌నాథ్, గాంధి కుటుంబానికి సన్నిహితుడు కదా అనవచ్చు. కానీ అసలు మతలబు ఇక్కడే ఉంది. 1984లో ఇందిరాగాంధి హత్యకు బదులుగా, దిల్లీలో సిక్కులను ఊచకోత కోశారు. ఇందులో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పాలు పంచుకున్నారన్నది ఒక అభియోగం. సదరు కాంగ్రెస్ నేతలలో కమల్‌నాథ్ ముఖ్యులు. రాజకీయ కారణాలైతేనేం, న్యాయవ్యవస్థలో జాప్యం వల్లనైతేనేం, తగినన్ని సాక్ష్యాలు లేకపోవడం వల్లనైతేనేం... కమల్‌నాథ్ ఇప్పటికీ దోషిగా రుజువు కాలేదు. తనకు ఏ పాపం తెలియదనీ కమల్‌నాథ్ చెబుతున్నా, సిక్కుల మనసుల్లో ఆయన పట్ల అపనమ్మకం అలాగే ఉంది. అలాంటి కమల్‌నాథ్‌కి ఇప్పుడు పంజాబు వ్యవహారాలను అప్పగించింది కాంగ్రెస్. ఈ విషయమై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.   పంజాబు ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా దుయ్యబడుతోంది. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అబ్యర్థిగా ఉన్న అమరేంద్ర సింగ్, ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీటారు. కమల్‌నాథ్‌కు పంజాబు పగ్గాలు అప్పగించడం అంటే పుండు మీద కారం చల్లడమే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజానికి ఈసారి పంజాబులో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకుంటుందని ఆశించారు. 2012 ఎన్నికలలో 117 సీట్లకుగాను 42 సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ ఈసారైనా కావల్సిన సంఖ్యాబలాన్ని సాధిస్తుందని ఊహించారు. దానికి తోడు పంజాబులో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోందంటూ వస్తున్న ‘ఉడతా పంజాబు’ సినిమాను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కానీ ఇంతలో కమల్‌నాథ్‌ నియామకంతో కాంగ్రెస్ తన విజయానికి తానే మోకాలడ్డినట్లు అయ్యింది.

అమెరికా కాల్పులతో వేడెక్కిన రాజకీయం

  దేశంలో వినాశనం జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే నేతల గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ మా అంతటి పెద్దన్నలు లేరని చెప్పుకునే అమెరికాలో సైతం ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తుంటే... ఏ దేశమేగినా నేతలు నీతులు ఒకే రీతిలో ఉంటాయని సర్దిచెప్పుకోవలసిందే! నిన్నటికి నిన్న, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పులతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అమెరికా చరిత్రలోనే అరుదైన నరమేధం అంటూ పరామర్శలు వెల్లువెత్తాయి. కానీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లింల గురించి తాను చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ఘటన ఊతం ఇస్తోందంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు ‘ఇస్లామిక్‌ ఉగ్రవాదం’ అనే పదాన్ని గుర్తించి తీరాలంటూ పట్టుపడుతున్నారు.   ముస్లింలను కొన్నాళ్లపాటు అమెరికాలోకి రాకుండా నిషేధించాలనీ, దేశంలో ఉన్న మసీదులని మూసివేయాలనీ, అమెరికా ముస్లింల మీద ఓ కన్నేసి ఉంచాలనీ... ఇలా ట్రంప్ ఒక దాని తరువాత ఒకటిగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే! మొదట్లో ఈ వ్యాఖ్యలకు అమెరికా జనం పెద్దగా ప్రతిస్పందించలేదు. కానీ పారిస్‌, బెల్జియం దేశాల్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలను బలపరిచేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉగ్రవాదుల గురించి పాశ్చాత్యులు భయపడిన ప్రతిసారీ, ఆ భయం ట్రంప్ బలంగా మారుతూ వచ్చింది. మొదట్లో అసలు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్షపదవికి పోరాడే అర్హతని సైతం సాధించలేడు అనుకున్న ట్రంప్ ఇప్పుడు... అధ్యక్ష పదవి వైపు దూసుకుపోతున్నాడు. మరోవైపు ట్రంప్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ కూడా, ఫ్లోరిడా కాల్పుల తరువాత కాస్త కఠినంగా మాట్లాడక తప్పదు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ ఫ్లోరిడా రాష్ట్రం హిల్లరీ క్లింటన్‌కే అనుకూలంగా ఉంది. అక్కడి ప్రజలను కనుక ట్రంప్‌ రెచ్చగొట్టి తనవైపుకి తిప్పుకుంటే, హిల్లరీకి తిప్పలు తప్పవు. ఫ్లోరిడా కాల్పులు స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుంటూ సాగాయి కాబట్టి, వారు కూడా ఇక మీదట ట్రంప్ వ్యాఖ్యలకు ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదం మీద పోరులో ట్రంప్ కథానాయకుడు అని కనుక అమెరికాలోని స్వలింగ సంపర్కులు భావిస్తే, ఓటింగ్ సరళి తారుమారు కాక తప్పదు. ఇన్నేసి భయాలను, భావాలను దృష్టిలో ఉంచుకుని.... హిల్లరీ క్లింటన్ ఎలా స్పందిస్తారో చూడాలి!

తెలంగాణ కాంగ్రెస్ చేయిజారిపోతోందా!

  2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏ వ్యూహంతో తెలంగాణను తీసుకువచ్చినా కానీ... అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీకి అడుగడుగునా గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. వారానికో వివాదం, రోజుకో పుకారుతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తెరాసలో చేరుతున్నారన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. కేసీఆర్‌తో వీరి మంతనాలు ముగిసాయనీ, ఇక లాంఛనంగా ‘చేయి’ జారిపోవడమే మిగిలిందనీ తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డి.శ్రీనివాస్, కేశవరావు వంటి సీనియర్ నాయకులను చేజార్చుకున్న కాంగ్రెస్‌కు గుత్తా ఎడబాటు మాయని గాయంగా మిగిలిపోనుంది.   ఇక వీరితో పాటుగా జి.వెంకటస్వామి కుమారులైన వినోద్‌, వివేక్‌లు కూడా గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో తమ పరిస్థితి మెరుగ్గానే ఉందని మురిసిపోయిన కాంగ్రెస్ నేతలకు తాజా వలసలు శరాఘాతంగా తోస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని తెదెపా వలసల వ్యూహంలో చిక్కుకుని చిక్కిపోయింది. 15 మంది ఎమ్మెల్యేల ఖాతా కాస్తా 3 దగ్గరకి వచ్చి ఆగింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలు మొదలైతే ఏమిటి పరిస్థితి అన్నది కాంగ్రెస్ నేతల ఆందోళన. 2014 ఎన్నికల అనంతరం 21 సీట్లతో కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సాధించింది. ప్రస్తుతానికి ఆ సంఖ్య కాస్తా 13కి దిగబడిపోయింది. మరి ఈ అంకెలు ఏ తీరానికి చేరుకుంటాయో, ప్రతిపక్ష హోదా సైతం ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం ఇప్పటి కాంగ్రెస్‌ది. అంతర్గత కుమ్ములాటలు, అధికార పట్ల ఆకర్షణ... ఆ పార్టీని బలహీనపరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకేనేమో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే కోదండరామ్‌ గొంతే బలంగా వినిపిస్తోంది.

ముద్రగడ కొద్దిగా నీళ్లు తాగారు.. అయోమయంలో ప్రభుత్వం..

  ముద్రగడ పద్మనాభం శనివారం ర్రాతి కొద్దిగా మంచినీళ్లు తీసుకున్నారని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం తన దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. అంతేకాదు తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని.. లేదంటే తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు దిగగా.. దానిని భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ముద్రగడ దీక్ష విరమించేది లేదని పట్టుబట్టి అలానే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారని.. పరీక్షలు చేయించుకుంటేనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని..  ఆహారం తీసుకోకపోవడం వల్ల ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు.   మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ముద్రగడ డిమాండ్లకు సానుకూలంగానే స్పందించింది. దీక్ష విరమించడానికి ముద్రగడ అంగీకరిస్తే తుని విధ్వంసం కేసును సిబిఐకి అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు. ఎంత ఖర్చైనా ముద్రగడకు చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిగారు అన్నారు. కానీ ముద్రగడ డిమాండ్ ప్రకారం.. నిందితులను విడుదల చేయడం వీలు కాదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలిపారు.   ఇదిలా ఉండగా ఇదే అదనుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ దీక్షను ఉపయోగించుకొని ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదులుతున్నారు. ఇక చిరంజీవి సహా పలువురు కాపునేతలు ముద్రగడకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఒకపక్క ముద్రగడ దీక్ష విరమింపజేయకపోవడం.. మరోవైపు నేతల విమర్శలతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడింది. మరి ముద్రగడ డిమాండ్ ప్రకారం.. ప్రభుత్వం నిందితులను విడుదల చేస్తుందా.. లేక వ్యూహాత్మక రచనలు ఏమైనా చేస్తుందా..లేక ముద్రగడ దీక్షను విరమిస్తారా.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

అప్పుడు.. భారత హోం శాఖను పాక్ "కంట్రోల్‌"లోకి తీసుకుందా..?

