ఏపీకి ప్రత్యేక హోదా లేదట

  ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్షంలో వున్న బీజేపీ ఇచ్చిన ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా ఇక రానట్టేనని తెలిసిపోయింది. ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తానని కాంగ్రెస్ అంటే, కాదు కాదు పదేళ్ళు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ కూడా ఇప్పుడు మాట మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని శుక్రవారం నాడు పార్లమెంటులో తేల్చి చెప్పింది. ఏపీకి ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇక ఇచ్చే అవకాశం లేదని తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎంపీలు కొత్త ప్రభాకరరెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర  ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్  లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రానికీ  ప్రత్యేక హోదాపై  ఇచ్చే అవకాశం లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే ఆర్థిక అవసరాలకు మార్గదర్శకం అని మంత్రి తన సమాధానంలో తేల్చేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామని, పలు పారిశ్రామిక రాయితీలు ప్రకటించామని,  అదనపు పెట్టుబడి, అదనపు తరుగుదల రాయితీలు ఇచ్చామన్నారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి ఐదేళ్ల పాటు అమలవుతాయని మంత్రి తెలిపారు.

20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గం

  లండన్ లో జరిగిన వేలంలో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం భారీ ధరకి అమ్ముడుపోయింది. ఈ ఖడ్గం పిడి పులి తల బొమ్మతో ఉండి వజ్రాలు, రత్నాలతో పొదిగి ఉంటుంది. ఓ వ్యక్తి ఈ ఖడ్గాన్ని ఏకంగా రూ. 20 కోట్లు పెట్టి దక్కించుకున్నాడు. వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన ఉపయోగించిన 30 రకాల ఆయుధాలను విక్రయించింది 'బోన్ హామ్స్'. టిప్పు సుల్తాన్ కత్తికి రూ. 20 కోట్లు రాగా మిగిలిన ఆయుధాలను మొత్తం రూ. 37 కోట్లకు విక్రయించారు. అయితే టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం రూ 10 కోట్లు రావచ్చని అంచనా వేసామని కానీ ఆ అంచనాలను దాటి రెట్టింపు ఆదాయం వచ్చిందని బోన్ హామ్స్ అధికారులు తెలిపారు.

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం

  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి ఎన్నికైన అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్న కేసీఆర్ జ్యోతి ప్రజ్వనల చేసి పార్టీ ప్లీనరీని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కేకే, కేటీఆర్, ఈటెల రాజేందర్, హరీష్‌రావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధించడానికి టీఆర్ఎస్ చేసిన కృషిని వివరించి, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

కార్యకర్తలకు రుణపడి ఉంటా.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ పాలమూరులో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాను దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని, ఈరోజు తెలంగాణ రాష్టం ధనిక రాష్టంగా ఉందంటే దానికి నేను చేసిన అభివృద్ధే కారణమని స్పష్టం చేశారు. ఒకరిద్దరు పార్టీ నుండి వెళిపోతే పార్టీకీ వచ్చిన నష్టం ఏం లేదన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నాయకులను తయారుచేసే సత్తా పార్టీకి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండటం పార్టీకి అదృష్టమని, ఇక్కడి కార్యకర్తల అభిమానం చూసి వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని అన్నారు. గతంలో పాలమూరు జిల్లా ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల పేదలున్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినట్టుగానే ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని తెలిపారు. మహిళలకు ప్రసవ సమయంలో ఏదైనా జరిగితే ఆదుకోవాలని నేతలు సూచించినప్పుడు తప్పకుండా ఈ విషయం మీద ఆలోచిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు జాతీయ కమిటీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

‘దోచేయ్‌’ షార్ట్ రివ్యూ...

నాగచైతన్య, కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘దోచెయ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, చేయ‌ని నేరానికి సీతారామ్ (రావు ర‌మేష్‌) జైలుపాలై యావ‌జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటాడు. సీతారామ్ కొడుకు... చందు(నాగ చైతన్య).   "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు అనే మాట న‌మ్ముతాడు. అందుకే.. చెల్లాయిని మెడిసెస్ చ‌దివించ‌డం కోసం మోస‌గాడిగా మార‌తాడు.  చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. మాణిక్యం (పోసాని) త‌న ముఠాతో బ్యాంకుల్ని లూఠీ చేయిస్తుంటాడు. ఓ బ్యాంక్‌లో రెండు కోట్లు ఎత్తేసిన ముఠా స‌భ్యులు ఒక‌రిని కాల్చుకొని మ‌రొక‌రు చ‌నిపోతారు. ఆ డ‌బ్బు అనూహ్యంగా చందుకి దొరుకుతుంది. ఆ డ‌బ్బుతో త‌న తండ్రిని జైలు నుంచి విడిపించుకొందామ‌నుకొంటాడు చందు. అయితే ఈ డ‌బ్బు కో్సం మాణిక్యం, ఆ ఏరియా సీఐ రిచ‌ర్డ్ (ర‌విబాబు) వెంట‌ప‌డ‌తారు. ఆ డ‌బ్బుని చందూ ఎలా కాపాడుకొన్నాడు. త‌న తండ్రిని జైలు నుంచి ఎలా విడిపించుకొన్నాడు?  అస‌లు సీతారామ్ జైలులో ఉండ‌డానికి కార‌ణం ఏమిటి?  అనేదే చిత్ర క‌థ‌. స్వామిరారాతో సుధీర్ వ‌ర్మ‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ న‌మ్మ‌కం క‌లిగింది. ఈ సినిమాలో  క‌థ - క‌థ‌నాల దృష్ట్యా అతను బాగా నిరుత్సాహ‌ప‌రుస్తాడు. క్రైమ్ కామెడీని ఎలా న‌డిపించాలో స్వామి రారాతో ఓ పాఠంగా చెప్పిన సుధీర్‌.. ఎలా తీయ‌కూడ‌దో ఈ సినిమాతో మ‌ళ్లీ తానే చూపించాడ‌నిపించింది. నాగ‌చైత‌న్య ఎప్ప‌ట్లా న‌టించేశాడు. ఆటోన‌గ‌ర్ సూర్య‌కీ, మ‌నంకీ, దోచేయ్‌కి న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ చూపించ‌లేక‌పోయాడు. ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాల్సిన సీన్స్‌లో నీర‌సంగా ఎలా న‌టించ‌గ‌లుగుతున్నాడో, ఆ సీక్రెట్ ఏంటో చైతూనే చెప్పాలి.

చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులు

  తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావు తో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వస్తోందని అనేక వదంతులు వస్తున్నాయని, అలాంటి వదంతులను నమ్మద్దని సూచించారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ తినచ్చని అన్నారు. ఈ సందర్భంగా చికెన్ తో తయారుచేసిన వంటకాలను, గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ మేళాలు నిర్వహిస్తామని, శుక్రవారం ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ తోనే వంటకాలు తయారుచేయిస్తామని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో వాలనున్న వాల్‌మార్ట్

  ఇప్పటికే హైదరాబాద్‌లో తన బ్రాంచ్‌లను ప్రారంభించిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇక తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ స్థాయిలో తన స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అనుమతులు తదితరాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాల్ మార్ట్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరి ప్రతిపాదనలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన లభించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్‌మార్ట్ ఏర్పాటు చేయబోయే స్టోర్‌లకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే విషయంలో తన సహకారం అందించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. దీనికోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాల్‌‌మార్ట్‌కి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అంటూనే, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో ఏపీ, తెలంగాణల్లో వాల్‌మార్ట్ విజృంభించబోతున్నట్టు అర్థమవుతోంది.

