జూబ్లీ గెలుపు.. నవీన్ యాదవ్ కు రాహుల్ అభినందన

ప్రతిష్టాత్మక  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది.   ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన విజయంపై రాహుల్  సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్‌ సూచనలు ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 

కేటీఆర్ పరాజయాల హ్యాట్రిక్!

కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత  జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు.  సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.   పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.   

జూబ్లీలో ఓటమిని కేసీఆర్ ముందే ఊహించారా?

బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.   జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని  అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.  జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో  పార్టీ క్యాడర్ కూడా ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 

జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం క్యాడర్?!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీని ముందుండి నడిపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో ఇటు జనంలోనే కాకుండా పార్టీ హైకమాండ్ వద్ద కూడా రేవంత్ ఇమేజ్ ఇనుమడించిందనడంలో సందేహం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందనుకున్న జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. అయితే పోలింగ్ ముగిసి ఫలితం వచ్చిన తరువాత.. ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం క్యాడర్ మద్దతు ఎవరికి లభించింది? అందుకు కారణమేంటి? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు.  ఇందుకు కారణాలు కూడా పరిశీలకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి  శ్రీశైలం యాదవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన తెలంగాణలో తెలుగుదేశం నాయకులు, శ్రేణులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే గతంలో తెలుగుదేశంలో అత్యంత కీలకమైన, బలమైన నాయకుడైన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో అభిమానం చెక్కు చెదరలేదు. ఈ కారణంగానే జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం క్యాడర్, ఆ పార్టీ మద్దతుదారులు, అభిమానులు మొత్తంగా కాంగ్రెస్ కు అండదండగా నిలిచారని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా వచ్చింది. మాగంటి గోపీనాథ్ కూడా గతంలో తెలుగుదేశం నాయకుడే. 2019, 2023 ఎన్నికలలో మాగంటి విజయం వెనుక ఉన్నది తెలుగుదేశం క్యాడరే. అయితే రాష్ట్రంలో మారిన  పరిస్థితి,  మాగంటి మరణం తరువాత తెలుగుదేశం  క్యాడర్ బీఆర్ఎస్ కు దూరం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే తెలుగుదేశం క్యాడర్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచిందని చెబుతున్నారు.  

మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రా అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక  పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను సిట్ అరెస్టు చేసింది. ఈ అనిల్ ఛోఖ్రా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్ల నగదును డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సిట్ పేర్కొంది. అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.  క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌, విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో  సృష్టించిన ఈ కంపెనీల ఖాతాల్లోకి  లిక్కర్ సొమ్మును జమ చేసి,  అనంతరం ఆ నిధులను మరో 32 వేర్వేరు ఖాతాలకు బదిలీ  చేసి, బ్లాక్ మనీని వైట్ గా మార్చే మార్చే ప్రయత్నం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా ఉండగా  అనిల్ చోఖ్రా గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. 2017, 2021 సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ చోఖ్రాను మనీలాండరింగ్ కేసుల్లో రెండు సార్లు అరెస్టు చేసినట్లు తెలిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, ఈ అనిల్ చోఖ్రా లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్‌గా మార్చేందుకు మద్యం స్కామ్ నిందితులు ఆయన్ను సంప్రదించినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ పేర్కొంది. భారీగా కమీషన్ తీసుకుని మరీ అనీల్ చోఖ్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయంతో  అనిల్ చోఖ్రాపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, గురువారం  (నవంబర్ 13)న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో  మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చిన సిట్ అతడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

బీహార్ ప‌వ‌న్ చిరాగ్ పాశ్వాన్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల శ్ర‌మ ఆపై రెండు ఎన్నిక‌ల ప్ర‌యోగాలు చేసి, అటు పిమ్మ‌ట మూడో ఎన్నిక‌ల్లో సాధించిన హండ్రెడ్ పర్సెంట్ విక్ట‌రీ ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాకిందా అంటే.. ఔననే చెప్పాల్సి వస్తోంది.  త‌మిళ‌నాడులో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి  ప‌వ‌నే అతి  పెద్ద ఇన్ స్పిరేష‌న్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ  సీట్ల‌ను ఎలా కైవ‌సం  చేసుకున్నారో.. అక్క‌డ బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ 75 శాతం స్ట్రైక్ రేట్ తో ప‌వ‌న్ ని తలపింపచేశారని పరిశీలకులు అంటున్నారు.  బీహార్ గ‌త కాల‌పు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన రామ్ విలాస్ పాశ్వాన్ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ లోక్ జ‌న  శ‌క్తి పార్టీని ముందుకు తీస్కెళ్తున్న యువ కెర‌టం  చిరాగ్ పాశ్వాన్. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ  29 సీట్ల‌కు పోటీ చేయ‌గా వాటిలో 19 స్థానాలలో విజయం సాధించింది.  గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఐదు ఎంపీ  సీట్ల‌ను గెలిచింది. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా చిరాగ్ పాశ్వాన్ దూసుకెళ్తున్నారు. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  చిరాగ్  సైతం బీహార్ లో ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగా చెబుతున్నారు చాలా మంది.

బిహార్‌‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం... బీజేపీకి అత్యధిక స్థానాలు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి 199 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాదాపు 203 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 90 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 82 సీట్లు గెలిచాయి. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ 18 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో కొనసాగుతుంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 35  స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.  ఆర్జేడీ 23 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ ఐదు స్థానల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

పడిలేచిన కెరటాలు...ఏపీలో పవన్ బీహార్‌లో చిరాగ్

  బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే పోత్తులో భాగంగా పోటీ చేసిన 5  ఐదు ఎంపీలు విజయం సాధించి పట్టు నిలుపుకున్నాది. సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు.  2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు పైగా పోటీ చేసి కేవలం ఒకేఒక స్ధానంలో గెలిచారు. బాబాయ్‌తో విభేధాలు 2021లో పార్టీ చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. ఈ విజయాన్ని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలైన బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మరో 49  స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జేడీయూ 17 స్థానాల్లో గెలిచి మరో 61 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో అధిక్యంలో ఉంది.నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.  

బీహార్ లో కనీసం బోణీ కొట్టని ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో  ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది.  జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు.  రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు.   అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  

బీహార్ లో గెలుపు ముంగిట ఎన్డీయే.. చంద్రబాబు హర్షం, అభినందన

బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.  బీహార్‌లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.    ఈ సందర్భంగా ఆయన నితీశ్ కుమార్‌కు, బీజేపీ, జేడీయూ విజేతలకు   శుభాకాంక్షలు తెలిపారు.  తన పోస్టుకు చంద్రబాబు నరేంద్రమోడీ, నితీష్ కుమార్ పేర్లను కలుపుsp ఎన్ఎఎన్ఐ (NaNi)  #NaNiLandslideInBihar అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.  జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించారు.  

సెంచరీకి చేరువలో రాహుల్ గాంధీ ఓటములు...బీజేపీ సైటర్లు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటములకు చిహ్నంగా రాహుల్ గాంధీ మారారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని తెలిపారు. 2004 నుంచి  2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓడిపోయిన  మ్యాప్‌ను కూడా మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరో ఎన్నిక, మరో ఓటమి ఎలక్షన్  ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే మొత్తం రాహుల్‌కే వస్తాయి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే  కూటమి దుందుభి మోగించింది. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటేసి, 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 84  జేడీయూ 78 ఎల్‌జేపీ 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉండగా కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ విజయం.. జూబ్లీ ఫలితంపై కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘనవిజయం సాధించారు. ఈ పరాజయంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్  నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.  ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గడపదాటి రాని కేసీఆర్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఆరోపణలు, విమర్శలు గుప్పించడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అధినేతగా ప్రచార బాధ్యతలను మోయాల్సిన కేసీఆర్.. అసలు ప్రచారానికే రాకపోవడం బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.  ఒక జూబ్లీ ఓటమిపై మీడియా సమావేశంంలో స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్కి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  గెలుపు ఓటములు సహజమన్న కేటీఆర్ 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని గుర్తు చేశారు.  ఈ ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 

బీహార్ లో ఎన్డీయే హవా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే ట్రెండ్స్ ను బట్టి ఈ ఎన్నికలలో ఘన విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా తేలిపోయింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్   49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.ఎన్డీయే కూటమిలో బీజేపీ  84 స్థానాల్లోనూ, జేడీయూ 80 స్థానాల్లో  ముందంజలో ఉన్నాయి.   శుక్రవారం(నవంబర్ 14) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే మెజారిటీ స్థానాలలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.   కాగా ఈ ట్రెండ్ చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు రాజా అన్నారు. ప్రచారంలో మహాఘట్ బంధన్, తేజస్వీ యాదవ్ ల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.  ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ బీహార్ ఫలితాలను చూసిన తరువాతైనా పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కేవలం ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోదనీ, కూర్చుని ఆలోచించాలనీ, ఎం తప్పు జరిగింది? ఎక్కడ జరిగింది అన్న విషయాలపై పార్టీలో విస్తృత చర్చ జరగాలని, వ్యూహాత్మక, సంస్థాగల తప్పులు ఏమిటన్నదానిపై అధ్యయనం జరగాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.   ఇక బీహార్ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జన సురాజ్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పార్టీ మొత్తం స్థానాలలో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యాయి. 

వెనుకంజలో తేజస్వీ యాదవ్... లాలూ కంచుకోట బద్దలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన సొంత నియోజకవర్గం రాఘోపూర్‌లో వెనుకంజలో ఉన్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 3,230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ అధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీకి, లాలూ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన రాఘోపూర్ నియోజకవర్గంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి తర్వాత 2015 నుంచి తేజస్వి యాదవ్ ఇక్కడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2020లో తేజస్వి ఇదే నియోజకవర్గం నుంచి 38,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఈ స్థానం విషయంలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా సతీశ్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దించింది. సతీశ్ కుమార్ కూడా రాఘోపూర్‌లో గణనీయమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా, 2010లో జేడీయూ తరఫున పోటీ చేసి రబ్రీ దేవిని ఓడించడం ఆయనకు పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ తరఫున ప్రేమ్ కుమార్ పోటీలో ఉండటం గమనార్హం. ఈ బహుముఖ పోటీ వల్ల ఓట్లు విపరీతంగా చీలుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో  బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీ బైపోల్ లో డిపాజిట్ గల్లంతు కావడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతే కాదు.. షేక్ పేట్ డివిజన్ లో కమలం పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు.  బీజేపీ జూబ్లీ బైపోల్ లో ఓటమిని ప్రచార పర్వంలోనే అంగీకరించేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక అంటూ చేసిన కామెంట్ తో ఆ పార్టీ శ్రేణులు సైతం ఓటమి ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే కనీసం డిపాజిట్ కూడా రానంతగా బీజేపీ చ తికిల పడుతుందని పరిశీలకులు కూడా ఊహించలేదు. బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఒకింత పట్టు ఉందని అంతా భావిస్తారు. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ పట్టు అంతంత మాత్రమేనని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 9100 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలో తనకు డిపాజిట్ రాకపోవడంపై స్పందించిన అభ్యర్థి దీపక్ రెడ్డి.. జూబ్లీ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావం అధికంగా ఉందన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 

పాతికవేల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మెజారిటీ సాధించింది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.  తొలి రౌండ్ నుంచీ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అంతే కాకుండా రౌండ్ రౌండ్ కూ ఆ అధిక్యత పెరుగుతూ వచ్చింది.  ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ లోనూ, నవీన్ యాదవ్ కార్యాలయంలోనూ కాంగ్రెస్ నేతలు, శ్రేణులూ మిఠాయిలు పంచుకుని, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విజయాన్నిపురస్కరించుకుని గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.   జూబ్లీ ఉప ఎన్నిక విజయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలుపుగా ఆయన అభివర్ణించారు.   కాగా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్.. ఈ విజయం ఊహించిందేనన్నారు. ఈ  ఉప ఎన్నికలో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుఅయ్యి చేసిన రాజకీయాలు ఫలించలేదన్నారు.   బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించిందన్నారు. ఈ విజయం విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  

షేక్ పేట్ డివిజన్ లో బీజేపీ స్కోరు జీరో ఓట్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైన క్షణం నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గట్టిపోటీయే ఇచ్చినా వెనుక బడ్డారు. కానీ ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం మాదే.. అందుకు జూబ్లీ విజయంతో తొలి అడుగు వేస్తాం అంటూ  గొప్పలు చెప్పుకున్న బీజేపీ జూబ్లీ బైపోల్ లో అసలు పోటీయే ఇవ్వకపోవడం. జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జూబ్లీ ఉప ఎన్నికలలో ఘోరంగా పెర్ఫార్మ్ చేసింది. కౌంటింగ్ పూర్తి కాకముందే ఓటమి అంగీకరించేసి ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి వేంచేశారు. సరే రాజకీయపార్టీకి గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకోవడానికి కూడా లేనంత ఘోర పరాభవం బీజేపీకి జూబ్లీ ఉప ఎన్నికలో ఎదురైంది. అదెలా అంటారా? కమలం పార్టీలో షేక్ పేట డివిజన్ లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు. ఔను నిజం.. ఓట్ల లెక్కింపులో భాగంగా   షేక్ పేట డివిజన్ లో ఓట్ల లెక్కింపులో బీజేపీ జీరో ఓట్లు స్కోర్ చేసింది. దీంతో కమలం నేతలు షాక్ కు గురయ్యారు. కనీసం ఆ పార్టీ తమ ఏజెంట్లుగా పెట్టుకున్న వారు కూడా బీజేపీకి ఓటు వేయలేదన్న సంగతి తేటతెల్లమైంది.  బీజేపీ పరిస్థితి భాగ్యనగరంలో ఇంత ఘోరంగా ఉందా అని ఆ పార్టీ వ్యతిరేకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యత 19వేల ఓట్లు

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 19 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ జరిగిన ఏడు రౌండ్లలోనూ నవీన్ యాదవ్ కే ఆధిక్యత లభించింది.  రౌండు రౌండు కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ పార్టీ ఏజెంట్లు బయటకు వచ్చేశారు. ఇక బీజేపీ  అభ్యర్థి దీపక్ రెడ్డి అయితే ఐదో రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కాంగ్రెస్ గెలుపు సంబరాలు ఆరంభించేసింది. గాంధీ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. 

ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ మెజారిటీ 12 వేలకు పైనే

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 651   ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ ఇక్కడ మూడో స్థానానికే  పరిమితమైంది. ఇప్పటివరకూ పూర్తయిన ఐదు రౌంట్ల ఓట్ల లెక్కింపులోనూ ప్రతి రౌండ్ లోనూ అనిల్ యాదవ్ కుఆధిక్యత వచ్చింది.  నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 42 వేల 126 వోట్లు, మాగంటి సునీతకు 33 వేల 978 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 6, 856 ఓట్లు వచ్చాయి.