మాతృభూమిని మరిచారా..?
posted on Aug 2, 2016 @ 5:46PM
హరితహారం. ఇప్పుడు తెలంగాణ అంతా మారుమోగుతున్న నినాదం. వర్షాకాలం మొదలు కావడంతో సర్కార్ భారీ ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో..ఆ మాటకొస్తే కోట్లాది మొక్కల్ని నాటి, వాటిని చెట్లుగా, మహా వృక్షాలుగా మలిచెయ్యాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆలోచన..దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేశారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నపుడు అందరూ తలో చెయ్యి వేయడం అలవాటే. అలాగే సినీ ప్రపంచం కూడా రంగంలోకి దూకింది. సీఎం గారు అలా పిలుపునిచ్చారో లేదో ఆ తెల్లారేసరికి హీరోలు, హీరోయిన్లు తోటమాలి అవతారం ఎత్తారు నవ్వులు విరజిమ్ముతూ ఒక చేతిలో మొక్క, మరో చేతిలో వాటర్ క్యాన్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ..మొక్కలు నాటి రాష్ట్రం మొత్తాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించారు, ఈ ఉద్ధేశ్యంతో "వనం-మనం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యంలో ప్రజలంతా భాగస్తులై విజయవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపు మేరకు ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ బాగానే సహకరిస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు.. ఒక్క సినిమా ప్రముఖుడు కూడా ఆంధ్రలో అడుగుపెట్టలేదు..ఒక్క మొక్క నాటలేదు. హైదరాబాద్‌లోనే ఆస్తులన్ని ఉన్నాయి కాబట్టి..ఆ సర్కార్ అవసరం ఉంది కాబట్టి..ఆ భయంతో పిలవకపోయినా వెళ్లి మొక్కలు నాటొచ్చారు. ఆంధ్రతో..అక్కడి ప్రజలతో అవసరం ఏముందిలే అనుకుని రావడం లేదా..?
నిజానికి తెలుగు సినిమాకు పోషకులు, మహారాజా పోషకులు ఆంధ్రులే. కోస్తా అయినా, సీమ అయినా సినిమా మీద కాస్త ఎక్కువ అభిమానం చూపేది ఆంధ్రా వారే. గత కొన్నేళ్లుగా నైజాంలో కలెక్షన్స్ పెరిగినా అవి ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చేవే. ఆ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఉన్నది ఆంధ్రా వారే. ఆంధ్రా, సీడెడ్‌లు కలిసి 60 శాతం కలెక్షన్స్‌ను అందిస్తే, నైజాం 40 శాతం కలెక్షన్స్ ఇస్తుంది. ఆ 40 శాతంలో 15 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటి ఆంధ్రులపై ఇంతటి చిన్నచూపా. సినిమా వాళ్లు లైమ్ లైట్‌తో ఉన్నవారితో సాంగత్యం చేయడానికి ఇష్టపడతారు. తెలుగు ప్రజల ఆరాధ్యధైవం స్వర్గీయ ఎన్టీఆర్ హయాంను పక్కన బెడితే..చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యావత్ తెలుగుచిత్ర పరిశ్రమ ఆయన ముందు సాగిలపడింది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు "జై జన్మభూమి".. "జై తెలుగుదేశం".."జై చంద్రబాబు" అన్నారు.
2004లో టీడీపీ ఓటమిపాలవ్వడంతో వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయన కళ్లలో పడటానికి పాకులాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడి తెలంగాణకు కేసీఆర్, నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లో నెలకొని ఉండటంతో సినీ పెద్దలు ఇక్కడి ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, స్టూడియోలున్నాయి కాదనం..కానీ మీరు పుట్టింది...పెరిగింది..ఓనమాలు దిద్దింది..ఆంధ్రాలో..అంటే అది మీకు మాతృభూమి. "జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసీ" అన్న సూక్తి ప్రకారం కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్ప. మాతృభూమిని మరిచిపోయారంటే కన్నతల్లిని మరచినట్లే.