ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఎండీ సమస్య పరిష్కారానికి చర్చలు నిర్వహించినా అవి కాస్తా విఫలమైన సంగతి తెలిసిందే. మరో పక్క హైకోర్టు కూడా సమ్మె విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించినా అవేమి పట్టించుకోకుండా కోర్టు తీర్పు కాపీ చేతికందేవరకు సమ్మే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఆర్టీసీ ఈ.యూ నేత పద్మాకర్ . మరోవైపు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఒప్పంద సిబ్బందితో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణాలో ఉనికిని చాటుకొనేందుకు వైకాపా తిప్పలు

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా యాత్రలు చేస్తూ రైతన్నలను ఆకట్టుకొని తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణాలో ఆ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో ‘రైతు దీక్ష’ అంటూ నిన్న ఒక్కరోజు నిరాహార దీక్ష చేసారు. అయితే ఉదయం సుమారు 9-10 గంటలకు ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి సాయంత్రం 4గంటలకే ఇద్దరు రైతుల చేతుల మీదుగా నిమ్మరసం పుచ్చుకొని దీక్ష విరమించారు. ఆ మాత్రం దానికి అంత హడావుడి ఎందుకు అంటే తెలంగాణాలో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికేనని వేరే చెప్పనవసరం లేదు. వైకాపాకు రైతుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే అవి సాధించేవరకు ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చినట్లయితే, ప్రభుత్వం కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసం మరింత శ్రద్ధ పెట్టేది. కానీ ఈవిధంగా మొక్కుబడి దీక్షలు చేయడం వలన ముందు వైకాపాయే ప్రజలలో నవ్వులపాలవుతుంది.

నేటి నుండి జగన్ రైతు భరోసాయాత్ర

  ఇంతకు ముందు తన తండ్రి వై.యస్స్. రాజశేఖర్ రెడ్డి మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్రలు చేసి, పనిలోపనిగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయారు. తన పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వంపై అప్పటి నుండి ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా యాత్రల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నుండి నాలుగు రోజుల పాటు చేయబోయే రైతు భరోసా యాత్రలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. పేరుకి అది రైతు భరోసా యాత్రే అయినా దాని కోసం వైకాపా చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రైతులపై సానుభూతి చూపేందుకా లేక రైతుల తరపున వైకాపా పోరాడుతోందని ప్రచారం చేసుకోవడానికా? అనే అనుమానం కలుగక మానదు.

కిరణ్ పై కాంగ్రెస్ నేతల ఎదురు దాడి షురూ

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర విభజన ఏవిధంగా జరిగిందో, తెర వెనుక ఎటువంటి రాజకీయాలలో నడిచాయో, దానిలో కాంగ్రెస్ నేతల పాత్ర గురించి వివరిస్తూ ఒక పుస్తకం వ్రాస్తున్నారు. అది త్వరలో విడుదల కాబోతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు ప్రజలతో ఆడిన డబుల్ గేమ్ గురించి అందులో ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నారు.   రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా, తెలంగాణా రాష్ట్రంలోను ఎన్నికలలో ఓడిపోయినా తరువాత నేటి వరకు కోలుకోలేకపోతోంది. మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లుగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్రాస్తున్న అ పుస్తకం వచ్చి పడుతోంది. సహజంగానే అది ఆ పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కనుక, ఊహించినట్లే అప్పుడే కాంగ్రెస్ నేతలు ఆయనపై ఎదురు దాడి ప్రారంబించేసారు.   అందరి కంటే ముందుగా సోనియా గాంధీకి వీర విధేయుడినని గర్వంగా చెప్పుకొనే సీనియర్ కాంగ్రెస్ నేత మరియు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు స్పందిస్తూ “కాంగ్రెస్ అధిష్టానం ఆయనను నమ్మి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రెండు రాష్ట్రాలలో కూడా పార్టీని, ప్రభుత్వాన్ని ముంచేసాడని తీవ్రంగా విమర్శించారు. ఆయన తన ముఖ్యమంత్రి పదవిని తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకొన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞత చూపకపోగా తిరిగి సోనియా గాంధీని అప్రతిష్టపాలు చేయడానికే ఆయన పనిగట్టుకొని పుస్తకం వ్రాయడం చాలా దారుణమని హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేసారు.

జయలలితకి జైలా...బెయిలా...తేలేది నేడే

  అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధింపబడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, గతేడాది సెప్టెంబర్ నెలలో వారం రోజులపాటు జైలులో గడపవలసి వచ్చింది. కానీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిలుపై మళ్ళీ బయటకు రాగలిగారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేస్తూ ఆమె కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టును మూడు నెలలలోగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించవలసిందిగా ఆదేశించింది. కానీ జడ్జీల బదిలీ తదితర కారణాల వలన ఆ కేసు విచారణ ఆలస్యమయింది. ఆమె కేసుపై కర్ణాటక హైకోర్టు ఈరోజు తుది తీర్పు చెప్పబోతోంది.   ఒకవేళ హైకోర్టు కూడా ఆమెకు ప్రత్యేక కోర్టు వేసిన శిక్షనే ఖరారు చేసినట్లయితే ఆమె మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. అదే జరిగితే మళ్ళీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించడం కూడా ఖాయం. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకు బెయిలు మంజూరు చేసేవరకు జైలు జీవితం తప్పకపోవచ్చును. అయితే ఆమె ఈరోజు కర్నాటక హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు కనుక ఆమె చెన్నైలో తన విలాసవంతమయిన పోయస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారు. తమిళనాడులో ఆమె పార్టీ- ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ప్రభుత్వం ఆమెను జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలకి జగన్ బహిరంగ లేఖ

  రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తుండటం సర్వ సాధారణ విషయమే. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమ్మెలను తీవ్రంగా పరిగణించే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వారికి మద్దతు పలుకుతుంటాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరుగుతోంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాస ప్రభుత్వాలు ఈ సమ్మెను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆవస్తలు పడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు వారి సమ్మెకు మద్దతు పలుకుతున్నాయి.ఒకవైపు వారికి సమ్మెకు మద్దతు తెలపడం ద్వారా వారి సమ్మెను మరింత ఉదృతంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని నిందిస్తుంటారు. అలాగని ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలకి వారిపై నిజంగా ప్రేమ ఏమయినా ఉందా? వారి పట్ల నిజంగానే సానుభూతి కలిగి ఉన్నాయా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. వారి సమస్యలని పరిష్కరింపబడాలనే తపన కంటే తమ రాజకీయ శత్రువయిన అధికార పార్టీలని ఈవిధంగా ఇబ్బంది పెట్టాలనే తాపత్రయమే ఎక్కువ. ఉద్యోగులు సమ్మెకు మద్దతు పలికితే వారు తమ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చనే చిన్న ఆశతోనే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉద్యోగులు చేసే ఏ సమ్మెలకయినా మద్దతు పలుకుతుంటాయనేది బహిరంగ రహస్యమే.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రెండు రాష్ట్రాలలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు తెలుపమని తన పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడమే కాకుండా వారి న్యాయబద్దమయిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సూచిస్తూ రెండు ప్రభుత్వాలకి ఒక బహిరంగ లేఖ కూడా వ్రాసారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకి ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం వలననే ఈ సమస్య ఏర్పడిందని,కనుక ఇప్పటికయినా వారిరువురూ ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చేరు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రతీకార ధోరణితో వ్యవహరించకుండా వారితో సుహృద్భావ వాతావరణంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.   ఆయన తన లేఖలో కొన్ని నిర్మాణాత్మకమయిన సలహాలు కూడా చేసారు. రెండు రాష్ట్రాలలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల వలన ఆర్టీసీకి ప్రతీ ఏట సుమారు రూ.1000 కోట్లు నష్టం వస్తోందని ప్రభుత్వమే చెపుతున్నప్పుడు, వాటిని ఎందుకు నియంత్రించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ నుండి డీజిల్ కొనుగోలుపై రూ.541 కోట్లు, విడిభాగాల కొనుగోలుపై మరో రూ.150 కోట్లు వ్యాట్ పన్ను వసూలు చేస్తోందని, ప్రభుత్వం దానిని వదులుకొనేందుకు సిద్దపడితే ఆర్టీసీ తన నష్టాల నుండి తేలికగా బయటపడగలదని ఆయన సూచించారు. మరి జగన్ వ్రాసిన ఈ బహిరంగ లేఖకి రెండు ప్రభుత్వాలు వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాసలు ఏమని సమాధానం చెపుతాయో వేచి చూడాలి.

సల్మాన్ ఖాన్ కేసు క్లోజ్?

  సెషన్స్ కోర్టులో దోషిగా నిరూపించబడి ఐదేళ్ళ జైలు శిక్ష విధింపబడిన బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ముంబై హైకోర్టు ఆ శిక్ష అమలుచేయకుండా నిలిపివేసి బెయిలు కూడా మంజూరు చేసింది. వేసవి శలవుల తరువాత కోర్టు మళ్ళీ పనిచేయడం ఆరంభించినప్పుడు ఆ కేసు విచారణ చేపడుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం గత పదమూడేళ్ళుగా చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం వలననే సల్మాన్ ఖాన్ కి శిక్ష పడింది. కనుక హైకోర్టు ఇప్పుడు అతనికి వేసిన ఆ శిక్షను నిలిపివేసినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలుకి వెళుతుందని అందరూ భావించడం సహజం. కానీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఏమీ లేనట్లు తెలుస్తోంది. అంటే ఇక సల్మాన్ ఖాన్ కేసు క్లోజ్ అయిపోయినట్లే భావించవచ్చునేమో? కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకున్నా ఇతరులు ఎవరో ఒకరు తప్పకుండా సుప్రీం కోర్టుకి వెళితే అతనికి సమస్యలు తప్పక పోవచ్చును.

రాష్ట్ర విభజనపై పుస్తకం వ్రాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

  కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం పెద్ద పొరపాటే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. ఆయన వలననే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని పార్టీలో చాల మంది బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వారి విమర్శలకు కిరణ్ కుమార్ రెడ్డి చాలా ధీటుగా త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు.   ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి అదృశ్యమయిపోయిన ఆయన ఈ విరామ సమయంలో రాష్ట్ర విభజన గురించి 400 పేజీలతో కూడిన ఒక పుస్తకం వ్రాయడం మొదలుపెట్టారు. అందులో సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలు తెర వెనుక ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషించారో, రాష్ట్ర విభజనకు ముందు పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు సంభవించాయో వంటి వివరాలన్నిటినీ ఆధారాలతో సహా ఆయన తన పుస్తకం ద్వారా తెలియజేయబోతున్నారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశ వివరాలను కూడా కూడా ఆయన తన పుస్తకంలో తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను ఈ వ్యవహారంలో ఎవరెవరు తప్పు దారి పట్టించారో, ఎందుకు పట్టించారో ఆయన తన పుస్తకంలో సవివరంగా వ్రాసినట్లు తెలుస్తోంది.   అదే విధంగా రాష్ట్ర విభజన వ్యవహారం మొదలయిన తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్, ఎకె. అంతోనీ, వీరప్ప మోయిలీ తదితరులతో జరిగిన తన సమావేశాల గురించి కూడా ఆయన తన పుస్తకంలో పేర్కొనట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలో తెరాస, తెదేపా, వైకాపా మరియు ఇతర పార్టీలు వాటి అధ్యక్షులు ఈ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారనే విషయాల గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.   తను పుస్తకం వ్రాస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. ఆ పుస్తకం మరొకటి రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పుస్తకం ఆయనే వ్రాస్తున్నారు కనుక అందులో తనను తాను సమర్దించుకొంటూ, తనని విమర్శించిన వారందరికీ చురకలు వేయవచ్చును.   ఇక ఆయనకి మళ్ళీ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యాలున్నట్లయితే, చేరితే ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న బీజేపీలోనే చేరవలసి ఉంటుంది గనుక ఈ వ్యవహారంలోఆ పార్టీపై ఎటువంటి ఘాటు విమర్శలు చేయక పోవచ్చును. ఆయన వ్రాసిన పుస్తకం విడుదలయితే అందరి కంటే ముందుగా రాష్ట్ర విభజన వ్యవహారంలో డబల్ గేమ్ ఆడిన ఆంధ్రా కాంగ్రెస్ నేతల బండారం బయటపడటం తధ్యం. రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి నేటికీ ప్రజాధారణకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నవారి నెత్తిపై ఇది పిడుగులా పడబోతోంది. దానితో ప్రజలు వారిని మరింత అసహ్యించుకొనే అవకాశం ఉంది కనుక వారు కిరణ్ కుమార్ రెడ్డిపై ముందుగానే ఎదురు దాడి చేయవచ్చును. లేదా వారిలో ఎవరో ఒకరు ఈ వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, పార్టీ అధిష్టానాన్ని, చివరికి తమందరినీ కూడా మభ్యపెడుతూ ఏవిధంగా రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించారో తెలియజేస్తూ పుస్తకం వ్రాసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ వారిలో ఎవరయినా పుస్తకం వ్రాసి పుణ్యం కట్టుకొంటే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలందరి కధలు ప్రజలకి కూడా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

ప్రమాదాలు... ప్రమాదాలు...

  ఆదివారం తెల్లవారు ఝామునే మూడు ప్రమాదాలు జరిగాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దగ్గర ఆటో అదుపు తప్పి ఎస్సారెస్సీ కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆటోలో వున్న ఒక మహిళ మరణించింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. అలాగే వరంగల్ జిల్లా జనగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీదికోడలి గ్రామం వద్ద ఒక వ్యాను బోల్తా పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోపాలపురం నుంచి ఎంబరామ్‌కి వెళ్తున్న పెళ్ళివారి వ్యాను మహేంద్రతనయ నది వద్ద బోల్తా పడింది.

తక్షణమే విధుల్లో చేరండి: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఆదేశం

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో గత నాలుగు రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక తక్షణమే వారిని సమ్మె విరమింపజేయవలసిందిగా కోరుతూ టిడిపి నేత పి.ఎల్.వెంకట్రావు, చిత్తూరు జిల్లా వాసి మహ్మద్‌గౌస్‌ హైకోర్టులో వేర్వేరు లంచ్ మోషన్ పిటిషన్స్ వేసారు.   వాటిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ జేసీ భాను సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు అందరూ తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరమని ఆదేశించారు. వారి సమ్మె చట్ట వ్యతిరేకమని, ఒకవేళ సమ్మె కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును ఈనెల 12కి వాయిదా వేసారు.   కానీ ఆర్టీసీ ఈ.యూ. మరియు టీ.ఎం.యూ. నేతలు తాము హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ కోర్టు తీర్పు కాపీ తమకు అందేవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. అయినా చట్ట ప్రకారం తాము యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్తితులల్లో సమ్మెకు దిగామని మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పు చేతికి వచ్చిన తరువాత సమ్మె విరమించడమా లేక సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడమా అనే విషయం గురించి ఆలోచిస్తామని అంతవరకు తమ సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఈ.యూ. నేత పద్మాకర్‌ చెప్పారు.

స్మార్ట్ విలేజ్ కోసం సపోర్ట్ చేయండి.. నారా లోకేశ్

  టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్రానికి పెట్టుబడుదారుల కోసం అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం శాన్ ఫ్రాన్సిన్స్ కోలోని ఎన్నారైలతో సమావేశమయ్యి వారికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ, స్మార్ట్ వార్డుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి చేయాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలోని గ్రామాలను బాగా అభివృద్ధి చేసిన వారికి చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం అందుతుందని తెలిపారు. నీటి సమస్య ఉన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసి మంచినీటికార్డు ద్వారా వారికి రోజుకు 20 లీటర్ల నీరు అందిస్తున్నామని అన్నారు. 2020 నాటికి తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రథమస్థానంలో ఉంటాయని, 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని అన్నారు.

హరీష్ రావు కారు దిగిపోతారా?

  ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావు చాకులా పనిచేస్తున్నాడని ఎంత మెచ్చుకొన్నప్పటికీ తెరాస ప్లీనరీ సమావేశాలలో ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో హరీష్ హార్ట్ అయ్యేరని సమాచారం. అదేవిధంగా కేసీఆర్ తన కుమారుడు కె.తారక రామారావుకే పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలతో ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు మరింత హార్ట్ అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల గురించి ఆయన తన అనుచరులతో చర్చిస్తునట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీలో, ప్రజలలో కె.టి.ఆర్ పాపులారిటీ పెంచేందుకే ఆయన అమెరికా యాత్రకి పంపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కె.టి.ఆర్. అమెరికాలో తనకున్న పరిచయాలతో, తెలంగాణా యన్.ఆర్.ఐ.లను, అక్కడి పారిశ్రామిక వేత్తలను మెప్పించి తెలంగాణా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురాగలిగితే ప్రజలు కూడా తప్పకుండా మెచ్చుకొంటారు కనుక అప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెడితే హరీష్ రావుతో సహా పార్టీలో నేతలెవరూ అభ్యంతరం చెప్పారని తెరాస అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు వెంటనే కారు దిగిపోయి కాంగ్రెస్ చెయ్యి పట్టుకొనే అవకాశాలున్నాయని, ఒకవేళ ఆయన కారు దిగిపోతే ఆయనతో బాటే ఆయన అనుచరులు మరో పది మంది వరకు కారు దిగిపోయి ఆయనను ఫాలో అయిపోయే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెరాసకు పెద్ద దెబ్బే అవుతుంది కనుక పరిస్థితి అంత దూరం పోకుండా కేసీఆర్ ముందే జాగ్రత్తపడవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు ప్లీనరీ సమావేశాల్లోనే కేటీఆర్ కి ప్రమోషన్ డిక్లేర్ చేస్తారని మీడియా కోడై కూసింది. కానీ అటువంటిదేమీ జరుగలేదు. ఇప్పుడు కేటీఆర్ అమెరికా నుండి తిరిగి రాగానే ఆయనకు పట్టాభిషేకం చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరదయినా నిజమో కాదో చూడాలి.

వైద్య పరీక్షలకు వెళ్లిన యువతి... జాతకం చెప్పమన్న వైద్యులు

  వైద్య పరీక్షలు చేయమంటే జాతకం చెప్పమని వేధించారట వైద్యులు. ఈ విచిత్రమైన సంఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. వివరాలు.. డాక్టర్ భాస్వతి భట్టాచార్య అనే యువతి వారణాసిలో బనారస్ యూనివర్శిటిలో ఆయుర్వేదంలో పీహెచ్డీ చేస్తుంది. అయితే ఆమెపై ఓ ఐదుగురు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై ఆమె స్థానిక లంకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరగా ఎస్పీ జోక్యం చేసుకోగా కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా లైంగిక దాడులు జరిగిన మహిళలను మహిళా డాక్టర్ల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకుండా, ఇద్దరు మగ డాక్టర్లను వైద్య పరీక్షలకు నిర్వహించారని బాధితురాలు వాపోయింది. అయితే వారు తను ఆయుర్వేదిక్ డాక్టర్ అని తెలియగానే తమ చేతులు చూపించి జాతకం చూడమని బలవంతం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాడి జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి ఘటన ఎలా జరిగిందో యాక్టింగ్ చేసి చూపించమని పోలీసు అధికారి వేధించాడని డాక్టర్ భట్టాచార్య చెప్పింది.

పురుషుడిపై అత్యాచారం

  ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ దేశంలో వెరైటీగా మగవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయట. ఎక్కడ అనుకుంటున్నారా... దక్షిణాఫ్రికాలో... అక్కడ పురుషులపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయట. అదే కోవలో ముగ్గురు మహిళలు ఓ వ్యకిని అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. గాంటెడ్ నగరానికి చెందిన ముగ్గురు యువతులు 33 ఏళ్ల యువకుడిని తుపాకీతో బెదిరించి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అతనిని 500 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి ఎవరూ తిరగని ప్రాంతంలో కారును ఆపి అతని చేత మద్యం తాగించారు. తరువాత అతనిపై అత్యాచారం జరిపి కారులోంచి తోసేని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుండి ఏపీలో ఉపాద్యాయ పరీక్షలు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈరోజు నుండి మొదలవుతున్నాయి. ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,97,294 మంది హాజరవుతున్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2560 పరీక్షా కేంద్రాలను ఏర్పటు చేసారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 10,313 ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. వేసవి శలవుల తరువాత మళ్ళీ పాఠాశాలలు మొదలయ్యేలోగానే జూన్ 1న పరీక్షా ఫలితాలు వెల్లడించి, నియామకాలు కూడా పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడంతో పరీక్షకు హాజరవుతున్న వారిలో ఒకరకమయిన ఆశ, ఉత్సాహం నెలకొని ఉంది.   సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల షెడ్యూల్: శనివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. బాషా పండితుల పరీక్షల షెడ్యూల్: ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షల షెడ్యూల్: సోమవారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1.15గంటల వరకు. స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షల షెడ్యూల్: సోమవారం మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 6.15 గంటల వరకు.   సెకండరీ గ్రేడ్ పరీక్షలకి మొత్తం 57,520 మంది, బాషా పండితుల పరీక్షలకి 53,044 మంది, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకి 56, 373 మంది, స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షలకి 2,20,490 మంది హాజరవుతున్నారు.   ఈ పరీక్షలకి హాజరవుతున్న వారి కోసం జిల్లాల వారిగా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కమీషనర్ సంద్యా రాణి మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయి సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లు: 9848854943, 9959400080.

సమావేశాలు పొడిగించినందుకు కూడా నిరసనలా?

  సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు పొడిగించమని ప్రతిపక్షాలు అధికార పార్టీలని డిమాండ్ చేయడం గురించి వింటాము. పొడిగించకపోతే అధికార పార్టీకి ప్రజాసమస్యల గురించి సభలో చర్చించడానికి శ్రద్ధ లేదని నిందిస్తుంటాయి. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు మూడు రోజులు పొడిగించినందుకు ఈరోజు సభలో నానా రభస చేసాయి. అయితే అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడికోడలు నవ్వినందుకేనన్నట్లు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు పొడిగించినందుకు కాక తమకు మాట మాత్రం చెప్పకుండా సమావేశాలు పొడిగించారంటూ ‘మోడీ నియంతృత్వం సహించేది లేదు’ అంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేసాయి.   అయితే బీజేపీ వారి ఆరోపణలను తిరస్కరించింది. గతంలో కూడా ఈవిధంగా ఆఖరు నిమిషంలో పార్లమెంటు సమావేశాలు పొడిగించబడ్డాయని కానీ నిన్న(గురువారం) రాజ్యసభ సమావేశాలు రాత్రి వరకు కొనసాగడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ యం. వెంకయ్యనాయుడుతో సహా అనేకమంది మంత్రులు సభా కార్యక్రమాలను మధ్యలో విడిచిపెట్టి రాలేకపోవడంతో పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తున్న సంగతి కొన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలియజేయలేకపోయామని బీజేపీ వాదించింది. కానీ బిజినస్ అడ్వయిజరీ కమిటీలో సమావేశంలో పాల్గొన్న సభ్యులకు దీని గురించి తెలుసునని బీజేపీ వాదించింది. తెదేపా, తెరాస, వైకాపా, ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీలు సమావేశాల పొడిగింపుకి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పాయి. ఈ సమావేశాల పొడిగింపు కారణంగా రాహుల్ గాంధీ ఈనెల 12న అదిలాబాద్ జిల్లాలో నిర్వహించదలచిన పాదయాత్రను 15కి వాయిదా వేసుకొన్నారు.