"షీ" టీమ్‌ కానిస్టేబుల్‌‌నే వెంటాడిన ఆకతాయి

బహిరంగ ప్రదేశాలు..సెల్‌ఫోన్స్...సోషల్ మీడియా ద్వారా మహిళలలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిల పని పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో పోకిరీల బెడద కాస్తంత తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అయితే ఎంతోమంది ఆడపిల్లలను వేధింపుల నుంచి రక్షించిన షీ టీమ్‌లోని ఓ కానిస్టేబులే ఆకతాయిల బారిన పడితే..రాచకొండ సమీప ప్రాంతానికి చెందిన ఓ యువకుడు డిగ్రీ చదువుతున్న ఓ యువతి సెల్‌ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపేవాడు..   కొద్దిరోజులు ఓపిగ్గా భరించినప్పటికీ అతడి వేధింపులు తారాస్థాయికి చేరడంతో సదరు యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. విచారణలో భాగంగా షీ టీమ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఒకరు నిందితుడికి ఫోన్ చేశాగా..ఆ కేటుగాడు ఆమెనే వేధించడం మొదలుపెట్టాడు. టార్చర్ ఎక్కువ కావడంతో ఆ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..అతనిపై నిర్భయ చట్టం నమోదు చేసినా..పోలీసులకు చిక్కకుండా వేధింపులను అలాగే కొనసాగించాడు.   అక్కడితో ఆగకుండా ఆమె నెంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్స్‌లో నమోదు చేయడంతో..ఆమె వేధన వర్ణనాతీతం..పలువురు ఫోన్ చేసి మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఆగంతకుడిని పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్‌గా గుర్తించారు. సెల్‌ఫోన్‌ నెంబర్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇతన్ని పట్టుకోవడానికి కాస్తంత శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

మోదీకి, ట్రంప్ కి తలనొప్పిగా మారిన ‘అతి’వాద మద్దతుదారులు!

  మోదీ, ట్రంప్ ఇద్దరూ ఒకే రకం నాయకులు కాదు! కాని, ఇద్దరూ ఒకే రకమైన వివాదాస్పద నేతలు! ఎట్ లీస్ట్, నిజంగా వివాదాస్పదం అయినా కాకున్నా వారి ప్రత్యర్థులు, విమర్శకుల దృష్టిలో మాత్రం ఇద్దరూ ఒకే రకమైన నాయకులు! అమెరికాలో తాజాగా చెలరేగిన హింస, దానికి ట్రంప్ స్పందన ఈ విషయం మరోసారి ఋజువు చేసింది!   ఇంతకీ… అమెరికాలోని వర్జీనియాలో వున్న చార్లెట్స్ విల్లేలో జరిగింది ఏమిటి? సింపుల్ గా చెప్పుకుంటే… అమెరికాలో నివురుగప్పిన నిప్పులా వుండే వైట్స్ , బ్లాక్స్ గొడవ మళ్లీ రాజుకుంది! అమెరికా అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, ఆహా, ఓహో అనుకుంటాం. కాని, అక్కడ ఒకప్పుడు నల్లటి వార్ని కట్టుబానిసలుగా చూసేవారు. అమెరికా తొలి అధ్యక్షుడు వాషింగ్ టన్ తో సహా చాలా మంది నాయకులు బానిసత్వానికి మద్దతుగానే వుండేవారు! అబ్రహం లింకన్ తరువాత మాత్రమే బానిసత్వం నిషేధించబడింది! అయినా కూడా ఇప్పటికీ అమెరికాలోని కొంత మంది అతివాద తెల్లవాళ్లకి నల్లవారన్నా, ఇతర వర్ణాల వారన్నా చులకన భావం, ద్వేష భావమే! అలాంటి ఎక్స్ ట్రీమ్ రైట్ వింగ్ వైట్ అమెరికన్సే చార్లెట్స్ విల్లేలో గొడవకి కారణం అంటున్నారు చాలా మంది!   బానిసత్వాన్ని సమర్థించిన యూఎస్ సివిల్ వార్ కాలం నాటి ఆర్మీ జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహాన్ని తొలగించటాన్ని కొందరు వైట్ రైటిస్టులు వ్యతిరేకించారు. అంతే కాదు, పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకొచ్చి నిరసనలకి దిగారు. వారికి వ్యతిరేకంగా లెఫ్ట్ భావజాలం వున్న అభ్యుదయవాదులు కూడా నిరసనలకి దిగారు. చివరకు ఒకర్నొకరు రెచ్చగొట్టుకుని దాడులు చేసుకునేదాకా పరిస్థితి వెళ్లింది. ఆ ఘర్షణల్లో అతివాద తెల్లవారి సమూహంలో ఒకరు తన కార్ తో లెఫ్ట్ నిరసనకారులపైకి దూసుకొచ్చారు. దాంతో ఒక స్త్రీ చనిపోగా, 19మందికి గాయాలయ్యాయి.   శాంతి భద్రతలకి పెట్టింది పేరైన అగ్ర రాజ్యంలో ఇంత రచ్చ జరుగుతోంటే ట్రంప్ మాత్రం తప్పు ఇరు వైపులా వుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి విమర్శకుల్ని మరింత రెచ్చగొట్టాడు. నిర్ద్వంద్వంగా తెల్లవారిది తప్పని చెప్పకుండా తప్పు అన్ని వైపులా జరిగిందంటూ అతివాదుల్ని వెనకేసుకొచ్చాడు. దాని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. పుట్టుకతోనే ఎవ్వరూ ద్వేషించటం నేర్చుకోరని, ప్రేమించటం మనమే నేర్పాలని ఒబామా ట్వీట్ చేయటంతో అది పెద్ద దుమారంగా మారింది. ట్రంప్ ను ద్వేషించే వారు, ఒబామాను అభిమానించే వారు అందరూ ట్విట్టర్ లో లైకుల వర్షం కురిపించారు. ఒబామా చార్లెట్స్ విల్లే వయోలెన్స్ ని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక లైకులు పొందింది! దీన్ని బట్టి ట్రంప్ వ్యతిరేకత జనాల్లో ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు.   తన మీద ఎన్ని విమర్శలు వస్తోన్న ట్రంప్ మాత్రం తప్పు అందరిదీ అనే నొక్కి చెబుతున్నాడు. కేవలం రైట్ వింగ్ వైట్ ప్రొటెస్టర్స్ ది మాత్రమే తప్పని చెప్పటానికి ఆయన అంగీకరించటం లేదు. అందుక్కారణం ఆయనకు ఆ వర్గంలో భారీగా మద్దతుదారులుండటమే! ఇంతకీ, ఇదంతా విన్నాక మీకు మన దేశంలో ఏం గుర్తొస్తోంది? గోరక్షకులమని చెప్పి దాడులు చేస్తూ మోదీకి తలనొప్పిగా మారిన వారే కదా! గో సంరక్షకుల్ని కఠినంగా విమర్శిస్తే మోదీకి నష్టం. అలాగని వార్ని అలాగే వదిలేస్తే కూడా ప్రధాని ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ట్రంప్ పరిస్థితి కూడా అలానే వుందని చెప్పవచ్చు! ఇక్కడి లాగే అమెరికాలోనూ రైట్ వింగ్ అతి వాదులు చెలరేగిపోతున్నారు. చూడాలి మరి … మోదీ లాగా ట్రంప్ కూడా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయం కొనసాగిస్తారా? లేక ఏకపక్షంగా తన మద్దతు దారులకి వత్తాసు పలికి మరిన్ని గొడవలకి కారణం అవుతాడా?

రాజుగారు కారెక్కుతారా..?

2019 ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు కారు స్పీడును ఎవరూ ఆపలేరని చెబుతున్నప్పటికీ ఆయన మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు అనుకున్నారేమో గానీ..పార్టీకి అక్కడక్కడా ఉన్న లోటుపాట్లను సవరించే పనిలో పడ్డారు. మిగిలిన అన్ని పార్టీలతో పోలిస్తే గులాబీ దండుకి సినీ గ్లామర్ చాలా తక్కువ. అప్పట్లో విజయశాంతి..ఇప్పుడు బాబు మోహన్ తప్పించి మరోకరు లేరు. కానీ వారికి ఎన్నికల్లో ఓట్లు వేయించగల ఛరిష్మా లేదు. దీంతో ఆ లోటు పూడ్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ వరుస పెట్టి సినిమా వాళ్ల ఫంక్షన్లకు హాజరవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   అలాగే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా వెలుగొందుతున్న దిల్‌రాజు‌ను కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.  పరిశ్రమలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు చాలా తక్కువ. ఇలాంటి వారిలో దిల్‌రాజు ముందు వరుసలో ఉంటారు. స్వతహాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం..టాలీవుడ్‌ను ప్రభావితం చేయగల స్థాయిలో ఉండటంతో ముఖ్యమంత్రి.. రాజుగారిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన బ్యానర్‌లో వచ్చిన ఫిదా మూవీని స్వయంగా చూసిన కేసీఆర్ తెలంగాణ యాస, భాష గొప్పగా ఆవిష్కరించారని ప్రశంసించారు.   సీఎం కోరిక మేరకు దిల్‌రాజు టీఆర్ఎస్‌లో చేరితే నిజామాబాద్ లేదా జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయిస్తారట. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కవిత ఎమ్మెల్యేగా వెళితే ఆ స్థానాన్ని దిల్‌రాజు‌కి ఇవ్వాలన్నది కేసీఆర్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే విజయవంతమైన నిర్మాతగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తోన్న రాజు గారు రాజకీయాల్లోకి వెళతారా అన్నది తెలియదు. ఈ ఏడాది శతమానం భవతి, నేనులోకల్, డీజే, ఫిదాలతో బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్‌జోష్‌లో ఉన్న ఈ టైంలో ఆయన సినిమాలను విడిచిపెడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఊహాగానాలకు తెర పడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అమితాబ్‌కు కష్టాలు తప్పవా..?

సరిగ్గా ఏడాది క్రితం.."పనామా పేపర్స్" పేరిట చట్టప్రకారం దేశానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న ఎంతోమంది పెద్దమనుషుల బాగోతాలను "ది ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్" వెలువరించిన కథనాలతో ప్రపంచం ఉలిక్కిపడింది. 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం ప్రపంచవ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను బహిర్గతం చేసింది. ఈ లిస్ట్‌లో ఐర్లాండ్ ప్రధాని, పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్, సౌదీ అరేబియా రాజులతో పాటు మనదేశానికి చెందిన సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్. ఐశ్వర్యరాయ్ తదితరుల పేర్లను వెల్లడించింది. దీంతో పాటు సెకండ్ లిస్ట్‌లో మరింత మంది పెద్ద పెద్ద తలకాయలను బయటకు తెచ్చింది.   అయితే తదనంతర కాలంలో పనామా పేపర్స్ ఎలాంటి చప్పుడు చేయకపోవడంతో విషయం మరుగున పడిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పించడంతో పనామా పేపర్స్‌‌ గురించి ఇండియాలో చర్చించుకోవడం మొదలెట్టారు. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ సీరియస్‌గా రంగంలోకి దిగి 33 మందిపై చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఈ వ్యవహారంలో చిక్కులు తప్పేట్లు లేవు.  అమితాబ్, ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగణ్ తదితరులు వర్జిన్ ఐలాండ్స్‌లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలను అక్రమ మార్గాల్లో దేశం దాటించారన్నది పనామా పేపర్స్ చేసిన ఆరోపణ.   ఈ వ్యవహారంలో నిజాలను రాబట్టేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని బ్రిటీష్ వర్జిన్ ల్యాండ్‌కు పంపింది భారత ప్రభుత్వం. ఆ బృందం ఇచ్చే నివేదికను బట్టి వీరందరిపై చర్యలుంటాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనామా పేపర్స్ స్కాం పేరుతో విడుదల చేసిన జాబితాపై అమితాబ్ అప్పట్లోనే స్పందించారు. విదేశీ నౌకాయాన కంపెనీలకు తాను డైరెక్టర్‌గా నియమించబడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఏ కంపెనీకి పనిచేయడం లేదని..ఎవరో కావాలనే తన పేరును జాబితాలో చేర్చారన్నారు. నిజానిజాలు తెలియాలంటే..ఇండియాలో పెద్ద మనుషుల ముసుగు తొలగాలంటే వర్జినీయా ఐలాండ్స్ వెళ్లిన బృందం తిరిగి రావాల్సిందే. 

పాకిస్తాన్ కు మనకన్నా ఒక్క రోజు ముందే స్వతంత్రం ఎందుకొచ్చింది?

  ఆగస్ట్ 15, 1947న ఏం జరిగింది? ఈ ప్రశ్నకి భారతదేశంలో ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేస్తారు! డెబ్బై ఏళ్ల కింద ఆ రోజున మనకు స్వేచ్ఛ లభించింది! కానీ, విషాదంగా, బ్రిటీష్ వెళ్లిపోయిన అదే రోజున పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారై కూర్చుంది! ఆగస్ట్ 15, 1947నే ఆనాటి పాకిస్తాన్ కూడా ఏర్పాటైంది! ఆ దేశ మొదటి స్వాతంత్ర దినోత్సవం కూడా అదే నాడు జరిగింది! మరి ఇప్పుడెందుకు ఆగస్ట్ 14న… ఒక్క రోజు ముందే… పాక్ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది?   నిజానికి… పాకిస్తాన్ ఇండియాతో పాటే… ఆగస్ట్ 15న ప్రతీ యేడూ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. కాని, తన సెకండ్ ఇండిపెండెన్స్ డే నాటి నుంచీ ఆ దేశం భారత్ కంటే ఒక్క రోజు ముందుగా వేడుకలు జరుపుకుంటోంది! దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథే వుంది!   1947లో మనకు స్వాతంత్రం రావటానికి ముందు… 1945 ఆగస్ట్ 15వ తేదీన జపాన్ బ్రిటీష్ వారి ముందు లొంగిపోయింది! దాంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. అదే రోజున రెండేళ్ల తరువాత మనకు స్వతంత్రం ప్రకటించింది బ్రిటన్! ఆ దేశ అధికారిగా మన దేశంలో అప్పట్లో వున్నది మౌంట్ బ్యాటన్! వైస్రాయ్ గా వున్న ఆయన 1947లో … ఆగస్ట్ 15న జపాన్ పై బ్రిటీష్ విజయానికి సంకేతంగా జరిగిన వేడుకల్లో పాల్గొనాలని భావించాడు! అంతే కాదు, ఆగస్ట్ 15న న్యూ దిల్లీలో జరిగే భారత తొలి స్వతంత్ర వేడుకల్లోనూ పాల్గొనాలని భావించాడు! ఈ రెండు కారణాల చేత పాకిస్తాన్ కు ఒక రోజు ముందే, అంటే ఆగస్ట్ 14, 1947న స్వతంత్ర ప్రకటించేశాడు!   ఒక రోజు ముందే స్వేచ్ఛ లభించినా కూడా పాకిస్తాన్ 1947లో ఇండియాతో పాటే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఆ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం కూడా కావటంతో ప్రపంచ వ్యాప్త ముస్లిమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జిన్నా పిలుపునిచ్చాడు కూడా! కాని, మరుసటి సంవత్సరం పరిస్థితి మారిపోయింది! 1948లో ఆగస్ట్ 14 రంజాన్ నెల 27వ రోజైంది! అది ముస్లిమ్ లకు ప్రత్యేక పర్వదినం! అందుకని అదే రోజున సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పట్నుంచీ ఆగస్ట్ 14ననే పాక్ స్వతంత్ర వేడుకలు జరగటం పరిపాటి అయిపోయింది!   భారతదేశం స్వతంత్ర దినోత్సవం జరుపుకునే రోజున పాకిస్తాన్ జరుపుకోకపోపవటానికి మరో కారణం కూడా వుంది! అది ఇండియానే! మనమంటే అస్సలు పడని పాకీలు మనతో బాటూ స్వతంత్ర వేడుకలు జరుపుకోవటం సహజంగానే ఇష్టపడరు! ఒకవేళ జరుపుకున్నా ప్రపంచం దృష్టి భారత్ వైపునే వుంటుంది! అందుకే, ఒక రోజే ముందే హంగామా చేసేస్తూ వస్తున్నారు 69ఏళ్లుగా… ఇస్లామాబాద్ పాలకులు!

