శిశుమరణాల రేటు తగ్గించాలి... చంద్రబాబు

  గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ టీకాల వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ వాక్సిన్ కోరింతదగ్గు, ధనుర్వాతం, హైపటైటిస్-బి వంటి వ్యాధుల నుండి కాపాడుతుందని అన్నారు. శిశుమరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గర్భిణీలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, పెళ్లి వయసు విభాగాల్లో వెనుకబడి ఉన్నామని అన్నారు.

'తానా' 20వ కాన్ఫరెన్స్ వేడుకలు

  'తానా' సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) తమ 20వ కాన్ఫరెన్స్ వేడుకలు జరుపుకోబోతుంది. దీనికి గాను పలు రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గేమ్స్, కల్చరల్ యాక్టివీటీస్ లాంటి ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని 'తానా' సంఘం అధ్యక్షుడు మోహన్ నన్నపనేని  తెలిపారు. ఇది కాంపీటీషన్ కాదని, తెలుగువారికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే కార్యక్రమంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకొనే వారి కావలసిన అర్హతలు 1. కార్యక్రమంలో పాల్గొనేవారి పేరు 2. వయసు (10-25) 3. తల్లిదండ్రుల పేర్లు 4. తల్లిదండ్రుల వివరాలు (ఇ-మెయిల్, ఫోన్ నెం) 5. యూట్యూబ్ వీడియో లింక్ 6. ప్రదర్శించే ఆర్ట్  

రామోజీరావును పొగిడిన ప్రధాని

  'ఈనాడు' 'ఈటీవీ' సహా రామోజీ గ్రూపు సంస్థలన్నీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రామోజీరావుకు ఓ లేఖ రాసారు. తాను ఇచ్చిన 'స్వచ్ఛభారత్' అభియాన్ పిలుపునందుకొని, స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ప్రజలలో శుభ్రత గురించి విస్తృత స్థాయిలో స్ఫూర్తి తెచ్చేందుకు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పరిశుభ్రమైన భారత్ ను సాధించాలంటే ఒక్క వ్యక్తి వల్ల అయ్యే పని కాదని, అందరు కలిసి చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకు రామోజీరావు గ్రూపు సంస్థల సభ్యులందరూ, రామోజీరావు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇలాగే తమ ప్రోత్సాహాన్ని కొనసాగించాలని ప్రధాని కోరారు.

డిల్లీలో చలసాని ప్రత్యేక పోరాటం, అరెస్ట్

  టాలివుడ్ నటుడు శివాజీ గుంటూరులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ వేడి ఇంకా తగ్గక మునుపే ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏపీ విద్యార్థుల జేఏసీ, జన జాగృతి సంస్థ ప్రతినిధులు కలిసి డిల్లీ వెళ్లి ఏపీ భవన్ లో బస చేసి ఉన్న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ లను కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఆ సందర్భంగా వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నామని మంత్రులిరువురూ స్పష్టం చేసినప్పటికీ విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు. అనంతరం వారు పార్లమెంటు వైపు బయలుదేరగా వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.   దేశంలో ఏదయినా ఒక రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి తప్పనిసరిగా ఆమోదం తెలుపవలసి ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, ఓడిశాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోతాయని అందువల్ల ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వరాదని కేంద్రానికి లేఖలు వ్రాసాయి.   దేశంలోని 8 రాష్ట్రాలు అనేక ఏళ్ళుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి. ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఆ తేనె తుట్టెను మళ్ళీ కదిపినట్లే అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొంతున్నప్పటికీ జంకుతోంది. ఈ విషయాలన్నీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఆ తరువాత ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చినందున ఇప్పుడు దాని కోసం పట్టుబడుతున్నాయి.

జగన్ బాటలో రాహుల్ ఓదార్పు యాత్ర

  జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేసారు. తన తండ్రి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని తనకు, తన పార్టీకి బదలాయించుకొనేందుకే ఆయన ఓదార్పు యాత్రలు చేసారనే సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ తెలంగాణాలో ప్రవేశించి తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు.   రెండు నెలల పాటు విదేశాలలో సేద తీరిన రాహుల్ గాంధీ చాలా హుషారుగా పాదయాత్రలు చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఓడిపోయింది. కానీ ఆంధ్రా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే దాని పరిస్థితి మెరుగుగానే ఉంది. కనుక ముందుగా దానిని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులను పరామర్శించడానికి ఈనెల 11న హైదరాబాదులో దిగుతున్నారు. ఆ మరునాడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వడ్యాల నుండి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ఆత్మహత్యలు చేసుకొన్నా రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రాచాపూర్, పొట్లపల్లి, లక్ష్మణ చాందా గ్రామాల మీదుగా ఆయన పాదయాత్ర చేసి సాయంత్రం 4 గంటలకు కొరటికల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ తంతు ముగియగానే మళ్ళీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రికి డిల్లీ వెళ్ళిపోతారు.   అయితే రాహుల్ గాంధీ మొక్కుబడిగా చేసే ఈ ఓదార్పుయాత్రతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుందనే భ్రమలు ఎవరికీ లేవు. కనుక ఆయన ఇలా ఎండల్లో పడి తనకు ఏమాత్రం అచ్చిరాని పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడం కంటే ముందుగా తన కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకొని, దానిపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దాసరికి సీబీఐ కోర్టు సమన్లు జారీ

  ప్రముఖ దర్శకుడు మరియు మాజీ బొగ్గు శాఖా మంత్రి అయిన దాసరి నారాయణ రావుకి బొగ్గు కుంభకోణం కేసులో విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టు బుదవారం నోటీసులు జారీ చేసింది. దాసరి నారాయణ రావుతో బాటు మరో 14మందికి, 5 కంపెనీలకి కూడా ఈరోజు నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు నోటీసులు జారీ అయిన వారిలో మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్.సి. గుప్తా, మాజీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఉన్నారు. వారు కాక ఇంకా గ్యాన్ స్వరూప్ ఘార్గ్, సురేష్ సింఘాల్, రాజీవి జైన్, గిరీష్ కుమార్ సునేజ, ఆర్కే సరఫ్ మరియు కె. రామకృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. వీరితో బాటు జే.యస్.పి.యల్., జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, గగన్ ఇన్ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, న్యూ డిల్లీ ఎగ్సిం లిమిటెడ్ మరియు సౌభాగ్య మీడియా లిమిటెడ్ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేయబడ్డాయి. వీరందరూ అమర్ కొండ ముర్గాదంగల్ బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతిలో నిందితులని సీబీఐ పేర్కొంది. వారిపై ఐ.పి.సి.సెక్షన్స్: 420,409 మరియు 120-బి క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. వారినందరినీ ఈనెల 22వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కావలసిందిగా జడ్జి భరత్ పరాశర్ ఆదేశించారు.

వారి ఆందోళనను సమర్ధిస్తున్నా... చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం నర్సిపురంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లుడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీమాంధ్రులు చేపట్టే ఆందోళనలు సరైనవేనని, వారు చేపడుతున్న నిరసనలను సమర్ధిస్తున్నానని తెలిపారు. కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు సహకరిస్తుందని, ఇప్పటికే కొన్ని విషయాలలో చొరవ తీసుకుందని అన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి వెనుకడుగు వేయలేదని... అలాగని ఇస్తుందో లేదో కూడా తెలియదని వెల్లడించారు. తాము మాత్రం ఎట్టి పరిస్థితిల్లో వెనక్కి తగ్గేది లేదని, ప్రత్యేక హోదా కోసం ప్రయాత్నాలు ఆపమని సుజనా అన్నారు.

