స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా?

తెలంగాణ రాజకీయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ వంక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతుంటే..  మరో వంక గత బీఆర్ఎస్  ప్రభుత్వ, ‘ఘన’  చరిత్రకు అద్దం పట్టే,  ప్రతిష్టాత్మక’ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా - ఈ కార్ రేస్  ఇతరత్రా అవినీతి కేసులు, రాష్ట్ర రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ రోజుకు ఆరోజు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి.  అదొకటి అలా ఉంటే..  అన్ని పార్టీలకూ,  మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తరుము కొస్తున్నాయి. 2019లో ఎన్నికల్లో కొలువు తీరిన స్థానిక సంస్థలు కాలం చేసి, సంవత్సరం పైగానే అయినది.  అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ.. స్థానిక ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది.  అయితే.. ఇక ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేకుండా రాష్ట్ర హై కోర్టు ఎన్నికలను పదేపదే వాయిదా వేయడాన్ని తప్పుపడుతూ, సర్కార్ నెత్తిన అక్షితలు వేయడంతో పాటుగా , 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాలని  ప్రభుత్వానికి గడవు విధించిది.  ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. రాష్ట్ర హై కోర్టు విధించిన 90 రోజుల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  మరో వంక ఎటు తేలని బీసీ రిజర్వేషన్  వ్యవహారం, సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది. ఈ  పీటముడిని విప్పితేగానీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదు. అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనసులో ఏముందో ఏమో కానీ..  ఈరోజుకు కూడా రిజర్వేషన్లపై ఎటూ తేల్చకుండా నాన్చివేత ధోరణి అవలబిస్తోంది. అదలా ఉంటే 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని, లేదంటే.. అంటూ బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా ఎటు చూస్తే  అటు పటు నిరాశ  అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం    చిక్కుల్లో చిక్కుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అదొకటి అయితే..  ఏదో ఒకటి చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం, 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించినా.. ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో అధికార పార్టీలో అనుమనాలు  తొలగడం లేదని అంటున్నారు.  కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  స్టైల్లో స్థానిక ఎన్నికలను స్వీప్ చేస్తామని చెపుతున్నా.. పార్టీ అంతర్గత సర్వేల ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఫలితాలు కూడా అలాగే ఉంటాయనే భయాన్ని వ్యక్త పరుస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లోనే కాదు..  పార్టీలోనూ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు సప్ష్టంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రికే తమ మంత్రుల పనితనం మీద విశ్వాసం లేదని, ఇక ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం ఎలా ఉంటుందని  విశ్లేషకులు అంటున్నారు.  నిజంగా కూడా సామాన్య ప్రజలు.. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం స్వచ్చందంగా పనిచేసిన వివిధ వర్గాల ప్రజలు.. ముఖ్యంగా నిరుద్యోగ యువత, పేద మహిళలు,  మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి మహిళలు కూడా.. కాంగ్రెస్ పార్టీని సొంత చేసుకునేదుకు, సమర్ధించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ముఖ్యంగా.. మహిళలకు ఇచ్చిన ప్రత్యేక హామీలు ఏవీ అమలు కాకపోవడంతో మహిళల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలో మహిళా వ్యతిరేకత ప్రభావం భారీగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  అలాగే..   ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు,  420 హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న  సాచివేత ధోరణి, రుణ మాఫీ, రైతుభరోసా సహా ఏ ఒక్క పథకాన్ని సంతృప్తి కరంగా పూర్తి చేయక పోవడంతో  అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారస్థాయికి చేరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో,కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించి ఎన్నికలకు వెళుతుందా? అన్న  అనుమానాలు కూడా విపక్షాలు వ్యక్త పరుస్తున్నాయి. అయితే..  ప్రభుత్వం ఎన్నికలు మరో సారి వాయిదా వేసే ఆలోచన చేయక పోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహిస్తుందా?  లేక, ఏపీలో జగన్ రెడ్డి నిర్వహించిన  అరాచక, అప్రజాస్వామిక పద్దతిలో మమ  అనిపిస్తుందా  అనే అనుమానాలు అందరిలో ఉన్నాయని అంటున్నారు.

