ప్రశాంత్ కిశోర్‌తో "ప్రశాంతంగా" కాంగ్రెస్
posted on Aug 3, 2016 @ 6:10PM
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. అది కూడా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి వేదికగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో బైకుల మీద పార్టీ జెండాలు ఊపుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ప్రచారపర్వానికి వారణాసి నుంచి తెరలేపడం ద్వారా మోడీపైనే కాంగ్రెస్ గురిపెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత వ్యూహత్మకంగా..పకడ్భంధీగా మోడీ కోటపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం వెనుక ఉన్నది ఒక్కడు.. ఆ ఒక్కడే ప్రశాంత్ కిశోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపు వెనుక, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిశ్ కుమార్ వెనుక..నిలిచి వారి విజయంలో ప్రశాంత్ కీలక పాత్ర పోషించాడు.
గుజరాత్‌లో మోడీ అభివృద్ధి చరిష్మాకు తోడు..ఎన్నికల సమయంలో పదునైన వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రచించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేదా విపక్షాల విమర్శలకు ప్రశాంత్ ధీటైన వ్యూహాలు పన్నారు. మోడీని ఛాయ్ వాలా అనటంతో..బీజేపీ ఛాయ్ పే చర్చాతో కౌంటర్ ఇచ్చింది. అలాగే నితీశ్ విజయంలో ప్రధాన సూత్రదారి ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ ఎటు వైపు పనిచేస్తే..అటు వైపే విజయం ఉండటం..ఒక పెద్ద యుద్దం ముందుండటంతో వరుస పరాజయాలతో చిక్కి..శల్యమైన కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం..పోల్ మేనేజ్‌మెంట్‌లో మొనగాడిగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను అద్దెకు తెచ్చుకుంది. వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రశాంత్ తన పని మొదలుపెట్టాడు. యూపీలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే బ్రాహ్మణ వర్గాన్ని మెప్పించటం కోసం ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన షీలాదీక్షిత్‌ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పట్టుబట్టి నిలబెట్టారు ప్రశాంత్.
వయసు మళ్లిన ఆమెను చూసి జనం ఓట్లు వేస్తారా..? అందుకే తనలోని మేధావిని బయటకు తీశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా స్లోగన్‌ను తయారుచేశారు. ఆ స్లోగన్ ఏంటంటే "మేరీ జీవన్ కా ఏక్ హీ సప్నా..ఉత్తరప్రదేశ్ కో ఢిల్లీ జైసా బనానా" దీనిని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తే "ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా మార్చాలన్నదే నా జీవితంలోని ఆఖరి కోరిక " దీన్ని బట్టి చూస్తే మనోడు ఎంత జాదూగాడో అర్థమవుతుంది. వయసు మళ్లిన వ్యక్తికి ఆఖరి కోరికగా అభివృద్ధిని చేర్చి దానితో సెంటిమెంట్‌ను రగల్చాలన్నదే ఆయన వ్యూహం. ఇక ఓబీసీగా ఉన్న రాజ్‌బబ్బర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడంతో ఆ వర్గం బలాన్ని కూడగట్టారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వ్యూహకర్తగా వారణాసిలో అమలు చేసిన రోడ్‌షో వ్యూహన్ని సోనియా గాంధీ చేత వర్కవుట్ చేయించారు. విమానం దిగిన దగ్గరి నుంచి స్ట్రాటజీతో వెళ్లారు ప్రశాంత్...విమానం దిగి దిగగానే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం ద్వారా సోనియా దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . జ్వరంతో ఉన్నా అలాగే ఓపిక పట్టి రోడ్‌షోలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు సోనియా.
ఈ పరిణామాలతో కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. మొన్నటికి మొన్న మాయవతిపై నోరుజారడం, అటు గుజరాత్‌లో దళితులపై దాడులను నియంత్రించలేక అప్రతిష్ట మూటగట్టుకుని దాదాపు దళితులకు దూరమయ్యే పరిస్థితిని కమలం కోరి తెచ్చుకుంది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే అద్భుతమే జరగాలన్నారు. గతంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో తమ ప్రత్యర్థులకు అలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి తమ వంతు వస్తుందన్న ఆశ ఉందని అన్నారు. మరి ఆయన మాటల్లోని అంతర్యాం ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు.