అంధ కళాకారుల అద్భుత ప్రతిభ

  మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో అత్యంత వైభవంగా జరిగిన ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో అంధ కళాకారులు ప్రదర్శించిన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. అంధ కళాకారులు సంగీత, నృత్యాలతో అలరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న పలువురు అంధ విద్యార్థులు విశ్వదృక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేదిక మీద తమ ప్రతిభను ప్రదర్శించారు. పలువురు గాయకులు తమ మధుర గాత్రంతో సభికులను రంజింపజేశారు. ముగ్గురు అంధులు తామే కంపోజ్ చేసిన నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యాన్ని చూసి అందరూ మైమరచిపోయారు. వీరి ప్రతిభను గుర్తించిన ఒక అజ్ఞాత దాత వారికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే దుబాయ్‌ నుంచి వచ్చిన అతిథి ఒకరు వీరి ప్రదర్శనను గల్ఫ్‌లో ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అయితే అంధ కళాకారుల ప్రతిభను మనస్పూర్తిగా ప్రశంసించారు. తనను చూడలేకపోయినా, తాను తీసిన సినిమాలను వారు చూడలేకపోయినా తన ముందు పాడటం వారికి సంతోషాన్ని కలిగించడం తన హృదయాన్ని స్పృశించిందని ఆయన అన్నారు. వారు పాటలు పాడుతున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు వారిలో తనకు భగవంతుడు కనిపించాడని, వారికి తన పాదాభివందనాలని చెప్పారు.

చిన్నారి శ్రీనిధి మృతి

  బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకిన పదేళ్ళ చిన్నారి శ్రీనిధి ఈరోజు తెల్లవారు జామున మరణించింది. ఆమె తనను కలవాలనుకొంటున్న సంగతి తెలుసుకొన్న జూనియర్ యన్టీఆర్ ఆమె (చివరి) కోరికను మన్నిస్తూ వారం రోజుల క్రితమే శ్రీనిధి (ఆఖరు) జన్మదినం జరుపుకొన్నప్పుడు ఆమె ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు గడిపారు. కానీ వారం తిరక్కుండానే సరిగ్గా జూ.యన్టీఆర్ జన్మదినం రోజునే శ్రీనిధి మరణించడం అందరినీ కలచివేసింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బందనపల్లి గ్రామం. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ సోకిన సంగతి తెలుసుకొన్న తరువాత ఆమె తల్లి తండ్రులు ఆమెను అనేక ఆసుపత్రులలో వైద్యం చేయించారు. కానీ ఆమె బ్రతకడం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పడంతో గత కొంత కాలంగా ఆమెను కూకట్ పల్లిలో ఒక ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే జూ. యన్టీఆర్ వచ్చి ఆమెతో కొంత సమయం గడిపారు. చిన్నారి శ్రీనిధి మరణించిందనే వార్త తెలిసి జూ. యన్టీఆర్ కూడా చాలా బాధపడ్డారు.

నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల

  నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖపట్నంలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తరువాత పరీక్షా ఫలితాలు, గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు, గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ వంటి పూర్తి వివరాలను ఏపీ ఆన్‌లైన్‌లో పెడతామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆర్‌.సురేందర్‌రెడ్డి నిన్న ఒక ప్రకటన ద్వారా విద్యార్ధులకు తెలియజేసారు. దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా విద్యార్ధులు పడవ తరగతి పరీక్షకి హాజరయ్యారు. విద్యార్ధులు తమ పరీక్షా ఫలితాలను www.bseap.org, www.vidyavision.com తదితర వెబ్ సైట్లలో కూడా చూసుకోవచ్చును.

