పది అడుగులు జరిగిన కాట్మండూ

  భారీ భూకంపం కారణంగా నేపాల్ రాజధాని కాట్మండూ గతంలో ఉన్న ప్రదేశంలోకంటే 10 అడుగులు దక్షిణం వైపుకి జరిగిపోయింది. ఈ విషయాన్ని భూగర్భ శాస్త్ర నిపుణులు వెల్లడించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నేపాల్ ప్రాంతానికి భూకంపాలు తప్పనిసరి. అలాగే నేపాల్ నగర్ ఉన్న ప్రదేశంలో శతాబ్దాల క్రితం పెద్ద సరస్సు వుండేదట. ఇలాంటి ప్రదేశంలో వుండటం వల్లే కాట్మండూ నగరం భూకంపం తీవ్రతకు భారీగా గురైంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రతి 75 సంవత్సరాలకు ఓసారి భారీ భూకంపం రావడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్, యురేసియా టెక్టానిక్ ప్లేట్లు (భూ ఫలకాలు) రెండూ పరస్పరం ఢీకొన్నాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు అలా ఢీకొనడం, భూకంపాలు సంభవించడం జరుగుతూనే వుంది.

నిండు గర్భిణి గిన్నిస్ రికార్డ్

  నిండు గర్భిణి 5కె రన్ లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించింది. కరీంనగర్ కు చెందిన కామారపు లక్ష్మీ అనే ఆమె మిషన్ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో ఇంతటి సాహసానికి పూనుకుంది. రేపో మాపో డెలివరీ కూడా అవుతుంది, అయినా లెక్కచేయకుండా స్ఠానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 5కె రన్ లో పాల్గొంది. ఉదయం 6 గంటలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి టీవీఎల్ సత్యవాణి 5కె రన్ ను ప్రారంభించారు. లక్ష్మీ 5 కిలోమీటర్ల దూరం ఆగకుండా పరిగెట్టి కేవలం 30 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ ఎం విజయభాస్కర్ రావు, ఉత్తర తెలంగాణ ప్రతినిధి యెడల్ల రమేశ్ ఈ రికార్డును నమోదు చేశారు.

భూకంప మృతులు 3218

  నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరిగిపోతోంది. సోమవారం ఉదయానికి భూకంప మృతుల సంఖ్య 3218గా అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా నేపాల్‌లో అనేకసార్లు భూమి కంపించింది. భూమి కంపించినప్పుడల్లా జనం ఆందోళనలతో తల్లడిల్లుతున్నారు. రాజధాని ఖాట్మండూతో సహా అనేక ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా వున్న శిథిలాలను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి. మృతదేహాలు పేరుకుపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం వుండటంతో సామూహికంగా దహనం చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వారు ఎవరైనా గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. జీవించి వున్నవారే మరణించిన వారికి ఆత్మబంధువులై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతూ వుండగానే భారీగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత చేయిజారిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదే వుంటున్నారు. రాత్రివేళ చలితో బాదపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరందరికీ పునరావాసం కల్పించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నివేదికలు సిద్దం

  విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించనున్న మెట్రో స్పెషలిస్ట్ శ్రీధరన్ రెండు ప్రాజెక్టుల నివేదికలను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. వీటిలో విజయవాడ ప్రాజెక్టు నిర్మాణానికి కి.మీ.కి 209కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ ప్రకారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 6,823 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసారు. విజయవాడలో రెండు మెట్రో కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో ఒకటి విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిమీ కారిడార్, రెండవది బస్టాండ్ నుంచి నిడమానూరు వరకు 13.27 కిమీ కారిడార్ నిర్మించేందుకు పూర్తి నివేదికను సిద్దం చేసారు. తాజా సమాచారం ప్రకారం విశాఖలో మూడు మెట్రో కారిడార్లు నిర్మించబోతున్నారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదిక వివరాలను కూడా ప్రకటిస్తారు.

నేపాల్ భూకంపం ధాటికి 2000కి పైగా మృతి

  నేపాల్ లో నిన్న సంభవించిన పెను భూకంపం ధాటికి సుమారు2000కి పైగా ప్రజలు మృతి చెందినట్లు అధికారిక సమాచారం. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేలమంది క్షతగాత్రులయారు. అయినప్పటికీ వందల సంఖ్యలో పేకమేడల్లా కుప్పకూలిపోయిన భవనాల క్రింద ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. క్షతగాత్రులతో అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అనేకమంది వైద్యం కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. వివిధ దేశాల నుండి అనేక సహాయ, వైద్య బృందాలు తరలివచ్చి సహాయ పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్న మరొకమారు భూకంపం సంభవించింది. నిన్న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9 నమోదు కాగా, ఈరోజు కొన్ని సెకండ్లపాటు మాత్రమే సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. కానీ ఈరోజు భూకంపం వలన మళ్ళీ అనేక భవనాలు కుప్పకూలాయి. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంత భారీ భూకంపం సంభవించడంతో నేపాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలతో రోడ్ల మీదే కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు నేపాల్ తో బాటు డిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకపంనలు వచ్చాయి. కానీ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

టాలీవుడ్ హీరోయిన్ అరెస్టు

  ఎర్రచందని కేసులో సినీనటి నీతూ అగర్వాల్‌‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నీతూ అగర్వాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈమెను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కేసులో ఇప్పటికే అరెస్టయిన మస్తాన్‌వలీలో ఈమె సహజీవనం చేస్తోంది. మస్తాన్ వలీ నిర్మించిన ‘ప్రేమ ప్రయాణం’ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. మస్తాన్ వలీ కర్నూలు జిల్లా చాగలమర్రు ఎంపీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి సహకరించడంతోపాటు ఆర్థిక లావాదేవీల్లో కూడా ఆమె పాత్ర వున్నట్టు తెలుస్తోంది. మస్తాన్ వలీ ఆమెను మూడో వివాహం చేసుకున్నాడని కూడా వినిపిస్తోంది. మస్తాన్ వలీని అరెస్టు చేసిన తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి నీతూ అగర్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నేపాల్ భూకంపం మృతులు 1500

  నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా, 1500 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం ఉదయం వరకు 1500 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని భయపడుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.8గా నమోదైందని అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ భారీగా దెబ్బతింది. ఈ నగరంలోని వీధులన్నీ హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు విద్యుత్, సమాచార, రవాణ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడంతో నేపాల్‌లో ఎమర్జెన్సీని విధించారు.

నేపాల్ భూకంప మృతులు 700

  నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా, 700 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం వరకు 700 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని భయపడుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.9గా నమోదైందని అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ భారీగా దెబ్బతింది. ఈ నగరంలోని వీధులన్నీ హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు విద్యుత్, సమాచార, రవాణ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడంతో నేపాల్‌లో ఎమర్జెన్సీని విధించారు.

భూకంపం.. భారత్‌లో 10 మంది మృతి

  నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది కూడా. నేపాల్‌లో భూకంపం కారణంగా వందలాది మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. భూకంపం కారణంగా ఇండియాలో కూడా మరణాలు సంభవించాయి. బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. బీహార్లోని భగల్పూర్ గ్రామంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. భూప్రకంపనల ధాటికి బీహార్‌లో అనేక ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం వల్ల ఐదుగురు మరణించినట్టు సమాచారం.

హీరోలైన కార్మికులు

  సింగపూర్ లో మన భారతీయ యువకులు ఇద్దరు హీరోలయ్యారు. ఎలాగంటారా... వివరాలు.. షణ్ముగన్ నాథన్, ముత్తుకుమార్ అనే యువకులు సింగపూర్ లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే వారు విధులు నిర్వహిస్తుండగా వారికి ఒక పసిపాప ఏడుపు గట్టిగా వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడినుండి వస్తోందని చూడగా ఒక పసిపాప వారు పనిచేస్తున్న పక్క అపార్ట్ మెంట్ రెండవ అంతస్తు బాల్కనీ గ్రిల్ మధ్య తల చిక్కుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడకు చేరుకొని రెండవ అంతస్తులోకి ఎక్కి పాపను రక్షించారు. సమాచారాన్ని అందుకున్న ఎస్పీడీఎఫ్ అక్కడకు చేరుకునే లోపులోనే వారు ఆపాపను ప్రాణాలతో కాపాడి కిందకు దించారు. దీంతో ఆ ఇద్దురు యువకులు ప్రదర్శించిన సాహసానికి, సమయస్పూర్తికి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రశంసలతో పాటు, పబ్లిక్ స్పిరిటెడ్నెస్ అవార్డుకి ఎంపిక చేశారు.

నిజాం నవాబు మళ్లీ పుట్టాడు

  తెదేపా సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను నిజాం నవాబుతో పోల్చి ఎద్దేవా చేశారు. నిజాం నవాబును ఎవరు మెచ్చుకోరని, అలాంటి నిజాం నవాబును కేసీఆర్ మెచ్చుకోవడం, గొప్పవాడిగా కీర్తించడం నిజాం ప్రతిరూపానికి కేసీఆర్ నిదర్శనం అని విమర్శించారు. అతి క్రూరంగా పాలించి, ప్రజలకు నరకం చూపించిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడని అన్నారు. నిజాం నవాబు ఎలాగైతే దళితులను, ఇతర వర్గాలను అణచివేశారో కేసీఆర్ కూడా అదే తరహాలో దళితులను అణచివేస్తున్నారని విమర్శించారు.

నేపాల్‌లో భారీ భూకంపం

  నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం నాడు సంభవించిన భూప్రకంపనలతో నేపాల్లో భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. నేపాల్ రాజధాని ఖట్మాండుతో సహా ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వుంది. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. ఖాట్మాండు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. అందుకే భూకంపం సంభవించిన చాలాసేపటికి గానీ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియలేదు. భూకంపం కారణంగా ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఢిల్లీలో, ఏపీలో భూకంపం

  ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. నేపాల్‌లోని భరత్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో భూమిలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్టు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 11.44 సమయంలో ఒక నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్టు సమాచారం. ఢిల్లీతోపాటు ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో, కోల్‌కతా. జైపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రకంపనల కారణంగా ఇళ్ళలోని వస్తువులు కింద పడిపోవడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ళలోంచి బయటకి పరుగులు తీశారు. ఏపీలో భూ ప్రకంపలన ప్రాంతాలు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా శనివారం ఉదయం 11.44 సమయంలోనే భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లా గొల్లపూడి, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, ఉర్లాం పరిసరాల్లో భూ ప్రకంపనలు జరిగాయి.

ఏపీ సరిహద్దుల్లో రవాణా పన్ను

  తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనాలకు రవాణా పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన సరిహద్దుల వద్ద రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి ఏపీ అధికారులు నుంచి రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించిన మొదటిరోజే భారీ స్థాయిలో పన్ను వసూలైందని తెలుస్తోంది. కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి కోటి 30 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. తిరువూరు చెక్‌పోస్ట్ దగ్గర 80 వేల రూపాయల పన్ను వసూలైంది.

మానవహక్కుల నేత కాల్చివేత

  పాకిస్తాన్, కరాచీలో మానవ హక్కుల నేత సబీన్ మహమ్మద్ పై తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బలూచిస్తాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ప్రసంగించిన ఆమె హోటల్ నుండి బయటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు ఆమె కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో సబీన్ మహమ్మద్ తో పాటు ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే సబీన్ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు అధికారి తారిఖ్ ధరేజో తెలిపారు. కాగా సబీన్ మహమ్మద్ గత కొంత కాలంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తిరుగుబాటుదారులతో, పోలీసుదళాలకు మధ్య నడుస్తున్న పోరులో అమాయకులను కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్నారు.

పర్వతారోహకుడు మస్తాన్ బాబు అంత్యక్రియలు

  పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డు సాధించి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు మల్లి మస్తాన్ బాబు. అతనికి తన స్వస్థలం నెల్లూరు జిల్లా గాంధీజనసంగంలో అతని పొలంలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్ బాబు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మస్తాన్ బాబు అంత్యక్రియలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్ జానకి పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు మళ్లీ పుడతాడని అన్నారు. పర్వాతరోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించాడని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని దాటిందన్నారు. మస్తాన్ బాబు మృతదేహం ఇక్కడికి రావడానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చొరవే కారణమని తెలిపారు. వారే అర్జెంటీనాతో దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.