అమిత్ షా ఎంపిక చేసిన యూపీ సీఎం ఎవరో... ఎవ్వరూ ఊహించలేరట!
posted on Mar 15, 2017 @ 11:13AM
ఉత్తర్ ప్రదేశ్ లో భారీ గెలుపుతో మోదీ బాధ్యత తీరింది. కాని, ప్రస్తుత బీజేపికి చాణక్య, చంద్రగుప్తుల్లాంటి అమిత్ షా, నమోల్లో... ఇంకా అమిత్ షాకు బాధ్యత అలానే వుంది! అదే... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం. యూపీకి ముఖ్యమంత్రి అంటే కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే ముఖ్యం కాదు. కమల దళం భవిష్యత్ కి కూడా చాలా ముఖ్యం. 2019లో పార్లమెంట్ తిరిగి కైవసం చేసుకోవాలంటే ఉత్తర్ ప్రదేశే ముఖ్యం. దానికి సీఎంగా ఎవరుండి అద్భుతాన్ని సృష్టిస్తారనేదే కీలకం...
గోవా, మణిపూర్లలో మెజార్టీ లేకున్నా సీఎం పీఠం కబ్జా చేసేశారు కాషాయదళం వారు! స్వతంత్ర భారత చరిత్రలో బోలెడన్ని సార్లు కాంగ్రెస్ తనదైన రీతిలో ప్రజాస్వామిక బలప్రయోగం చేసింది. ఇప్పుడు అదే దాదాగిరిని బీజేపి రుచి చూపిస్తోంది. అమిత్ షా మార్చ్ 11 నుంచీ గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ కు చెక్ పెట్టడం పై దృష్టి పెట్టారు. పారికర్ ని ప్రయోగించటంతో గోవా కంట్రోల్ కి వచ్చేసింది. ఇక తొలిసారిగా బీజేపి కిరీటంలో మణిపూర్ మణి కూడా విజయవంతంగా వెలిగిపోతోంది. అయితే, విచిత్రంగా అమిత్ షాకు మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన రాష్ట్రాలు ఈజీ అయ్యాయి. కాని, స్వంతంగా రికార్డ్ స్థాయి మెజార్టీ సాధించిన యూపీలో మాత్రం సవాల్ ఎదురవుతోంది! సీఎం ప్రకటనా ఇంకా జరగలేదు...
యూపీలో సీఎం పదవికి ఎవరు అర్హులు అన్న దానిపై అసలు సమస్యంతా బోలెడు మంది సమర్థులు వుండటమే! యూపీ బీజేపి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య నుంచి మొదలు పెడితే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వరకూ చాలా మందే వున్నారు. ఇక కులాల వారీగా కూడా బ్రాహ్మణ నేతల్నుంచి లిస్ట్ ప్రారంభమైతే సామాజికంగా వెనుకబడ్డ కులాల నాయకుల వరకూ చాలా మందే వున్నారు! అమిత్ షాకు ఛాలెంజ్ గా మారింది ఇదే!
ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరు సీఎం అయినా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకవైపు మోదీ జనానికి మాటిచ్చినట్టు అభివృద్ధి చేసి చూపాలి. మరో వైపు కులాల కాంబినేషన్లో పార్టీని ఎక్కడా దెబ్బతినకుండా అందర్నీ కలుపుకుని పోవాలి. అలాగే, అన్నిటికంటే ప్రధానంగా, రామజన్మభూమి ఉద్యమానికి కేంద్రం అయిన ఉత్తర్ ప్రదేశ్ రాజ్యంలో... రామాలయం విషయంలో రాబోయే ఒత్తిళ్లని సీఎం తట్టుకోగలగాలి! ఇవన్నిటి కారణంగానే సీనియర్, గతంలో లక్నో పీఠం అధిష్ఠించిన అనుభవం వున్న రాజ్ నాథ్ అయితే బెటరని ఆరెస్సెస్ అంటోందట! కానీ, హరియాణాలో మనోహర్ లాల్ కట్టర్,మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి సర్ ప్రైజ్ సెలక్షన్స్ చేసిన మోదీషా ద్వయం... ఈసారి కూడా ఎవ్వరూ ఊహించని ఎన్నికతో మన ముందుకొస్తారని అంటున్నారు బీజేపిలోని కొందరు నేతలు!
ఆల్రెడీ అమిత్ షా ఒక అనూహ్య నేతను యూపీ సీఎంగా ఎంచుకున్నారనీ... కాని, అందరితోనూ చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్టు భావన కల్పించేందుకే కాలయాపన చేస్తున్నారని .... ఢిల్లీలోని కాషాయ వర్గాలు చెప్పుకొంటున్నాయి! ఇంతకీ ఎవరా అన్ ఎక్స్ పెక్టెడ్ సర్ ప్రైజ్ సీఎం? ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే!