మిథున్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

  వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు.  తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్‌ ఫర్‌ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్‌ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు.  మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారని సిట్‌  అధికారులు అభియోగం మోపారు. యావత్తు లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్‌ను ఉపయోగించారని తెలిపారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్‌ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు వివరించారు.  ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్‌ వ్యక్తులు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్‌ అధికారులు.మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని  సిట్‌ అధికారులు తెలిపారు.  మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్‌రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సిట్‌ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్‌రెడ్డి సహకరించలేదని గుర్తుచేశారు. నిందితుడు మిథున్‌రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్‌ అధికారులు పేర్కొన్నారు.

టీడీపీ నేత మృతి పట్ల.. లోకేశ్ దిగ్భ్రాంతి

  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు  గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మంత్రి నారా లోకేశ్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. శేషగిరి రావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటని లోకేశ్ పేర్కొన్నారు. శేషగిరి రావు కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుంది. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ఎక్స్ వేదిక నారా లోకేశ్ తెలిపారు

అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం

  లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతోపాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా క్రైమ్ పార్టీలు ఆ ప్రాంతాల్లో మోహరించాయి. బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాప్‌లని ప్రభుత్వం మూసివేసింది. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..  

లిక్కర్ స్కామ్‌లో మాస్టర్ మైండ్ జగన్, భారతి : మాణికం ఠాగూర్

  వైసీపీ అధినేత జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆరోపించారు. నాసిరకం మద్యంతో రూ. 32,00 కోట్ల కోల్లగొట్టారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు ఈ స్కామ్ మాస్టర్ మైండ్ జగన్,భారతి అని మాణికం ఠాగూర్ అన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బుతోనే ఎన్నికల్లో ఓట్లు కొన్నారు.  ఇది జగన్ మొదటి స్కామ్ కాదు గతంలో 43 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అని మాణికం ఎక్స్ వేదికగా తెలిపారు. వైఎస్ జగన్ 2012లో అరెస్టై 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారని మాణికం ఠాగూర్ అన్నారు. మాజీ సీఎం జగన్ ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మరియు భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇప్పుడు, ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి మద్యం దోపిడీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

  సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  పాతబస్తీ కుర్రోడు  రాహుల్ సిప్లిగంజ్  ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డు ను అందుకున్నారు.  సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.  ఆమేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.స్వయం కృషితో హైదరాబాద్‌ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్‌ను గౌరవిస్తామని రేవంత్ గతంలో తెలిపారు. ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలోనూ సింగర్‌కు ఏదైనా కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని ముఖ్యమంత్రి కోరారు. 

మిథున్ రెడ్డి అరెస్టు దాని వెన‌క క‌థ కేంద్రం, క‌మామిషు!

