కేసీఆర్ ని కూడా మరిచి టీ కాంగ్ కేటీఆర్ తో యుద్ధం చేస్తోందా?
posted on Jul 27, 2017 @ 2:26PM
ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం ప్రధానంగా ఎవర్ని టార్గెట్ చేస్తుంది? ఉదాహరణకి ఏపీనే తీసుకుంటే… అక్కడ వైసీపీ నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే, ఆయన సీఎం కాబట్టి. సీఎంని విమర్శించటం ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు. దోషిగా చూపొచ్చు. అలాగే, దిల్లీలో అయితే ప్రతిపక్షాలు ప్రధానిని నిలదీస్తాయి. అలా చేయటం ద్వారా గవర్నమెంట్ మొత్తాన్ని జనం ముందు కార్నర్ చేయోచ్చు. కాని, తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది! దాంట్లోని మర్మమేంటో టీ కాంగ్ కే తెలియాలి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన నోరు తెరిచి తిట్టారంటే ప్రతిపక్షాలకు అది పరమ భయంకరమే! ఊరికే రాజకీయ విమర్శలు చేయటం కాకుండా కేసీఆర్ సెటైర్లతో, ఘాటు పదాలతో గడగడలాడిస్తారు. పాపం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ కంటే మరెవరికీ బాగా తెలియదు! ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్రా నాయకుల్ని ఏ రేంజ్లో ఏకిపారేసేవారో అలాగే ఇప్పుడు టీ కాంగ్ నేతల్ని చెడుగుడు ఆడుతుంటారు కేసీఆర్. అయితే, రోజూ కేసీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయటం లేదు. అవసరం వచ్చినప్పుడు, ఇక తప్పదనుకున్నప్పుడు దుమ్ము దులుపుతున్నారు. కాని, ఆయన్ని అదే రేంజ్లో కాంగ్రెస్ నేతలు విమర్శించిన దాఖలాలు ఇంత వరకూ లేవు. ఇక ఘాటైన పదాలతో కేసీఆర్ ను తిట్టగలగటం కలలో మాటే!
కేసీఆర్ ను తగిన రీతిలో ఎదుర్కోని తెలంగాణ కాంగ్రెస్ కేటీఆర్ ని మాత్రం చెడామడా మాటలు అనేస్తోంది. అదే రేంజ్లో కల్వకుంట్ల తారక రాముడు కూడా తన వాక్కు బాణాలు ఎక్కుపెడుతున్నాడు. తండ్రి లాగే సిగ్గు, శరం వుండాలి లాంటి మాటలు… ఉత్తమ్ కుమార్ని ఉత్తర కుమారుడనటమూ… ఇవన్నీ చేస్తూనే వున్నాడు. అయితే, రాను రాను కేటీఆర్, కాంగ్రెస్ నేతల మధ్య పర్సనల్ వార్ మరీ ఎక్కువైపోతున్నట్టు కనిపిస్తోంది. కేటీఆర్ కాంగ్రెస్ వార్ని పేరు పేరున వ్యక్తిగతంగా తిట్టిపోస్తుంటే అదే భాషలో జవాబిస్తున్నారు టీ కాంగ్ వాళ్లు! తాజాగా కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అని వెధవ అనే దాకా వెళ్లిపోయారు! ఈ వ్యక్తిగత దూషణల పర్వంలో ఇద్దరిదీ సమాన బాధ్యతనే చెప్పాలి!
కేటీఆర్ తో సంబంధాలున్న వారికి డ్రగ్ కేసుతో లింక్ వుందన్న దిగ్విజయ్ కు కూడా స్ట్రాంగ్ రిప్లై తప్పలేదు. కేటీఆర్ ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఘాటు సమాధానం ఇచ్చాడు. దీంతో తమ పార్టీలోని చిన్నా, పెద్దా నాయకులందర్నీ టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ యువరాజును ఆయన లాంగ్వేజ్ లోనే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ వారు. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా హరీష్ రావు, కవిత, ఆఖరుకు కేసీఆర్ కూడా కనిపించటం, వినిపించటం లేదు. కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లే యుద్దం నడుస్తోంది! సీఎం కుర్చీలో వున్న కేసీఆర్ ని వదిలేసి ఆయన కుమారుడ్ని టార్గెట్ చేయటం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లాభం పొందుతుందో.. ఎన్నికలు వస్తేగాని తెలియదు!