జగన్ గ(క)డపలో టీడీపీ పాగా..?

కడప..ఈ పేరు చెబితే మొదటగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.  ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా వైఎస్‌దే హవా. తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌కు తప్ప మరోపార్టీకి కడపలో స్థానం లేకుండా చేశారు వైఎస్. గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ వైఎస్, ఆయన కుటుంబసభ్యుల మాట వినవలసిందే. ఇక వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం హవా గురించి చెప్పవలసిన అవసరం లేదు. అధికారం అంటే ఎలా ఉంటుందో..అధికారం ఎలా అనుభవించాలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేసి చూపించారు. జిల్లాకు పవర్ సెంటర్‌లా మారి దాదాపు ప్రతిపక్షాన్ని అణచివేశారు వైఎస్. అలా కడప జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అన్నట్లుగా తీర్చిదిద్దారు. అయితే ఆయన అకాల మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.   కాంగ్రెస్ అధిష్టానం తనను అవమానిస్తోందన్న ఆగ్రహంతో వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవ్యాంధ్రలో తెలుగుదేశానికి వైసీపీ ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా కడపలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలవలేకపోయింది. ఆది నుంచి పట్టున్న జిల్లా కావడం..పైగా సొంత జిల్లా కావడంతో వైసీపీ అధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 10 శాసనసభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకుని జగన్ తన ఆధిక్యత చాటారు. అయితే కడపను కంచుకోటగా చేసుకున్న వైసీపీ సామ్రాజ్యంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులపై దృష్టిసారించింది.   ఇప్పటికే కడప, ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు సైకిలెక్కారు. ఇక మండల, జిల్లా పరిషత్‌లపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు కూడా జరగనుండటంతో మరిన్ని సమీకరణలు చేపట్టనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరడంతో అక్కడ స్థానిక బలం పెరిగింది. బద్వేల్‌లో ఇలాంటి పరిస్థితులపై దృష్టి సారించనున్నారు. మున్సిపాలిటీల్లో సంఖ్యాబలం పెంచుకుంటున్న టీడీపీ కొన్ని చోట్ల ఆ పీఠాలను చేజిక్కించుకునే అవకాశాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకు తోడు కొందరు ముఖ్యనేతలు, సీనియర్లుగా ఉన్నవారు టీడీపీ వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ పరిస్థితులు తెలుగుదేశానికి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక ఖరారైతే వార్డు స్థాయి నుంచి పార్టీకి మరికొంత  బలం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దగ్గరుండి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.   లోకేష్ కృషి ఫలితంగానే కడప నగరంలో వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ఈ నెల 29న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు జిల్లాకు రానుండటంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే తాతల నుంచి వస్తోన్న ఆధిపత్యాన్ని వేరొకరికి ఇవ్వడానికి ఒప్పుకోని జగన్ "ఇజ్జత్ కా సవాల్" అన్న చందంగా సర్వశక్తులు ఒడ్డి టీడీపీపై ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేత వరకు సైకిల్‌ వైపు చూస్తోన్న తరుణంలో జగన్ మాటలు ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమీకరణాలన్నింటి బట్టి కడప గడపలో టీడీపీ పాగా ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీకి బీజేపీ నేతలే శత్రువులా..?

శత్రువులు ఎక్కడో ఉండర్రా.. మనకు తెలిసిన వాళ్ల రూపంలోనే.. మనచుట్టూనే తిరుగుతుంటారు.. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదా. సినిమా డైలాగే.. కానీ ఇప్పుడు ఇది సరిగ్గా మన బిజేపీ నేతలకు సూటయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. వారు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. అయితే అదేంటో తెలియదు కానీ సరిగ్గా ఎన్నికల సమయం అప్పుడే వారు తమ నోటికి పని చెబుతుంటారు. తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు.   గతంలో బీహార్ ఎన్నికలప్పుడు కూడా అంతే.. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని అధికారం చేపట్టాలని గట్టి వ్యూహాలే రచించింది. అయితే బీఫ్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి నానా రభన చేసింది. ఈ గోమాంసం ఇష్యూ దేశ వ్యాప్తంగా ఎంతగా సెగలు రేపిందో తెలిసిందే. ఇదే ఆ ఎన్నికల ఓటమికి పెద్ద మైనస్ అయింది. దీనికి తోడు ఆ ఎన్నికల బరిలో దిగిన నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని బయటపడ్డాయి. అదొక్కటే కాదు దేశవ్యాప్తంగా అసహనం అనే కాన్సెప్ట్ కూడా బీజేపీ ఓటమికి కారణమైంది. ఇలా పలు కారణాలు బీజేపీ ఓటమికి కారణమయ్యాయి.   ఇప్పుడు చూడబోతే యూపీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరగబోయే యూపీ ఎన్నికలకు అన్ని పార్టీలు తమ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ కూడా బాగానే కష్టపడుతోంది. ఎలాగంటారా.. అన్ని వివాదాల్లో చిక్కుకొని. ఈ మధ్య కాలంలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య.. హెచ్సీయూ యూనివర్శిటీ ఉదంతం.. ఇవన్నీ బీజేపీకి తలనొప్పి తెచ్చే వ్యవహారాలే. ఇప్పుడు తాజాగా గుజరాత్ లో దళితులపై దాడి విషయంలో బీజేపీపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాల్సిందే అని ఒకపక్క పార్లమెంట్ అట్టుడుకుతోంది. దానికి ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ నేత దయాకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. అయితే పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేసినా... ఆయన చేసిన వ్యాఖ్యల సెగ మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. యూపీలో బీఎస్పీ కార్యకర్తలు దయాకర్ సింగ్ దిష్టిబొమ్మలు తగలబెడుతూ.. పెద్ద ఎత్తున నిరసలు తెలుపుతున్నారు.   మరి వచ్చే ఏడాదిలో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆచితూచి మాట్లాడుతూ.. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి బీజేపీ పార్టీ లేనిపోని కష్టాలను కొనితెచ్చుకుంటుంది. బీజేపీ నేతలే బీజేపీని కష్టాల్లోకి నెడుతున్నారు. రైట్ టైంలో.. రాంగ్ స్టేట్ మెంట్స్.. పనలు చేస్తూ పార్టీని ఓటమికి కారణమవుతున్నారు. మరి ఇప్పటికే వారు మారి తమ నోటికి తాళాలు వేసుకుంటారా..లేక ఇలానే చేసి బీహార్ ఎన్నికల ఫలితాన్నే మూటగట్టుకుంటారా.. చూడాలి

విమాన ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమేనా!

  నిన్న ఉదయం చెన్నై నుంచి అండమాన్‌కు బయల్దేరిన ఓ విమానం గల్లంతు కావడం దేశమంతా ఆందోళనకు గురించేసింది. ఈ విమానంలో 29మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలుగువారూ ఉన్నారు. విమానపు శకలాల ఆచూకీ ఇంకా తేలలేదు కాబట్టి వీరంతా ఇంకా క్షేమంగానే ఉండిఉంటారన్న ఆశ ఎక్కడో వారి బంధువులలో మిణుకుమిణుకుమంటోంది. కానీ దారి పొడుగునా సముద్రంలోనే ప్రయాణించిన విమానం, ఇక తిరిగి దక్కకపోవచ్చు అన్న భయమే ఎక్కువగా మెదులుతోంది. ఆ భయంతో పాటుగా విమానం గురించి బయటపడుతున్న వివరాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.   - 'ఏఎన్‌32' అనే ఈ రష్యా విమానం దాదాపు 32 ఏళ్ల పురాతనమైన విమానశ్రేణికి చెందినది. ఈ తరహా విమానాలు పాతబడిపోయాయనీ, ఇప్పటి అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయనీ ఎప్పటి నుంచో ఆరోపణలు వినవస్తున్నాయి.   - వీటి స్థానంలో రష్యా నుంచి కొత్త విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన దాదాపు దశాబ్ద కాలంగా మూలుగుతోంది.   - ప్రమాదానికి గురైన విమానం పరిస్థితి కూడా ఏమంత సజావుగా లేదని తేలుతోంది. ఈ విమానానంలో ఇప్పటికే మూడుసార్లు తీవ్రమైన లోపాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి.   - పోర్ట్‌బ్లెయిర్‌ (అండమాన్‌ దీవులు)లోని రక్షణ శాఖకు కావల్సిన సరుకులు తీసుకువెళ్లేందుకు ఈ విమానం బయల్దేరే సమయానికి బంగాళాఖాతం మీద వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉందని కథనాలు వినిపిస్తున్నాయి.   ఇదంతా చూస్తుంటే ఒకవేళ విమానం కనుక ప్రమాదానికి గురైందన్న వార్త రుజువయితే, దానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యతను వహించాల్సి ఉంటుంది.

సారీ చెప్పిన భగవంత్‌మాన్ సింగ్...

భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంట్‌లోకి వెళ్లిన ఘటనపై ఆప్‌ ఎంపీ భగవత్‌మాన్ సింగ్ పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా చేశానని, ఇది ఇంత పెద్ద విషయమవుతుందని అనుకోలేదని భగవంత్ తెలిపారు. భగవంత్ పటిష్ట భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంట్‌లోకి వెళ్లారు. అంతేకాకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 12 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన రన్నింగ్ కామెంటరీ కూడా చెప్పారు. దీనిపై ఉభయసభలు అట్టుడికిపోయాయి..బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దేశ భద్రతకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. భగవంత్‌మాన్ ఒకసారి కాకుండా మళ్లీ చిత్రీకరిస్తానని చెప్పడమేంటని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేస్తానన్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలే సభే నిర్ణయించాలని పేర్కొన్నారు.   తీవ్ర గందరగోళం మధ్య..భగవంత్‌పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టి..సమన్లు జారీ చేశారు. దీంతో స్పీకర్ ఎదుట హాజరైన భగవంత్ సుమారు 20 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. తను చేసిన పనికి క్షమించాలని..పార్లమెంటు, దాని నిర్వహణ ఎలా ఉంటుందో పంజాబ్‌లోని తన నియోజకవర్గ ప్రజలకు చూపించడానికి ఇలా చేశానని భగవంత్ చెప్పారు. 

బీహార్‌లోనూ పాక్ జెండా రెపరెపలు..

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న పెద్దల మాట ప్రకారం..జన్మనిచ్చిన తల్లి, పుట్టిన గడ్డ స్వర్గం కంటే గొప్పవి.. ఈ విషయాన్ని మరచి కొందరు దుర్మార్గులు పరాయి దేశం అందునా శత్రుదేశంపై మమకారం పెంచుకుంటున్నారు. ఈ దేశపు మట్టిపై నిలబడి..ఇక్కడి గాలి పిలుస్తూ..ఇక్కడి నీరు తాగుతూ సిగ్గు లేకుండా మనదేశంపై అణువణువునా విషం చిమ్మే పాకిస్థాన్ జెండాను ఎగురవేస్తున్నారు. కశ్మీర్‌లో వేర్పాటు వాద నేతల అనుచరులు చాలా సార్లు పాక్ జెండాలతో పాటు శతృదేశానికి జై కొడుతున్నారు.   కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆమన మద్ధతుదారులు శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్, ఐఎస్, లష్కరే తోయిబా వంటి జెండాలు ప్రదర్శించారు. అలా వీలు చిక్కినప్పుడల్లా జెండాలు ఎగురవేస్తూనే ఉన్నారు. ఈ విష సంస్కృతి కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఆ జాడ్యం మిగతా రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. బీహార్‌లోని సుప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయం కొలువైన బిహార్ షరీఫ్‌లోని ఖరడికాలనీలోని ఒక ఇంటిపై పాకిస్థాన్‌ జెండాను పోలిన పతాకం ఎగురుతోందన్న వార్తలతో అధికారులు పరుగులు తీశారు.   అన్వరుల్‌హక్ అనే వ్యక్తి ఇంటిపై పచ్చని రంగు జెండాపై చంద్రుడు, అర్థచంద్రాకృతితో కూడిన పతాకం ఎగురుతున్న దృశ్యం వివిధ ఛానెళ్లలో ప్రసారమైంది. రంగంలోకి దిగిన పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి ఆ గ్రామానికి వెళ్లి జెండాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మన ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై మొద్దు నిద్ర పోతుంటే..విరాట్ కోహ్లీ విరాభిమాని అయిన పాక్ జాతీయుడు అతని ఆట తీరుకు ముగ్ధుడై తన ఇంటిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పాక్ ప్రభుత్వం అతన్ని ఖైదు చేసింది. ఆ దేశాన్ని స్పూర్తిగా తీసుకుని మన ప్రభుత్వం కూడా తల్లిపాలు తాగే రొమ్ము గుద్దే సన్నాసులను అణచివేయాలి.  

కర్ణాటకలో మరో పోలీస్ అధికారిణి ఆత్మహత్యాయత్నం..

కర్ణాటకలో పోలీసు అధికారుల బలవన్మరణాలు ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం మంగుళూరులో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఏంకే గణపతి మడికెరలో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగడం..చివరకు మంత్రి కేజే జార్జ్ రాజీనామా చేయడం వరకు వెళ్లింది. తాజాగా మరో పోలీస్ అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. హాసన్ అసిస్టెంట్ కమిషనర్ విజయా తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది.   తాను సూసైడ్ చేసుకోబోతున్నట్టు తన పై అధికారి శోభారాణికి ఫోన్‌చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడికి వెళ్లిన శోభారాణి ఇరుగుపొరుగు వారి సాయంతో విజయను కాపాడి హాసన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలిసింది. ఈమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టాయి. దీనిపై విజయ బెంగుళూరులోని కేఏటీలో విచారణకు హాజరయ్యారు.   విచారణలో లాయర్ దేవరాజ్‌గౌడ విజయపై పలు అభియోగాలు మోపడంతో పాటు కేఏటీకి తప్పుడు సమాచారం అందించారని ఆరోపించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ప్రభుత్వాధికారులు సూసైడ్‌లకు పాల్పడుతున్న తరుణంలో విజయ ఆత్మహత్యాయత్నం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది.

నోరు జారిన ఫలితం బీజేపీ అనుభవించాల్సిందేనా..?

దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలనుకునే ఏ పార్టీ అయినా యూపీలో నెట్టుకురాగలిగితే అధికార పీఠం ఖాయమని భావిస్తుంది. అందుకే ఆ రాష్ట్ర ఎన్నికలను మినీ భారత్ ఎన్నికలుగా భావిస్తుంటారు. గత సాధారణ ఎన్నికల్లో అనూహ్య విజయవం సాధించిన బీజేపీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాబోయే 2019 ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే కమలనాధులు స్కెచ్ రెడీ చేస్తున్నారు. అక్కడ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించే ప్రధాన కులాల మద్ధతు కూడగట్టే పనిలో అగ్రనేతలు తలమునకలై ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యూపీకి ప్రాధాన్యత నిచ్చారు.   ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఆ పార్టీ నేతల నోటీ దురుసు కమలాన్ని కోలుకోలేని స్థితిలోకి నెట్టింది. "డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. కాని మాయావతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారంటూ" బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున సభ లోపల, బయట కూడా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దయాశంకర్ మాయావతికి క్షమాపణ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇంత చేసినా బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకోవచ్చు.   ఎందుకంటే మాయవతి దేశంలో దళిత చైతన్యానికి ప్రతీక.. ఒక దళిత మహిళగా సగర్వంగా తిరుగుతూ, మంత్రులను, అధికారులను ఎడాపెడా మార్చేస్తూ చండశాసనురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పేద దళిత కుటుంబాలకు పింఛన్లు రెట్టింపు చేయడం, దళిత యువతుల వివాహాలకు రూ.10 వేల చొప్పున సాయం చేయడం వంటి చర్యలతో దళితుల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉత్తరప్రదేశ్‌ రగిలిపోయింది. బీఎస్సీ శ్రేణులతో పాటు మాయావతి అభిమానులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. పార్టీలకు ఎన్నికల వేళ ఏదైనా అంశం దొరికితే ఏకిపారేస్తాయి. అలాంటిది బీజేపీ పోయి పోయి మాయవతికి చేతికి చిక్కింది. ఈ ఎన్నికల్లో దళితుల్ని మరింత ఆకట్టుకోవడానికి, బీజేపీని టార్గెట్ చేయడానికి ఈ వ్యవహారం మాయకు వజ్రాయుధంలా ఉపయోగపడుతుంది. 

మదనపల్లె ఎర్రపండు పాకిస్థాన్‌కు..

తెలుగు రాష్ట్రాల్లో టమోటా అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చే పేరు మదనపల్లె. నిన్న మొన్నటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే ఇక్కడి నుంచి టమోటా ఎగుమతి అయ్యేది. అయితే తాజాగా మన దాయాది దేశం పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఇక్కడ మార్చి నెలఖారు నుంచి జులై వరకు టమోటాకు సీజన్‌గా పరిగణిస్తారు. ఇందుకు కారణం ఈ మాసాల్లో బయట ప్రాంతాల్లో టమోటా పంటకు అనుకూలమైన వాతావరణం ఉండదు.   మదనపల్లె చుట్టుపక్కల మండలాల్లో మాత్రం వేసవిలోనూ టమోటా పండుతుంది. దీంతో ఇక్కడి టమోటాకు దేశమంతటా డిమాండ్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో టమోటా అధిక మొత్తంలో సాగవుతుంది. వేరు శెనగ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగుచేసే టమోటా పంటపై వేల సంఖ్యలో రైతు కుటుంబాలు ఆధారపడ్డాయి. వినియోగానికి మించి టమోటా మార్కెట్‌లోకి వస్తుండటం, అధిక ధరల ఆశలు, కుంటలు, బోరుబావులు, చెరువులు, బావులలో పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు 10 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు.   దీనికి తోడు అనంతపురం జిల్లాలో టమోటాకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అక్కడి రైతులు కూడా మదనపల్లె మార్కెట్‌కే టమోటాను తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో జూన్ ప్రారంభంలో మదనపల్లెలో డిమాండ్ పెరిగింది. ఎన్నడూ లేని విధంగా రూ.60 వరకు పలకగా..ఓ రోజున ఏకంగా రూ.90 వరకు వెళ్లింది. తాజాగా కిలో ధర రూ.10 నుంచి రూ. 26 వరకు ఉంటోంది. ప్రస్తుతం 500 టన్నుల వరకు సరకు వస్తోంది. దీనిని కొనుగోలు చేస్తున్న ఢిల్లీ వ్యాపారులు పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు. 

బాలకార్మికులకు రక్షణ కవచం

దేశాన్ని పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైంది. స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడుస్తున్నా నేటికి మన సమాజంలో బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చునని యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాలకార్మిక వ్యవస్థ మరింత పెరగడానికి దోహదం చేస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 25.2 కోట్ల మంది పిల్లలున్నారు. వీరిలో సుమారు 1.26 కోట్ల మంది బాల కార్మికులున్నట్లు అంచనా.   నానాటికి పెరిగిపోతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. 1986లో చేసిన బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికలుండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. అయితే బాలకార్మికులను ఎంతగా విడిపిస్తున్నప్పటికి వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఈ దురవ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది.   14 ఏళ్లలోపు పిల్లలకు పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ రూపోందించిన బిల్లును రాజ్యసభ మూజు వాణి ఓటుతో ఆమోదించారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి విధించే జైలుశిక్ష, జరిమానాను పెంచారు. కొత్త బిల్లు ప్రకారం 14 ఏళ్ల లోపువారిని పనిలో పెట్టుకుంటే ఆ సంస్థ యజమానిపై కేసు నమోదు చేస్తారు. తల్లిదండ్రులపైనా జరిమానా విధిస్తారు. గతంలో మూడు నెలల నుంచి ఏడాది పాటు విధించే శిక్షను తాజాగా ఆరు నెలల నుంచి రెండేళ్లకు పెంచారు. జరిమానా సైతం గతంలో ఉన్న రూ.10-20 వేల నుంచి రూ.20-50 వేలకు పెంచారు. కేసు తీవ్రతను బట్టి పై రెండూ ఒకేసారి విధించవచ్చు.

శ్రీవారి ఆలయంపై విమానాలను కేంద్రం ఆపలేదట....

తిరుమల కొండపై విమానాలు ఎగరకుండా నిషేదించడం వీలు కాదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధర్మిక క్షేత్రం, కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ అదే పనిగా విమానాలు ఎగురుతుండటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూలోక వైకుంఠం, కలియుగదైవం కొలువైన ఆనంద నిలయం..వేంకటాచలపతి సంస్థానం తిరుమల. స్వామి వారు కొలువైన శేషాచల పర్వత శ్రేణులను నిశితంగా పరిశీలిస్తే..శ్రీవారి ముఖం కనిపిస్తుంది.   అందుకే ఏడు కొండలనూ వేంకటేశుడి ప్రతిరూపంగానే విశ్వసిస్తారు భక్తులు. సాధారణ భక్తులతో పాటు నిత్యం ముక్కోటి దేవతలు, సప్తర్షులు కూడా శ్రీవారిని సేవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తిరుమల గిరులను పాదాలతో అధిరోహించినట్లుగా అనిపించేలా..విమానాల రాకపోకలు జరగడం శాస్త్ర విరుద్ధమని ఆగమ పండితులు వాదిస్తున్నారు. దానికి తోడు ఏ క్షణానైనా విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు మాటు వేసి ఉన్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నో ఫ్లైయింగ్ జోన్ లిస్ట్‌లో శ్రీవారి ఆలయాన్ని చేర్చారు. కానీ రాను రాను ఈ నిబంధన గాలికిపోయి..విమానాలు యధేచ్చగా రాకపోకలు సాగిస్తున్నాయి.   ఈ పరిస్థితుల్లో తిరుమల కొండలపై విమానాలు తిరగకుండా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖను కోరింది. దీనిపై ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. తిరుమల కొండపై విమానాలు ఎగరకుండా నిషేధించలేమని అలా చేస్తే ఇప్పటికే పలు విమానాలకు అందుబాటులో లేకుండా పోయిన తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు మరింత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక సమయంలో, ఒక్క విమానం మాత్రమే వచ్చిపోయే విధంగా తిరుపతి విమానాశ్రయం ఉందన్నారు. అది వెళ్లే వరకు రెండో విమానం ఆ రన్‌వేపై దిగడానికి అవకాశం లేదన్నారు.

ఐసిస్‌తో అన్నలు కలిస్తే అలజడేనా..?

ఇస్లామిక్ స్టేట్..దారుణ మారణకాండతో అగ్రరాజ్యాలతో సహా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థ. ఇప్పటికే వివిధ దేశాల్లో రక్తపుటేరులు పారించిన ఐఎస్‌ కన్ను భారతదేశంపై పడింది. ఎన్నోసార్లు భారత్‌లో విధ్వంసం సృష్టించాలనుకున్నా..మన నిఘా సంస్థలు, భద్రతా దళాల ముందు దాని ఆటలు సాగలేదు. పేలుడు పదార్థాలతో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథక రచన చేస్తోన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ గత జనవరిలో అరెస్ట్ చేసింది. దేశంలో ఐసిస్ ఉగ్రవాదులను తయారు చేస్తోన్న వ్యవహారంలో ప్రధాన నిందితుడు, తప్పించుకు తిరుగుతున్న షఫీ ఆర్మర్ సహా 16 మంది అనుమానిత ఉగ్రవాదులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఐఏ నిన్న ఛార్జిషీటు దాఖలు చేసింది.   ఈ క్రమంలో ఎన్ఐఏ ఒక చేదువార్తను వెలుగులోకి తెచ్చింది. భారత్‌లోని ఐసిస్ ఉగ్రవాదులు నక్సల్‌ గ్రూపులతో సంప్రదింపులు జరిపినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో సాయుధ పోరాటాలు చేస్తున్న నక్సలైట్ గ్రూపులకు దేశంలోని ఇతర తీవ్రవాద, వేర్పాటు వాద గ్రూపులతోనే కాక పాక్ మద్ధతుగల ఆరు తీవ్రవాద గ్రూపులతో సన్నిహిత సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయుధ సరఫరా, సైనిక శిక్షణ అవసరాల కోసం గతంలో శ్రీలంకలోని ఎల్‌టీటీఈతో నక్షలైట్లు సంబంధాలు ఏర్పరచుకున్నట్టు అనేక ఉదంతాలు వెల్లడించాయి. మావోయిస్టులతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనదేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు వారిని పాకిస్తాన్‌లోని నిఘా వర్గాలు ఉపయోగించుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ ఆరోపిస్తోంది.    మత్తు పదార్థాలు, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌లో మావోలు సహకరిస్తున్నట్టు భావిస్తున్నారు. అందుకు ప్రతిగా ఐఎస్ఐ ఆయుధాలు, ప్రేలుడు పదార్థాలను మావోలకు అందజేస్తోంది. ఇలా మావోల ఎదుగుదలలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ప్రతి దేశానికి సవాలు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్‌తో మావోయిస్ట్‌లు కలిస్తే..? అసలు ఆ ఊహే వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అయినా ఐఎస్ భావజాలం వేరు..మావోయిస్టుల పంథా వేరు. ప్రపంచంలో ఇస్లాం రాజ్య స్థాపన ఐఎస్ లక్ష్యం..ఆయుధంతోనైనా బడుగులకు న్యాయం చేయాలన్నది మావోల లక్ష్యం. అయితే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో పాటు వరుస ఎదురుదెబ్బలు మావోల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. దీనికి తోడు అన్నలకు ఆయుధాలు సరఫరా అయ్యే అన్ని రకాల మార్గాలను భద్రతా దళాలు మూసివేశాయి. దీంతో ఉద్యమాన్ని నడిపించాలంటే బయటి నుంచి మద్ధతు అవసరం అందుకే వేరే గత్యంతరం లేక మావోలు ఐఎస్‌తో సంబంధాలు పెట్టుకుని వుండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

కేసీఆర్ షర్ట్ కలర్ వెనుక "కలరింగ్" ఏంటీ..?

రాజకీయ నాయకులు ఎలాంటి చొక్కా వేసుకుంటారు...? ఛీ..అదేం ప్రశ్న ఆ మాత్రం తెలియదా..తెల్ల రంగు ఖద్దరు షర్ట్ వేసుకుంటారని చిన్నపిల్లల కూడా చెబుతారు. అయితే మనుషుల్ని రంగులుగా విడగొట్టి జాతులకు వర్ణాలని పేరు పెట్టిన మన సమాజంలో..రాజకీయ రంగంలో అసలు సిసలైన వర్ణ సంకరం జరుగుతోంది. మనుషులకు రంగులున్నట్లే పార్టీలు ఇప్పుడు సంకరింపబడుతున్నాయి. పార్టీ జెండాకు తగ్గట్టే చాలా మంది రాజకీయ నాయకులు తాము ధరించే షర్ట్ రంగును ఎంచుకుని పార్టీపై ఉన్న అభిమానాన్ని జనానికి చూపిస్తారు.   మనం రోజు కనిపించే దానికి భిన్నంగా కనిపిస్తే..ఏంట్రా స్పెషల్ అని మన రిలేటీవ్సో..స్నేహితులో ఆటపట్టిస్తారు. అలాంటిది ప్రముఖుల విషయంలో అలా జరిగితే దానికి ఎక్కడా లేని ఇంపార్టెన్స్ వచ్చేస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనూ అదే జరిగింది.     రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తెలుపు రంగు చొక్కాలో మాత్రమే కనిపిస్తారు. ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలో తన పార్టీ జెండా గుర్తు అయిన గులాబీ రంగు చొక్కాలో కనిపించారు. అయితే రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం కొత్తగా కనిపించారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధరించే గోధుమ రంగు చొక్కా తరహాలో కాస్తంత లైట్ గోధుమ రంగు చొక్కాలో కేసీఆర్ దర్శనమిచ్చారు. గోధుమ రంగు గుడ్డతో కుట్టిన షర్ట్‌లో ఢిల్లీలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్..ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో కూడా అదే రంగు చొక్కాలో దర్శనమిచ్చారు. ప్రజంట్ ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్న సిద్ధూ..

భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన చూపు ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ రాజకీయాల్లో తక్కువ కాలంలోనే ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు సిద్దూ. సిద్దూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ఆయనను పక్కకు తప్పించి, అరుణ్‌జైట్లీకి ఆ సీటు ఇవ్వడంపై సిద్దూ అలిగి ఉన్నాడు. ఇంత చేసినా తీరా జైట్లీ అక్కడ గెలవలేకపోయాడు. అప్పట్లో సిద్దూ బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించాడు. అతన్ని బుజ్జగిస్తూ రెండు నెలల కిందటే రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు కమలనాథులు.   అయితే త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 13 ఎంపీ సీట్లలో నాలుగు గెలుచుకున్న ఆప్ మరింత కష్టపడితే..ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడుతోంది. అందులో భాగంగానే ఆప్ సిద్దూతో సంప్రదింపులు జరిపింది. దీనిపై తీవ్ర తర్జన భర్జనలు పడ్డ సిద్దూ ప్రస్తుతానికైతే బీజేపీకి రాజీనామా చేశారు. సిద్దూ కోసం ఆప్ అంతగా ఆసక్తి చూపడానికి కారణాలున్నాయి. అంతకు ముందే టీమిండియా క్రికెటర్‌గా దేశవ్యాప్తంగా పేరున్న సిద్దూకు పంజాబ్‌ రాజకీయాల్లోనూ మంచి పేరుంది. స్వతహాగా మాటకారి అయిన ఆయన తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట.   ఢిల్లీ తర్వాత పంజాబ్‌‌లోనే ఆప్ బలంగా ఉన్నా అక్కడ సరైన నాయకత్వం లేదు. ఢిల్లీకి చెందిన ఆప్ నేతలే అక్కడ కూడా కార్యకలాపాలు, ప్రచారం చేపడుతున్నారు. అయితే ఢిల్లీకి పంజాబ్‌కు సామాజికంగా, సాంస్కృతికంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే ఢిల్లీ నేతలు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా నడిపించలేకపోతున్నారు. ఈ దశలో సిక్కు వర్గానికి చెందిన బలమైన నేత కోసం ఆప్ వెతుకుతోంది. ఈ ప్రయత్నంలో వారికి కనిపించిన వ్యక్తి సిద్దూ. మరి సిద్దూ ఆఫ్‌లో చేరుతారా..? లేక సిద్దూ విలువ తెలిసిన బీజేపీ తిరిగి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి.

ఏపీలో తాగి నడిపేవాళ్లని పట్టుకునేది ఎలా..?

హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి సహా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంతటి విషాదానికి కారణం మద్యం..తాగి వాహనాలు నడపడం. ఈ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పెషల్ డ్రైవ్‌ల పేరిట హడావిడి చేయడం మొదలెట్టారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తెలంగాణ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా నిద్రలేచింది. అయితే పాపం వారికి మద్యం తాగిన వాళ్లను గుర్తించడం కష్టంగా మారింది. ఎందుకంటే డ్రంకన్ డ్రైవ్ చేసే వారిని గుర్తించే అత్యాధునిక బ్రీత్ అనలైజర్ల కొరత ఏపీ పోలీస్ శాఖను తీవ్రంగా వేధిస్తోంది.   రాష్ట్రంలో మొత్తం 1015 పోలీస్ స్టేషన్లు ఉండగా కేవలం 250 పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కువ శాతం పాతవి కావడంతో తనిఖీల సందర్భంలో మొరాయిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో రాష్ట్రంలో గత రెండేళ్లలో సగటున ఇద్దరు గాయపడగా, రెండు రోజులకొకరు ప్రాణాలు కోల్పోయారు. గత 17 నెలల వ్యవధిలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ లక్ష మందికి పైగా పట్టుబడ్డారు.   తనిఖీలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పరికరాల కొరత కూడా అడ్డంకిగా మారింది. కొత్తగా 1200  బ్రీత్ ఎన్‌లైజర్లు కొనుగోలు చేయాలని ఏపీ పోలీస్ విభాగం ప్రతిపాదనలు పంపింది. ఉన్నవాటిలో సరిగా పనిచేసే వాటితోనే అప్పుడప్పుడూ మందుబాబులను పసిగడుతున్నారు తప్ప ప్రతి రోజు ఖచ్చితంగా తనిఖీలు చేయ్యాలంటే అది కుదరని పనే. బ్రీత్ ఎనలైజర్లలో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, వాటిని సరిచేసే పరిస్థితి లేదు. ఏదైనా లోపం వస్తే అలాగే వాటిని మూలకు చేరుస్తున్నారు. వీటిని భద్రపరిచే విధానంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో లెక్కలో ఉన్నవి కూడా అవసరానికి అక్కరకు రాకుండా పోతున్నాయి.

ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా తెలుగు రాష్ట్రాలు..

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై ఉగ్రవాదం బుసకొడుతోంది. ఈ భయం భారతదేశాన్ని ఎప్పటి నుంచో వెంటాడుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. నిఘా వర్గాలు ఎంతగా పహారా కాస్తున్నప్పటికి ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ విరుచుకుపడతారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పేరు చెబితేనే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాదం "ఇస్లామిక్ స్టేట్" ప్రభావంతో జిల్లాలకు విస్తరించింది. ఇటీవల హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది.   ఉగ్రవాదానికి..భాగ్యనగరానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు దేశంలో జరిగిన చాలా పేలుళ్ల మూలాలు హైదరాబాద్‌లోనే దొరికాయి. చాలా ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ క్యాంపస్‌లా మారిపోయింది. రీసెంట్‌గా ఉగ్రవాదాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఐఎస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే పడింది. అందుకే రాజధానిని దాటి జిల్లాల్లో ఉగ్రజాడలు వెలుగు చూస్తున్నాయి. సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను పుణేలో అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఒక యువకుడు ఇప్పటికే సిరియాలో జరుగుతున్న యుద్ధంలో మరణించాడు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఐసిస్ కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.   నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో ఉగ్రవాదుల జాడలు బయటపడటం అప్పట్లో కలకలం రేగింది. జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఐఎస్‌లో పనిచేస్తున్నారు. వారు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన తల్మిజూర్ రెహమన్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి నుంచి సిరియా చేరుకుని అక్కడ యుద్ధంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెహమాన్ మరణించలేదని తేలింది. అలాగే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల్లో కొందరు ఆయుధాల కోసం అనంతపురంలో బస చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా నిజామాబాద్ నుంచి అనంతపురం వరకు ప్రతి ప్రాంతం ఉగ్రవాదులకు సేఫ్‌జోన్‌గా మారడంతో ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. అయితే అదృష్టవశాత్తూ చాలా కుట్రలను నిఘా వర్గాలు విజయవంతంగా ఛేదించగలిగాయి. కానీ తెలియకుండా ఇంకా అనేకం జరుగుతూ ఉండవచ్చని..వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. 

