వేడుకలో విషాదం

  కడప జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లి గ్రామంలో శ్రీరాముని ఊరేగింపు వేడుకలో విషాద ఘటన జరిగింది. బుధవారం రాత్రి సీతారాముల ఉత్సవ విగ్రహాలను ట్రాక్టర్ మీద వుంచి గ్రామంలో ఊరేగించారు. ఆ ట్రాక్టర్ మీద ఎక్కిన గణేష్, జగన్ అనే ఇద్దరు బాలురు అదే వాహనంలో నిద్రపోయారు. ట్రాక్టర్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వుంది. అందులోంచి వచ్చిన పొగ పీల్చడంతో ఈ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పిల్లలు కనిపించకపోవడంతో వెతికిన ఆ చిన్నారుల తల్లిదండ్రులకు గురువారం ఉదయం ట్రాక్టర్‌లో వారు కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో గణేష్ అనే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. జగన్ అనే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

'ఎటకారం' విజయ్‌కి అంకితం

  నేపాల్ భూకంపం వల్ల 'ఎటకారం' సినిమా నటుడు, నృత్య కళాకారుడు విజయ్ చనిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ అంత్యక్రియలు గురువారం అతని స్వస్థలం బాపట్లలో జరిగాయి. విజయ్ భౌతికకాయానికి మాజీ మంత్రి పనబాక లక్ష్మీ నివాళులు అర్పించారు. 'ఎటకారం' చిత్ర యూనిట్ కూడా విజయ్ కు ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కిషన్ మాట్లాడుతూ ఎటకారం సినిమాను విజయ్ కు అంకితం చేస్తున్నామని, సినిమాకు వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని విజయ్ సింగ్ కుటుంబానికి ఇస్తామని తెలిపారు. నేపాల్ లో 'ఎటకారం'సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తీయడానికి చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.

స్పేస్‌క్రాఫ్ట్ దూసుకొచ్చేస్తోంది...

  చాలాకాలం క్రితం స్కైలాబ్ అనే ఉపగ్రహం భూమి వైపు దూసుకొస్తోందని, అది భూమిని ఢీకొంటే ఇక అంతే సంగతులని వదంతులు వ్యాపించి, చాలామంది ఇక ఇవే చివరి రోజులని లైఫ్‌ని ఎంజాయ్ చేయడం, భోరున ఏడవడం గురించి తెలిసిందే. ఆ తర్వాత ఆ స్కైలాబ్ సముద్రంలో పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మానవులు పంపిన ఉపగ్రహాలు వాటి కాల వ్యవధి ముగిసిపోవడం, నియంత్రణ కోల్పోవడం కారణంగా భూమ్యాకర్షణ కారణంగా తిరిగి భూమ్మీదకు వచ్చేస్తూ వుంటాయి. ఇప్పుడు ఒక మానవ రహిత రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి నియంత్రణ కోల్పోయి భూమ్మీదకు దూసుకుని వస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి సామగ్రిని తరలించడం కోసం ప్రయోగించిన మానవ రహిత రష్యన్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణ కోల్పోవడంతో భూమి మీదకు దూసుకు వస్తోంది. ప్రస్తుతం అది అదుపులో లేకపోవడం వల్ల వేగంగా భూమ్మీదకు వస్తోన్నట్టు తెలుస్తోంది. అది ఏ ప్రాంతంలో భూమిని ఢీకొంటుందో శాస్త్రవేత్తలే చెప్పలేకపోతున్నారు. దానిని అదుపు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.

నేపాల్ భూకంప మృతులు 5,489

  భూకంప తాకిడికి నేపాల్ ఒక్కసారిగా అతలాకుతలమైపోయింది. రోజులు గడుస్తున్నా పరిస్థితి ఇంకా కొలిక్కిరాకపోగా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపు ఇప్పటివరకు 5,489 మంది మృతిచెందారు. ఇంకా ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. మరోవైపు ఎన్నో దేశాలు నేపాల్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చినా ఆసాయాన్ని సమర్ధవంతంగా అందుకో లేకపోవడమే సమస్యగా మారింది. మరోవైపు దేశాల నుండి వచ్చే సహాయాన్ని అందుకోవడానికి, బాధితులు వద్దకు చేర్చడానికి నేపాల్ ఒకే ఒక విమానాశ్రయం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే ఆధారపడింది. ఇప్పటికే విపరీతమైన రద్దీతో ఉన్న విమానాశ్రయం... బాధితులకు నిత్యావసర సరుకులు తీసుకువచ్చే పలు విమానాలు దిగే వీలు లేకుండా పోయింది. దీంతో వాటిని భారత్ కో, మరోవైపుకో మళ్లించడం జరుగుతోంది. పొరుగు దేశాలు సహాయ సామాగ్రిని పంపించినా మౌలిక సౌకర్యాలు, పాలన వనరులు, నైపుణ్యం అంతంత మాత్రంగానే ఉన్న నేపాల్ ప్రభుత్వం సైన్యం వాటిని వినియోగపరుచుకోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా దాతలు సహాయం మావద్దకు చేర్చాలంటూ బాధితులు నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కోయిరాలా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంగళసూత్రం మింగేసిన దొంగోడు

