టీడీపీ, బీజేపిలకి... పవన్ 'రెడ్' సిగ్నల్ ?
posted on Dec 2, 2016 @ 2:36PM
పవన్ కళ్యాణ్ ... ఈ పేరుకి ఎంత క్రేజ్ వుందో అంతే అయోమయం కూడా తోడై వుంటూ వస్తోంది! మరీ ముఖ్యంగా, పొలిటికల్ గా పవర్ స్టార్ వ్యూహం ఏంటో ఇంత వరకూ ఎవరికీ అర్థమైనట్టు కనిపించదు! 2014లో జనసేన అంటూ హడావిడి చేసిన ఆయన దాన్ని పక్కన పెట్టి టీడీపీ, బీజేపి సేనలో చేరిపోయారు. రాజు అవుతాడని అభిమానులు ఊహించుకుంటే మామూలు సైన్యాధిపతిలా చంద్రబాబు, మోదీలకు ఉపయోగపడ్డాడు. అయినా కూడా జనం పవన్ ప్రభావంతో ఒకింత ఎక్కువ ఓట్లే వేశారు ఎన్డీఏ కూటమికి. కాని, చంద్రబాబు సీఎం, మోదీ పీఎం అయ్యాక పవప్ క్రమంగా వారికి దూరమవుతూ వస్తున్నాడు. తాజాగా కమ్యూనిస్టులతో బేటీ అయ్యి తన భవిష్యత్ రూట్ ఏంటో సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు...
తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులది వింత వ్యవహారం. వాళ్లు కలవని పార్టీ అంటూ లేదు. ఏపీ, తెలంగాణల్లో పెద్దగా బలం లేని బీజేపితో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు సీపీఎం, సీపీఐ వాళ్లు! ఓ సారి టీడీపీతో, ఓ సారి కాంగ్రెస్ తో, ఓ సారి టీఆర్ఎస్ తో... ఇలా ప్రధాన పార్టీలన్నిటితో కలిసి పని చేశారు. వైసీపీతో కూడా వాళ్లకు బాగానే అవగాహన వున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే, ప్రతీ అయిదేళ్లకు పొత్తులు మార్చేయటంతో వాళ్లకు గత కొంత కాలంగా అసలుకే మోసం వచ్చింది. క్రమంగా తెలంగాణ, ఆంద్రప్రదేశుల్లో వాళ్ల ప్రభావం తగ్గిపోతోంది. ప్రస్తుత ఏపీ అసెంబ్లీలోనైతే ఒక్క ఎర్ర కండువా ఎమ్మెల్యే కూడా లేడు. అదీ పరిస్థితి...
జనసేన పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలకలం సృస్టిస్తాడని భావిస్తున్న పవన్... బలం తగ్గిపోయి అంపశయ్యని చేరిన కమ్యూనిస్టుల్ని ఎందుకు చేరదీస్తున్నాడు? తాజాగా ఆయన సీపీఐ నాయకులతో ఎందుకు భేటీ అయ్యారు? పైకి ప్రజా సమస్యలనీ రొటీన్ గా చెబుతోన్నా రానున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది! అందుకు, క్యాడర్ వున్న కమ్యూనిస్టుల్ని పవర్ స్టార్ వాడుకోవాలనుకుంటాన్నారేమో! అటు ఎర్ర పార్టీల వారికి కూడా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల కంటే సినిమా గ్లామర్ వుండే జనసేనే కాస్త బెటర్ అనిపించవచ్చు. తిరిగి కొన్నైనా సీట్లు పవన్ ఫాలోయింగ్ తో సంపాదించుకోవచ్చని వాళ్ల క్యాలికులేషన్ కావొచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే ఇద్దరికీ లాభమే...
పవన్ ఎప్పుడు సభ పెడతాడో, వేదిక మీద నుంచి ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఈ మధ్య. అటువంటి అనూహ్యమైన స్పందన కలిగిన పవన్ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు దిగుతాడా అంటే... ఇప్పుడే చెప్పటం కష్టం. ఎన్నికల టైంకి ఏదైనా కావొచ్చు. కాని, 2014లో పచ్చ, కాషాయ కండువాలు కప్పుకుని బరిలో నిల్చిన కళ్యాణ్ ఈ సారి ఎర్ర కండువా వేసుకుని నామినేషన్ వేస్తే మాత్రం వ్యవహారం రంజుగానే వుంటుంది. టీడీపీ, బీజేపి ఒక వైపు, వైసీపీ ఒక వైపు, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్న పవన్ ఒక వైపు వుండటంతో ఏపీలో త్రిముఖ పోటీ ఫుల్ గా రక్తి కడుతుంది!