నిరంతరాయ విద్యుత్: కేంద్రంతో ఏపీ ఒప్పందం

  ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయ విద్యుత్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏపీలో నిరంతరాయ విద్యుత్ అమల్లోకి రానుంది. అలాగే 6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

నాకు ప్రాణహాని వుంది.. భద్రత తగ్గించొద్దు.. జగన్...

  తనకు ప్రాణహాని వున్నందువల్ల తనకు భద్రత తగ్గించవద్దని వైసీపీ నాయకుడు జగన్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం తనకు వున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గత మూడు సంవత్సరాల నుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కడప జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

మెదక్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

  మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఈ స్థానం నుంచి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2,67,900 మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కౌంటింగ్లో టీఆర్ఎస్ మొదటి నుంచీ ఆధిక్యం ప్రదర్శించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్లు దక్కించుకోగలిగాయి.

నందిగామ విజయం టీడీపీ పాలనపై తీర్పు.. చంద్రబాబు..

  కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు మీద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నందిగామలో విజయం తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలన మీద ప్రజల తీర్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. నందిగామలో విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. నిరంతరాయ విద్యుత్, అధిక ధరల నియంత్రణ లాంటి ప్రభుత్వ పనులకు ప్రజల నుంచి లభించిన ఆమోదమే ఈ విజయమని సీఎం చంద్రబాబు అన్నారు.

సోనియా అల్లుడికి ఊరట

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. భూముల కొనుగోళ్ళ వ్యవహారంపై వాద్రాపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. వాద్రాపై విచారణకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్‌లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లాలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.

నాంపల్లి బస్టాప్‌... విద్యుత్ తీగలు పడి నలుగురి మృతి

  నాంపల్లిలోని హజ్ హౌస్ ఎదురుగా వున్న బస్టాప్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీద హై టెన్షన్ కరెంట్ తీగలు పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారు మధ్యప్రదేశ్‌లోని జిమ్మీ సర్కస్‌కి చెందిన సుశీల్ యాదవ్, కౌసర్, రాబిన్, రమీకాంత్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఇదే బస్టాపు మీద కరెంటు తీగలు తెగి పడటంతో కొంతమంది మరణించారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇదే బస్టాపులో అలాంటి సంఘటనే జరిగి నలుగురు మరణించారు.

త్వరలో విండోస్-9

  మైక్రోసాఫ్ట్ సంస్థ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 9ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 30వ తేదీన దీన్ని విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఆరోజు జరిగే కార్యక్రమానికి అందరికీ స్వాగతం అంటూ మైక్రోసాఫ్ట్ ఆహ్వానాలు పంపింది. ‘‘విండోస్కు, మా సంస్థకు తదుపరి భవిష్యత్తు ఏంటో చూసేందుకు మాతో కలసి రండి’’ అని అర్థం వచ్చేలా ఓ ఆహ్వానాన్ని మైక్రోసాఫ్ట్ పంపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు ఉపయోగపడే ప్రత్యేకమైన విండోస్ తయారుచేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈనెల 30వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా విండోస్ ఆధారిత కంప్యూటర్లకు వివిధ ప్రోగ్రాంలు రూపొందించే డెవలపర్లు, తమ నెట్వర్కులలో మైక్రోసాఫ్ట్ ప్రోగ్రాంలు వాడేవాళ్లను ఉద్దేశించి ఈ ఆహ్వానం పంపినట్లు భావిస్తున్నారు.

నందిగామలో తెలుగుదేశం విజయం

  కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు మీద విజయం సాధించారు. 15 రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. 73,807 ఓట్ల మెజారిటీతో తంగిరాల సౌమ్య కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు మీద విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం అనేది కోరి కోరి ఓటమి తెచ్చుకోవడమేనని అందరూ భావించారు. ఇప్పుడు ఆ విషయం రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం చోటు లేదని మరోసారి నిరూపణయింది.

మెదక్‌లో టీఆర్ఎస్, నందిగామలో టీడీపీ ఆధిక్యం

  ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మెదక్‌లో టీఆర్ఎస్, నందిగామలో టీడీపీ ఆధిక్యంలో వున్నాయి. మెదక్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు 4710 ఓట్లు, కాంగ్రెస్‌కు 1840 ఓట్లు, బీజేపీకి 1710 ఓట్లు వచ్చాయి. ఇక మెదక్‌ లోక్‌సభకు మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా టీఆర్‌ఎస్-10, బీజేపీ-9, కాంగ్రెస్-1, రెండు తిరస్కరణకు గురయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక కృష్ణాజిల్లా నందిగామలో తొలి రౌండ్లో టీడీపీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్‌లో టీడీపీకి 5680 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

బాబు 100 రోజుల పాలనపై అంబటి అరుపులు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఏపీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు వంద రోజుల పాలనను ప్లాప్ అయిన సినిమాగా అభివర్ణించారు. బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ రాజధానిగా అందరికీ సమ్మతమేనని అయితే, చర్చ లేకుండా ప్రకటన చేయడమే సరికాదన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. వంద రోజులైనా రుణమాఫీపై సంతకం పెట్టలేదన్నారు.

టీడీపీ బాటలో దగ్గుబాటి దంపతులు?

  కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం కాబట్టి ఈ పరిణామం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి దంపతులు టీడీపీలోకి వెళ్ళేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని చెప్పారని ప్రచారం జరుగుతోంది.

సీబీఐ డైరెక్టర్ లోగుట్టు బయటపెట్టాలి.. సుప్రీం

  2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ దర్యాప్తు వ్యవహారంలో సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా లోగుట్టు వ్యవహారాన్ని బయటపెట్టాలంటూన్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరో ఏదో ప్రకటన చేశారని, దాని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించలేమని, భూషణ్ తప్పకుండా సీబీఐ డైరెక్టర్ ఇంటి అతిథుల జాబితాను వెల్లడించాలని తెలిపింది. వారి పేర్లను సీల్డ్ కవర్లో తమకు అందించాలని చెప్పింది. అయితే, ప్రశాంత్ భూషణ్ ఆరోపిస్తున్నట్లు రిజిస్టర్‌లోని 90 శాతం పేర్లు అసత్యమని, కొన్నే నిజం కావొచ్చని సిన్హా వాదించారు. ఈ మేరకు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన, తనపై భూషణ్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరిస్తున్నానన్నారు. తనపై తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని, అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది