తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

  తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.  ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గత కొద్దిరోజుల నుంచి వాతావరణం చల్ల బడింది. కొంత సేపు ఎండలు పెట్టినా.. మిగితా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి.  పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది.  

ఎవరి హవా వారిదే!

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం (జూన్ 23) వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో ఏ పార్టీకీ నిరాశ మిగల్లేదు. అలాగని రొమ్ము విరుచుని ఆనందంతో గంతులేయడానికీ అద్భుత ఫలితాలూ రాలేదు. ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి.  గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఈ నెల  19న పోలింగ్ జరిగిన విషయం విదితమే. వెలువడిన ఫలితాలను బట్టి ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాల సరళి ఉంది.   కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్   అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ విజయం సాధించారు.  ఇక పంజాబ్ లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గాన్ని ఆప్ కైవశం చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ స్థానానికి జరిగిన బై పోల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక పోతే గుజరాత్ లోని విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధిస్తే. కాడి సీటును బీజేపీ దక్కించుకుంది. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటిలో రెండింటిని ఆప్ దక్కించుకుంది. ఇక బీజేపీ, యూడీఎఫ్, టీఎంసీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. 

ఫోన్ పే రచ్చ.. ఉచ్చు బిగుస్తోంది.. అయితే అరెస్టు అంత వీజీ కాదు!

ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన  ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో..  ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం   ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా  ఈకేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే  పని చేశానని ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం గా మారింది.  ప్రభాకర రావు స్టేట్మెంట్ ఆధారంగా  ‘సిట్’ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్  ను రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా.. ఎప్పటికప్పడు స్టాండ్’ మారుస్తూ వస్తున్న ప్రభాకర రావు..సిట్  విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకొచ్చారని, మాజీ ఐపీస్ అధికారి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్  సహా పలువురు మాజీ అధికారులు, పరిపాలన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇంటెల్జెన్సీ మరీ ముఖ్యంగా పొలిటికల్ ఇంటెల్జెన్సీకి సంబందించిన వ్యవహారాల్లో డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, చివరకు హోం మంత్రి ప్రమేయం కూడా ఉండదని.. ఎస్‌ఐబీ చీఫ్ నేరుగా శాంతి భద్రతల శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రికి (హోం మంత్రి ఎవరైనా శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంచుకోవడం అన్నది అనాదిగా అన్ని రాష్ట్రాల్లో  ఆచారంగా వస్తోంది. గత ప్రభుత్వ హయంలోనూ అదే ఆచారం కొనసాగింది. నాయని నరసింహ రెడ్డి, మహ్మూద్ అలీ ఎవరు హోం మంత్రిగా ఉన్నా, శాంతి భద్రలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉన్నాయి.)  మాత్రమే రిపోర్ట్ చేస్తారని, ముఖ్యమంత్రి నుంచే, మౌఖిక, లిఖిత పూర్వక ఆదేశాలు స్వీకరిస్తారని  అంటున్నారు. సో.. ఇక్కడ ప్రభాకర రావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకు రావడం ఒక విధంగా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే చూడాలని మాజీ అధకారులు అంటున్నారు. అయితే.. మరోవంక ప్రభాకర రావు ఇచ్చినట్లు చెపుతున్న స్టేట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్  మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. అదలాఉంటే, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునను ఇప్పటికే ఐదుసార్లు విచారించిన  సిట్  మరో సారి అంటే ఆరో సారి ఆదివాకం   (జూన్ 23)  విచారించింది. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో.. బంతిని మాజీ డీజీపీ కోర్టులోకి నెట్టిన ప్రభాకర రావు, ఈ సారి ఎలాంటి  ప్రకటన చేస్తారు.. ఇంకెవరిని సీన్ లోకి తెస్తారు  అన్న ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతున్నాయి. నిజానికి..  ప్రభాకర రావు విచారణకు పెద్దగా సహకరించడం లేదనీ..  ఎన్నిగంటలు కూర్చోపెట్టినా, ఒకటీ అరా ప్రశ్నలకు   అరకొర సమాధానాలు ఇవ్వడమే కానీ, సరైన సమాధానలు ఇవ్వడం లేదని  సిట్   వర్గాల సమాచారం. ముఖ్యంగా..  ఆగష్టు 5 వరకు ప్రభాకర రావును అరెస్ట్ చేయరాదని సుప్రీం కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించిన నేపధ్యంలో..  ఆయన విచారణకు సహకరించక పోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సిట్ వర్గాలు అంటున్నాయి. అదలా ఉంటే..  గత అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరి తో ఒకరు తలపడిన కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్ సహా, మరి కొందరు కాంగ్రెస్ నాయకులకు  సిట్ వారం రోజుల్లోగా సిట్ కార్యాలయాని వచ్చి వాగ్మూలం ఇవాలని నోటీసులు ఇచ్చింది. అలాగే.. మరి కొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ కూడా  సిట్  అధికారులు, రికార్డు చేయనున్నట్లు  తెలుస్తోంది. అదలా ఉంటే..  ఈ కేసు ఏనాటికైనా లాజికల్ కంక్లూజన్  కు చేరుతుందా ? పెద్ద తలల అరెస్ట్ వరకు వెళుతుందా అంటే..  అది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినంత ఈజీ అయితే కాదని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్

  తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాదిలో  ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయితే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘన్ని  కోర్టు నిలదీసింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టును విజ్ఞప్తి చేసింది.  వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. 

బండి వెర్సెస్ ఈటల.. ముదురుతున్న యుద్ధం!

భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా  ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే..  కదలికతో పాటు  కయ్యాలకు తెర లేచింది. అఫ్కోర్స్.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, మరోలా ఉన్నా.. బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే..   తాజాగా పాత గొడవలు కొత్తగా తెర పైకి రావడంతో పార్టీ క్యాడర్  నారాజ్  అవుతున్నారు.  పార్టీ ముఖ్య నాయకులు, వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో  బహిరంగంగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తోందని పార్టీ వర్గాల్లో అందోళన, పార్టీ క్యాడర్ లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి. నిజానికి..  కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద మోదీ, సారధ్యంలోని  ఎన్డీఎ ప్రభుత్వం ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మల్కా జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం(జూన్ 22) వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ జరుగతున్న సమయంలోనే.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్  సభకు హాజరు కాకపోవడమే కాకుండా..  అదే సమయంలో  కరీంనగర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసీ మరీ,కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు.అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అంటూ..  కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాట, తీసుకున్న స్టాండ్ లో ఈ రోజుకూ ఇసుమంతైనా  మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. అంత వరకు అయితే కొంతవకు ఓకే.. బండి అక్కడితో ఆగలేదు బీజేపీలో ఉన్న ఎవరైనా  బీజేపీ స్టాండే తీసుకోవాలనీ..  వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు.   అంతే కాదు..  కాళేశ్వరం ప్రాజెక్టు సమబందించి అప్పటిరాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, మాజీ మంత్రి హోదాలో ఈటల ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుకు కాబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని కాంగ్రెస్ నేతలకు సవాలు కూడా విసిరారు. అయితే, బండి సంజయ్ ఈటల సవాలును సింపుల్ గా తీసి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ అభిప్రాయానికి పార్టీ స్టాండ్ పూర్తి భిన్నమని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. అంటేఈటల చెప్పింది తప్పు, కాంగ్రెస్ చెప్పిందే సత్యం అని బండి, కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చారు.   విషయంలోకి వెళితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ లో మూడు పిల్లర్లు కూలిన సంఘటన, ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు, ఆర్థిక ఆకతవకలపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌  ఏర్పాటు చేసిన విషయం  అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా కాకుండా..  గతంలో  కేసీఆర్  మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి,  మాజీ మంత్రి హోదాలో ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆర్థిక విషయాలకు సబంధం లేని  కాబినెట్ ఆమోదం వంటి కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి  కేసీఆర్  ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈటల వ్యాఖ్యల, పూర్వాపరాలు, పర్యవసానాలపై, పార్టీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట, ఈటల మాజీ మంత్రిగా హాజరయ్యారే కానీ, బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని స్పష్టం చేశారు. సరే.. అది ఎంత వరకు సమంజసం అనే విషయాన్నిపక్కనపెడితే.. అంతర్గతంగా చర్చించవలసిన  అంశాలను  బహిరంగా అది కూడా  బీజేపీ దేశ వ్యాప్తంగా, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అభియాన్ లో  భాగంగా రాష్ట్రంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహిస్తున్న  సమయంలో.. పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని సృష్టించదాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. అలాగే..  ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య రాజుకున్న ఈ వివాదం ఎటు దారి తెస్తుంది, ఎందాకా పోతుంది అనేది  ఇప్పడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటేనే కానీ, బండి వర్సెస్ ఈటల మధ్య ముదురుతున్న యుద్ధం చల్లారదని అంటున్నారు.

పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

  వైసీపీ నేత మాజీ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని మఠం ఈఓ ఉత్తర్వులివ్వగా పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై అభ్యంతరాలుంటే దేవదాయశాఖ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. నేటి నుంచి రెండు వారాల పాటు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్‌ కేవి విశ్వనాథన్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగించింది  

మరోసారి వివాదాల సుడిలో గుమ్మనూరు!

గుంతకల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాల సుడిలో చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం సంస్థాగత కమిటీల నియామకానికి సంబంధించి గుంతకల్లులోని ఓ కళ్యాణమండపంలో మూడు రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడారు.  ఆ సందర్భంగా  ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయాలని, లేదంటే వారి తోక కత్తిరించి సున్నం పెడతామని హెచ్చరించారు. అలాగే వైసీపీ తరపున ఎవరూ నామినేషన్లు వేయకుండా చూడాలని తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  వైసీపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రెడ్ బుక్  ఓపెన్ చేస్తానన్నారు. కాగా..  ప్రజాస్వామిక హక్కులు కాలరాసేలా మాట్లాడిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజలు తోక కోసి సున్నం పెడితేనే జయరాం  గుంతకల్లుకు వలస వచ్చి... చంద్రబాబు దయతో ఎమ్మెల్యే అయ్యారని వారు ఎద్దేవా చేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో తన కుటుంబీకులను సామంత రాజుల్లా పెట్టుకుని జయరాం పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాగే వ్యవహరిస్తే జిల్లా ప్రజలు కూడా ఆయనను తరిమి కొడతారని హెచ్చరించారు.  కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గుమ్మనూరు జయరాం కు ఇదే మొదటి సారి కాదు. తనపై ఆధారాల్లేకుండా వార్తలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని ఆయన చేత వివరణ ఇప్పించాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయినా, ఆయనలో మార్పు రాలేదని ప్రస్తుత వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. గతంలో వైసీపీ తరపున ఆలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు తన నోటి దురుసు ప్రదర్శించారు. టీడీపీలోకి వచ్చాక కూడా ఆయన అదే పద్ధతిలో మాట్లాడుతూం డడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఎన్నికల ముందు ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం టీడీపీ అధినేతను, లోకేశ్ ను గతంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషించి ఉండడమే. ప్రత్యర్థుల చేత నామినేషన్లు కూడా వేయనివ్వకుండా స్థానిక ఎన్నికలను గత వైసీపీ ప్రభుత్వం ఏకపక్షం చేసిన విషయం తెలిసిందే.

మంచు విష్ణు కన్నప్పకు సినిమా కష్టాలు!

మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కన్పప్ప సినిమాకు సినిమా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కన్నప్పలో కీలక సన్నివేశాల హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలోనూ ఇబ్బందుకు ఎదురౌతున్నాయి. కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ 13 సన్నివేశాలను తొలగించాల్సిందేనంటూ రివిజన్ కమిటీ నివేదిక ఇచ్చింది. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరచడం, పిలక, గిలక పాత్రలతో ఒక సామాజిక వర్గాన్ని, దేవీ, దేవతలను, కోయకులాన్ని కించపరిచే విధంగా ఉన్న 12 సన్నివేశాలను తొలగించాల్సిందేనని 11 మంది సభ్యులతో కూ డిన రివిజన్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేరకు ఆ 13 సన్నివేశాలను తొలగించిన సినిమా కాపీ వచ్చిన తరువాతే కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని రీజనల్ సెన్సార్ ఆఫీసర్ పేర్కొన్నారు.   కన్నప్ప సినిమా పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్  దాఖలైన సంగతి తెలిసిందే.  ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్ , సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరి వాదనలు వినిపించాల్సి ఉంది. కన్నప్ప  సినిమా విషయంలో తొలి నుంచీ సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయానికించపరచడం దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. 

సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీకి బెదిరింపు కాల్!

  మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్‌కాల్‌ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్‌ చేశారు. బెదిరింపు కాల్‌పై డీజీపీ, మెదక్‌ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్‌ ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్‌రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్‌కి, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

తెనాలి జంట హత్యల కేసు.. నిందితులు ఎవరంటే?

గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు భేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మారిసి పేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్  పెరవలి కుసుమ కుమారిగా పోలీసులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ గోపి మరో మైనర్ బాలుడు తో కలిసి పక్క ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ   జనార్ధనరావు తెలిపారు.  త్రీ టౌన్  పోలీస్ స్టేషన్లో సోమవారం( జూన్ 23)  ఉదయం   మీడియా సమావేశంలో  మాట్లాడిన ఆయన నిందితుల వివరాలను తెలియజేశారు. డొంకలో అప్పడాల కంపెనీ పై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లయిన రాజేశ్వరి, అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం, నగదు  కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన  తెలిపారు. కీలక సూత్రధారి కుసుమ కు గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసుతో  సంబంధం ఉన్నట్లు చెప్పారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తో పాటు సిబ్బందిని డి.ఎస్.పి బీ జనార్ధన రావు అభినందించారు.

ప్రధాని రేసులో నితిన్ గడ్కరీ?

బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అటు నుంచి అటువంటి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల  కిందట నితిన్ గడ్కరీ తమ రాజకీయ భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు   నాగపూర్ నుంచి ఢిల్లీ వరకు పరివార్ వర్గాల్లో సంచలనంగా మారినట్లు తెలుస్తోంది.  , రెండు రోజుల కిందట ఒక టీవీ చానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నితిన్ గడ్కరీ..  2029 ఎన్నికల్లో తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ఇంత వరకు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది  అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ  తాను ప్రధాని రేసులో ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారని  రాజకీయ, పరివార్ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు. అయితే..  ఆ వెంటనే గడ్కరీ,  బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ నిర్ణయిస్తుందనీ..  పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే..  అందులోనూ పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాననే సంకేతం ఉందని  పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.  అదలా ఉంచితే..  ప్రధాని నరేంద్ర మోదీ, స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్  ఏజ్  75 కి చేరువలో ఉన్న సమయంలో.. గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీఫ్  వేయడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోందని  అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు నెలలలో.. అంటే  సెప్టెంబర్ 17 న 75 ఏళ్లు దాటి దాటి 76వ పడిలో అడుగు పెడతారు. అంటే..  రిటైర్మెంట్’ ఏజ్ లోకి అడుగు పెడుతున్నారు. అదలా ఉంటే.. మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి,మోదీ వారసుని గురించి..  ఇటు పార్టీ, పరివార్ వర్గాల్లో ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే.. మొదలైనట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.  అయితే..  నిజంగా  మోదీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమనాలు లేవు. ఇటు పార్టీ  నుంచి గానీ అటు పరివార్ నుంచి గానీ  అటువంటి సంకేతాలు, సూచనలు ఏవీ కనిపించడం లేదు.  నిజానికి, 2029 ఎన్నికల తర్వాత కూడా  మోదీ నే ప్రధాని  అని అమిత్ షా సహా  ముఖ్య నాయకులు మరి కొందరు అనేక సందర్భాలాలో స్పష్టం చేశారు. అలాగే..  ఇప్పటికైతే మోదీ మనసు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు ఏ మాత్రం  కనిపించడం లేదు.  సో.. మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేదా అనే విషయం పక్కన పెడితే.. బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాల్లో గత కొంత కాలంగా  ప్రధాని మోదీ వారసుడు ఎవరన్న.. చర్చ జరుగుతోందన్నది మాత్రం కాదన లేని వాస్తవం. నిజానికి  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా  ప్రధాని రేసులో ఉన్నట్లు మీడియా చర్చల్లో  వినిపిస్తున్నాయి. సో .. 2029 ఎన్నికల్లో కొత్త చిత్రం’ చూస్తారు అంటూ చేసిన గడ్కరీ ప్రకటన.. సమయం సందర్భం దృష్ట్యా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.   నిజానికి..  ఇప్పుడే కాదు  గతంలోనూ ప్రధాని పదవికి గడ్కరీ పేరు   ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముఖ్యంగా..  2019సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సౌమ్యు డు, వివాద రహితుడుగా పేరున్న గడ్కరీ ప్రధాని రేసులో ఉంటారనే  చర్చ జరిగింది. అయితే..  2019లో ఆ అవసరం రాలేదు.  బీజేపీ సొంతంగానే మెజారిటీ (303)  సాధించింది. ఎన్డీఏ మెజారిటీ మరింత పెరిగింది. మోదీ  మళ్ళీ ప్రధాని అయ్యారు.  2024లో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా.. చంద్రబాబు, నితీష్ కుమార్ చెరో చేయి వేయడంతో  మోదీ  మూడవసారి ప్రధాని అయ్యారు. సో.. ఇప్పటికిప్పుడు  మోడీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి  అయితే లేదు. అయితే..  2029 నాటికి, పరిసస్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేము.  అందుకే ఎందుకైనా మంచిదని, గడ్కరీ కర్చీఫ్ వేసి ఉండవచ్చని బీజేపీ, పరివార్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖకు ఐఎన్ఎస్ నీలగిరి

తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక  ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ నౌకను  ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించిన తొలి నౌక ఇది. ఈ నౌకలో వినియోగించిన  స్టెల్త్ టెక్నాలజీ  కారణంగా ఐఎన్ఎస్ నీలగిరి శత్రువు రాడార్‌లలో కనిపించదు. ఈ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రాక విశాఖ నగర రక్షణకు అదనపు అలంబనగా ఉంటుంది.  సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది. 

లోకేష్ చర్యలతో సత్ఫలితాలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వంద శాతం అడ్మిషన్లు!

జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది. సంక్షుమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం వినా జగన్ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేని పరిస్థిది. జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ దాదాపు కుప్ప కూలిపోయిన పరిస్థితి. అమ్మఒడి అంటూ పథకాన్ని ప్రవేశ పెట్టినా దానిలో కోతలు.  ప్రస్తుత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యావ్యవస్థ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలో పేతమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాల్లో సీట్లు వందశాతం భర్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరి ప్రభుత్వ విద్యా సంస్థలలోనూ అడ్మిషన్ల్స కంప్లీటడ్ , సీట్స్ ఫిల్, అడ్మిషన్స్ క్లోజ్ డ్ అన్న బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి. టెక్కలి, నెల్లూరు ఇలా  చోట్ల  సీట్స్ కంప్లీటడ్ అన్న బోర్డులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతమౌతోందనడానికి నిదర్శనమిదిగో అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు.   ఈ పరిస్థితి అంత లేలికగా ఏమీ రాలేదు. గత ఏడాది సార్వత్రి ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలుగుదేశం కూటమి సర్కార్ విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. పాఠశాలలలో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. పాఠశాలల రూపురేకలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. ఆ కృషి ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకం విద్యార్థలు తల్లిదండ్రులలో ఏర్పడింది. దీంతో ప్రస్తత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంగ్త్ అనూహ్యంగా పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితమే పలు స్కూళ్లల్లో విద్యా సంవత్సరం ప్రారంభమ్యే సరిగే సీట్లు భర్తీ అయిపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం సర్కారీ బడుల్లో అడ్మిషన్ల ప్రారంభం నాటికే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిపోయాయి.  

భయపెట్టడమేనా వైసీపీ బ్రాండ్?

  ఆవిర్భావం నుంచీ భయపెట్టడమే తన బ్రాండ్  అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైపీపీ జనాలను భయపెట్టి సాగుతోంది. 2014 ఎన్నికలలో ప్రతిపక్ష హోదా దక్కిన వైసీపీ అప్పుడూ జనాలను భయపెట్టే తీరుతోనే సాగింది. తాను చేసిన తప్పులకు కూడా అప్పటి అధికార పక్షంపై నెపం నెట్టి ప్రజలలో సానుభూతి సంపాదించుకుంది. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ సర్కార్ తీరు మారలేదు. అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుతో వైసీపీ అంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ కారణంగానే 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని తీర్పు ఇచ్చారు. జగన్ పాలన వద్దు అన్న నిర్ణయానికి ప్రాంతాలకు అతీతంగా జనం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారన్న విషయాన్ని ఆ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ  వైసీపీ చావు దెబ్బ తింది. స్వయంగా జగన్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఇక కడపలోని పది నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి ఏడు నియోజకవర్గాలలో విజయకేతనం ఎగుర వేసిందంటేనే జగన్ తన అడ్డాగా చెప్పుకునే జిల్లాలో జనం ఆయనను ఎంత వ్యతిరేకించారో అర్ధమౌతుంది. ఇక ఆ ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం 11 అంటే 11 స్థానాలకు పరిమితమైంది.  అయినా కూడా వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. ఓడించిన జనంపైనే ఆ పార్టీ కక్ష గట్టిందా అన్నట్లుగా.. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తరువాత వెన్నుపోటు దినం నిర్వహించి జనం తనను వెన్నుపోటు పొడిచారంటూ చాటింది. అంతే కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి రప్పరప్ప నరుకుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా వ్యవహరిస్తున్నది. బెదరించి గెలిచేద్దాం అన్న మోడల్ లో ఇప్పటికీ ఫాలో అవుతోంది.  ప్రజలలో మమేకం అవ్వడం కాదు.. వారిని బెదరించి, భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు కదులులోందా అనిపించేలా ఆ పార్టీ కార్యక్రమాలు, జగన్, ఇతర వైసీపీ నేతల ప్రసంగాలు ఉంటున్నాయి.   పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన సందర్భంగా  ఆ పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఫ్లెక్సీలు  కూడా అదే చాటుతున్నాయి. అలాగే ఆ పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మరణించినా కూడా కనీసం వాహనం ఆపకుండా ముందుకు సాగిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీంతో వైసీపీ అన్నా,  జగన్ పర్యటన అన్నా జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.  ఆ పార్టీ తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి  చట్టసభలో ప్రాతినిథ్యం  కూడా లేకుండా పోయే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ పై కేసు..ధృవీకరించిన గుంటూరు ఎస్పీ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ  సతీష్ కుమార్ ధృవీకరించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన   స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో జగన్ ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో  ఆయన అన్ని నిబంధనలనూ ఉల్లంఘించారని స్పష్టం చేశారు.  జగన్ వాహనం ఢీ కొనడం వల్లనే సింగయ్య మరణించారని తేలిందన్నారు. తొలుత సింగయ్య ను ఢీ కొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదనీ, ప్రైవేటు వాహనమనీ తమకు సమాచారం అందిందనీ, అయితే ఆ తరువాత పలువీడియోలను స్వాధీనంన చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న  వాహనం ఢీ కొనడం వల్లే సింగయ్య మరణించినట్లు థృవీకరించుకున్నట్లు తెలిపారు. సింగయ్యను ఢీ కొట్టిన తరువాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తేలిందని చెప్పారు.  వాస్తవానికి మాజీ సీఎం హోదాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు 100 మంది అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను, 14 వాహ‌నాల కాన్వాయ్‌కి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌నిఅయితే జగన్ మాత్రం  తాడేప‌ల్లి నుంచి   50 వాహ‌నాల‌తో వ‌చ్చార‌ని.. దారి పొడ‌వునా హంగామా చేశారని తెలిపారు. ఇవ‌న్నీ.. పోలీసు యాక్టు 30/2 మేర‌కు ఉల్లంఘ‌న‌లేన ని చెప్పారు. దీనిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు. అయితే.. సింగ‌మ‌య్య మృతిపై ఆయ‌న స‌తీమ‌ణి  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు. కాన్వాయ్‌కు ఇచ్చిన అనుమ‌తులు,  పోలీసుల నిబంధ‌న‌లు ఉల్లంఘించి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జ‌నీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎ నాగేశ్వ‌ర‌రెడ్డిల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని, బీఎన్ ఎస్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టామ‌ని వివ‌రించారు. చ‌ట్ట‌ప‌రంగా  చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూన్ 23) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండియపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల వ్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఆదివారం (జూన్ 22) స్వామివారిని మొత్తం 87 వేల 254 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 777 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 28 లక్షల రేపాయలు వచ్చింది. 

పాక్ ఎటు వైపు ?.. ఇరాన్ వైపా? అమెరికా వైపా?

అడ్డ కత్తెరలో పోక చెక్క  అనే సామెత అతికినట్లు అక్షరాలా సరిపోయే ఏకైక దేశం పాకిస్తాన్.  ఎందుకంటే  2026 నోబుల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని శనివారం (జూన్ 21)  అన్న పాకిస్థాన్   ఆదివారం (జూన్ 22) మాట మార్చేసింది.   ఇజ్రాయెల్ తో కలసి ఇరాన్ పై బాంబులు వేసిన అమెరికాను వ్యతిరేకించింది. ఇరాన్ ను వెనకేసుకు వచ్చింది.  దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అమెరికా అధ్యక్షుల వారికి.  అరే ఇదేంటి.. పాకిస్థాన్ కి మనం ఇంత చేస్తుంటే అలా అనేసిందేంటని? వాపోవడం ట్రంప్ వంతు అయ్యింది. ఎవరు అవునన్నా కాదన్నా పాక్ ఇస్లామిక్ రెవల్యూషన్ కి కట్టుబడక తప్పదు.   ఇరాన్ యూఎస్ రెండింటిలో పాక్ ఎటువైపు అంటే..   ఆ దేశానికున్న మత ఛాందస వాదం కారణంగా ఇరాన్ వైపు ఉండాల్సిందే.  కానీ అటు అమెరికా  పాక్ కి బిలియన్ డాలర్ల కొద్దీ ఇటు ఐఎంఎఫ్, అటు వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు ఇప్పిస్తోంది. అంతే కాదు.. తన సొంత సంస్థ చేత కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు ట్రంప్. ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఈ మాత్రమైనా కోకుకుందంటే అది అమెరికా చలవే అనడంలో సందేహం లేదు.  గతంలో  యూఎస్ నుంచి పూర్తి సహాయ సహకారాలను కోల్పోయాక తన భూభాగంలోని బెలూచిస్తాన్ ని పణంగా పెట్టి చైనాతో చెలిమి చేసింది. అంతేనా ఆ సమయంలో చైనా అధ్యక్షుడు పాక్ వచ్చినపుడు..  తన సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని  అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  పాక్.. ఒక మతమా కాదు. ఒక భావజాలమా కాదు. అయినా సరే బలూచీ- ఖనిజాల కోసం వెంపర్లాట కారణంగా చైనా-పాకిస్థాన్ తో అలాయ్ బలాయ్ అంది.  ట్రంప్ వచ్చే వరకూ పాక్ వెనక ఉన్న దేశమేదైనా ఉందంటే అది చైనా మాత్రమే. చైనా అంతగా ఆర్ధిక అండదండలు అందిస్తూ వచ్చింది.  అయితే   ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత స్వరం మార్చారు. ఎలాగైనా సరే పాక్ ని కంట్రోల్లో పెట్టుకుని చైనాను కట్టడి చేయాలని స్కెచ్ వేశారు. పాక్ సైతం బెలూచిస్తాన్ వేరు పడితే.. చైనా అండదండలు ఆవిరైపోతాయని తెలిసి రివర్స్ స్కెచ్ వేసి అమెరికాతో చెలిమి మొదలు పెట్టింది. అయితే..  సరిగ్గా ఈ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోకి దిగడం. ఆ వార్ లో ట్రంప్  ఇజ్రాయెల్ కి వంత పాడటంతో  ఇప్పుడు పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.  అయితే నైతికంగా ఎలాంటి విలువలు లేని కంట్రీ కాబట్టి.. ఈ బాయికాడ ఈ పాట- ఆ బాయికాడ ఆ పాట పాడుతూ  మేనేజ్ చేస్తోంది. అందుకే ఇక్కడ ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నోటితోనే ఆయన బాంబులు కురిపిస్తున్న ఇరాన్ కు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.