హైకోర్టును వెంటనే విభజించండి... టీ ఎంపీలు

  తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విభజించాలని పిటిషన్ ను దాఖలు చేయగా ఇప్పుడే విభజించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే ప్లకార్డులు పట్టుకొని హైకోర్టును వెంటనే విభజించాలని నిరసనలు తెలిపారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, కోర్టు విభజన చేయాలని తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

ఫేస్బుక్ సీవోవో భర్త మరణం

  ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ష్రేల్ సాండ్బర్గ్ భర్త డేవిడ్ గోల్డ్బర్గ్ ట్రెడ్మిల్పై ప్రమాదవశాత్తు మరణించారు. ట్రెడ్మిల్పై వ్యాయామం చేస్తూ అదుపుతప్పి కింద పడి తలకు గాయం తగలడంతో ఆయన చనిపోయినట్టు సమాచారం. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయన వ్యాయామానికని వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి బంధువులు ఆరా తీశారు. దీంతో ఆయన ఒక హోటల్ జిమ్ లో ట్రెడ్ మిల్ పక్కన పడిపోయి ఉండటంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. భర్త మరణం తనకు తీరని లోటని.. తన కెరీర్లో ఎదగడంలో తన భర్త పాత్ర చాలా ఉందని... తను నిజమైన భాగస్వామి అంటూ నివాళులర్పించారు సాండ్బర్గ్. ఈ సంఘటన పై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ గోల్డ్బర్గ్ చాలా మంచి మనిషి ఆయనతో పరిచయం తన అదృష్టమంటూ సాండ్బర్గ్కు తన సంతాపాన్ని తెలియజేశారు.

530 మందికి ఒకేసారి అంత్యక్రియలు

  నేపాల్ లో వచ్చిన భారీ భూకంపానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపంలో శిథిలాల కింద వెలికితీసిన 530 మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించనున్నామని నేపాల్ అధికారులు తెలిపారు. భూకంపం వచ్చి ఇప్పటికి 9 రోజులైనా నేపాల్ లో ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూకంప ప్రభావం సుమారు 80 లక్షల మంది మీద పడగా, దాదాపు లక్షా అరవై వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు ఏడు వేల మంది మరణించారు. అయితే శిథిలాల వెలికితీత మొత్తం పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య దాదాపు పదిహేను వేలకు పైగా ఉండవచ్చని నేపాలి ప్రధానమంత్రి సుశీల్ కోయిరాలా తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం మరో ఏడుసార్లు భూమి స్వల్పంగా కంపించడంతో నేపాలు ప్రజలు భయభ్రాంతులయ్యారు.

మొక్కలకు మూత్రం పోయండి... కేంద్రమంత్రి

  మీ ఇంట్లో పండ్ల మొక్కలు బాగా ఎదగాలన్నా, బాగా కాయలు కాయాలన్నా మొక్కలకు మూత్రం పోయండి చాలు. ఛీ ఛీ ఇదేంటి అనుకుంటున్నారా ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనే చెపుతున్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో 'కరువుపై పోరాటం' అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ జనపథ్లో ఉన్న తన ఇంటి ఆవరణలోని గార్డెన్లో యూరిన్ చిట్కాను పాటించానని దీంతో తన ఆరెంజ్ తోటలో ఒకటికి రెండింతలు కాయలు కాసాయని చెప్పుకొచ్చారట. అంతేకాదు సోనియాగాంధీ తోటమాలికి తమ బంగ్లాలోని మొక్కలకు కూడా ఈ చిట్కాను వాడమని సెలవిచ్చారు గడ్కరీ. దీంతో బాబోయ్ ఈ గడ్కరీ యూరిన్ చిట్కా ఏంటిరా బాబూ అనుకుంటున్నారట జనాలు. మరి కొందరయితే ఆయన ఎవరికైనా పండ్లు బహుమతిగా ఇస్తే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారట.

హుస్సేన్ సాగర్ శుభ్రం చేయోచ్చు... ఆస్ట్రియా నిపుణులు

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హైదరాబాద్ కు వచ్చి ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయి, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై చర్చించారు. అనంతరం వారు హుస్సేన్ సాగర్ ను పరిశీలించి డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్‌సాగర్ కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని సూచించారు. సైంటిస్టుల బృందం దీనికి సంబంధించిన నివేదికను మంగళవారం సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది.

అందుకే చంద్రబాబు జూన్ 2ని ఎంచుకొన్నారా?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినంగా పాటించాలని నిర్ణయించింది. అయితే ఈఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించకుండా నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ర్యాలీలు, సభలు నిర్వహించి రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలను కూడా భాగస్వాములయ్యేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం అధికారికంగా విభజించబడిన జూన్ 2వ తేదీనే రాష్ట్ర అవతరణ దినంగా నిర్ణయించడం వెనుక చాలా బలమయిన కారణాలే కనబడుతున్నాయి.   రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్దంగా జరిగిన రాష్ట్ర విభజనను ఆ తేదీ ప్రజలందరికీ ఎల్లపుడూ గుర్తు చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కసితో పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు. ప్రజలందరినీ ప్రేరేపించడం మాటెలా ఉన్నప్పటికీ, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొన్న ప్రతీసారి ఎటువంటి పరిస్థితులలో రాష్ట్రం విడిపోయిందో, విభజనకు ముందు తరువాత పరిణామాలు, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఎదుర్కొన్న అనేక సమస్యలు, సవాళ్లు, అవమానాలు అన్నీ గుర్తుకురాక మానవు. అదే సమయంలో ఇందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ, అది ప్రజల అభిమతానికి విరుద్దంగా వ్యవహరించిన తీరు, పార్లమెంటులో విభజన బిల్లును ఆమోదించిన తీరు వగైరా అన్నీ ప్రజల కళ్ళ ముందు సినిమా రీలులా కదలాడకమానవు.   అదేసమయంలో విభజన తరువాత రాష్ట్ర పరిస్థితి, కాలక్రమంలో రాష్ట్రాభివృద్ధి జరిగిన తీరు అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, ముఖ్యంగా అత్యంత క్లిష్ట సమయంలో అధికారం చేప్పటిన తెలుగుదేశం ప్రభుత్వం మొదటి ఐదేళ్ళలో ఎదురయిన అనేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని ఏవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినది కూడా జ్ఞప్తికి రావడం తధ్యం.   ఇక మరో ముఖ్యమయిన విషయం జూన్ 2నే రాష్ట్రావతరణ దినోత్సవంగా నిర్ణయించడం ద్వారా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మొండిగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇకపై రాష్ట్రావతరణ దినోత్సవం జరిన ప్రతీసారి తను చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పించారని భావించవచ్చును. చంద్రబాబు నాయుడు చాలా దూరం ఆలోచించి కాంగ్రెస్ పార్టీని చాలా నేర్పుగా శిక్షించినట్లు కనబడుతోంది.

రామ్ చరణ్ విమానాలు వచ్చేస్తున్నాయి

  ‘ట్రూ జెట్’ పేరుతో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్‌గా టర్బో మేఘ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సేవలు జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నామని, జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందని టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఉత్తరాదీన అహ్మదాబాద్, పుణే, గోవాలలో కూడా ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను కూడా టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఇప్పుడు ప్రారంభించనుంది. ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించాలని కోరుతున్నామని ఉమేశ్ అన్నారు.

ఇక ఇంటర్నెట్ ఉండదా?

  ఇంటర్నెట్... ప్రపంచంలో 90% మంది దీనిపై ఆధారపడేవాళ్లే. అలాంటి ఇంటర్నెట్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోతే... అది జరిగే ప్రమాదముందని అంటున్నారు బ్రిటన్ నిపుణులు. ప్రపంచం వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకీ పెరుగుతుండటంతో మరో ఎనిమిదేళ్లలో ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంటర్నెట్ సామర్ధ్యం దాని పరిమితులను దాటి చేరుకుంటోందని దాని సామర్థ్యం పెంచడం ఇంక సాధ్యం కాదని తెలిపారు. మన ల్యాప్ టాప్ లకు, స్మార్ట్ ఫోన్ లకు, ట్యాబ్లెట్లకు కావలసిన సమాచారాన్ని కేబుళ్లు , ఆప్టికల్ ఫైబర్స్ అందిస్తాయి. అయితే వాటి సామర్ధ్యం మరో ఎనిమిదేళ్లలో గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని, ఒక ఆప్టికల్ ఫైబరులోంచి అంతకు మించిన సమాచారాన్ని పంపించడం వీలుకాదని ప్రొఫె సర్ ఆండ్ర్యూఎలిన్ తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే అంశంపై ప్రముఖ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, టెలికం సంస్థల ప్రతినిధులతో ఆండ్ర్యూఎలిన్ ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

పనిచేయలేని మంత్రులకి టీసీలు ఇచ్చేస్తా: చంద్రబాబు

  నిన్న జరిగిన మంత్రివర్గసమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులను సున్నితంగా హెచ్చరించారు. ఎంత బాగా చదివినప్పటికీ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రయోజనం ఉండనట్లే మంత్రుల పనితీరుకి ప్రజల ఆమోదం లభించకపోతే ఎటువంటి ఉపయోగమూ ఉండదని అన్నారు. అటువంటి మంత్రులకు టీసీలు ఇచ్చి పంపించవలసి వస్తుందని ఆయన తన మంత్రులను హెచ్చరించారు. “మంత్రులు తాము చాలా బాగా పనిచేస్తున్నామనుకోవచ్చును, గానీ ప్రజలు కూడా ఆవిధంగా భావించినప్పుడే దానికర్ధం ఉంటుందని” ఆయన అన్నారు. మంత్రులు తమ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటూ, మరింత మెరుగుపరుచుకోవాలని లేకుంటే తొలగించవలసి వస్తుందని చంద్రబాబు నాయుడు రెండవ మంత్రివర్గ సమావేశం నుండే మంత్రులందరినీ హెచ్చరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో తెదేపా అధికారం వచ్చే వరకు ఎంతో శ్రమించిన పార్టీ నేతలందరూ, అధికారంలోకి వచ్చిన తరువాత ‘విశ్రాంతి-మోడ్’ లోకి వెళ్లిపోయారని చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే మంత్రులలో మునుపటి పట్టుదల, ఉత్సాహం కొరవడ్డాయని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మళ్ళీ నిన్న మంత్రులకు టీసీలు ఇచ్చి పంపించేస్తానని ఆయన సున్నితంగా చేసిన హెచ్చరికను మంత్రులందరూ సీరియస్ గా తీసుకోకపోతే ఏదో ఒకరోజున ఆయన మంత్రివర్గ ప్రక్షాళన చేసి తన హెచ్చరికలను పట్టించుకోని మంత్రులను ఇంటికి పంపడం తధ్యంగా కనిపిస్తోంది.   రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలను కూడా పునరంకితం చేసేందుకు జూన్ 2నుండి 8వరకు వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించాలని నిన్న మంత్రివర్గం నిర్ణయించింది. కానీ అంతకంటే ముందు మంత్రులు అందరూ కూడా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరికలను బట్టి అర్ధమవుతోంది.

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన అనేక సమస్యలను లోతుగా చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆరోజున రాష్ట్రావతరణ దినోత్సవంగా కాక నవనిర్మాణ దీక్షా దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2నుండి 8వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి చివరి రోజయిన జూన్ 8న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు జూన్3-8 తేదీల మధ్య రూ. 4284 కోట్లు ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించారు. కాయగూరలు పండించే రైతులకు విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇస్తారు.   విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయం, విమాన శిక్షణ సంస్థ, విమానాల నిర్వహణ, మరమత్తుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కోసం భూసేకరణ. తిరుపతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం జూన్ నెలలో ప్రారంభం. రాజమండ్రికి రాత్రిపూట కూడా విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రానికి లేఖ వ్రాయాలని నిర్ణయించారు. గుంటూరులో వినుకొండ, నెల్లూరులో దగదర్తి, కర్నూలులో ఓర్వకల్లు, చిత్తూరులో కుప్పం, పశ్చిమగోదావరిలో తాడేపల్లి గూడెం వద్ద కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.   మే10 నుండి 31 రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల బదిలీలు పూర్తి చేయడం. తితిదే పాలకమండలిలో ఎక్స్ అఫీషియో గా కొనసాగుతున్న తుడా చైర్మన్ తొలగించాలని నిర్ణయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన నీరు-చెట్టు, చెరువులలో పూడికతీత పనులను వేగవంతం చేయాలని నిర్ణయం. డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో వ్యవసాయం కోసం రూ.534కోట్లు కేటాయింపు. ప్రతీ మంత్రిత్వ శాఖలో ఆర్ధిక శాఖ తరపున ఒక అధికారి, మీడియా లైజనింగ్ ఆఫేసర్ ఏర్పాటు.

