నయీమ్ డైరీలో ఏముంది..?
posted on Aug 10, 2016 @ 5:55PM
మోస్ట్ వాంటేడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టార్ నయీమ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. బతికుండగా ఎంతోమందికి నిద్రలేకుండా చేసిన నయీమ్..చనిపోయాక బతికున్నవాళ్లను చంపుతున్నాడు. గ్యాంగ్‌స్టార్‌గా పోలీసుల చేతిలో ఆయుధంగా మాఅతని కథ ముగిసిన వెంటనే నయీమ్ నేరసామ్రాజ్యాన్ని పేకలించి వేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే నయీమ్ ఇంట్లో జరిపిన సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్స్‌తో పాటు దొరికిన డైరీలో చాలా మంది ప్రముఖుల భండారాలున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డజన్ మంది ఐపీఎస్ అధికారులు, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని మరో 15 మంది ఐపీఎస్‌ల పేర్లు ఆ డైరీలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీటితో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అదనపు ఎస్సీ, డీఎస్సీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని 65 మంది మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. ఐపీఎస్‌లు, పోలీస్ అధికారులతో జరిపిన సంప్రదింపులు, వారు చెప్పిన పనులు, చేసిన వివరాలు స్పష్టంగా రాసున్నాయి. అనధికారిక ప్రచారం నయీమ్‌ను చాలా సార్లు పోలీసులు , పొలీటీషన్స్ కూడా వాడుకున్నారట. తాము నేరుగా హ్యాండిల్ చేయటం కుదరని సెటిల్మెంట్లు వంటివి నయీమ్ చేత చేయించి తిలా పాపం తల పిడికెడు పిడికెడు పిడికెడు... అన్నట్టు అందరూ పంచుకునే వారట! రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో వున్న ఈ లింక్ వల్లే నయీమ్ ఇంత కాలం మహారాజాలా లైఫ్ గడిపాడు. లేకపోతే వందల కోట్ల సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద తలనొప్పిగా మారిన ఒక క్రిమినల్ ఇంత కాలం ఎన్‌కౌంటర్ అవ్వకపోవటం, అది అతను దావూద్‌లా ఏ విదేశానికీ పారిపోకుండా ఇక్కడే వున్నా కూడా అంటే... వ్యవస్థలోనే నయీమ్ అభివృద్ధి, చావు రెండూ వున్నాయని అర్థం!.
నయీమ్ స్వస్థలానికి చెందిన పోలీసు సిబ్బంది సహా పలువురు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారికి తాను చేసిన సాయం తదితర విషయాలను నయీమ్ డైరీలో రాసుకున్నాడు. ఈ విషయం బయటపడితే పరువు పోవడంతో పాటు ఉద్యోగాలకే ఎసరొచ్చే పరిస్థితులు కలిగే అవకాశం ఉండటంతో ఖాకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఒకట్రెండు రోజుల్లో నయీమ్ గ్యాంగ్‌తో మిలాఖత్ అయిన వారి వివరాలు వెలుగుచూసే అవకాశముంది.