26/11 ఎటాక్..ముంబైపై దాడి.. ఇలా పేరేదైనా దేశ చరిత్రలో చీకటి రోజు అనదగ్గ సంఘటన. 2008 నవంబర్ 26వ తేదీన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడిలో 180 మందికిపైగా అమాయక ప్రజలు మృత్యువాత పడగా, మరో 700 మంది వరకు గాయపడ్డారు. నాడు ముష్కరులు సృష్టించిన భయోత్పాతాన్ని తలుచుకుంటే ఒక్క ముంబై వాసులే కాదు..దేశ ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. తాజాగా ఆ మానని గాయం మరోసారి రేగింది.   ఈ దాడుల సమయంలో మన హోంశాఖ ఉన్నతాధికారులు పాక్ ఆధీనంలో ఉన్నారని దాంతో పాటు దేశం తగలబడిపోతుంటే వీళ్లు పాక్ ఆతిథ్యంలో మునిగి తేలారంటూ సంచలన కథనాలు ప్రసారమవుతున్నాయి. భారత్‌పై ఉగ్రవాదులు దాడి చేస్తారని పాక్ అత్యున్నత అధికార వర్గానికి ముందే తెలుసన్నది ఆ వార్తల సారాంశం. అందుకే ఉగ్రవాదులు తమ పని కానిచ్చేందుకు ఆ అధికారులు పూర్తిగా సహకరించారని నిన్నటి నుంచి మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు కౌంటర్ టెర్రరిజం వింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత హోం శాఖ అధికారుల టీం పాకిస్థాన్‌కు వెళ్లింది.   వరుసగా 2006, 2007ల్లో పాక్‌లో పర్యటించిన ఈ బృందం మరోసారి 2008 నవంబర్‌ 24న ఆ దేశానికి వెళ్లింది. 25న చర్చలు జరగాల్సి ఉంది. కానీ పాక్ అధికారులు కావాలని ఆలస్యం చేసి..చర్చల తేదీని 26కు మార్చారు. 26న కసబ్ తదితరులతో కూడిన ఉగ్రవాదుల పడవ దేశ పశ్చిమ తీరం గుండా ముంబైలోకి ప్రవేశించి పని మొదలెట్టింది. దాడి విషయం తెలిసిన వెంటనే ఈ బృంద సభ్యులతో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నించారు. అయితే పాక్ అధికారులు చాలా తెలివిగా..మొబైల్ నెట్‌వర్క్ రాని ముర్రీ అనే ప్రాంతంలో వారిని ఉంచారు. ముంబైలో బలగాలను మోహరించినా వీరిని నడిపించే అధికారులు మాత్రం పాక్ వలలో చిక్కుకుపోయాయరని అప్పటి హోంశాఖ మాజీ అధికారి మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  

బుక్స్ మోసినట్లు.. బ్యాగ్‌లోతన గుండెను మోశాడు

  స్కూల్ స్టూడెంట్స్ బ్యాగ్‌లో బుక్స్ మోసినట్లు..ఒక వ్యక్తి తన గుండెను బ్యాగులో పెట్టుకుని మోశాడు. అమెరికాలోని మిచిగన్‌కు చెందిన 25 ఏళ్ల లార్కిన్ 16 ఏళ్ల వయసులో బాస్కెట్ బాల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అతనిని పరీక్షించిన వైద్యులు అతనికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఏఆర్‌వీడీగా పిలువబడే రైట్ వెంట్రిక్యూలర్ డిస్‌ప్లాసియా వ్యాధితో అతను బాధపడుతున్నట్టు గమనించారు. ఆ వ్యాధి వల్ల హార్ట్ బీట్ రెగ్యులర్‌గా ఉండదు. సడన్‌గా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనికి పరిష్కారం ఆలోచించిన వైద్యులు ఆ గుండెను తొలగించి కొత్త గుండెను అమర్చాలనుకున్నారు.   అయితే సమయానికి అతనికి సరిపడిన గుండె లభించపోవడంతో ప్రాణాలు నిలబెట్టడం కోసం కృత్రిమ గుండెను బిగించారు. ఆ హార్ట్ డివైస్‌ను సింక్కార్డియా ఫ్రీడమ్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్‌ లేదా బిగ్‌బ్లూగా పిలుస్తారు. బిగ్‌బ్లూ గుండె మిషన్ గాలిని కంప్రెస్డ్ రూపంలో పంపుతుంది. రెండు ట్యూబ్‌ల ద్వారా ఎయిర్ పంపింగ్ జరుగుతుంది. రెండు గుండె కవాటాలకు ఆ రెండు పైపులను తగిలిస్తారు. అయితే వీపు వెనుకాల ఉన్న మిషన్ ద్వారా గాలి గుండెకు చేరుతుంది. అలా ఆ గుండెను లార్కిన్ ఎప్పుడూ బ్యాగ్‌లా తన వెంట తీసుకెళ్లేవాడు. దాని వల్ల అతను సాధారణ జీవితాన్ని సాగించాడు. సుమారు 13.5 పౌండ్ల బరువున్న గుండెను దాదాపు 555 రోజులు మోశాడు. అయితే గత నెలలో లార్కిన్ గుండె మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. దీంతో సుమారు 17 నెలల పాటు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లైంది. ఇప్పుడతను బాస్కెట్‌బాల్ కూడా ఆడగలడు.

పాపం పసివాడు:విగ్రహంగా మారుతున్న బాలుడు

సువర్ణసుందరి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు శాపం కారణంగా రాయిలా మారుతుంటాడు..దేవలోకంలో ఉన్న ఒక పుష్పం తెచ్చి ఆయన తలపై పెడితేనే శాపం తీరుతుంది. నేపాల్‌లో ఓ బాలుడి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది..తోటిపిల్లలతో సరదాగా ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన వయస్సులో రమేశ్ కుమార్ అనే చిన్నారి అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు.   పదకొండేళ్ల బాలుడి శరీరంపై చర్మం ఉన్నట్టుండి ఊడిపోయి దాని స్థానంలో గట్టిగా, మందంగా చర్మం రావడంతో ఆ చిన్నారి తల్లడిల్లిపోతున్నాడు. ఇచ్‌థైసోసిస్ అనే వ్యాధి కారణంగా శరీరం వికృతంగా మారిపోవడంతో తోటి పిల్లలు కూడా అతనితో కలిసి ఆడుకోవడానికి కూడా భయపడుతున్నారు. పుట్టిన 15వ రోజు నుంచే రమేశ్‌కు చర్మం ఊడిపోవడం, గట్టిపడటం ప్రారంభమైంది. వయసు పెరిగే సరికి పరిస్థితి మరింత దారుణంగా తయారై కనీసం నిలబడటం, నడవడం కూడా కష్టంగా మారింది. పిల్లాడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యులకు చూపిస్తే వారానికి ఒకసారి యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించారని చిన్నారి తల్లి కంటతడితో చెప్పింది. కానీ వారికి ఆ ఇంజెక్షన్ ఇప్పించేంత స్థోమత లేదు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో బాలుడి వీడియోను చూసిన బ్రిటన్ గాయకురాలు జోస్‌స్టోప్ ఆ పసివాడికి బాసటగా నిలిచారు. ఆమె తన ఫౌండేషన్ ద్వారా రూ.1.33 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించింది. దీంతో బాలుడి పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది.

అన్నిదేశాలు మీదపడినా..ఐఎస్ ఆదాయం తగ్గడం లేదు

. ఉగ్రవాదానికి సరికొత్త భాష్యం చెబుతూ..మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది ఇస్లామిక్ స్టేట్. మిగిలిన ఉగ్రవాద సంస్థలకు ఐఎస్‌కు ఉన్న తేడా ఒక్కటే. అపార ఆదాయ వనరుల ద్వారా ప్రపంచంలోనే ధనిక తీవ్రవాద సంస్థగా ఐఎస్ పేరుగాంచింది. తద్వారా ఉగ్రవాదులకు వేతనాలు చెల్లించి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అందువల్లే అనేక మంది యువత ఇస్లామిక్ టెర్రరిజం వైపు ఆకర్షితులవుతున్నారు. మానవళి మనుగడకే ప్రమాదంగా మారిన ఐఎస్‌ను అణచివేయాల్సిన అవసరాన్ని గుర్తించిన అగ్రరాజ్యాలు ఉమ్మడిగా యుద్ధం ప్రకటించాయి. ఎంతగా ధ్వంసం చేసిననప్పటికి ఐఎస్ రాబడి ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా ట్రెజరీ శాఖ మంత్రి డానియెల్ గ్లేసర్  హౌస్‌ ఆఫ్ రిప్రజెంటివ్స్ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో ఈ విషయం ప్రపంచానికి వెల్లడైంది.   దీని ప్రకారం 2015లో ఐఎస్ రూ.6681 కోట్ల ఆదాయం సంపాదించిందని ఆయన తెలిపారు. ఇందులో సగం తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ విక్రయం ద్వారా సముపార్జించిందని తెలిపారు. స్ధానికుల నుంచి బలవంతపు వసూళ్ల ద్వారా రూ.350 మిలియన్ డాలర్ల ఆదాయం లభించిందన్నారు. 2014, 2015 ప్రారంభంలో ఇరాక్‌లోని తన అధీనంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి గణనీయ స్థాయిలో సుమారు రూ.3340.5 కోట్ల నిధులు పొందిందన్నారు. 2014లో కిడ్నాప్‌ల ద్వారా 20 నుంచి 45 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకున్న ఐఎస్..ఆ ప్రాంతంలో విదేశీయుల సంఖ్య తగ్గిపోవడంతో బాగా నష్టపోయిందని చెప్పారు.   ఇస్లామిక్ స్టేట్ చమురు, సహజవాయువు సరఫరా వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో సంకీర్ణ దళాలు జరిపిన దాడులు జరిపాయని..ఉగ్రవాద సంస్థ దాచి ఉంచిన నగదు నిల్వలపైన జరిపిన దాడుల ద్వారా రూ.688 కోట్లు ధ్వంసమయ్యిందన్నారు. అటు ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాలకు ప్రభుత్వ వేతనాలు పంపిణీ చేయకుండా ఇరాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇస్లామిక్ స్టేట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్థిక సంక్షోభం కారణంగా తన వద్ద పనిచేస్తున్న ఉగ్రవాదులకు ఐఎస్ వేతనాలు చెల్లించలేకపోతుండటంతో పలువురు ఆ సంస్థను వదిలిపెడుతున్నారని తెలిపారు.

చిరంజీవి "తీరని కోరిక" తీర్చబోతున్న కేసీఆర్‌

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. "గాడ్ ఫాదర్" లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన క్రమశిక్షణ, పట్టుదలతో మెగాస్టార్‌గా ఎదిగిన చరిత్ర ఆయన సొంతం. ఎన్ని రికార్డులున్నా, ఎన్ని ఘనతలు సాధించినా చిరంజీవికి ఒక తీరని కోరిక అలాగే మిగిలిపోయింది. అదే "స్టూడియో అధినేత" అన్నపేరు. పరిశ్రమను ఏకఛత్రాధిపత్యం కింద ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు సొంతంగా స్టూడియోలున్నాయి. నిర్మాత రామానాయుడుకి కూడా స్టూడియో ఉంది. వీళ్లంతా స్డూడియో ఓనర్లు అనిపించుకున్నారు. కాని ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా తనకు స్టూడియో లేకపోవడం చిరంజీవిని వేధిస్తోంది. వెండితెరపై వెలుగుతున్న కాలంలోనూ..కేంద్రమంత్రిగా పవర్‌లో ఉన్నపుడు కూడా స్టూడియో కట్టాలని చిరు తెగ ట్రై చేశాడు. కానీ అది అందని "ద్రాక్షే" అయ్యింది.   మొన్నామధ్య ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి చిరంజీవి  విశాఖలో స్టూడియో కట్టబోతున్నట్టు వార్తలు వినిపించినా..అవి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవి "తీరని కోరిక" తీర్చేందుకు ముందుకువచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చిరు స్టూడియో నిర్మించబోతున్నారని దానికి తన ఇంటిపేరు అయిన "కొణిదెల"ను ఖరారు చేశారని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ వందో సినిమా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించాల్సిందిగా చిరు, కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం. చిరు అడగటంతో అక్కడికక్కడే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన హామీ కార్యరూపం దాల్చితే చిరు తీరని కోరిక తీరినట్లే. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాలి.

సీఎంనే కంటతడి పెట్టించింది..

దేశంలో నానాటికి తగ్గిపోతున్న స్తీ, పురుష లింగ నిష్పత్తి గురించి మాట్లాడి సాక్షాత్తూ ముఖ్యమంత్రినే కంటతడి పెట్టించింది ఓ బాలిక. గుజరాత్‌లోని ఖేడా జిల్లా మహుదా పరిధిలోని హెరంజి గ్రామానికి చెందిన బాలిక అంబికా గోహెల్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో వారి స్కూలు ప్రాంగణంలో భ్రూణ హత్యల గురించి ఒక సభ జరిగింది. ఆ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబికా చదివి వినిపించింది.   తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, కాని ఆ అవకాశాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేదని మృత శిశువు ఆవేదనను కళ్లకు కట్టింది."నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలో నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తుంచుకో ఆడపిల్ల లేకుంటే ఇల్లు ఇల్లే కాదు" అంటూ భావోద్వేగంతో ఆ లేఖను చదివింది. అంబికా ఆ లేఖ చదువుతున్నంతసేపు వేదికపై కూర్చున్న ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరూ కంటతడి పెట్టారు. బాలిక ప్రసంగించిన వెంటనే సీఎం కూర్చీలోంచి లేచొచ్చి అంబికాను అప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలిక తనకు డాక్టర్ కావాలని ఉందని ఆనందీతో చెప్పడంతో అందుకు తగిన సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తానికి తన ప్రసంగంతో సీఎంనే చలించేలా చేసిన అంబికా అభినందనీయురాలు.  

రెండో పెళ్లి చేస్తామంటూ దోచేశారు..

వీలైనన్ని మార్గాల్లో సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి జాబితాలోకి పెళ్లిని కూడా చేర్చారు. యాభై ఏళ్ల వ్యక్తిని పెళ్లి పేరుతో మోసం చేసి ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌కు దిగి ఒళ్లు, ఇళ్లు గుల్ల చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పర్సోత్తమ్ మార్వియాకు మూడేళ్ల క్రితం భార్య మరణించింది. అతనికి ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భార్య మరణించినప్పటి నుంచి మానసిక వేదనలో ఉన్న తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని పిల్లలు నిర్ణయించారు. ఈ మేరకు వారు తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. పిల్లల కోరిక మేరకు అహ్మదాబాద్‌కు చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ షీలాను సంప్రదించాడు పర్సోత్తమ్. సంబంధాలు చూసుకోవడానికి షీలా ఆయన్ను అహ్మదాబాద్‌కు రమ్మంది. అక్కడ మంజుల అనే 37 సంవత్సరాల మహిళతో పాటు మరో ఆమెను చూపించింది. అయితే వారు నచ్చలేదని పర్సోత్తమ్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.   అయితే మంజుల పదేపదే ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని కోరింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీనికి భయపడిన పర్సోత్తమ్ తిరిగి అహ్మదాబాద్ వెళ్లి మంజులను కలిశాడు. ఆమె ఆయన్ను మౌంట్ అబూకి తీసుకువెళ్లి హోటల్ గదిలో మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చింది. పర్సోత్తమ్ మత్తులోకి జారుకున్న అనంతరం వేరోక మహిళతో కలిసి ఉన్నట్టుగా అసభ్యంగా ఫోటోలు తీసింది. అతని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, 12,000 రూపాయలు దోచేసి పారిపోయింది.   మత్తు వదిలిన తర్వాత జరిగిన మోసాన్ని గుర్తించిన పర్సోత్తమ్ తిరిగి అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ కుట్ర అక్కడితో ఆగలేదు.. పర్సోత్తమ్‌కు ఓ యువకుడు ఫోన్ చేసి అమ్మాయితో కలిసున్న ఫోటోలు ఉన్నాయని రూ.25 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫోటోలు సోషలో మీడియాతో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. కంగారుపడిన ఆయన చివరకు రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని, డబ్బు పట్టుకుని అహ్మదాబాద్‌కు పయనమయ్యాడు. తండ్రి ఆందోళనగా ఉండటాన్ని గమనించిన కొడుకు నిలదీయగా జరిగిన కథంతా చెప్పాడు. వెంటనే ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వలపన్ని మంజుల, షీలాతో పాటు మరోక మహిళను బెదిరించిన యువకుడిని అరెస్ట్ చేశారు.

కేరళ క్రీడా మంత్రులకు జనరల్ నాలెడ్జ్ నిల్..?

కేరళ క్రీడామంత్రులకు జనరల్ నాలెడ్జ్ లేదనుకుంటా..? మొన్న బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ ఆలీ మరణిస్తే ఆయన కేరళకు చెందిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు ఆ రాష్ట్ర ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి ఈసీ.జయరాజన్. ఆయనే అలా ఉంటే తాను రెండాకులు ఎక్కువే చదివానంటూ ముందుకు వచ్చారు కేరళ మాజీ క్రీడల మంత్రి సుధాకరన్. వివరాల్లోకి వెళితే జయరాజన్‌ను మర్యాద పూర్వకంగా కలవడానికి కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్, ప్రముఖ అథ్లెట్, అర్జున అవార్డు విన్నర్ అంజు బాబీ జార్జ్‌ వెళ్లారు. అయితే తనను అవినీతిపరురాలినని, గత ప్రభుత్వపు మనిషివని జయరాజన్ అవమానించారని ఆమె ఆరోపించారు.   దీంతో అంజుకి బాసటగా నిలచారు మాజీ క్రీడా శాఖ మంత్రి సుధాకరన్. జయరాజన్‌కు క్రీడలపై అసలు అవగాహనే లేదంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇక్కడే ఆయన జనరల్ నాలెడ్జ్ బయటకొచ్చింది. అంజు బాబీ జార్జ్‌తో పాటు ఆమె భర్త జిమ్మీ జార్జ్ కుటుంబం అంతా కేరళలో క్రీడల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. నిజానికి అంజు బాబీ జార్జ్ భర్త పేరు రాబర్ట్ బాబీ జార్జ్. రాబర్ట్ కూడా ప్రముఖ క్రీడాకారుడే కావడంతో ఆమెకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆ విషయం తెలియని సుధాకరన్ అంజు భర్త పేరును తప్పుగా పలికి విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు వీరిద్దరిని కేరళ నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక ఆటాడుకుంటున్నారు.

మోడీకి భయపడి సిద్దూ వెనుక దాక్కొన్న రాహుల్..

ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి ఫుల్‌టైమ్ సారథిగా సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించబోతున్నారని దేశం మొత్తం ప్రచారం జరుగుతోంది. మరోపక్క రాజకీయాల్లో ఓనమాలు తెలియని రాహుల్ ప్రధాని మోడీ ముందు నిలబడలేరని మరో వాదన వినబడుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ ఇప్పుడు కన్నడ నాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉడిపి జిల్లాకు చెందిన సతీష్ ఆచార్య అనే కార్టూనిస్ట్ కార్టూన్ కార్నర్ పేరుతో ఓ హోర్డింగ్ ఉంచారు. అందులో తాను గీసే ప్రతి కార్టూన్‌ను ఉంచడం ఆయనకు అలవాటు. అలాగే తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీలపై ఓ కార్టూన్ గీశారు. ఆ కార్టూన్‌లో మోడీ తనను పట్టుకోవడానికి వస్తుంటే రాహుల్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెనుక దాక్కున్నట్టుగా చిత్రీంచారు.   అంతే అసలే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడంతో ఉలిక్కిపడిన అధికారులు దానిని వెంటనే తొలగించారు. దీనిపై అధికారులను ఆరా తీసిన సతీష్ ఆచార్య పట్ణణ సుందరీకరణలో భాగంగా హోర్డింగ్స్, బిల్‌బోర్డ్స్ తొలగించామని, ప్రత్యేకంగా ఆ కార్టూన్‌నే తీసివేయలేదని చెప్పుకొచ్చారు. తాను అన్ని పార్టీల మీద కార్టూన్లు వేస్తానని, కానీ గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన చెప్పారు. అయితే ఆయన గీసిన కార్టూన్‌లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను బ్లూ కలర్‌లో వేసి చివర్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని రాశారు. హస్తం అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడం..గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకోవడంతో తిరిగి పవర్ లాక్కోవడానికి కర్ణాటకపై కమలం కాన్సన్‌ట్రేషన్ చేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ కార్టూన్ కర్ణాటక కాంగ్రెస్‌ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. అందుకు నిదర్శనంగా ఈ కార్టూన్ వేసిన వెంటనే ఓ స్థానిక కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆచార్యకు ఫోన్ చేసి అలాంటి కార్టూన్ వేయడం తప్పని, దానిని వెంటనే తొలగించాలని బెదిరించినట్లు సతీశ్ వెల్లడించారు. కాంగ్రెస్ తన ముందున్న సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి గానీ..ఇలా కార్టూన్లను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.  

హైదరాబాద్ ఏపీ సెక్రటేరియట్ ఇక తెలంగాణకే..

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇక ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లు కనిపించవు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న సచివాలయాన్ని పదేళ్లపాటు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అవకాశం కల్పించింది. దీని ప్రకారం సచివాలయంలోని ఎనిమిది బ్లాకుల్లో ఎల్‌, నార్త్ హెచ్, నార్త్ సౌత్, జె, కె బ్లాకులు ఏపీకి..ఏ,బీ,సీ,డీ బ్లాకులు తెలంగాణకు వచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇరు ప్రభుత్వాలు తమకు కేటాయించిన బ్లాకుల నుంచి పరిపాలనను మొదలుపెట్టాయి. అయితే ఇద్దరు చంద్రుల మధ్య వివాదాలు రావడం అవి తీవ్రతరం కావడంతో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాకాంను విజయవాడకు మార్చారు. పరిపాలనను యావత్తూ ఆయన బెజవాడ నుంచే కానిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా విజయవాడ, గుంటూరు నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.   ఇప్పుడు హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రాజధాని ప్రాంతానికి వచ్చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులంతా అమరావతి బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. ఉద్యోగులు ఆ బ్లాక్‌లను ఖాళీ చేస్తే అవన్నీ ఖాళీగానే పడి ఉంటాయి. దాంతో బ్లాకుల నిర్వహణ వ్యయం కూడా ప్రభుత్వానికి భారమే. ఇప్పటికే ప్రతీ బ్లాక్ నిర్వహణకు సర్కార్ ప్రతీ నెల సగటున రూ.10 లక్షలు వ్యయం చేస్తోంది. దీంతో సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క ఎల్ బ్లాక్ మినహా మిగిలిన బ్లాక్‌లను ఈ నెల 27న అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ , తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు లేఖ రాశారు. మొత్తానికి సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ అన్న పదం మటు మాయం కానుంది.

