తెలంగాణా ఎంసెట్ పరీక్ష నేడే

  రాష్ట్ర విభజన జరిగి ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఎంసెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే విషయంలో రెండు ప్రభుత్వాలు పంతాలకు పట్టింపులకి పోయాయి. కానీ చివరికీ తెలంగాణా ప్రభుత్వం తన పంతమే చెల్లించుకొంది. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే వేరేగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకొంది.   ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎంసెట్ పరీక్షలు జరుగబోతున్నాయి. వీటికి మొత్తం 2,31,998 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరిలో 1,39,636మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్, 92,362 మంది విద్యార్ధులు మెడికల్ ఎంట్రన్ పరీక్షలు వ్రాస్తున్నారు. వీరి కోసం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 432 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 189 కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు కనుక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో ఎనిమిది జోన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది జోన్లలో పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులను చేర్చేందుకు ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా మొత్తం 261 బస్సులను కూడా ఏర్పాటు చేసారు. కానీ నిన్నటితోనే ఆర్టీసీ సమ్మె ముగియడంతో ప్రభుత్వం, ఎంసెట్ నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకొన్నారు. తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఎంసెట్ పరీక్షల కోసం ‘కోడ్-క్యూ’ పరీక్షా పత్రాల సెట్ ని ఎంపిక చేసారు. తాజా సమాచారం ప్రకారం కొద్ది సేపటి క్రితమే రాష్ట్రంలో అన్ని సెంటర్లలో ఎంసెట్ పరీక్ష మొదలయింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా సాగుతోంది.

44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీ కంటె 1 ఎక్కువే

  తెలంగాణ ఆర్టీసీ కార్మికలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు ముగిశాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్ మెంట్ పెంచమని అడుగగా కేసీఆర్ ఒక శాతం ఎక్కువే అంటే 44 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముఖ్యమంత్రి ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సమ్మె కథ సుఖాంతం అయింది.

గే పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకోనున్న ప్రధాని

  గేలు పెళ్లి చేసుకోవడం ఎక్కడో అరుదుగా చూస్తుంటాం.. ఇప్పుడు వాళ్ల జాబితాలో పశ్చిమ యూరోప్ దేశం లక్సెంబర్గ్ ప్రధాన మంత్రి జేవియర్ బెటెల్ కూడా చేరిపోయారు. స్వలింగ సంపర్కుడైన జేవియర్ బెటెల్ తన సహచరుడైన గోథియర్ ను వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. బెటెల్ 2013 డిసెంబర్ లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు మూడేళ్లనుండి అతను గోథియర్ తో సహజీవనం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని గే పెళ్లికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ప్రధాని పెళ్లి వేడుకను ప్రచురించేందుకు ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్లు ముందుకు రాగా బెటెల్ మాత్రం పెళ్లి తన వ్యక్తిగత విషయమని, ఎలాంటి ప్రచారం అవసరం లేదని తిరస్కరించాడు.

చెన్నై ఛీర్ గర్ల్స్ ను వేధించిన పోలీసులు

  చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ఛీర్ గర్ల్స్ ను రాయపూర్ పోలీసులు తనిఖీ పేరుతో వేధించిన ఘటన వెలుగు చూసింది. చెన్నై ఫ్రాంచైజీకి చెందిన ఛీర్ గర్ల్ నగరంలోని ఒక హోటల్ లో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్‌లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఛీర్ గర్ల్స్‌ హోటల్ పై దాడులు నిర్వహించారు. ఛీర్ గర్ల్స్‌ ఉన్న గదులను దాదాపు గంటపాటు క్షుణ్ణంగా పరిశీలించి, వాళ్లపై ప్రశ్నల వర్షం కురింపిచారు. హోటల్ లో ఉన్న ప్రతి ఒక్కరిని.. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్ ను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులను సైతం వదలకుండా పోలీసులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని, మాపట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు ఏం బాలేదని ఛీర్ గర్ల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్ లో విదేశీ అమ్మాయిల గురించి సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించామని, ఇది రొటీన్ తనిఖీ మాత్రమేనని సిటీ ఎస్పీ సింగ్ శిశోడియా అన్నారు.

బస్సుపై కాల్పులు.. 47 మంది మృతి

  పాకిస్థాన్ లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియకుండా ఉంది. ఇప్పుడు కొత్తగా ఓ బస్సుపై కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... పాకిస్థాన్ నగర శివార్లలో షియాలు అల్- అజహర్ గార్డెన్ కాలనీలో నివసిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణా రహింతగా కాల్పలు జరిపారు. ఈ కాల్పులలో 47 మంది చనిపోయారు. అయితే ఉగ్రవాదులు పోలీసుల డ్రస్సులో రావడంతో డ్రైవర్ బస్సు ఆపాడని, ఆగివున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఘటనలో గాయపడిన ఒక బాధితుడు చెప్పాడని పాక్ పోలీసులు తెలిపారు. మొత్తం 60 మంది ఉన్న ప్రయాణికుల్లో అందరూ కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ - ఏ- తాలిబన్ సంస్థ ప్రకటించింది. దీంతో పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల చేసిన పనిని ఖడించి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.

43 శాతం ఫిట్మెంట్ కు ఓకే.. ఏపీ సర్కార్

  ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సమస్య పరిష్కారం ఓ కొలిక్కి వచ్చింది. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేసిన 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తమకు ఉన్న బకాయిలు కూడా చెల్లించాలని ఆర్టీసీ కార్మికులు కోరగా.. ఇప్పటినుండి అవి లేకుండా ఇస్తామని, చెల్లింపు కుదరదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. ప్రస్తుతం ఫిట్మెంట్ మాత్రమే ఇస్తే ఏపీ ప్రభుత్వం పై రూ. 900 కోట్ల భారం పడుతుందని, ఒకవేళ పాత బకాయిలు చెల్లించాల్సి వస్తే మరో 1108 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. సమస్య పరిష్కారం అవడంతో కొంతసేపట్లోన్ ఆర్టీసీ సమ్మె కూడా విరమించే అవకాశం ఉంది.

రాముని మందిరాన్ని మేమే నిర్మిస్తాం

  సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, ఆధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో మెజారిటీ లేకుండా రాముని ఆలయం కట్టడం సాధ్యం కాదని చెప్పిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని, బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా మండిపడ్డారు. రామ మందిరానికి రాజకీయ నాయకుల డబ్బులు తమకు అవసరం లేదని.. ప్రజలు సాధువుల సహాయంతో నిర్మిస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్న కేసీఆర్

  తమ వేతనసవరణలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒకవేళ అలా ఇచ్చినట్టయితే కేసీఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని చిక్కుల్లో పడేసినట్టే. అసలే ఆర్ధికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికే కేసీఆర్ చూస్తున్నారని ఆంధ్ర మంత్రులు అంటున్నారు. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్‌ను ప్రకటించారు. దాంతో ఇక్కడ ఆంధ్రా ఉద్యోగులు కూడా తమకు పెంచాలని కోరడంతో పెంచాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా కేసీఆర్ అలానే చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంత బాలేదు కాబట్టి కేసీఆర్ పెంచినంత వేతనాలు పెంచలేమని చంద్రబాబు వెల్లడించారు.

కేసీఆర్ పై బీజేపీ ఫైర్

  టీఅర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై జీజేపీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తమ పార్టీ నేతలకే అవకాశం కల్పిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజసింగ్ రాథోడ్‌లు గంటసేపు సచివాలయం సీ బ్లాక్ ముందు బైఠాయించారు. నగరంలో చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అంతా టీఆర్ఎస్ నాయకులే ఉంటారా? అని ప్రశ్నించారు. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములు చేయాలని నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆపార్టీ వర్గాలు కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు.

ఆంధ్ర రాజధాని శంకుస్థాపన

  ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి అని ఖరారైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నూతన రాజధాని అయిన అమరావతికి జూన్ 6న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త రాజధానికి శంకుస్థాపన చేసేందుకు జూన్ 5, 6, 8 తేదీలు బాగా ఉన్నాయని పండితులు వివరించారని, ఈ తేదీల్లో శంకుస్థాపన జరగకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం మార్చి వరకు మంచిరోజులు లేవని చెప్పారని చెప్పారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీన శంకుస్థాపనక చేసేందుకు మొగ్గు చూపినట్టు మంత్రులు చెప్పారు.

కీలకు దశకు చేరుకొన్న ఆర్టీసీ సమ్మె

  ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వాలు రెండూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు నేతృత్వంలో మంత్రుల సబ్-కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు ఉదయం9-10 గంటల మధ్య సమావేశమవుతుంది. అదేవిధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు.   ఇక ఈరోజే ఉదయం 10 గంటలలోగా సమ్మె విరమిస్తున్నట్లు తమకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆదేశించినందున వారు కోర్టుకి కూడా తమ అభిప్రాయం చెప్పవలసి ఉంది. హైకోర్టు ఆదేశాన్ని మన్నిస్తూ సమ్మె విరమణ చేసినట్లయితే ఇప్పుడిప్పుడే దిగివస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ బిగుసుకుపోతాయని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. కనుక ఈరోజు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు పూర్తయ్యేవరకు, హైకోర్టు ఒత్తిడి చేస్తున్నప్పటికీ వారు సమ్మె విరమణకు మొగ్గు చూపకపోవచ్చును. మరి వారి ఈ సమస్యను అర్ధం చేసుకొని హైకోర్టు వారికి మరికొంత సమయం గడువు ఇస్తుందో లేదో మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది.

హైకోర్టు ఆదేశంపై ఆర్టీసీ సంఘాలు నిరసన

  గత 8రోజులుగా ఉదృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ రోజుతో 9వ రోజుకు చేరుకొంది. ఈరోజు ఉదయం 10 గంటలలోపుగా సమ్మె విరమించాలని, ఆ సంగతి తనకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించింది. తమ కార్మిక చట్ట సమ్మతమయినదేనని, తమ హక్కుల కోసం సమ్మె చేసే హక్కు తమకు ఉందని, చట్ట ప్రకారం ప్రభుత్వాలకి నెల రోజులు ముందుగానే సమ్మె నోటీసులు అందజేసిన తరువాతనే, ప్రభుత్వాలు తమ డిమాండ్లను పట్టించుకోక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘాల వాదన. అందుకే వారు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా రెండు రాష్ట్రాలలో అన్ని బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయబోతున్నారు. హైదరాబాద్ లో గల ‘బస్ భవన్’ ను ఈరోజు ముట్టడించడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి. ఈరోజు హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని, ఒకవేళ హైకోర్టు తమ సమ్మె కొనసాగానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే సుప్రీంకోర్టులో అప్పులు చేసుకొనయినా సరే తమ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు. ప్రభుత్వాలు న్యాయబద్దమయిన తమ డిమాండ్లకు అంగీకరించేవరకు సమ్మెను నిలిపేది లేదని వారు తేల్చి చెపుతున్నారు.

ఏపీ ఉన్నత విద్యా మండలిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషనుపై ఈరోజు విచారణ జరగుతుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కనుక హైదరాబాద్ లో ఉన్న ఆ సంస్థ తన ఉనికిని కోల్పోయినట్లేనని కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందని కొన్ని రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఉద్యోగులు, భవనాలు, ఆసంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలలో ఉన్న సొమ్ము అన్నీ కూడా తెలంగాణా ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు చెప్పడంతో వెంటనే స్పందించిన తెలంగాణా ప్రభుత్వం వాటన్నిటినీ తన అధీనంలో తీసుకొంటున్నట్లు ప్రకటించింది.   హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషను వేసింది. దానిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేప్పట్టబోతోంది.ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినట్లయితే మళ్ళీ కొత్తగా ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకోవడం తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వేరే గత్యంతరం ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలతో అంగీకరించినట్లయితే, మళ్ళీ ఉన్నత విద్యామండలి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంటుంది. 

కోతులను కూడా వదల్లేదు

  దొంగలు సహజంగా ఏ బంగారమో, డబ్బులో దొంగతనం చేస్తారు. కాని ఇక్కడ వెరైటీగా కోతులని దొంగతనం చేశారు. ఎక్కడనుకుంటున్నారా... సెంట్రల్ ఫ్రాన్స్ లోని సెయింట్ ఆగ్నన్ జులాజికల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు అరుదైన జాతికి చెందిన 17 కోతుల్ని ఎత్తుకెళ్లారని, ఎలాంటి ఆధారాలు వదలకుండా చాలా చాకచక్యంగా కోతులను తీసుకెళ్లారని జూ పార్క్ డైరెక్టర్ రుడాల్ఫ్ డెలార్డ్ చెప్పారు. అంతరించిపోతున్న కోతుల జాబితాలో ఉన్న ఏడు గోల్డెన్ లయన్ టమరిన్స్, పది సిల్వర్ మెర్కోసెట్స్ కోతులను అపహరించారని తెలిపారు. కోతులకు ఎలాంటి హానీ చేయకముందే దొంగలనుపట్టుకోవాలని పోలీసులకు చెప్పామని రుడాల్ఫ్ డెలార్డ్ చెప్పారు.