  ఓ చైన్ స్నాచర్ తాను దొంగిలించిన మంగళసూత్రాన్ని మింగేసి కష్టాల్లో పడ్డాడు. ముంబైలో ఓ చైన్ స్నాచర్ ఒక మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుని పారిపోయాడు. అయితే పోలీసులు వెంట పడటంతో దొరికిపోతాననే భయంతో తాను తెంచిన మంగళసూత్రాన్ని నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. అయితే 25 గ్రాముల బరువున్న ఆ మంగళ సూత్రం నేరుగా పొట్టలోకి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఇరుక్కుపోయి, అక్కడి నుంచి కదలని డిసైడైంది. సదరు దొంగగార్ని పట్టుకున్న పోలీసులు అతను మంగళసూత్రాన్ని మింగిన విషయాన్ని గ్రహించి అతనికి అరటిపళ్ళు తినిపించడం, పళ్ళరసాలు ఇవ్వడం లాంటి పనులన్నీ చేశారు. అయితే ఆ మాంగల్యం చాలా గట్టిదేమో, పేగుల్లో ఎక్కడ ఇరుక్కుండో అక్కడే గట్టిగా వుండిపోయింది. దాంతో ఆ దొంగకి కడుపునొప్పి మొదలైంది. బాధతో కేకలు వేస్తూ వుండటంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ గొలుసును బయటకి తీయాలని నిర్ణయించారు.

పెళ్ళి వాహనాలకు ప్రమాదం... 14 మంది మృతి

  ఉత్సాహంతో పెళ్ళికి వెళ్తున్న పెళ్ళి బృందాల వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో 14 మంది మరణించారు. ఈ ఘటనలు ఛత్తీస్‌గఢ్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బలోడ్ జిల్లాలో ఒక పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న వ్యాను లారీని ఢీకొనడంతో ఒక బాలిక సహా 10 మంది అక్కడికక్కడే మరణించారు. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఒకపెళ్ళి వాహనం ప్రమాదానికి గురైంది. పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

95 ఏళ్లుగా తలలో బుల్లెట్

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 95 ఏళ్లు బుల్లెట్ ను తలలో దాచుకొని బతికాడు ఓ వ్యక్తి. వివరాలు... 1917 లో కాలిఫోర్నియాకు చెందిన విలియం లాలిస్ పేస్ అతని అన్న కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. అయితే రోజూ ఒకేలా ఆడితే ఏం థ్రిల్ ఉంటుంది అనుకున్నారేమో వెంటనే వాళ్ల నాన్న దగ్గర ఉండే రివాల్వర్ తీసుకొని ఆడటం మొదలుపెట్టారు. అయితే విలియం అన్న చేతిలో ఉన్నతుపాకీ ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్ విలియం తలలోకి దూసుకుపోయింది. అంతే విలియం వెంటనే స్పృహ కోల్పోయాడు. అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లగా తలలో ఉన్న బుల్లెట్ తీసేస్తే అతను బ్రతుకుతాడన్న నమ్మకం లేదని వైద్యులు చెప్పడంతో అలా అది విలియం తలలోనే ఉండిపోయింది. అయితే బుల్లెట్ తలలోనే ఉండిపోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా అతని దృష్టి, వినికిడి శక్తి కోల్పోయి, కుడి కన్ను, చెవి పనిచేయడం మానేశాయి. అలా 95 ఏళ్లపాటు బతికిన విలియం 2012లో 103 సంవత్సరాలకు మరణించాడు. 2006 లో ఇతని గొప్పదనాన్ని గుర్తించి గిన్నిస్ రికార్డు పుస్తకంలో చోటు కల్పించారు.

టీచర్ కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా టీచర్ అవతారం ఎత్తనున్నారు. ఎలాగంటారా... మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ దీనికి వేదిక కానుంది. తన పార్టీలోని నాయకులంతా తన లాగే వైబ్రైంట్ గా ఉండాలన్నది కేసీఆర్ సంకల్పమట. తాను ఎంపీగా, ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎదుర్కొన్న అనుభవాలనే పాఠాలుగా చెపుతారంట. కేసీఆర్ తోపాటు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ శిక్షణ తరగతులో రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్ ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు, చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

దాసరిపై సీబీఐ మరో చార్జిషీట్

  కాంగ్రెస్ హయాంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో అంటుకున్న మసి వదిలే దాఖలాలు కనిపించట్లేదు. లేటెస్ట్ గా దాసరి నారాయణరావుతో పాటు మరో 14 మందిపై సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. అమరకొండ ముర్గాదంగల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో చార్జిషీటు దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లను సీబీఐ చార్జిషీటులో పెట్టారు. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది.

ప్రత్యేకంగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్ట్

  ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ నిశ్చితార్థం మార్చి 4న జరిగిన విషయం అందరికి తెలిసిందే. మనోజ్- ప్రణతిరెడ్డి వివాహం మే 20న ఉదయం 9.10 గంటలకు హైటెక్స్ లో జరగనుంది. ఈయన పెళ్లి హడావుడి ఎప్పుడో మొదలైంది. శుభలేఖలు కూడా పంచిపెట్టేశారు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ ప్రత్యేకంగా తయారుచేయించిన పెళ్లి కార్డుపై అందరి దృష్టి పడింది. కాషాయ రంగు, ఊదారంగు కాంబినేషన్ లో ఉండి కళంకారి తరహా బొమ్మలతో ప్రత్యేకంగా డిజైన్ చేపించిన వెడ్డింగ్ కార్డు అందరికి తెగ నచ్చేసింది. ప్రధాని మంత్రి మోడీ కూడా కార్డు చూసి మెచ్చుకున్నారట. ఈ వివాహానికి సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను మోహన్ బాబు ఆహ్వానించినట్టు సమాచారం.

వైసీపీలో బొత్స ముసలం

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సర్వనాశనం అయిపోవడానికి గల ప్రధాన కారణాల్లో రాష్ట్ర విభజనతోపాటు, ఆ పార్టీ నాయకుల అవినీతి, ఆ పార్టీకి నాయకత్వం వహించిన బొత్స సత్యనారాయణ కూడా ఒక కారణం అని కాంగ్రెస్ కార్యకర్తలే అంటూ వుంటారు. బొత్స సత్యనారాయణ తన శల్య సారథ్యంతో కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారన్న అభిప్రాయం బలంగా వుంది. బొత్స చేసిన అవినీతి, అక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ కన్నుమూయడానికి తమవంతు సహకారాన్ని అందించాయని చెబుతూ వుంటారు. బొత్స ధాటికి తట్టుకోలేక ఎన్నికల ముందే చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి బలంగా వున్న అనేకమంది నాయకులు బొత్స పుణ్యమా అని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి వారిలో బొబ్బిలి రాజ కుటుంబానికి చెందిన సుజయకృష్ణ రంగారావు, బేబి నాయన కూడా వున్నారు. రంగారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, బేబి నాయన ఎంపీగా పోటీ చేసి  అశోక్ గజపతిరాజు చేతిలో ఓడిపోయారు. గెలిచినా, ఓడినా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉత్తరాంధ్ర వైసీపీలో బలమైన నాయకులుగా వున్నారు. ఇప్పుడు వీరిద్దరిని దూరం చేసుకునే రాంగ్ స్టెప్ వైసీపీ వేయబోతోంది. ఆ స్టెప్పే బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకోవడం. బొత్స సత్యనారాయణ టీడీపీలో, బీజేపీలో చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాక ఇప్పుడు ఆయన దృష్టి వైసీపీ మీద పడింది. వైఎస్సార్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాకుండా వుండటానికి తనవంతు కృషి చేసిన బొత్స ఇప్పుడు వైసీపీ గుమ్మం ముందు నిల్చోవడాన్ని చూసి ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, రాజకీయాల్లో ఇది మామూలే. వైసీపీ నాయకత్వం కూడా బొత్సను పార్టీలో తీసుకోవాలనే ఆసక్తి కనిపిస్తోంది. ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ కీలక నాయకులు విజయ సాయి రెడ్డి, సజ్జా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగబోతోందట. ఆ సమావేశంలో బొత్స పార్టీ ప్రవేశానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయం అంటే బొత్సను పార్టీలోకి తీసుకునే నిర్ణయమే అయి వుంటుందని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూర్చున్న పార్టీ ఆలోచనా విధానం ఇలా వుంటే, ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులలో మాత్రం బొత్స రాక చాలా సీరియస్ మేటర్ అయి కూర్చుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న సుజయ కృష్ణ రంగారావు, బేబి నాయన బొత్సతో వేగలేకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొత్సకు రాజకీయ గురువు అయిన పెన్మత్స సాంబశివరాజు కూడా కాంగ్రెస్ టాటా చెప్పేసి వైసీపీకి వచ్చేశారు. ఇప్పుడు కనుక బొత్సను పార్టీలో చేర్చుకున్నట్టయితే ఈ ముగ్గురూ వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా బొత్సను పార్టీలోకి తీసుకునే ఆలోచనను మానుకోవాలని వీరు అంటున్నారు. బొత్స కనుక పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్రలో వైసీపీ సమాధి కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. బొత్స కావాలో, తాము కావాలో తేల్చుకోవాల్సిన తరుణం ఇదని వారు అంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స విషయంలో ఇంత నెగటివ్ వున్నప్పటికీ పార్టీ నాయకత్వం బొత్స వైపే మొగ్గు చూపుతూ వుందంటే ఏమని అర్థం చేసుకోవాలి... పార్టీకి అంతిమ ఘడియలు సమీపించాయని అర్థం చేసుకోవాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దుర్గ గుడి గోశాలలో ఐదు ఆవులు మృతి