చంద్రబాబు ను కలిసిన కడియం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ లు కలిశారు. ఈ సందర్భంగా వారు వరంగల్ జిల్లాలో ఉన్న రేయాన్న్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను చర్చించారు. గతేడాది నుండి ఫ్యాక్టరి మూసిఉన్నందున అనేక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అందువల్ల దానిని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. అయితే సమస్య ఏంటంటే ఫ్యాక్టరీకీ కావలసిన ముడిసరుకు తెలంగాణ నుండి 25 శాతం మాత్రమే అందుతుంది. మిగిలిన ముడిసరుకును తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకోవడానికి అక్కడ ఎగుమతి నిషేదం ఉన్నందున పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి దిగుమతి చేసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీకి కావలసిన ముడిసరుకును ఆంధ్రరాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశంజిల్లానుండి 50 శాతం రాయితీతో సరఫరా చేయాలని చంద్రబాబును కోరారు. అయితే ఇది ఆర్ధిక సమస్యలతో ముడిపడిఉందని, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. 

లోకేశ్ ఎఫర్ట్ ... స్మార్ట్ సిటీకి ఎన్నారైల సపోర్ట్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం యువనేత పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నారై తెలుగుదేశం లోకేశ్ కు ఘన స్వాగతం పలికింది. ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఏ హోదాలో లేని లోకేశ్ ఒక భాధ్యతాయుతమైన ఆలోచనతో తన వంతుగా ఆంధ్రరాష్ట అభివృద్ధికి కావలసిన సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఎలాగైనా ఆంధ్రరాష్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో  అమెరికాలోని అనేక పారిశ్రామిక వేత్తలతో, పెట్టుబడిదారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అనేక ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి విశాకపట్నం అనువైనదిగా ఉంటుందని విశాఖను స్మార్ట్ సిటీగా మార్చాలని లోకేశ్ అన్నారు.   ఇందులో భాగంగానే ఆయన మంగళవారం ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలైన ఇమాజినేషన్ సంస్థ అధినేత యార్లగడ్డ కృష్ణగారిని, అంతేకాక వాణిజ్యవిభాగానికి చెందిన అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్, డైనమిక్ గ్లాస్ తయారీ సంస్థ సీఈఓ మురళీ రావు వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఈ సందర్భంగా వారు విశాఖపట్నంలో కూడా తమ సంస్థలను స్థాపించడానికి, అభివృద్ది చేయడానికి సహకరిస్తామని తెలిపారు. అంతేకాక లోకేశ్ కామర్స్ అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్ ను ఆంధ్రరాష్ట్రాన్ని ఒక తయారీకేంద్రం మార్చడానికి సహకరించాలని కోరామని, ఆంధ్రరాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, పెట్టుబడులు అనువైన స్థలమని చెప్పామని చెప్పారు. యూఎస్ పెట్టుబడుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను స్మార్ట్ సిటీ గా మలిచే విధానంపై చర్చించామన్నారు.   దీంతో లోకేశ్ 15 గంటలలో ఆరు సమావేశాలు, పలు రకాల పారిశ్రామికవేత్తలతో చర్చలు, జరిపినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దీంతో లోకేశ్ అమెరికా నుండి పెట్టుబడుదారులను తీసుకొస్తాడనే నమ్మకం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న లోకేశ్ తెలుగుదేశం గర్వపడేలా చేస్తాడనే అందరూ ఆశిస్తున్నారు.

సల్మాన్ తీర్పుతో వారి ఆత్మకు శాంతి

  శాంతి హిట్ రన్ అండ్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ పై నేరం రుజువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ తీర్పుపై సోషల్ మీడియాలో సెలబ్రిటీల దగ్గరనుంచి, అభిమానులు, సామాన్యులు తమ కమెంట్స్ పోస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి దయాహృదయుడికి, తన ఛారిటీ ద్వారా ఎంతోమంది పేద విద్యార్ధులకు సహాయం చేసే ఆయనకు శిక్ష పడటం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. అతని నిర్లక్ష్యానికి అభాగ్యులు బలయ్యారని అన్నారు. ఈ తీర్పుతో వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు బాలీవుడ్ నటి హేమమాలిని సల్మాన్ కు తక్కువ శిక్ష పడాలని ప్రార్ధిస్తున్నానంటూ తన సానుభూతిని ప్రకటించారు.

