అప్పుడు ఆయన..ఇప్పుడు ఈవిడ..?
posted on Aug 10, 2016 @ 12:31PM
మనదేశంలో అన్ని పనులకు, ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంది గానీ రాజకీయాలకు లేదు. అందుకే తొంభైలకి దగ్గరవుతున్నా చాలా మంది నేతలు కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. మరేంతో మంది కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. వారి పరిస్థితి అలా ఉంటే మరి కొందరేమో అల్రెడీ కుర్చీల్లో ఉన్నా తమను తప్పించండి మహా ప్రభో అంటూ అధినేతలను వేడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వయోభారం కారణంగా చూపి ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. ఆనందీ..బీజేపీలో సీనియర్ నాయకురాలు..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె చెప్పిన కారణం కూడా ఈ సీనియారిటీనే..75 సంవత్సరాలు నిండిన వాళ్లు కీలక బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలన్నది బీజేపీ అభిమతం.
2014లో మోడీ అధికారంలోకి వచ్చి రాగానే బీజేపీ అగ్రనేతలు..ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహార్ జోషి, శాంతకుమార్, యశ్వంత్‌సిన్హా వంటి సీనియర్ నాయకులకు పదవులు దక్కకపోవడానికి కారణం వయోపరిమితే. మోడీ వారసురాలిగా 2014 మే 22న గుజరాత్ తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ తీవ్ర స్థాయిలో ఎగసిపడిన పటేల్ ఉద్యమం, ఉనాలో దళితులపై దాడి ఘటనతో రగిలిన దళితుల నిరసనోద్యమం ఆనందీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ ప్రభావంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిని, ప్రతిపక్ష కాంగ్రెస్ పుంజుకోవటం వెనువెంటనే జరిగిపోయింది. మోడీ ప్రధాని పీఠం అలంకరించే నాటికి బలంగా ఉన్న కమలం..తాజాగా వాడిపోయే దశకు చేరుకుంది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం...ఇక ఉపేక్షిస్తే లాభం లేదని..సీఎంగా ఆనందీని కొనసాగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని భావించారు. అందుకే ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవే ఆమె రాజీనామాకు అసలు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ప్రస్తుత తమిళనాడు గవర్నర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో..అనివార్య పరిస్థితుల్లో రోశయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిని తీసుకున్న నాటి నుంచి ఆయనకు "దినదినగండం నూరేళ్ల ఆయుష్షు" అన్నట్లుగా నడిచింది. పదవిలోకి వచ్చిరాగానే కర్నూలు, విజయవాడల్లో వరదలు, ఆపై జగన్ వేరు కుంపటి ఇవి చాలవన్నట్లు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో కేసీఆర్ దీక్షలు రోశయ్యకు కంటిమీద కనుకు లేకుండా చేశాయి. తన అనుభవంతో , శక్తిమేరకు సమస్యలను పరిష్కరించాలని చూసినప్పటికి కుదరలేదు. దీంతో రోశయ్య సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
వయస్సు వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్టు, తన రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన మీడియాకు తెలిపారు. అయితే వాస్తవంలో రోశయ్య పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది..జగన్‌ను కట్టడి చేయలేకపోవడం, ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై అసహనం కలిగేలా చేశాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలు కనిపిస్తుండటంతో అధినాయకత్వం రోశయ్యపై ఒత్తిడి పెంచింది. ఇక రోశయ్యకు రాజీనామా చేయక తప్పలేదు. దానికి కారణంగా వయోభారాన్ని చూపారు. ఆనందీ, రోశయ్య ఇద్దరూ తమ తమ పార్టీల కోసం దశాబ్దాల పాటు సేవలు చేశారు, ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతారా..? తప్పుకోవాలని అనుకుంటారా..? దాని వెనుక కారణం ఎంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.