క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

  రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ లో గందరగోళం జరిగింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెద్ద ఇరకాటంలో పడ్డారు. ఘటన జరిగి అనేక ఆందోళనలు జరిగిన తరువాత ఇప్పుడు కేజ్రీవాల్ నోరు విప్పారు. ఘటన జరిగిన తరువాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది ఎవర్నైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆఖరికి క్షమాపణ చెప్పారు. ఘటన జరిగిన తరువాత పదినిమిషాలు ఆయన మాట్లాడుతూ గజేంద్రసింగ్ ను కాపాడటంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ప్రసంగించారు. దీంతో ప్రతిపక్షాలు, పోలీసులు ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిరంచారు. గజేంద్ర ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఆప్ కార్యకర్తలు చోద్యం చూస్తూ కూర్చున్నారని, వారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

నటుడిగా సచిన్ టెండుల్కర్

  క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. క్రికెట్ లో ఎన్నో మెరుపులు మెరిపించి ఎంతో మంది అభిమానుల మనసులో స్థానం నిలుపుకున్నాడు. ఒక్క క్రికెట్ లోనే కాకుండా యాడ్స్ లో, చట్టసభ సభ్యుడిగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు కొత్తగా ఒక డాక్యుమెంటరీ కోసం నటుడిగా మారనున్నాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ - ఫీచర్ సినిమా తీయనున్నారు. దీనికి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నదని సమాచారం. అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్న సచిన్ ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు.

కేసులో ఇరుక్కున్న అల్ఫోన్సా

  కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డాన్సర్‌గా అనేక వందల సినిమాల్లో నటించిన అల్ఫోన్సా గుర్తుండే వుంటుంది. సినిమా కెరీర్ ముగిసిన తర్వాత అల్ఫోన్సా మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ‘అలాంటి’ కేసులో ఒకసారి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఇప్పుడు అల్ఫోన్సా మరో కేసులో ఇరుక్కుంది. ఆమె తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ చెన్నైకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 2013 సంవత్సరంలో జయశంకర్ అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని, ఆయనతో బుద్ధిగా కాపురం చేసుకుంటున్నానని ఆ మహిళ చెప్పింది. కొద్ది రోజుల క్రితం తన భర్తను అల్ఫోన్సా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించిందని, తన భర్తని వదిలిపెట్టమని చెబితే తనను బెదిరిస్తోందని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా భర్తను ఎందుకు కిడ్నాప్ చేశావని అల్ఫోన్సాని అడిగితే, నీకంటే ముందు నేను అతన్ని పెళ్ళి చేసుకున్నాను... కాబట్టి నువ్వే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ బెదిరిస్తోందని ఆ మహిళ పోలీసులకు తెలిపింది.

జీవితాన్ని త్యాగం చేసిన అమ్మాయిలు

  అమ్మాయిలు, అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలంటే అన్ని వివరాలు తెలుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మరీ అప్పుడు వివాహమాడతారు. అలాంటిది ఇద్దరు యువతులు 20 ఏళ్లుగా మంచంపైనే ఉన్న కవలలను పెళ్లి చేసుకొని వారిలోని మానవత్వాన్ని చాటారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్యాళ్ దంపతులకు విజయకుమార్, జయకుమార్ అనే కవలలు ఉన్నారు. వీరు పదేళ్ల వయసులో ఉన్నప్పుడే మంచం పట్టారు. అప్పటినుండి ఎన్ని ఆస్పత్రులు తిప్పిన ఫలితం మాత్రం ఏం లేదు. ఇప్పుడు వారి వయసు 30 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన వీరి గురించి కేరళకు చెందిన మంజూష సామియార్ తెలుకొని వారిపట్ల సానుభూతి తెలిపింది. వీరిద్దరిలో పెద్దవాడైన విజయ్ కుమార్ ను 2012లో వివాహం చేసుకుంది. చిన్నవాడైనా జయకుమార్ సెల్ ఫోన్ ద్వారా పరిచయమైన శివకులదేవి అనే అమ్మాయి పెళ్లి చేసుకుంది. మొదట శివకులదేవి తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ తరువాత ఒప్పుకున్నారు.

ఊరంతా ఇల్లరికపు అల్లుళ్లే

  పెళ్లవగానే అమ్మాయిలు అత్తవారింటికి వెళతారు. ఎక్కడో గాని అబ్బాయిలు ఇల్లరికానికి వెళతారు. కాని ఓ ఊళ్లో అసలు అమ్మాయిలు అత్తారింటికే వెళ్లరట. అందరూ ఇల్లరికపు అల్లుళ్లే ఉన్నారట. ఎక్కడనుకుంటారా... ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి నగర పరిధిలోగల కరాయ్ టౌన్షిప్లో అందరూ ఇల్లరికపు అల్లుళ్లే. అల్లుళ్లందరూ మూటాముల్లె సర్దుకొని తమ మామగార్ల ఇళ్లకు వచ్చేస్తారు. దీంతో ఆవీధికి అల్లుళ్ల వీధి అని పేరు కూడా పెట్టారు. అక్కడే దాదాపు 60 కుటుంబాలు ఉండగా వాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే. ఆ వీధి మొత్తాన్ని కూడా 'అల్లుళ్ల వీధి' అంటారు. వీరిలో చాలామంది వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని అక్కడి స్థానికులు చెప్పారు. దాదాపు 35 సంవత్సరాలనుండి ఇక్కడ ఇలాగే కొనసాగుతోందని తెలిపారు.

చిన్నారి అవయవ దాత

  సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, చనిపోయిన వాళ్లు అవయవదానం చేస్తుంటారు. కానీ పుట్టగానే అవయవదానం చేసి చరిత్ర సృష్టించాడు ఓ చిన్నారి. బ్రిటన్ కు చెందిన జెన్ ఇవాన్స్, మైక్ హౌల్ స్టన్ దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కవల పిల్లలు జన్మించారు. అయితే వీరిద్దరిలో ఒకరి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మరోబాబు మాత్రం అరుదైన వ్యాదితో జన్మిచాడు. దీంతో వైద్యులు ఆ బాబు కొద్ది నిమిషాలు మాత్రమే బతుకుతాడని నిర్ధారించారు. ఆ పసికందు సమస్య తెలుసుకొన్న తల్లిదండ్రులు గుండె దిటవు చేసుకొని చిన్నారి కిడ్నీలు, గుండె కవాటాలు దానం చేశారు. దాంతో బ్రిటన్ లో అత్యంత చిన్నవయసులో అవయవదానం చేసినవాడిగా రికార్డు సృష్టించాడు. ఈ చిన్నారి అవయవదానం చేసి ఏడాది అయిన సందర్భంగా జస్ట్ గివింగ్ అనే సంస్ఠ చిన్నారి స్పూర్తికథనాన్ని తన వెబ్ సైట్ లో ఉంచింది.

ఏపీ ఇంటర్లో 62 శాతం ఉత్తీర్ణత

  ఆంధ్రప్రదేశ్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఫలితాలను విడుదల చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో మొదటిసారి విడుదల చేసిన పరీక్ష ఫలితాలివి. జనరల్‌లో 52 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఒకేషనల్‌లో 60 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీలో హాజరవగా, 26,913 మంది ఒకేషనల్‌కి హాజరయ్యారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 62.09 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇది నాలుగు శాతం ఎక్కువ. మొత్తం ఫలితాలలో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 59 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా, జనరల్ కేటగిరీలో పరీక్ష రాసిన విద్యార్థులలో 79 మంది మీద, ఒకేషనల్ పరీక్ష రాసిన విద్యార్థులలో 12 మంది మీద.. మొత్తం 91 మంది మీద మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. పరీక్షలో ఫెయిలయిన విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా తెలిపారు.

ఆత్మహత్యలపై మోడీ ఆవేదన

  భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన దర్నాలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎప్పటినుంచో కలచివేస్తున్నాయని, అలాంటి రైతుల సమస్యలను అర్ధం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారాన్నికనుక్కోవాలన్నారు. మనిషి జీవితం కన్నా గొప్పది ఏదీ లేదని, రైతులు అలాంటి జీవితాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. బాధితుల కుటుంబాలు పడే బాధను తాను అర్ధం చేసుకోగలనన్నారు. రైతుల ఆత్మహత్యలు అనాదిగా కొనసాగుతున్న దౌర్భాగ్యమైన పరిస్ధితికి నిదర్శనం అని ప్రధాని ఆవేదన తెలిపారు.