ప్రశాంత్ కిషోర్ ను ప్రశాంతంగా వుండనీయవద్దనే, టీడీపీ డిసైడ్ అయిందా?

  ప్రశాంత్ కిషోర్… పేరులో ప్రశాంతం వుంది కాని… ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక పార్టీని ప్రశాంతంగా వుండనీయకుండా చూస్తుంటాడు ఈ మేధావి! మోదీ కోసం దేశం మొత్తం మీద ప్రయోగించిన తన వ్యూహం తరువాతి కాలంలో బీహార్ లో ప్రయోగించాడు. ఆ తరువాత యూపీలో తన బుర్రని ఎక్కుపెట్టి ప్రత్యర్థుల్ని ఢీకొట్టాడు. మోదీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసినప్పుడు కాంగ్రెస్ కు, దాని మిత్ర పక్షాలకు నిద్ర లేకుండా చేశాడు. తరువాత బీహార్లో బీజేపికి పీడకలగా మారాడు. యూపీలోనూ కమలనాథుల్ని అల్లాడించాలని భావించాడు. కాని, పీకే ఎఫెక్ట్ ఉత్తర్ ప్రదేశ్ కాషాయదళంపై అస్సలు పని చేయలేదు! ఇక ఇప్పుడు ఏపీ మీద కన్నేశాడు ఆధునిక చాణుక్యుడు!   నిజంగా ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ ఏపీలో ఎంత వరకూ వుంటుంది? ఇప్పుడే చెప్పలేం. కాని, టీడీపీ వారు మాత్రం పెద్ద కర్రతోనే కొట్టాలని భావిస్తున్నట్టుగా వుంది! ఇంతకాలం ప్రశాంత్ కిషోర్ మోదీ కోసం, నితీష్ కోసం, రాహుల్ గాంధీ కోసం … ఎవరి కోసం పని చేసినా… ఆయన మీద ప్రత్యక్ష దాడి జరగలేదు. కాని, ఏపీ టీడీపీ పీకేని ఏకి పారేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది! తెర వెనుక వ్యూహాలు రచిస్తాడని పేరున్న ప్రశాంత్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. ఆయన ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా టీడీపీని అప్రతిష్ఠపాలు చే్స్తున్నారని కంప్లైంట్ చేశారు. పోలీస్ బాస్ తో జగన్ రాజకీయ వ్యూహకర్త మీద కూడా నిఘా పెట్టాలని విన్నపం చేశారు!   ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ ఎనలిస్ట్ మీద టీడీపీ ఎందుకు డైరెక్ట్ గా గురి పెడుతోంది? ఈ విషయం అర్తం కావాలంటే పీకే గ్రౌండ్ లెవల్లో చేస్తున్న హంగామాను అర్థం చేసుకోవాలి! ఆయన జగన్ తరుఫున నియోజక వర్గాల్లో ఎంటరైపోయి ఏకంగా ఎలక్షన్స్ కి సెలక్షన్సే చేసేస్తున్నారు! అంటే, వైసీపీ కీలక నిర్ణయాలు చాలా వాటిల్లో ప్రశాంత్ కిషోర్ మార్కు కనిపిస్తుందన్నమాట ముందు ముందు! ఆయనకు జగన్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేశారు కాబట్టే టీడీపీ వారు కూడా టార్గెట్ చేస్తున్నారు! అదీ కాక తప్పడు ప్రచారంతో సోషల్ మీడియాలో ప్రతాపం చూపటం… ఏ పార్టీ కూడా సహించదు! అందుకే, టీడీపీ వారు ప్రశాంత్ కిషోర్ ను నేరుగానే విమర్శించటం మొదలు పెట్టారు!   వచ్చే ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్ ఎంత వుంటుందో కాని… ఆయన పేరు మాత్రం బాగానే వార్తల్లో నాన వచ్చు! ఆయన మీద అధికార పక్షం కాన్నన్ ట్రేషన్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది!

వలస పక్షులు తిరిగి గూళ్లకు చేరే కాలమొచ్చేసిందా?

ఫిరాయింపులు ఫిరంగి గుండ్లలా తగులుతున్నాయి ఈ మధ్య పార్టీలకి! మరీ ముఖ్యంగా, ప్రతిపక్షంలోని పార్టీలకి తమ నాయకులు ఫిరాయించకుండా చూసుకోటం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇందుకు ఈ మధ్య జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలే మంచి ఉదాహరణ! అక్కడ మొన్నటి దాకా బలంగా వున్న కాంగ్రెస్ ఒకే పెట్టున ఏడేనిమిది మంది ఎమ్మేల్యేల్ని చేజార్చుకోవాల్సి వచ్చింది! శంకర్ సిన్హ్ వాఘేలా లాంటి సీనియర్ కూడా హస్తానికి హ్యాండిచ్చారు! అయితే, గుజరాత్‌లో ఫిరాయింపు బాధలు పడుతోన్న అదే కాంగ్రెస్ తెలంగాణలో గాలం సిద్ధం చేస్తోందని టాక్!   2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అదే పనిగా కేసీఆర్ వల విసిరారు. పదుల సంఖ్యలో టీడీపీ, టీ కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల హై కమాండ్లు ఏమీ చేయలేక చూస్తూ వుండిపోయాయి. అయితే, గులాబీ బాస్ ఏవో పొలిటికల్ కాలిక్యులేషన్స్ వేసుకుని గెలిచిన ఎమ్మెల్యేల్నే కాదు ఓడిపోయిన వార్ని కూడా తెచ్చి పెట్టుకున్నారు పార్టీలో. అయితే, ఈ వలసలు చాలా చోట్ల ఇప్పుడు వర్కవుట్ కావటం లేదు. వచ్చిన వారు, వున్న వారు మనస్ఫూర్తిగా ఇమడలేకపోతున్నారు. అందువల్ల అధికార పక్షం నుంచీ తిరిగి తమ స్వంతగూళ్లకు చేరే నాయకులు కూడా త్వరలో బయటకు రాబోతున్నారని టాక్!   టీఆర్ఎస్ నుంచి తిరిగి ఇతర పార్టీలకు ఎవరు వెళతారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కాని, ఆశ్చర్యకరంగా టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు పొందిన డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని పొలిటికల్ సర్కిల్స్ లో గాసిప్స్ నడుస్తున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లటమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మళ్లీ సోనియమ్మతో టచ్ లో వున్న ఆయన 2019ఎన్నికల కోసం కాంగ్రెస్ లోకి వెళతారని అంటున్నారు! దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది!   డీఎస్ టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లినా, వెళ్లకపోయినా కొందరు నాయకులైతే పార్టీలు మారే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం, నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో చెప్పయేటమేనట. పాత నియోజకవర్గాలే వుంటే టీఆర్ఎస్ లో చాలా మందికి టికెట్లు దొరకటం అనుమానమే. కాబట్టి కాంగ్రెస్ నుంచో, మరో పార్టీ నుంచో హామీ పుచ్చుకుని ప్లేటు ఫిరాయించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే స్థితి వుంది! అక్కడ కూడా ఇంత కాలం టీడీపీ వైపు ప్రవహించిన వలసల జలమంతా తిరిగి జగన్ కాలువల వైపు యూ టర్న్ తీసుకునేలా వుంది!

ఐపీఎస్‌కే ఎదురు నిలిచిన ఏడేళ్ల చిన్నారి..?

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా..ఇప్పటికీ రక్షక భటులంటే చాలా మందికి భయమే..అటు పక్కగా పోలీసు వ్యాను వెళుతున్నా..పోలీసులు కనిపించినా మన వెన్నులో వణుకు రావడం మాత్రం ఖాయం. అటువంటి పోలీసులకు ఎదురు నిలిస్తే ఇంకేమైనా ఉందా..కాకలు తీరిన పెద్ద మనుషులే వారి కళ్లలోకి చూడ్డానికి భయపడతారు అలాంటిది ఏకంగా ఐపీఎస్‌కే ఎదురు నిలిచి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు ఏడేళ్ల బుడతడు.   కేరళలోని పుథియవైపే వద్ద ఉన్న ఎల్పీజీ ప్లాంట్ వద్ద కొద్దిరోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు..వారిని అదుపు చేసేందుకు డీసీపీ యతీశ్ చంద్ర తన బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనను విరమించాలని చెప్పకుండానే ప్రజలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయించారంటూ ప్రజా సంఘాలు డీసీపీపై రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన హెచ్‌ఆర్సీ తమ ఎదుట హాజరుకావాల్సిందిగా యతీశ్‌ను ఆదేశించింది. కమిషన్ ఎదుట హాజరైన యతీశ్ చంద్ర తాను ఎవరినీ కొట్టలేదని, తన విధిని తాను నిర్వహించానని వెల్లడించారు.   అదే సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఏడేళ్ల చిన్నారి ఒక్కసారిగా పైకి లేచి "ఆ అంకుల్ అందర్నీ కొట్టాడు. తర్వాతి రోజు పేపర్‌లో అంకుల్ ఫోటో చూశానని" చెప్పడంతో అక్కడున్న కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజలు నిర్ఘాంతపోయారు. ఊహించని షాక్‌ నుంచి తేరుకున్న యతీశ్ .."నేను కొట్టానా.." అని చిన్నారిని ప్రశ్నించగా..దానికి ఆ బాలుడు "అవును..నువ్వే కొట్టావ్" అని సమాధానమిచ్చాడు. విచారణ అనంతరం డీసీపీ యతీశ్ మాట్లాడుతూ..ఈ బాలుడికి ఎవరో బాగా ట్రైనింగ్ ఇచ్చారని..అరెస్ట్ చేసిన ఆందోళనకారులను తాను బాగా చూసుకున్నానని చెబుతూ..అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌కు అప్పగించారు. అయితే ఐపీఎస్‌కు వ్యతిరేకంగా బుడతడు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు కేరళలో సంచలనం సృష్టిస్తోంది. కొందరు ఆ బాలుడిని మెచ్చుకుంటుండగా..మరి కొందరు ఆ కుటుంబానికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెక్లెస్‌రోడ్‌లో కూలిన హెలీకాఫ్టర్.. టీ.గవర్నమెంట్‌కు జర్క్

నవాబుల అడ్డాగా..చారిత్రక సంపదకు పట్టుకొమ్మగా భాసిల్లుతున్న భాగ్యనగరంలో పర్యాటకులు మెచ్చే ఎన్నో ప్రదేశాలున్నాయి. అయితే నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయే హైదరాబాద్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడం అంత సులభం కాదు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు..పర్యాటకులను ఆకర్షించేందుకు హెలీ టూరిజంకు శ్రీకారం చుట్టింది తెలంగాణ పర్యాటక శాఖ. కేవలం రూ.2,495లకే హైదరాబాద్ నగర అందాలను వీక్షించే జాయ్ రైడ్‌ను గత ఏడాది మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హుస్సేన్ సాగర్‌ తీరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా హెలికాఫ్టర్ ఎక్కి ఒకేసారి 12 మంది నగర అందాలను తిలకించేందుకు వీలు కలుగుతుంది.   దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పర్యాటకశాఖ కూడా దీనిని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.. అలా పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న జాయ్ రైడ్‌కు చిన్న షాక్ తగిలింది. నిన్న మధ్యాహ్నం 1.15 గంటలకు పర్యాటకులతో టేకాఫ్ తీసుకున్న తుంబి ఏవియేషన్‌కు చెందిన ఛాపర్‌ అంతలోనే తడబడి సాగర్‌వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.   నాలుగుసార్లు పర్యాటకులను తీసుకువెళ్లి వచ్చిన హెలికాఫ్టర్...మరో రైడ్‌కు కోసం సిద్ధమైంది..టేకాఫ్ తీసుకుని 10 అడుగుల మేరకు పైకి ఎగిరి వెంటనే కిందకి దిగింది. భూమికి ఐదు అడుగుల ఎత్తులోనే పైలెట్ కొద్దిసేపు గాలిలో నిలిపి ఉంచి..తర్వాత మళ్లీ పైకి లేపి యధావిధిగా పర్యాటకులకు సిటీ అందాలు చూపించాడు. అయితే హెలికాఫ్టర్ ఎక్కేందుకు పర్యాటకులు సిద్ధంగా ఉండగానే ఇవాళ్టీకి రైడ్ లేదని..వారికి డబ్బులు వాపస్ ఇచ్చేసి హెలికాఫ్టర్‌ను బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. ప్రమాదం జరగలేదని ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నా కానీ నగరవాసులు ఆ హెలికాఫ్టర్ ఎక్కాలంటే భయపడిపోతున్నారు. 

అమిత్ షా ఓటమిని తన ఖాతాలో వేసుకోరట..?

ఇటీవల ముగిసిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలిసిందే. తమకు బద్ధ శత్రువైన అహ్మద్ పటేల్‌ను ఓడించడానికి ప్రధాని మోడీ, అమిత్‌ షా చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. మెజారిటీ ప్రకారం తమకు రెండు సీట్లు గెలుచుకునే సత్తా ఉందని తెలిసికూడా..కావాలని మూడో అభ్యర్థిగా బల్వంత్ సింహ్‌ను పోటీలో నిలబెట్టారు. ఆయన్ను గెలిపించేందుకు గానూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఆరుగురిని బయటకు వచ్చేలా చేశారు. ఈ చర్యతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన శాసనసభ్యులను కాపాడుకునేందుకు బెంగళూరులో క్యాంప్ నిర్వహించింది.   తీరా రాజ్యసభ ఎన్నికలు రానే వచ్చాయి..బీజేపీ అధిష్టానం మూడు స్థానాలు తమవేనని భావించింది. కానీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అహ్మద్ పటేల్ విజయం సాధించడంతో కాషాయదళానికి షాక్ తగిలినట్లైంది. దీంతో లెక్క ఎక్కడ తేడా కొట్టిందా అని పోస్ట్‌మార్టం మొదలెట్టింది కమలదళం. ఈ రివైండింగ్‌లో బీజేపీ ఓడిపోవడానికి కారణం "వాఘేలా" అని తేలింది. వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు మీకే అని చెప్పి వాఘేలా నెత్తిన రాజ్యసభ ఎన్నికల భారాన్ని పెట్టారు మోడీ, అమిత్ షా. పాపం ఆయన శక్తికి మించి కష్టబడ్డారు కూడా. అయితే కాంగ్రెస్ నుంచి చీల్చిన ఆరుగురి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం, పోలింగ్ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఓటు బీజేపీకేనని బహిరంగంగా చెప్పడం వాఘేలాను చిక్కుల్లోకి నెట్టింది. ఈ రెండు అవకాశాలతో కాంగ్రెస్‌ను అదృష్టం వరించింది.   వాఘేలా తప్పిదం కారణంగానే బీజేపీ నవ్వులపాలు అవ్వాల్సి వచ్చిందని ఢిల్లీలోని పార్టీ పెద్దలు నివేదిక రెడీ చేసేశారు. షా కూడా ఓటమి తాలుకూ పాపం మొత్తాన్ని వాఘేలాపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తమ సామాజిక వర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అక్కసుతో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అహ్మద్ పటేల్‌కు ఓటేశారు. ఈ మ్యాటర్‌ను ఏ మాత్రం కదపని బీజేపీ హైకమాండ్‌ వాఘేలాను బలి పశువును చేయడం అర్థరహితం అంటూ గాంధీనగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

పోతూ పోతూ పొగబెట్టిన అన్సారీ!

మన దేశంలో రాష్ట్రపతి పదవే అలంకారప్రాయం. ఇక ఉప రాష్ట్రపతి సంగతి చెప్పాలా? ఉప రాష్ట్రపతి అడపాదడపా రాజ్యసభ నిర్వహించినప్పుడు తప్ప మరెప్పుడూ కనిపించరు! ఎక్కడ చూసినా ప్రధాని , మంత్రులు మాత్రమే కనిపించే వ్యవస్థ మనది. ఇక మిగిలిన కీలకమైన చోట్ల రాష్ట్రపతికి పెద్ద పీట వేస్తారు. మొత్తం మీద రెండో అత్యున్నత స్థానమైన వైస్ ప్రెసిడెంట్ పోస్టు… చాలా వరకూ న్యూస్ లో వుండదనే చెప్పాలి!   ఉప రాష్ట్రపతి మాట ఇప్పుడెందుకు వచ్చిందంటే… మన తెలుగు వాడు వెంకయ్యకి సీటు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు హమీద్ అన్సారీ. పదేళ్లుగా సైలెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గిరి కొనసాగించిన ఆయన వెళుతూ వెళుతూ మాత్రం వివాదం రాజేశారు. అదే ఇప్పుడు బీజేపి వారికి మంట రేపుతోంది! అన్సారీ యూపీఏ పాలకులు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక చేసిన వ్యక్తి. బాగా చదువుకున్న వాడు, సీనియర్ బ్యూరోక్రాట్ అయినప్పటికీ … కాంగ్రెస్ కు, సోనియాకు నమ్మకస్థుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! అదే ఆయనకు వరుసగా రెండు సార్లు పదవి కట్టబెట్టింది. అయితే, మోదీ సర్కార్ ఉప రాష్ట్రపతి పదవిలో ఆరెస్సెస్ నేపథ్యమున్న సీనియర్ బీజేపి నాయకులు వెంకయ్యను కూర్చోబెట్టాలని నిర్ణయించింది. కాబట్టి అన్సారీకి రిటైర్మెంట్ తప్పలేదు!   హమీద్ అన్సారీ చివరి సారి రాజ్యసభ నిర్వహించిన వేళ అన్ని పార్టీల నేతలు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. బీజీపి నాయకులు కూడా ఆయన గొప్ప వాడనే అన్నారు. మోదీ స్వయంగా తాము ఎంతో నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే, అంతలోనే అన్సారీ చేసిన ఓ కామెంట్ కలకలం రేపుతూ వార్తల్లోకి వచ్చింది. ఆయన ఓ ఇంటర్వ్యూలో దేశంలోని ముస్లిమ్ లు అభద్రతా భావానికి లోనవుతున్నారని అన్నారు! ఇది ఇంచుమించూ ఎవర్ని ఉద్దేశించి చేసిందో మనకు తెలిసిందే!   ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగిన అన్సారీ అధికార పక్షానికి తగిలేలా ముస్లిమ్ లు భయపడతున్నారని, బెదిరిపోతున్నారని కామెంట్స్ చేయటం సహజంగానే కాషాయ నాయకులకి నచ్చలేదు! బీజేపి అధికార ప్రతినిధి అయితే అన్సారీ రాజకీయ ఉపాధి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు! అయితే నిజం ఏంటో అన్సారీకే తెలియాలి. మోదీ వచ్చి మూడేళ్లు అయిపోయాక కూడా నిజంగా ముస్లిమ్ లు అభద్రతలో వున్నారా? లేక ఈ కామెంట్ ద్వారా ఆయన ఏదైనా రాజకీయ ఉద్యోగం సంపాదించే పనిలో వున్నారా? అల్లాకే తెలియాలి! ప్రస్తుతానికైతే … వెళుతు వెళుతూ ఆయన వార్తల్లోకి వ్యక్తిగా నిలిచారు! అంత మాత్రం క్లియర్…

వైసీపీ వారి మాటల తూటాలు… టీడీపీ వారికే తగులుతున్నాయా?

   అనౌన్స్ మెంట్ వచ్చింది. నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా అయిపోయింది. ఇక మిగిలింది యుద్ధమే! అవును… జరగాల్సింది బ్యాలెట్ వార్ కాదు రియల్ వారే! అంతలా ఉద్విగ్నంగా, ఉద్వేగంగా వున్నాయి నంద్యాలలో పరిస్థితులు! టీడీపీ, వైసీపీ రెండూ ల్యాండ్ మైన్ మీద కాలుపెట్టి నిలబడ్డాయి. పోలింగ్ పూర్తయ్యి ఫలితాలు వస్తే ఏదో ఒక పార్టీ నెత్తిన బాంబు పేలేలా వుంది. అయితే, అధికార టీడీపీది పరువు కోసం పోరైతే… వైసీపీది వచ్చే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు తాపత్రయం. కాని, ఫ్యాను పార్టీ ఆ తొందరలో పదే పదే నోరు జారుతోందా? అవుననే అనిపిస్తోంది జగన్ శిబిరం అపరిపక్వ మాటలు వింటోంటే…   నంద్యాల నియోజక వర్గం సీటు ఎవరిది? భూమా నాగిరెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఆయన చేరాక అకాల మరణం పొందటంతో ఇప్పుడు టీడీపీ ఆ సీటు తమదేనని రంగంలోకి దిగింది. అటు వైసీపీ కూడా నంద్యాల తమదేనని భావిస్తోంది. ఈ కారణం చేతనే అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ తమ సర్వశక్తులూ ఒడ్డి నంద్యాల సంపాదించాలని చూస్తున్నారు. అయితే, తమ నేతకి మేలు చేయాలనే ఉత్సాహంలో మొట్ట మొదట నోరు జారింది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. ఆమె దివంగత భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియపై నోరు పారేసుకున్నారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే, తండ్రి మరణంతో మంత్రి అయ్యావంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. అంతే కాదు, మరీ అభ్యంతరకరంగా అఖిలప్రియ చుడీదార్ వేసుకుని తిరుగుతారంటూ డ్రెస్సింగ్ ని కూడా టార్గెట్ చేసింది రోజా. ఒక మహిళా నాయకురాలి డ్రెస్సింగ్ గురించి మాట్లాడటం జనం మెచ్చుతారా? అదీ మరో మహిళ నేత అయిన రోజా, చుడీదార్ వేసుకోవటం సంస్కారవంతం కాదన్నట్టు మాట్లాడటం ఓట్లు సాధించి పెడుతుందా? కౌంటింగ్ నాడే తెలుస్తుంది!   వైసీపీ నాయకురాలు రోజా లాగే ఆ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తమకు రావాల్సిన మెజార్టీ గురించి మాట్లాడుతూ ఒక్క ఓటు తక్కువైనా మనం మగవాళ్లమే కాదంటూ, ఆడవాళ్లమన్నాడు! మగవాళ్లకంటే ఆడవాళ్లు తక్కువ అని చక్రపాణి రెడ్డి చెప్పకనే చెప్పారు! మరి మహిళా ఓటర్లు ఈ విధమైన ఆలోచనా ధోరణిని సహిస్తారా?   రోజా, చక్రపాణిరెడ్డి లాంటి ఇతర నాయకులు కాదు… ఏకంగా వైసీపీ బాస్ జగనే ఘోరంగా నోరు జారారు! చంద్రబాబును నడి రోడ్డు మీద నరికి చంపాలని ఆయన ఎందుకు అన్నాడో? ఏం ఆశించాడో? ఆయనకే తెలియాలి! పెద్ద రచ్చయ్యాక ఈసీకి వివరణ కూడా ఇచ్చుకున్నారు వైసీపీ అధ్యక్షులు!   ఒకవైపు వైసీపీ నుంచి వరుస వివాదాస్పద వ్యాఖ్యలు బయలుదేరుతున్నా టీడీపీ వారు జాగ్రత్తగా నోరు మెదుపుతున్నారు. నంద్యాల బరిలో గెలవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడా అతిగా మాట్లాడటం లేదు. చంద్రబాబు మొదలు ప్రతీ ఒక్కరూ వైసీపీ వారి ఓవర్ కామెంట్స్ ని క్యాష్ చేసుకునే పనిలో వున్నారు. అయితే, కౌంటింగ్ డే వచ్చే దాకా జగన్ వర్గం వారి మాటల ప్రభావం మనకు తెలియదు. రిజల్ట్స్ ఒకవేళ ఫ్యాన్ కి వ్యతిరేకంగా వస్తే… అందులో ఈ ఇష్టానుసారం మాట్లాడిన మాటల ప్రభావమూ ఖచ్చితంగా వుందనే భావించాలి!

నంద్యాల బరికి పార్టీల ఖర్చు ఎంత..?

ఎన్నికల్లో ఎంత మంచి అభ్యర్థి పోటీలో ఉన్నా..అతనికి ఎంత బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా లాభం లేదు..ఎందుకంటే ఇండియాలో డబ్బు ఖర్చు పెట్టనిదే ఎన్నికల్లో గెలవలేరన్నది జగమెరిగిన సత్యం. ప్రచారాన్ని పరుగులు పెట్టించాలన్నా..ఓటర్లను ఆకట్టుకోవాలన్నా డబ్బుదే కీలకపాత్ర.. రోజుల తరబడి ప్రచారం చేసినా ఆఖరి రోజున డబ్బులు పంచితేనే రాజకీయ పార్టీలు తమ పని అయినట్లు భావిస్తాయట. డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం నుంచి స్వచ్చంద సంస్థల వరకు ఎంతగా అవగాహన కల్పించినా.. ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టి మేం ఇస్తున్నామని పొలిటీకల్ పార్టీలు, వాళ్లు ఇస్తున్నారు కాబట్టి, మేం తీసుకోవడంలో తప్పేముంది అని జనం చెబుతూ ఉండటం గత కొన్నాళ్లుగా చెప్తున్న మాట.   దేశంలో అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగినట్లే ఎన్నికలకు కూడా ఖర్చు పెరిగిందని సర్వేలు రుజువు చేస్తున్నాయి. తప్పు కానీ ఒప్పు కానీ డబ్బు ప్రవహించకుండా ఎన్నికల పండగ అసాధ్యం. ఏ ఎన్నికలు వచ్చినా సరే వాటిలో తెలుగు రాష్ట్రాలే తీరే వేరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అక్రమంగా పట్టుబడ్డ 283 కోట్ల డబ్బులో 152 కోట్లు తెలుగు రాష్ట్రాలకు చెందినవే. సీజ్ చేసిన 130 లక్షల లీటర్ల మద్యంలో ఐదున్నర లక్షల లీటర్లు మన తెలుగు సోదరులను మత్తులో ముంచడానికి సరఫరా చేసిందే.   ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా డబ్బు, మద్యం ఏరులై పారుతుందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు నంద్యాల సీటు కోసం 100 కోట్లను ఖర్చు చేయబోతున్నాయట. ఎందుకంటే ఈ ఉప ఎన్నికకు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అయితే నంద్యాల ఉప ఎన్నికలో ధనవ్యయం విపరీతంగా జరిగే అవకాశం ఉందని..దీనికి అడ్డుకట్ట వేయాల్సిందిగా కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి.

నంద్యాలలో వైసీపీని కొట్టడానికి టీడీపీ ప్లాన్ ఇదే..?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు పక్క రాష్ట్రాల చూపు కూడా నంద్యాలపైనే.  ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాంప్రదాయం ప్రకారం అయితే టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సింది. కానీ భూమా నాగిరెడ్డి తమ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశంలోకి వెళ్లాడు కాబట్టి ఈ స్థానం తమకే చెందుతుందని చెప్పి పోటీకి రెడీ అయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్. తమ పనితీరును బేరీజు వేసుకునేందుకు..జనం తమ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పాలక, ప్రతిపక్షాలు రెండు నంద్యాల ఉప ఎన్నికను కొలమానంగా తీసుకున్నాయి. దీంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.   టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణులను ఉత్సాహపరుస్తుండగా.. సైకిల్ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు..రేపో మాపో సినీ గ్లామర్ కూడా తోడుకానుంది. ప్రస్తుతానికి అందిన అన్ని సర్వేల సమాచారం మేరకు వైసీపీకే విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోవడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోందట.   గత ఎన్నికల్లో వైసీపీకి ఎక్కడ ఓట్టు పడ్డాయి..మనకు ఎక్కడ పడలేదు అన్న దానిపై టీడీపీ అధినాయకత్వం విశ్లేషిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏరియాల వారీగా కార్యకర్తలను మోహరించింది. ప్రాంతాల సమస్యలు, వర్గాల వారీగా అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టింది. అలాగే కీలకమైన బలిజ ఓట్లను పొందడానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతు కూడగట్టేందుకు రాయబారం నడుపుతోంది టీడీపీ.. దీనిపై నేడో, రేపో తేలిపోనుంది. అన్నింటికి తోడు అధికారం చేతిలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఇలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు సమన్వయంతో ముందుకు సాగుతోంది సైకిల్..మరి కొద్ది రోజుల్లో స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి రానుండటంతో నంద్యాలలో పొలిటీకల్ సీన్ మొత్తం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఆనం బ్రదర్స్ కోసం బాబు మాస్టర్ ప్లాన్

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేతల్లో ఆనం బ్రదర్స్ ప్రముఖులు.. కాంగ్రెస్ హయాంలో జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించారు ఈ అన్నదమ్ములు. అయితే రాష్ట్ర విభజన పేరిట కాంగ్రెస్ చేసిన ఘోరమైన తప్పిదం హస్తం పార్టీకి చెందిన ఎంతోమంది నేతల రాజకీయ భవిష్యత్తును సమాధి చేసింది. ఆనం బ్రదర్స్‌కు కూడా ఇది తప్పలేదు. దీంతో అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి రాకను పార్టీలో చాలా మంది స్వాగతించారు కూడా అయితే పార్టీ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనబెట్టిందని ఆనం బ్రదర్స్ లోలోపల కుమిలిపోతున్నారు. దీంతో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది.   దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే చర్యలు చేపట్టారు. తన కలల ప్రాజెక్ట్‌ను ఆనం రామనారాయణ రెడ్డి చేతికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవేంటంటే చంద్రన్న భీమా, ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రెండు ప్రాజెక్ట్‌లను సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చివరికి అధికారుల చేతిలో కూడా పెట్టకుండా తానే స్వయంగా వీటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది..కొన్నింటిని అధికారులకు అప్పగించాలని సన్నిహితులు సూచించినా ముఖ్యమంత్రి వినడం లేదట. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్ పార్టీ మారేందుకు సన్నాహలు చేస్తున్నారనే వార్త చంద్రబాబు చెవిన పడింది. వారు టీడీపీని వీడితే నెల్లూరు జిల్లాపై పట్టు జారిపోతుందని సీనియర్ నేతలు సూచించడంతో ముఖ్యమంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. దీంతో ఆనం బ్రదర్స్‌ పార్టీ మారకుండా కీలక బాధ్యతలు అప్పగించాలని భావించినట్లు తెలుస్తోంది.   ఆనం రామనారాయణ రెడ్డికి ప్లానింగ్, ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టగా మంచి పేరుంది..అలాంటి వ్యక్తికి తన కలల ప్రాజెక్ట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఓ వైపు ఆనం సోదరులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇప్పటికే వారు వైసీపీకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుందని బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

గుజరాత్ కాంగ్రెస్… కన్నులొట్టవోయి చావు తప్పించుకుంటుందా?

ఒకప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాంగ్రెస్! ఇప్పటి కాంగ్రెస్… రాహుల్ గాంధీ కాంగ్రెస్! గాంధీ అన్న పేరు అదే అయినా, కాంగ్రెస్ అదే అయినా… పరిస్థితి మాత్రం వేరు! ఇంకా చెప్పాలంటే… దుస్థితి వేరు! గాంధీ పుట్టిన గుజరాత్ లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలే ఇందుకు సంకేతం! సాక్షాత్తూ సోనియా అంతరంగికుడు అహ్మద్ పటేలే అగమ్యగోచరమైన స్థితిలో పడిపోయారు! ఇక గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు…   గుజరాత్ అంటే ఈ తరం వారికి బీజేపి అనే తెలుసు! ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా అక్కడ హస్తం పార్టీ చేతులు కట్టుకుని కూర్చోవటం తప్ప చేసిందేం లేదు. వరుసగా కమలనాథులు అధికార పీఠం కైవసం చేసుకుంటూనే వున్నారు. మరీ ముఖ్యంగా, 2002 అల్లర్ల నెపంతో మోదీని జాతీయ విలన్ చేద్దామనుకున్న కాంగ్రెస్ ప్లాన్ బెడిసి కొట్టి పరిస్థితి మరింత దిగజారింది. గుజరాతీలు అంతకంతకూ హిందూత్వ ఎజెండాకు జై కొట్టి కాషాయ ధ్వజాన్నే నమ్ముకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కష్ట కాలం పరాకాష్ఠకు చేరినట్లే కనిపిస్తోంది…   ఒకప్పుడు కాంగ్రెస్ ను ముందుకు నడిపిన గాంధీ, పటేల్ లాంటి వారు గుజరాత్ నుంచే పుట్టుకొచ్చారు. అందుకే, కాంగ్రెస్ కూడా గాంధీ భూమిలో గట్టిగానే వుండేది. కాని, రాను రాను ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కాలంలో గుజరాత్ పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ కంచుకోటలో గొప్ప లీడర్లు పుట్టుకురావటం మానేశారు. మరో వైపు ఆడ్వాణీ రూపంలో బీజేపికి ఆయువు పట్టు గుజరాత్ లోనే దొరికింది. సోమనాథ్ నుంచే ఆయన తన రథ యాత్ర మొదలు పెట్టి బీజేపి శకానికి నాంది పలికారు! ఆ ఊపే ఇప్పటికీ గుజరాత్ లో కనిపిస్తోంది. బీజేపి రోజురోజుకి బలపడుతూనే వుంది. ఎంతగా అంటే… ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యసభ ఎన్నికలు సోనియా, రాహుల్ కి కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి.   గుజరాత్ లో అధికారం చేపట్టటం మాట ఎప్పుడో మరిచిపోయింది అక్కడి రాష్ట్ర కాంగ్రెస్. ఇక ఇప్పుడు వున్న ఎమ్మెల్యేలు కూడా చేతి పార్టీ చేయి నుంచి మెల్లగా చేజారిపోతున్నారు. సోనియా కుడి భుజం లాంటి అహ్మద్ పటేల్ పదే పదే గెలుచుకునే రాజ్యసభ సీటు ఈ సారి సాధ్యమో, అసాధ్యమో తెలియని స్థితిలో పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ 56మందితో కావాల్సినంత మద్దతు వున్న గుజరాత్ కాంగ్రెస్ అమిత్ షా వ్యూహాలు, శంకర్ సిన్హ్ వాఘేలా తిరుగుబాటుతో చిందరవందర అయిపోయింది. ఆయన, ఆయనతో పాటూ మరో ఆరుగురు బీజేపి వైపు జంప్ కావటంతో అహ్మద్ పటేల్ కు కావాల్సిన 45మంది ఎమ్మెల్యేల మద్దతు కష్టమైపోయింది. బెంగుళూరులో దాచి పెట్టుకుని తీసుకొచ్చి ఓటింగ్ కి పంపినా కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఎన్సీపీ, జేడీయూ లాంటి పార్టీలకున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేల్ని తమకు ఓటు వేయాల్సిందిగా కాంగ్రెస్ కన్విన్స్ చేసింది! అయినా కూడా రిజల్ట్స్ వచ్చే దాకా అహ్మద్ పటేల్ భవిష్యత్తు అయోమయమే! అచ్చంగా అదే స్థితిలో వుంది గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి కూడా!   బీజేపి తరుఫున అమిత్ షా, స్మృతీ ఇరానీ తప్పక గెలిచే స్థితి వుంది. ఇక మూడో అభ్యర్థిగా కమలం వారు నిలబెట్టిన అభ్యర్థి నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ వాడే! పైగా అతడే చీఫ్ విప్ కూడా! విప్ జారీ చేయాల్సిన వ్యక్తే బీజేపిలోకి జంప్ అయ్యాడంటే గుజరాత్ కాంగ్రెస్ గందరగోళం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు! ఇందుకు కారణం కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వుండే రుగ్మతే! హైకమాండ్ కల్చర్ నీడలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవటమే పార్టీని నిండా ముంచుతోంది! అందుకు తోడు మోదీ, అమిత్ షా లాంటి బీజేపి అగ్రనాయకులు దుస్థితి మరింత దుర్భరం చేస్తున్నారు! మొత్తానికి అహ్మద్ పటేల్ ఓడితే మాత్రం సోనియా, రాహుల్ తో సహా కాంగ్రెస్ వారంతా లోపం ఎక్కడుందో ఖచ్చితంగా వెదుక్కుని తీరాలి. లేదంటే, మోదీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ కేవలం నినాదంలా వుండటం సాధ్యం కాకపోవచ్చు!

రామ మందిరానికి సై అనేస్తోన్న ఓ వర్గం యూపీ ముస్లిమ్ లు!

అయోధ్య రామ మందిరం వ్యవహారం తేలిపోనుందా? సంకేతాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది! సుబ్రమణియన్ స్వామి లాంటి వారు చాలా సార్లు చెబుతున్నట్టుగా 2018లో బాబ్రీ వివాదం ముగిసిపోయేలా కనిపిస్తోంది! కోర్టుల్లో ఇంత కాలం ఏ కదలికా లేకుండా వున్న అయోధ్య కేసు చకచకా మలుపులు తిరుగుతోంది. త్వరలోనే రోజువారీ విచారణ కూడా మొదలు పెట్టనున్నారు సుప్రీమ్ జడ్జ్ లు! బీజేపి ఎంపీ స్వామీనే ఈ విధంగా కోర్టుని అభ్యర్థించారు. అయితే, అయోధ్య కేసులో ఇప్పుడు షియాలు కూడా కలుగజేసుకుని ఆసక్తి కలగజేస్తున్నారు…   1992లో బాబ్రీ కూల్చివేత జరిగినప్పటి నుంచీ సున్నీ పర్సనల్ లా బోర్డ్ కోర్టులో ముస్లిమ్ ల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే, తాజాగా అయోధ్య రామజన్మ స్థానం విషయంలో తమకూ హక్కు వుందని షియా పర్సనల్ లా బోర్డ్ ముందుకొచ్చింది. ఎప్పుడో 1945లోనే షియా, సున్నీలు బాబ్రీపై హక్కు కోసం కోర్టుకు వెళ్లారు. అయితే, అప్పుడు తీర్పు షియాలకి వ్యతిరేకంగా వచ్చింది. బాబ్రీపై హక్కుని సున్నీలకే అప్పగించింది స్వాతంత్ర్యానికి ముందటి కోర్టు. కాని, ఇప్పుడు దాన్ని కూడా సవాలు చేయనున్నట్టు షియా వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. బాబ్రీ నిజానికి షియా కట్టడమనీ, దానిపై తమకే హక్కు వుందని వారంటున్నారు!   షియాలు, సున్నీలు బాబ్రీ విషయంలో భిన్నాభిప్రాయాలతో వుండటం కొత్తేం కాదు. అయితే, తమకూ హక్కు వుందని ఇప్పుడు వ్యాజ్యంలో ప్రవేశించిన షియాలు రామ మందిరం నిరభ్యంతరంగా కట్టుకోవచ్చనటమే ఆసక్తికలిగిస్తోంది. సున్నీ పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా షియా బోర్డ్ బాబ్రీ కూల్చిన చోటనే కట్టాలని అనటం లేదు. ముస్లిమ్ లు అధికంగా వుండే మరో  చోట… రామ జన్మ స్థానానికి దూరంగా వుండేలా కట్టించాలని కోరుతోంది. అదే రెండు మత వర్గాలకి సౌలభ్యంగా వుంటుందని షియాలంటున్నారు!   షియా బోర్డ్ సూచించిన విధంగా కోర్టు బాబ్రీని మరో చోట నిర్మించాలని ఆదేశించవచ్చు. లేదా మరో రకమైన తీర్పు కూడా ఇవ్వవచ్చు. కాని, మొత్తం మీద కోట్లాది మంది షియాలకి ప్రాతినిధ్యం వహించే యూపీ షియా బోర్డ్ మందిర నిర్మాణానికి అభ్యంతరం లేదనటం పెద్ద పరిణామమే! దీని ప్రభావం తీర్పుపై వుంటుంది. ఎలా అన్నది మాత్రం మరి కొన్ని నెలలు సస్పెన్సే. వచ్చే సంవత్సరం దశాబ్దాల వివాదానికి, శతాబ్దాల కాలపు పంచాయితీకి తెర పడవచ్చు!  

మియాందాద్ మాట వింటే.. అడుక్కు తినాల్సిందే..!

ప్రపంచ క్రికెట్‌లో అనిశ్చితికి, వివాదాలకు మారుపేరైన జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాకిస్థాన్ అని చెప్పవచ్చు. ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌ వివాదాలు, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, అతిథ్య జట్టుకు భద్రతా కల్పించలేకపోవడంతో పాక్‌తో మ్యాచ్ అంటేనే ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు వేతనాలు కూడా సరిగా ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాల్సిందిగా బీసీసీఐని కోరింది పాక్. ఎందుకంటే భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఆ మజానే వేరు. మైదానం యుద్ధభూమిని తలపిస్తుంది   భావోద్వేగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ పక్కనబెడితే వాణిజ్య ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం. అందుకే ఇప్పటికిప్పుడు తమ క్రికెట్‌ను రక్షించే పెద్ద దిక్కుగా టీమిండియాను చూస్తొంది పాక్. ఇరు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌కు బీజం పడబోతుంది అనుకుంటూ ఉండగా..ఉరి సైనిక స్థావరంపై దాడి భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనికి ప్రతిగా భారత సైన్యం సర్జికల్స్ దాడులు నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తుందని భావించారు. అయితే ఆ తర్వాత వాతావరణం చల్లబడటంతో సిరీస్‌ కోసం చర్చలు ప్రారంభించింది పీసీబీ. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో బీసీసీఐపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది పాక్ క్రికెట్ బోర్డు.   తమ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతామని ఒప్పందం చేసుకుని ఇప్పుడు వాటిని రద్దు చేయడం వల్ల తాము రూ.1340 కోట్లు నష్టపోయామని..దీనికి బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాలని ఐసీసీని ఆశ్రయించింది పీసీబీ. ఈ వ్యవహారం అక్కడ నడుస్తుండటం, బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్న వేళ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న భారత్‌తో పూర్తి స్థాయి సంబంధాలను తెంచుకోవాలని మియాందాద్ అన్నాడు. అంతేకాకుండా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ను ఒప్పించాలని ఐసీసీ..వారు నిర్వహించే టోర్నీల్లో మాత్రం భారత్‌తో పాకిస్థాన్‌ను ఆడించాలనుకోవడం సరికాదన్నాడు. పాక్ ఎప్పుడైతే భారత్‌తో జరిగే ఐసీసీ టోర్నీలకు దూరంగా ఉంటుందో..అప్పుడు ఆ టోర్నీ ఆదరణ తగ్గుతుంది..దీంతో ఐసీసీ ఆర్థికంగా నష్టపోతుందని అప్పుడు మన విలువ ఏంటో తెలుస్తుందన్నాడు.   అసలే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ క్రికెట్‌కు మియాందాద్ వ్యాఖ్యలు శరాఘాతంగా తగిలే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ విశ్వవిజేతగా ఆవతరించడంతో పాకిస్థాన్ క్రికెట్‌కు తిరిగి కొత్త జీవం వస్తుందని అంతా భావిస్తున్నారు..ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐని కాదని ఐసీపీ ఏం చేయలేదు. అటువంటప్పుడు నయానో బయానో భారత్‌ను ఒప్పించుకోవాలి కానీ బలవంతంగా చేయగలిగింది లేదు. ఒక మాజీ కెప్టెన్‌గా, పాకిస్థానీయుడిగా మియాందాద్‌కు తమ జట్టుపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు..హుందాగా వ్యవహరించాల్సిన చోట, సహనం కోల్పోతే పాక్ క్రికెట్‌కు, క్రికెటర్లకు చిక్కులు తప్పవు.

గుజరాత్‌లో కాంగ్రెస్‌‌కు ఉన్న ఆ ఒక్క ఛాన్స్ మిస్..?

ప్రస్తుతం దేశం మొత్తం గుజరాత్ రాజ్యసభ ఎన్నికల గురించే చర్చ. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తోన్న సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఎలాగైనా రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే గుజరాత్ నుంచి ఖాళీగా ఉన్న మూడు సీట్లు తమకే చెందాలని భావిస్తోన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు తోడుగా మూడో అభ్యర్థిని పోటీకి పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ బల్వంత్ సింహ్ రాజ్‌పుత్‌ను అహ్మద్‌పటేల్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన గెలుపుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలను ప్రారంభించింది.   ప్రలోభాలకు లోనయ్యారో లేక భయపడ్డారో కానీ ఇప్పటి వరకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా మరికొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలి ఉన్న 44 మంది శాసనసభ్యులను తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు పంపి రక్షించుకునే ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే ఉండటం..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉండటంతో మిత్రపక్షాల వైపు చూస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకోవడం..ఆ ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు గెలుపొందడంతో వారి మద్ధతు తనకే లభిస్తుందని ఆశించిన హస్తానికి ఊహించని షాక్ ఇచ్చింది ఎన్సీపీ.   రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇచ్చే అంశంపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత ప్రపుల్ పటేల్ చెప్పడంతో కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కిపడ్డారు. గత యూపీఏ కూటమిలో తమ పార్టీ లేదు..ప్రస్తుతం అలాంటి కూటమి కూడా కొనసాగడం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీ మద్ధతు కోసం అందరూ రాయబారాలు నడుపుతున్నారని..కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రపుల్ పటేల్ స్పష్టం చేశారు. అయితే ఎన్సీపీ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వకుండా బీజేపీ ఆ పార్టీని భయభ్రాంతుకు గురి చేసిందని..రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి న్యూట్రల్‌గా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు ఉన్నపళంగా ఇలా మాట్లాడం పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఎన్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు మద్ధతు ఇస్తుందని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.