చిత్రపరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉంది

తెలంగాణ జేఏసీ ప్రతినిధులు ఆ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జేఏసీ ప్రతినిధులు.. శ్రీనివాస్ యాదవ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న చిత్రపరిశ్రమ కొందరి వ్యక్తుల చేతుల్లో నడవడం సబబుకాదన్నారు. కేవలం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు మాత్రమే వృద్ధి చెందితే సరిపోదు, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కూడా వృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానాన్ని సవరించాల్సిన అనసరం ఉందని మంత్రిగారిని కోరినట్టు కోదండరాం తెలిపారు.

సెల్వం రాజీనామా, జయలలిత శాసనసభా పక్షనేతగా ఎన్నిక

  ఈరోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం గవర్నర్ రోశయ్యను కలిసి ఆయనకి తన రాజీనామా పత్రం సమర్పించారు. దానిని ఆయన వెంటనే ఆమోదించారు. ఆ తరువాత చెన్నైలో జరిగిన అన్నాడీ.యం.కె. పార్టీ శాసనసభ సభ్యుల సమావేశంలో పన్నీర్ సెల్వం స్వయంగా జయలలితను తమ పార్టీ శాసనసభా పక్షనేతగా ప్రతిపాదించగా దానిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి యన్.ఆర్. విశ్వనాథం బలపరిచారు. మిగిలిన సభ్యులు అందరూ కూడా ఆ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో జయలలిత శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు మద్రాస్ యూనివర్సిటీలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకొంటున్నారు. చెన్నై అంతటా వీధివీధినా ఆమె ఫోటోలున్న పోస్టర్లు, బ్యానర్లు, కటవుట్లు కనబడుతున్నాయి.

తాళ్లాయపాలెంలో రాజధానికి శంఖుస్థాపన?

  వచ్చే నెల ఆరవ తేదీన ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనే విషయం కూడా ఇప్పుడు దాదాపు ఖరారు అయింది. దీని కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు, వాస్తు పండితులు రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో శ్రీశైవ క్షేత్రమనే పుణ్యస్థలి, ఆ పక్కనే కృష్ణా తీరం కూడా ఉన్నందున తుళ్లూరు మండలంలో తాళ్లాయపాలెం గ్రామంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అన్నివిధాల మంచిదని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలోనే అనేకమంది రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేరు గనుక తాళ్లాయపాలెంలోనే శంఖుస్థాపన చేసినట్లయితే ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం పూర్తి అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అధికారుల చేసిన ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదముద్ర పడగానే తాళ్లాయపాలెంలో శంఖుస్థాపనకు అవసరమయిన ఏర్పాట్లు చేయడం మొదలుపెడతారు.

ఆర్టీసీ విభజనకు మరో చిన్న ఆటంకం

  ఇంతవరకు ఉమ్మడిగా సాగుతున్న ఏపీయస్ ఆర్టీసీని ఈనెల 28నుండి ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించుకోవాలని అంగీకరించాయి. అందుకోసం హైదరాబాద్ లో గల బస్ భవన్ లోనే వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు, అధికారుల కేటాయింపు కూడా పూర్తయింది. ఇక ఈనెల 25న ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి దానికి ఆమోదముద్ర వేయడం లాంచన ప్రాయమేనని అందరూ భావిస్తున్న తరుణంలో సాంకేతిక కారణం వలన ఆ సమావేశం రద్దు చేయబడింది. పాలక మండలిలో రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తగినంత ప్రాతినిధ్యం కలిగి ఉండాలనే విభజన చట్టంలో ఉన్న షరతు వలన సమావేశం కంటే ముందు రెండు రాష్ట్రాల సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడిన ఉత్తర్వులను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేయవలసి ఉంటుంది. కనుక పాలకమండలిని ఏర్పాటుచేసే వరకు సామవేశాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాయడంతో ఈనెల 25న జరగవలసిన సమావేశం రద్దు అయింది. ఆర్టీసీకి పాలకమండలిని ఏర్పాటుచేసి, సమావేశం నిర్వహించి ఆర్టీసీ విభజనకు ఆమోదం తెలిపే వరకు యాధావిదిగా ఆర్టీసీ ఉమ్మడిగానే కొనసాగుతుంది.

మనిషిని మిగిన మొసలి

  స్నానం చేయడానికి కాలువలో దిగిన ఒక వ్యక్తిని అందులో ఉన్న మొసలి మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛత్తాపూర్‌లో వున్న టైగర్ రిజర్వ్‌లో జరిగింది. దుర్జన్ యాదవ్ అనే వ్యక్తి ప్రతిరోజూ ఒక కాలువలో స్నానానికి వెళ్తూ వుంటాడు. అయితే గురువారం నాడు యాదవ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు కాలువ వద్దకు వెళ్ళి గాలింపు జరిపారు. అక్కడ లభించిన గుర్తుల ఆధారంగా దుర్జన్ యాదవ్‌ని మొసలి మింగేసిందని నిర్ధారించారు. అయితే సదరు కాలువలో మొసళ్ళు ఎక్కువగా వుంటాయని చెబుతారు. ఆ విషయం తెలిసినా ఆ కాలువలో స్నానం చేయడానికి వెళ్ళడం దుర్జన్ యాదవ్‌ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహం కోసం వెతకాలని యాదవ్ బంధువులు వేడుకుంటున్నారు. అయితే మొసళ్ళ భయంతో ఎవరూ కాలువలోకి దిగడానికి సాహసించడం లేదు.

జగన్ తలపెట్టింది ‘అసుర దీక్ష’

  వైసీపీ అధినేత జగన్ మళ్ళీ దీక్షల బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతున్న అమరావతి ప్రాంతంలో వున్న మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో ‘సమర దీక్ష’ పేరుతో ఆయన దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మరింత చికాకు పెట్టాలన్నది జగన్ ఆలోచన. అయితే ఈ దీక్షను ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ‘అసుర దీక్ష’గా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని భారీగా దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న జగన్ త్వరలో మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం అని కిషోర్ బాబు విమర్శించారు. జగన్ ఇలాంటి దీక్షలు ఎన్ని చేసినా ప్రయోజనం వుండదని ఆయన అన్నారు.

దొంగని పట్టిచ్చిన గేదె

  గేదె పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పారిపోతున్న దొంగలను కూడా పట్టిస్తుంది. నమ్మలేకపోతున్నారా? నిజంగానే ఓ గేదె దొంగని పట్టించింది. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జరిగింది. ఈ మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని ప్రవేశించారు. ఇంట్లో వున్న వారిని బెదిరించి వారి దగ్గర వున్న నగలు, నగదును దోచుకున్నారు. ఇంతలో ఆ ఇంట్లోవారు కేకలు వేయడంతో దొంగలు పరుగు అందుకున్నారు. అయితే ఆ ఇంటి ఆవరణలో కట్టేసి వున్న ఒక గేదె ఆ దొంగల్లో ఒకడిని కసిదీరా పొడిచింది. దాంతో అతను అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. మిగతావారు పారిపోయారు. పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతను కోలుకున్న తర్వాత అతని ద్వారా మిగతా దొంగల ఆచూకీ తెలుసుకుంటామని చెబుతున్నారు.

అమెరికాలో ఇండియన్ కాల్చివేత

  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సెయింట్ అగస్టీన్‌లో ఓ నిత్యావసర వస్తువుల దుకాణంలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ యువకుడు దుండగుల దాడిలో ప్రాణాలు వదిలాడు. ఆ యువకుడు పనిచేసే దుఖాణంలోకి ఇద్దరు టీనేజ్ యువకులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ప్రవేశించారు. దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ యువకులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మానవ్ దేశీ అనే భారతీయ యువకుడి మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆ భారతీయ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. గతంలో ఉత్తర కరోలినా ప్రాంతంలో నివసించిన మానవ్ దేశీ రెండు నెలల క్రితమే ఫ్లోరిడాకు వచ్చాడు. త్వరలో మానవ్ వివాహం జరగనున్నట్టు తెలిసింది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రి

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల కారణంగానే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఆస్తుల పంపిణీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. మే 28 నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్న విషయం తెలిసిందే.  

గోదావరిలో పడిన భద్రాచలం బస్సు

  ప్రయాణికులతో వున్న బస్సు భద్రాచలం వద్ద వంతెన మీదనుంచి గోదావరిలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డాడరు. సారపాక నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వంతెన ఎక్కే సమయంలో ఎడమవైపు వేగంగాదూసుకెళ్ళి తలకిందులుగా నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే నదిలో నీళ్ళలో కాకుండా నీళ్ళు లేని ప్రాంతంలోనే బస్సు పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది.30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. బస్సు పల్టీలు కొడుతూ కింద పడిపోవడంతో గాయపడినవారి సంఖ్య బాగా పెరిగింది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను నల్గొండ జిల్లా కోదాడ పట్టణానికి  చెందిన బి.శ్రీవాణి (30)గా గుర్తించారు.

ఏపీ ఎంసెట్ టాపర్లు వీరే...

  ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టాపర్ల వివరాలు ఇలా వున్నాయి. టాప్ 10 వివరాలు.... ఇంజనీరింగ్ టాప్ 10   1వ ర్యాంకు - కొండపల్లి అనిరుధ్ రెడ్డి (157 మార్కులు), 2వ ర్యాంకు - దొంతుల అక్షిత్ రెడ్డి (156 మార్కులు) 3వ ర్యాంకు - కోసూరు జోషి (156 మార్కులు) 4వ ర్యాంకు - కొడుముల ఆహ్వాన్ రెడ్డి (155 మార్కులు) 5వ ర్యాంకు - ఎం.సందీప్ కుమార్ (155 మార్కులు) 6వ ర్యాంకు - మోపర్తి సాయి సందీప్ (154 మార్కులు) 7వ ర్యాంకు - గార్లపాటి శ్రీకర్ (153 మార్కులు) 8వ ర్యాంకు - మద్దాలి యశ్వంత్ కుమార్ (153 మార్కులు) 9వ ర్యాంకు - ఒర్సు కాళేశ్వర్ రావు (153 మార్కులు) 10వ ర్యాంకు - బి.వెంకట్ నాయుడు (153) మార్కులు) మెడిసిన్ టాప్ 10   1 వ ర్యాంకు - కాడ శ్రీ విదుల్ (హైదరాబాద్ - 151 మార్కులు) 2వ ర్యాంకు - రాళ్ళబండి సాయి భరద్వాజ (హైదరాబాద్ - 150 మార్కులు) 3వ ర్యాంకు - శ్రీరామ దామిని (రంగారెడ్డి జిల్లా - 150 మార్కులు) 4వ ర్యాంకు గుండ జయ హరీష్ (వినుకొండ - 150 మార్కులు) 5వ ర్యాంకు - గజ్జల సాయి ధీరజ్ రెడ్డి (గుంటూరు - 150 మార్కులు) 6వ ర్యాంకు - అంశ్ గుప్తా (హైదరాబాద్ - 150 మార్కులు) 7వ ర్యాంకు - కోయి జగదీష్ (తెనాలి - 150 మార్కులు) 8వ ర్యాంకు -సుమయ్యా ఫాతిమా (హైదరాబాద్ - 149 మార్కులు) 9వ ర్యాంకు - శీలం చరిష్మా - (మిర్యాలగూడ - 149 మార్కులు) 10వ ర్యాంకు - మైలవరపు నాగ అనుదీప్ (విశాఖపట్నం - 149 మార్కులు)

ఎంసెట్‌లో అర్హుల శాతాలివే...

  ఇంజనీరింగ్ - 77.4 శాతం అర్హులు ఇంజనీరింగ్ విభాగంలో 77.4 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విభాగంలో కె.అనిరుధ్ రెడ్డి 157 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో వి.అచ్యుత్ రెడ్డికి రెండో స్థానం, ఆహ్వానరెడ్డికి మూడో స్థానం లభించిందని తెలిపారు.   మెడిసిన్‌ - 89.89 శాతంఅర్హులు ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 89.89 శాతం మంది అర్హత సాధించినట్టు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కె.శ్రీవిద్యుల్ (హైదరాబాద్)కి ప్రథమ ర్యాంక, సాయి భరద్వాజ్ రాళ్ళబండికి రెండో ర్యాంకు, శ్రీరామ దామినికి మూడో ర్యాంకు లభించాయి. జూన్ 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మూడు నాలుగు రోజుల్లో మెడిసిన్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని మంత్రులు తెలిపారు.