విభజన త్వరగా చేయాలి: గవర్నర్
posted on Oct 24, 2013 @ 11:27AM
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో పలువురు పెద్దలతో వరుసగా భేటీ అయి..ఒక్కొక్కరితో అరగంట చొప్పున చర్చలు జరిపారు. రాష్ట్ర స్థితిగతులు, రాజకీయ పరిస్థితిపై అందరికీ నివేదికలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. విభజనపై నిర్ణయం తీసుకున్నందున పరిస్థితి సద్దుమణగాలంటే దానిని వేగవంతం చేయాలని, లేదంటే పరిస్థితి మలుపులు తిరిగే అవకాశముందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర విభజన పట్ల సుముఖంగా లేని ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానం ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలక దశను ఎలా దాటాలన్న దానిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశంపైనే హోంమంత్రి షిండేకు గవర్నర్ నరసింహన్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది.