హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుంది...

  ఏపీ, తెలంగాణ హైకోర్టు తనకు సంబంధించిన వివాదం మీద తానే కీలకమైన తీర్పును వెల్లడించింది. హైకోర్టును విభజించాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పడే వరకు హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని హైకోర్టు పేర్కొంది. విభజన చట్టం ప్రకారం ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏపీ రైతులు హ్యాపీ

  ఆంధ్రప్రదేశ్ రైతులకు హైకోర్టు ఊరట కలిగించింది. ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని కోసం తీసుకుంటున్న భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రైతులు వ్యవసాయం చేసుకొనే భూముల జోలికి ప్రభుత్వం వెళ్ళొద్దంటూ, రైతులు వారి పొలాలలో వ్యవసాయం చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు కొంత ఊరట లభించింది. తమ భూములను నూతన రాజధాని కట్టడానికి ఇవ్వడం ఇష్టం లేదని సుమారు 300 మంది రైతులను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది రైతులు తమ వద్ద బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అంగీకార పత్రాలు ఇచ్చినవారు కూడా తమ భూములలో వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పేసింది.

టీఆర్ఎస్ కు హైకోర్టు ఝలక్

  ఉమ్మడి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. టీఆర్ఎస్ సర్కారు పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని, వెంటనే సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. దీంతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు.

కేసీఆర్ మేడే కానుక

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమను పరిశ్రమలు దోపిడీ చేయకూడదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు రవాణా పన్ను లేకుండా చేశాం, గతంలో ఉన్న రవాణా పన్నుబాకాయిలను కూడా మాఫీ చేశామన్నారు. బీడీ కార్మికులుకు ప్రత్యేక బృతి కల్పించిన ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. తెలంగాణలో హోంగార్డులకు డ్రైవర్లకు, జర్నలిస్టులకు రూ 5. లక్షల ఉచిత ప్రత్యేక ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అలాగే తెలంగాణలో ఇక నుండి విద్యుత్ కోతలు ఉండవని అన్నారు. వేలాది పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయని, యువతలో స్కిల్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

చెప్పినట్టే చేశాం... చంద్రబాబు

  తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ లో టూరిజం పార్క్ కు శంకుస్థాపన చేశారు. టూరిజం వల్లే జిల్లా అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశానికి అన్నం పెట్టిన జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని అన్నారు. కాకినాడపై టీడీపీకి ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని, కాకినాడలో పోర్టుల అభివృద్ధి జరగాల్సి ఉందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం... చెప్పినట్టు చేసి చూపించాం అన్నారు. అనంతరం రాజమండ్రిలో నిర్వహించనున్న మేడే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ

  గత ఏడాది నవంబర్ 1వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీగా జీజేపీ సరికొత్త రికార్డును సృష్టించిందని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండగా దానిని తాము అధిగమించామని, బీజేపీలో సభ్యుల సంఖ్య 10.5 కోట్లకు చేరుకున్నందుకు చాలా సంతోషనంగా ఉందని అన్నారు. ఈ క్రెడిట్ అంతా బీజేపీ కార్యకర్తలదే అని, వాళ్ల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 1.82 కోట్ల మంది పార్టీలో చేరారని పేర్కొన్నారు.

పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా

  రాజస్థాన్ లో ఓ పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాడు. పదేళ్ల బాలుడేంటి పోలీస్ కమిషనర్ ఏంటీ అనుకుంటున్నారా... రాజస్థాన్ కి చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది రోజులుగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆబాలుడికి బాగా చదివి పోలీస్ కమిషనర్ కావాలనే కోరిక. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే సంస్థ అతని కోరికను గుర్తించి ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు చెప్పింది. దీంతో ఆయన గిరిశ్ శర్మకు ఒకరోజు పోలీస్ కమిషనర్ అయ్యే అవకాశం కల్పించి తన కోరికను తీర్చారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిరీశ్ శర్మ తో ప్రత్యేక ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరీశ్ శర్మ మాట్లాడుతూ ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.

ఆంధ్రాలో 4, తెలంగాణాలో 5స్మార్ట్ సిటీలు

  కేంద్రప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో విజయవాడ,గుంటూరు, కర్నూలు, చిత్తూరు నగరాలను, తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్,కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ పట్టణాలను కూడా స్మార్ట్స్ సిటీలగా అభివృద్ధి చేయబోతున్నట్లు నిన్న ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలు మూడు కూడా రాజధాని పరిధిలోనే ఉన్నాయి గనుక అవి సహజంగానే స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందవచ్చును. కనుక మిగిలిన నగరాలతో పోలిస్తే వాటిని స్మార్ట్ సిటీలుగా మార్చడానికి కేంద్రప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మిగిలిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చాలా భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి.   ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలతో కలిపి 100స్మార్ట్ సిటీల అభివృద్ధికి, ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులు, అనేక ఉన్నత విద్యా వైద్య సంస్థల ఏర్పాటు వంటి భారీ వ్యయమయ్యే అనేక కార్యక్రమాలను కూడా తలకెత్తుకొంది. కనుక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా ఎన్ని నిధులు విడుదల చేస్తుందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.   విశాఖ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, అందుకు అమెరికా దేశ సాంకేతిక సహకారం తీసుకొంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకు ప్రకటించారు. అంటే విశాఖనగరంతో బాటు రాష్ట్రంలో మరో నాలుగు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లవుతుంది. అంటే రెండు రాష్ట్రాలలో తలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయబోతున్నారన్నమాట.

భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు

  పెట్రోలియం సంస్థలు నిన్న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెంచేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో తప్పని సరి పరిస్థితులలోనే ధరలు పెంచవలసి వచ్చిందని చెపుతున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.3.96, డీజిల్ పై లీటరుకు రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎంట్రీ టాక్సుల భారం మోస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మరియు సరుకు రవాణా వాహనదారులకు ఇది మోయాలని భారం అవుతుంది. అంతిమంగా ఆ భారం తిరిగి సామాన్య ప్రజలపైనే పడుతుంది. గత ఆరేడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టడంతో గత ఆగస్ట్ నెల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పెట్రోల్ ధర రూ. 17.11, డీజిల్ ధర రూ. 12.96 తగ్గింది. కానీ ఇప్పుడు ఒకేసారి ఏకంగా పెట్రోల్ ధర రూ.4, డీజిల్ ధర రూ.3 పెరిగిపోయింది. ఒకేసారి ఇంత భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు చూసి సామాన్య పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్సులో అత్యాచారయత్నం, హత్య

  పంజాబ్‌లోని మొగా పట్టణంలో కదులుతున్న బస్సులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ళ బాలికను కొంతమంది దుండగులు వేధించి అత్యాచారం జరపడానికి ప్రయత్నించారు. ఆ బాలిక ప్రతిఘటించడంతో ఆమెను బస్సు నుంచి కిందకి తోసేసి చంపేశారు. తన తల్లి, తమ్ముడితో కలసి ఆ బాలిక బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కూడా వున్నారు. బాలికను దుండగులు వేధిస్తూ అత్యాచారానికి ప్రయత్నిస్తూ వుండగా ఆమె తల్లి వాళ్ళను నిలువరించాలని ప్రయత్నించింది. బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ ఆపలేదు. చివరికి ఆ దుండగులు ఆ బాలికను, ఆమె తల్లి, తమ్ముడిని బస్సులోనుంచి కిందకి తోసేయడంతో ఆ బాలిక మరణించింది. తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం జరిగిన బస్సు ఆర్బిట్ అనే కంపెనీకి చెందింది. ఈ బస్సులో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కి చెందినది. దాంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రకాష్ సింగ్ బాదల్ ఈ ఘటన పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ బస్సు తమకు చెందినదే అని, ఈ ఘటనకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’

  ఇప్పటి వరకు ఇందిర జలప్రభ పేరుతో అమల్లో వున్న పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకాన్ని ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’ పేరుతో పిలుస్తారు. ఈ మేరకు గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల ఏపీ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పేరును ఈ పథకానికి పెట్టడం సముచితమని ప్రజలు, రైతులు అంటున్నారు. ఇదిలా వుండగా, ఒంటిమిట్టలోని రామాలయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటిమిట్ట దేవాలయాన్ని అప్పగించడం వల్ల ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం వుంది.

ముంబై మెట్రోలో శ్రుతిహాసన్ ప్రయాణం

  హీరోయిన్ శ్రుతిహాసన్ గురువారం నాడు ముంబై మెట్రో రైల్లో ప్రయాణించింది. ఈ విషయాన్ని శ్రుతి హాసన్ ట్విట్టర్లో తన అభిమానులకు తెలిపింది. తాను గురువారం నాడు మెట్రో రైల్లో ప్రయాణించానని, మెట్రో రైలు ప్రయాణం తనకు ఎంతో నచ్చిందని ఈ సందర్భంగా శ్రుతిహాసన్ ట్విట్ చేసింది. ఈమధ్య అనేకమంది ప్రముఖులు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా మొన్నామధ్య మెట్రో రైల్లో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇవి ఇలా వుంటే, హైదరాబాద్‌లో మెట్రో రైలు సిద్ధమవుతోంది. గురువారం నాడు ఇప్పటి వరకు పూర్తయిన మార్గంలో ట్రైల్ రన్ జరిపారు.

బీజేపీ నుంచి శివాజీ సస్పెన్షన్?

  భారతీయ జనతా పార్టీ నుంచి సినీ నటుడు శివాజీని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. గత ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన శివాజీ, ఆ పార్టీ విజయం కోసం తనవంతు కృషి చేశారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి బీజేపీకి ప్రచారం కూడా చేశారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తాత్సారం చేయడం వల్ల ఆయన కినుక వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉద్యమించారు. దాంతో ఏపీ బీజేపీలోనే ఆయనకు వ్యతిరేకులు పెరిగారు. ఒక బీజేపీ నాయకుడైతే శివాజీ బీజేపీలోనే లేరని ఆమధ్య ప్రకటించారు. శివాజీ మాత్రం తాను బీజేపీలో వున్నానని చెబుతూ వచ్చారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశంలో కొంతమంది ఏపీ బీజేపీ కార్యకర్తలు శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శివాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకత్వం భావించినట్టు, ఈ మేరకు శివాజీకి నోటీసు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

టీటీడీ అధీనంలోకి ఒంటిమిట్ట రామాలయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడపజిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఎప్పుడూ శ్రీరామ నవమి ఉత్సవాలు భద్రాచలంలో జరిగేవి. అయితే రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లింది. అందువల్ల లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి ఉత్సవాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిమిట్ట రామాలయం టీటీడీ ఆధ్వర్యంలోకి వెళ్లడం వల్ల ఇది గొప్ప పుణ్యక్షేత్రం గా తయారవుతుందని ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ ఒంటిమిట్ట ఆలయంలోనే జరిగాయి. ఈ ఆలయం కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో ఉంది.

ఎవరెస్టుపై చిక్కుకుపోయిన తెలుగువారు

  భూకంపం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పర్వతారోహణకు వెళ్లిన 20 మంది ఐదు రోజులుగా ఎవరెస్ట్ పై చిక్కుకుపోయినట్లు సమాచారం. ఆ బృందానికి సారధ్యం వహిస్తున్న శేఖర్ బాబు ఒక మీడియాకు సంస్థకు ఫోన్ చేసి భారత్, చైనా ప్రభుత్వాలు తమకు సహకరించి తమను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ మీడియా వెబ్ సైట్లో వార్త ప్రచురితమవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తెలుసుకున్నతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయాత్నాలు చేపడుతున్నాయి. వారు ఎవరెస్టుపై సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో చైనా వైపు ఉన్నట్టు సమాచారం.

పైత్యం ప్రదర్శించిన పాక్

  పాకిస్తాన్ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వివాదంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మంచి పని చేద్దామనుకొని వివాదంలో పడింది. ఏంటంటే... అసలే భూకంపం వచ్చి నేపాల్ పుట్టెడు దుఃఖంలో ఉంటే పాకిస్తాన్ ఆదేశానికి సాయం పేరిట బాగా మసాలా దట్టించిన మాంసాహారాన్ని పంపి వార్తల్లోకెక్కింది. అది కూడా వారు ఎంతో పవిత్రంగా భావించే గోవుల మాంసం. హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ ప్రజలు గోవులను చాలా పవిత్రంగా భావిస్తారు. గోవధను అక్కడి మత సంఘాలు ఒప్పుకోవు. అలాంటిది నేపాల్ బాధితులకు పాక్ సహాయార్ధం పంపించిన బీఫ్ వల్ల వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నేపాల్ లో వైద్య సేవలు అందించడానికి వెళ్లిన భారతీయ వైద్యులు మాట్లాడుతూ పాక్ పంపించిన ఆహారపదార్ధాలలో బీఫ్ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. అది తెలియక మొదట స్థానికులు తీసుకున్నా తెలిసిన తరువాత పక్కన పడేశారని తెలిపారు. మరోవైపు గిడియన్స్ అనే మిషనరీ వాళ్లు బైబిళ్లు పంపించగా... నేపాల్ ప్రధాని స్పందిస్తూ, మేం బైబిళ్లు తినం... ఈ సమయంలో మాకు కావలసింది తినడానికి తిండి, నీరు కాని బైబిళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.