పవనిజం.. వ్యూహాత్మక ‘సనాతన’ ప్రయాణం?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ఈ ప‌న్నెండేళ్ల‌లో ప‌న్నెండు మ‌లుపులు తిరిగిన మాట నిజం. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌త క‌ట్ట‌ని వారు లేరు. వారిలో క‌మ్యూనిస్టులున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మాయావ‌తి వంటి  ద‌ళిత నేత‌లున్నారు. ఇక చెగువేరా సంగ‌తి స‌రే స‌రి. ఫైన‌ల్ గా ఆయ‌న సేన‌- బీజేపీ, టీడీపీతో చేస్తోన్న‌ ప్ర‌యాణం గురించి తెలియంది కాదు. కానీ ప‌వ‌న్ పై ఇప్పుడు చ‌ర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ  ధ‌రించి, గొడ్డు మాంసం తిన‌డం  లో త‌ప్పు లేద‌ని.. త‌న తండ్రి దీపం మంట‌లో సిగ‌రెట్ వెలిగించుకునేంత నాస్తికుడ‌ని చెప్పుకుని, ఆపై బైబిల్ ప‌ట్టుకుని త‌న పెళ్లాం పిల్ల‌లు పూర్తి క్రిష్టియ‌న్ల‌ని చెబుతూ.. చివ‌రికి ఆయ‌నిలాంటి నిగూఢ‌మైన వారాహీ దీక్ష‌లు, వాహ‌నాల‌కు ఆ పేరుబెట్ట‌డంతో పాటు య‌జ్ఞ‌యాగాల నిర్వ‌హ‌ణ‌, కుంభ‌మేళాలో    స్నానాలు.. ఇవ‌న్నీ ఏం చెబుతున్నాయ్? ఆయ‌న హిందువా ముస్లిమా క్రిష్టియ‌నా?  లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా?  జ‌నాన్నిలా సందిగ్దంలో ప‌డేయ‌టం ప‌వ‌న్ మార్క్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ.  ప‌వ‌న్ ప‌య‌న‌మెటు? ఈయ‌న్ని మ‌న‌మెలా అర్దం చేసుకోవాలి? అంటే  ప‌వ‌న్ పెద్ద  స్కెచ్చే వేశారని అంటారు కొంద‌రు ఆధ్యాత్మిక రాజ‌కీయ పండితోత్త‌ములు. వ‌చ్చ‌  రోజుల్లో ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ గా దేశమంతా ఒక ర‌క‌మైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు త‌గిన మార్గం కోసం వెతుకుతుండ‌గా వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన చందంగా మారిందట ఈ స‌నాత‌నం. దీని ప‌వ‌ర్ కేవ‌లం ఒక‌టీ రెండు రాష్ట్రాల‌కు సంబంధించింది కాదు. ఇది దేశ వ్యాప్తంగా క‌నిపించే కామ‌న్ పాయింట్. గ‌తంలో ర‌జ‌నీకాంత్ ని వాడాల‌నుకున్నారు మోడీ. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు అదే ప‌నిగా పంచ‌క‌ట్టుకుని వెళ్ల‌డం చూసే ఉంటాం. ఆయ‌న కూడా అందుకు త‌గిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజ‌కీయాల‌నే చేస్తాన‌న్నారు. కాకుంటే ఈ సూప‌ర్ స్టారుడికి కాలం ధ‌ర్మం పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో ర‌జ‌నీ ఛాన్స్ మిస్ చేసుకుంది క‌మ‌లం దండు. స‌రిగ్గా ఈ టైంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ఇక ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మోడీ  ఎప్పుడైనా  ఎక్క‌డైనా మొద‌టి ప్ర‌యారిటీ కింద గుర్తిస్తారు.   అంతెందుకు ప్ర‌మాణ  స్వీకార స‌మ‌యంలో   మోడీ ప‌వ‌న్, చిరంజీవిల చేతులు పైకి లేపి.. ఇచ్చిన సంకేతం ఏమిటి? అందుకే ప‌వ‌న్ ఈ  దిశ‌గా త‌న అడుగులు వేస్తూ బీజేపీ  పాలిట ఒక స్టార్ క్యాంపెయిన‌ర్ గా త‌న ప‌రిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే త‌మిళ‌నాడు బీజేపీ  సైతం మురుగ‌న్ పేరిట ఒక ఆధ్యాత్మిక స‌భ‌ను ఏర్పాటు చేసింది. కార‌ణం ఇక్క‌డ మురుగ‌న్ అన్న‌దొక ప్ర‌త్యేక మ‌తం. ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. త‌ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పెద్ద పీట వేసి.. ఇక్క‌డి తెలుగు ఓట‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షించి.. ఆపై.. త‌మిళ‌నాట త‌న ఓటు బ్యాంకును మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని క‌మ‌ల‌ద‌ళం చూస్తున్న‌దని పరిశీలకుల విశ్లేషణ. అది మోడీ ఆదేశాను సార‌మో మ‌రొక‌టో తెలీదు కానీ..  ఈ దిశ‌గా ప‌వ‌న్ కి కూట‌మి ప్ర‌భుత్వంలోనూ భారీ ఎత్తున ప్ర‌యారిటీ ద‌క్కుతోంది. మొన్న క‌ర్ణాట‌క‌ ఏనుగుల వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న ద‌గ్గ‌రుండి వాటిని తీసుకోవ‌డం.. ఇలా ప‌వ‌న్ ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు   బీజేపీ ఒక ప‌థ‌కం ప్ర‌కారం వెళ్తున్న‌ట్టుగా స‌మాచారం.  మ‌న‌మంతా ఏమ‌నుకుంటున్నాం,, ఇదేంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా చేస్తున్నారు? ఆయ‌న‌కు ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీ ఓట్లు వ‌ద్దా? అని తీసిక‌ట్టిన‌ట్టు మాట్లాడుకుంటాంగానీ.. ఈ మొత్తం జ‌ర్నీలో ఆయ‌న్ని స‌నాత‌న ధ‌ర్మ వార‌ధిగా భారీ  క‌మ‌ల వ్యూహ‌మే ర‌చిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు.  ఆయ‌న కూడా వెళ్లిన ప్ర‌తి ప్రాంతాన్నీ.. ఇక్క‌డే  నేను పుట్టా. ఇక్క‌డే  నేను పెరిగా ఇక్క‌డే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ అక్క‌డి వారిని ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజ‌కీయాల్లో భాగంగానే చూడాలంటారు కొంద‌రు ఎన‌లిస్టులు.  ఎందుకంటే తాను కేవ‌లం ఒక కాపు నేత‌గా మాత్ర‌మే కాకుండా.. స‌ర్వ‌జ‌న..  స‌ర్వ‌కుల నేత‌గా ఎద‌గ‌డం ఒక అనివార్యంగా కావ‌డంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి. ప‌వ‌న్ అలవోకగా చెప్పే  డైలాగ్ లోనూ ఒక వ్యూహం ఉంటుంద‌ని అంటారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టుగా ఒక టాక్ న‌డుస్తోంది దక్షిణాది రాజకీయవర్గాల్లో. అందుకే ఇత‌ర రాష్ట్రాల వేదిక‌ల‌పై ప‌వ‌న్ కి ఇంత ఎలివేష‌న్ అంటున్నారు విశ్లేష‌కులు.

రైతు బంధు డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేసిన కొడుకు

రైతు బంధు డబ్బుల విషయంలో  ఘర్షణ పడి తండ్రి నాలుక కోసేసిన సుపుత్రుడి ఉదంతమిది. ఈ దారుణం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కోపంతో దాడి చేసి నాలుకు కోసేశాడో సుపుత్రుడు. తాండాకు చెందిన బానోత్ కిర్యా కు ఇద్దరు కుమారుడున. రైతు బంధు పథకం కింద బానోత్ కిర్యా ఖాతాలో ఇటీవల తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి.  ఎకరాకు రూ.6 వేల చొప్పున  ఎకరంన్నర పొలం ఉండటంతో తొమ్మిదివేలు కిర్యా ఖాతాలో జమ అయ్యాయి.  ఆ సొమ్ములు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ కోరాడు. అయితే తండ్రి కిర్యా మాత్రం తాను నాలుగువేల రూపాయలు మాత్రమే ఇస్తాననీ, తన అనారోగ్యం కారణంగా ఐదు వేలు ఖర్చయ్యయనీ చెప్పాడు. దీంతో  ఆగ్రహానికి గురైన సంతోష్ తండ్రిపై దాడి దాడి చేసి కొడవలితో తండ్రి నాలుకను అతడు కోసేశాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా నాలుగు కుట్టుపడ్డాయి,   కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.  

ఆ చీకటి రోజులపై ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం.. మోడీ

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎమర్జెన్సీ డైరీస్ అన్న పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై  ది ఎమర్జెన్సీ  ఈ ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 30లోగా స్ధానిక ఎన్నికలు.. తెలంగాణ హైకోర్టు

ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ  స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత తొలగిపోయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు బుధవారం (జూన్ 25)  కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే నెల రోజులలోగా  వార్డుల విభజన చేయాలని స్ఫష్టం చేసింది. ఇలా ఉండగా  ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని  రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును కోరాయి. వీరి విజ్ణప్తులను పరిగణనలోనికి తీసుకున్న తెలంగాణ హైకోర్టు కో సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  వాస్తవానికి స్థానిక సంస్థల గడవు ముగిసి సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే.. ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది. మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్

ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. బుధవారం (జూన్ 25) జరిగే ఈ సమావేశంలో ఈ ఇద్దరు సీఎంలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ సీఎంలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రగతి అజెండాపై చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపై మోడీ చర్చిస్తారని అంటున్నారు. అలాగే  రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పోలవరం అంశం కూడా మరోమారు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పురోగతి, ఒడిశాలో రూ.18,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, తెలంగాణలో రూ.56,000 కోట్ల ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌లో గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం.  

క్వాంటం వ్యాలీ ముందు తీసికట్టు సిలికాన్ వ్యాలీ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీని అమెరికాలోని సిలికాన్ వ్యాలీని మరిపించేలా తీర్చిదిద్దనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. క్వాంటం వ్యాలీ అత్యధునిక సాంకేతికలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  సిలికాన్ వ్యాలీ తీసికట్టు అయ్యే విధంగా దేశంలోనే మొదటి టెక్నాలజీ వ్యాలీగా  క్వాంటం వ్యాలీని తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే.. ఇప్పుడు క్వాంటం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు తొలి అడుగు వేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు.  క్వాంటం వ్యాలీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముందు ముందు కనీసం 15లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటున్నారు. క్వాంటం వ్యాలీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.   క్వాటం మిషన్ పేరిట బుధవారం విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ జరిగింది. మొత్తం మీద సాంకేతిక అద్భుతంగా క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోబోతున్నది. క్వాంటం వ్యాలీ ప్రత్యేకతలను చాటే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఐకానిక్ టవర్ ను నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి 1న క్వాటం వ్యాలీని ప్రారంభించేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది.  

ఖ‌తార్ ఖ‌త‌ర్నాక్ దెబ్బ?.. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టాప్!?

ఈ ట్రంపున్నాడే.. తొంద‌రెక్కువ- వివ‌రం త‌క్కువ‌.. అంటారు కొంద‌రు. జీ- 7 నుంచి హ‌డావిడిగా వెళ్తూ కాల్పుల విర‌మ‌ణ‌క‌న్నా మించి జ‌ర‌గ‌బోతోంద‌ని  బిల్డ‌ప్ ఇచ్చి వెళ్లారు.  తీరా చూస్తే.. ఇరాన్ తో కాళ్లా వేళ్లా బతిమిలాడుకుని ఈ యుద్ధం ఆపుకోవ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. కార‌ణం ఏంటంటే ఖ‌తార్ రాజ‌ధాని దోహా ఔట్ స్క‌ర్ట్స్ లో 60 ఎక‌రాల్లో 1996లో స్థాపించిన అల్ ఉదీద్ అనే   సైనిక స్థావ‌రంపై ఇరాన్ గురి చూసి కొట్ట‌డ‌మేన‌ట‌. ఉండే వాడు ఉండ‌కుండా మొన్న గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఏ అధ్య‌క్షుడూ  వెళ్ల‌ని విధంగా ఇక్క‌డి  సైనికుల‌ను వెళ్లి క‌లిసి వ‌చ్చారు ట్రంప్.  సుమారు 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మ‌ధ్య బీభ‌త్స‌మైన యుద్ధం. అది ఎంత‌గా ఉంటే ఇజ్రాయెల్ రోజుకు 2400 కోట్లు ఖ‌ర్చు చేసి మ‌రీ చేస్తోన్న యుద్ధం. నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుంటే ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేది కాదేమో. త‌న బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబ‌ర్ల‌తో ఇరాన్ అణు శుద్ధి  కేంద్రాల‌పై దాడులు చేసి  నానా హంగామా చేయ‌డం యూఎస్ కి ఎంత చేటు తెచ్చిందంటే.. ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత‌.  అప్ప‌టికీ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ స‌ల‌హాదారు అలీ అక్బ‌ర్ అంటూనే ఉన్నాడు అమెరికాకు ప్ర‌తీకార దాడులు త‌ప్ప‌వ‌ని. అన్న‌ట్టుగానే ఖ‌త‌ర్ లోని యూఎస్ సైనిక స్థావ‌రం మీద బాంబుల వ‌ర్షం కురిపించారు. అందులో యూఎస్ మాత్ర‌మే కాదు యూకే ఇత‌ర విదేశీ విమానాలెన్నో ఉంటాయి. అంతేనా  ఏకంగా ప‌ది వేల మంది సైనికులు ఇక్క‌డ ఉంటారు. అంత పెద్ద ఎయిర్ బేస్ అది. సెప్టెంబ‌ర్ లెవ‌న్ అటాక్స్ త‌ర్వాత ఇక్క‌డి నుంచి ఆఫ్గ‌న్ తాలిబ‌న్లు, అల్ ఖైదా కార్య‌క‌లాపాల‌ను కంట్రోల్ చేస్తూ వస్తోంది అమెరికా.  దీంతో పాటు బ‌హ్రెన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, కువైట్, సౌదీ సిరియా అంటూ 8 స్థావ‌రాలుండ‌గా.. వీట‌న్నిటిలో క‌లిపి సుమారు 50 వేల మంది  సైనికులుంటారు.. వీటిలో ఖ‌తార్ చాలా చాలా  కీల‌కం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా. వీట‌న్నిటికి తోడు ఇది ఇరాన్ కి కేవ‌లం 190 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇక్క‌డ కొడితే ఫ‌స్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది.. ఎంద‌రు సైనికుల‌ను చంపార‌న్న విష‌యం అటుంచితే.. అస‌లీ స్థావ‌రాన్ని టార్గెట్ చేయ‌డంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో    మ‌ట్టికొట్టుకుపోతుంది. మొన్న భార‌త్- పాక్ యుద్ధం ఆప‌డంలో కూడా స‌రిగ్గా ఇదే స‌మ‌స్య‌. త‌మ ఎఫ్- 16లను భార‌త్ అవ‌లీల‌గా దాడి చేసేస్తుంద‌న్న మాట మార్కెట్లో వినిపిస్తే ఇంకేమైనా ఉందా? అది త‌మ ఆయుధ వ్యాపారం మొత్తాన్ని కుప్ప కూల్చేస్తుంది. అందుకే ఈ యుద్ధం విష‌యంలోనూ.. ట్రంప్ వెంట‌నే అలెర్ట్ అయ్యి.. అప్ప‌టి వ‌ర‌కూ బీరాల‌న్నిటినీ తూచ్ అనేశారు. కాల్పుల విర‌మ‌ణ‌కు ర‌మ్మంటూ ఇరాన్ని బ‌తిమ‌లాడుకున్నారు. ఈ విష‌యం ఇరాన్ యంత్రాంగం చెబుతోంది. అందుకే తాము కాల్పుల విర‌మ‌ణ చేసుకున్నామ‌ని అంటోంది. మొన్నే ఈ స్థావ‌రాన్ని సుమారు 8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అప్ గ్రేడ్ చేసిన‌ట్టు చెబుతుంది వాషింగ్ట‌న్ కి చెందిన ద హిల్ అనే ప‌త్రిక‌. ఇపుడా డ‌బ్బు మొత్తం మంట గ‌ల‌వ‌డంతో పాటు.. త‌మ దేశ ప‌రువు అమాంతం పోతుంది. దీంతో ప‌రిస్థితి అర్ధం చేసుకున్న ట్రంప్.. ఇరాన్ తో ఒక స‌యోధ్య‌కు వ‌చ్చారు. ఈ దిశ‌గా ట్రూత్ అనే సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ పెట్టారు. పోస్టు పెట్టిన ఆరు గంట‌ల‌కు ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తాము వ‌చ్చిన‌ట్టు అంగీక‌రించాయి. ఇందులో ఇజ్రాయెల్ అంటున్న మాట ఏంటంటే.. త‌మ ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ మిష‌న్ కంప్లీట్ అయ్యింది. ఇరాన్ సైనిక నాయ‌క‌త్వంతో పాటు లేటెస్టుగా మ‌రో అణు సైంటిస్టును కూడా హ‌త‌మార్చాం అంటోంది. దీంతో తాము హ్యాపీ అన్న‌ది ఇజ్రాయెల్ అంటోన్న మాట‌. ఈ ప‌న్నెండు రోజుల యుద్ధం ద్వారా తాము సుమారు 25 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా.. అందుకంటూ ఒక ప‌ర‌మార్ధం ఉందంటోంది. ఇజ్రాయెల్ వ‌ర‌కూ ఓకేగానీ.. ఇప్పుడు అమెరికా సిట్యువేష‌నే మ‌రీ దారుణంగా త‌యారైంది. అమెరికా వ‌దిలిన బాంబుల ద్వారా ఇరాన్ కోల్పోయిందేమీ లేదు. పైపెచ్చు 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఇరాన్ ద‌గ్గ‌ర ఎంతో సేఫ్ గా ఉంది.  దీంతో ప‌ది అణు బాంబుల త‌యారీ చేయ‌వ‌చ్చ‌ని  తెలుస్తోంది. అయినా స‌రే అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ చేస్తోన్న కామెంట్ ఏంటంటే.. మ‌ళ్లీ  ఇరాన్ అణ్వాయుధ తయారీ చేస్తే అత్యంత శ‌క్తిమంత‌మైన అమెరిక‌న్ ఆర్మీ ప్ర‌తాపం చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ని. ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌రికి ప్ర‌తాపం  చూపించారో.. అంద‌రూ చూశారంటూ కొంద‌రు కామెంట్లు చేయ‌డం క‌నిపిస్తోంది.

