తనపై వచ్చిన ఆరోపణలకు కోహ్లీ ఫైర్...
posted on Nov 25, 2016 @ 1:00PM
టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టన్ విరాట్ కోహ్లీపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవిషయంపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవంబర్9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కోహ్లీ ఇండియా- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డాడు. ‘నిజానికి నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్(మొదటి) టెస్ట్‌లో నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్‌లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని అన్నారు. కాగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ మొహాలీలో జరగనుంది.