  బెజవాడ కనకదుర్గ దేవాలయానికి చెందిన గోశాలలో గోవులకు పాడైపోయిన పదార్థాలు పెట్టడంతో ఐదు ఆవులు మరణించాయి.బుధవారం ఉదయం గోశాల సిబ్బంది పెట్టిన గోధుమరవ్వ తిన్న ఐదు ఆవులు నురగలు కక్కుకుంటూ మరణించాయి. మరో 20 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాయి. గోధుమరవ్వ తినడం కారణంగానే ఆవులు మరణించినట్టు సమాచారం. ఇంద్రకీలాద్రి కొండదిగువన అర్జున వీధిలో ఈ గోశాల వుంది. ఇక్కడ దాదాపు ఐదు వందల ఆవులు వుంటాయి. గోశాలను సందర్శించే భక్తులు వాటికి అన్నం, ఇతరత్రా ఆహారం పెడుతుంటారు. విజయవాడలోని ఒక సంస్థకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన గోధుమరవ్వను బుధవారం ఉదయం గోవులకు పెట్టినట్టు తెలుస్తోంది. గోవుల మృతిపై గోశాల సంరక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది.

పైకి పోయేముందు పెళ్ళి

  ఉరితీసే ముందు ఆఖరి కోరిక ఏమిటని అడగడం సహజం. అలా అడిగినందుకు పెళ్లి కోరుకున్నాడు ఓ వ్యక్తి. ఆస్ట్రేలియాలో ఆండ్రూచాన్ అనే వ్యక్తి డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో 2005 లో అరెస్ట్ అయ్యాడు. దేశవిదేశాలు అంతర్జాతీయంగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇండోనేషియా మాత్రం అవేమి పట్టించుకోకుండా చట్ట ప్రకారం ముందుకెళ్తూ ఉరిశిక్ష విధించింది. నేరం రుజువుకావడంతో ఆండ్రూచాన్ తో పాటు మరో 9 మందికి బుధవారం తెల్లవారుజామున మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆండ్రూచాన్ ఆఖరి కోరిక అడుగగా అతనికి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ఉందని కోరాడు. దీంతో జైలులోనే ఖైదీల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిపి ఆండ్రూచాన్ ఆఖరి కోరిక తీర్చారు పోలీసు అధికారులు. ఆస్ట్రేలియాకు చెందిన మరో నిందితుడు మ్యూరన్ సుకుమారన్ చివరి క్షణాల వరకు పెయింటింగ్‌లు వేసేలా చూడాలని కోరాడు.