నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
posted on Jul 7, 2014 6:55AM
ఈరోజు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాల మొదటిరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు వంటివి సభలో ప్రతిపాదించబోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేఖించాలని తెరాస యంపీలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు గనుక సమావేశాలు తొలిరోజు నుండే సభలో యుద్ద వాతావరణం నెలకొనబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ధరలు, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, ఇరాక్ నుండి భారతీయుల తరలింపు వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై కత్తులు దూయడానికి సిద్దంగా ఉంది.
ఈ నేపధ్యంలో సభలో 2014-15 సం.లకు ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్ధిక సర్వే, 10న ఆర్ధిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టబడతాయి. ఆర్ధిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెడతారు. రెండు బడ్జెట్లపై ఈ నెల 30వరకు చర్చలు జరిగి అదే రోజు ఆమోదించబడతాయి. పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 14న ముగుస్తాయి. ఆ మరునాడు అంటే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రసంగిస్తారు.