జంతర్‌ మంతర్‌లో బాబు దీక్ష

  విభజనపై కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపెట్టిన దీక్షకు వేదిక ఖరారయింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో యన దీక్షకు దిగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ దీక్షకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.   అయితే బాబుతో పాటు దీక్షలో పాల్గొనటానికి పెద్దయెత్తున కార్యకర్తలు అభిమానులు సిద్దమవుతున్నారు. బాబు చేపట్టిన ఈ దీక్షకు తెలంగాణ తో పాటు సీమాంద్ర ప్రాంతం నుంచి కూడా పలువురు అగ్రశ్రేణి నాయకులు హాజరు అవుతున్నారు.   అయితే ఈ దీక్ష తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకం కాదంటున్నాయి పార్టీ వర్గాలు, విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరితో పాటు, సీమాంద్ర ప్రజల్లో నెలకొన్న భయాలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు.

విజయన’గరం’

  విభజన నిర్ణయంతో భగ్గుమన్న విజయనగరంలో ఇంకా శాంతి భద్రతలు నెలకొనలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. మంత్రి బోత్సా సత్యనారాయణ ఆస్తులే లక్ష్యంగా సమైక్యవాదుల దాడులు చేస్తుండటంతో ఆయన ఆస్తులకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.   ఆంధోళనలు చేస్తున్న వారిపై సీఆర్‌పిఎఫ్‌ బలగాలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు, వ్రుద్దులు ఆందోళనకు దిగారు. బోత్సా సత్యనారాయణకు చెందిన కాలేజి భవనంపై దాడికి దిగిన ఆందోళన కారులు భవనంతో  పాటు ఫర్నిచర్‌ను కూడా ద్వంసం చేశారు. కర్ఫ్యూ ఉన్నందున ప్రజలు భయటికి రావద్దని పోలీసులు చెపుతున్న ఆందోళన కారులు మాత్రం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు.

రైల్వేశాఖకు కరెంట్‌ కష్టాలు

  విభజన సెగలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే విద్యుత్‌ జెఎసి సమ్మెతో సీమాంద్రలోని చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకోగా. రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది.   రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆది, సోమ వారాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు రోజుల్లో తొమ్మిది రైళ్లను పూర్తిగా, మరో నాలుగు రైళ్లను పాక్షికంగా నిలిపిస్తేన్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.   చెన్నై విజయవాడల మధ్య నడిచే పినాకిని , జనశతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌లను పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు తిరుపతి వెళ్లాల్సిన పద్మావతి, నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్‌ లను రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచీగూడల మీదుగా మళ్లించారు.

వెంకన్నకు సమైక్య సెగ

  సీమాంద్రలో వెల్లువెత్తున్న సమైక్య సెగలు తిరుమలేషునికి కూడా తాకాయి. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో భారీగా విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది. దీంతో తిరుమలకు కూడా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. తిరుమల చరిత్రలో కరెంట్‌ సరఫరా నిలిచిపోవటం ఇదే తొలి సారి అంటున్నారు అక్కడి ప్రజలు.   తిరుమల కొండపై జనరేటర్‌లతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నా అది స్వామి వారి ఆలయానికి, సేవలకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇతర వసతి గ్రుహాలకు, హాటల్లకు ఇతర అవసరాలకు కరెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కొన్ని గంటలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

సమైక్య షాక్‌

  తెలంగాణ నోట్‌కు కేభినెట్‌ ఆమోదం లభించిన నేపధ్యంలో వెల్లువెత్తున్న నిరసనలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. సీమాంద్ర జిల్లాల్లోని విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగటంతో ఉత్పత్తితో పాటు, సరఫరా వ్యవస్థలు కూడా అస్థవ్యస్థంగా మారుతున్నాయి.   దీనికి తోడు సీమాంధ్ర విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇప్పటికే జల విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో అవాంతరాలు విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నా యి. ఈ ప్రభావం ఆంద్ర ప్రదేశ్‌తో పాటు దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటి మీద కనిపించనుంది.   ఎన్‌టీపీసీలోని ఆరు యూనిట్లలో 1250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌టీ పీసీలో మొత్తం 1510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలి చింది.  ఆర్‌టీపీపీలోనూ 2560 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో 240 మెగావాట్ల వద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు.   పరిస్థితి మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే సీమాంద్ర ప్రాంతంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దక్షిణాది మొత్తం అంధకారంగా మారనుంది. ఏ  పరిస్ధిత్తుల్లో అయినా దక్షిణాది పవర్‌ గ్రిడ్‌ ఫెయిల్‌ అయిన పక్షంలో దాని మరమ్మత్తులకు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందంటున్నారు విధ్యుత్‌ రంగ నిపుణులు.

