అధికారమనే అహంకారంతో రాజకీయ నేతలు
posted on Jul 3, 2015 @ 11:30AM
అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు కొంతమంది నేతలు కానీ దానికి పర్యవసానంగా లేని పోని చిక్కుల్లో పడుతున్నారు. గత వారం రోజులలోనే ఇలాంటి ఘటనలు రెండు మూడు చూశాం. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి రిజిజూ కోసం విమానాన్ని గంటసేపు నిలిపివేయడమే కాకుండా అతను ఎక్కడానికి ఖాళీ లేకపోతే అప్పటికే దానిలో కూర్చొని ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి కుటుంబసభ్యలు ముగ్గురిని విమానం నుంచి దించేశారు. అయితే ఈ వ్యవహారం గురించి మాత్రం రిజిజూ తనకేం సంబంధంలేదని, ప్రయాణికులను దింపిన విషయం తెలియదని చెప్పి తప్పించుకున్నారు.
మరో ఉదంతం డీఎంకే నేత స్టాలిన్ ది.. ఈయన చైన్నై లో కొత్తగా ప్రారంభించిన మెట్రోరైలు ప్రారంభంలో పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా తన పక్కన ఉన్న ఒక ప్రయాణికడిని పక్కకి జరగమంటూ చెంప మీద ఒకటి కొట్టారు. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో తేరుకున్న మన నేత తాను కావాలని కొట్టలేదని.. మహిళ ప్రయాణికురాలికి ఇబ్బంది కలిగిస్తున్నాడని అందుకే కొట్టానని చెప్పారు.
ఇది జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ గారి ఉందంతం.. ఈయన కూడా ఓ లేడి డాక్టర్ గారి కాలర్ సరిచేసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో అక్కడి నెటిజన్లు మంత్రి చేసిన పనికి మండిపడి ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా ఒక మహిళను కౌగిలించుకొని తన పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్న మంత్రిగారి ఉదంతం.. నేపాల్ మంత్రి హరిప్రసాద్ పరాజులి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం నేపాల్‌లో వరినాట్ల వేడుకలను వ్యవసాయశాఖ నిర్వహించడం ఆనవాయితీ. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మంత్రిగారు అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన ఓ మహిళను కౌగిలించుకొని సంచలనం సృష్టించారు. ఇంకేముంది మంత్రిగారు చేసిన ఈ నిర్వాకానికి ముందు ఎలా ఉన్నా ఒక్కసారి పదవి వచ్చిన తరువాత వారి దర్పాన్ని చూపించడానికి ప్రయత్నించి చివరికి పదవిపోయేలా చేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో తివ్రమైన విమర్శలు వచ్చాయి. ఆఖరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.