తట్టా..బుట్టా సర్దుకున్న 'ముఠామేస్త్రి'

      ఆంద్ర రాష్ట్ర విభజన అంశం విషయం ఎటు తేలినా కానీ ఒక్కరు మాత్రం ఏమీ అర్ధం కాని అయోమయ గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆ ఒక్కరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి. పాపం ఆ మహానుభావుడి జాతకం ఏమిటో కాని సామాజికన్యాయం కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు,అదికాస్తా బెడిసికొట్టింది. దెబ్బతో 19శాతం ఓటు బ్యాంకుతో అసెంబ్లీలో ఒక మూలాన కూర్చోవలసి వచ్చింది.   ఆ తరువాత పార్టీ ని నడపలేక పదవి కోసం, హోదా కోసం అల్లాడిపోతూ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి, ఎంచక్కా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసి రాజ్యసభలో మెంబర్ అయి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదా దక్కించుకొని బతుకుజీవుడా అనుకుంటూ ఉండగా, ఇంతలో ఈ తెలంగాణ విభజన ప్రక్రియ వచ్చి... దెబ్బకు సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది.  గతంలో శాసనసభలో ప్రభుత్వం పడిపోకుండా ఆపగలిగిన తన ఓటు బ్యా౦క్, ప్రస్తుత పరిస్థితుల్లో తన పదవి వీడిపోకుండా మాత్రం ఆపలేక పోయింది. ఏది ఏమైనా చివరకు పదవి, హోదా అన్నిటిని వదులుకోక తప్పింది కాదు. కనీసం తన పార్టీలో అలాగే కొనసాగినా ఈనాడు ప్రజలలో అతని పట్ల జాలైన ఉండేది. ఆఖరికి 'ముఠామేస్త్రి' కి మిగిలింది తట్టా బుట్టే..!    

కాంగ్రెస్ నేతల చిలుక పలుకులు

  రాష్ట్ర విభజన జరుగబోతోందని తెలిసినా డిల్లీలో సమావేశాలు పెట్టుకొంటూ విభజన జరిగేంత వరకు కాలక్షేపం చేసి, ఇప్పడు పార్టీ మమ్మల్ని మోసం చేసిందని సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వచ్చి మోసలి కన్నీరు కారుస్తున్నారు,  తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తమని మోసం చేసిందని చెపుతూనే మరో వైపు ప్రతిపక్షాలని నిందించడం విశేషం. ఇంత జరిగినా తాము మాత్రం నూటికి నూరు శాతం సమైక్యవాదులమేనని ప్రజలని ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొగుడ్ని కొట్టి వీదికెక్కినట్లు, రాష్ట్ర విభజన జరిగేందుకు అధిష్టానానికి పూర్తి సహకారం అందించి, ఇప్పుడు టీవీ చాన్నాళ్ళ ముందు గద్గద స్వరంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి  విచారం చూసి ప్రజలకు వారిపై జాలి కలుగకపోగా మరింత ఏహ్యత కలుగుతోంది.   లగడపాటి: మా కాంగ్రెస్ పార్టీ ప్రజల్నేకాక మమల్ని కూడా మోసం చేసింది. ఎవరి కోసమో మమ్మల్ని, ప్రజల్నిబలి చేస్తోంది. అందుకే పదవికి రాజీనామా చేసేసాను.   కిరణ్ కుమార్ రెడ్డి: ఆత్మగౌరవం దెబ్బతిన్నాక ఇంకా డిల్లీతో పనేముంది. ఎవరికోసమో మమ్మల్ని విస్మరించి, మేము పార్టీని విస్మరించేలా చేస్తోంది.   ఉండవల్లి: కాంగ్రెస్ పార్టీ మా అభిప్రాయాలను కానీ ప్రజల మనోభావాలను గానీ పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేసాను.   బొత్స: రాష్ట్ర విభజన నాకూ చాలా బాధగానే ఉంది. దీనికంతటికీ కారణం తెదేపా, వైకాపాలే. వారు మొదటే రాష్ట్ర విభజనకు అంగీకరించమని స్పష్టంగా చెప్పి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ రెండు పార్టీలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నాయి. కానీ మేము అలా కాదు. టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా కావాలని డిమాండ్ చేస్తూంటే, సీమంద్రా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెపుతూనే ఉన్నాము. కానీ ఏమి చేస్తాం? హైకమాండ్ నిర్ణయం అలా ఉంది మరి! ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపమని కూడా అడిగాము. కానీ మరెందుకో రాలేదు. అయినా ఇక్కడి ప్రజల సమస్యల గురించి మా హైకమాండ్ కి వివరిస్తాను. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కూడా చెపుతాను. సమస్యలు వచ్చినప్పుడు పార్టీని వీడిపోవడం సబబు కాదు.   ప్రజలు: చేయవలసినంతా చేసి ఇంకా ఈ మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకు? ఇంకా మమ్మల్ని మభ్యపెట్టడమెందుకు? 

తెలంగాణ ఇచ్చిన నక్సల్స్ సమస్య ఉండదు: షిండే

      తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే నక్సల్స్ సమస్య ఎక్కువవుతుందన్నది అవాస్తవం అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లను అణచి వేయడంలో మంచి రికార్డు ఉందని..విభజన తరువాత కూడా ఇరు ప్రాంతాలలో నక్సల్స్ సమస్య ఉండదని షిండే స్పష్టం చేశారు.     ''రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అవతలి వారి మనసులు బాధగా ఉండడం సహజమే. అప్పుడు వారిని ఓదార్చడం తప్ప మరేమి చేయలేం. ఎవరయినా ఈ మనోభావాలకు అతీతులు కారు. ఇరుప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పేందుకు..వారి మధ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం” అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. మిగిలిన రాష్ట్రాల డిమాండ్ కంటే ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మాత్రమే ముఖ్యం అని అన్నారు.

రాజీనామా పై చిరుకి ప్రధాని ఫోన్

      కేంద్ర మంత్రి చిరంజీవికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఫోన్ చేసిన ప్రధాని మన్మోహన్ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారట. కానీ చిరంజీవి మన్మోహన్ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని.. కాబట్టి రాజీనామా వెనక్కి తీసుకోనని చెప్పానట్లు సమాచారం.     మరో కేంద్ర మంత్రి పళ్లం రాజు సోనియాతో భేటీ అయ్యారు. భేటీలో ఏం మాట్లాడిందీ ఆయన వెల్లడించలేదు కానీ.. అధిష్టానానికి వ్యతిరేకంగా మీడియా ముందు గళం విప్పారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజలకు నమ్మకం ద్రోహం చేసిందని విమర్శించారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటుందని భావించామని.. కానీ అంతలోనే కేబినెట్ ముందు నోట్ పెట్టి హడావుడిగా విభజన చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

జగన్ దీక్ష సమైక్యం కోసమేనా

        సీమంద్రాపై పట్టుకోసం తీవ్రంగా కృషిచేస్తున్న వైకాపా ఊహించినట్లుగానే సమైక్యాంధ్ర ఉద్యమాన్నిమరింత తీవ్రతరం చేయడం ద్వారా ఇంతవరకు పార్టీల వారిగా విడిపోయినప్పటికీ సమైక్యంగా ఉద్యమం చేస్తున్న ప్రజలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోంటునట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తనకంటే ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబుని, తెదేపాను కూడా తనతో ఉద్యమంలో కలిసి పనిచేయాలని కోరి అతితెలివి తేటలు ప్రదర్శించడం విశేషం. ఈవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధిని కూడా ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచడం ఆయనకు కొత్తేమి కాదు. గతంలో ఆయన తన పార్టీ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించినపుడు, ఆ తరువాత తను, తన తల్లి విజయమ్మలు తమ పదవులకు రాజీనామాలు చేసినపుడు కూడా తేదేపాను ముగ్గులోకి లాగడానికి చేసినవే. తొలి ప్రయత్నంలో కొంత మేర సఫలమయినప్పటికీ, రెండో ప్రయత్నంలో మాత్రం చట్టసభలలో అడుగుపెట్టకుండా చేసుకొని పోరాపాతుచేసామని గ్రహించారు.     ఇక ఇప్పుడు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నప్రజలతో మమేకం అవడం ద్వారా వారిలోకి తేలికగా చొచ్చుకుపోవచ్చుననే ఆలోచన కనబడుతోంది. అయితే ఈరోజుల్లో ఆమరణ నిరాహారదీక్షలు ఏరకంగా ముగుస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకు ఆయన తల్లి విజయమ్మ చేసిన ‘ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష’,  అతను స్వయంగా జైల్లో చేసిన ‘ఆరు రోజుల ఆమరణ నిరాహార దీక్షలే ఇందుకు మంచి ఉదాహరణలు. రేపు ఆయన మొదలుపేట్టబోయే దీక్ష కూడా ఈవిధంగానే ముగిసే అవకాశం ఉంది. అదేవిధంగా తన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం నిర్ణయం మార్చుకోదని జగన్ కు తెలియకపోదు. అందువల్ల ఇది సీమంధ్ర ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న దీక్షగానే భావించవలసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకపక్క నీతి నిజాయితీ అని మాట్లాడుతూ మరో వైపు ఇటువంటి దురాలోచనలు చేయడం వలన ముందుగా ఆయనే మరో మారు ‘విశ్వసనీయత’ కోల్పోతారని గ్రహించాలి.

జగన్ ఆమరణ నిరాహార దీక్ష

      వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాదులో తన పార్టీ కార్యాలయం ముందు రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రెండు నెలలుగా సీమంధ్ర ప్రజలుచేస్తున్న ఉద్యమాలను ఏ మాత్రం ఖాతరుచేయకుండా ‘మీ చావు మీరు చావండి’ అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికయినా రాజకీయాలకు అతీతంగా తెదేపా మరియు ఇతర పార్టీలన్నీ తమతో కలిసి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు.   తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు; మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జలవనరుల ట్రిబ్యునల్స్ ఉన్నపటికీ ఆ రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్దాలు తప్పడం లేదని, ఇక ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతే తెలుగు ప్రజలు ఒకరితో ఒకరు నీటి కోసం కొట్టుకొనే పరిస్థితి ఏర్పడుతుందని, అటువంటి పరిస్థితి రాకుండా నివారించాలంటే ఇప్పటికయినా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే, అయన ఆమరణ నిరాహార దీక్ష చేప్పటడాన్ని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఆయన గొడవలు రెచ్చగొట్టి యుద్ధ వాతావరణం సృష్టించేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

24 గంటల డెడ్ లైన్: చంద్రబాబు

      తెలంగాణ నోట్ కు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టె రీతిలో లెక్కలేనితనంతో వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ''24 గంటల సమయం ఇస్తున్నాం. చర్చల ప్రక్రియ మొదలు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. మా పార్టీపరంగా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాం'' అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 'ఎక్కడ నుంచి మీకింత ధైర్యం వచ్చింది? అటూ ఇటూ చెరొకరు ఉన్నారనే కదా? మీకు ఓట్లు వేయకపోయినా వాళ్ళకు వేస్తారనే కదా? జగన్ సోనియాను ఒక్క మాట అనడు. రెండు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని చెప్పిన నన్ను తిడతాడు. ఈ వ్యవహారంలో నెంబర్ వన్ క్రిమినల్ అయిన సోనియా పేరే ఎత్తకుండా నా గురించి మాట్లాడటానికి సిగ్గుందా? జగన్‌తో ఒప్పందం కుదరగానే విభజనపై కాంగ్రెస్ ముందడుగు వేసింది. జగన్‌పై వేసిన కేసులకు ఆధారాలు లేవని ఢిల్లీలో మెమో తయారు చేసి విమానంలో హైదరాబాద్ పంపి కోర్టులో దాఖలు చేయించారు. అందుకే సోనియా గురించి మాట్లాడకుండా జగన్ మమ్మల్ని తిడుతున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.

ప్రజలే పావులుగా రాజకీయ రాక్షస క్రీడ !

     .....సాయి లక్ష్మీ మద్దాల     ఆంధ్ర -తెలంగాణా రాష్ట్ర విభజన అంశం గత కొద్ది రోజులుగా యావత్భారతవనిని సందిగ్ధ స్థితిలోకి నెట్టింది. జూలై 30 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది మొదలు సీమాంధ్ర ప్రాంతంలో రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలంటూ ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. 60రోజులుగా పిల్ల,పెద్ద అనే వయో భేదం లేకుండా యావత్ సీమాంధ్ర ప్రజానీకం రోడ్ల మీదే ఉంటూ ఉద్యమం చేస్తున్నారు. 2నెలలుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు. బడుగు,బలహీన ప్రజలకు తిండి,తిప్పలు లేవు. ఈ విధంగా ఇంత కఠిన తరంగా అక్కడి ప్రజలు తమ పిల్లల చదువుల కోసం,ఉద్యోగాల కోసం,అక్కడి ప్రజల భవిష్యత్తుకోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమం చేపడితే,ఆ ఉద్యమం తీవ్రతను ఇసుమంతైనా గమనించకుండా,గుర్తించ కుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యంత రాక్షసంగా తెలంగాణపై ఏక పక్ష నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రాతం ఎంత నష్ట పోతుందో,ఆ నష్టాన్ని ఎలా నివారించ గలరో ఏవిధమైన భరోసాను,వివరణను ఇవ్వలేదు. మరి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలకు విలువ లేనట్లేనా?ప్రజల ఆందోళనలకు విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది?ఒక 15 ఎంపి సీట్లకోసం ఇంతగా దిగజారిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీనా ఆంధ్రరాష్ట్రం రెండుసార్లు వరుసగా గెలిపించింది అని ప్రతి తెలుగువాడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అక్టోబర్ 3 2013 న ఆంధ్ర రాష్ట్ర విభజన నిమిత్తమై దొంగచాటుగా విభజన నోట్ పెట్టి కేంద్ర ప్రభుత్వంచే సోనియా గాంధి ఆమోదింప చేసుకుంది.కాని ఇప్పటివరకు జరిగిన మూడురాష్ట్రాల విభజనల ప్రక్రియను పరిశీలిస్తే కేంద్ర కాబినెట్ లో ఆమోదం పొందిన నోట్ శాసనసభకు తీర్మానం నిమిత్తం వెళ్ళి,అక్కడ శాసనసభ ఆమోదం కూడా పొందినతరువాత కేంద్ర మంత్రుల బృందం ఇ దే నోట్ మీద బిల్లును తాయారు చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లును తిరిగి మరల శాసనసభకు పంపించటం జరుగుతుంది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్ కు ఆమోదం నిమిత్తం ఆ బిల్లును పంపిస్తారు. పార్లమెంట్లో ఒకసారి ఆమోదం పొందిన వెనువెంటనే దానిని రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఇది ఇప్పటివరకు ఏర్పాటైన కొత్త రాష్ట్రాల విషయంలో జరిగిన రాజ్యాంగ ప్రక్రియ. కాని నేడు ఆంధ్రరాష్ట్ర విభజన విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా నోటు ను శాసనసభలో ప్రవేశపెట్ట కుండ నేరుగా బిల్లును తయారు చేస్తున్నారు. ఇది సమైఖ్య రాష్ట్ర స్ఫూర్తి కి విరుద్ధం.                            నోట్ ను బిల్లుగా తయారు చేయవలసిన మంత్రుల బృందానికి నిర్ణీత గడువు హొమ్ మంత్రిత్వ శాఖ షెడ్యుల్ లో 90 రోజులు అని ఉంది. కాని ప్రస్తుతం ఈ గడువును ఆరువారాలు అనగా సగానికి కుదించారు. నవంబర్ లో రానున్నపార్లమెంట్  శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవటానికి ఇంత హడావుడి ప్రక్రియ చేపట్టారు. వై.ఎస్.ఆర్.సి.పి  వారి రాజీనామాలతో శాసనసభలో నోట్ ను నేగ్గించుకోవాలని చూశారు. అది విఫలం కావటంతో నోట్ పై శాసనసభ ఆమోదం లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కుటిల రాజకీయాలను తిప్పి కొట్టటానికి రాష్ట్రపతి మరియు న్యాయ వ్యవస్థలు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సి ఉంది.                        భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చాలా రాష్ట్రాలు ఉద్యమం చేస్తున్నాయి. గూర్ఖాలాండ్ 1907 నుండి ఉద్యమం చేస్తోంది. విదర్భ,ఉత్తర ప్రదేశ్ లు అసెంబ్లీ తీర్మానం కూడా పొందాయి. మరి కుప్పలుతెప్పలుగా ఉన్న మిగతా రాష్ట్రాల విభజన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంత హడావుడిగా ఒక్క ఆంద్ర రాష్ట్రాన్ని అందున ఒకే జాతిని రెండుగా చీల్చే పాపానికి కాంగ్రెస్ అధిష్టానం ఒడిగట్టింది. కేవలం ఓట్లు సీట్లతో రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా సోనియా గాంధి, ఆమెకు తొత్తులుగా మారిన బొత్స సత్యనారాయణ లాంటి కొంత మంది సీమాంద్ర ద్రోహులు కలిసి ఆడుతున్న వికృత క్రీడ. ఏ విధమైన భరోసా లేకుండా పూర్తి అన్యాయ భరితంగా చేపట్టిన ఈ ప్రక్రియ మీద సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు రీతిలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అన్నిటికి మించి రాష్ట్రపతి చేతులలో అవకాశం ఇంకా మిగిలే ఉంది. నేరచరితులైన నేతల కోసం చేసిన ఆర్డినెన్సు ను ఎలా చెత్త బుట్ట దాఖలు తానుగా చేయ గలిగారో,చాలా అన్యాయంగా ఏక పక్షంగా కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తన అధికారంతో వెనక్కు తిప్పి పంపించాల్సి ఉంది. లేని పక్షంలో 1907 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న గూర్ఖాలాండ్ ను కూడా పశ్చిమ బెంగాల్ నుండి ,పశ్చిమబెంగాల్ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడగొట్టాలి. అలా చేయలేకపోతే ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తున్న కారణంగా ప్రధమ పౌరిడిగా ఆ పదవిలో కొనసాగే అర్హత నైతికంగా ఆయనకు లేనట్లే.                         రాజకీయ స్వార్దాలకోసం తీసుకునే నిర్ణయాలు పార్టీలకు లాభం చేకూరుస్తాయేమో గాని జాతికి మాత్రం నష్టం తెస్తాయి. కొన్ని సందర్భాలలో ఆశించిన రాజకీయ ప్రయోజనం లభించకపోగా పూర్తి వ్యతిరేక ఫలితం కూడా అనుభవంలోకి రావచ్చు. ఇప్పటికైనా ఈ నేతలందరూ తమ పార్టీల జెండాలను,అజెండాలను పక్కనపెట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడితే కొంత వరకైనా న్యాయం జరగవచ్చు.

మంత్రులు, యంపీలు రాజీనామా డ్రామాలు

  రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందుగానే తెలిసినప్పటికీ తెలియనట్లు నటిస్తూ ఇంతకాలం పదవులలో కొనసాగిన మంత్రులు,యంపీలు ఇప్పుడు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ రాజీనామాలు చేయడం కూడా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికే. బహుశః ఇది కూడా అధిష్టానం కనుసన్నలలోనే జరిగి ఉండవచ్చును.   కేంద్రమంత్రి పదవి ఈయలేదని అలిగిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావుని కేంద్రమంత్రి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా తీసుకొన్నారు. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అప్పటికే స్పష్టం అయినందున వర్కింగ్ కమిటీలోఉంటే ఆ నిర్ణయానికి తను కూడా అమోదముద్ర వేయవలసి ఉంటుంది గ్రహించిన కావూరి, దానివల్ల తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ముందు చూపుతోనే కేంద్ర మంత్రి పదవిని అట్టేబెట్టుకొని వర్కింగ్ కమిటీ సభ్యత్వం వదులుకొన్నారు. ఆ వెంటనే ఆయన “కేంద్రమంత్రిగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని” ప్రకటించడం గమనిస్తే ఆయనకి అప్పటికే రాష్ట్రవిభజన నిర్ణయం అయిపోయినట్లు తెలుసన్నసంగతి అర్ధం అవుతోంది. మరి ఆయనకి తెలిసిన ఈ విషయం మిగిలిన యంపీలకి, కేంద్రమంత్రులకి తెలియదని భావించలేము.   ఇప్పుడు కొందరు నేతలు పార్టీలు మారడానికి దీనినొక సదవకాశంగా భావించి రాజీనామాలు చేస్తే, ఇంకొందరు అధిష్టానం అనుమతి తీసుకొని, మరికొంతమంది ప్రజల పోరు భరించలేక రాజినామాలు చేస్తున్నారు తప్ప వారి రాజినామాలలో నిజాయితీ లేదు. అటువంటి నేతలు, రాజకీయ నాయకులూ ఇంకా రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని పలుకుతున్న ఉత్తరకుమార ప్రగల్భాలు కూడా సీమంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే.   ఇక ఇప్పటి నుండి ఈ సదరు నేతలు విభజన ప్రక్రియలో ప్రతీ అంచెలో తాము అడ్డుకొంటునట్లు నటించడం మొదలుపెట్టబోతున్నారు. తద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకొని తమ రాజకీయ జీవితం దెబ్బతినకుండా చూసుకొందామనే తాపత్రయమే తప్ప నిజంగా అడ్డుకోవాలనే ఆలోచనతో మాత్రం కాదని ప్రజలు గ్రహించాలి. ఈ లోగా వివిద అంశాలను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే క్యాబినెట్ మంత్రి మండలితో సీమంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు యుద్ధం చేస్తున్నట్లు కూడా నటించవచ్చును. వారు ఈ డ్రామాలు రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఏర్పడేవరకూ కూడా కొనసాగిస్తూనే ఉంటారు.   అయితే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని సీమంధ్ర ప్రజలు, ఉద్యోగులు కూడా ఎంత త్వరగా జీర్ణించుకోగలిగితే అంత మచిది. ఇంతవరకు వచ్చిన తరువాత ఏ ప్రభుత్వము, పార్టీ కూడా తన నిర్ణయాన్నిఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొనే అవకాశం లేదనే సంగతి వారు గ్రహించాలి. అందువల్ల రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నాలకు బదులు, సీమంధ్ర ప్రాంతం, ప్రజలు నష్టపోకుండా ఏమిచేయాలని ఆలోచనలు చేయడమే తక్షణ కర్తవ్యం.

సీమాంధ్ర మంత్రుల రాజీనామా

  తెలంగాణ నోట్‌కు కేంద్రం ఆమోదం తెలపటంతో కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.. మొదటి నొంచి తెలంగాణ నోట్‌కు మోదం నపడితే రాజీనామ చేస్తామంటూ వస్తున్న మన రాష్ట్రనికి సంభందించిన జాతీయ నాయకులు  ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.   తమ సమక్షంలోనే తెలంగాణ నోట్‌కు ఆమోదం పడటంతో సమావేశంనుంచి మధ్యలోనే బయటికి వచ్చిన పళ్లంరాజు, కావూరి సాంబశివరావులు రాజీనామ చేసే లోచనలో ఉన్నారు. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామకు అనుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.     వీరితో పాటు ఎంపిలు అనంతవెంటకట్రామి రెడ్డి, సబ్బం హరిలు, తమ ఎంపి పదవులతో పాటు కాంగ్రెస్‌ పార్టికి కూడా రాజీనామ చేస్తున్నారు. ఉండవల్లి, హర్షకుమార్‌, కెవిపి, పురందరేశ్వరి లాంటి మరింత మంది నేతలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

48 గంటల సీమాంద్ర బంద్‌

    తెలంగాణ నోట్‌కు సంభందించి కేభినెట్ ఆమోదం లభించటంతో సీమాంద్ర భగ్గుమంది.. సమైక్యాంద్ర పరిరక్షణ సమితి తరుపున ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు రేపు దయం 6 గంటల నుంచి 48 గంటల పాటు బంద్‌కు పిలుపు నిచ్చారు.   ఎపిఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 48 గంటల పాటు కేంద్ర కార్యాలయాలతో పాటు రహాదారులు, అన్ని ఆఫీస్‌లు, బ్యాంక్‌లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. బంద్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులను కోరారు.   ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఎంపిలు రాజీనామాలు చేసి ప్రజా ఉధ్యమంలోకి రావాలని కోరారు.. ఇప్పటికీ ఉద్యమంలోకి రాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

      తెలంగాణ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కనుగొనేందుకు మంత్రుల బృందం ఏర్పాటు అవుతుందని చెప్పారు. నీటి సమస్య, ఆదాయాలు,అప్పులు, ఇతర సమస్యలపై మంత్రుల కమీటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని షిండే తెలిపారు. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ నోట్ ఇప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళుతుంది. ఆయన దానిని శాసనసభ ఆమోదానికి పంపిస్తారు. కాని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపించే ఆదేశాలలో కేవలం అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటారు గాని అసెంబ్లీ ఆమోదానికి ఎదురుచూడరని తెలుస్తున్నది.

కేబినెట్ ముందు తెలంగాణ నోట్

        తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. కేంద్ర కేబినెట్ భేటీ గురువారం సాయంత్రం 5-30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 14 మంది మంత్రులు, 37 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, పల్లం రాజులు హాజరయ్యారు. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ మాతృ వియోగంతో సమావేశానికి గైర్హాజరయ్యారు.     అయితే కేబినెట్‌లో నోట్‌ను వ్యతిరేకిస్తామని కావూరి సాంబశివరావు తెలిపారు. మిగిలిన మంత్రుల అభిప్రాయాలు వింటామని అన్నారు.  ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నోట్ పై షిండే సంతకం పెట్టారు

      తెలంగాణ నోట్ మధ్యాహ్నం కొంత గందరగోళంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి షిండే సాయంత్రానికి నోట్ పై సంతకం చేశారు. హోంశాఖ నోట్ కు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కేబినెట్ నోట్ మీద సంతకం చేశారు. అనంతరం తెలంగాణ నోట్ లను కేంద్రమంత్రులకు పంపించారని తెలుస్తోంది. దీంతో ఉదయం నుండి తెలంగాణ నోట్ మీద నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయినట్లే. కాగా సీమాంద్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు క్యాబినెట్ నోట్ పై ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ తన తల్లి మరణం కారణంగా ఆయన డిల్లీలో లేరు. ఈ ఇద్దరు మంత్రులు వ్యతిరేకమైనా, పెద్ద ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ నెల ఇరవై లోపు శాసనసభకు ఈ తీర్మానం రావచ్చని అంటున్నారు.

దాణా స్కాం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష

      దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ళు శిక్షపడింది. ఆయనకు పాతిక లక్షల జరిమానా కూడా విదించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు: దిగ్విజయ్

      తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు వెలుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని...తెలంగాణకు కట్టుబడి వున్నామని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని తెలంగాణ,సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారని, అందరిని సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేబినెట్ నోట్ కు, ఆంటోనీ కమిటీకి సంబంధం లేదన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు కేబినెట్ నోట్ ఆగుతుందని తాము చెప్పలేదన్నారు. విభజన అనంతరం సీమాంద్రలో తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి కమిటీ రాష్ట్రానికి వచ్చే వరకు వేచిచూడాలన్నారు.

తెలంగాణ నోట్ లోని విశేషాల స్పెషల్..!

      తెలంగాణకు సంబంధించి ఇప్పుడే రాదని అనకున్న తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణపై కేబినెట్ నోట్ ను సిద్ధం చేశారు. సోనియా గాంధీ సూచనల్ని అనుసరించి హోంమంత్రిత్వ శాఖ 22 పేజీల నోట్ ను తయారు చేసింది. నోట్ లో కొన్ని ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించారు. ఆర్టికల్-3 ప్రకారం విభజన జరుగుతుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియ పూర్తవుతుంది.   తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్ సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. అందులో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్ సభ స్థానాల్లో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు. నదీజలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి.

బాబు, మోడీల అంతర్గత చర్చలు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుల మధ్య అనుబంధం పూర్తిగా బలపడినట్లు కనిపిస్తోంది. బుధవారం సదస్సులో వీరిద్దరూ వేదికపైకి కలసికట్టుగా వచ్చి కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో అభివృద్ధి గురించి, కాంగ్రెస్ పార్టీ దోపిడీ గురించి తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు మోడీ ఆసక్తిగా విన్నారు. అంతేకాదు.. వీరిద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలూ దేశ రాజకీయ పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకోవడమే కాక, ఎన్నికల పొత్తులపై కూడా నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే భావసారూప్యం గల పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా ఉదయం సభాస్థలిలో ప్రవేశించినప్పటి నుంచీ ఇద్దరు నేతలూ దాదాపు కలిసే గడిపారు. విద్యార్థులతో మంతనాలు జరిపారు. ఇంచుమించు 8 గంటలపాటు ఇద్దరూ అలా కలిసే గడపడం, పక్కపక్కనే కూర్చోవడం, ఒకర్నొకరు ప్రశంసించుకోవడంతో వారిమధ్య స్నేహం బలోపేతమైందనడానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.