స్థానిక ఎన్నికలు.. కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి?

తెలంగాణలో స్థానిక నగారా మోగింది.  బీఆర్ఎస్ పుంజుకుంటుందా? బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుస్తుందా?  వంటి అంశాలకన్నా.. ఇప్పుడు  రాజకీయ వర్గాలలో  కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి? అన్నదానిపైనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ సభ్యత్వంలో సహా పార్టీకి రాజీనామా చేసేశారు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా చెబుతున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఆమె అభ్యర్థులను నిలబెడతారా? నిలబెట్టి గెలిపించుకోగలరా? లేకుంటే ఆమె అభ్యర్థులను పోటీలో పెట్టడం వల్ల బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆమె విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు మంగళవారం (సెప్టెంబర్ 30) తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే క్షణం  ఆలస్యం చేయకుండా తెలంగాణ జాగృతి ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు.   బతుకమ్మ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళిన‌ కవిత అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. రెండు దశాబ్దాల పాటు తాను తెలంగాణ కోసం, బీఆర్ఎస్ కోసం అన్నీ వదులుకుని పని చేశానని చెప్పుకున్నారు. పార్టీ తనను వద్దనుకుంది కనుకనే రాజీనామా చేశాననీ చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగా కవిత తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదీ కాక హైదరాబాద్ వచ్చీ రావడంతోనే   జాగృతి నేతలతో భేటీ కావడంతో ఆమె కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒక వేళ  స్థానిక  ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరుపున పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే.. బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తీ రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆమె జాగృతి తరఫున అభ్యర్థులను నిలబెడితే.. బీఆర్ఎస్ పై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.  రాష్ట్రంలో మూడు ద‌శ‌ల్లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు, రెండు ద‌శ‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంచాయ‌తీల్లో పార్టీ గుర్తుపై ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోయినా, పార్టీలు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులే రంగంలోకి దిగుతారు. ఇక‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తుల‌పైనే జ‌రుగుతాయి. పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ఎస్‌ల ఉంటుందన్న అంచనాలు ఉన్నప్పటికీ ఏదో మేరకు బీజేపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపితే సీన్ మారిపోయే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.   కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆ పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ పై మాత్రం ఈగ వాలనీయడం లేదు. తండ్రి సెంటిమెంట్ ను బలంగా పండిచడం కోసం ఆమె ఇటీవల తండ్రి సొంత ఊరైన చింతకుంటకు వెళ్లి మరీ తెలంగాణ సంబురాలలో పాల్గొని వచ్చారు. ఈ నేపథ్యంలో కవిత తెలంగాణ జాగృతి తరఫున స్థానక సమరంలోకి దిగితే.. ఆమె కచ్చితంగా త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతోనే ప్రచారం నిర్వహిస్తారు. ఇది అనివార్యంగా బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమే అంటున్నారు.  ఆమె వల్ల బీఆర్ఎస్ నష్టపోవడమే కాదు.. కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరడం కాడా  ఖాయమంటున్నారు.

హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (సెప్టెంబర్ 30) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్‌షోలు నిర్వహిస్తూ ఇప్పటికే పారిశ్రామిక వేత్తలను  ఏపీకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో   ఐటీసీ మౌర్యలో జరిగే ఈ పార్టనర్ షిప్ కర్టెన్ రైజన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ అవుతారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి బుధవారం (అక్టోబర్1)న ఢిల్లీ నుంచి నేరుగా   విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి గజపతి నగరం దత్తి గ్రామం   వెడతారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అమరావతి చేరుకుంటారు.  

జగన్ డిజిటల్ బుక్.. తొలి ఫిర్యాదు మాజీ మంత్రి విడదల రజినిపైనే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆర్భాటంగా డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారు. ఈ బుక్ లో వైసీపీ కార్యకర్తలు తమను వేధించిన వారిపై ఫిర్యాదులు నమోదు చేస్తే.. తాను అధికారంలోకి వచ్చాకా, వారి సంగతి తెలుస్తానని అన్నారు. చాలా మంది ఈ డిజిటల్ బుక్ ను గత ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ కు మక్కీకి మక్కీ కాపీ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అది పక్కన పెడితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ బమూరాంగైందన్న సెటైర్లు సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఇప్పుడు వేధింపులపై ఫిర్యాదులు నమోదు చేయండి అంటూ.. జగన్ డిజిటల్ బుక్ ను ఇలా ప్రారంభించారో లేదో.. అలా  ఆ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఎవరిపైనో తెలుసా? వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై. ఔను డిజిటల్ బుక్ లో నమోదైన తొలి ఫిర్యాదు విడదల రజినీ పైనే..  జగన్ హయాంలో విడదల రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు ఇలా లెక్కలేనన్ని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు విడదల రజినీపైనే రావడంతో జగన్ డిజిటల్ బుక్ సొంత పార్టీ వారిపై వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకుంటుదా అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతున్నది. ఇంతకీ రజినిపై ఫిర్యాదు ఏమిటంటే..  చిలుకలూరిపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు.. సొంత పార్టీకి అండగా ఉండే వారిని కూడా టార్గెట్ చేశారు. నవతరం  అనే పార్టీకి స్వయం ప్రకటిత అధ్యక్షుడైన   రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. 2022లో  రజినీ మంత్రిగా ఉన్న సమయంలో  తన కార్యాలయం, నివాసంపై దాడులు చేయించారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ దాడికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన  ఆ ఫిర్యాదుకు జోడించారు.  విడదల రజినిపై చర్యలు తీసుకుంటేనే వైసీపీ కార్యకర్తలు జగన్ ను నమ్మతతారనీ, లేకపోతే కార్యకర్తలలో జగన్ విశ్వాసాన్ని కోల్పోతారని ఆ సుబ్రహ్మణ్యం అంటున్నారు.  వాస్తవానికి చిలుకలూరిపేట  ఎమ్మెల్యేగా విడదల రజిని ఉన్న సమయంలోనూ, అలాగే ఆ తరువాత జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలోనూ  రజినిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతెందుకు ఆమె మరిదిని పోలీసలు అరెస్టు చేశారు కూడా.  అధికారంలో ఉన్నప్పుడు ఆమె సొంత పార్టీ వారిపై కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో రజినిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడంతో.. ముందు ముందు వైసీపీ నేతలపైన డిజిటల్ బుక్ లో మరెన్ని ఫిర్యాదులు నమోదౌతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలలేరని గుంటూరుకు పంపించారు. అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో..తనకు పేటనే మంచిదని చెప్పి మళ్లీ అక్కడికే ఇంచార్జ్ గా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షురూ!

తెలంగాణ రాజకీయాల్లో  పెను సంచలనంగానూ, తీవ్ర చర్చనీయాంశంగానూ మారిన  ఎమ్మెల్యేలపై అనర్హత   పిటిషన్లపై  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు.  ఈ విచారణ సోమవారం (సెప్టెంబర్  29) అసెంబ్లీ భవనంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ మొదలైంది.  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం  కింద జరుగుతున్న ఈ విచారణకు తొలుత‌ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తనఅడ్వకేట్లతో కలిసి హాజరయ్యారు.  ఆయన తరువాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు తమతమ అడ్వకేట్లతో కలిసి విచారణకు హాజరయ్యారు.  అలాగే ఈ పిటిషన్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌ కూడా  విచారణకు హాజరౌతారు. ఎమ్మెల్యేల అనర్హత విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంక్షలు కూడా విధించారు. ఈ భద్రతా ఏర్పాట్లూ, ఆంక్షలూ వచ్చే నెల 6వ తేదీ వరకూ అమలులో ఉంటాయి.   

హక్కుల కోసం పీవోకేలో ప్రజాందోళన.. మరో జెన్ జడ్ కానుందా?

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో  జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీవోకే ప్రజలపై రాజకీయ, ఈర్థిక అణచివేతకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అవామీ యాక్షన్ లీగ్ పిలుపు మేరకు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.  సోమవారం (సెప్టెంబర్ 29) నుంచీ షట్టర్ డౌన్, వీల్ జామ్  పేరుతో నిరవధిక బంద్‌ పాటిస్తున్నట్లు అవామీ యాక్షన్ లీగ్ పేర్కొంది. పాకిస్థాన్  ఆక్రమణ నుంచి విముక్తి కావాలంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ లీగ్  38 డిమాండ్లలో ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్నది. వాటిలో ప్రధాన డిమాండ్ పీవోకే అసెంబ్లీలో  పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా ముందుకు తీసుకువచ్చింది.  అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలనీ,   విద్యుత్ చార్జీలను తగ్గించాలని కూడా జనం కోరుతున్నారు. ఏడు దశాబ్దాలుగా పీవోకే ప్రజలు కనీస ప్రాథమిక హక్కులు కూడా లేకుండా దుర్భర జీవితాలను గుడుపుతున్నారనీ, ఇప్పుడు హక్కుల కోసం నినదిస్తూ ఆందోళనకు దిగారనీ అవామీ యాక్షన్ లీగ్ చెబుతోంది. ఇప్పటికైనా పీవోకే ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వకుంటే ప్రజాగ్రహం మరింత పెచ్చరిల్లడం తథ్యమని హెచ్చిరించింది.   ఇలా ఉండగా పీవోకేలో ఆందోళనలను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పీవోకే అంతటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పెద్ద ఎత్తున దళాలను తరలించింది. అంతే కాకుండా ఆదివారం (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి నుంచీ పీవోకే వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. పీవోకేలోకి ఎవరూ ప్రవేశించకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా దిగ్బధనం చేసింది.  మరో వైపు పీవోకే అధికారులు అవామీ యాక్షన్ లీగ్ ప్రతినిథులతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  దీంతో పీవోకేలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

మోగిన స్థానిక నగారా!

తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా మోగింది.  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయి. తొలి రెండు దశలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు,  ఆ తరువాత మూడు దశలలో వార్డు, సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతాయి.  ఈ నెల  30లోగా  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు ప్రభుత్వం కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని తెలిపింది.  దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 23, 27 తేదీలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు  నవంబర్ 11న కౌంటింగ్ జరిపి ఫలితాలను విడుదల చేస్తారు.  ఇక వచ్చే నెల 31, నవంబర్ 4, 8 తేదీలలో వార్డు, సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.   రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం 42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనే.  అయితే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  

పరామర్శలోనూ ప్రగతి, సంక్షేమంపైనే చర్చలు!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర, ప్రగతి, ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతల చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఆదివారం (సెప్టెంబర్ 28) చోటు చేసుకుంది. గత ఐదారు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కూడా ఇరువురి మధ్యా అధికారిక కార్యక్రమాలపైనా, రాష్ట్రప్రగతి, ప్రజాసంక్షేమంపైనే చర్చ జరిగింది. తొలుత చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇందుకు పవన్ కల్యాణ్ జ్వరం నియంత్రణలోకి వచ్చిందనీ, అయితే దగ్గు మాత్రం తగ్గలేదనీ చెప్పారు. అక్కడితో ఆగకుండా గత ఐదు రోజులుగా తాను అధికారిక కార్యక్రమాలలో పాల్గొన లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్యా అక్టోబర్ మాసంలో కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది.   వీరిరువురి మధ్యా భేటీలో మెగాడీఎస్సీ సక్సెస్ ప్రస్తావన కూడా వచ్చింది.  అలాగే వచ్చే నెల 4 నుంచి ప్రారంభించనున్న ఆటో డ్రైవర్ల సేవలోపథకం, . స్త్రీ శక్తిద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై చర్చించారు.  అదే విధంగా వచ్చే నెల 16న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై కూడా చర్చ జరిగింది.  

ఇప్పుడు తెలిసిందా విజ‌య్‌..రాజ‌కీయాలంటే ఏంటో!

  తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి ఎంతో కాలం కాలేదు. జ‌స్ట్ కొన్ని నెల‌లు మాత్ర‌మే అయ్యింది. గ‌తేడాది పార్టీ పెట్టిన విజ‌య్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో నేరుగా స్టాలిన్ పార్టీని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎవ‌రితో పొత్తుల్లేవ్ ఒంట‌రిగా వ‌స్తా అంటూ బీరాలు ప‌లికాడు. ఇప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌చారానికి 40 మంది ప్రాణాల‌ను బ‌లి తీస్కున్నాడు. అంతే కాదు మీడియా ఈ విషాద‌ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించ‌డానికి ట్రై చేస్తే ఎయిర్ పోర్టులో మొహం చాటేసుకుని వెళ్లిపోయాడు. ఆపై త‌న గుండె బ‌ద్ధ‌లై పోయింద‌ని.. ఇప్పుడు నేను చెప్ప‌న‌ల‌వి కాని బాధ‌లో ఉన్నాన‌నీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నాడు. ఇంకా రాజక‌ీయ అరంగేట్రంలో బోణీ కొట్ట‌కుండానే.. ఆయ‌న ఖాతాలో ఇన్నేసి ప్రాణాలు. ఇపుడీ చితికిన బ‌తుకుల‌కు బాధ్యులెవ‌రు?  మృతుల్లో పిల్ల‌లు ఏడుగురు, మ‌హిళ‌లు 17 మంది వ‌ర‌కూ ఉండ‌గా.. 12 మంది ప‌రిస్తితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు క‌రూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు. అనుకున్న షెడ్యూల్  ప్ర‌కారం కాకుండా విజ‌య్ నాలుగు గంట‌లు ఆల‌స్యంగా రావ‌డ‌మే అస‌లు కార‌ణంగా చెబుతున్నారు. ఎండ‌లో భారీ ఎత్తున త‌మ అభిమాన న‌టుడి కోసం ఎదురు చూసి చూసిన జ‌నం.. ఆయ‌న వ‌చ్చేస‌రిక‌ల్లా డీలా ప‌డిపోయారు. ఒంట్లో శ‌క్తి లేక నీర‌సించి పోయారు.  అప్ప‌టికీ విజ‌య్ త‌న ప్ర‌సంగం ఆపి.. నీళ్ల బాటిళ్లు విసిరేశారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఈ లోగా క‌రెంటు పోవ‌డంతో ఎవ‌రు ఎక్క‌డ ఎలా చిక్కారో తెలీదు. అంతా అగ‌మ్య‌గోచ‌రం. దీంతో ప‌రిస్తితి అదుపు త‌ప్ప‌డం. వారిలో పిల్ల‌లు, మ‌హిళ‌లు చిక్కుకోవ‌డంతో ఇదీ ప‌రిస్థితి. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందే ఊహించిన స్టాలిన్ స‌ర్కార్ అప్ప‌టికీ ఆంక్ష‌లు విధించింది. అయినా స‌రే హైకోర్టుకెళ్లి వాటిని స‌వ‌రించుకుని మ‌రీ విజ‌య్ ఈ స‌భ ఏర్పాటు చేశారు. స‌మ‌యానికి రావ‌ల్సిన వాడు కాస్తా ఆల‌స్యం చేయ‌డంతో.. ఇంత విషాద‌ఘ‌ట‌న‌కు దారి తీసిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ‌కీయాలంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు.. జ‌నం నాడి ప‌ట్ట‌డం అంత తేలిక కాదు. ఇప్పుడీ విషాదం ఆయ‌న పార్టీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటుంది. సీఎం స్టాలిన్ అయితే క‌రూర్ కి ఆదివారం రావ‌ల్సింది శ‌నివార‌మే చేరుకున్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్  దుబాయ్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుని మ‌రీ ఘ‌ట‌నా స్థ‌లి  చేరుకున్నారు.  ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి చూస్తే త‌న పార్టీకి ప్ర‌చారంగా మారాల్సిన స‌భ కాస్తా దుష్ప్ర‌చారానికి వేదికైంది. ఇప్ప‌టికే స్టాలిన్ స‌ర్కార్ మృతుల‌కు 10 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు ల‌క్ష ప్ర‌క‌టించారు. సినిమాకు వంద కోట్ల  మేర తీస్కునే విజ‌య్.. మ‌రి ఈ  ప్రాణాల‌కు ఎంత ఖ‌రీదు క‌డ‌తారో తేలాల్సి ఉంది.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

మండలిలో కాఫీ లొల్లి!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శనివారం (సెప్టెంబర్ 27) కాఫీపై వైసీపీ సభ్యులు రచ్చరచ్చ చేశారు. చర్చించడానికి ప్రజాసమస్యలేవీ లేవన్నట్లుగా శాసనమండలిలో కాఫీకీ, అసెంబ్లీలో కాఫీకీ తేడా ఉందంటూ రెచ్చిపోయి సభను స్తంభింపచేశారు. విషయమేమిటంటే   శాసనసభలో అందించే కాఫీకి, శాసనమండలిలో అందించే కాఫీకి నాణ్యతలో తేడా ఉంటోందని మండలి చైర్మన్ మోషెన్ రాజు ఆరోపించారు. దీనిపై వైసీపీ సభ్యులు కాఫీతో పాటు భోజనాల విషయంలో కూడా వివక్ష చూపిస్తు న్నారంటూ ఆరోపణలు గుప్పించారు. రెండు సభల్లోనూ ఒకే నాణ్యతతో ఆహార పదార్థాలు అందించాలని చైర్మన్ అన్నారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం విషయాన్ని అంతటితో వదిలేయకుండా.. కాఫీపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో మండలి చైర్మన్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.  కాగా ఈ విషయంపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తూ మండలి, అసెంబ్లీలలో ఒకే నాణ్యతతో ఆహారం ఇస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే పునరావృతం కాకుండా చూస్తామన్నారు.  

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ జీవోపై హైకోర్టులో పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  బీసీ రిజర్వేషన్ల  జీవో విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందనీ, నేడో, రేపో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయనీ అంతా భావిస్తున్న తరుణంలో ఆ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే  డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సీఎంకు అందజేశారు. అలాగే ఆయా స్థానాలకు  అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.   ఈ తరుణంలో  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్​ 9పై  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కేశవాపూర్‌ గ్రామానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో శనివారం (సెప్టెంబర్ 27) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయనే గతంలో కూడా  బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి   ప్రభుత్వం   జీవో విడుదల చేయలేదు. దీంతో ఆయన పిటిషన్ ను అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. పత్రికలలో కథనాల ఆధారంగా దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మాధవరెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

15 నెలల్లో 4లక్షలకు పైగా ఉద్యోగాలు.. అసెంబ్లీ వేదికగా జాబ్ డేటా

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 15నెలల కాలంలోనే గణనీయంగా ఉద్యోగాల సృష్టిజరిగింది. దీనిపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగాయన్నదానిపై గణాంకాలతో సహా వివరించారు. గత 15 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మొత్తం 4,71,574 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల 941 పోస్టులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో 9,093 ఉద్యోగాలు ఇక పోలీసు శాఖలో  6వేల వంద పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాబ్ మేళాల ద్వారా 92 వేల149 మందికి ఉపాధి లభించిందన్నారు. వర్క్ ఫ్రం హోం మోడల్ లో 5 వేల 500 అవకాశాలు దక్కాయి.  ఉద్యోగ కల్పనలో అధిక శాతం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ప్రధానంగా  ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్‌ఎంఈలు వంటి పరిశ్రమలలో 3లక్షల 48 వేల 891 మందికి ఉద్యోగాలు లభించాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకూ ఉద్యోగాలు లభించిన వారి పేర్లు, వారి హోదా, ఎక్కడ పని చేస్తున్నారు వంటి అన్ని వివరాలతో  పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్సల ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామనీ, ఇప్పటి వరకూ జరిగింది ప్రారంభం మా్రతమేననీ రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయనీ వివరించారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ షెడ్యూల్

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ కార్యాలయం  శనివారం (సెప్టెంబర్ 27)షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ అధికా రంలోకి వచ్చిన తరువాత..  బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.   భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే   కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే  మహిపాల్​రెడ్డి లు తెరాస గూటిని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతొ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. దీంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు తాము  బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నట్లు ఆ నోటీసులకు బదులు ఇచ్చారు. దీంతో  స్పీకర్ వారిని విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు మహిపాల్​రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు.  

లడక్.. నాడు సంబరాలు.. నేడు ఆగ్రహ జ్వాలలు కారణమేంటి?

సరిగ్గా ఆరేళ్ల కిందట లడక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పండుగ జరుపుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ఏర్పడాలన్న తమ స్వప్నం సాకారమైందంటూ అనందంతో పరవశించిపోయారు అయితే సరిగ్గా ఆరేళ్లు తిరిగే సరిగి.. లడక్ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడికిపోతోంది.  నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. పోలీసు కాల్పులతో మరణాలు సంభవించాయి. ఆంక్షలు, కర్ఫ్యూలతో లడక్ ఉద్రిక్తంగా మారిపోయింది. ఆరేళ్ల నాటిసంబరాలు ఆవిరై ఇప్పుడు ఆగ్రహజ్వాలలుగామారడానికి కారణమేంటి? పరిస్థితి ఇలా మారడానికి వెనుక ఎవరున్నారు? అసలు  లడక్ ప్రజలు కోరుకుంటున్నదేమిటి?   ఈ ప్రశ్నలకు   లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయడంతోనే వారి డిమాం డ్లన్నీతీరిపోయినట్లేనని కేంద్రం భావించడమే ఇప్పటి ఈ పరిస్థితికి కారణమన్నదే సమాధానంగా వస్తున్నది. ఎందుకంటే లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే యూనియన్ టెరిటరీగా  మార్చడం పట్ల వ్యక్తం చేసిన ఆనందం, చేసుకున్న సంబరాలు ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా పడిన మొదటి అడుగుగా భావించడమేనని పరిశీలకులు అంటున్నారు. స్థానిక పాలన, తమ సాంస్కృతిక ప్రత్యేకతలను కాపాడుతూ లడక్ ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చడం, స్థానికులకు ఉద్యోగాలు, భూ యాజమాన్యంలో ప్రత్యేక రిజర్వేషన్లు వంటి ఆకాంక్షలు ఉన్నాయి. యూనియన్ టెరిటరీగా మార్చి జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోవడం ఆ ఆకాంక్షల సాకారం దిశగా పడిన తొలి అడుగుగా భావించి లడక్ ప్రజలు ఆరేళ్ల నాడు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఆరేళ్లలో ఆ తొలి అడుగుతరువాత మరో అడుగు ముందుకు పడకపోవడం లడక్ ప్రజలలో అసహనానికి కారణమైంది. అందుకే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆందోళనకారులు జరిపిన చర్చలు విఫలం కావడం అసహనాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా  లేహ్‌లోని బౌద్ధులు, కార్గిల్‌లోని షియా ముస్లింలు  ఐక్యంగా ఆందోళనలకు ముందు పీఠిన నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక లడక్ రాష్ట్రం కోసం శాంతియుతంగా నిరశన చేస్తున్న వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, ఆందోళనను అణిచివేయడానికి పోలీసులను నియోగించడం,మరో సారి చర్చలంటే ఇప్పుడప్పుడే కాదని కేంద్ర మొండికేయడం వంటివి ఆందోళనకారులలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తడానికి కారణమయ్యాయి. సరిగ్గా ఈ దశలోనే ఆందోళన యువత చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే రాహుల్ పదేపదే చెప్పే జెన్ జడ్ రంగంలోకి దిగిందన్న మాట.  ఈ దశలోనే ఆందోళన హింసాత్మక రూపం దాల్చడం, దాడులు, పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి వెళ్లింది.   లేహ్, కార్గిల్‌లలో ‘అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్స్ ద్వారా ప్రత్యేక రాష్ట్రానికి ఉండే అన్నీ కల్పిస్తున్నామంటూ కేంద్రం చేస్తున్న వాదనను లడక్ వాదులు అంగీకరించడం లేదు.   కౌన్సిల్స్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కింద పరిమిత అధికారాలే ఉన్నాయని వాదిస్తున్నారు. లడక్ ప్రాంతం దేశ భద్రతకు సంబంధించినంతవరకూ అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతం అనడంలో సందేహం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడమూ జరిగే పని కాదు.. కానీ.. ప్రజల ఆకాంక్షలను అణచివేయాడం సరికాదు. వారితో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. రాష్ట్ర హోదాకు ప్రత్యామ్నాయంగా  కౌన్సిల్స్ అధికారాలను  పెంచి, ఉద్యోగ, భూమి హక్కులపై స్పష్టమైన హామీలు ఇస్తే.. ప్రజాగ్రహం చల్లారే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయకుంటే లడక్ నిత్యాగ్ని గుండంలా మండుతూనే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లిలోని సీబీఐ కోర్టు యూకే పర్యటనకు అనుమతి ఇచ్చింది. అధికారం కోల్పోయిన తరువాత నుంచీ జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమౌతూ అడపాదడపా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. పార్టీ నాయకులతో భేటీలు నిర్వహించి మళ్లీ యహలంక ప్యాలెస్ కు వెడిపోతున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే జగన్  అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా కోర్టు హాజరు నుంచి ఇంకా ఎంత కాలం మినహాయింపు అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్ తన యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి 30వ తేదీ లోపు 15 రోజుల పాటు జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి మంజూరు చేసిన కోర్టు, ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత  నంవంబర్ 14లోగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.  జగన్ అక్రమాస్తుల కేసులో ఇది కీలక పరిణామమని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లడం ఇది రెండో సారి అవుతుంది.  కాగా జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఇక తెరపడినట్లేనన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు లభించిన మినహాయింపు అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతుండటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో నాంపల్లి కోర్టు నవంబర్ 14లోగా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ సందర్భంగా సీబీఐ అనుమతి ఇవ్వరాదంటూ గట్టిగా అభ్యంతరం తెలిపింది. పలు ఆర్థిక నేరాల కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశించింది. కాగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదంటూ జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలూ విన్నమిదట.. కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ పలు షరతులు విధించింది.  జగన్ తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే  యూరప్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ  మెమో సమర్పించాలని ఆదేశించింది. 

జగన్ అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే?

ప్రతీకార రాజకీయాల అన్నవి తన డిక్షనరీలోనే లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందన్నారు. జగన్ హయాంలో తనను అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా  అప్పటి ప్రభుత్వం సృష్టించిన భయానక వాతావరణాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. తాను అరెస్టైనప్పుడు తనను పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను మార్గమధ్యంలో ఆపేశారన్నారు. జగన్ హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతు దారులు ఎవరినీ ఉపేక్షించలేదనీ, వారి ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించారి చంద్రబాబు చెప్పారు.  తాను అధికారం చేపట్టిన తరువాత తలుచుకుంటే మొదటి రోజునే ఆయనను (జగన్) అరెస్టు చేయగలిగే వాడిననీ, అయితే తన విధానం అది కాదనీ అన్నారు. తాను అటువంటి రాజకీయ నాయ కుడిని కానని చంద్రబాబు చెప్పారు. చట్టాలపైనా, రాజ్యాంగంపైనా తనకు నమ్మకం ఉందన్నారు. ప్రతీకార రాజకీయాల గురించి ఎన్నడూ ఆలోచించననన్నారు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందనీ చెప్పారు. అందుకే ప్రజలు తనను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్న చంద్రబాబు, వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయనని చెప్పారు.   

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. సంప్రదాయాన్ని దాటకుండా.. మాగంటి  గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన  ఆ సీటును ఆయన సతీమణి మాగంటి సునీతకే కేటాయించారు. దీంతో జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న సందిగ్ధతకు కేసీఆర్ తెరవేశారు.  అనవసర ఊహాగానాలకు తెరదించుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందుగానే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల సానుభూతితో పాటు.. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కీలక సామాజిక వర్గ మద్దతు కూడా లభిస్తుందన్న అంచనాతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.  అలాగే  పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ   మాగంటి కుటుంబానికి అవకాశం ఇస్తేనే బెటర్ అని తేలిందని, దీంతో ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా  కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారని అంటున్నారు.  మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఇందులో మొదటి సారి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందగా, తరువాత రెండు సార్లు  బీఆర్ఎస్ తరపున గెలిచారు.  ఏవరు ఔనన్నా కాదన్నా, జూబ్లీ బైపోల్ లో విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం.  తాము పుంజుకుంటున్నామనీ,  మళ్లీ ప్రజాదరణ పొందుతున్నామనీ నిరూపించుకోవాలంటే జూబ్లీ బైపోల్ లో విజయం తప్పని సరి. ఎందుకంటే ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది. అంతే కాకుండా ఆ స్థానంలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ను బైపోల్ లో కోల్పోతే.. పార్టీ క్యారడ్ స్థైర్యం పూర్దిగా దిగజారిపోయే అవకాశం ఉంది.  అందుకే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, అన్నివిధాలుగా ఆలోచించే.. ఇప్పుడు అభ్యర్థిని కూడా ప్రకటించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

ఓజీపై అంబటి యూటర్న్

ఒకే మాట మీద నిలబడటం అన్నది వైసీపీ ఎకో సిస్టమ్ లో లేనే లేదు. నిన్న ఔనన్నది కాదనడం.. కాదన్నది ఔనన్నడం ఆ పార్టీలో మామూలే. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి నేతలు, శ్రేణుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకు రాజకీయాలే కాదు, కులం, మతం, వర్గం ఇలా ఏదీ మినహాయింపు కాదు. తాజాగా సినీమాలు కూడా మినహాయింపు కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రుజువు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినీమా తాజాగా విడుదలైంది. విడుదల కు ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీపై, పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ యూటర్న తీసుకుని యథాప్రకారంగా పవన్ పై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆయన నటించిన సినీమానూ విమర్శించారు. అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు సీనీ, రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.   ఇంతకీ ఏం జరిగిందంటే..ఓజీ సినీమా విడుదలకు ముందు అంబటి రాంబాబు ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ.. పవన్ కల్యాణ్ ఈ సినిమాను కసిగా చేశారనీ, బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనీ పేర్కొన్నారు. అయితే గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఆ మేరకు ఓ ట్వీట్ చేస్తూ పవన్ సినిమా సక్సెస్ కావాలన్నది తన ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం అంటూ పేర్కొన్నారు. దీనిపై జనసైనికులు, పవన్ అభిమానులూ మండి పడుతున్నారు.  సోషల్ మీడియా వేదికగా అంబటిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంబటి కపటత్వానికి ఇది నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా మాట మార్చడంలో వైసీపీ ఆనవాయితీని అంబటి మరోసారి రుజువు చేశారని అంటున్నారు. 

పవన్ కు అస్వస్థత.. వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్ కు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. మంగళగిరిలో ఉంటూనే నాలుగు రోజులుగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా జ్వర తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ కు బయలు దేరారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. జనసేనాని అస్వస్థతతో ఉన్నారన్న వార్తతో జనసైనికులతో పాటు ఆయన అశేష అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళనా అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే జ్వరం వచ్చిందని అంటున్నారు.  

ఆక్షేపించడానికేం లేకేనా.. బాబు వయస్సుపై జగన్ వ్యాఖ్యలు?

తెలుగు దేశం పార్టీ అధినేత,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన దార్శనికతను  రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఈ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ  అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను  ఉపయోగించిన తీరును మేధావులూ, ప్రగతి కాముకులు ప్రశంసిస్తూనే ఉంటారు. ప్రస్తుతిస్తూనే ఉంటారు. దీంతో జగన్ కు చంద్రబాబుపై విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు వయస్సుపై కామెంట్లు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఇక ఆయన వయస్సు విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్లు. అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన ఆయనలో నిత్యం ప్రస్ఫుటిస్తుంటాయి. అటువంటి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆయన    ముసలాయన  అంటున్నారు. ఆయనను వృద్ధుడు అనడం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది తెలియదు కానీ..  చంద్రబాబు మాత్రం  తాను నిత్యయవ్వనుడినని తన తీరుతో, పని విధానంతో  పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజలు సైతం ఆయన ఉత్సాహాన్ని, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న ఉత్సుకతను, నిబద్ధతను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తున్నారు.  అదే సమయంలో   జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  అత్యంత అరుదుగా తప్ప పర్యటన చేసే వారు కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ లకే పరిమితం అవుతున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు.  అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమౌతూ ప్రజాక్షేత్రంలో, అధికారిక కార్యక్రమాలలో నిరంతరం బిజీగా ఉంటారు. ఉంటున్నారు. అందుకు ఉదాహరణగా బుధవారం (సెప్టెంబర్ 24) గురువారం(సెప్టెంబర్25) ఆయన బిజీ షెడ్యూల్ ను గమనిస్తే సరిపోతుంది.    ముందుగా బుధవారం చంద్రబాబు క్షణం తీరిక లేని షెడ్యూల్ ను చెప్పుకుంటే.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాథాకృష్ణన్ కు విమానాశ్రయంతో స్వాగతం పలకడం తో మొదలైంది.  ఆ తరువాత చంద్రబాబు సకుటుంబ సమేతంగా  మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. అక్కడ నుంచి.. విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.  ఆ తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు. అక్కడ నుంచి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక గురువారం (సెప్టెంబర్ 25) ఉదయమే ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి అమరావతి చేరుకుని అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నారు. సాయంత్రం డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో కూడా ఆయనలో ఎక్కడా అలసట చ్ఛాయలు కూడా కనిపించలేదు. ముఖంపై చిరునవ్వు చెరగలేదు.  ఒక రోజు పర్యటిస్తే రోజుల తరబడి ప్యాలెస్ కే పరిమితమయ్యే జగన్ చంద్రబాబు వయస్సుపై వ్యాఖ్యలు చేయడమేంటంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.