నేను విభజన వాదినే ; పనబాక లక్ష్మీ

  సీమాంద్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం పదవులు కాపాడుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీమాంద్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ విభజన వాదం అందుకున్నారు.   ఇన్ని రోజులుగా ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నా ఏ రోజూ నోరు విప్పని పనబాక లక్ష్మీ ఇప్పుడు మాత్రం అధిష్టానం నిర్ణయానికే తన ఓటు అని ప్రకటించారు. తాను మొదటి నుంచి విభజన వాదినే అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే తాను నడుచుకుంటానని తెలిపారు. సీమాంధ్రకు కావాలంటే ప్యాకేజీ ఇస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.

చీకట్లు కమ్ముకుంటున్న రాష్ట్రం

  తెలంగాణ నోట్‌కు కేభినెట్‌ ఆమోదం రావటంతో సీమాంద్రలో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఎపిఎన్జీవోలతో పాటు పలు ప్రజాసంఘాలు ఉద్యోగ సంఘాలు సమ్మెలో ఉండగా ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌ ఉద్యోగ సంఘం కూడా సమ్మెలోకి దిగనుంది.   రేపు ఉదయం ఆరుగంటల నుంచి సీమాంద్ర జిల్లాల్లోని అన్ని విధ్యుత్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్టుగా విధ్యుత్‌ ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ సాయిబాబ ప్రకటించారు. సమ్మె నుంచి అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.   జెన్‌కో, డిస్కంలతో పాటు వివిధ సంస్ధలకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు  ఈ సమ్మెలో పాల్గొననున్నారు. విభజన నోట్ వెనక్కి తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు సాయిబాబ. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో మన రాష్ట్రంతో పాటు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో అంధకారం అలుపుకోనుంది.

పుత్తూరు ఆపరేషన్ సక్సెస్: టార్గెట్ తిరుమల?

      పుత్తూరులో టెన్షన్ వాతావరణానికి తెరపడింది. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో ఆక్టోపస్ బృందం చేపట్టిన ఆపరేష్‌న పూర్తైంది. 11 గంటలపాటు సాగిన ఆక్టోపస్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నారు. బిలాల్, మున్నాలను రహస్యంగా ఆంబులెన్స్‌లో తరలించారు.   ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం పుత్తూరులోని ఓ ఇంటి వద్ద తమిళనాడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమమంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీఐ రామకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందగా, కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు సమాచారం. రెండున్నరేళ్లుగా ఉగ్రవాదులు చిత్తూరులోనే ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి ప్రాంతాల్లో వారు నివాసమున్నారు. తిరులమ, తిరుపతి, అలిపిరి,శ్రీనివాసం, విష్ణువాకం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, రిజర్వేషన్ కౌంటర్లు, చంద్రగిరి శ్రీవారి మెట్లమార్గం, సీఎం కిరణ సొంతూరు నగరిపల్లిలో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. పాతబట్ట వ్యాపారం చేస్తూ జీవనం సాగించిన ఉగ్రవాదులు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించలేదు. స్థానికులకు ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే వారు మకాం మార్చేవారు. వీరి కోసం రెండున్నరేళ్లుగా ఎన్ఐఏ,కౌంటర్ ఇంటలిజెన్స్ గాలింపు చర్యలు చేపట్టారు. బెంగుళూరు పేలుళ్లు, తమిళనాడు బీజేపీనేత హత్య, అద్వానీ హత్యకు కుట్రపన్నిట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు కేరళకు చెందిన అల్ ఉమా ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

సమైఖ్య ఆగ్రహంలో 'సత్తిబాబు'

      కేంద్రం రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలోఉద్యమం పూర్తిగా చెయ్యి దాటి పోయింది. సమైక్య ఉద్యమంలో ఉత్తరాంధ్ర మొదటి నుంచి ప్రశాంతత ఉద్యమానికే వేదికయ్యింది. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉత్తరాంధ్ర ఉగ్రాంధ్రగా మారిపోయింది. ముఖ్యంగా విజయనగరం జిల్లా రణరంగంగా మారిందనే చెప్పాలి.   ఈ ఆగ్రహంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ, బంధువర్గం టార్గెట్ గా ఆస్తుల విధ్వంసం జరుగుతుంది. సమైక్య వాదులో లేక బొత్స అంటే గిట్టని వాళ్ళో తెలియదు గాని ..ఆయన ఆస్తులపై తీవ్ర దాడులు కొనసాగుతున్నాయి.  శుక్రవారం ఆయన ఆస్తులపై ఆందోళనకారులు పెద్ద యెత్తున దాడి చేశారు. శనివారం కూడా ఆయన నివాసం వద్ద ఆందోళనలను కొనసాగిస్తున్నారు.  బొత్స నివాస ముట్టడికి మరోసారి విద్యార్థులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పుత్తూరులో ఉగ్రవాదులు పోలీసులు మధ్య ఫైట్

  రెండు రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకొన్నారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా వారు ఈ రోజు తెల్లవారు జామున ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాలో సరిహద్దు వద్దగల చిత్తూరు జిల్లాకు చెందిన పుత్తూరులో ఉగ్రవాదులు ఉంటున్న ఒక ఇంటిని చుట్టుముట్టారు. వెంటనే స్పందించిన రాష్ట్ర పోలీసు బలగాలు, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏర్పరచిన ఆక్టోపస్ కమెండోలు కూడా అక్కడికి చేరుకొని ఈ ‘ఆపరేషన్ స్టార్’ లో పాల్గొంటున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు, కమెండోలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. లోపల ఇస్మాయిల్, ఫక్రుదీన్, ఒక మహిళా, మరియు ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.   పోలీసులు ముందు ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ లోపలకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేసారు. కానీ లోనకి ప్రవేశిస్తే గ్యాస్ సిలిండర్ పేల్చివేస్తామని వారు బెదిరించడంతో, ఆ ప్రయత్నం విరమించి వారిని ఆ ఇంటికి రంద్రం చేసి టియర్ గ్యాస్ షెల్స్ లను లోపలకి విసిరారు. ఉగ్రవాదులు లొంగిపోవడమో లేక పోలీసుల చేతిలో హతమవడమో తప్పదు. ప్రస్తుతం ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.   ఈ రోజు తెల్లవారు జామున ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులలో తమిళనాడుకు చెందిన లక్షణ్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరణించగా, మరొక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు కొద్ది నెలల క్రితం తమిళనాడు మదురై జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీని హతమార్చేందుకు ఆయన వెళ్ళే దారిలో పైప్ బాంబ్ అమర్చిన కేసులో నిందితులు. 

హరీష్ రావు మాటకారితనం ప్రదర్శిస్తున్నారా

  కేసీఆర్ కుటుంబంలో అందరూ మంచి వాగ్ధాటి, రాజకీయ పరిణతి కలవారేనని అందరికీ తెలిసిన విషయమే. తెరాస నేతలు విద్యా, వ్యాపార, సినీ పరిశ్రమల నుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడిన ఆరోపణలను కూడా మరిచిపోయి, ఏపీ ఎన్జీవోలు నిరవదిక సమ్మెకు దిగినప్పుడు రాజకీయ నాయకుల అండతో సమైక్యాంధ్ర అంటూ కృత్రిమ ఉద్యమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా సమైక్యవాదులు ఆర్టీసీ బస్సులను తిరగనివ్వకుండా చేసి, కొందరు రాజకీయ నేతల ప్రైవేట్ బస్సులు తిప్పుకోవడానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు తమ సమైక్య ఉద్యమాలతో రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజల బ్రతుకులు దుర్భరం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసారు. కానీ అవే పనులు తాము కూడా గతంలో చేసామన్న సంగతిని మాత్రం తెరాస నేతలు ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.   నిన్న బొత్స సత్యనారాయణ ఇంటిపై సమైఖ్యవాదులు చేసిన దాడిపై స్పందిస్తూ తెరాస నేత హరీష్ రావ్ మళ్ళీ తన మాటకారితనమంతా మరోమారు ప్రదర్శిస్తూ సమైక్యఉద్యమంలో చీలికలు తేవాలని ప్రయత్నించారు.   సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా బొత్స ఇంటిపై దాడిచేయమని సమైక్యవాదులను ప్రోత్సహించారని, ఆయన ఒక ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించడం శోచనీయమని ఆన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం పార్టీల మధ్య, నేతల మధ్య, ఉద్యోగుల మధ్య జరుగుతున్నఆధిపత్య పోరు అని గ్రహించాలని ఆయన సీమాంధ్ర ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికయినా ప్రజలు ఈ కృత్రిమ ఉద్యమం చేస్తున్నవారి మాటలకు తలొగ్గకుండా తెలంగాణా ఏర్పాటుకి అందరూ సహకరించాలని ఆయన కోరారు.   ఆయన మొదట సమైక్య ఉద్యమం రాజకీయ నాయకుల అండతో సాగుతున్న కృత్రిమ ఉద్యమమని హేళన చేసారు. కానీ రెండు నెలల తరువాత కూడా వారి ఉద్యమం కొనసాగుతుండటం చూసిన తరువాత ఇప్పుడు మాట మార్చి ఇది ఆధిపత్యం కోసం జరుగుతున్న ఉద్యమం అంటున్నారు.   రాజకీయనాయకుల అండతో సాగుతోందని మొదట ఆరోపించిన ఆయన, ఇప్పుడు అదే రాజకీయ నాయకుల ఇళ్ళ మీద ప్రజలు దాడులు చేస్తుంటే, ఇదంతా ముఖ్యమంత్రి పనే అని వక్ర భాష్యం చెపుతూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలకు విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.   రాజకీయ నాయకుల అండతో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నట్లయితే వారు రాజకీయ నాయకులని ఎందుకు దూరం పెడతారు? ఎందుకు నానా విదాలుగా వారిని అవమానిస్తున్నారు? ఎందుకు నేడు వారి ఇళ్ళపై దాడులు చేస్తున్నారో హరీష్ రావ్ వంటి కుహాన మేధావులే వివరించాలి. ఈ ఉద్యమం రాజకీయ ఆధిపత్యం పోరుకోసం సాగుతున్న కృత్రిమ ఉద్యమo అంటూ సీమంధ్ర మంత్రులకి మధ్య ఆయన అపార్ధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.   హరీష్ రావ్ ఎంత గొప్ప మాటకారి అయినప్పటికీ లక్షలాది ప్రజలు స్వచ్చందంగా చేస్తున్నఉద్యమాలను ఈవిధంగా కించపరచడం, నేతల మధ్య తగవులు పెట్టే ప్రయత్నాలు చేయడం, తెలంగాణాను వ్యతిరేఖిస్తున్న కారణంగా ముఖ్యమంత్రిపై అబద్దాలను ప్రచారం చేయడం సబబు కాదని గ్రహించాలి.

కేసీఆర్ బాటలో జగన్మోహన్ రెడ్డి

  జగన్ జైలు నుండి విడుదలయిన నాటి నుండి, అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత తన భుజాలపై వేసుకొని, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను తన వెనుక నడువమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవసరమయితే వారు తమ పార్టీ జండాలు పట్టుకొని మరీ తన వెనుక నడువవచ్చనే ఒక ఆప్షన్ కూడా వారికిచ్చిఆయన తన ఉదారతను చాటుకొన్నారు.   జగన్ జైలు నుండి విడుదల అయినప్పటి నుండి కూడా తను అందరికంటే ఒక గొప్ప సమైక్యవాదిననే అభిప్రాయం ప్రజలలో కలిగించేవిధంగా మాట్లాడుతూ, వ్యూహాలు పన్నుతున్నారు. పైకి ఆయన సమైక్యాంధ్ర కోసం ఎంతో పరితపిస్తున్నట్లు కనిపించవచ్చును. కానీ ఆయన ప్రతీ మాట, వ్యూహం వెనుక సీమంద్రాలో తన పార్టీని బలపరచుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే తపన, తెదేపాను రాజకీయంగా దెబ్బతీయాలనే కసి దాగి ఉన్నాయని చెప్పక తప్పదు.   ఇక తాను, తన పార్టీ తప్ప మిగిలిన రాజకీయ నేతలు పార్టీలు అందరూ ద్రోహులే అన్నట్లుగా మాట్లాడుతున్న ఆయన తీరుగమనిస్తే, ఆయనలో కూడా కేసీఆర్ లక్షణాలే స్పష్టంగా కనిపిస్తాయి. కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటుతో ప్రజలను ఏవిధంగా ఆకట్టుకొన్నాడో, అదేవిధంగా ఇప్పుడు జగన్ కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఏవిధంగా తెలంగాణా అంశంపై కేవలం తనకు, తన పార్టీకే పేటెంట్ హక్కులున్నట్లు మాట్లాడుతాడో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ప్రత్యర్ధులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడో, జగన్ కూడా ఇప్పుడు సరిగా అదేవిధంగా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో తెదేపాను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు.   ఇది వరకు కేసీఆర్ కూడా తరచు తను రాజీనామాలు చేస్తూ, తన అనుచరులచేత రాజీనామాలు చేయిస్తూ ప్రజలలో ఎప్పటికప్పుడు తన రేటింగ్ నిలకడగా ఉంచుకొనే ప్రయత్నం చేసినట్లే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో యావత్ తెలంగాణా ప్రజలను, రాజకీయ పార్టీలను చివరికే కేంద్రాన్ని కూడా ఏవిధంగా తన ముందు మోకరింప జేసుకోన్నాడో నేడు జగన్ కూడా తన ఆమరణ నిరాహార దీక్షతో అదే ఫలం ఆశిస్తున్నాడు.కేసీఆర్ ఎంతో విజయవంతంగా అమలుచేసిన వ్యూహాలనే జగన్మోహన్ రెడ్డి కూడా నేడు అనుకరిస్తూ సీమంద్రాలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలపై రాజకీయంగా పైచేయి సాధించాలని తపిస్తున్నారు.   కానీ ఆంధ్రా కేసీఆర్ కావాలనుకొంటున్నజగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విడదీసేందుకు సర్వం సిద్దం చేసిన ఈ తరుణంలో తన వ్యూహాలతో రాష్ట్రం విడిపోకుండా ఆపలేకపోవచ్చునేమో కానీ సీమంద్రాలో నిలద్రొక్కుకొనే అవకాశం మాత్రం చాలా ఉంది.  

జగన్ ఉద్యోగ దీక్ష

  సీమంద్రాలో ప్రజలు పార్టీల వారిగా చీలి ఉన్నపటికీ, సమైక్యాంధ్ర కోసం అంతా ఒక్క త్రాటిపైకి వచ్చిమూడు ప్రధాన పార్టీలను సమదూరంలో ఉంచుతూ ఉద్యమిస్తున్నారు. వారికి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో వైకాపా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సమ్మె కాలానికి జీతంతో మరియు బోనస్ కూడా ఇస్తామని ఎర వేయజూసినప్పటికీ ఉద్యోగులు దానిని నిర్ద్వందంగా తిరస్కరించి ఉద్యమంపట్ల తమ నిబద్దతను చాటుకొన్నారు.   అయితే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే హైదరాబాదులో ‘సమైక్యశంఖారవం’ సభ వ్యూహంతో ఆయన వారిలో చీలికలు సృష్టించగలిగారు. ఆయన ఉద్యోగ సంఘాల నేతలను “మీరు సమైక్యాంధ్ర కోరుతూ లేఖవ్రాసి తెస్తే తొలి సంతకం చేస్తా”నని చెప్పడం ద్వారా, వారు ఏమిచేయాలో నిర్దేశిస్తున్నపుడే, సమైక్య ఉద్యమాన్నితన చేతులోకి తీసుకోవాలనే ఆయన మనసులో ఆలోచనలు బయటపడ్డాయి.   సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం రాష్ట్రవిభజన ఖరారు చేసి ఆయనకు మరో గొప్ప అస్త్రం అందించడంతో, నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొవడం ద్వారా సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులను పూర్తిగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన దీక్షవల్ల కేంద్రం తన నిర్ణయం ఉపసంహరించుకోకపోయినా, ఉద్యోగులను తనవైపు తిప్పుకోవాలనే ఆయన లక్ష్యం మాత్రం నెరవేరవచ్చును.   తనకు కష్టకాలంలో అండగా నిలచిన వ్యక్తులను (సబ్బం హరి, మహేందర్ రెడ్డి, కొండ సురేఖ తదితరులు) అవలీలగా వదుల్చుకొన్న జగన్మోహన్ రెడ్డి, రేపు ఉద్యోగులతో కూడా ఏవిధంగా ప్రవర్తించవచ్చో చూచాయగా అర్ధం అవుతోంది.

