శ్వేతా బసు ప్రసాద్: మూడు నెలలు అక్కడే...

  వ్యభిచారం కేసులో పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ మహిళా పునరావాస కేంద్రంలో వుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పోలీసులు ఆ కేంద్రంలో వుంచారు. ఆ కేంద్రంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను, అనాథలను, నా అంటూ లేని వారిని వుంచుతారు. హీరోయిన్‌గా ఎంతో లగ్జరీని అనుభవించిన శ్వేతా బసు ప్రసాద్‌ ఇప్పుడు అక్కడ వుంది. శ్వేత బసు ప్రసాద్‌ని పునరావాస కేంద్రంలో వుంచాలని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించిన తర్వాత పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు. శ్వేతా బసు ప్రసాద్‌ను ఆ పునరావాస కేంద్రంలో మూడు నెలలపాటు వుంచుతారు. ఈ మూడు నెలల లోపు ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

అప్పటికింకా నా వయసు నిండా పదహారే... మైత్రేయ...

  కేంద్ర మంత్రి సదానంద గౌడ కొడుకు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని, రేప్ చేశాడని కన్నడ నటి మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్ గౌడ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషి అనే కన్నడ డైరెక్టర్ పదేళ్ళ క్రితం తాను ‘సూర్య ది గ్రేట్’ అనే సినిమా తీసే సమయంలో మైత్రేయని తాను పెళ్ళి చేసుకున్నానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే దీనిని హీరోయిన్ మైత్రేయ ఖండించింది. ‘‘ఆ సినిమా తీసే నాటికి నాకు పదహారేళ్ళు. అప్పుడు నా వెంట మా అమ్మ కూడా వుండేది. మా అమ్మకి తెలియకుండా నా పెళ్ళవుతుందా చెప్పండి? అంచేత నాకు, తనకి పెళ్ళయిందంటూ డైరెక్టర్ రిషి చెబుతున్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు’’ అని మైత్రేయ వివరణ ఇచ్చింది. మొత్తానికి ఈ హీరోయిన్ రేప్ కేసు సస్పెన్స్ సినిమా తరహా ట్విస్టులతో ముందుకు వెళ్తోంది.

జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీ

  భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన నాలుగు రోజుల జపాన్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బుధవారం తిరిగి వచ్చారు. ఆయన శనివారం జపాన్‌కి బయల్దేరి వెళ్ళారు. యుపిఎ ప్రభుత్వ 10 ఏళ్ళ హయాంలో జపాన్‌తో భారత సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి. వాటిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతంతో పాటు అతిథి సత్కారాలు కూడా లభించాయి. జపాన్ వెళ్ళేముందు మోడీ జపనీస్ భాషలో ట్వీట్లు చేయడంతో ఆయనకు జపనీయులు మరింత దగ్గరయ్యారు. జపాన్‌లోని క్యోటో, టోక్యో నగరాలను ఆయన సందర్శించారు. పురాతన దేవాలయాన్ని, పురాతన విద్యాలయాన్ని సందర్శించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారతదేశానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపనీయులను ఆహ్వానించారు. మొత్తమ్మీద ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ఫలప్రదమైంది.

పళ్ళంరాజుకు పితృవియోగం

  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పళ్ళంరాజు తండ్రి మల్లిపూడి సంజీవి రావు (87) కాకినాడలో బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంజీవి రావు రెండుసార్లు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మల్లిపూడి సంజీవిరావు తండ్రి.. అంటే పళ్ళంరాజు తాతగారి పేరు కూడా పళ్ళంరాజే. ఆయన గోదావరి జిల్లాల్లో పేరు పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సంజీవిరావు రెండుసార్లు కేంద్రమంత్రి అయ్యారు. సంజీవిరావు వారసత్వాన్ని ఆయన కుమారుడు పళ్ళంరాజు అందుకుని ఆయన కూడా కేంద్రమంత్రి అయ్యారు. సంజీవిరావు మృతికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

యువ సినీ నటి, మోడల్ ఆత్మహత్య

  ముంబైలో సయ్యామ్ ఖన్నా అలియాస్ మోనా ఖన్నా అనే యువ వర్ధమాన సినీ నటి, మోడల్ ఆత్మహత్య చేసుకుంది. మోనా ఖన్నా గత కొంతకాలంగా మోడలింగ్ రంగంలో కొనసాగుతోంది. మోడలింగ్‌లో అవకాశాలు, ఆర్థిక అంశాలూ బాగానే వున్నప్పటికీ ఆమెకు మొదటి నుంచీ సినిమా హీరోయిన్ కావాలనే కోరిక వుండేది. సినిమా హీరోయిన్ కావాలన్న ఉద్దేశంతోనే ఆమె మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత ప్రయత్నిస్తున్నా చిన్నా చితకా వేషాలు తప్ప తాను కోరుకుంటున్న హీరోయిన్ వేషాలు రావడం లేదు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ ఆమెకి సంతోషం కలగడం లేదు. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ తనకు సినిమా హీరోయిన్ అవకాశాలు రావడం లేదని మోనా ఖన్నా బాధపడుతూ వుండేది. ఆదివారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మోనా ఖన్నా ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, సినిమా అవకాశాలు లేని కారణంగానే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు మోనా ఖన్నా తన  సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

శాసనమండలి డిప్యూటీ సతీష్‌రెడ్డి... లక్కీ ఛాన్స్

  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ చైతన్యరాజు రంగంలో వున్నారని భావించారు. అయితే ఆయన మీద శాసన మండలి సభ్యుల్లో వ్యతిరేకత వుండటంతో సతీష్ రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేశారని తెలుస్తోంది. సతీష్ రెడ్డి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలసినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతోపాటు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంతేటి కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం లాంఛనమని తెలుస్తోంది. సతీష్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు.

