పరిటాల కేసులో జగనే ముద్దాయి... సునీత

  దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే వైసీపీ నాయకుడు జగన్ మొదటి ముద్దాయి అవుతారా? అవునని అంటున్నారు పరిటాల రవి భార్య, ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే జగనే తొలి ముద్దాయి అవుతారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తుల కేసులో 11వ చార్జ్‌షీట్ దాఖలు చేసిన అంశంపై ఆమె వ్యాఖ్యానిస్తూ పరిటాల రవి కేసులో కూడా ఆయనే తొలి ముద్దాయి అవుతారని అంటున్నారు. పరిటాల రవి హత్య కేసును తిరగదోడాలని పరిటాల సునీత తరచూ అంటూ వుంటారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే పరిటాల హత్య కేసును తిరగదోడనున్నారా అనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు మీద పాతిక లక్షల క్యాష్ బ్యాగ్

  తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలో కళ్ళు తిరిగిపోయే సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని బట్నవిల్లిలో రోడ్డు మీద వాహనంలో వెళ్తూ వాహనంలో నుంచి రోడ్డు మీదకి ఓ సంచి విసిరి వెళ్ళిపోయారు. స్థానికులు ఆ సంచిని పరిశీలించి చూస్తే అందులో పాతిక లక్షల డబ్బు వుండటంతో అందరూ షాకయ్యారు. ఈ డబ్బును స్థానికులు తమ అధీనంలో వుంచుకున్నారు. ఆ డబ్బును మీడియా సమక్షంలో పోలీసులకు అందిస్తామని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బుని రోడ్డు మీద ఎవరు విసిరారు... ఎందుకు విసిరారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఏది?: బొత్స

  తెలంగాణ గడ్డపై వుండాలంటే తెలంగాణకు సెల్యూట్ చేయాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరికీ తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం లేదని, దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స అన్నారు. హైదరాబాద్‌ శాంతి భద్రతల అంశం గవర్నర్ పరిధిలో వుందని, ఈ నేపథ్యంలో ఛానళ్ళ మీద నిషేధం విషయంలో గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. ప్రజలు ఎవరికైనా సాల్యూట్ చేయవలసి వస్తే, గాంధీ, అంబేద్కర్‌ లాంటి మహానుభావులకే సెల్యూట్‌ చేయాలని, ఎందుకంటే వారివల్లే దేశంలో ప్రతి ఒక్కరు ఈనాడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

శ్వేతా బసు ప్రసాద్‌కి మంచు విష్ణు మద్దతు

  కథానాయిక శ్వేతా బసు ప్రసాద్‌కు తెలుగు సినిమా రంగంలో మద్దతు పెరుగుతోంది. శ్వేతా బసు ప్రసాద్ విషయంలో మీడియా, పోలీసులు అతిగా వ్యవహరించారన్న విమర్శలు పెరిగిన నేపథ్యంలో తెలుగు సినిమా రంగం కూడా శ్వేతా బసు ప్రసాద్‌కి నైతికంగా మద్దతు ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి మంగళవారం నాడు శ్వేతా బసు ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. తన ట్విట్టర్ అకౌంట్లో మీడియాకి, పోలీసులకు ప్రశ్నలు సంధించారు. శ్వేతా బసు ప్రసాద్ మీద తనకున్న సానుభూతిని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కథానాయకుడు మంచు విష్ణు కూడా శ్వేతా బసు ప్రసాద్ విషయంలో పోలీసులు, మీడియా నిర్దయగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘శ్వేతాబసు విషయంలో అనవసరంగా ఆమె పేరును బయటపెట్టారు. అమ్మాయిలు అంటే అంటే అంత నెగటివ్ ఎందుకో తెలియడంలేదు. ఇండస్ట్రీలో ఏది జరిగినా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అదేమంటే విలువలు గురించి మాట్లాడుతూ ఉంటారు. మనకసలు విలువలు ఎక్కడున్నాయి..? సన్నీ లియోన్ ఎవరు..? ఆమెను హిందీ చిత్ర పరిశ్రమ పెద్ద స్టార్ ను చేసేసింది. నేను కూడా ఆమెను ‘‘కరెంటు తీగ’’ సినిమాలో పెట్టాను. భవిష్యత్తులో శ్వేతా బసుకు కూడా ఆఫర్ ఇస్తాను’’ అన్నారు.

చర్చలు సఫలం... ఏపీలో ఆర్టీసీ సమ్మె ఉపసంహరణ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు గురువారం నుంచి సమ్మె చేయాలని తలపెట్టిన విషయం తెలిసిందే. తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మె చేయబోతున్నామని కార్మికులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాము సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఈనెల 8వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం నాడు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. డీఏ, పండగ బకాయిలను చెల్లించడంతోపాటు నిర్ణీత గదువు లోగా సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

నా పరువుకి నష్టం జరిగింది: జయ కేసు

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనని పరువు నష్టం కేసు నమోదు చేశారు. సుబ్రమణ్య స్వామి తనమీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ జయలలిత కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు అక్టోబర్ 30న కోర్టు ముందు హాజరు కావాలని డాక్టర్ సుబ్రమణ్య స్వామికి బుధవారం సమన్లు జారీ చేసింది. అలాగే, తమిళ జాలర్ల సమస్యలపై సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ దినపత్రిక దినమలర్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు.

హీరోయిన్ మైత్రేయ కేసు.. వాస్తు దోష ప్రభావమా?

  అడ్డమైన చెత్త పనులు చేయడం... దానికి కారణం వాస్తు అని నేరమంతా వాస్తు నెత్తిన వేయడం ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. బాగా నడిచినంతకాలం అంతా తమ ప్రతిభ అని బిల్డప్పు ఇవ్వడం, ఏదైనా తేడా వస్తే వాస్తు ప్రాబ్లం వల్లే తనకు కష్టాలు వచ్చాయని వాపోవడం మామూలైపోయింది. ఇప్పుడు ఇలా వాపోయే రాజకీయ నాయకుల లిస్టులోకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కూడా చేరారు. ఈమధ్య ఈయనగారి పుత్రరత్నం కార్తీక్ గౌడ సినీ హీరోయిన్ పెట్టిన మోసం, రేప్‌లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ కేసు పుణ్యమా అని పోలీసులు కార్తీక గౌడను జైల్లో వేసేవారే.. ఎక్కడో అదృష్టం బేలన్స్ వుండి బెయిల్ వచ్చింది. ఇదిలా వుంటే, రాజకీయంగా ఉన్నత స్థాయిలో దూసుకుపోతూ కేంద్ర రైల్వే మంత్రి పదవి కూడా చేపట్టిన తనకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడానికి ఢిల్లీలోని తన ఇంటి వాస్తు బాగాలేకపోవడమేనని సదానందగౌడ భావిస్తున్నారట. జనం సొమ్ము అర్జెంటుగా ఖర్చు చేసి ఆ ఇంటికి వాస్తు రిపేర్లు చేయాలని ఆలోచిస్తున్నారట. రిపేర్ చేయాల్సింది ఇంటికి కాదు.. బుద్ధికి అనే విషయం మంత్రిగారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో..!

గణేశ నిమజ్జనం.. అపశ్రుతులు... ఐదు ప్రాణాలు..

  తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయకచవితి వేడుకల చివరి రోజైన నిమజ్జనం రోజున మాత్రం కొంతమంది మరణించడం అనేది ప్రతి ఏడాదీ జరుగుతోంది. ఈ మరణాలను ఆపాలని ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా ప్రయోజనం వుండటం లేదు. ఈ ఏడాది వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు యువకులు మరణించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మానేరు వాగులో వినాయక నిమజ్జనం సందర్భంగా నగురం గ్రామానికి చెందిన సంజీవరావు, శ్రావణ్ కుమార్, రవి అనే ముగ్గురు యువకులు నీట మునిగి మరణించారు. అలాగే మెదక్‌లో శివకుమార్ అనే యువకుడు వినాయక నిమజ్జనం చేస్తూ నీటిలో పడి చనిపోయాడు. ఉప్పల్‌కి చెందిన రామరాజు నాగర్జున సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్ళి అక్కడ డ్యాం పక్కనే వున్న నీటి ప్రవాహంలో పడి మరణించాడు.

మీడియాని అణిచేస్తాననడం భావ్యం కాదు.. వెంకయ్య...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మీడియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మీడియాను తొక్కి పెడతాననడం మంచిది కాదని అన్నారు. ఒకవేళ ఏవైనా మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు. మరీ ఇబ్బంది అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇలాంటి సున్నిత విషయాలలో ప్రభుత్వం నడిపే పెద్దలకు సహనం అవసరమని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రజలకు సముచిత స్థానం ఇస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని వెంకయ్య అన్నారు.

ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సమ్మె

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మె చేయబోతున్నామని కార్మికులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాము సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఈనెల 8వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల చేత సమ్మెని విరమింపజేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం నాడు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపనున్నారు.

ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...

  ప్రముఖ సామాజిక మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్విట్ చేయడం వెరైటీ. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఘనకార్యాన్ని పూర్తి చేస్తాయని, ఇప్పటికే అనేకమంది ట్విట్టర్ ఉద్యోగుల మీద నిఘా ఏర్పాటు చేశామని, సమయం సందర్భం చూసి వారిమీద దాడి చేసి చంపేస్తామని సదరు తీవ్రవాదులు ట్విట్ చేశారు. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ట్విట్టర్ ఉద్యోగులందరికీ మూడిందని, వారిదరినీ చంపేయడం ఖాయమని తీవ్రవాదులు ప్రకటించారు. ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులు త్వరలో తాము చావబోతున్నామని డిసైడ్ అవ్వాలని తీవ్రవాదులు తమ ట్విట్‌లో పేర్కొన్నారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు.

ఒక్క కేసీఆర్.. బిరుదులు బోలెడు.. హిట్లర్.. తుగ్లక్.. ఫాసిస్ట్..

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ వంద రోజుల పాలన పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు పార్టీల నాయకులు మంగళవారం నాడు కేసీఆర్ని బిరుదులతో ముంచెత్తారు. కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్‌కి హిట్లర్, తుగ్లక్, నీరో, కుంభకర్ణుడు అనే బిరుదులు ఇచ్చారు. ఈమధ్యే బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు కపిలవాయి దిలీప్ కుమార్ అయితే కేసీఆర్‌ని ‘ఫాసిస్ట్’ అని అభివర్ణించారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ని అబద్ధాలు చెప్పడంలో ‘గోబెల్స్’ అని, తప్పులు చేయడంలో శిశుపాలుడు అని విమర్శించారు. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా మంగళవారం నాడు కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి

  అమెరికాలో ఒక భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా అంతమైపోయింది. ఉత్తర భారతదేశానికి చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు వున్నాడు. ఈ ఏడాది జనవరిలో సుమీత్ అమెరికా నుంచి ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్ కప్పి బయటపడింది. ఎందుకిలా జరిగిందని పల్లవిని పోలీసులు ప్రశ్నిస్తే, తన కొడుకు అనారోగ్యంతో మరణించాడని, తన భర్త విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు శవాన్ని భద్రపరచాలని ఐస్‌లో పెట్టానని ఆమె చెప్పింది. ఈ విషయంలో ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతూ వుండటంతో ఆర్నవ్‌ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పదంగా మరణించి కనిపించారు. సుమీత్ తలకు దెబ్బ తగిలి మరణించి వుండగా, పల్లవి స్విమ్మింగ్ పూల్‌లో శవమై తేలింది. వీరిని ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేక పల్లవే భర్తని చంపి తాను ఆత్మహత్య చేసుకుందా అనే విషయాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుటుంబం అనుమానాస్పద మరణం అమెరికాలో పెను సంచలనం సృష్టించింది.

మోడీ అమెరికా టూర్.. ఒబామా ఆసక్తి...

  భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 20, 30 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిక్కీ నీలిగిన అమెరికా ఇప్పుడు మోడీ అమెరికా రాక కోసం ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే మోడీని ఎప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నారట. మోడీ పర్యటన షెడ్యూలు గురించి ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెలువడకపోయినప్పటికీ సెప్టెంబర్ 29, 30 తేదీలలో మోడీ అమెరికా పర్యటన ఖాయమని తెలుస్తోంది. అమెరికా పర్యటన సందర్భంగా మోడీ బరాక్ ఒబామాతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి చర్చలు జరుపుతారు. సాధారణంగా ఏ దేశాధ్యక్షుడు అమెరికా వెళ్ళినా ఒకరోజు పర్యటన మాత్రమే వుంటుంది. నరేంద్ర మోడీకి మాత్రం రెండు రోజుల పర్యటన షెడ్యూలు కేటాయించడం మోడీ అంటే అమెరికాకి వున్న ఆసక్తి గురించి తెలియజేస్తోందని అమెరికా అధికారులు అంటున్నారు.

తాతయ్య కాబోతున్న బాలయ్య...

  నందమూరి, నారా వంశాభిమానులకు శుభవార్త.. కథానాయకుడు, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ త్వరలో ‘తాతయ్య’ హోదాని అందుకోబోతున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణి త్వరలో మాతృత్వాన్ని పొందబోతున్నారు. ఈ శుభవార్తను నారా లోకేష్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించారని సమాచారం. ఈ వార్త ఇటు నందమూరి, అటు నారా వారి కుటుంబాలలో ఆనందోత్సాహాలను నింపింది. ఇటీవలి కాలంలో ఈ రెండు వంశాలకూ ఎన్నో శుభాలు జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా విజయాలు పొందడంతోపాటు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. వచ్చే వేసవి నాటికి బ్రహ్మణి తల్లి అవుతారని సమాచారం.

ఆ పేలుడు తప్పిదం గెయిల్‌దే...

  తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో జూన్ 27వ తేదీన ఊరంతా గ్యాస్ వ్యాపించి జరిగిన విస్ఫోటనంలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు కారణం పైప్‌లైన్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలేనని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ దుర్ఘటనపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్‌కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. గెయిల్ ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది.

అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్

  ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ నిజానికి నీచనికృష్టమైన అంక ఛండాలమైన బౌలింగ్ అట. ఆయనగారి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలిపోయింది. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఐసీసీ అయ్యగారిపై నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండడంతో గత నెల 25న అతని బౌలింగ్ శైలిపై పరీక్షలు జరపగా, అతను పరిమితికి మించి మోచేయిని వంచి బంతులు విసురుతున్నట్టు స్పష్టమైంది. అజ్మల్ ఇప్పటివరకు 35 టెస్ట్‌ల్లో 178 వికెట్లు, 111 వన్డేల్లో 183 వికెట్లు, 63 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. ఈ ఘనతంతా నీచనికృష్ట బౌలింగ్ ద్వారానే సాధించాడని ఇప్పుడు అందరికీ అర్థమైంది.

శ్వేతా బసు ప్రసాద్: మీడియా తీరుపై రాజమౌళి ఆగ్రహం

  సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతంపై దర్శకుడు రాజమౌళి మీడియా మీద, ప్రజల మీద ప్రశ్నలను ట్విట్టర్లో సంధించారు. శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు చూసిన శ్వేత బసు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులెవరు? సున్నితమైన విషయాన్ని ఎందుకు బజారుకీడ్చారు? మీడియా శ్వేతాబసు విషయంలో అనుసరిస్తున్న వైఖరికి ఎవరివద్దయినా సమాధానం ఉందా అంటూ రాజమౌళి ప్రశ్నించారు.