కేంద్ర బలగాలతో సీమాంద్ర కట్టడి

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్ నోట్‌తో సీమాంద్ర ప్రాంతం భగ్గుమనడంతో, పరిస్తితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తారేమోనన్న సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.     కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు మాట్లాడారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలకు 25కంపెనీల బలగాలను పంపాలని కోరారు. వెంటనే స్పందిచిన కేంద్రం తమిళనాడు, కర్నాటకలనుంచి ప్రత్యేక బలగాలను సీమాంద్ర ప్రాంతానికి తరలిస్తున్నారు.     శనివారం వరకు పూర్తి స్ధాయిలో బలగాలు రాష్ట్రానికి చేరనున్నాయి. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆ బలగాలతో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టనున్నారు.  

ప్రీ ఫైనల్స్‌ కు రెడీ

  త్వరలో జరగభోయే పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ కి ప్రీఫైనల్స్‌ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్‌ కు నగారా మోగింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాలకు సంభందించిన ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది.   నాలుగు రాష్ట్రాల్లో ఒకదశలోనే పోలింగ్‌ పూర్తిచేయనున్నట్టుగా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఛత్తీస్‌గడ్‌లో మాత్రం రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నేటినుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.   ఐదు రాష్ట్రాల్లో మొత్తం, 11 కోట్ల మంది ఓటర్లు ఉండగా, లక్షా 30 వేల పోలింగ్‌ బూతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్షన్లలో తొలిసారిగా తిరస్కరణ ఓటు సదుపాయం కల్పిస్తామని, నామినేషన్ పత్రాలలో ఖాళీలు వదిలితే తిరస్కరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.  

ఢిల్లీ వేదికగా బాబు నిరవదిక దీక్ష

  సీమాంద్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేఖంగా యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతికేకంగా ప్రజలతో పాటు నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం వైఖరిపై మండిపడ్డారు.   సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రవిభజనపై ముందుకు వెళ్లకూడదని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుండి డిల్లీలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు బాబు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, టిడిపి పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, వారి సమస్యల కోసం పోరాడుతుందని హామి ఇచ్చారు.   సీమాంద్రలో సమస్యలపై గతంలో రాష్ట్రపతిపి కలిసి చెప్పామని, ఇదే విషయాన్ని ప్రదానితో చెప్పాలని భావించినా.. ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలో సీమాంద్ర ప్రజల మనోభావాలను కించపరిచారన్న ఆయన విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు కనుకే దీక్షకు దిగుతున్నట్టుగా ప్రకటించారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ విడుదల చేశారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. చత్తీస్‌గడ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని, నవంబర్ 11న తొలిదశ, 19న రెండో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలోనే పోలింగ్ జరుగుతుందని, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న పోలింగ్, రాజస్థాన్‌లో డిసెంబర్ 1న పోలింగ్, ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్ 4న పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది.     ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని, ఎన్నికలకు ముందే అర్హులైన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని ఈసీ పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, లక్షా 30 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.