  నిజానికి మిథున్ రెడ్డి అరెస్టు కార‌నే అనుకున్నారంతా. కార‌ణం ఇంత‌క‌న్నా మించిన కేసైన వివేకా కేసులోనే అవినాష్ ఇంత వ‌ర‌కూ అరెస్టు కాలేదు.. జ‌గ‌న్ అరెస్టు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఆ మాట‌కొస్తే.. మ‌ద్యం వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ అరెస్టే ముందు అవుతుంద‌నుకున్నారు. కానీ  కాలేదు. దానికి తోడు ఛ‌త్తీస్ గ‌డ్ మ‌ద్యం కేసు కేవ‌లం 2వేల కోట్లు. దాన్ని టేక‌ప్ చేసి ఈడీ, సీబీఐ.. 3వేల కోట్ల‌కు పైగా ఉన్న ఏపీ లిక్క‌ర్ కేసును టేక‌ప్ చేయ‌లేదు. ఢిల్లీ కేసు కూడా ఏమంత ఎక్కువ లేదు ఐదారు వంద‌ల కోట్ల‌కు మించ‌దు. కానీ కేంద్ర నాయ‌క‌త్వం ఈ విష‌యంలో చూపిన అత్యుత్సాహం అంద‌రికీ తెలిసిందే. దీంతో చేసేది లేక ఏపీ స్పెష‌ల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్- సిట్ ర్యాప్తు చేప‌ట్టింది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఏ 4 మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తోన్న ప్ర‌శ్న‌ ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ మ‌ద్యం కేసును ఈడీ, సీబీఐ ఎందుకు అటెంప్ట్ చేయ‌లేదు?. అంటే వైసీపీ  బీజేపీకి ఉన్న చీక‌టి సంబంధ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వ‌మే  చొర‌వ  తీసుకుని.. ఈ కేసును డీల్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. బేసిగ్గా చంద్ర‌బాబు విష‌యంలో రెండు కేసులు ప‌డితే వాటిలో ఐటీ కేసు ఒక‌టి కాగా, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసు మ‌రొక‌టి. ఈ రెండూ కూడా కేంద్ర స్థాయిలోనివే. ఇక్క‌డివి కావు. చంద్ర‌బాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారంటే  ఎక్క‌డో మ‌హారాష్ట్ర పూనేలో ఉన్న జీఎస్టీ అధికారులు దీన్ని క‌దిల్చి.. అక్క‌డి నుంచి ఏపీకి ఈ కేసును మ‌ళ్లించి.. ఆపై బాబును అరెస్టు చేయించారు. అంటే కేంద్ర‌మే దీని వెన‌క ఉంద‌ని మాట్లాడుకున్నారు అప్ప‌ట్లో. ఒక ర‌కంగా  చెబితే జ‌గ‌న్ కి ఈ అరెస్టు మ‌ర‌క అంట‌కుండా జాగ్ర‌త్త వ‌హించార‌న్న‌మాట‌. ఈ మాత్రం కోప‌రేష‌న్ ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వానికి లేద‌న్న‌ది.. కొంద‌రు విశ్లేష‌కుల వాద‌న‌. మ‌ళ్లీ ఇదే కూట‌మిలో ఇక్క‌డ ఏపీలో బీజేపీ కూడా ఉంది. ఆ మాట‌కొస్తే బీజేపీకి టీడీపీతో జ‌త‌క‌ట్టాల‌ని లేదని కూడా మాట్లాడుకున్నారు ఎన్నిక‌ల ముంద‌రి కాలం రోజుల్లో. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామ  క్ర‌మాల‌న్నీ మ‌న‌కు తెలిసిందే.  ఇప్పుడీ మ‌ద్యం కేసు ద్వారా ఏం తెలుస్తోందంటే.. ఇది కేంద్ర స్థాయిలో జ‌ర‌గాల్సిన  కేసు. ఇందులోని నిధులు దుబాయ్ వ‌ర‌కూ వెళ్లిన‌ట్టు చెబుతున్నారు. అంతే కాదు నాలుగైదు మార్గాల ద్వారా మ‌ద్యం మ‌నీ హవాలా రూపంలో మిథున్ రెడ్డికి చేరాయ‌నీ అంటున్నారు. అంటే మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు ఆధారాలున్నాయి. అయినా గానీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు క‌నీసం టేక‌ప్ చేయ‌డం లేదంటే దాన‌ర్ధ‌మేంటి? జ‌గ‌న్ అరెస్టు గానీ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల అరెస్టు చేయ‌డానికి గానీ కేంద్రం స‌మ్మ‌తంగా లేక పోవ‌డ‌మే క‌దా? అన్న‌ది కొంద‌రు సంధిస్తోన్న ప్ర‌శ్నాస్త్రం. మొన్న అమిత్ షా వ‌చ్చిన‌పుడు కూడా బాబు, ప‌వ‌న్ ముందు జ‌గ‌న్ రెడ్డి గురించి వాక‌బు చేయ‌డం క‌నిపించింది. నిజానికి కేంద్రం త‌లుచుకుంటే జ‌గ‌న్ మోహ‌న రెడ్డి అరెస్టుకు కేవ‌లం మ‌ద్యం కుంభ‌కోణ‌మే అవ‌స‌రం లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే ఉన్న‌ 33 కేసులు చాలు. వీటిలో ఏదో ఒక‌టి  అరెస్టు చేయ‌డానికి స‌రిపోతుంది. గ‌త కొన్నేళ్ల క్రితం.. ఈడీ, సీబీఐ స్వ‌యంగా వెళ్లి కేంద్రంతో మొర పెట్టుకున్నాయి. ఇన్నాళ్ల పాటు ఆయ‌న బెయిలు పై బ‌య‌ట ఉన్నాడ‌ని. అయితే ఇదే జ‌గ‌న్, చంద్ర‌బాబు మ‌ద్యం కేసులో బెయిలుపై బ‌య‌ట తిరుగుతున్న‌ట్టు చెప్ప‌డం వింత విడ్డూరంగా ఉందంటారు కొంద‌రు నిపుణులు. టోట‌ల్ గా ఈ వ్య‌వ‌హార‌మంతా చూస్తుంటే జ‌గ‌న్ కేంద్రం అండ‌తోనే ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట తిర‌గ‌గ‌లుతున్నార‌నీ. కేంద్ర నాయ‌క‌త్వానికి వైసీపీకి సంబంధ‌ముందా లేదా చెప్ప‌డానికి ఈ ఒక్క ఎవిడెన్సు చాల‌ని అంటారు నిపుణులు. ఒక వేళ నిజంగా జ‌గ‌న్ని అరెస్టు చేయాలంటే వారికి చిటికెలో ప‌ని. గ‌తంలో శ‌శిక‌ళ‌ను ఇలాగే జైలుకు పంపిన ప‌రిస్థితి  ఉంది. అదే జ‌గ‌న్ ప‌ట్ల వారిలాంటి చ‌ర్య చేప‌ట్ట‌డం లేదంటే జ‌గ‌న్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్య‌వ‌హ‌రిస్తుందా? అన్న అనుమానాలున్నాయ‌ని అంటారు కొంద‌రు రాజ‌కీయ‌ విశ్లేష‌కులు.  

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

  రేపటి (జులై 21)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 12నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో 8 కొత్త బిల్లులను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం  నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్. ఎన్సీపీ నుంచి సుప్రియాసూలే,  తెలుగుదేశం పార్టీ నుంచి  లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్,గురుమూర్తి, బీఆర్‌ఎస్‌నుంచి సురేష్‌రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.  

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు

  లిక్కర్ స్కామ్, కేసులో అరెస్ట్ అయిన, అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ ఎంపీ మిధున్ రెడ్డిని, వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు సిట్ అధికారులు  తరలించారు. సీఆర్పీఎఫ్ భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరిలించారు. వైద్య పరీక్షల అనంతరం మిధున్ రెడ్డిని, ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి, ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు.. ఈ విషయాన్ని ప్రాథమిక అభియోగ పత్రం (ప్రిలిమినరీ చార్జ్ షీట్)లో సిట్ పేర్కొంది. నిన్న శనివారం కోర్టులో సిట్ ప్రిలిమినరీ చార్జ్ షీటు దాఖలు చేసింది. తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌లో పాత్రధారులు. ముడుపుల సొమ్ము భద్రపరిచిన డెన్లలోని సొత్తు హ్యాండ్లర్లు. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిల ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్‌లో కీలకంగా పని చేశారు. వీరిలో కొంత మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. వీరిలో పలువురు దుబాయ్‌లో, ఒకరిద్దరు అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో వీరి పాత్ర, ప్రమేయం గురించి చార్జ్ షీటులో సిట్ ప్రస్తావించింది. తాజా నిందితుల్లో రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి సోదరుడు ముప్పిడి అనిరుథ్ రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, సైమన్ ప్రసన్ బావమరిది మోహన్ కుమార్, ముప్పిడి అనిరుథ్ రెడ్డి బావమరిది అనిల్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు, ఐఐటీ పూర్వ విద్యార్ధి సుజల్ బెహరూన్ లు ఉన్నారు. వీరంతా లిక్కర్ ముడుపుల సొమ్ము వసూళ్లు, తరలింపు, డొల్ల కంపెనీల ద్వారా మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. 

వైభవంగా బోనాలు..అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

  హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అటు కార్వాన్ క్రాస్‌లోని దర్బార్ మైసమ్మ తల్లిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ఆలయం వద్ద నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్‌ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

  వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా జులై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  సత్తెనపల్లి మండలం రెంటపాళల్లో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పోలీసులు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.అయితే పరిమితి దాటి పోవడంతో కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్డు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అంబటి, తన సోదరుడు మురళి, కార్యకర్తలు బారికేడ్ల వద్ద ఉన్న పోలీసులను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తోసేసి పోలీసులను నెట్టివేశారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటిపై సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

దాత చేయూతతో పాఠశాల భవనాన్ని.. కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు

  దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు వెళ్తారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ లో ఉంది ఈ పాఠశాల. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునికీకరించారు. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి.  సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల 1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని చాటుతున్నారు. పాఠశాలలో 17 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నరన్నారు.  పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం  ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ చెరశాల తప్పదా?

వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టు ఆ దిశగా తొలి అడుగా అంటే ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అరాచకత్వం హద్దులు లేనట్టుగా సాగింది. అధికారాన్ని అడుపెట్టుకుని ఆయన కబ్జాలు, దౌర్జన్యాలకు యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు వాస్తవమేని తేలుతోంది. జగన్ హయాంలో ఆయన హద్దూపద్దూ లేకుండా సాగించిన కబ్జా వ్యవహారాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అటవీ భూములను ఆక్రమణలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల ద‌గ్దం కేసు విచారణలో పైళ్ల ద‌గ్దం ప్ర‌మాద‌శాత్తూ జరిగింది కాదని తేలింది.  ఆ ఫైళ్ల‌ దగ్ధం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి అనుచరులేనని దర్యాప్తులో తెలడంతో ఆయన అనుచరులు అరెస్టు కూడా అయ్యారు. ఇలా పెద్దిరెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలూ ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.  ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేయడంతో ఇక పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్య పునాదులు కదిలిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం ఏం చేసినా ఎదురేలేదన్నట్లుగా సాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఇక సాగడం లేదని ప్రస్ఫుటమైందని అంటున్నారు.   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గతంలో చేసిన   అక్రమాలు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.  మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి అరెస్టయ్యారనీ, అలాగే తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, తిరుపతిలో భూ కబ్జాల వ్యవహారంలో పెద్దిరెడ్డి అరెస్టు కూడా తప్పదని అంటున్నారు. 

ఇప్పుడిక విడదల రజనీ వంతు?

వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు  నిబంధనలను  ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై  విడదల రజినిపై  సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే పోలీసులు రజనీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం కూడా వాటిల్లిందని పేర్కొంటూ.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విడదల రజనీ వంతు వచ్చింది. ముందుముందు మరింత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.  వరుస కేసులు అరెస్టులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడిక విడదల రజని వంతు వచ్చిందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. విడదల రజనీపై జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘన కేసు మాత్రమే కాకుండా పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయి.   పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే విడదల రజిని మరిదిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి  జాషువా, రజిని పీఏ రామకృష్ణలు కూడా ఉన్నారు.   ఈ నేపథ్యంలో రెంటపాళ్ల కేసులో రజనీని అరెస్టు చేయడం అంటూ జరిగితే.. వరుస పీటీవారెంట్లతో ఆమె సుదీర్ఘకాలం కటకటాల వెనుకే ఉండేలా పోలీసులు వ్యూహాత్మకంగా సాగుతున్నారని అంటున్నారు.  

బిజేపీలో బహిర్గతమైన ఈటల, బండి వర్గపోరు!

తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే.. పార్టీ అధిష్ఠానమే రాష్ట్రంలో పార్టీని పతనం దిశగా నడిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తోంది.  తాజాగా ఈటల రాజేందర్ ఓపెన్ అప్ అయిపోయారు. సొంత పార్టీ వాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజేందర్  అన్న మాటేమిటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించిన క్షణం నుంచీ బీజేపీలో ఆసంతృప్తి జ్వాల భగ్గుమంది.  ఆ పదవిని ఆశించిన బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు మీ గుప్పిస్తున్నారు. రాజాసింగ్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా, ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు.  తాజాగా ఈటల రాజేందర్ తన నివాసంలో నిర్వహించిన బీజేపీ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడించేందుకు సొంత పార్టీ వారే కుట్రలు పన్నారన్నారు. అప్పట్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు క్యాడరేలేదని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి హుజూరాబాద్ నుంచి అప్పట్లో తాను ఓడిపోయాననీ, అయితే ప్రజల మనస్సులను గెలుచుకుని మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించాననీ చెప్పుకొచ్చారు.  తాను ఎన్నడూ వ్యక్తులను నమ్ముకుని, వారిపై ఆధారపడలేదనీ, ప్రజలను నమ్ముకునే ప్రజాజీవితంలో సాగుతున్నానని చెప్పుకున్న ఈటల.. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనీ, ఇక ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.   త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా సామాజిక మాధ్యమంలో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారన్నారు.   తాను ప‌ద‌వుల కోసం  వెంప‌ర్లాడ‌లేనీ, వాటి కోసం పార్టీలు మారలేదనీ చెప్పిన ఈటల గతంలో తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కు తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పానని గుర్తు చేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ హై కమాండ్ దృష్టికి తీసుకువెడుతున్నానని ఈటల చెప్పారు. ఈటల ఎక్కడా నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన విమర్శల దాడి నేరుగా బండిపైనేనని అర్ధమౌతూనే ఉంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో తనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు పడకుండా కుట్ర జరిగిందని రెండు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండవనీ, ఉండేది ఒకే వర్గం, అది మోడీ వర్గమని బండి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈటల బదులిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మిథున్ రెడ్డి అరెస్ట్.. పెద్దిరెడ్డికి తొలి ఎదురుదెబ్బ

వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో  కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ లో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దరెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలినుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తుంది.  విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తలపడ్డారు.  అనేక సంద ర్భాల్లో చంద్రబాబు ను రాజకీయంగా దెబ్బ తీయడానికి రామచంద్రా రెడ్డి విఫలయత్నం చేశారు.  2004 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికి వైఎస్ తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్ కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి జగన్, మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తరవాత జరిగిన పరిణామాలలో చిత్తూరు జిల్లాలో అప్పటి వరకు వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచీ  చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగింది.  ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంటే.. 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ కూడా జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. 2019-24 మధ్య జగన్ క్యాబినెట్ లో పెద్దిరెడ్డి నంబర్ టూ గా ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే కుప్పం లో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓ వైపు జగన్ కు సంబంధించిన కీలక వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా   మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డికి ప్రత్యా మ్నాయంగా జగన్  ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏమి చేసినా రైట్ అన్నట్లుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు. జగన్ అధికారంలో ఉన్నంత వరకూ పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్లుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూక్జాల నుంచి దౌర్జన్యాల వరకూ చేయని అరాచకం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిందో.. అ అప్పటి నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచీ ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.   తనయుడి అరెస్ట్ తో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచం ద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా దీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు.  అయితే ఇప్పుడు మిధున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.  

ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జ్ షీట్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో  చార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం (జులై 18)న ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్.. ఆ చార్జిషీట్ లో కీలక విషయాలను పేర్కొంది.  దాదాపు 300 పేజీల ఈ చార్జ్ షీట్ లో వందకు పైగా ఫోరెన్సిక్ నివేదికలను పొందుపరిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకూ  . 62 కోట్ల రూపాయలను సీజ్ చేసిట్లు పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి   268మంది సాక్ష్యులను విచారించి, అరెస్టు చేసిన 11 మంది నిందితుల స్టేట్ మెట్లను కూడా ఆ చార్జ్ షేట్ లో పేర్కొంది.  బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మద్యం అక్రమ సొమ్మును పెట్టుబడులుగా పెట్టినట్లు సిట్ పేర్కొంది. అలాగే షెల్ క ంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సిట్ పేర్కొంది. అలాగే మద్యం అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలు, బంగారం దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు  ఆధారాలను, నిందితులు, సాక్ష్యుల స్టేట్ మెంట్లనూ కూడా సిట్ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది. కాగా సిట్ శనివారం (జులై 19)న అరెస్టు చేసిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిధున్ రెడ్డి పేరును ఈ చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. మిథున్ రెడ్డిని ఆదివారం (జులై 20) న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరే అవకాశం ఉంది. . 

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. శనివారం (జులై 19) ఆయనను విచారణకు పిలిచిన సిట్ దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన తరువాత అరెస్టు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది.  ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆయనను రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  సిట్ విచారణలో  మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సంగతి విదితమే ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టివేశాయి. మిథున్ రెడ్డి అరెస్టుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సిట్ అరెస్టు చేసింది.  అదలా ఉండగా మద్యం కుంభకోణం కేసులు సిట్ ఈ రోజు కోర్టులో తొలి చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అయితే ఈ చార్జిషీట్ లో మిథున్ రెడ్డి పేరు లేదు.  

పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యాటనలో కపిలేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, అనంతరం శుభ్రంగా తుడిచారు. పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పర్యటన సందర్భంగా, శ్రీ కపిలేశ్వరాయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయానికి వచ్చిన ఆయన అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. పవిత్ర వస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించారు. అంతకుముందు, తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిత్యం గోధుమ కలర్ డ్రెస్‌లో కనిపించే సీఎం చంద్రబాబు కొత్త దుస్తుల్లో దర్శమిచ్చారు.