సినిమా క్రియేటివ్ గా తీస్తాడు! పబ్లిసిటీ కన్నింగ్ గా కొట్టేస్తాడు!
posted on Dec 3, 2016 @ 2:26PM
రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ఇమేజ్! ఆయన రాక ముందు మన సినిమాలు ఒకలా వుంటే ఆయన వచ్చాక మరోలా మారాయి. అసలు ఇప్పుడు వారానికో హారర్ సినిమా జనం ముందుకి వస్తోందంటే అందుకు రాము తీసిన ఎన్నో దెయ్యం సినిమాలే కారణం! ఆర్జీవీకి ముందు టాలీవుడ్లో వయోలెంట్ మూవీస్, హారర్ మూవీస్ లేనే లేవా అంటే ... అదేం కాదు. కాని, వర్మ వచ్చాక ఆ జానర్ మూవీస్ కి భీభత్సంగా క్రేజ్ వచ్చింది!
రాము తన పాతికేళ్ల కెరీర్ లో సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువగా వివాదాలతో పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియా వచ్చాక ఆయన వివాదాన్ని కూడా తన పబ్లిసిటీ క్యాంపైన్ లో భాగం చేసేసుకున్నాడు! ఎలాంటి సినిమా తీసినా దానికి సంబంధించి ఏదో ఒక గొడవ రాజేయటం వర్మ స్టైల్. అది హిందీలో తీసిన సత్య అయినా, సర్కార్ అయినా, తెలుగులో తీసిన రక్త చరిత్ర అయినా, కొంత కాలం కింద జనంపైకి వదిలిన బెజవాడ అయినా... వివాదమే ఆయనే కలెక్షన్స్ సీక్రెట్!
సాధారణంగా తెలుగు సినిమా జనాలు గొడవలు అంటే భయపడిపోతారు. ఏ చిన్న కాంట్రవర్సీ అయినా తమ సినిమాకు నష్టం అని భావిస్తారు. కాని, రామ్ గోపాల్ వర్మ రివర్స్. కాంట్రవర్సీనే కాసులుగా మార్చేసుకునే టాలెంట్ ఆయనది. తాజాగా వంగవీటి సినిమా హడావిడి అలాంటిదే! ఆడియో రిలీజ్ దాకా వచ్చేసిన రౌడీయిజం బ్యాక్ డ్రాప్ మూవీ ఇప్పుడు వివాదంగా మారింది. స్వయంగా వెళ్లి వంగవీటి రంగా కూమారుడు వంగవీటి రాధను కలిసిన వర్మ... ట్విట్టర్ లో మాత్రం బేటి అంత గొప్పగా జరగలేదని పెదవి విరిచాడు. అంతే కాదు, తనను నవ్వుతూ బెదిరించే ప్రయత్నం చేశారని అన్నాడు! కాని, తాను ఇలాంటి స్మైలింగ్ వారెంట్ లకు జడవనని చెప్పుకొచ్చాడు!
అసలు వంగవీటి సినిమా విషయంలో ఎవరికి అభ్యంతరాలున్నా ఇంత కాలం సినిమా షూటింగ్ హ్యాపీగా జరిగేదే కాదు. ఎందుకంటే, ఆర్జీవీ ముహూర్తం షాట్ నుంచీ అన్నీ చెప్పే చేస్తున్నాడు. కాని, మొత్తం అంతా అయిపోయాక ఆడియో టైంలో వంగవీటి ఫ్యామిలీని కలవటం, దేనికి సంకేతం? దాని వల్ల ఉపయోగం ఏంటి? వాళ్లు వారెంట్ ఇవ్వటం, వర్మ భయపడకపోవటం... ఇవన్నీ మీడియాలో సినిమా పేరును మార్మోగేలా చేసేవే తప్ప మరేం కాదు! గతంలో రక్త చరిత్ర సమయంలో కూడా అనేక మంది సినిమా గురించి అనేక కామెంట్లు చేశారు. రామూ కూడా ఇరు వైపుల వున్న కుటుంబాల్ని కలిసి మీడియా కెమెరాలకి బోలెడు ఫీడ్ ఇచ్చాడు! తనకు కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకున్నాడు!
రాంగోపాల్ వర్మ తన ప్రతీ సినిమా ముందు ఏదోలా వార్తల్లో వుంటూ పబ్లిసిటీ సంపాదించుకోవటం తప్పా? అస్సలు కాదు. ఆ మధ్య వచ్చిన లో బడ్జెట్ మూవీ ఐస్ క్రీం విషయంలో కూడా వర్మ పెద్ద గొడవే చేశాడు. అప్పుడు అతి చేసే రివ్యూవర్లని ఏకీపారేశాడు. ఆ దెబ్బకి ఐస్ క్రీం సినిమా వచ్చిందని కూడా తెలియని వారికి సైతం మ్యాటర్ తెలిసి పోయింది. బెజవాడ రౌడీలు అంటూ కూడా అలాగే చేశాడు. చివర్లో రౌడీలు అనే పదం తీసేసి థియేటర్స్ లో వదిలాడు. మొత్తం మీద ఇది మంచి తెలివైన పద్ధతనే చెప్పుకోవాలి! ఒక్క వివాదం ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీ బోలెడు ట్రైలర్స్, వాల్ పోస్టర్స్, ఇంటర్వ్యూస్ ... ఏవీ తెచ్చి పెట్టవు! ఆ విషయం రామూకి బాగా తెలుసు...