జగన్ కు ప్రాణహాని లేదు.. కోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

తనకు ప్రాణహాని ఉందనీ, అదనపు భద్రత కావాలని గగ్గోలు పెడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లోని డొల్లతనం కేంద్ర హోంశాఖ తేటతెల్లం చేసింది. పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టుకు తెలిపింది. జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక సమర్పించింది.  ఆ నివేదికలో జగన్ కు ఎలాంటి ప్రాణహాని కానీ, ముప్పు కానీ లేదని పేర్కొంది. ఈ మేరకు ఆ నివేదికను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.  తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించాలని ఆ పిటిషన్‌లో జగన్ కోరారు. జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాదిపేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశిం చింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 

ఎమర్జెన్సీ చీకటి రోజులపై బిజెపి అవగాహన సదస్సులు

  దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తియన సందర్భంగా నాటి చేదు ఘటనలు, ఆ చీకటి రోజులపై నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా బుధవారం (జూన్ 25) అవగాహన సదస్సులు నిర్వహించనుంది.  దేశం లో  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్  ఇష్టానుసారం గావ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనీ,   ఎమర్జెన్సీ పేరుతో  కాంగ్రెస్ వ్యవహరించిన నియంతృత్వ ధోరణులను, నాటి అమానుష ఘటనలను నేటి యువతరానికి  తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.   21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్ల పాలయ్యారనీ, అసలు దేశమే ఒక జైలుగా మారిపోయిందనీ ఆ పార్టీ పేర్కొంది. ఎమర్జెన్సీ కాలంలో   ప్రశ్నించిన ప్రతి ఒక్కరు జైలు పాలయ్యారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఏలూరులో జరిగే అవగాహన సదస్సుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్, అలాగే పాలకొల్లులో జరిగే సదస్సుకు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి భువనేశ్వర్హాజరౌతారని తెలిపారు. అలాగే తిరుపతి సదస్సు కు , ఎంపీ అపరాజిత సారంగి ముఖ్య అతిథి గా హాజరౌతారు.  

రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ

  రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో  మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.  నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.  

జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్

  వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు.  పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి  జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.  అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణకు మళ్లీ ఆమ్రపాలి

  ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట లభించింది. ఆమెను ఏపీ కేడర్ నుంచి తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఏపీ కేడర్‌కు వెళ్లారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ, తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్, ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం, ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..శాసన సభలో చర్చించే దమ్ముందా?

