మంత్రినే ఉగ్రవాది అనుకున్నారు… స్వంత సైనికులే ఎన్ కౌంటర్ చేశారు!
posted on May 5, 2017 @ 10:56AM
ఉగ్రవాదం… ఇప్పుడు దీని కంటే పెద్ద సమస్య ప్రపంచానికి ఏదీ లేదనిపిస్తోంది! ఎందుకంటే, నిన్న మొన్నటి వరకూ ఉగ్రవాదం కొన్ని దేశాలకీ, కొన్ని ప్రాంతాలకి పరిమితం! కానీ, రాను రాను టెర్రరిజమ్ లేని టెరిటరీ లేకుండాపోతోంది! ప్రపంచం మొత్తం ఉగ్రవాదుల గుప్పిట్లో బందీ అయిపోతోంది. హాయిగా నిర్భయంగా బతికేసే వాడు అమెరికా మొదలు ఆఫ్రికా వరకూ ఎక్కడా లేకుండా పోతున్నాడు!
కొన్ని దశాబ్దాల కింది వరకూ ఉగ్రవాదం అంటే ఆసియాలో వుంటుందనే ఆలోచన వుండేది. పాకిస్తాన్, పాలస్తీనా లాంటి ప్రాంతాల్లో విపరీతంగా వుండేది. ఇజ్రాయిల్, ఇండియా లాంటి దేశాలు బాధిత దేశాలుగా పరిగణింపబడేవి. కాని, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. వాల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తరువాత అమెరికా కూడా భయం లేకుండా నిద్రపోలేపోతోంది! ట్రంప్ నిషేధాలు, హెచ్చరికలు అన్నీ ఉగ్రవాదం చలువే! ఇక యూరప్ కూడా ఈ మధ్య దారుణంగా తయారైంది. ఎక్కడ ఏ టెర్రరిస్ట్ ట్రక్ తీసుకుని పైకొచ్చేస్తాడో అర్థం కాని పరిస్థితి! ఎక్కడ ఏ నైట్ క్లబ్ లో జనాల జీవితాలు తెల్లారిపోతాయో ఎవరికీ అర్థం కావటం లేదు!
ఉగ్రవాదుల అరాచకలతో అల్లాడిపోవటం మనకైతే కొత్త కాదు. పాకిస్తాన్ లాంటి దేశాలు స్వయంకృతం కారణంగా మానవ బాంబులతో దద్ధరిల్లిపోతున్నాయి! అయితే, ఎవరూ పట్టించుకోని పేద ఖండమైన ఆఫ్రికా పరిస్థితి ఏంటి? అక్కడా ఉగ్రవాదం ఉరిమి ఉరిమి మీద పడుతోంది! నిజానికి అమెరికా, యూరప్, ఆసియా కంటే ఆఫ్రికాలో టెర్రరిజమ్ మరింత అమానుషం! అందుకు అత్యంత తాజా ఉదాహరణ సోమాలియా మంత్రి కాల్చివేత!
అబ్బాస్ అబ్దుల్లాహి సిరాజీ, 31ఏళ్ల ఈ యంగ్ మినిస్టర్ సోమాలియా చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి! కాని, దురదృష్టం అతడ్ని బుల్లెట్ల రూపంలో వెంటాడి వేటాడింది! విషాదం ఏంటంటే… సిరాజీని ఎవరో ఉగ్రవాదులు చంపలేదు. ఆయన ప్రభుత్వానికి రక్షణగా వుండే సైనిక బలగాలే కాల్చి చంపాయి! అందుక్కారణం, తన కార్ తానే నడుపుకుంటూ వచ్చిన ఆయన్ని చూసి భద్రతా సిబ్బంది ఉగ్రవాదేమోనని అనుమానించటమే!
సోమాలియా ఆడిటర్ జనరల్ కి సెక్యురిటీగా వున్న జవాన్లు కార్ లో వస్తోన్న మంత్రిని చూసి టెర్రరిస్ట్ అనుకున్నారట! దాంతో కాల్పులు జరిపారు. మంత్రి అక్కడికక్కడే చనిపోయాడు! ఇది పైకి మామూలు మానవ తప్పిదంలా కనిపిస్తోన్నా… సోమాలియా లాంటి ఆఫ్రికన్ దేశాల్లో ఉగ్రవాద పంజాని కళ్లకు కడుతుంది! అక్కడ అందరూ అందర్నీ అనుమానించాల్సిన దుస్ఙతి! చివరకు, డ్రైవర్ లేకుండా స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మంత్రికి కూడా రక్షణ లేదక్కడా! అతడ్నీ అనుమానించే దారుణమైన వ్యవస్థ!
పోమాలియా ఉగ్రవాదంతో అల్లకల్లోలం అయిపోతోంది. అక్కడ పట్టపగలు రాజధాని నడిబొడ్డులో కూడా టెర్రర్ దాడులు జరుగుతుంటాయి. ఉగ్ర మూకలు గన్నులు పట్టుకుని రాక్షసానందంతో తిరుగుతుంటాయి. ఇంచుమించూ ఇలాంటి పరిస్థితే చాలా ఆఫ్రికన్ దేశాల్లో వుంది. ఆ మధ్య నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాదులు వందల మంది టీనేజ్ క్రిస్టియన్ అమ్మాయిల్ని ఎత్తుకెళ్లారు. ఇంత వరకూ వారి జాడ కూడా దొరకటం లేదు! అదీ అక్కడ నెలకొన్న నరకం!
ఒకవైపు ఆయుధ కంపెనీల స్వార్థం, మరో వైపు రాజకీయ నేతల దుర్మార్గం, ఇంకో వైపు మత పెద్దల , నాయకుల అమానుష సిద్దాంతం… అన్నీ కలిసి ఉగ్రవాదం రూపంలో సోమాలియా లాంటి ఎన్నో దేశాల్ని చిదిమేస్తన్నాయి. దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించటం లేదు…