తాతయ్య కాబోతున్న బాలయ్య...

  నందమూరి, నారా వంశాభిమానులకు శుభవార్త.. కథానాయకుడు, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ త్వరలో ‘తాతయ్య’ హోదాని అందుకోబోతున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణి త్వరలో మాతృత్వాన్ని పొందబోతున్నారు. ఈ శుభవార్తను నారా లోకేష్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించారని సమాచారం. ఈ వార్త ఇటు నందమూరి, అటు నారా వారి కుటుంబాలలో ఆనందోత్సాహాలను నింపింది. ఇటీవలి కాలంలో ఈ రెండు వంశాలకూ ఎన్నో శుభాలు జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా విజయాలు పొందడంతోపాటు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. వచ్చే వేసవి నాటికి బ్రహ్మణి తల్లి అవుతారని సమాచారం.

ఆ పేలుడు తప్పిదం గెయిల్‌దే...

  తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో జూన్ 27వ తేదీన ఊరంతా గ్యాస్ వ్యాపించి జరిగిన విస్ఫోటనంలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు కారణం పైప్‌లైన్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలేనని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ దుర్ఘటనపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్‌కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. గెయిల్ ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది.

అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్

  ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ నిజానికి నీచనికృష్టమైన అంక ఛండాలమైన బౌలింగ్ అట. ఆయనగారి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలిపోయింది. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఐసీసీ అయ్యగారిపై నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండడంతో గత నెల 25న అతని బౌలింగ్ శైలిపై పరీక్షలు జరపగా, అతను పరిమితికి మించి మోచేయిని వంచి బంతులు విసురుతున్నట్టు స్పష్టమైంది. అజ్మల్ ఇప్పటివరకు 35 టెస్ట్‌ల్లో 178 వికెట్లు, 111 వన్డేల్లో 183 వికెట్లు, 63 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. ఈ ఘనతంతా నీచనికృష్ట బౌలింగ్ ద్వారానే సాధించాడని ఇప్పుడు అందరికీ అర్థమైంది.

శ్వేతా బసు ప్రసాద్: మీడియా తీరుపై రాజమౌళి ఆగ్రహం

  సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతంపై దర్శకుడు రాజమౌళి మీడియా మీద, ప్రజల మీద ప్రశ్నలను ట్విట్టర్లో సంధించారు. శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు చూసిన శ్వేత బసు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులెవరు? సున్నితమైన విషయాన్ని ఎందుకు బజారుకీడ్చారు? మీడియా శ్వేతాబసు విషయంలో అనుసరిస్తున్న వైఖరికి ఎవరివద్దయినా సమాధానం ఉందా అంటూ రాజమౌళి ప్రశ్నించారు.

తెలంగాణలో కొత్త జిల్లాలు.. 10 నుంచి 24కి...

  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలను విభజించి మొత్తం 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.   హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్,   రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి,   వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం,   మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు,   ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, ఆదిలాబాద్,   ఖమ్మం జిల్లా: కొత్తగూడెం, ఖమ్మం,   నల్లగొండ జిల్లా: సూర్యాపేట, నల్లగొండ,   మెదక్ జిల్లా: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్,   కరీంనగర్ జిల్లా: కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విభజించనున్నారు.   నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్‌ జిల్లాగానే వుంచుతూ, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు.

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన.. హిట్లర్ పోకడ...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వందరోజుల పాలనలో నియంతలైన హిట్లర్, తుగ్లక్‌లను మరచిపోయేలా చేస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. దీనికి సంబంధించిన కర్రపత్రాలను పొన్నాల ఈ సందర్భంగా విడుదల చేశారు. తెలంగాణ వచ్చిన ప్రజల్లో సంతోషం కనిపించడం లేదని పొన్నాల ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నాడు స్వర్గాన్ని చూపాయని, సీఎం పీఠం ఎక్కిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఆయనకి మాత్రం నరకంగా ఉందని అభివర్ణించారు. తప్పులు చేయడంలో కేసీఆర్ శిశుపాలుడ్ని మించిపోయారన్నారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ గోబెల్స్కే పాఠాలు చెబుతారని అన్నారు. కేసీఆర్ పాలన తుగ్లక్, కుంభకర్ణుడి వారసుడిగా, నీరోను తలపించేలా ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు.

లేడీస్ హాస్టల్లో కేడీ...

  విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఒక కేడీ ప్రవేశించి హడావిడి చేసిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లిమర్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోకి ఈనెల నాలుగో తేదీన ఒక ఆగంతకుడు కిటికీలోంచి హాస్టల్‌లోకి ప్రవేశించాడని, హాస్టల్లో కొంతమంది ఆడపిల్లల మీద అత్యాచారయత్నం చేశాడని తెలుస్తోంది. అయితే ఆడపిల్లలు భయంతో కేకలు వేయడంతో అతను పారిపోయాడని చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ఎవరన్నది తేల్చాలని ఆడపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీకృష్ణ జన్మస్థానానికి యాంకర్‌!!

  పది కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఓ విద్యాసంస్థ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో టీవీ యాంకర్ హర్షవర్ధన్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వీరికి పదిహేను రోజులపాటు రిమాండ్ విధించింది. దాంతో ఈ ఐదుగురినీ పోలీసులు ఏలూరులోని సబ్ జైలుకు తరలించారు. ఇదిలా వుండగా టీవీ యాంకర్ హర్షవర్ధన్ కారణంగా తాము కూడా ఎంతో నష్టపోయామని కొంతమంది ఇప్పుడు బయటకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ క్రైం యాంకర్ హర్షవర్ధన్ నేర చరిత్ర గురించి మరింత లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం వుందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో బంధించారు...

  వరకట్న పిశాచి వికృతరూపం అత్తవారింటి రూపంలో మరోసారి కనిపించింది. అదనపు కట్నం తేలేదని ఒక యువతిని అత్తింటివారు దారుణంగా హింసించి బాత్‌రూమ్‌లోంచి మూడేళ్ళపాటు బయటకి రాకుండా బంధించారు. మహారాష్ట్రలోని దర్బంగా పట్టణంలో ఈ దారుణం జరిగింది. మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో మగ్గిన యువతిని పోలీసులు బయటకి తీసుకొచ్చారు. అదనపు కట్నం తేలేదని, ఆడపిల్లని కన్నానని తనను తన అత్తింటివారు చిత్రహింసలకు గురిచేశారని ఆమె పోలీసులకు తెలిపింది. తన పుట్టింటి వారు తనను చూడటానికి వచ్చినా బయటి నుంచి బయటే పంపించేవారని ఆమె రోదిస్తూ చెప్పింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం రాక్షసుల్లా ప్రవర్తించిన బాధితురాలి భర్త ప్రభాత్ కుమార్ సింగ్, ఆమె మామ ధీరేంద్ర సింగ్, అత్త ఇంద్రాదేవిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్‌కి నివాళి...

  హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు దగ్ధం కావడం, ఆ బస్సు డ్రైవర్ గంగాధర్ ఈ ప్రమాదంలో సజీవ దహనం కావడం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించింది. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఆరు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

బెల్లంకొండ సురేష్ ఆత్మహత్యాయత్నం... ఖండన

  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడన్న పుకార్లు ఫిలింనగర్‌లో వ్యాపించాయి. బెల్లంకొండ సురేష్ అంటే గిట్టనివాళ్ళు ఎవరు పుట్టించారోగానీ, ఈ వార్త పాపం నిక్షేపంలా వున్న బెల్లంకొండకు మనస్తాపాన్ని కలిగించాయి. ఆయన వెంటనే ఈ పుకార్లను ఖండించారు. తాను ఆత్మహత్యాయత్నం చేసేంత పిరికివాడిని కాదని, తాను తన తదుపరి చిత్రం పనుల్లో బిజీగా వున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన పుకార్లు సృష్టించడం అన్యాయం. ఇటీవలి కాలంలో బెల్లంకొండ సురేష్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఒక సంస్థకు చెల్లించాల్సిన పాతిక కోట్లకు పైగా మొత్తానికి సంబంధించి ఆయన మీద ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్న పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్ల విషయంలో బెల్లంకొండ సురేష్ వివరణ ఇవ్వడంతో క్లారిటీ వచ్చింది. ఇలాంటి పుకార్లు రావడం వల్ల బెల్లంకొండ మీద వున్న దిష్టి మొత్తం పోయినట్టుగా భావిస్తున్నామని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఫేస్‌బుక్ విలువ ఎక్కడికో వెళ్ళిపోయింది

  ఫేస్బుక్ మార్కెట్ విలువ 12.05 లక్షల కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే 22వ అతిపెద్ద కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సోమవారం నాడు ఫేస్ బుక్ కంపెనీ షేర్లు అత్యధికంగా 77.6 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆది అల్ టైం హై అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి ఫొటో షేరింగ్ సైట్లు, వాట్స్ యాప్ లాంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులను టేకోవర్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించుకున్నా, ఇంకా చేయలేదు. అది కూడా అయితే దీని విలువ మరింత పెరిగిపోతుందని అంటున్నారు. దీంతో ఫేస్బుక్ షేరుకు, ఆ కంపెనీకి బంగారు భవిష్యత్తు ఉందన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ.

ప్రియురాలిపై శాడిస్ట్ లవర్ కాల్పులు

  నాకు దక్కనిది వేరెవరికీ దక్కడానికి వీల్లేదన్నది సినిమాల్లో విలన్లు చెప్పే మాట. నిజ జీవితంలోనూ అలాంటి విలన్లకి తక్కువేమీ లేదు. గుర్గావ్‌లో లలిత్ అనే ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి అతన్ని కాదని ప్రదీప్ అనే మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. దీన్ని తట్టుకోలేని లలిత్ ప్రదీప్ మీద పగబట్టాడు. సోమవారం నాడు ప్రదీప్, లలిత్, ఆ యువతి ఒక పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా లలిత్‌కి, ప్రదీప్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశం ఆపుకోలేని లలిత్ తన దగ్గర వున్న నాటు తుపాకీతో ప్రదీప్ మీద కాల్పులు జరిపాడు. తాను ప్రేమించిన అమ్మాయి మీద కూడా కాల్పులు జరిపాడు. అయితే టైమ్ బాగుండి వాళ్ళిద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, లలిత్, ప్రదీప్ ఇద్దరూ గతంలోనే పెళ్ళయి పెళ్ళాలు పిల్లలు వున్నవాళ్ళే.

దంపతుల మధ్య ఫోన్ వివాదం.. భార్యని చంపిన భర్త...

  ఫోన్ ఆమె ప్రాణం తీసింది. కేవలం ఫోన్లో మాట్లాడ్డమే ఆమె నిండు జీవితానికి ముగింపు పలికింది. బెంగుళూరుకు చెందిన రేణుక, సైమన్ అనే యువతి యువకులు ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకున్నారు. సైమన్ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో కూడా చేరాడు. సంసారం హాయిగా సాగిపోతోంది. అయితే రేణుకకి గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూ వుండటం అలవాటు. భర్త ఇంట్లో వున్నా ఫోన్ మాట్లాడ్డంలోనే మునిగిపోయి వుంటుంది. ఈ విషయంలో సైమన్ ఆమెను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ రేణుక తన ధోరణి మార్చుకోలేదు. సైమన్ ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటికి పోన్ చేసినా ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చేది. ఈ విషయంలో గత నెల నుంచి దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి దంపతులు తీవ్రంగా గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన సైమన్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.

రంజిత్ సిన్హాకి సుప్రీంకోర్టు తాఖీదులు...

  అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్టు అందరికీ నోటీసులు ఇచ్చే సీబీఐ డైరెక్టర్‌కే నోటీసులు జారీ అయ్యాయి. 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుంభకోణం నిందితులతో భేటీ అయిన ఆయన్ని సీబీఐ డైరెక్టర్గా తొలగించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ఈ ఆరోపణలపైసంబంధించి పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ‘సుప్రీం’ రంజిత్ సిన్హాను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణలో వుండాలంటే తెలంగాణకి సెల్యూట్ కొట్టాలి: కేసీఆర్

  తెలంగాణ సమాజాన్ని అగౌరవ పరిస్తే పాతరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వరంగల్‌లో కాళోజీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. రెండు ఛానెళ్ళను తెలంగాణలో ప్రసారం కాకుండా చేయడం పట్ల జరుగుతున్న ఆందోళన మీద ఆయన మాట్లాడారు. ‘‘మా తెలంగాణ గడ్డ మీద ఉండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి. మా తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కర్లేదు.. మా తెలంగాణ ప్రజా ప్రతినిధులను పాచికల్లు తాగే ముఖాలు అంటే క్షమించాలా? అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. కేసీఆర్ని తిడితే బాధలేదు. తెలంగాణ శాసన సభ్యులను తిట్టడం అవమానకరం. తెలంగాణ శాసనసభ్యులందరూ ఆ ఛానల్స్ మీద సమష్టిగా తీర్మానం చేశాయి. ఆ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పరిధిలో వుంది. ఈ అంశానికి స్పందించిన ఎంఎస్ఓలు ప్రసారాలు నిలిపేశారు. దీనిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి రాద్ధాంతం చేశారు. ఆ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ అంశంలో ఆ ఛానెళ్ళలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కూడా ఆలోచించాలి’’ అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.