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బనకచర్లపై శాసన సభలో చర్చపెడతాం అన్ని ఆధారాలతో నేను వస్తా. మీరు సిద్దమా అని మాజీ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి  ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.  రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.  వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగలా మార్చేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత  కరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. గతంలో వరి వేసుకుంటే ఉరేననే పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి, 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని, వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రం నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం కూడా జరిగిపోయిందని విమర్శించారు.  "కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వారంతా ఎలా సంపన్నులయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. గ్రామాల్లో 'అమ్మ ఆదర్శ పాఠశాలలు' తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

ఆర్జేడీ అధ్యక్షుడిగా 13వ సారి లాలూ ప్రసాద్

    రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో తేజస్వీ యాదవ్, రబ్రీ దేవి, మీసా భారతి, సీనియర్ నాయకుల సమక్షంలో లాలూ నామినేషన్ దాఖలు చేశారు. వేరే అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో లాలూ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. లాలూ నాయకత్వం పార్టీకి బలమని, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోతప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా జూలై 5న "లాలూ సమ్మాన్ దివస్" జరుపుకోనున్నారు. 1997లో ఆర్జేడీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి లాలూ నాయకత్వం వహిస్తుండగా.. బీహార్‌లో OBCలు, దళితులు, ముస్లింల మద్దతుతో ఆర్జేడీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 78 ఏళ్ల లాలూ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన నాయకత్వం కొనసాగిస్తూ.. కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ పునఃనియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్‌ చేశారు. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మళ్లీ మొదటికి ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధం

    ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య యుద్దం మళ్లీ మొదటికి వచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన గంటలలోపే సీన్ రివర్స్ అయింది. ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేటికే మళ్లీ.. కాల్పులకు సై అంటూ దిగడం.. ఆ రకంగా ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది.. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్‌ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ లోని పలు నగరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ఇరాన్‌పై మరిన్ని భీకరదాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ ప్రకటించింది.  బీర్‌షెవాలోని ఓ బిల్డింగ్‌ మిస్సైల్‌ దాడిలో కుప్పకూలింది. 9 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌ దాడిలో బీర్‌షెవాలో మూడు భవనాలు ధ్వంసమయ్యాయయని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించారు. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేస్తామని ప్రకటించారు. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకరదాడులు చేయాలని IDFకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. అయితే ఇజ్రాయెల్‌ ఆరోపణలను ఇరాన్‌ తీవ్రంగా ఖండిచింది. తాము కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది.  కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి దాడులు చేయలేదని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై తమకు నమ్మకం లేదని ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రకటించింది. అయితే.. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని.. శత్రువుపై తమకు అస్సలు నమ్మకం లేదని ఇరాన్ చెప్పింది. తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని.. చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘కాల్పుల విరమణ ఉల్లంఘనలకు’ ప్రతిస్పందనగా.. ఇరాన్ పై దాడులు చేయాలని ఆదేశించిన తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేసింది.  

2033 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

    మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకన్ని సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోందని.. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ పుస్తకన్ని మహేశ్ కుమార్ గౌడ్  రచించారు. ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతున్నదన్నారు. ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ తీసుకువస్తున్నాం. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నదని సీట్లు పెరగబోతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రయాణికులకు షాక్..రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు

    ప్రయాణికులపై ఇండియన్ రైల్వే ఛార్జీల భారం మోపడానికి సిద్ధమైంది. గత  కొన్నేళ్లుగా స్థిరంగా ట్రైన్ టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది.  ఏసీ తరగతుల్లో ప్రయాణానికి కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. అయితే, సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎటువంటి పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించిన దూరాలకు మాత్రం సెకండ్ క్లాస్ ప్రయాణంలో కిలోమీటర్‌కు అర పైసా చొప్పున ఛార్జీ పెరగనుంది.  

గజం మిథ్య.. పలాయనం మిథ్య!

ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న... ఫోన్   ట్యాపింగ్ కేసు విచారణ ఏ రోజుకారోజు కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త చిత్రాలను చూపిస్తోంది. ఈ వ్యవహారంలో  విచారణ జరుపుతున్న  సిట్   ఈ కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న స్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును దఫదఫాలుగా విచారిస్తోంది. అదే సమయంలో గుర్తించిన ఫోన్ ట్యాపింగ్ బాధితులు, రాజకీయ నాయకులను విచారించి వారి నుంచి వాంగ్మూలానను సేకరిస్తోంది. ఇదంతా ఏదో టీవీ డైలీ సీరియల్ వ్యవహారంలా నడుస్తోంది. కానీ..  అవుట్కమ్  ఏమిటన్నది  మాత్రం  భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అదలా  ఉంచితే..  ఎవరో పెద్దాయన అన్నట్లుగా..  ఈ కేసుకు సంబంధించి అందుతున్న సమాచారం మొత్తం నిజమే అయితే..  ఇది స్వాతంత్ర భారత చరిత్రలో ఏనాడు జరగని మెగా కాదు, మహా మెగా, మహామహా మెగా  ఫోన్ ట్యాపింగ్ కుంబకోణంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ కుంభకోణంలో కేవలం   రాజకీయ కోణం మాత్రమే కాదు.. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి అంటున్నారు. అవును.. సమస్త సామాజిక, ఆర్థిక నేరాలకు  ఫోన్ ట్యాపింగ్ సాధనమైందని అంటునారు. ఎవరు ఎందుకు మొదలు పెట్టినా..  ఆ తర్వాత  అయినవారు, కాని వారు, ఎవరికి వారు  నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లు..  ఫోన్ ట్యాపింగ్ ను  సాధనంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలు పొందారని అంటున్నారు. అనుమానిస్తున్నారు.     అందుకే..  ఇంతటి మెగా కుంభకోణంలో ఎస్‌ఐబీ  మాజీ చీఫ్ ప్రభాకర రావు పాత్రే కీలకమా?  ఆ ఒక్కడే అన్నీ చేశారా?  పోనీ చేశారే అనుకున్నా.. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్  వ్యవస్థ ఏమి చేస్తునట్లు? ముఖ్యంగా..  ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండేందుకే ఉన్నతాధికారులతో  ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ  ఏమి చేసినట్లు, ఏమి చేస్తున్నట్లు?  నిజానికి..  సిట్‌ విచారణకు హాజరైన ప్రతి సందర్భంలోనూ ప్రభాకర్‌రావు ట్యాపింగ్ జరగలేదని ఒక్కసారి కూడా చెప్పలేదు. ట్యాపింగ్  జరిగింది. కానీ, రివ్యూ కమిటీ అనుమతి, ఆమోదంతోనే ట్యాపింగ్‌లు చేసినట్లు స్పష్టంగా చెప్పిట్లు చెపుతున్నారు. అంటే, రివ్యూ కమిటీ ఆమోదతోనే..  ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని ఎవరైనా అనుకుంటే  కాదనే పరిస్థతి లేదని అంటున్నారు. నిజానికి ప్రభాకరరావు చెప్పక పోయినా.. రివ్యూ కమిటీ  బాధ్యత నుంచి తప్పించుకోలేదు  అంటున్నారు.  మరోవంక రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్న అప్పటి సీఎస్‌ శాంతికుమారి, సభ్యులుగా ఉన్న జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి రఘునందన్‌రావు,  అప్పటి హోం శాఖ కార్యదర్శి జితేందర్‌, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌లు సిట్ కు ఇచ్చినట్లు చెపుతున్న వాంగ్మూలంలో ఎస్‌ఐబీ నుంచి ట్యాపింగ్‌ జాబితా రావడంతో నమ్మకం తో రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించకుండానే కేంద్ర టెలికం శాఖకు ఫైల్‌ పంపినట్లు తేలిందని అంటున్నారు. అదే నిజం అయితే..  జరిగిన  భారీ  అనర్ధాలకు రివ్యూ కంమిటీనే బాధ్యత వహించవలసి ఉంటుంది కదా  అని నిపుణులు  ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..   ఇంత పెద్ద ఎత్తున, వారు వీరని లేకుండా..  వందల వేల మంది  ఫోన్లు ట్యాప్  చేసిన మెగా  కేసును,విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ప్రత్యేక విచారణ బృందం(సిట్) సరి పోతుందా?  సిట్ విచారణతో  ఒకరిపై ఒకరు రాజకీయ బురద చల్లుకోవడం, తుడుచుకోవడం కాకుండా.. ఇంకా ఏమైనా జరుగుతుందా? అంటే..  ఆ అవకాశమే  లేదంటున్నారు. కేసు పరిధి, పరిమాణంతో పాటు గా.. కేంద్ర ప్రభుత్వ చట్టాలతోనూ ముడిపడిన ఈ  కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం ఒక్కటే మార్గమని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.అయితే..  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించేలా లేదు. చివరకు..  ఇప్పటికే చాల చాలా కేసుల్లో జరిగిన  విధంబుగానే .. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా,‘గజం మిథ్య పలాయనం మిథ్య’ అన్నట్లు తేలిపోతుందని  అంటున్నారు.