కోలి ఉరి ఓ వారం ఆపండి.. కోర్టు

  నిఠారి వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి సోమవారం ఉరి వేయనున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని సోమవారం ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మీరట్ జైల్లో ఆదివారం నాడు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఉరివేసే తాడు, తాడు తగిలించే కొక్కెం, ఉరి వేసి వ్యక్తి.. ఇలా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కానీ ఇంతలోనే సుప్రీం కోర్టు ఒక వారం పాటు స్టే ఇచ్చింది.

చైనా: ఎంచక్కా ఇద్దర్ని కనండి..

  జనాభా నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు చైనాలో ఒక జంట ఒక సంతానాన్ని మాత్రమే కనడానికి వీలుంది. దశాబ్దాలుగా ఈ విధానం అమలులో వుంది. ఈ నేపథ్యంలో చైనాలో జనాభాలో భారీ స్థాయిలో సమతుల్యత దెబ్బతింది. దీనితోపాటు ఇటీవలి కాలంలో తమకు మరో సంతానానికి జన్మనిచ్చేందుకు అనుమతి కావాలని చాలామంది ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దాంతో తమకు వినతిపత్రం సమర్పించిన 21,249 మంది జంటల్లో 19,363 జంటలో రెండో సంతానాన్ని కనడానికి అనుమతి ఇస్తూ చైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా అనుమతి లభించిన వారిలో 56 శాతం మంది మహిళలు 31 నుంచి 35 ఏళ్ల లోపు వారే కావడం విశేషం.

శారదా చిట్‌ఫండ్.. మమతనీ విచారించాలి: అమిత్ షా

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాత్ర కూడా ఉంటే ఆమెను కూడా విచారించాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ స్కామ్‌లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదన్నారు. కోల్‌కతాలో భారతీయ జనతాపార్టీ సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా పై విధంగా వ్యాఖ్యానించారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కునాల్ ఘోష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే శారదా చిట్ ఫండ్ అధినేత సుదీప్త సేన్‌తో పాటు తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా విచారించాల్సి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

‘నిఠారీ’ కోలీకి సోమవారం ఉరి?

  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీని మీరట్ జైల్లో సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని గజియాబాద్‌లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశం వుంది. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని తెలుస్తోంది.

వెంట్రుక కూడా పీకలేవు కేసీఆర్: రేవంత్ రెడ్డి

  మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల ఊపు పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావారణాన్ని వేడిక్కిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ పెట్టించే అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు. కేసీఆర్.. ఆ కేసులతో వెంట్రుక కూడా పీకలేవు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా?’’ అన్నారు. మెదక్ ఎన్నికల ప్రచారంలోనే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను మరోసారి సమైక్యాంధ్ర మద్దతుదారులని అంటే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు.

క్రైం యాంకర్.. క్రిమినల్ అయిపోయాడు.. 10 కోట్లు డిమాండ్

  టీవీ ఛానల్‌లో గంభీరంగా క్రైం వార్తలు చెప్పే యాంకర్ హర్షవర్ధన్ తాను చదివే వార్తల పుణ్యమేమోగానీ, తాను కూడా క్రిమినల్ అయిపోయాడు. ఓ కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేయడంతో విజయవాడ పోలీసులు హర్షవర్ధన్‌ని అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ 5 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో బాల పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగి హర్షవర్ధన్‌తోపాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం...?

  ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాజ్ నివాస్ బీజేపీకి ఆహ్వానించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేది అప్రజాస్వామికం అని స్థానిక కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వమని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ హెచ్చరించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాట చేయాలని అనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు.

భారత్‌లో అల్ ఖైదాకి అంతసీన్ లేదు... అమెరికా..

  భారత ఉప ఖండంలో అల్ ఖైదా శాఖను ప్రారంభించబోతున్నామని అల్ ఖైదా నాయకుడు అల్ జవహరి ప్రకటించడాన్ని భారత ముస్లిం మత పెద్దలు తీవ్రంగా ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను వారంతా బలపరుస్తూ వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రాణాలకంటే మిన్నగా దేశాన్ని ప్రేమిస్తున్నామన్నారు. అది ఎల్లప్పుడు కొనసాగుతుందన్నారు. అల్‌ఖైదాకు భారత్‌లో స్థానం లేదని వాషింగ్టన్ భారతీయ అమెరికన్ ముస్లిం మండలి పేర్కొంది. మరోవైపు అమెరికా కూడా ఈ ప్రకటన ఉనికి నిరూపించుకోవడానికే చేసిన ప్రకటనగా భావిస్తోంది.

హీరోయిన్ ముద్దు ఖరీదు అక్షరాలా 49 లక్షలు

  హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ హర్లే ముద్దు ఖరీలు 49 లక్షలు పలికింది. ఆమను ముద్దెట్టుకునేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్‌ భారతి 49 లక్షలు చెల్లించాడు. ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టింది. ఇటీవల జరిగిన వేలంపాటలో ఈ అందగత్తెని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని రూ.48,77,010 లక్షలు చెల్లించి జులియన్ భారతి దక్కించుకున్నాడు. బెర్క్‌షైర్‌లోని ఎల్టన్ మాన్షన్‌లో జరిగిన ఈ ముద్దు పెట్టుకునే కార్యక్రమాన్ని తిలకించి తరలించడానికి పలువురు మిలియనీర్లు ఒక్కో టికెట్‌కు రూ.3.7 లక్షలు చెల్లించారు.

జమ్ము కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

  జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 160 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆదివారం మాట్లాడుతూ కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా తక్షణం గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వరద బీభత్సానికి 2500 గ్రామాలు నీటి ముంపునకు గురికాగా, వరద బాధిత ప్రాంతాల్లో వేలమందిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు, భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహ తీవ్రత పెరిగి, పరిస్థితి వరదలకు దారి తీసింది. శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకుని వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చించారు.

హైదరాబాద్... గణేశ నిమజ్జనానికి సర్వం సిద్ధం

  హైదరాబాద్‌లో గత తొమ్మది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న గణేశుడు ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ప్రతి యేటా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు తలమునకలై ఉన్నారు. 30 వేల మంది పోలీసులతో నిమజ్జనానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 40 క్రేన్లు, 71 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి సౌకర్యార్థం ఆర్టీసీ, రైల్వే శాఖలు భారీగా ఏర్పాట్లు చేశాయి.

గొడవ పడొద్దు.. నాతో చెప్పండి.. సర్దుకుపొండి...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం తెలంగాణకు ఏ సమస్య వచ్చినా తనకు చెప్పాలని, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని భారత ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు చెప్పారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి తాను ఒక పెద్దన్న మాదిరిగా సహకరిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో అనవసరంగా గొడవ పడొద్దని, తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో తెలంగాణకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. 

జమ్ము కాశ్మీర్‌లో వరద బీభత్సం... 100 మంది...

  జమ్ము కాశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు జీలం నది పొంగి ప్రవహిస్తూ వుండటంతో రాష్ట్రమంతా వరదలతో అల్లకల్లోలమైపోతోంది. ఈ వరదల్లో ఇప్పటి వరకు మొత్తం వందమందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరదల కారణంగా రోడ్డు నానిపోవడంతో పెళ్ళి బృందంతో వెళ్తున్న ఒక బస్సు నీటిలో పడిపోయి 40 మంది మరణించారు. అలాగే పుల్వామాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి వెళ్ళిన ఎనిమిది మంది సైనికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే పుల్వామాలోని అవంతీపూర్ వర్సిటీ హాస్టల్‌లో వరద నీటిలో వందమంది విద్యార్థులు చిక్కుకుపోయారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో 15 అడుగుల మేరకు వరద నీరు నిలిచింది. నీటిలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

వర్మ మీద మరో కేసు

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద మరో కేసు నమోదైంది. వినాయకుడిపై ట్విట్టర్లో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి మతపరమైన సెంటిమెంట్ల అవమానించారని రాంగోపాల్ వర్మ మీద ముంబైలోని ఓ కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసు మీద విచారణను అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్లో వినాయకుడు తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని ప్రశ్నించడమే కాక ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295ఎ, 504, 505లను వర్మ ఉల్లంఘించారని కేసులో పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అలాగే చట్టసభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సభ తీర్మానించింది. సభలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అధికార పార్టీ సభ్యులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని, అధికార పార్టీ సభ్యులందరూ కౌరవుల మాదిరిగా వున్నారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు అడపా దడపా జగన్‌కి చురకలు అంటించారు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు జరిగాయి. 60 గంటల 37 నిమిషాలపాటు సభ జరిగింది. 41 మంది సభ్యులు మాట్లాడారు. 5 బిల్లులను ఆమోదించారు. 117 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది.