పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో కొత్త తిరకాసు!
తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు చెన్నైలో కూర్చుని మరీ పొత్తును పీటలెక్కించారు. స్వయంగా ఆయనే చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరంలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే’ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కే. పళని స్వామి, బీజేపీ నేత అన్నామలైలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా స్వయంగా పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు.. పొత్తుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని, అలాగే బీజేపీ నుంచి కూడా షరతులు ఏవీ లేవని స్పష్టం చేశారు. డీఎంకే దుష్ట దుర్మార్గ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఎ బ్యానర్ పై ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు.
అంత వరకు అంతా బాగుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు పొత్తు కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అయితే.. స్ట్రాంగర్ టుగెదర్ (‘కలిసి ఉంటే కలదు బలం’) అని ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే ఎన్డీఎ కూటమిలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతించారు.
నిజానికి ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు, సంప్రదింపులు జరుగతున్న నేపధ్యంలో, పొత్తు ప్రకటన పెద్దగా సంచలనం కాలేదు. అయితే పొత్తు పారాణి ఆరక ముందే.. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెపుతూ చేసిన ప్రకటన నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. చర్చకు దారి తీసింది.
అవును. ఎన్నికల వరకే పొత్తంటూ పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెప్పారు.ఎ న్నికలలో ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్నాడీఎంకే ఒప్పుకోదని స్పష్టం చేశారు. అంటే పీటల వరకే పెళ్లి, సంసారం అంటే కుదరదు అని పళని స్వామి మెలిక పెట్టారు. అంతే కాదు.. అమిత్ షా చెప్పింది కూడా అదే అని వివరణ కూడా ఇచ్చారు. అయితే వాస్తవంలో అమిత్ షా చెప్పిన దానికి, పళని స్వామి చెప్పిన భాష్యానికి పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా చాలా స్పష్టంగా పొత్తుకు తమిళ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. కానీ పళని స్వామి ఇప్పడు పొత్తుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు. అంతే కాదు.. పొత్తు ఎన్నికల వరకే, ఎన్డీఎ అధికారంలోకి వచ్చినా, బీజేపీ, ఇతర మిత్ర పక్షాలకు మంత్రివర్గంలో స్థానం ఉండదని పళని స్వామి తేల్చేశారు.
మరో వంక రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అంతేగా ..అంతేగా అంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో వుందా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ నాయకత్వం,అన్నాడీఎంకే షరతులకు తాత్కాలికంగానే అయినా ఓకే అంటుందని అంటున్నారు. నిజానికి అన్నాడీఎంకే డిమాండ్ మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించిందనీ, అలాగే పళని స్వామి తాజా డిమాండ్ ను అంగీకరించినా అంగీకరిస్తుందని అంటున్నారు.
అయితే.. పళని స్వామి రోజుల వ్యవధిలోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారు? ఇంతలో ఏమి జరిగింది.. అంటే, బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వరం నేతల విముఖతే పళని సామి యు టర్న్ కు ప్రధాన కారణం అంటున్నారు. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటును పూర్తిగా దూరం చేస్తుందని అన్నాడీఎంకే నాయకులు పొత్తును వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. అలాగే.. బీజేపీతో పొత్తు కారణంగా 2021 అసెంబ్లీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కూడా పొత్తు వద్దనడానికి కారణంగాచెపుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్నా ఫలితం లేక పోయింది. అన్నాడీఎంకే సీట్ల సంఖ్య 136 నుంచి 75కి పడి పోయింది. అధికారం అన్నాడీఎంకే చేజారింది. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 20 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అయితే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 33 సీట్లలో పోటీ చేసినా అన్నాడీఎంకేకి ఆ ఒక్క సీటే దక్కింది.
అందుకే ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపట్ల అన్నాడీఎంకేలో విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే, పళని స్వామి యు టర్న్ తీసుకున్నారని అంటున్నారు.
అయితే.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలం మెల్ల మెల్లగా పెరుగుతోందని అంటున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా బీజేపీకి 3-4 శాతం మధ్యనే ఓట్లు పోలయ్యాయి. కానీ, 2024 లోకసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకున్నా బీజేపీ ఓటు 7.58 శాతం పెరిగింది. 11 శాతానికి పైగా ఓట్లు బీజేపే సొంత చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బీజేపీతో మళ్ళీ పొత్తుకు సిద్దమైంది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో పళని స్వామి అటూ ఇటూ అవుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పళని స్వామి వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినా.. డీఎంకేను ఎదుర్కోవాలంటే బీజేపీ ఓటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అన్నాడీఎంకేకు అవసరం అవుతుందనీ, అలాగే బీజేపీకి కూడా దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేనతో ఎలాగైతే పొత్తు అవసరమో.. అదే విధంగా తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు అనివార్యమని అంటున్నారు. సో .. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నా చివరాఖరుకు పొత్తు పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.