చెల్లి లవ్ చేసింది... అన్న గొంతు కోశాడు...

  సినిమాల్లో కావొచ్చు, నిజ జీవితంలో కావొచ్చు. అన్న ఎవర్నయినా ప్రేమిస్తే తన చెల్లిని ప్రేమ రాయబారిగా ఉపయోగించుకుంటాడు. అన్నయ్య ప్రేమలో పడితే అతగాడి చెల్లెలు ఎగిరి గంతులు వేస్తుంది. అయితే చెల్లి విషయంలో మాత్రం అందుకు రివర్స్. చెల్లెలు ప్రేమలో పడితేమాత్రం అన్నయ్య సహించలేదు. నానా న్యూసెన్సూ చేస్తాడు. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీలో నివసించే రాణి అనే అమ్మాయి ఆరు నెలల క్రితం ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ ప్రేమకు ఇంట్లోవారు.. ముఖ్యంగా రాణి అన్న తీవ్రంగా అభ్యంతరం తెలిపాడు. దాంతో రాణి ప్రియుడితో వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంది. మళ్ళీ ఈమధ్యే పుట్టింటికి రాకపోకలు చేస్తోంది. అయితే తమను కాదని ప్రేమపెళ్ళి చేసుకుందని చెల్లి మీద కోపం పెంచుకున్న అన్న బుధవారం నాడు ఆమె గొంతు కోశాడు. దాంతో రాణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గొంతుకోసిన అన్న పరారీలో వున్నాడు.

తెరాస రాజ్యాంగ సంక్షోభం తెస్తోంది: బీజేపీ నేత

  తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని తెచ్చే విధంగా వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంధించిన విమర్శనాస్త్రాలు ఇలా వున్నాయి.   1. తెలంగాణ రాష్ట్ర సాధనలో, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో విద్యార్థుల కృషి ఎంతో వుంది. ఇప్పుడు విద్యార్థులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.   2. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా హామీలను పట్టించుకోవడం లేదు.   3. బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ తేవాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో తెరాస ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం తెచ్చేలా వ్యవహరిస్తోంది.   4. రుణ మాఫీపై కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. లేనిపోని వంకలు చెబుతూ రుణమాఫీ ఆలస్యం చేస్తున్నారు.   5. రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదా? విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లు లేవు. ఎందులోనూ పాలక మండళ్ళు లేవు.   6. కేసీఆర్ ప్రభుత్వానికి రైతు రుణమాఫీ కంటే సర్వేనే ముఖ్యమైపోయింది.

రాజధానిపై వైసీపీ రచ్చ.. అసెంబ్లీ రేపటికి వాయిదా...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో బుధవారం నాడు వైపీసీ అసెంబ్లీలో నానా హడావిడి చేసింది. చర్చ లేకుండా రాజధానిని ప్రకటించడమేంటని ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రశ్నించారు. అయితే అధికార పార్టీ సభ్యులు ఎంత వివరించినప్పటికీ వైసీపీ సభ్యులు సభని నడవనివ్వలేదు. రాజధాని అంశం మీద చర్చని చేపట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆ అంశం మీదే పట్టు పట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతి కోడెల శివప్రసాదరావు సభను ఎంత అదుపులోకి తేవాలని ప్రయత్నించినప్పటికీ వైసీపీ సభ్యులు తమ పట్టు విడవలేదు. దాంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.

రాజధాని: జగన్ చిచ్చు పెట్టే ప్రయత్నం.. యనమల

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ నాయకుడు జగన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని ప్రకటన విషయంలో బుధవారం నాడు జగన్ అసెంబ్లీలో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యనమల స్పందించారు. ‘‘శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మీద మంత్రివర్గంలో చర్చించాం. మంత్రివర్గ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గురువారం సభలో ప్రకటిస్తారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రివర్గ నిర్ణయాలను సభలో ప్రకటించడం అనేది ఆనవాయితీ. అందువల్లే సభలో ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారు. అసెంబ్లీ వ్యవహారాల గురించి తెలియకపోవడం వల్ల జగన్ తనకు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రాజధాని గురించి సీఎం ప్రకటించిన తర్వాత జగన్ పార్టీ అభ్యంతరాలు చెప్పవచ్చు. కానీ జగన్ రాజకీయ దురుద్దేశంతో సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు.

రాజధాని: చర్చ లేకపోతే రచ్చ చేస్తాం....

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. సభలో ఎలాంటి చర్చా లేకుండానే రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధానిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే రాజధానిపై ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకుడు జగన్ విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించి ఏ ప్రయోజనమని నిలదీశారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలియచేసింది. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా సమక్షంలోనే రాజధానిపై ప్రకటన చేస్తారని, అలా ప్రకటించిన తర్వాత జగన్ ఎంతసేపైనా మాట్లాడవచ్చని అన్నారు.

ఒక ప్రాంతానికే ‘తారకరామ నగర్’ పేరు!

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు అసెంబ్లీలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు పేరు పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఎనిమిది వేల ఎకరాల భూమి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో రైతులు సిద్ధంగా వున్నారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానికి ‘తారకరామ నగర్’గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజధాని మొత్తానికీ కాకుండా, రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్ లాంటి ప్రభుత్వ ప్రధాన నిర్మాణాలున్న ప్రాంతానికి ‘తారకరామ నగర్’ అనే పేరును నిర్ణయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

రేప్ కేసు: ఇరుకునపడిన హీరోయిన్

  కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడని, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కోర్టుకి ఎక్కి కేంద్ర మంత్రి గారికి, ఆయన పుత్రరత్నానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కన్నడ హీరోయిన్ మైత్రేయ ఇప్పుడు ఇరుకునపడింది. హీరోయిన్ మైత్రేయ తన భార్య అంటూ కన్నడ దర్శకుడు రిషి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు పరిస్థితి ఆమెకి వ్యతిరేకంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాను చాలా అమాయకురాలిని అయినట్టు, తనను మంత్రి కొడుకు మోసం చేశాడన్నట్టు చెప్పుకొస్తున్న మైత్రేయ దర్శకుడు రిషి పిటిషన్‌కి సమాధానం ఎలా చెప్పుకుంటుందో చూడాలి. దర్శకుడు రిషి మైత్రేయతో తనకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఆమె తనను విడిచిపెట్టేసిందని, తన దగ్గర ఆధారాలు కూడా వున్నాయని అంటున్నాడు. మైత్రేయ పెట్టిన ‘రేప్’ కేసు తాజా పరిణామాలతో డీలా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాజీ ఏజీ వాహనవతి కన్నుమూత

  భారత మాజీ అటార్నీ జనరల్ వాహనవతి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావడం మరణించారు. వాహనవతి అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన మొదటి ముస్లిం. అటార్నీ జనరల్‌గా నియమితులు కావడానికి ముందు వాహనవతి 2004 జూన్ 20నుంచి 2009 జూన్ 7 దాకా సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. అంతకుముందు ఆయన మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్నారు. యుపియే ప్రభుత్వం హయాంలో ఆయన ఐదేళ్ళపాటు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సమగ్రంగా లేదని ఆయన అప్పట్లో అభిప్రాయపడ్డారు.

బంగారు బిస్కెట్లు కాదు.. చాక్లెట్లు..

  శతకోటి ఆదాయాలకు అనంతకోటి ఉపాయాలనే కొత్త సామెతలు బంగారం స్మగ్లర్లని చూస్తే పుట్టుకొస్తాయి. ఇతర దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు రకరకాల ఉపాయలతో బంగారాన్ని తరలిస్తూ వుంటారు. వారి ప్లాన్లు చాలాసార్లు సక్సెస్ అవుతూ వుంటాయి. అప్పుడప్పుడు మాత్రం వాళ్ళు దొరికిపోతూ వుంటారు. అలా దొరికినప్పుడు బంగారం స్మగ్లింగ్ చేయడానికి వాళ్ళు వేసిన ప్లాన్స్ చూసి కస్టమ్స్ అధికారులకే కళ్ళు తిరుగుతూ వుంటాయి. అలాటి ఒక ఉపాయం చెన్నై ఎయిర్‌పోర్టులో తాజాగా బయటపడింది. మలేసియా నుంచి చెన్నై వచ్చిన అరాఫత్ అనే ఓ యువకుడి బ్యాగ్‌ని కస్టమ్స్ అధికారులు చెక్ చేసినప్పుడు బోలెడన్ని చాక్లెట్లు కనిపించాయి. ఇంట్లో పిల్లలకి ఫారిన్ చాక్లెట్లు తీసుకెళ్తున్నాడేమోలే అని కస్టమ్స్ అధికారులు అనుకున్నారు. కానీ అంతలోనే అనుమానం వచ్చి చెక్ చేస్తే అవి మామూలు చాక్లెట్లు కాదని.. బంగారు చాక్లెట్లు అని వాళ్ళకి అర్థమై నోళ్ళు తెరిచారు. అయ్యాగారు రెండు కిలోల బంగారు బిస్కెట్లను ముక్కలు ముక్కలు చేసి వాటిని చాక్లెట్ల రేపర్లలో కట్టాడు. వాటిని చాక్లెట్ల ప్యాకెట్లో ప్యాకింగ్ కూడా చేశాడు. ఎవరికైనా అవి చాక్లెట్ల మాదిరిగానే కనిపిస్తాయి. అయితే అతని టైమ్ బ్యాడ్ అయి కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.