పేలిపోయిన బస్సు... 35 మంది మృతి

  మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లోని పన్నా నుండి ఛతర్‌పూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీనివల్ల బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించింది. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది.

కేసీఆర్ కు క్లాసు తీసుకుంటా... రేవంత్ రెడ్డి

  టీడీపీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విమర్శల వర్షం కురించారు. టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల పేరిట క్లాసులు తీసుకుంటున్న కేసీఆర్ కు కావాలంటే నేను క్లాసులు తీసుకుంటానని విమర్శించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ విలువలను దిగజార్చిన కేసీఆర్, సభా సంప్రదాయాలపై నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. ఇవి కేవలం కేసీఆర్ భజన శిక్షణాతరగతులని, ప్రజల సమస్యలపై చర్చిచే తరగతులు కావని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాం, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డిలు కూడా టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతులకు వెళ్లడం దారుణమని, వారిద్దరూ టీఆర్‌ఎస్‌ సభ్యులుగా మారిపోయారని ధ్వజమెత్తారు. వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆడకుక్కలే బెస్ట్

  కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. అలాంటి కుక్కలలో మగ కుక్కల కంటే ఆడకుక్కలే నయమని పెర్ జెన్సన్ నేతృత్వంలోని జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కుక్కలను మనం పెంచుకోవడం మొదలు పెట్టిన తరువాత వాటిలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అన్నఅంశం మీద ఈ పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే మనుషులకు మగకుక్కల కంటే ఆడ కుక్కలే తొందరగా దగ్గరవుతాయట. ఆడ కుక్కలే త్వరగా యజమాని దగ్గరకు వచ్చి తోక ఊపుతాయని, కళ్లలో కళ్లు పెట్టి చూస్తాయని తెలిపారు పరిశోధకులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 430 జాతులకు చెందిన కుక్కలపై ఈ పరిశోధన జరిపారట. ఏ జాతిలో చూసినా మగకుక్కల కంటే ఆడ కుక్కలే ఎక్కువగా మనుషుల దగ్గరకు వస్తున్నాయని స్ఫష్టం చేశారు.

కయ్యిమన్న కేజ్రీవాల్

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో మీడియా సుపారీ తీసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఆప్ ర్యాలిలో రాజస్థాన్ కు చెందిన రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అలాగే న్యాయశాఖమంత్రిగా ఉన్న జితేంద్ర తోమర్ నకిలీ డిగ్రీల వ్యవహారంపై మీడియా తమ ప్రతిష్ఠతను దిగజార్చేలా చేశారని అన్నారు. తోమర్ విషయంలో నిజనిజాలు తెలుసుకోవడం మీడియా ఉద్దేశం కాదని, అతనిని పదవి నుండి తొలగించాలనే ఉద్దేశ్యంతోనే వారు అలా ప్రచారం చేశారని విమర్శించారు. మీడియా సంస్థలపై వెంటనే బహిరంగ విచారణ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

జోస్యం చెపుతున్న కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెపుతున్నారు. కేసీఆర్ జోస్యం చెప్పడమేంటీ అనకుంటున్నారా... 2019లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే అధికారాన్ని చేపడుతుందని జోస్యం చెపుతున్నారు. డబ్పు కావాలంటే, డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి కానీ... ప్రజా ప్రతినిధులు మాత్రం మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని, ప్రజల పక్షాన్నే నిలవాలని సూచించారు. టీఆర్ఎస్ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అనుకున్నది సాధించడం టీఆర్ఎస్ నైజమని అన్నారు. తెలంగాణ రాదన్న వారికి దానిని సాధించి చూపించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే పని చేయాలని, లేకపోతే మనమే చరిత్రలో కలిసిపోతామని అన్నారు.

సన్యాసి అవ్వాలనుకున్న మోదీ

  భారత ప్రధాని నరేంద్ర మోడీ బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ మహారాజ్ ను కలవనున్నారు. 97 ఏళ్ల ఆత్మస్థానంద్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వచ్చే శనివారం ఆత్మస్థానంద్ మహారాజ్ ను కలుసుకోవడానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్ నందా మహారాజ్ మాట్లాడుతూ.. ఆత్మస్థానంద్ మహారాజ్ ను మోడీ గురువుగారిగా భావిస్తారని, వారి సలహాలు తీసుకునేవారని చెప్పారు. 2013లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామీజీ ని కలిసారని, అయితే మోడీ ప్రధాని అయిన తరువాత తమ ఆశ్రమానికి రావల్సిందిగా కోరుతున్ననని ఆత్మస్థానంద్ మహారాజ్ రాసిన లేఖలో ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు ఇప్పుడు భారత ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉందని ఆయన ఆ లేఖలో రాసినట్టు సమాచారం. అయితే అప్పుడు సన్యాసిగా చేరేందుకు వెళ్లిన ప్రధాని మోడీని ఆపి రాజకీయాల్లోకి వెళ్లాలని చెప్పింది ఆత్మస్థానంద్ మహారాజ్ స్వామీజీయేనట.

నేపాల్ ను పట్టుకున్నమరో భూతం

  అసలే భూకంపం వల్ల నేపాల్ కు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ నేపాల్ ప్రజలు భయపడుతూనే ఉన్నారు. అటూ భూకంపంతో పాటు మరో భూతం నేపాల్ ను వణికిస్తోంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమరవాణా). అసలే హ్యూమాన్ ట్రాఫికింగ్ కు నేపాల్ దేశం పెట్టింది పేరుగా తయారైంది. ఇప్పుడు ఈ దేశంలోని మహిళల అక్రమ రవాణా మరింత పెరగే అవకాశం ఉందని సమాచారం. భూకంపం వల్ల ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ట్రాఫికర్స్ రెచ్చిపోవచ్చనే అనుమానాలు వణికిస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, వారు ప్రయాణికుల వివరాలు, వీసా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, ముఖ్యంగా పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై శ్రద్ధ పెట్టామని అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని, దీనికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేశామని, ముఖ్యంగా రోడ్డు మార్గం, టాక్సీ బూత్, టాక్సీ యూనియన్లపై ఓ కన్నేసి ఉంచామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మార్కులు వేయకపోతే మంత్రం వేస్తా

  పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా పిల్లలు ఏడుస్తారు. కాని ఓ విద్యార్ధి ఏకంగా టీచర్లనే చంపేస్తానంటూ బెదిరించాడు. ఎక్కడంటారా... కర్ణాటకకు చెందిన ఓ విద్యార్ధి పదో తరగతి పరీక్షలు రాశాడు. సరిగ్గా రాయలేదో ఏమో గాని పేపర్లు దిద్దే టీచర్లకు ఓ లేఖ రాసి దానిని ఆన్సర్ షీట్ తో పాటు జత చేశాడు. తనను పరీక్షల్లో ఫెయిల్ చేశారంటే వారి ఫ్యామిలీనంతా మంత్రాలతో చంపేస్తానని, తనను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తన సమాధాన పత్రం చూడకుండా పాస్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ లేఖలో రాశాడు. ఆ లేఖను కర్ణాటక విద్యాశాఖాధికారులు విడుదల చేశారు. అయితే అధికారులు విద్యార్ధి హరిహర ప్రాంతానికి చెందిన వాడని వెల్లడించారు తప్పా... విద్యార్ధి గురించి మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.