కన్న ఊరు కోసం ఉద్యోగాలు వదిలి పోరుబాట...

ప్రశాంత్,  శ్రీకాంత్, వెంకటేశ్, చంద్రశేఖర్ రెడ్డి అనే యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..ఐదెంకెల జీతాలతో ఎలాంటి చీకు చింతా లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతున్నవారు. ఇలాంటి సమయంలో తను పుట్టినఊరు కనుమరుగు కాబోతోందని..ఒక ప్రాజెక్ట్ తన ఊరులాంటి ఊళ్లను నామరూపాల్లేకుండా చేయబోతోందని తెలిసింది .. అంతే జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసి అన్న సూత్రాన్ని నమ్మి వెంటనే తను పుట్టిపెరిగిన ఊరిని నాశనం చేసే ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అంతే ఊరికంటే ఉద్యోగం ఎక్కువకాదని నమ్మి బంగారు భవిష్యత్‌ను పక్కనబెట్టి కదనరంగంలోకి దిగారు.   వీళ్లు ఉద్యోగాల్ని పక్కన బెట్టడానికి కారణమైన ప్రాజెక్ట్ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్మించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రిజర్వాయర్ నిర్మాణానికి 21,441 ఎకరాలు సేకరించేందుకు అధికారులు భూమిని గుర్తించారు. ఈ భూములన్నీ తొగుట, కొండపాక మండలాల్లోని 18 గ్రామాలకు సంబంధించినవే. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయి. దానితో పాటు భూసేకరణ నిమిత్తం, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123, 214 జీవోలను వర్తింపచేస్తున్నారు.   ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కేటాయించిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా 50 వేలు కూడా పలకని చోట 50 లక్షలకు పలుకుతోంది.  ప్రభుత్వం ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షలు చెల్లించి చేతులు దులుపుకునేందుకు చూస్తుండటంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. దీంతో వీరు ఆందోళనకు దిగారు..తమకు పరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షలు, భూమికి భూమి, పునరావాసం, జీవనోపాధి కల్పించాలని పోరుబాట పట్టారు. ఈ విషయం హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్ ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఈ ప్రాంత బిడ్డలకు తేలియడంతో వారు తమ గ్రామాల్ని కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుని గ్రామగ్రామాన తిరిగి ప్రాజెక్ట్ వల్ల ఏం కోల్పోతున్నాం తెలిపి అక్కడి ప్రజలల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.   వీరి రాకకు ముందు ఉద్యమాన్ని రెండు గ్రామాల ప్రజలు మాత్రమే చేపట్టారు. ఈ యువకుల రంగప్రవేశంతో ఏటిగడ్డకిష్టాపూర్, వేములఘాట్, ఎర్రవల్లి, పల్లెపహాడ్ తదితర గ్రామాల ప్రజలు కూడా వీరితో చేయి కలిపారు. అంతేకాకుండా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి, మరింత మంది ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యమం వివరాలు తెలిపేందుకు గానూ ఈ టెక్కీలు టెక్నాలజీ సాయం తీసుకున్నారు. రోజువారి వివరాలు తెలపడానికి "మల్లన్న సాగర్ పోరాట సమితి", "మల్లన్న సాగర్ మీడియా" పేరుతో వాట్సాప్, ఫేస్‌బుక్ ఎకౌంట్లు తెరిచి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ల నినాదం ఒకటే "2013 భూసేకరణ చట్టాన్ని" అమలు జరిపి "పోలానికి పోలం..ఇంటికి ఇళ్లు..గ్రామానికి గ్రామాన్ని" తమకు ఏర్పాటు చేయాలి లేదంటే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలి. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని వారు చెబుతున్నారు. డబ్బు కోసం కన్న ఊరిని వదిలి విదేశాలకు వెళ్లే యువత ఉన్న ఈ రోజుల్లో కన్న ఊరి కోసం ఈ యువకులు పడతున్న తపన నిజంగా అభినందనీయం.