టర్కీ సైనిక "కుట్ర" వెనుక అమెరికా..?

దేశంలో నియంతృత్వ పాలన, పెరుగుతున్న ఉగ్రవాదాన్ని సాకుగా చూపుతూ టర్కీ సైనికులు ఆ దేశ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తిరుగుబాటు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన టర్కీ సైన్యం కుట్రను ప్రభుత్వ అనుకూల దళాలు, ప్రజలు కలిసి విఫలం చేశారు. సైనిక కుట్ర విఫలమైన తర్వాత ఆ దేశ ప్రభుత్వం కుట్రదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అలాగే కుట్ర వెనుక కారణాలను, సూత్రధారులను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ కుట్ర వెనుక అమెరికా ఉందంటూ టర్కీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. తిరుగుబాటులో అమెరికా పాత్రపై టర్కీ కార్మికశాఖ మంత్రి అనుమానించారు. అందుకు కారణాలు లేకపోలేదు..   అమెరికాలో నివసిస్తున్న టర్కీ అసమ్మతి నేత "ఫెతుల్లా గులెన్" అనుచరులే అరెస్టయిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. సున్నీ ముస్లిం నేత సయ్యద్ నుర్సీ శిష్యుడైన గులెన్ "హిజ్మత్" పేరిట ఓ ఉద్యమాన్ని నిర్వహిస్తూ, ఇస్లాం ప్రబోధకుడిగా ఉన్నారు. 2013 వరకూ ఎర్డోగాన్ సన్నిహితుడిగానే ఉన్న గులెన్, ఆపై అధ్యక్షుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దూరం జరిగారు. దేశాన్ని వదిలి అమెరికాలోని పెన్సిల్వేనియా పరిధిలోని పెకనాస్ పర్వత ప్రాంతంలో గ్రీన్ కార్డుతో నివసిస్తున్నాడు. సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత కారణాలు అన్వేషిస్తున్న అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా తిరుగుబాటుకు సూత్రధారిగా గులెన్‌ అని భావిస్తున్నారు. దీంతో ఆయన్ను తమ దేశానికి అప్పగించాల్సిందిగా ఎర్డోగాన్ డిమాండ్ చేశారు. అయితే కుట్రపై గులెన్ ప్రమేయంపై సరైన ఆధారాలు చూపిస్తేనే ఆయన్ను టర్కీకి అప్పగిస్తామని యూఎస్ స్పష్టం చేసింది.   దీంతో పాటు సిరియాలోని ఐఎస్ఐఎస్‌పై దాడులకు అమెరికా ఉపయోగిస్తున్న టర్కీ వైమానిక స్ధావరంలోని జనరల్, 12 మంది అధికారులు ప్రభుత్వం కూల్చివేత కుట్రలో కీలక పాత్రధారులని తేలింది. తిరుగుబాటు దారులు వినియోగించిన విమానాలకు ఈ స్థావరంలోనే ఇంధనాన్ని సమకూర్చారు. ఈ ఆధారాలతో టర్కీ అమెరికాను అనుమానిస్తోంది. నిజానికి టర్కీ అమెరికాకు చిరకాల మిత్రదేశం. ప్రచ్ఛన్న యుద్ద సమయంలో టర్కీ, సోవియట్ రష్యా ప్రాబల్యాన్ని నిరోధించి అమెరికా కూటమిలో పనిచేసింది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో 1952 నుంచి సభ్యదేశంగా ఉంది. సిరియాలో ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాదులపై అగ్రరాజ్యం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలిచి అమెరికాకు సహకరిస్తోంది. అలాంటి టర్కీ-అమెరికా సంబంధాలపై సైనిక తిరుగుబాటు పెను ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది. 

చంద్రబాబుతో మళ్లీ జతకట్టిన బిల్‌గేట్స్...

మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు తన హైటెక్ పరిపాలనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ప్రపంచం మొత్తం మైక్రోసాఫ్ట్ వైపు చూస్తోన్న సమయంలో ఆ మైక్రోసాఫ్ట్‌ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు చంద్రబాబు. ఐటీ రంగానికి బాబు ఇస్తోన్న ప్రాధాన్యతను గుర్తించిన బిల్‌గేట్స్ హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అలా వీరిద్దరి బంధం మరింతగా బలపడి వ్యక్తిగత స్నేహంగా మారింది. గేట్స్ సహకారంతో చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీని పరుగులు పెట్టించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు పదేళ్లు అధికారానికి దూరమయ్యారు.   రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి, ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేశారు. అలా దావోస్‌లో పర్యటిస్తుండగా ఆయనకు బిల్‌గేట్స్ ఎదురుపడ్డారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత చంద్రబాబును చూసి గేట్స్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పారు ముఖ్యమంత్రి. మీరేం భయపడొద్దని..అండగా ఉంటానని గేట్స్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. డిజిటల్ ఏపీ ప్రాజెక్ట్‌తో పాటు..ఐటీ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ భాగమవుతుందని అన్నారు.   నిన్న బిల్‌గేట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఏపీలో పేదలకు వైద్య సేవల విస్తృతికి సహకరించాలని కోరారు. గేట్స్ తన భార్య పేరు మీద బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్ధాపించి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో పట్టణ పారిశుద్ధ్య రంగంలోనూ, సెర్ప్‌తోనూ కలిసి పనిచేస్తున్న గేట్స్ ఫౌండేషన్ ఎన్టీఆర్ వైద్యసేవలోనూ సహకరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో నిర్వహిస్తున్న ఇ-ప్రగతి కార్యక్రమానికి సలహాదారుగా వ్యవహరించాలని, ఆసక్తి ఉన్న ఇతర సంస్థల్ని భాగస్వాముల్ని చేయాలని సీఎం బిట్‌గేట్స్‌ను కోరారు. దీనిపై స్పందించిన గేట్స్... "ఫౌండేషన్" ప్రతినిధులు ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఫౌండేషన్ తరపున సాయం అందిస్తామని చెప్పారు. అప్పుడు ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన బాబు-గేట్స్ జోడీ మరోసారి జతకడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ మోటార్ సైకిలిస్ట్ ప్రాణత్యాగం..ఎందరికో స్పూర్తి

జాతీయ దినోత్సవాల్లో జరుగుతున్న వేళ ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన మారణకాండ ప్రపంచాన్ని కలవరపరిచింది. బ్యాస్టిల్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు బాణాసంచా పేలుళ్లను తిలకిస్తుండగా ఒక ఉగ్రవాది ట్రక్కును వేగంగా నడుపుతూ వారిపైకి ఎక్కించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలను తొక్కించుకుంటూ వెళ్లాడు. ఈ మారణకాండలో పది మంది ఉగ్రవాదులు సహా 84 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృత్యు శకటం నుంచి తప్పించుకునేందుకు ప్రజలంతా తలొదిక్కుకు పారిపోయారు.   కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ ఆగంతకుడి నుంచి తోటి వారిని రక్షించేందుకు రంగంలోకి దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ప్రయత్నంలో ఒకరు మరణించినా..మరోకరు మాత్రం ఉగ్రవాదితో తలపడి పోలీసులు ఆ కిరాతకుడిని హతమార్చడంతో తోడ్పడ్డాడు. పిచ్చిపట్టిన వాడిలా ట్రక్కును నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తుండటాన్ని గమనించిన ఒక వ్యక్తి జరగబోయే దానిని ఊహించాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మోటార్ సైకిల్‌పై ట్రక్కును వెంబడించాడు. ట్రక్కును ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు డ్రైవర్ తలుపుతీసి కేబిన్‌లోకి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో కిందపడిపోయి ట్రక్కు చక్రాల కిందపడి నలిగిపోయి చనిపోయాడు.   మరోక వ్యక్తి ట్రక్కులోకి దూకి..దానిని నడుపుతున్న ఉగ్రవాదితో కలబడ్డాడు. అతడి వద్ద ఉన్న తుపాకీని లాక్కొన్నాడు. ఈ ఘర్షణలో ట్రక్కు కొంతసేపు ఆగటంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని..ఉగ్రవాదిని కాల్చి చంపటానికి సమయం లభించింది. వీరిద్దరి వీరోచిత పోరాటంతో మారణహోమం ఎక్కువసేపు సాగలేదు. లేదంటే మరింత ప్రాణనష్టం సంభవించేది. ఇపుడు ఆ మోటార్ సైకిలిస్ట్ ప్రజల గుండెల్లో హీరోగా నిలిచాడు. అతనికి దేశమంతా నివాళులర్పిస్తోంది.

టర్కీలో సైన్యం తిరుగుబాటు.. పార్లమెంట్‌పై బాంబు దాడులు

ఉగ్రవాద దాడులతో ఇప్పటికే అట్టుడుకుతున్న టర్కీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు ప్రయత్నించింది. నియంతృత్వపాలన, ఉగ్రవాదం కారణంగానే దేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించింది...అయితే ఆ కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు టర్కీ ప్రధాని వెల్లడించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇస్తాంబుల్, అంకారా తదితర ప్రధాన పట్టణాల్లో యుద్ధ ట్యాంకులు తిరిగాయి.   పార్లమెంట్ భవనంపై సైన్యం మూడు బాంబులను ప్రయోగించడంతో ఎంపీలు పార్లమెంట్ షెల్టర్‌లో తల దాచుకున్నారు. టర్కీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై హెలికాఫ్టర్ గన్ షిప్పుతో సైన్యం కాల్పులు జరిపింది. అటు సైన్యాన్ని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. టిక్‌సిమ్ స్క్వేర్ వద్ద పోలీసులు, సైన్యం మధ్య  భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 17 మంది పోలీసులు సహా 42 మంది మృతి చెందగా..  మరో 130 మంది సైనికులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   తిరుగుబాటు చేసిన సైన్యం ఉపయోగించిన యుద్ధ విమానాన్ని కూల్చివేయాల్సిందిగా టర్కీ సైన్యానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. అటు సైనిక తిరుగుబాటును విదేశీ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఖండించారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మద్ధతు తెలపాలని ప్రజలకు ఎర్డోగన్ పిలుపునిచ్చారు. దాంతో పాటు తిరుగుబాటులో పాలుపంచుకున్న వారు త్వరలో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఎర్డోగన్ హెచ్చరించారు. టర్కీలో 1960, 1971, 1980, 1993లో సైన్యం తిరుగుబాటు చేసింది.