డిసెంబర్ 9లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!?
తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెయ్యేనుగుల బలం ఇచ్చిందా? అందుకే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం కేబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్తులు భర్తీ చేయడమే కాకుండా.. కొందరు మంత్రుల శాఖల మార్పు, కొందరికి ఉద్వాసన, కొత్త వారికి కేబినెట్ లో చోటు.. ఇలా మొత్తం కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో రేవంత్ కేబినెట్ కొలువుదీరి రెండు సంవత్సరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పాలనలో తన మార్క్ మరింత ప్రస్ఫుటంగా కనిపించేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరతూ ఇప్పటికే రేవంత్ పార్టీ హైకమాండ్ కు లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన, అదే సంఖ్యలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది రేవంత్ యోచనగా చెబుతున్నారు. అలాగే కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే ఉద్దేశం ఉందంటున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి పంపి అనుమతి కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగించాలన్నది రేవంత్ ప్రతిపాదనగా చెబుతున్నారు.
వారి స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, మహేష్ కుమార్ గౌడ్, మదన్ మోహన్ రావు, బాలూ నాయక్ లను కేబినెట్ లోకి తీసుకోవాలన్నది ఆ ప్రతిపాదనగా చెబుతున్నారు. అదే విధంగా ఆర్థిక, రెవెన్యూ, హోం, ఐటీ వంటి కీలక శాఖలను సీనియర్లకు అప్పగించాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
జూబ్లీ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదను కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా పరిశీలించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే నెల9 లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.