మంత్రి పొంగులేటికి మల్లికార్జున ఖర్గే వార్నింగ్

  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పొంగులేటిపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయిన ఖర్గే.. గంటసేపు మాట్లాడారు. ‘బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కోరారు.  ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు' అని ఖర్గే హెచ్చరించినట్టు సమాచారం. మంత్రి పొంగులేటి తీరు నచ్చక తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు టాక్. అలాగే గతంలో బాంబులు పేలతాయని.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి. రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని పొంగులేటికి మల్లికార్జున్ ఖర్గే సూచించారు.  

జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ

పల్నాడు పర్యటనలో తన వాహనం ఢీ కొని సింగయ్య మరణించిన ఘటనపై జగన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.   దీంతో  ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నమోదైన కేసు నాన్ బెయిలబుల్ కే  కావడంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టులో గురువారం (జూన్ 26)  విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో  శుక్రవారానికి (జూన్ 27) వాయిదా పడింది.   రాజకీయ ప్రతీకారంతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన సెక్షన్లు పెట్టారని  జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసును కొట్టేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.  

సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరు ప్రవేశం

పర్యావరణ సమతుల్యతపై ప్రజలలో అవగాహన కల్లించడమే ధ్యేయంగా ఓ యువకుడు చేపట్టిన సైకిల్ యాత్ర గుంటూరు చేరుకుంది. డిగ్రీ విద్యార్థి కోటా కార్తిక్ ఈ  బృహత్ కర్యక్రమాన్ని చేపట్టాడు. చిన్ననాటి నుంచే భూమిపై పచ్చదనాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మొక్కలు నాటుతూ, పర్యావరణ కాలుష్యాన్నితగ్గించే లక్ష్యంతో ముందుకు సాగిన కోటా కార్తిక్  ఇప్పుడు అదే లక్ష్యంతో కడప టు కాశ్మీర్ అంటూ సైకిల్ పై భారతదేశ యాత్ర ప్రారంభించాడు. సేవ్ ఎర్త్.. సేవ్ ట్రీస్ అనే నినాదంతో ఈ యాత్ర చేపట్టాడు. తన యాత్ర పొడవునా దారిలో మొక్కలు నాటుతూ.. వాతావరణ కాలుష్యాన్ని రహిత భారత దేశ నిర్మాణంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న కోటా కార్తీయ్ యాత్ర గుంటూరు చేరుకుంది. ఈ సందర్భంగా కార్తిక్ తన యాత్ర లక్ష్యాన్ని వివరించారు.   చిన్న వయసులోనే భూమిని కాపాడటం మొక్కలు నాటి  కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశం తో సైకిల్ పై భారత దేశ యాత్ర చేపట్టానన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కార్తీక్ ను అభినందించారు.  నేటి యువకులు చదువులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో పాటు పర్యావరణ సమతుల్యత ఎలా చేయాలి అనేది కూడా గ్రహించాలని, అందుకు కోటా కార్తిక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు ఈయన యాత్ర దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో ఈ యువకుడికి సంఘీభావం తెలియజేయాలని  కోరారు. 

అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో శుభాంశు శుక్లా శుభారంభం!

14 రోజుల ట్రిప్ కి 550 కోట్ల రూపాయల పెట్టుబడి. ఈ ప్రయోగంతో భారత్ ఏం సాధిస్తోంది? ఇదొక గేమ్ ఛేంజరా? అయితే అదెలా? ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి  యాక్స్- 4 మిషన్ ప్రయోగం ఆక్సియమ్ స్పేస్, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో.. కలసి చేస్తోన్న సంయుక్త ప్రయోగం భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ గా శుభాన్ష్. బరువులేని వాతావరణంలో నివసించే ట్రైనింగ్ డ్రాగన్ ద్వారా ప్రయాణించి.. ISSకి చేరిక అంతరిక్షంలో నాయకత్వ అనుభవం కోసం 12 ప్రయోగాల్లో.. 7 జీవ శాస్త్రానికి చెందినవి 2026- ఇస్రో గగన్ యాన్ లో ఇది కీలకం అంతరిక్ష నివాసం, ప్రయోగశీలత  అంతర్జాతీయ నియమాల పాటింపు సరికొత్త పార్టనర్ షిప్పులు లభించే ఛాన్స్. 2035- ఇండియన్ స్పేస్ సెంటర్ కి హెల్ప్ అంతరిక్షంలో ఎలా పని చేయాలో ఒక అనుభవం ఎమర్జెన్సీ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఐఎస్ఎస్ పరికరాలను ఎలా వాడాలన్న విషయాల్లో ట్రైనప్ యాక్స్- 4 నాసా, ఇసా, యాక్సియమ్ స్పేస్ తో.. మెరుగు పడనున్న సంబంధ బాంధవ్యాలు స్పేస్ లీడర్షిప్ కి దోహద పడనున్న ప్రయోగం కండరాల వ్యాధి నివారణకూ సహాయం ISS నుంచి స్కూల్ పిల్లలతో చాట్ చేయనున్న శుక్లా ఆ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యం మైక్రో ఆల్గేతో ఆహారాన్ని పెంచడం, - సైనో బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ తయారీ, - అంతరిక్షంలో మానవ కండరాల రక్షణ, సలాడ్ తయారీ కోసం విత్తనాలు,  టఫ్ టార్డిగ్రేడ్స్ కాగా  మరో ముఖ్య ప్రయోగం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యకరంగా ఉండటం ఎలా? అన్నది లక్ష్యం.  భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకే బీజాలు ఇవి బీజాలు. భూమిపై మెరుగైన జీవితాన్నీ ఇవ్వగలవు  2026లో రూ. 20, 193 కోట్లతో గగన్ యాన్ ముగ్గుర్ని 3 రోజుల పాటు 400 కి. మీ కక్ష్యలోకి పంపేదుకు  యాక్స్- 4 తో ఈ ప్రయోగం ఒక ట్రయిల్ రన్ గా చెప్పాల్సి ఉంటుంది. నాసా, ఇసాతో కలసి పని చేయడంతో వరల్డ్ క్లాస్ మిషన్ లో శుక్లా పెట్ నేమ్ 'షక్స్’. కాగా ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. 140 కోట్ల మంది ప్రయాణమిది అన్నారు. ఈ ప్రయోగానికి అయ్యే వ్యయం  రూ. 550 కోట్లు కేవలం ఖర్చు కాదనీ.. భారత అంతరిక్ష భవిష్యత్ కి పెట్టుబడి అని అభివర్ణించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దాదాపు నెలన్నర నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పట్టిన సమయం తెలిసిందే. వసతి గదుల కోసం కూడా భక్తులకు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.  విద్యాసంస్థలు తెరుచుకోవడం, పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  గురువారం (జూన్ 26) శ్రీవారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,765 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల వచ్చింది. ఇక శుక్రవారం (జూన్ 27) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లునిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.  టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమ యం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది.  

బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా? : వర్ల రామయ్య

  సొంత బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా అని  జగన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. సింగయ్య చావుకు తన కారుకు సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? సింగయ్యను వైసీపీ కార్యకర్తలే టైర్ క్రింద నుండి లాగి పక్కన పడేయలేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ని  నిలదీశారు.  చిన్న నాటి నుండి జగన్ రెడ్డి వ్యక్తిత్వం నేర ప్రవృత్తితో మిళితం అయ్యిందని.  విద్యార్థి దశలోనే ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు తనపై ఉన్నాయిని రామయ్య అన్నారు.  ఆ ఆరోపణలపై ఇప్పటికీ జగన్ రెడ్డి నుండి సమాధానం లేదు. పార్లమెంట్ కు రాజీనామా చేయనన్నాడని.. లాలించి పెంచి ప్రేమించిన బాబాయిని లాగి చెంప పగలగొట్టిన మనస్తత్వం జగన్‌దని ఆయన ఆరొపించారు. హైదరాబాద్ కు వద్దని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను వారించినా బెంగళూరులో ఉండకుండా పదే పదే హైదరాబాద్ కు వచ్చి తండ్రికి తలనొప్పి కలిగించిన కొడుకు జగన్ రెడ్డి.  తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ ది. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్ కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.  సొంత తల్లి తన ఇంట్లో లేకపోవడానికి జగన్ రెడ్డి వీపరీత మనస్తత్వమే కారణం. సోంత చెల్లి తనకు దూరం అవ్వడానికి జగన్ వీపరీత మనస్తత్వమే కారణం. మాజీ సీఎంకు ధనాశకు వారు ఎక్కడో ఉంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. జగన్ రెడ్డి బాబాయి కూతరు సునీత నాడు న్యాయం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఎండలో నడుస్తుంటే నాకే బాధేసింది జగన్ రెడ్డికి మాత్రం మనసు కరగలేదని ఆయన అన్నారు. అధికార దాహం కోసం జగన్ రెడ్డి ఏదైనా చేయగలరు. స్టేరాయిడ్స్ తీసుకునే అథ్లెట్ కు.. అరాచకంతో అధికారంలోకి రావాలనుకునే జగన్ రెడ్డికి ఎటువంటి తేడాలేదు. తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏవర్గానికి మేలు చేశాడో చెప్పగలడాని వర్ల రామయ్య నిలదీశారు.  

రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ మృతిపై...చంద్రబాబు విచారం

  కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరమని సీఎం చంద్రబాబు  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ లు అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్‌లకు అందుతున్న వైద్య సహాయం గురించి అధికారులతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.  వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు, అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు వివరించారు. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.  

గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు

  హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వ తరుపున  పట్టు వస్త్రాలను మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ సమర్పించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి తొలి బోనం నేవేద్యంగా ఇచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.  గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

నేడు జగన్నాథుని నేత్రోత్సవం

  జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు కోలుకున్నాడు. గురువారం (26వ తేదీన) నవయవ్వన రూపంతో భక్తులకు దర్శనం ఈయనున్నాడు. శుక్లపక్షమి పాడ్యమి తిథి పర్వదినం పురస్కరించుకుని గురువారం బ్రహ్మాండనాయకుని నేత్రోత్సవం పూరీ శ్రీక్షేత్రంలో నిర్వహించనున్నారు. కాగా పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం (27న) నిర్వహించనున్నారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు నేడు శ్రీక్షేత్రం ఎదుట కార్డన్ కు చేరుకోనున్నాయి. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి

ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు

  తెలంగాణ వ్యాప్తంగా పలు పలు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి తదితర జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్లు పెరిగిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ల పర్యవేక్షణలో అధికారులు కార్యాలయాల్లోని రికార్డులను, కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇద్దరు క్లర్క్‌లతో పాటు కార్యాలయం వద్ద తిష్టవేసిన 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.   అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30  గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన  రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 01వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 03న పార్వేట ఉత్సవం జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, సూప‌రింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు : కాగ్నిజెంట్

  ఆంధ్రప్రదేశ్‌లోని  విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సుమారుగా 8 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి తొలిదశ పూర్తిచేస్తామని ప్రకటించింది. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రూ. 1,500 కోట్లతో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి కాగ్నిజెంట్ కంపెనీకి కుటమి ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిదేళ్లలో 8,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాగ్నిజెంట్ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందట. వైజాగ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ మోసం

  తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రోబ్‌లాక్స్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నది. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని సోషియల్ మీడియాలో నయో మోసాలు పాల్పడుతున్నదని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. తిరుమల మీద గేమ్ డిసైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్  వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ చైర్మన్  అదేశించారు. తిరుపతి నుండి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలతో యాప్ రూపొందించిన రోబ్‌లాక్స్ కంపెనీ దైవ భక్తిని...అదును చేసుకొని డాలర్స్ రూపంలో అన్ లైన్ లో వసూలు చేసినట్లు మాకు ఫిర్యాదు అందిందని వారు తెలిపారు.  స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ రోబ్‌లాక్స్ గేమ్‌కు మరింత లోకలైజ్ చేసేందుకు కొందరు స్థానికంగా ఉంటే ప్రాంతాలను రిఫరెన్స్‌గా తీసుకొని గేమ్స్ రన్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అందుకే అలాంటి వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత పెద్ద ఆటంకాలు దాటుకుంటూ వెళ్తే అన్ని వ్యూస్‌ వస్తాయి. అందుకే దీన్ని లోకలైజ్ చేసి వీడియో వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నారు.  శ్రీవారికి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గేమ్ డిజైన్ చేశారని అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుంది అని గేమ్ డిజైన్ చేశారని వెంటనే ఆ గేమ్ అకౌంట్ ని తొలగించాలని టిటిడిని కోరాని కిరణ్ రాయల్ తెలిపారు.

వైసీపీని అధికారంలోకి రానివ్వం.. జనసేనాని ధీమా

  రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లివి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ వస్తుందేమో.. అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎంతో మంది తమను అడుగుతున్నారంటూ.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, అధికారులు మాట్లాడుతున్న వేళ.. కీలక కామెంట్లు చేశారు జనసేనాని. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. 2029లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న మాట గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా విన్పిస్తోంది. ఈ అంశంపై పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వర్గాలు తమను పలు సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాయంటూ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు చెప్పుకొచ్చారు.  సరిగ్గా ఇలాంటి పరిణామాల వేళ కీలక కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉద్దేశిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వెనక్కు రప్పిస్తామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్. అయితే.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాదు.. రానివ్వం అంటూ పవన్ వ్యాఖ్యానించడం వెనుక దీమా ఏంటన్న ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణం అని కొందరు చెబుతుంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసి వాడే జనసేనాని అని మరికొందరు చెబుతున్నారు. తమది సుదీర్ఘ కాల లక్ష్యంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మరోమారు స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా రెడీ అని ప్రకటించారు.  వికసిత్ భారత్‌లో ఏపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పిన ఆయన.. వికసిత్ ఏపీగా మారాలంటే కూటమి ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో తాను కానీ, మరెవరూ కానీ లేరని స్పష్టం చేశారు. ఇది సైతం పవన్ దీమాకు ఓ కారణమని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. నిజానికి.. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటయ్యేందుకు గట్టిగా కృషి చేశారు పవన్ కల్యాణ్. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్.. ఇటు టీడీపీతోనూ జట్టు కట్టారు. చివరకు మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిగా మార్చేందుకు తనవంతు పాత్ర పోషించారు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. ఫలితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2029 నాటికి వైసీపీ ఓటు చీలకుండా తన వంతు పాత్ర బలంగా పోషించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మరోసారి తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు పవన్ అన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మరి.. జనసేనాని మాటలకు వైసీపీ ఎలా స్పందిస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.  

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌

  ఏపీలో  రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీ పురందేశ్వరి  పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇక పర్యాటకులకు నూతన శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు 2027లో జరిగే పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, శక్తివంతమైన నాయకత్వమని పవన్ అన్నారు.  రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చేది గోవావరి తీరం అన్నారు. ఆది కవి నన్నయతో పాటు ఎంతో మంది కళాకారులు జన్మనిచ్చిన నేల ఇదని అన్నారు. తీరం వెంబటి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదన్నారు. టూరిజం రంగంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. హేవ్ లాక్ బ్రిడ్జి చాలా పురాతనమైనది, వాడకుండా వదిలేయబడింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించి పర్యాటకం కింద మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభాప్రాయపడ్డారు. పుష్కరాలన నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు

తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

  తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను బీఆర్‌ నాయుడు అభినందించారు.మరోవైపు అమలాపురం వాసి నిమ్మకాయల సత్యనారాయణ టీటీడీకు 2వేల హెల్మెట్లను అందించారు. తిరుమల ఛైర్మన్‌ను కలిసి రూ.15లక్షల విలువైన హెల్మెట్లను విరాళంగా అందజేశారు.  శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారికి 3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలకు భక్తుల రద్ధీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం అమావాస్య కావడంతో ప్రజలు తమ ప్రయాణాలు నిలిపివేసుకుంటారు. దీంతో గురువారం తెల్లవారుజామున తిరుమల కొండపై భక్తుల రద్ధీ భారీగా తగ్గిపోయింది.  

గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

  హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మృతునికి తొమ్మిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. మానసిక కుంగుబాటే కరణమని పోలీసులు అనుమానిస్తున్నరు.