జమ్ము కాశ్మీర్‌లో వరద బీభత్సం... 100 మంది...

  జమ్ము కాశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు జీలం నది పొంగి ప్రవహిస్తూ వుండటంతో రాష్ట్రమంతా వరదలతో అల్లకల్లోలమైపోతోంది. ఈ వరదల్లో ఇప్పటి వరకు మొత్తం వందమందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరదల కారణంగా రోడ్డు నానిపోవడంతో పెళ్ళి బృందంతో వెళ్తున్న ఒక బస్సు నీటిలో పడిపోయి 40 మంది మరణించారు. అలాగే పుల్వామాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి వెళ్ళిన ఎనిమిది మంది సైనికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే పుల్వామాలోని అవంతీపూర్ వర్సిటీ హాస్టల్‌లో వరద నీటిలో వందమంది విద్యార్థులు చిక్కుకుపోయారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో 15 అడుగుల మేరకు వరద నీరు నిలిచింది. నీటిలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

వర్మ మీద మరో కేసు

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద మరో కేసు నమోదైంది. వినాయకుడిపై ట్విట్టర్లో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి మతపరమైన సెంటిమెంట్ల అవమానించారని రాంగోపాల్ వర్మ మీద ముంబైలోని ఓ కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసు మీద విచారణను అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్లో వినాయకుడు తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని ప్రశ్నించడమే కాక ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295ఎ, 504, 505లను వర్మ ఉల్లంఘించారని కేసులో పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అలాగే చట్టసభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సభ తీర్మానించింది. సభలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అధికార పార్టీ సభ్యులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని, అధికార పార్టీ సభ్యులందరూ కౌరవుల మాదిరిగా వున్నారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు అడపా దడపా జగన్‌కి చురకలు అంటించారు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు జరిగాయి. 60 గంటల 37 నిమిషాలపాటు సభ జరిగింది. 41 మంది సభ్యులు మాట్లాడారు. 5 బిల్లులను ఆమోదించారు. 117 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది.

రేవంత్ రెడ్డి నాలుక కోస్తాం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తెలంగాణ తెలుగుదేశం నాయకుడు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ఆయన నాలుక కోస్తామని టీఆర్ఎస్ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఇప్పటికైనా కేసీఆర్ మీద ఆరోపణలు మానుకోకపోతే సరైన బుద్ధి చెబుతామని సుమన్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని సుమన్ ఓ బఫూన్ అని అభివర్ణించారు. ఓ బఫూన్ కేసీఆర్ మీద మాట్లాడితే ఒక వర్గం మీడియా అతిగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సామాన్యుడైన రేవంత్ రెడ్డి కోట్లకు ఎలా పడగలెత్తాడని? కాంట్రాక్టర్లను బెదిరించి రేవంత్ రెడ్డి డబ్బు సంపాదించాడని, ఆ డబ్బులతోనే జూబిలీహిల్స్‌లో రేవంత్ రెడ్డి బిల్డింగ్ కడుతున్నాడని బాల్క సుమన్ ఆరోపించారు.

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండీ మోడీ జీ...

  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. కేసీఆర్ కేసీఆర్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. అలాగే అలాగే అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ మేయర్ల సదస్సుకు హాజరు కావాలని కేసీఆర్ నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి వివిధ నగరాల మేయర్లు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సును ఉపయోగించుకుని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా సదస్సు ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా చేయించాలని, ముగింపు సమావేశానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.

హత్య కేసులో హీరోయిన్ అరెస్ట్

  హత్య కేసులో ఓ కన్నడ హీరోయిన్ అరెస్టయింది. రేనాల్డ్ పీటర్ ప్రిన్స్ అనే నటుడిని హత్య చేసినందుకు ఆమెని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కన్నడ సినిమాలలో నటించే శ్రుతికి బాగా డబ్బున్న వ్యక్తి, నటుడు, సినిమా ఫైనాన్షియర్ అయిన రేనాల్డ్ పీటర్ ప్రిన్స్‌తో పరిచయమైంది. అతని డబ్బు అంతా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన సినీ నటి శ్రుతి అచ్చం సినిమాల తరహాలోనే ప్లాన్ వేసి ప్రిన్స్‌ని చంపేసింది. మొదట అతన్ని పెళ్ళాడింది. కొంతకాలం కలసి జీవించిన తర్వాత అతన్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి చంపేసింది. శవాన్ని పాతిపెట్టేసింది. తర్వాత పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు క్లోజ్ చేసిన తర్వాత ప్రిన్స్ భార్య హోదాలో అతని ఆస్తి మొత్తాన్నీ సొంతం చేసుకోవచ్చని ఆమె భావించింది. అయితే పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ప్రిన్స్‌ని శ్రుతే హత్య చేసిందని బయపడింది. ఆమెని చెన్నై పోలీసులు బెంగుళూరులో అరెస్టు చేశారు.

టీఆర్ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

  ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో తుమ్మల టీఆర్ఎస్‌లో చేరారు. తుమ్మలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతోపాటు పలువురు ఖమ్మం జిల్లా నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించారు. కేసీఆర్ నా చిరకాల మిత్రుడు. కేసీఆర్ లక్ష్యసాధనలో భాగస్వామిని కావాలనే టీఆర్ఎస్‌లో చేరాను. రాష్ట్ర రాజకీయాలలో మార్పులకు నేను, కేసీఆరే కారణం. తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చాల్సిన అవసరం వుంది. గుజరాత్‌ కంటే ఎక్కువగా తెలంగాణను అభివృద్ధి చేసే శక్తి కేసీఆర్‌కి వుంది’’ అన్నారు.

హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కి ఆయన మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే భయమట.. కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం వుంది కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారట. ఈ మాటలు అందు ఎవరో కాదు.. బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీట మునిగిపోతే ఎంతమాత్రం పట్టించుకోని హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో మాత్రం బాగా మునిగిపోయారని నాగం విమర్శించారు. అసలు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో వుందో లేదో టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని నాగం డిమాండ్ చేశారు.

‘తీవ్రవాద’ విద్యార్థుల అరెస్ట్... విడుదల...

  ఇరాక్‌కి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ‘ఆశయాలు’ తెలుసుకుని హైదరాబాద్‌కి చెందిన నలుగురు విద్యార్థులు ఎంతో ఆకర్షితులయ్యారు. వెంటనే ఆ సంస్థలో చేరిపోవాలని ఇరాక్‌కి ప్రయాణం కట్టారు. అయితే ఈ నలుగురూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. పోలీసులు ఆ విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏదో ఆవేశంలో అలా తీవ్రవాదం వైపు ఆ నలుగురూ ఆకర్షితులు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌లో ఆ సంస్థ గురించి ఈ విద్యార్థులు తెలుసుకున్నారని చెప్పారు. ఆ నలుగురు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.

విద్యార్థులతో మోడీ ముఖాముఖి

  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఒక ఆడిటోరియంలో 700 విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 12,500 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒక కోటి 20 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రసారాన్ని తిలకించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని ఇతర నగరాలకు చెందిన విద్యార్థులు కూడా మోడీని ప్రశ్నలు అడిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచేలా ఎదగాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

తన గురువులకు చంద్రబాబు సత్కారం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాల్యంలో తనకు పాఠాలు చెప్పిన గురువులు మునికృష్ణారెడ్డి, లక్ష్మణరెడ్డిలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి తన ఒక నెల పెన్షన్‌ని రాష్ట్ర అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఉపాధ్యాయులు విద్యార్థులలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాపరంగా మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రణాళికలను వివరించారు.