దర్శకుడి దుర్మరణం

  భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరణించారు. ఆయన వయసు 26 సంవత్సరాలు. మే 10వ తేదీన ఫిలిడెల్ఫియాలో బైక్పై వెళ్తున్న విజయ్ మోహన్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు విజయ్ మోహన్ మరణించారు. విజయ్ మోహన్ చికాగోలో జన్మించారు. అయితే ఆయన ఇండియాలో చదువుకున్నారు. ఆ తర్వాత టెంపుల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. విజయ్ మోహన్ మరణం పట్ల ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ సంతాపం ప్రకటించింది.

ట్విట్టర్లో ఒబామా.. రికార్డు...

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం నాడు అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇప్పటికే ఒబామా పేరుతో అనేక అనధికారిక ఖాతాలు వున్నాయి. ఈ విషయాన్నే బరాక్ ఒబామా తన ట్విట్లర్లో ప్రస్తావిస్తూ, మొత్తానికి ట్విట్లర్లో నా సొంత అకౌంట్‌ని ప్రారంభిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన న్యూజెర్సీ పర్యటన గురించి రెండో ట్వీట్ చేశారు. ఒబామా తన ఖాతాను తెరిచిన 12 గంటల్లోనే 1.46 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అయ్యారు. ఇది ఒక రికార్డు. ట్విట్టర్ ప్రారంభమైన తర్వాత ఆయన మొదటిసారి అకౌంట్‌ తెరిచారు. ఒబామాను ఫాలో అయ్యేవారు మాత్రమే కాదు.. ఆయన ఫాలో అయ్యేవారు కూడా వున్నారు. ఒబామా మొత్తం 65 మందిని ఫాలో అవుతున్నారు.

జయలలితకు అస్వస్థత

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అయితే మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి, ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, జయలలితను అనారోగ్యం బాధిస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆమె అనారోగ్యంతో బాధపడేవారు. అందుకోసం ఆమె తమిళనాడులోని ఓ ప్రకృతి చికిత్సాలయలంలో చేరి చికిత్స కూడా పొందారు. పరిపాలనను విడిచిపెట్టి ప్రకృతి చికిత్సాలయానికి పరిమితయ్యారన్న విమర్శలను కూడా అప్పట్లో ఆమె ఎదుర్కొన్నారు. ఇటీవలి కాలంలో కోర్టుల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురైన ఒత్తిడులకు ఆమె గురయ్యారు.

ఇదిగో... కాళ్ళున్న చేప!

  అమెరికాలో కాళ్ళున్న చేప కనిపించింది. చేపలను మొప్పలతోనే చూశాం. కాళ్ళున్న చేపలు వుంటాయని వినడమేగానీ, చూడలేదు. అలా కాళ్ళున్న చేపను అమెరికాలోని కొలరాడోలో ఓ చెరువు దగ్గర ఓ వ్యక్తం గుర్తించాడు. వెంటనే దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వ్యాపిస్తోంది. అయితే ఈ కాళ్ళున్న చేప అప్పటికే చనిపోయి వుంది. అది బతికి వుంటే, దానిమీద పరిశోధనలు చేసే అవకాశం వుండేదని పలువురు అంటున్నారు. ఈ చేపకు కాళ్ళ వంటి నిర్మాణాలు సహజంగానే వున్నాయా, లేక జన్యుపరమైన మార్పుల వల్ల కాళ్ళలాంటి ఆకారాలు వచ్చాయా అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ కాళ్ళున్న చేపను కనుగొన్న చెరువులో ఇంకా అలాంటి చేపలు మరేవైనా వున్నాయా గమనించాల్సి వుందని అంటున్నారు. ఇది నిజంగానే కాళ్ళున్న చేప అని, దీనికి ‘మెక్సికన్ వాకింగ్ ఫిష్’ అనే పేరు వుందని కూడా కొంతమంది చెబుతున్నారు.

డిల్లీ గవర్నర్ పై రాష్ట్రపతికి పిర్యాదు చేయనున్న కేజ్రీవాల్

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య ప్రధాన కార్యదర్శి నియామకంపై మొదలయిన గొడవ నానాటికీ ముదురుతోంది. డిల్లీ ప్రధాన కార్యదర్శి కెకె శర్మ తన స్వంత పని కోసం కొన్ని రోజులు శలవు పెట్టి అమెరికా వెళ్ళడంతో ఆయన స్థానంలో శకుంతల గామ్లిన్ అనే ఐ.ఏ.యస్. అధికారిణిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాలు జారీ చేశారు. దాని కోసం ప్రధాన కార్యదర్శి (సర్వీసస్) మజుందార్ నోటిఫికేషన్ ఇచ్చేరు. కేజ్రీవాల్ వారిస్తున్నా వినకుండా శకుంతల గామ్లిన్ బాధ్యతలు చేప్పట్టారు.   ఈ మూడు సంఘటనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గవర్నర్ నజీబ్ జంగ్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నారని, ఆయన చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని కేజ్రీవాల్ వాదన. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ శకుంతల గామ్లిన్ కి ప్రధాన కార్యదర్శిగా నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు మజుందార్ ని బాధ్యతల నుండి తప్పించి, ఆయన కార్యాలయానికి తాళాలు వేయడమే కాకుండా ఆయన స్థానంలో రాజేంద్ర కుమార్ అనే మరో అధికారిని నియమించారు.   కానీ మజుందార్ స్థానంలో ముఖమంత్రి నియమించిన రాజేంద్ర కుమార్ నియామకానికి తన అనుమతి లేదని కనుక ఆయన నియామకం చెల్లదని తెలియజేస్తూ గవర్నర్ నజీబ్ జంగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఒక లేఖ వ్రాయడంతో ఆయన మరింత ఆగ్రహం చెందారు.   తన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి ఏదోవిధంగా కూల్చివేయాలనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం ఈ విధంగా గవర్నర్ ద్వారా తనకు ఇబ్బందుకు సృష్టిస్తోందని అని విమర్శించారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వ్యవహారం గురించి పిర్యాదు చేయబోతున్నారు.

నేటి నుండి ఏపీలో ఉద్యోగుల బదిలీ

  నేటి నుండి ఈ నెలాఖరు వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల బదిలీల ప్రక్రియ ఆరంభించేందుకు ప్రభుత్వం నిన్న జీ.ఓ. (నెంబర్: 57) జారీ చేసింది. అందులో ఉద్యోగుల బదిలీలకు సంబందించి మార్గదర్శకాలను సూచించింది. వరుసగా ఐదేళ్ళపాటు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. వరుసగా రెందేల్లో ఒకే చోట పనిచేసినవారు కావాలనుకొంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చును. కానీ ఈ బదిలీల కోసం ఉద్యోగులు ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలు తీసుకోనివస్తే అటువంటి వారిపై కటినచర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే హెచ్చరించారు. ఈ ప్రక్రియ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు అధ్యక్షతలో నీతి ఆయోగ్ సమావేశం నేడు

  ఈరోజు చండీఘడ్ లో జరుగబోయే నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం) సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించబోతున్నారు. ఇంతవరకు ప్రణాళికా సంఘంలో రాష్ట్రాల పాత్ర నామమాత్రంగానే ఉండేది. ఇంతకు ముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ లోపాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ తను ప్రధానమంత్రి అయిన తరువాత దానిని సరిదిద్దారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రణాళికా సంఘంలో సమాన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది ఆశించిన ఫలితాలు ఇస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే పాత ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి, ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సవరించి దాని స్థానంలో కొత్తగా ఈ నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించడమే ఆ వ్యవస్థలో జరిగిన మార్పులకి అద్దం పడుతోంది.

కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు

తెలంగాణ ముఖ్యమంత్రి పై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులతో సక్యతగా ఉన్నారని ఇప్పుడు సీఎం కాగానే ఉద్యోగులను విస్మరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కార్యలయంలో ఉద్యోగుల కోసం వార్ రూమ్ ఉండేదని అది ఇప్పుడు వాష్ రూమ్ గా మార్చారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన మేము ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం అదే కేసీఆర్ పై పోరాటం చేసేందుకు సిద్ధమని అంటున్నారు. తెలంగాణ జేఏసీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా నిద్రపోతే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

తప్పించుకున్న సింహాన్ని చంపేశారు

  జూలో వున్న సింహం బోనులో వున్నంతవరకే గౌరవం. బోను నుంచి తప్పించుకుంటే దానిమీద ఎవరికీ గౌరవం వుండదు. చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైయాన్ టైగర్స్ పార్క్‌లో ఆదివారం నాడు సింహాల ఎన్‌క్లోజర్ని క్లీన్ చేయడానికి వెళ్ళిన జూ సిబ్బంది ఒకరి మీద ఒక సింహం దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఎన్‌క్లోజర్లోంచి తప్పించుకుని బయటకి వచ్చింది. దాంతో జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూలో వున్న అందర్నీ బయటకి పంపేసి సింహాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. గంటసేపు ప్రయత్నించినా ఆ సింహం అదుపులోకి రాలేదు. దాంతో దాన్ని కాల్చి చంపేశారు. సింహాన్ని చంపి చాలా మంచి పనిచేశారని చాలామంది అంటుంటే, కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇది దారుణమని విమర్శిస్తున్నారు.

కొత్త పైత్యం.. ఫైర్ ఛాలెంజ్...

  ఆ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఐస్ బక్కెట్ ఛాలెంజ్’ గురించి అందరికీ తెలిసిందే. నెత్తిన ఐస్ ముక్కలను కుమ్మరించుకునే ఈ ఛాలెంజ్‌కి సోషల్ మీడియా పుణ్యమా అని విస్తృత ప్రచారం లభించింది. ఈ ఛాలెంజ్‌కి నకలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛాలెంజ్‌లు బయల్దేరాయి. నెత్తిన ఐస్ ముక్కల బక్కెట్‌ని కుమ్మరించుకుని మరికొంతమందికి అలా చేయాలంటూ ఛాలెంజ్ విసిరే ఈ ‘ఐస్ బక్కెట్’ ఛాలెంజ్ ఎంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించిందో, అంత త్వరగా చల్లారింది. ఆ ఛాలెంజ్ చల్లారినా, అలాంటి ఛాలెంజ్‌లు మాత్రం పుట్టుకొస్తూనే వున్నాయి. ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అమెరికా యువతరం ఒక కొత్త ఛాలెంజ్‌ని ప్రారంభించారు. ఆ ఛాలెంజ్ పేరు ‘ఫైర్ ఛాలెంజ్’ ఒంటిమీద పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని, వెంటనే నీళ్ళలోకి దూకే ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ గాయపడుతున్నారు. ఈ మధ్య ఈ ఫైర్ఛాలెంజ్లో పాల్గొన్న ఇద్దరు అన్నదమ్ములు ఒంటికి నిప్పంటించుకున్నారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించాయి. పక్కన ఉన్నవాళ్ళు సమయానికి మంటలార్పి వాళ్ళని కాపాడారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే నిప్పంటించుకుని ఏడుస్తున్న ఓఅమ్మాయి ఫొటో కూడా సోషల్ మీడియాలో సంచరిస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌ల కారణంగా తమ పిల్లలు ఏమైపోతారో అని అమెరికాలోని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.

ఏపీ రాజధాని ముహూర్తం బాలేదని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారం చేపట్టి జూన్ 8 నాటికి ఏడాది కావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా నూతన రాజధాని నిర్మాణానికి పెట్టిన ముహూర్తం సరిగా లేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గేయ అన్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల ముందు ముహుర్తాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవని, పుష్కరాలు ప్రారంభమైన 70 రోజుల తరువాత ముహుర్తాలు బావుంటాయని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ జూన్ 6వ తేదీనే భూమి పూజ నిర్వహిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.