దేశరాజకీయాల్లో మళ్లీ "ట్యాపింగ్" కలకలం
"ఫోన్ ట్యాపింగ్" దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఆరేళ్ల క్రితం నీరా రాడియా టేపుల వ్యవహారం దేశంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థల అధిపతులు, అధికారులు, మీడియా కుమ్మక్కయిన తీరును 140 టెలిఫోన్ సంభాషణలతో కూడిన టేపులను 2010లో ఔట్‌లుక్ మ్యాగజైన్ బయటపెట్టినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది. ఆ టేపులు అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. తాజాగా అదే పద్థతుల్లో..రాడియా టేపులను తలదన్నే భయంకరమైన కుమ్మక్కు వ్యవహారాలను అదే ఔట్‌లుక్ మ్యాగజైన్ బయటపెట్టడంతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. 2001 నుంచి 2006 మధ్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ కార్యాలయంతో సహా ఇప్పుడు న్యాయ వ్యవస్థను, పార్లమెంట్‌ను, బ్యాంకర్లను, ప్రత్యర్ధి వ్యాపార సంస్థలను దేశంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బహుళజాతి సంస్థ "హచీసన్"తో కలిసి హచీసన్ ఎస్సార్ పేరుతో టెలికాం వ్యాపారం నిర్వహించింది. అలా వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ..మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఎస్సార్ గ్రూప్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాను తన క్లయింట్ "అల్‌బసీత్ ఖాన్" తరపున ప్రధానికి ఫిర్యాదు చేస్తున్నట్టు సురేన్ వెల్లడించారు. 2001-06 మధ్య కాలంలో అల్‌బసీత్ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు.
ట్యాపింగ్ బాధితుల్లో నాటి మంత్రులు ప్రపుల్ పటేల్..రామ్ నాయక్..సురేశ్ ప్రభు..పీయూష్ గోయల్ లాంటి వారితో పాటు వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ..అనిల్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు, ఐడిబిఐ మాజీ చైర్మన్ పిపి వోరా, ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ ఎండి కెవి కామత్, ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ జాయింట్ ఎండి లలిత గుప్తే, హోం సెక్రటరీ రాజీవ్ మహర్షి, అప్పట్లో ప్రధాని కార్యాలయంలో ఉన్న బ్రిజేష్ మిశ్రా, ఎన్‌కె సింగ్, పార్లమెంట్ సభ్యుడు అమర్‌సింగ్, బిజెపి నేతలు కిరీటి సోమయ్య, జస్వంత్ సింగ్, సహారా అధిపతి సుబ్రతారాయ్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్.. ఫోన్లను ఎస్సార్ ట్యాప్ చేసినట్టు సురేన్ ఆరోపించారు. ఇంతకీ ఎస్సార్ గ్రూప్ ఇలాంటి పనిచేయటానికి గల కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలు బయటకు వస్తే..మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే వీలుందని చెప్పొచ్చు.