షూస్ పోయాయని కేసు పెట్టాడు

  మనం కేసులు ఎప్పుడు పెడతాం? సాధారణంగా మన వస్తువులు ఏమైనా పోయినప్పుడో, దొంగలు పడినప్పుడో పలు రకాల సందర్భాలలో పెడతాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన చెప్పులు పోయాయని కేసు పెట్టాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఈ విచిత్రమైన ఘటన ఢిల్లీలో జరిగింది. కాన్పూర్ కి చెందిన అన్షల్ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలోని ప్రముఖ ఆలయమైన కల్కాజీ దేవాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయం బయట తన షూ ను కౌంటర్ లో విడిచి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్లాడు. దర్శనం తరువాత తిరిగి వచ్చి చూసేసరికి తన షూ కనిపించలేదు. అంతే అతనికి ఒక్కసారిగా కోపం వచ్చి అసహనానికి గురయ్యి అక్కడ వున్నవారిపై చిర్రుబుర్రులాడాడు. తనవి ఎంతో బ్రాండ్ షూ అని, కొత్తగా కొన్నానని ఆవేదనకు గురై ఆలయ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు.

నేరం చేసింది సల్మాన్ ఖానే

  మధ్యం మత్తులో కారు నడిపిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎప్పటినుంచో విచారణలో ఉన్న ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. కానీ ఈ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ పై ఉన్న ఆరోపణలు నిజమే అని, ఆరోజు మద్యం తాగి కారు నడిపింది సల్మాన్ ఖాన్ అని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో సల్మాన్ పై ఉన్న నేరం రుజువు కావడంతో ఆయనకు జైలు శిక్ష పడనుంది. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్ పాండే సల్మాన్ శిక్ష కాలాన్ని ప్రకటించనున్నారు. ఈ తీర్పుతో ఒక్కసారిగా సల్మాన్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు నిరాశకు గురయ్యారు. మరోవైపు ఈ తీర్పుతో బాలీవుడ్ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ హీరోగా రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉండటంతో వాటి పరిస్థితి ఏంటా అని భయపడుతున్నారు. అయితే ఈ కేసుపై సల్మాన్ హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

ఏపీ రవాణా మంత్రికి చంద్రబాబు ఫోన్

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు తమ వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. దీంతో రెండు రాష్ట్రాలలో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఏపీ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో ఫోన్ లో మాట్లాడారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని శిద్దా తెలిపారు. అవసరమైతే రైల్వేశాఖతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

తితిదే సభ్యుడిగా రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారం

  తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం) ధర్మకర్తల మండలి సభ్యుడిగా దర్మక దిగ్గజం కె. రాఘవేంద్రరావు ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తితిదే ఈవో డి. సాంబశివరావు శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి ఎదుట రాఘవేంద్రరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకొన్నారు. శ్రీవారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటం, ఆధ్యాత్మిక గ్రంధాలను అందజేసి రాఘవేంద్రరావును సత్కరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

మళ్ళీ మరో పిటిషను పడింది

  తెలంగాణా ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో అనేక మార్లు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇంతకు మునుపు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు కూడా అడపా దడపా కోర్టు మెట్లు ఎక్కిన సందర్భాలున్నాయి. కానీ తెరాస ప్రభుత్వంలాగ నెలకీ వారానికీ ఓ మారు కోర్టు మెట్లు ఎక్కిన దాఖలాలు మాత్రం లేవు. ఎర్రగడ్డకి సచివాలయ తరలింపు, అక్కడ ఉన్న పురాతన భవనం కూల్చివేత, ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్ను, తరువాత హైకోర్టు విభజన, ఆ తరువాత పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం...ఇలా ఒకదాని తరువాత మరొక కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పాత కేసులు పరిష్కారం కాక మునుపే మళ్ళీ మరొక కొత్త కేసు దాఖలవుతుండటంతో తెలంగాణా ప్రభుత్వం నిత్యం కోర్టు మెట్లు ఎక్కక తప్పడం లేదు.   తాజాగా మరొక కేసు దాఖలయింది. ఈసారి ఇందిరా పార్క్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసారు. పిల్లలూ, సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకొనే యన్టీఆర్ స్టేడియంలో కళాభారతి పేరుతో సిమెంట్ కట్టడాలు నిర్మించాలనే జి.హెచ్.యం.సి. నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుధాకర్ హైకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం వేశారు. నగరంలో కళా ప్రదర్శనలకు రవీంద్ర భారతి, శిల్పారామం వంటివి ఉండగా వాటిని కాదని పిల్లాలు ఆడుకొనే పార్కులో సిమెంట్ కట్టడాలు కట్టాలనే నిర్ణయాన్ని ఆయన తీవ్రం వ్యతిరేకిస్తున్నారు. పైగా జి.హెచ్.యం.సి. ప్రత్యేక పాలనాధికారి క్రింద నడుస్తున్న ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా సుధాకర్ తన పిటిషనులో తప్పు పట్టారు. కోర్టు ఆయన వేసిన పిటిషనును విచారణకి స్వీకరించింది. కనుక త్వరలోనే దీని కోసం ప్రభుత్వం మరోమారు కోర్టు మెట్లు ఎక్కక తప్పేలా లేదు.

నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకి బ్రేక్

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ యాజమాన్యంతో ఆయా రాష్ట్ర రవాణాశాఖ మంత్రులతో వేతన సవరణపై జరిపిన చర్చలు విఫలం కావడంతో నేటి నుండి రెండు రాష్ట్రాలలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. నిన్న ఆర్ధరాత్రి నుండే అనేక దూరప్రాంత బస్సులు డిపోలలో నిలిపివేయగా, సిటీ సర్వీసు బస్సులను ఈరోజు ఉదయం 6 గంటల నుండి నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అంత వేతన సవరణ చేయలేమని చెపుతుంటే, తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ నష్టాలలో ఉన్నందున ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గలేదు. సమ్మెను విరమించుకొమ్మని ఇరు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తులను ఉద్యోగులు తిరస్కరించి ఈరోజు నుండి సమ్మెకు దిగుతున్నారు. కనుక రెండు రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆర్టీసీ యండి సాంభశివరావు అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాలలో డిపోలవారిగా తాత్కాలికంగా డ్రైవర్లు, కండెక్టర్ల నియామకాలు జరుగుతున్నాయి. కానీ లక్షలాది ఉద్యోగులు కలిసి నిర్వహించే ఆర్టీసీణి కొన్ని వందలమంది తాత్కాలిక ఉద్యోగులతో నడిపించడం ప్రజల ఊరట కోసం మాత్రమేనని భావించాల్సి ఉంటుంది.

కర్నూలులో తెదేపా కార్యకర్త హత్య

  గత రెండుమూడేళ్ళుగా కొంచెం ప్రశాంతంగా కనిపించిన రాయలసీమలో మళ్ళీ ఫాక్షన్ హత్యలు మొదలయినట్లున్నాయి. వారం రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వై.యస్సార్.కాంగ్రెస్ నేత బి. ప్రసాద రెడ్డి హత్యతో రాష్ట్రం ఉలిక్కిపడింది. రాష్ట్రంలో నానాటికి పెరిగుతున్న రాజకీయ హత్యల గురించి ఆ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ కి పిర్యాదు కూడా చేసారు. దానిపై అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.   ఆ రెండు పార్టీల మధ్య ఈ హత్యల గురించి మాటల యుద్ధం నడుస్తుండగానే మళ్ళీ నిన్న కర్నూల్ జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామంలో టిడిపికి చెందిన ఈరన్న, అతని కుమారుడు మరో నలుగురు తెదేపా కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడులలో ఈరన్న అక్కడికక్కడే మరణించగా అతని కుమారుడితో సహా మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. వైకాపాకు చెందినవారే ఈ దాడికి పాల్పపడినట్లు భాదితులు చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మళ్ళీతలెత్తుతున్నఈఫాక్షన్ గొడవలను, హత్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయకపోతే దాని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.