ట్రంప్ విదేశీ కాల్స్... షాకవుతోన్న స్వదేశీ మీడియా!
posted on Dec 3, 2016 @ 4:18PM
కొన్ని సార్లు రుచి మరీ కొత్తగా వున్నా తినేవాడికి అది మింగుడు పడదు! కొన్నాళ్లు పోతే తినగా తినగా వేము తియ్యగా వుంటుంది! ట్రంప్ గురించి ఇప్పుడు అలాగే చెప్పుకోవాల్సి వచ్చేలా వుంది! ఎందుకంటే, అమెరికన్ మీడియాకి తమ కొత్త అధ్యక్షుడు ఏ రోజు ఏం చేస్తాడో అర్థం కాకుండా వుంది. ఒకవేళ ఏదైనా చేసినా అది అస్సలు నచ్చటం లేదు! ఇది నిజంగా తప్పు పని చేస్తుండటం వల్లనా? లేక ఇంత కాలం అధ్యక్షులు పాటిస్తూ వచ్చిన ఆచారాలు, సంప్రదాయాలు ట్రంప్ పాటించకపోవటం వల్లనా? ఎవరికీ అర్థం కావటం లేదు...
ఇంతకీ ట్రంప్ అనూహ్యంగా చేస్తున్న పనులేంటి? మొదట్నుంచీ షాకింగ్ కామెంట్స్ చేసే ట్రంప్ ఇప్పుడూ అదే పని చేస్తున్నాడు. జస్ట్ మాట్లాడుతున్నాడు. అంతే! కాని, ఆయన చేస్తోన్న ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ అమెరికన్ మీడియాకి, పొలిటికల్ క్రిటిక్స్ అస్సలు మింగుపడటం లేదు! తాజాగా న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక పెద్ద వ్యాసమే రాసింది డొనాల్డ్ వరుస తప్పుల గురించి. వాటిల్లో మొదటిది మన శత్రు దేశం పాకిస్తాన్ గురించే...
ట్రంప్ ఇంకా అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టక ముందే దేశాధినేతలకు ఫోన్ లు చేస్తున్నాడు. ఇది తప్పేం కాదు కాని ఆయన వారితో మాట్లాడుతున్న తీరే షాకింగ్ గా వుంటోందట. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఆ దేశం చాలా ఫెంటాస్టిటిక్ అని, షరీఫ్ కూడా టెరిఫిక్ లీడరని అన్నాడట ట్రంప్. దీన్ని పాక్ చక్కగా ప్రచారం చేసుకుంది. కాని, ఇప్పుడు అక్కడి మీడియా ఇలా పాకిస్తాన్ ని పొగిడి ఇండియాకి చిర్రెత్తుకొచ్చేలా చేయటం దేనికని వాపోతోంది!
ట్రంప్ ట్రింగ్ ట్రింగ్ గొడవ పాక్ తో ఆగలేదు. తైవాన్ అంటే చైనాకు పడదు. దాన్ని తమ భూభాగం నుంచి విడిపోయిన ఒక రెబెల్ దేశంగా చూస్తుంది డ్రాగన్. అలాంటి తైవాన్ తో జాగ్రత్తగా డీల్ చేస్తూ వుంటుంది అమెరికా. తైవాన్ ని స్వతంత్ర దేశంగా గుర్తించను కూడా గుర్తించ లేదు వాషింగ్ టన్. కాని, ఇంత వరకూ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయని విధంగా ట్రంప్ తైవాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి కబుర్లు చెప్పాడు. దీనితో చైనా అగ్గి మీద గుగ్గిలం అయిపోతోందట!
ట్రంప్ చేసిన మరో ఫోన్ కాల్ అయితే ఇంకా దారుణం అంటోంది అమెరికన్ మీడియా. ఈ మధ్యే ఒబామాను పచ్చి బూతులు తిట్టిన ఫిలీప్పీన్స్ అధ్యక్షుడికి కూడా ఆయన ఫోన్ చేశాడు. తమ దేశంలో పర్యటించమని కూడా కోరాడట! ఒక ప్రెసిడెంట్ ని తిట్టిన అమెరికా వ్యతిరేకిని మరో ప్రెసిడెంట్ ఆహ్వానించటమేంటని తల పట్టుకుంటున్నారు కొందరు అమెరికన్స్! ఇక ట్రంప్ ఆదరణ అందుకున్న మరో ఇద్దరు... కజక్ స్తాన్ అధ్యక్షుడు, బ్రిటన్ లోని ఒక అతివాద పార్టీ మాజీ నేత! వీరిద్దర్నీ గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు. కాని, ట్రంప్ పనిగట్టుకుని వాళ్లతో మాట మంతీ కలుపుతున్నాడు! అదే సమయంలో బ్రిటన్ ప్రధాని థెరెసా మేను మాత్రం క్యాజువల్ గా అమెరికాకు రమ్మంటూ నిర్లక్ష్యంగా ఆహ్వానించాడట!
ఇక ఫైనల్ గా అమెరికన్స్ కు సరికొత్త రాజకీయం చూపించాడు ట్రంప్, ఈ మధ్య జపాన్ ప్రధాని వచ్చినప్పుడు. ఆయనతో మీటింగ్ లో డొనాల్డ్ తన కూతుర్ని కూడా వుండనిచ్చాడట! ఎంత ప్రెసిడెంట్ గారి అమ్మాయి అయితే మాత్రం మరో దేశ ప్రధానితో చర్చలు జరిగే టైంలో ఆమె వుండటం ఏంటని షాకవుతున్నారు చాలా మంది! ఇలాంటివి ఇప్పటి వరకూ అమెరికాలో ఏనాడూ జరగలేదు. మన దగ్గరంటే రాజకీయ నేతల కుటుంబ సభ్యులు ఏ మీటింగ్ కి వచ్చినా మనం లైట్ గా తీసుకుంటాం. కాని, అమెరికన్స్ కి ట్రంప్ చేస్తున్న పనులు విడ్డూరంగా, విభ్రాంతికరంగా కనిపిస్తున్నాయి! ఇంకా వైట్ హౌజ్ లో అపీషియల్ గా కాలుమోపక ముందే ఇంత కలకలం రేపుతున్న ట్రంప్ నాలుగేళ్లలో ఏమేం చేస్తాడో?